ఘానాలోని “సాంప్రదాయ వివాహం”
ఘానాలోని తేజరిల్లు! ప్రతినిధి ద్వారా
వివాహం—ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాదిమంది ఈ బంధంలోకి అడుగిడుతున్నారు. సాధారణంగా వారు తాము నివసిస్తున్న ప్రాంతంలోవున్న వివాహ సాంప్రదాయానుసారంగా అలా చేస్తారు.
సాంప్రదాయ వివాహం అని పిలువబడేది ఘానాలో అతి సాధారణమైన వివాహం. దీనిలో వరుని కుటుంబం వధువు కుటుంబానికి కన్యాశుల్కం చెల్లిస్తుంది. ఆఫ్రికాలోని అనేక ప్రాంతాల్లో, హాంకాంగ్, పాపువా న్యూ గినియా, సాలమన్ దీవులు వంటి ప్రాంతాల్లోనూ అలాగే ఈశాన్య కొలంబియా మరియు వాయవ్య వెనుజ్యులా నందలి గ్వాకీరో ఇండియన్లు మున్నగు ప్రాంతాల్లోని ప్రజలు సాంప్రదాయ వివాహం చేసుకుంటారు.
బైబిలు కాలాల్లో కన్యాశుల్కం చెల్లించడం ఆనవాయితీగా ఉండేది. (ఆదికాండము 34:11, 12; 1 సమూయేలు 18:25) అమ్మాయి సేవలను నష్టపోతున్నందుకు, ఆమె విద్యకు వివాహానికి ముందు ఆమె పోషణకు వెచ్చించబడిన సమయం, శక్తి మరియు వనరుల కొరకు ఆమె తలిదండ్రులకు ఇవ్వబడే నష్టపరిహారమే కన్యాశుల్కమని ప్రాచీన కాలాల్లోనూ మరియు నేడు అర్థం చేసుకోబడుతోంది.
తలిదండ్రుల బాధ్యత
ప్రాచీన కాలమందు ఘానాలో యౌవనస్థుల మధ్య డేటింగ్, కోర్ట్‌షిప్ ఉండేవి కావు. సమాజంలోని వివాహయోగ్యులైన యువతీ యువకుల గురించి జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత తలిదండ్రులు ఎదిగిన తమ పిల్లల కోసం సంబంధాలను కుదిర్చేవారు. ఘానాలోని కొంతమంది తలిదండ్రులు ఇంకా అలాగే చేస్తున్నారు.
అబ్బాయి తలిదండ్రులు అమ్మాయి వ్యక్తిత్వం, ఆమెకు ఆమె కుటుంబానికి ఉన్న గౌరవమర్యాదలు, వారి కుటుంబంలో వంశపారంపర్యంగా రాగల రుగ్మత, యెహోవాసాక్షుల విషయంలోనైతే ఆమె ఆత్మీయత వంటి అంశాలను పరిశీలిస్తారు. సంతృప్తికరంగా అనిపిస్తే, తలిదండ్రులు లాంఛన ప్రాయంగా అమ్మాయి తలిదండ్రుల దగ్గరికి వెళ్లి వివాహ ప్రస్తావన చేస్తారు.
ఇప్పుడు అమ్మాయి తలిదండ్రులు అబ్బాయి పూర్వాపరాల గురించి, అతని కుటుంబ పూర్వాపరాల గురించి వాకబు చేస్తారు. పైన పేర్కొన్న అంశాలనేగాక, భార్యను పోషించగల సామర్థ్యం అబ్బాయికి ఉందాలేదా అంటే అతడు పని చేస్తున్నాడా లేక నిరుద్యోగా అనేది కూడా వాళ్లు పరిశీలిస్తారు. అమ్మాయి తలిదండ్రులు సంతృప్తి చెందితే, ఆ విషయం వాళ్లు అబ్బాయి తలిదండ్రులకు తెలియజేస్తారు, అమ్మాయి అబ్బాయి దానికి అంగీకరించిన తర్వాత ఇరువురి తలిదండ్రులు కలిసి పెళ్లి వివరాలు మాట్లాడుకుంటారు.
