వేగానికి రాజు
దక్షిణాఫ్రికాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
ఎవరిదీ బిరుదు? తక్కువ దూరం పరిగెత్తేటప్పుడు, ప్రపంచంలోని అన్ని జంతువులకంటే వేగంగా వెళ్లగల చీతాది. ప్రతి చీతాకి తనదైన ప్రత్యేక పద్ధతిలో మచ్చలు ఉంటాయి, అలా “మచ్చల శరీరం” అనే అర్థమున్న సంస్కృత పదంనుండి చీతా అనే పేరు వచ్చింది.
దాన్ని చూడగానే విశిష్ఠంగా కనిపించేవి దాని కాళ్లేనని కొందరు అంటారు. దాని వెన్ను భాగం వంగిపోతుందని, దాని తల మరీ చిన్నదని ఇతరులంటారు. అయితే, ఈ లక్షణాలే దానికి ప్రయోజనకరమైనవి. దాని పొడవైన వెనక కాళ్లు దానికి శక్తినిస్తాయి, అది మనోహరంగా నడిచేందుకు మరియు హుందాగా పరుగెత్తేందుకు అవి వీలు కలిగిస్తాయి. ఈ జంతువు నిజంగా చాలా వేగంగా పరుగెత్తగలదు! నిలబడి ఉన్న స్థానంనుండి ఒక చీతా, కేవలం కొన్ని క్షణాల్లోనే గంటకు దాదాపు 110 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోగలదు.
చీతా అత్యంత అనుకూలమైన వేగం కొరకు చక్కగా రూపొందించబడింది. తక్కువ బరువుగల దాని అస్థిపంజరంలో, అసాధారణంగా వంగగల వెన్నెముక కూడా ఉంది, అది స్ర్పింగు వలె చుట్టుకుని విడిపోగలదు. గాఢమైన ఛాతి, విశాలమైన ఊపిరితిత్తులు, దృఢమైన గుండె, సమతౌల్యాన్ని అందించే తోక మరియు త్వరితంగా ఊపిరి పీల్చుకునేందుకు వీలు కలిగించే పెద్ద ముక్కుపుటాలు చీతాకు వరంగా ఇవ్వబడ్డాయి—ఇవన్నీ కూడా ఈ జంతువు యొక్క సాటిలేని వేగానికి తోడ్పడతాయి. అయితే చీతాకు కలిగే శక్తి విస్ఫోటం తక్కువ సేపు ఉంటుంది. కేవలం 400 మీటర్లు పూర్తి వేగంతో పరుగెత్తిన తర్వాత, అది చల్లబడేందుకు ఆగవలసిందే.
సాధారణంగా చీతాలు మానవులకు ప్రమాదం కలిగించవు. డా విల్ట్‌కు చెందిన చీతాలు (ఆంగ్లం) అనే తన పుస్తకంలో, సంవత్సరాలుగా చీతాలను పెంచుతున్న ఆన్ వాన్ డైక్ ఇలా వ్రాస్తుంది: “నా పిల్లుల కుటుంబానికి తిండి పెట్టిన తర్వాత, చీకటి పడకముందు వాటితో ఆ కొద్ది క్షణాలు గడపడమంటే నాకెంతో ఇష్టం. మా మధ్య ఓ విశ్వాస భావం వృద్ధి చెందింది, అవి సాధు జంతువులు కాకపోయినా నాకు హాని చేయవని నాకు తెలుసు.”
అయితే, మనుష్యులు చీతాల ఎడల ఎల్లవేళలా దయాపూర్వకంగా లేరు. ఉదాహరణకు, ఆఫ్రికాలోని వేటగాళ్లు దాని ప్రత్యేకమైన చర్మాన్ని ఎంతో ఆశించారు, మరి వలస వెళ్లడం చీతా పరుగెత్తేందుకు ప్రాంతాన్ని తక్కువ చేసింది. ఇది చీతాల సంఖ్యను చాలా తగ్గించేసింది. భారతదేశంలో ఒకప్పుడు చీతాలు పుష్కలంగా ఉండేవి, మరి 1952లో అవి అక్కడనుండి అంతరించిపోయాయి. తూర్పు మధ్యదరా ప్రాంతపు తీరాల్లోని కొన్ని దేశాల్లో అవి ఇప్పుడు ఎంతమాత్రం లేవు.
దేవుని నూతన లోకంలో జంతువులు పేరాశగల మానవుల వలన ప్రమాదానికి గురి కావు గనుక మనం ఎంత ఆనందించవచ్చో కదా! (యెషయా 11:6-9) అద్భుతంగా రూపొందించబడిన, వేగానికి రాజైన చీతాను చూడగల ఆధిక్యత బహుశ మీకు ఆ సమయంలో లభించవచ్చు.