మెక్సికో నందు విపత్తుల మధ్య క్రైస్తవ ప్రేమ
మెక్సికో నగరానికి చెందిన ఒక వార్తా పత్రిక ఇలా నివేదించింది: “గత 20 రోజుల్లో, ప్రకృతి వైపరీత్యాలు—తుపానులు మరియు భూకంపం—మెక్సికో తీరాల్ని మరణాలతో, వినాశముతో ఒక ఊపు ఊపేసింది.—ఎల్ ఫినాన్సియారో అక్టోబరు 17, 1995.
కాంపెకె, క్వున్టానా రూ, టాబాస్కో మొదలైన మెక్సికో రాష్ట్రాలు అక్టోబరు ప్రథమార్ధంలో వచ్చిన ఓపల్ తుపాను మూలంగా ఘోరంగా దెబ్బతిన్నాయి. దాదాపు 200 మంది మరణించారు, 150 కంటే ఎక్కువమంది గాయపడ్డారు, 5,00,000 మందికి తీరని నష్టం కలిగింది, వేలాది గృహాలు దెబ్బతిన్నాయి లేక పూర్తిగా నాశనమయ్యాయి.
మెక్సికోలోవున్న యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం ఈ నష్టాన్ని గురించి విన్నవెంటనే, దెబ్బతిన్న ప్రాంతాల్లోవున్న సాక్షులు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ఒక వ్యక్తిని పంపింది. 2,500 కంటే ఎక్కువమంది తమ ఇళ్లను విడిచివెళ్లాలని బలవంతం చేయబడ్డారని తెలిసింది. వీరు తమ తోటి సాక్షుల గృహాల్లోకి దయాపూర్వకంగా స్వీకరించబడ్డారు.
పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయబడ్డాయి. అవసరతలో ఉన్నవారికి ఆహారం, వస్త్రాలు, డబ్బు అందజేయబడ్డాయి. వరద నీరు తగ్గిపోయిన తర్వాత, సాక్షులు తమ క్రైస్తవ సహోదరుల గృహాలను పునర్నిర్మించడం ప్రారంభించారు.
అక్టోబరు 9న, రిక్టర్ స్కేలు మీద 7.6గా నమోదయిన పెద్ద భూకంపం మెక్సికో రాష్ట్రాలైన కొలిమా మరియు జలిస్కోలను దెబ్బతీసింది. యెహోవాసాక్షులకు చెందిన ఎనిమిది రాజ్య మందిరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వారి పన్నెండు గృహాలు కూలిపోయాయి, దాదాపు 65 పాడైపోయాయి. మళ్లీ, మరో సహాయక వర్గం నెలకొల్పబడి, సహాయం అందజేసింది.
తర్వాత అక్టోబరు 20న, కయపాస్ రాష్ట్రాన్ని కుదిపివేస్తూ మరో భూకంపం వచ్చింది. మరో 88 మంది సాక్షుల ఇండ్లు నాశనమయ్యాయి, 38 తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు రాజ్య మందిరాలు పూర్తిగా శిథిలమయ్యాయి, మరో నాలుగు బాగా దెబ్బతిన్నాయి. దాదాపు అదే సమయంలో, రక్సాన్ తుపానుతోపాటు వచ్చిన వరదలు వెరాక్రజ్ రాష్ట్రంలోని దాదాపు 80 మంది సాక్షుల గృహాలను నాశనం చేశాయి. నాలుగు గృహాలు పూర్తిగా నాశనమయ్యాయి. యెహోవాసాక్షులు స్థాపించిన ఒక సహాయక నిధి కూడా ఈ బాధితులకు వెంటనే సహాయపడింది.
కొంతమంది సాక్షులకు గాయాలై, ఎముకలు విరిగినప్పటికీ ఈ ప్రకృతి వైపరీత్యాలవల్ల ఎవరూ మరణించలేదు. మొత్తం మీద, అవసరంలో ఉన్నవారి కొరకు దాదాపు 24 టన్నుల ఆహారం, 4 టన్నుల వస్త్రాలు పంపబడ్డాయి. అనేకమంది చూపరులు సహాయక పని గురించి మెప్పును వ్యక్తపర్చారు. కొలిమాలోని ఒక స్త్రీ ఇలా చెప్పింది: “యెహోవాసాక్షులు ఎంతో ఐక్యంగా ఉంటారని నేను కేవలం విన్నాను, కాని ఇప్పుడు నేను నా స్వంత కళ్లతో చూడగలుగుతున్నాను.”
సాక్షుల గురించి, వారి సహాయక పని గురించి తరచూ ప్రజలు ఇలా పేర్కొన్నారు: “వీరు నిజంగా సహోదరులు.” “వారు చక్కగా సంస్థీకరింపబడిన గుంపు.” కొంతమంది ఇలా కూడా అన్నారు: “సహాయం చేయడానికి వచ్చిన పునరావాస గుంపులన్నీ యెహోవాసాక్షుల వలె పనిచేస్తే, మొత్తం పట్టణమంతా ఇదివరకే శుభ్రమై ఉండేది.”
ఇప్పుడు 4,40,000 కంటే ఎక్కువమంది సాక్షులు తమ తోటి మెక్సికో దేశస్థులతో సువార్తను పంచుకుంటున్నారు. ఇటీవల సంభవించిన ఈ ప్రకృతి వైపరీత్యాల సమయంలో వారు ఒకరి ఎడల ఒకరు చూపించుకున్న ప్రేమ శక్తివంతమైన సాక్ష్యాన్నిచ్చింది.—యోహాను 13:34, 35.