ఎదిగిన తమ పిల్లలకు వివాహ భాగస్వాములను వెదికే బాధ్యతను కొంతమంది తలిదండ్రులు ఇంకా ఎందుకు తమపై వేసుకుంటున్నారు? ఇండియాకు చెందిన ఒక స్త్రీ ఇలా చెప్పింది, ఆమెకు ఆమె తలిదండ్రులే పెళ్లి కుదిర్చారు: “అంత ముఖ్యమైన నిర్ణయాన్ని ఒక యౌవనస్థుడెలా తీసుకోగలుగుతాడు? సరైన నిర్ణయం తీసుకునే వయస్సూ అనుభవమూ ఉన్నవారికే ఆ విషయాన్ని విడిచిపెట్టడం ఎంతో మంచిది.” ఆమె చేసిన వ్యాఖ్యానాలు అనేకమంది ఆఫ్రికన్ల అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయి.
అయితే, ఘానాలో కాలాలు మారుతున్నాయి. డేటింగ్, కోర్ట్‌షిప్ ప్రజాదరణ పొందుతున్నాయి. కోర్ట్‌షిప్‌లో ఉండగా తగిన సమయంలో ఆ జంట తమ ఉద్దేశాలను తలిదండ్రులకు తెలియజేస్తారు. వారి తలిదండ్రుల మధ్య సంప్రదింపులు జరిగి, అది మంచి సంబంధమని తలిదండ్రులకు సంతృప్తి కలిగిన తర్వాత రెండు కుటుంబాలు లాంఛనప్రాయమైన వేడుక కొరకు ఏర్పాట్లు చేసుకుంటాయి, ఘానాకు చెందిన వివిధ భాషల్లో సాధారణంగా దీన్ని తలుపు తట్టడం అంటే పెళ్లి తలుపు తట్టడం అంటారు.
తలుపు తట్టే వేడుక
ఆ జంట యొక్క తలిదండ్రులు సమావేశమయ్యే తేదీని, ఉద్దేశాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేస్తారు. “కుటుంబ సభ్యులు” అనే పదం, ఆ జంట యొక్క మేనత్తా మేనమామలు, పిన్నీ బాబాయిలు, వాళ్ల పిల్లలు, తాతా మామ్మలతో కూడిన ఒక పెద్ద ఆఫ్రికా కుటుంబాన్ని సూచిస్తుంది. నిర్ణయింపబడిన దినాన రెండు కుటుంబాల ప్రతినిధులు వేడుక కొరకు సమావేశమౌతారు. వరుడు అక్కడ ఉన్నా లేకపోయినా ఫరవాలేదు. అలాంటి ఒక తలుపుతట్టే వేడుకలో ఏమి జరిగిందో ఈ క్రింది ఘట్టం క్లుప్తంగా తెలియజేస్తుంది.
అమ్మాయి ప్రతినిధి: [వరుని ప్రతినిధులతో మాట్లాడుతూ] మీరు రావడానికిగల కారణం మాకు తెలుసు, అయినా మేము అడగడం సాంప్రదాయం. మీరెందుకు ఇక్కడికి వచ్చారు?
అబ్బాయి ప్రతినిధి: మా కుమారుడు క్వాజీ మీ ఇంటి ముందు నుండి వెళ్తూ ఒక చక్కని పువ్వును చూశాడు, దాన్ని కోసుకోవటానికి మీ అనుమతి కావాలి.
అమ్మాయి ప్రతినిధి: [నిర్లక్ష్యం నటిస్తూ] ఈ ఇంట్లో ఏ పువ్వూ లేదు. కావాలంటే మీరు అడిగి తెలుసుకోవచ్చు.
అబ్బాయి ప్రతినిధి: మా కుమారుడు పొరపాటు పడలేదు. ఈ ఇంట్లో ఎంతో చక్కని పువ్వుందని మేము మళ్లీ చెబుతున్నాము. ఆ పువ్వు పేరు అఫీ.
