యెహోవా బలంతో దుర్ఘటనను ఎదుర్కొనడం
స్పెయిన్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, స్పెయిన్ నందలి యెహోవాసాక్షుల బైల్ సంఘానికి చెందిన అనేకులు, సమీపంలోని సెయిరా నివాడా పర్వతాల్లో అందరూ కలిసి ఓ అందమైన దినాన్ని ఆనందించారు. అయితే ఇల్లు చేరేందుకు కేవలం ఇంకా ఐదు కిలోమీటర్లు ఉండగా, వీరు ప్రయాణిస్తున్న బస్సు ఏ వీధిలో ఉందో అందులోకి ఒక కారు దూసుకువచ్చి బస్సుకు గుద్దుకుంది. ప్రేలుడు సంభవించింది, దానితో బస్సుకు నిప్పంటుకుంది. కొంతమంది ప్రయాణికులు సమయానికి బయటపడగలిగారు, అయితే బస్సు వెనుక భాగంలో ఉన్న అనేకులు పొగవల్ల బయటకు రాలేకపోయి మరణించారు.
మొత్తం 26 మంది సాక్షులు తమ జీవాలను కోల్పోయారు, అందులో నలుగురు పూర్తికాల సేవకులు, చాలామంది పిల్లలు ఉన్నారు, అంటే బైల్ సంఘంలో దాదాపు మూడో వంతు అన్నమాట. స్పెయిన్ రాజైన కువాన్ కార్లోస్, బైల్ యొక్క మేయర్‌కు తానిచ్చిన టెలిగ్రామ్‌లో, “ఆ దుఃఖకర ప్రమాదాన్నిబట్టి చాలా విభ్రాంతి చెందాము. మా యథార్థ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ బాధాకర సమయంలో మా మిక్కుట సానుభూతిని, మద్దతును బాధితుల కుటుంబాలకు దయచేసి అందించండి” అని వ్రాసినప్పుడు ఆయన అనేకమంది స్పెయిన్ నివాసుల భావాలను ప్రతిధ్వనింపజేశాడు.
అంత్యక్రియలకు హాజరైన వేలకొలది మందిలోని కొందరి మనస్సుల్లో మెదిలిన ప్రశ్న ఏమంటే, అలాంటి దుర్ఘటనలు ఎందుకు సంభవిస్తాయి? “కాలవశమునను, అనూహ్యంగాను” సంభవించే ప్రమాదాలు, అందరినీ ప్రభావితం చేసే విధంగానే యెహోవా ప్రజలను కూడా ప్రభావితం చేయవచ్చు అన్నది స్పష్టమౌతుంది. (ప్రసంగి 9:11, 12, NW) అయినప్పటికీ, ఇక కొంత కాలానికి అలాంటి దుర్ఘటనలు జరగవని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు.—ప్రకటన 21:4, 5.
స్పెయిన్ లోని యెహోవా సాక్షుల బ్రాంచి కుటుంబసభ్యులు అనేకమంది మరియు దేశంలోని ఇతర భాగాలకు చెందిన వేలాదిమంది సాక్షులు, ప్రాంతీయ సహోదరులకు ఆదరణను మరియు మద్దతును ఇచ్చేందుకు బైల్‌కు ప్రయాణమై వచ్చారు. స్థానిక మరియు ప్రాంతీయ అధికారులతో సహా బైల్ ప్రజలు కూడా సాక్షుల కుటుంబాల దుఃఖాన్ని పంచుకున్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన సాక్షుల ధీరోదాత్తతను చూసిన అనేకమంది ప్రభావితం చెందారు.
