మా పాఠకుల నుండి
సంపన్న దేశాలు పేద దేశాలను మోసగిస్తున్నాయి నాకు 14 సంవత్సరాలు, “సంపన్న దేశాలు పేద దేశాలను ఎల్లవేళలా మోసగిస్తాయా?” (డిశంబరు 8, 1995) అనే శీర్షికల విషయమై నేను మీకు ఎంతో కృతజ్ఞున్ని. “దుర్దశ” అనే అంశంపై వ్యాసం వ్రాయమని మా భూగోళశాస్త్ర ఉపాధ్యాయుడు మాకు అసైన్‌మెంటు ఇచ్చాడు. నేను వార్తాపత్రికలను, ఇతర పత్రికలను చూశాను కానీ ఉపయోగించడానికి అనువైనవేవి కన్పించలేదు. అప్పుడు, సరిగ్గా అవసరమైన సమయంలో, నా నివేదికకు ఆధారంగా ఉండేందుకు ఈ పత్రిక వచ్చింది. నాకు తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులు లభించాయి, ఈ శీర్షికల విషయమై నేను ఎంతో కృతజ్ఞున్ని.
ఎ. ఒ., బ్రెజిల్
అనివార్య ప్రవర్తన “అనివార్య ప్రవర్తన—అది మీ జీవితాన్ని అదుపుచేస్తోందా?” (మార్చి 8, 1996) అనే ప్రోత్సాహకరమైన శీర్షిక విషయమై మీకు వందనాలు. నేను అనివార్య ప్రవర్తన వలన బాధపడుతున్నాను, అయితే అలా బాధపడేది నేను ఒక్కదాన్నే కాదని తెలుసుకోవడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. చిన్నతనం నుండి కూడా అది నన్ను ఎంతో పీడించింది. బైబిలును పఠించినప్పటి నుండి, నేను పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేశాననే ఆలోచనల్లో మునిగిపోయేదాన్ని. క్రమేపీ, నేను నా సమస్యలను అదుపు చేసుకోగలిగాను. యెహోవా తన అపరిపూర్ణ సేవకులను అర్థం చేసుకుంటాడని తెలుసుకోవడం ఎంత మేలో!
ఎ. బి., జర్మని
మన సృష్టికర్త ఈ జబ్బును అర్థం చేసుకుంటాడని, ఆయన “మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు” అని నేను ఎంతో గుణగ్రహిస్తున్నాను. (1 యోహాను 3:20) ఈ విధమైన శీర్షికలను దయచేసి ప్రచురిస్తూ ఉండండి; అవి మాకు ఎంతో గొప్ప ప్రోత్సాహాన్నిస్తున్నాయి.
డబ్ల్యు. ఇ., స్విట్జర్లాండ్
ఈ శీర్షిక నాకు ఎంత ఆదరణనిచ్చిందో మీరు ఊహించలేరు. నాకు భయంకరమైన, నీచమైన తలంపులు ఉండేవి, అవి క్రుంగుదలకు మరియు కొన్నిసార్లు ఆత్మహత్యా తలంపుల వైపుకు నన్ను నడిపాయి. అయితే యెహోవా నన్ను నిరాకరించలేదుగానీ నన్ను ప్రగాఢంగా ప్రేమిస్తున్నాడనే విషయాన్ని నేను గ్రహిస్తుండగా ఎంతో విపరీతమైన బరువు నా భుజాలపైనుండి తీసివేయబడినట్టు నేను భావిస్తున్నాను.
ఐ. బి., ఫ్రాన్స్
నేను చిన్నగా ఉన్నప్పటి నుండి నా చేతులను పదే పదే కడిగే దాన్ని. నేను స్టవ్‌ను మూడుసార్లు తనిఖీ చేస్తాను, అలా తనిఖీ చేసేందుకు బయటనుండి ఇంటికి తిరిగి రావలసి వచ్చినా నేను అలా చేస్తాను. నేను బాణలిలకు అన్నింటికీ మూతలు పెట్టానో లేదో అని, తలుపులన్నీ సరిగ్గా వేసానో లేదో అని తనిఖీ చేస్తాను. నేను అనివార్య ప్రవర్తనతో పోరాడి పోరాడి అలసిపోయి అప్పుడు నిద్రపోతాను. మీ శీర్షిక విషయమై మీకు వందనాలు.
ఎమ్. పి., వెనిజ్యులా
రాబిన్‌లు నేను “స్నేహశీలియైన రాబిన్” (మార్చి 8, 1996) అనే శీర్షికను బట్టి ఎంతో ముగ్ధున్నయ్యాను. కొన్ని సంవత్సరాల క్రితం, తోటలో ఒక కాలువను తవ్వుతుండగా, దగ్గర్లోని లాన్‌లో నిలబడి నన్నే గమనిస్తున్న ఒక రాబిన్ పాడుతున్న శ్రావ్యమైన గీతాన్ని నేను విన్నాను. నేను దాని స్వరాన్ని అనుకరించాలని ప్రయత్నించిన వెంటనే అది కాలువలో నా ప్రక్కన వచ్చి నిలబడింది. నేను పారతో మట్టిని వేసిన ప్రతిసారి బయటికి వచ్చిన పురుగులను తీసుకునేందుకు రాబిన్ ఇష్టపడింది. జంతు ప్రపంచాన్ని గురించిన శీర్షికలను దయచేసి ప్రచురిస్తూ ఉండండి!
ఎఫ్. ఎస్., జర్మని
మంచుపర్వతాలు “సముద్రంలోని స్ఫటిక భవనాలు” (జనవరి 8, 1996) అనే శీర్షిక విషయమై మీకు వందనాలు. ఆ సమాచారాన్ని చదవడం మరియు ఆ మహత్తరమైన మంచు గడ్డల్లో ఒకదాని ఎదురుగా నన్ను నేను ఊహించుకోవడంతో, మన ఆనందం కొరకు మన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు చేసిన మహిమాన్విత విషయాలనుబట్టి నేనెంతో ప్రభావితుడినయ్యాను. కీర్తన 104:24 నందు కీర్తనల గ్రంథకర్త యెహోవా గురించి పలికిన విధంగా “[ఆయన] కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.”
ఎ. ఐ. బి., బ్రెజిల్
పాఠశాల వ్యాసం ఎరిక్ పాఠశాల వ్యాసాన్ని గురించిన కథ ఉన్న “కాలగమనంలో నేనో క్షణాన్ని మార్చగల్గితే” [ఫిబ్రవరి 22, 1996, (ఆంగ్లం)] అనే శీర్షిక నన్ను నిజంగా ప్రభావితం చేసింది. ఆ అబ్బాయి తలిదండ్రుల ఎడల నాలో అది ప్రశంసను, కృతజ్ఞతా భావాన్ని కలిగించింది. ఆ అబ్బాయి పసివాడైనా, అంతటి ధైర్యము మరియు యెహోవా ఎడల ప్రేమ ఉన్న కుమారున్ని పెంచేందుకు వారు ఎంతో సమయాన్ని వెచ్చించి ఎంతో శ్రమపడి ఉంటారు.
కీ. ఎన్., ఇటలీ