మేము దేవున్ని కనుగొనడానికి ఆయన అనుమతించాడు
దావీదు రాజు తన రాజత్వాన్ని తన కుమారుడైన సొలొమోనుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తన కుమారునికి ఆయన ఈ సలహాను ఇచ్చాడు: “నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును [“నీవు ఆయనను కనుగొనడానికి ఆయనే అనుమతిస్తాడు,” NW]; నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును.”—1 దినవృత్తాంతములు 28:9.
మా విషయంలో ఇది నిజమని మేం తెలుసుకున్నాం. మేం దేవుని కోసం వెదికాం, మేము ఆయనను కనుగొన్నాం, అయితే అదీ అనేక తప్పుద్రోవల్లో వెళ్ళిన తరువాతే. మా ఆలోచనా సరళులు ఎంత శక్తివంతంగా ఆయనపై మరియు ఆయన సేవపై కేంద్రీకరించబడ్డాయో యెహోవా గ్రహించాడని మేము నమ్ముతున్నాము, మరి ఆయనను మేము కనుగొనడానికి తనకు తానుగా అనుమతించాడు. ఈ క్రింది వివరణ అదెలా జరిగిందో తెలుపుతుంది.
మేము నలుగురు సహోదరులం అమెరికాలోని ఫ్లోరిడాలో పెరిగాం. కుటుంబాన్ని పోషించేందుకు మా నాన్న వంటవాడిగా చాలా గంటలు పని చేసేవాడు, అమ్మ గృహిణి, మేము నలుగురు అబ్బాయిలం గడ్డికోసేవాళ్ళం, వార్తాపత్రికలను వేసేవాళ్ళం, అంటే ఇంటి ఆదాయాన్ని పెంచే దేనినైనా చేసేవాళ్ళం. అమ్మ కాథోలిక్కు, నాన్న బాప్టిస్టు. మేమందరం దేవున్ని బైబిలును నమ్మాం, కాని దాని గురించి మరేమీ చేయలేదు, మేము చర్చికి అరుదుగా వెళ్ళేవాళ్ళం. 70ల తొలి భాగంలో శాంతి, బెల్బాటం జీన్సు, పొడవైన వెంట్రుకలు, రాక్ సంగీతం అనేవి చాలా ప్రాచుర్యంలో ఉండేవి. ఇవన్నీ మా జీవితాలపై ప్రభావం కలిగి ఉండేవి.
24 మరియు 17 ఏండ్ల స్కాట్ మరియు స్టీవ్ అనే మేమిద్దరం 1982 వరకు బైబిలునందు గంభీరంగా శ్రద్ధ తీసుకోనూ లేదు, విషమిస్తున్న ప్రపంచ పరిస్థితులను గూర్చిన చింత పెరగనూ లేదు. స్కాట్‌కు స్వంతంగా భవన నిర్మాణ వ్యాపారం ఉండేది. అది బాగా లాభదాయకంగా ఉండేది, కనుక మేము ఇద్దరం కలిసి ఒక అపార్ట్‌మెంట్‌లోకి మారాం. బారులో ఎక్కువ సేపు గడపడమూ ఆ రకమైన జీవితమూ మాకింక ఏ మాత్రం ఆసక్తికరంగా అనిపించలేదు, మరింత ఆకర్షణీయమైన సంతోషకరమైన మరొక జీవిత విధానం ఉండకపోదని మాకు తెలుసు. మేము ఆత్మీయ విషయాల కొరకు ఆకలిగొనడం మొదలుపెట్టాము. మేము బైబిలును క్రమంగా చదవడం దేవుని వాక్యంలో మరింత జ్ఞానాన్ని, అంతర్దృష్టిని మరెక్కువగా కోరుకునేందుకు మాకు సహాయపడింది.
మేము ఆదివారాల్లో వేర్వేరు చర్చీలకు వెళ్ళడం మొదలుపెట్టాం. ఫ్లోరిడాలోని లేక్ వర్త్‌లోని మా ఇంటి దగ్గర్లో ఉన్న మేము వెళ్ళిన ఒక చర్చిలో ఆదివారపు ప్రసంగంలో 25 నిమిషాలు డబ్బివ్వడాన్ని గురించే. ప్రసంగీకుడు ప్రసంగపీఠం మీదుగా సగం వంగి, “ఔదార్యంగా ఇవ్వండి, మీ జేబు లోపలివరకు చేతిని వెళ్ళనివ్వండి” అని అంటాడు. వాళ్ళు డబ్బుల పళ్ళాన్ని ఒక కూటమిలో మూడు సార్లు పడుతారు, అలా చాలా మంది ఖాళీ జేబులతో తిరిగి వెళ్తారు. మేము ఎన్నో చర్చీలకు వెళ్ళాం, కాని ఎక్కువగా చందా పళ్ళాలను పట్టడమూ సాంఘిక సహవాసాలు మాత్రమే కనిపించాయి.