అమ్మాయి ప్రతినిధి: అయితే మీరు మాట్లాడేది మానవ పువ్వు గురించన్నమాట. అవును, అఫీ ఇక్కడే నివసిస్తుంది.
అబ్బాయి ప్రతినిధి: మేము తలుపు తట్టి, మా కుమారుడు క్వాజీ కోసం ఆమెను అడగాలనుకుంటున్నాము.
ఇప్పుడు అబ్బాయి కుటుంబం వివిధ రకరకాల పానీయాలను కొంత డబ్బును బహుకరిస్తుంది. తెగనుబట్టి, ఇచ్చే వాటి పరిమాణంలోను రకాలలోను తేడాలుంటాయి. ఈ వేడుక దాదాపు పాశ్చాత్య శైలి ప్రదానంతో సమానంగా ఉంటుంది, కొన్ని సందర్భాలలో ప్రదానం ఉంగరం పెట్టమని కోరుతారు.
తెచ్చిన వస్తువులను తీసుకోవాలా అని ఇప్పుడు వధువు ప్రతినిధి చూసేవారందరి ఎదుట ఆమెను అడుగుతాడు. అవుననే ఆమె సమాధానాన్నిబట్టి, పెళ్లి చేసుకోవాలనే ఆమె సుముఖతకు అక్కడున్న వారందరూ ప్రత్యక్ష సాక్షులుగా ఉంటారు. కన్యాశుల్కం చెల్లించడానికి, పెళ్లికి రెండు కుటుంబాలకు అనువైన తేదీని కుదుర్చుకుంటారు. తినుబండారాలతో ఆ వేడుక ముగుస్తుంది.
వివాహ వేడుక
తలుపు తట్టే వేడుకకు వచ్చేవారికంటే, కన్యాశుల్కం చెల్లించడానికి, వివాహానికి అమ్మాయి ఇంట్లోనో లేక ఎంపిక చేసుకున్న ప్రతినిధి ఇంట్లోనో సమావేశమయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఈ సమయంలో ఎక్కువమంది స్నేహితులు వస్తారు.
ఆనందభరితమైన వాతావరణం ఉంటుంది. వధువు కొరకు ఏమి తెచ్చారో చూడాలని అవివాహితులైన యువతీ యువకులు ఉత్సుకత చూపుతారు. కాని కన్యాశుల్కంలోని వస్తువులన్నీ రాలేదని వధువు కుటుంబంవారు ఫిర్యాదు చేయడంతో ఆనందభరితమైన వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. వధువు కుటుంబం ఒప్పుకోవడానికి సుముఖంగా లేనట్లు అనిపించినప్పుడు ప్రేక్షకుల్లోని కొందరు ఊపిరిబిగబట్టి గమనిస్తుంటారు. వధువు కుటుంబం సానుభూతితో వ్యవహరించేలా వరుని ప్రతినిధి నైపుణ్యంగా వాదిస్తాడు. అమ్మాయి కుటుంబం మెత్తబడడంతో పరిస్థితి చల్లారుతుంది. మళ్లీ వాతావరణంలో మార్పువస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఉల్లాసకరంగా ఉంటుంది, అల్పాహారాలు వడ్డించబడతాయి.
ఆ తర్వాత, వధువు ప్రతినిధి నిమ్మళంగా ఉండమని చెప్పి, అందరినీ ఆహ్వానిస్తాడు. ఆయన వరుని తరపు వాళ్లను వారొచ్చిన ఉద్దేశమేమిటని అడుగుతాడు. ఇప్పటికే తలుపు తట్టడం జరిగిందని, ప్రవేశించడానికి అనుమతి లభించిందని సమావేశమైనవారికి గుర్తు చేస్తూ వరుని ప్రతినిధి తాము వచ్చిన కారణాన్ని తెలియజేస్తాడు.