“నాకు సాక్షులు అనేక సంవత్సరాల నుండి తెలుసు, నేను వ్యక్తిగా అజ్ఞాతవాదినైనా, నేను మీ విశ్వాసాన్ని ప్రశంసిస్తున్నాను. ప్రమాదం జరిగినప్పుడు, ఇతర గుంపులకంటే మీరు ఈ దుర్ఘటనను శ్రేష్ఠమైన రీతిలో ఎదుర్కొనేందుకు మీ మతం మరియు మానవ సంసంజన శక్తి మీకు వీలు కలిగిస్తుందని నేను వెంటనే అనుకున్నాను. దుఃఖిస్తున్న కుటుంబాలకు మొత్తం నగరమంతా ఎలా మద్దతునిచ్చిందో నేను చూశాను. బహుశా ముందు, మీరు ఏ విషయాలను దృఢంగా నమ్ముతారో దాని విషయమై ప్రజలకు తప్పుడు అభిప్రాయాలు ఉండి ఉండవచ్చు, అయితే అవి మటుమాయమయ్యాయని చెప్పేందుకు నేను సంతోషిస్తున్నాను. మీకు అంతరంగ శక్తి ఉంది, సాక్షులు కాని వారు దాన్ని అర్థం చేసుకోవడం కష్టం” అని బైల్ యొక్క మేయర్ అయిన ఆంటోన్‌యో గొమెజ్ వ్యాఖ్యానించాడు.
స్పెయిన్ ప్రభుత్వ ప్రతినిధిగా అంత్యక్రియలకు హాజరైన, ప్రజా సేవల మంత్రియైన హోసా బోరెల్ ఇలా ఒప్పుకున్నాడు: “ఒక్క దెబ్బలోనే తమ కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన వారికి మీరేమి చెప్పగలరు? తమ విశ్వాసంలో వారు కనుగొనేదాని కంటే గొప్పదాన్ని మనమివ్వలేము. . . . మీకు అద్భుతమైన విశ్వాసముంది.”
‘ఒకనినొకడు ఆదరించుకొనుడి’
“తమ విశ్వాసంలో” వారేమి ‘కనుగొన్నారు’? అన్నిటికంటే మిన్నగా, ‘మన శ్రమ అంతటిలో మనలను ఆదరించే, . . . మరియు సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడగు’ యెహోవా నుండి వారు ఆదరణ పొందారు. (2 కొరింథీయులు 1:3, 4) వారికి దుఃఖం ఉన్నప్పటికీ, “యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి” అని పౌలు థెస్సలొనీకయులకు వ్రాసిన మాటలను మనస్సునందుంచుకుని, ఒకరికొకరు ఆదరణనిచ్చుకునేందుకు వారు శక్తిని పొందారు.—1 థెస్సలొనీకయులు 5:11.
ఆ క్రైస్తవ సహోదర సహోదరీలు, వారిలో కొందరు ఎనిమిది మంది వరకూ బంధువులను కోల్పోయిన వారు, తమ ప్రియమైన వారిని కోల్పోయిన సంఘంలోని ఇతర సభ్యులను దర్శించేందుకు వెళ్లడాన్ని చూడటం ఎంతో కదిలించే అనుభవం. “మేము ఒకరినొకరం చూసుకున్నప్పుడు, మేము ఏడ్చాము. అయితే ఆ కన్నీళ్లలో మేము పునరుత్థాన నిరీక్షణను జ్ఞాపకం చేసుకున్నాం, అప్పుడు మాకు ఆదరణ లభించిందని” సంఘాధ్యక్షుడైన ఫ్రాన్సిస్‌కో సేజ్ వివరించాడు, ఆయన తనకున్న ఇద్దరు పిల్లలనూ పోగొట్టుకున్నాడు.
“మేము మా ప్రకటనా పనిని నిర్లక్ష్యం చేయలేదు, మరియు మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే అనే బ్రోషూర్‌ను ఉపయోగిస్తూ, మరణించిన వారి సాక్షులుకాని బంధువులను సందర్శించాలని మేము ప్రత్యేకంగా ప్రయత్నించాము.” ఫ్రాన్సిస్‌కో ఇలా చెప్పుకుపోతున్నాడు: “వ్యక్తిగతంగా, నేను ప్రకటించాలని ఇష్టపడ్డాను, ఎందుకంటే ఇతరులకు ప్రకటించడం ద్వారా నేను ఉపశమనం పొందుతానని నాకు తెలుసు. అంతేకాకుండా, నేను దుఃఖిస్తూ బయటకు వెళ్లినప్పటికీ, తప్పక ఆదరణ పొంది ఇంటికి తిరిగి వచ్చాను.”