యెహోవాసాక్షుల గురించి హెచ్చరించబడింది
బైబిలు ప్రాథమిక బోధలు అని మేము తలంచిన విషయాలు మాకు బోధించబడ్డాయి, ఉపాధ్యాయులు వృత్తిపర వేదాంతులు కనుక మేము వాటిని నమ్మాం. ఆ తరగతుల్లో ఒకటి అమెరికాలోని తెగల గురించే, యెహోవాసాక్షులు ఆ లిస్టు మొదట్లో ఉన్నారు. వారికి యేసుయందు విశ్వాసం లేదని, వాళ్ళకు వాళ్ళదైన వేరే బైబిలు ఉందని, వాళ్ళు స్వర్గానికి వెళ్ళరని, నరకం లేదని వాళ్ళు నమ్ముతున్నారని మాకు హెచ్చరిక ఇవ్వబడింది. నిజమే, యెహోవాసాక్షులది తప్పనే నిర్ణయానికి మేము రావడానికి ఇదంతా కారణమయ్యింది.
ఈ పాటికి మాకు బలమైన ఆసక్తి ఉంది, కాని అది కచ్చితమైన జ్ఞానం చొప్పున కాదు. (రోమీయులు 10:2) మనం తప్పక సువార్తను ప్రకటించి, శిష్యులను చేయాలని మత్తయి 28:19, 20 నందు యేసు చెప్పిన విషయం మాకు తెలుసు. ఆ సమయంలో 2,000 మంది సభ్యులు గల బైబిల్ టౌన్ అనే చర్చికి మేము హాజరయ్యేవాళ్ళం, అక్కడ 17 నుండి 30 ఏండ్ల వయస్సు గల దాదాపు 100 మంది యౌవనస్థుల గుంపులో భాగంగా మేము ఉండేవారం. స్కాట్ ఏదో ఒకరకమైన ప్రకటన పని చేయడానికి వారిని కూడగట్టుకోవాలని ప్రయత్నించాడు, కాని సఫలుడు కాలేదు.
కనుక మా అంతట మేమే ప్రకటనా కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. స్థానిక సంతలో బల్లను పెట్టి, కరపత్రాలను బైబిళ్ళను పంచిపెట్టాలనే తలంపు స్కాట్‌కు వచ్చింది. మేము అలాగే చేశాం. మేము స్థానిక “క్రైస్తవుల” బుక్ స్టోర్‌కు వెళ్ళి బోలెడు కరపత్రాలను బైబిళ్ళను కొనుక్కొని, రెండు కాళ్ళున్న చట్రంపై పొడవైన ప్లైవుడ్ ముక్కతో బల్లను తయారుచేసి, వాటిపై బైబిళ్ళను కరపత్రాలను ఉంచి, ‘వినువారుమాత్రమై ఉండక వాక్యప్రకారము ప్రవర్తించువారునై’ యుండుటకు ప్రయత్నించాము.—యాకోబు 1:22.
ఆంగ్ల సాహిత్యాన్ని అలాగే, స్పానిష్ సాహిత్యాన్ని అందిస్తూ సంత పరిచర్య అని పిలువబడేది ఒక్కోవారం గడుస్తున్న కొలది వృద్ధి చెందింది. అలాగే మేము బైబిళ్ళను, 30 వేర్వేరు రకాల కరపత్రాలను “దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు” అనే హ్యాట్ పిన్నులను ఇచ్చాము. కొంత కాలం తరువాత, “ఈ రోజు మీరు మీ బైబిలును చదివారా?,” “నేనెందుకు నవ్వుతున్నానని ఆశ్చర్యపోతున్నారా? యేసు నా హృదయంలో ఉన్నాడు” అనేటటువంటివి చెప్పే మరనేక చిన్న బైబిలు సందేశాలను టీ షర్ట్‌లపై ముద్రించేందుకు ఒక డెకల్ యంత్రాన్ని స్కాట్ కొన్నాడు. నాలుగు గుర్రపు రౌతుల చిత్రంతో “ప్రకటన” అని ఒక సందేశం చెప్పింది.
వెళ్ళే ప్రతిచోట ఆ టీ షర్ట్‌లను వేసుకోవడం ద్వారా మేము మౌన సాక్ష్యాన్నిస్తున్నామని మేం అనుకున్నాం. ప్రతి శనివారం మరియు ఆదివారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సంత పరిచర్యలు కనిపించేవి. మీరు వాహనాలను పార్కు చేసే చోట నడుస్తుండగా కార్ల మీద కరపత్రాలు కనిపించాయంటే అవి మేము పెట్టినవే. సాహిత్యాన్నంతా విరాళాలు తీసుకునే ఇచ్చేది, అయితే అందే డబ్బు చాలా తక్కువ. మేము ఒక సంవత్సరం అయిన ఖర్చులను లెక్కపెట్టాం, ఆ సంవత్సరం ఖర్చు 10,000 అమెరికా డాలర్ల కన్నా ఎక్కువయ్యింది.