అప్పుడు, పెళ్లి చేసుకోవడానికి అమ్మాయికి అనుమతి ఇచ్చే వ్యక్తి, అలాగే పెళ్లిలో అబ్బాయికి మద్దతునిస్తున్న వ్యక్తితో సహా కుటుంబంలోని సన్నిహిత సభ్యులను ఒక్కో కుటుంబ ప్రతినిధి సమావేశమైనవారికి పరిచయం చేస్తాడు. వేడుక కొనసాగుతుంది.
అమ్మాయి ప్రతినిధి: [వరుని ప్రతినిధులతో మాట్లాడుతూ] దయచేసి మేము అడిగిన పెళ్లి వస్తువులు ఇవ్వండి.
కన్యాశుల్కంలోని వస్తువులన్నీ ఉన్నాయో లేదో అందరూ తెలుసుకునేలా వధువు ప్రతినిధి వాటిని లెక్కపెడతాడు. వధువు కుటుంబం ఎక్కువగా కోరుతుందని వరుని ప్రతినిధులు భావిస్తే, వివాహ దినానికి ముందు వాళ్లు ఏకాంతంగా విషయాన్ని సరిచేసుకుంటారు. అయితే, వధువు కుటుంబంలోని కొందరు సభ్యులు దానికి అంగీకరించకపోతే, అదనం అనిపించే వాటిని తగ్గించమని అడగడానికి వరుని కుటుంబం సిద్ధపడి వస్తుంది. ఎక్కడ నివసించే వారైనప్పటికీ, అంగీకరించిన కన్యాశుల్కాన్ని అది ఎక్కువైనా తక్కువైనా పూర్తిగా చెల్లించవలసిందే.
కొన్ని కుటుంబాలు నెక్లెస్‌లు, చెవి దుద్దులు, స్త్రీల ఇతర వస్తువులు వంటివి కోరుతారు. ఉత్తర ఘానాలో, కన్యాశుల్కంలో ఉప్పు, కోలా గింజలు, గిన్నీ కోళ్లు, గొర్రెలు, చివరికి పశువులు కూడా ఇమిడి ఉంటాయి. కన్యాశుల్కంలో డబ్బు తప్పకుండా ఉంటుంది.
సంప్రదింపులు కొనసాగుతుండగా, వధువు అక్కడ ఉండదుగాని సమీపంలో ఉండి గమనిస్తుంటుంది. వరుడు ఉన్నా లేకపోయినా ఫరవాలేదు. కాబట్టి, దూరంలో నివసిస్తున్న వ్యక్తి తన తరపున పెళ్లి సంప్రదింపులు జరిపే పనిని తన తలిదండ్రులకు అప్పగించవచ్చు. అయితే ఇక్కడ వివరించిన సందర్భంలో, వరుడు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు కోరవలసిన వంతు ఆయన కుటుంబంది.
అబ్బాయి ప్రతినిధి: మమ్మల్ని కోరినవన్నీ మేము తెచ్చాము, కాని మేము మా కోడలిని చూడలేదు.
వివాహ వేడుక పూర్తిగా గంభీరమైన వ్యవహారమేమీ కాదు; అది పరిహాసాలు చేసుకునే సందర్భం కూడా. వధువును చూడాలని అబ్బాయి కుటుంబం కోరేదానికి ఇప్పుడు అమ్మాయి కుటుంబం ప్రతిస్పందిస్తుంది.
అమ్మాయి ప్రతినిధి: వధువు ఇక్కడ ఉంటే బావుండేది. దుఃఖకరంగా, ఆమె విదేశాలకు వెళ్లింది, ఆమెను వెనక్కి తీసుకురావడానికి వెళ్లేందుకు మా దగ్గర పాస్‌పోర్టులుగానీ వీసాలు గానీ లేవు.
దాని భావమేమిటో ప్రతి ఒక్కరికీ తెలుసు. అప్పటికప్పుడు వరుని కుటుంబం కొంత డబ్బు అంటే వరుడు ఇవ్వగలిగినంత డబ్బు ఇస్తుంది, ఇక అంతే! బూటకపు పాస్‌పోర్టులు, వీసాలు సిద్ధం. వధువు తన ప్రయాణం నుండి తిరిగి వచ్చేసింది!