బైల్‌లోని ప్రజలు ఈ ప్రకటనాపనికి ఎంతో అనుకూలంగా ప్రతిస్పందించారు. ప్రమాదం జరిగిన ఒక వారం తర్వాత, తన ఇద్దరు కుమార్తెలను, నలుగురు మనుమలను పోగొట్టుకున్న దుఃఖంతో బాధపడుతున్న ఎన్‌కార్నా, తాను ఇటీవలనే బైబిలు అధ్యయనం ప్రారంభించిన స్త్రీని దర్శించింది. తన భర్తను నాలుగు నెలల క్రితం పోగొట్టుకున్న ఈ స్త్రీకి ఎన్‌కార్నా లేఖనాధార ఆదరణను అందించేది. మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే అనే బ్రోషూర్‌ను వారు పరిశీలించడంలో కొనసాగుతుండగా, “ఇప్పుడు మేము ఒకరికొకరం ఆదరణనిచ్చుకోవాలి” అని ఆమె అంటుంది.
ప్రపంచవ్యాప్త సహోదరత్వం నుండి కూడా మద్దతు వెంటనే వచ్చింది. “మేము అందుకున్న వేలకొలది ఉత్తరాలు, టెలిగ్రామ్‌ల ద్వారా సంఘంలోని సభ్యులందరూ ప్రోత్సహింపబడినట్టు భావించారు. వాటినన్నిటినీ బట్వాడా చేసేందుకు తపాలా కార్యాలయం ప్రతి రోజూ మా ఇంటికి ఓ వ్యానును పంపాల్సి వచ్చేది. సహోదరుల ప్రేమపూర్వక శ్రద్ధ విషయమై మేమెంతో కృతజ్ఞులం” అని సంఘ సెక్రటరీయైన ఫ్రాన్సిస్‌కో కపీయా వివరించాడు.
దుర్ఘటన నిరీక్షణనిస్తుంది
అలాంటి దుర్ఘటననుండి ఏదైనా మంచి జరుగగలదా? “జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి యింటిమీదనుండును” అని ప్రాచీన రాజైన సొలొమోను వ్రాశాడు. (ప్రసంగి 7:4) బైల్‌లో జరిగిన దుర్ఘటన ఈ సూత్రానికి అనుగుణంగా, దేవునితో తమకున్న సంబంధాన్ని గురించి మరింత గంభీరంగా తలంచేందుకు కొంతమందిని పురికొల్పింది. దుర్ఘటనలో తన ఆరుగురు పిల్లలో ఇద్దరిని కోల్పోయిన అవిశ్వాసియైన భర్తయగు ఫావుస్టీనో, తన భార్య డోలోరాస్‌కు ఇలా చెప్పాడు: “నేను నీకో శుభవార్త చెప్పాలి. నేను నా పిల్లలను నూతన లోకంలో చూడాలని ఇష్టపడుతున్నాను గనుక నేను బైబిలు పఠించడం ప్రారంభించబోతున్నా.”
బైల్ నందలి మన సహోదర సహోదరీలు తమ దుఃఖాన్ని త్వరగా మర్చిపోలేకపోయినప్పటికీ వారు ఇతరులకు ఆదరణను ఇస్తున్నారు మరియు ఆదరణ పొందుతున్నారు. యెహోవా తన ఆత్మ ద్వారా మరియు ప్రేమగల అనేకమంది సహోదరసహోదరీల ద్వారా వారిని బలపరుస్తున్నాడు. వారి విషయమై మనం చేసే ప్రార్థనలు మన పరలోక తండ్రిని ఎడతెగక చేరుతున్నాయి.
[26వ పేజీలోని చిత్రాలు]
నశించిన వారిలోని నలుగురు