తమాషాకు, కొన్ని తెగలవారు వధువులా నటించమని ఆమె స్నేహితురాళ్లను కొంతమందిని ఏర్పాటు చేస్తారు. అలా నటించిన ప్రతి ఒక్కరిని ఆ గుంపు పూర్తిగా నిరాకరిస్తుంది, అప్పుడు పెద్ద హర్షద్వానాల మధ్య అసలైన వధువు తీసుకురాబడుతుంది. తన కన్యాశుల్కానికి సంబంధించిన వివిధ వస్తువులను చూడమని ఆమె ప్రతినిధి ఆమెను ఆహ్వానిస్తాడు. వరుడు తెచ్చిన వాటిని స్వీకరించాలా అని ఆమెను అడుగుతారు. జవాబు కోసం అందరూ ఆత్రంగా వేచిచూస్తున్నప్పుడు నిశ్శబ్దం ఏర్పడుతుంది. కొంతమంది అమ్మాయిలు సిగ్గుపడతారు, మరికొందరు ధైర్యంగా ఉంటారు, కాని జవాబు మాత్రం తప్పకుండా అవుననే వస్తుంది, వెంటనే హర్షద్వానాలు మారుమ్రోగుతాయి.
వరుడు అక్కడ ఉంటే, వధువు కుటుంబం ఆయనను చూడాలని కోరుతుంది. ఆయన స్నేహితులలో ఒకరిని ఆయనలా నటించడానికి ఏర్పాటు చేస్తే, తమాషా ఎదురులేకుండా కొనసాగుతుంది. అతని స్నేహితుడు తానే వరుడైనట్లు లేచి నిల్చుంటాడు, కాని వెంటనే అందరూ ఆయనను నిరాకరిస్తూ బిగ్గరగా కేకలు వేస్తారు.
తమ అల్లున్ని చూడాలని ఉందని వధువు తలిదండ్రులు కోరుతారు. ఇప్పుడు అసలైన వరుడు సంతోషభరితమైన చిరునవ్వులు చిందిస్తూ, లేచి నిల్చుంటాడు. వధువు కుటుంబం ఆమెను ఆమె భర్తతో కలవడానికి అనుమతిస్తుంది, కన్యాశుల్కంలో భాగంగా ఉంగరం పెట్టాలని కూడా కోరితే, ఆయన ఆమె వేలికి ఉంగరం పెడతాడు. ఉంగరం పెట్టడం పాశ్చాత్య దేశాల అనుకరణ. ఆమె కూడా ఆయన వేలికి ఉంగరం పెడుతుంది. అభినందనలు, ఆనందాలతో వాతావరణం నిండిపోతుంది. అనుకూలంగా ఉండేందుకు, ఖర్చును తగ్గించేందుకు ఇప్పుడు కొంతమంది తలుపుతట్టే వేడుకను అలాగే పెళ్లిని ఒకేరోజున ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఇప్పుడిక అనుభవజ్ఞులైన ఇరు కుటుంబాల సభ్యులు అలాగే ఇతరులు, మరణపర్యంతం వివాహాన్ని ఎలా విజయవంతం చేసుకోవాలనేదానిపై నూతన వధూవరులకు ఉపదేశం ఇస్తారు. ఆ దినాన్ని ఆనందభరితంగా ముగించడానికి అల్పాహారాలు వడ్డించబడతాయి.
వివాహ వేడుక ముగిసింది! ఘానాలో, ఆనాటి నుండి సమాజం ఆ జంటను చట్టబద్ధంగా వివాహం చేసుకున్నట్లు పరిగణిస్తుంది. ఏదైనా కారణం చేత అమ్మాయి కుటుంబంలోని ముఖ్య సభ్యులెవరైనా వేడుకకు రాలేకపోతే, అక్కడ ఇవ్వబడిన పానీయాలు కొన్ని వివాహ వేడుక ముగిసిందని తెల్పడానికి వారికి పంపబడతాయి. వధూవరులు యెహోవాసాక్షులైతే, సాక్షులు బైబిలు ప్రసంగం ఇవ్వడానికి ఏర్పాటు చేస్తారు, ఆ తర్వాత స్వల్ప అల్పాహారాలు ఇవ్వబడతాయి.
ఘానాలో కొందరు జంటలు పాశ్చాత్య శైలీ వివాహ వేడుక జరుపుకుంటారు, ఇక్కడ దాన్ని పౌర వివాహమని లేక చట్టబద్ధమైన వివాహమని పిలుస్తారు. ఆ జంటకు వివాహం కొరకు చట్టసమ్మతమైన వయస్సు ఉన్నంత వరకు దీన్ని తలిదండ్రుల అంగీకారం ఉన్నా లేకున్నా కుదుర్చుకోవచ్చు. సాంప్రదాయ వివాహంలో తలిదండ్రుల అంగీకారం తప్పనిసరి.
పౌర వివాహంలో జంట పెళ్లి ప్రమాణాలు చేస్తారు. కాని సాంప్రదాయ వివాహాల్లో ప్రమాణాలు ఉండవు. సాంప్రదాయ వివాహాలన్నిటినీ రిజిస్టరు చేయించుకోవాలని ప్రభుత్వం కోరుతుంది, యెహోవాసాక్షులు దానికి విధేయులౌతారు. (రోమీయులు 13:1) అప్పుడు ఒక రిజిస్ట్రేషను పత్రం జారీ చేయబడుతుంది.
పురాతన కాలం నుండి గోల్డ్ కోస్ట్, ఇప్పుడు ఘానా, బ్రిటీష్ కాలనీ అయ్యేవరకు ఆ దేశంలో కేవలం సాంప్రదాయ వివాహం మాత్రమే అమలులో ఉండేది. అప్పుడు, ఇక్కడ నివసిస్తున్న తమ పౌరుల కోసం బ్రిటిషువారు పాశ్చాత్య శైలీ వివాహాన్ని ప్రవేశపెట్టారు. స్థానికులు కూడా ఈ విధమైన వివాహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించబడ్డారు, ఇప్పటికి చాలా సంవత్సరాలుగా, పాశ్చాత్య శైలీ వివాహం మరియు సాంప్రదాయ వివాహం రెండూ అమలులో ఉన్నాయి. ఘానాలో రెండూ చట్టబద్ధంగా గుర్తింపబడ్డాయి కాబట్టి యెహోవాసాక్షులకు అంగీకారమైనవే. ఏది ఎంపిక చేసుకోవాలనేది వ్యక్తిగత ఇష్టానికి విడిచిపెట్టబడింది.
కొన్ని ఆఫ్రికా దేశాల్లో, జంటలు చట్టబద్ధంగా వివాహితులైనట్లు పరిగణింపబడడానికి ముందు సాంప్రదాయ వివాహాలను రిజిస్టరు చేసుకోవలసి ఉంటుంది. అయితే, ఘానాలో, పైన వివరించబడినట్లుగా సాంప్రదాయ వివాహం రిజిస్టరు చేయించుకోక పోయినా చట్టబద్ధంగా సరైనదే, సాంప్రదాయ వివాహం ముగిసిన వెంటనే ఆ జంట చట్టబద్ధంగా వివాహితులైనట్లు పరిగణింపబడతారు. ఆ తర్వాత, కేవలం రికార్డుల కొరకు సాంప్రదాయ వివాహం రిజిస్టరు చేయబడుతుంది.
వివాహం అన్నది నిజంగా దేవుడు మానవజాతికిచ్చిన ప్రేమపూర్వక కానుక, ఆ విశేషమైన కానుక దేవదూతలకు కూడా ఇవ్వబడలేదు. (లూకా 20:34-36) ఆ అమూల్యమైన సంబంధానికి రూపకర్తయైన యెహోవా దేవునికి మహిమ కలిగేలా దాన్ని కాపాడుకోవడం ఉచితం.
[29వ పేజీలోని చిత్రం]
ఉంగరాలు మార్చుకోవడం