మేము యెహోవాసాక్షుల్లో ఒకరిని కలవడం
మేము బోనీటా స్ప్రింగ్స్‌లోని ఒక సముద్ర తీరంలో ఈదుతుండగా, ఒక వృద్ధుడు మమ్మల్ని సమీపించి, మా ట్రక్కులపైన చక్కని స్టిక్కర్లను చూశాడని, మా టీ షర్ట్‌లను గమనించాడని మెచ్చుకున్నాడు. ఆయన బైబిలు గురించి మాట్లాడ్డం మొదలుపెట్టి, లేఖనాల నుండి తర్కించనారంభించాడు. అపొస్తలుల కార్యములు 2:31 లోని అంశాన్ని గూర్చి చెప్పి, “నరకాగ్ని ఉంటే, చెడ్డవారు మాత్రమే అక్కడికి వెళ్ళినట్లయితే, మరి యేసు అక్కడ ఉండినాడని బైబిలు ఎందుకు చెబుతుంది?” అని అడిగాడు. మరనేక లేఖనాలను చర్చించడాన్ని ఆయన కొనసాగించాడు. చివరికి, “మీరు యెహోవాసాక్షుల్లో ఒకరై ఉంటారు” అని స్కాట్ అన్నాడు. “అవును, నేను యెహోవాసాక్షినే” అని ఆయన జవాబిచ్చాడు. “మీరు యేసును నమ్మరు” అని స్కాట్ అప్పుడు అన్నాడు. తరువాతి 20 నిమిషాల వరకు, ఆ సాక్షి యేసును గూర్చి మాట్లాడాడు గాని, కాని ఏ విధంగానో అది మాపై ఏ ప్రభావం చూపలేదు.
మేము వారాంతాల్లో సంత పరచర్యలను కొనసాగించాం. మేము అప్పటికి మూడు సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నాం, ఆ సమయమంతా, మా దగ్గర సత్యముందని, మేము సరైనదే చేస్తున్నామని నమ్మేవాళ్ళం. మేము అప్పటికి చర్చికి వెళ్తున్నాం, ఏ ఆదివారం రాత్రి కూడా మేము హాజరైన ఏ చర్చి మాకు సంతృప్తినివ్వలేదు. మేము సందర్శించడానికి ఇక చర్చీలు లేవు, అలా ఒకరోజు యెహోవాసాక్షుల ఒక చర్చికి వెళ్ళాలనుకున్నాం, మేము దాన్ని అలాగే అనేవాళ్ళం. యేసును గూర్చి వారికి ప్రకటించేందుకు మేము వెళ్తున్నాం. మేము చిరునామాను టెలిఫోను డైరెక్టరీలో కనుగొని, ఒక ఆదివారం సాయంకాలం అక్కడికి వెళ్ళాం. మిగిలిన అన్ని చర్చీల్లా వారికి ఆదివారం సాయంకాలం కూటాలు లేవని తెలుసుకున్నప్పుడు, వాళ్ళు నిజంగానే యేసును నమ్మరనే నిర్ణయానికి మేము వచ్చాము. కూటాల సమయాలను చూపించే బోర్డులో సోమవారం రాత్రి పుస్తక పఠనాన్ని చూశాం. కనుక మేము మా టీ షర్ట్‌లను వేసుకుని, బైబిళ్ళను తీసుకుని తిరిగి వెళ్ళాం. ఏ టీ షర్ట్‌ను వేసుకోవాలి, ఏది మంచి సాక్ష్యాన్నిస్తుంది అని తీర్మానించుకోవడానికి కొన్ని నిమిషాలు తీసుకోవడం మాకు గుర్తుంది. సమయానికి కొంత ముందుగానే అక్కడికి చేరుకున్నాం, కొంత మంది సహోదరులు మా దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఎంతో ఆప్యాయంగాను స్నేహపూర్వకంగాను ఉన్నారు. వెంటనే మేము ప్రకటనను గూర్చిన లోతైన చర్చలో మునిగాం. కూటం కొరకు ఉండమని మమ్మల్ని కోరారు. ఆరాధనలో ఐక్యమగుట అనే పుస్తకాన్ని మాకిచ్చారు, అలా మేము కూర్చున్నాం.a ఒక సహోదరుడు ప్రార్థనతో పఠనాన్ని ఆరంభించాడు.
మేము శ్రద్ధగా విన్నాము. ముగింపులో “యేసు నామమున . . . ఆమేన్” అని ఆయన అన్నాడు. మేము ఎంతో ఆశ్చర్యంగా ఒకరినొకరం చూసుకున్నాం. “ఆయన అన్నది మేము సరిగ్గా విన్నామా? ఆయన యేసు నామమున ప్రార్థించాడు!” ఆ సమయంలో మా కన్నులు తెరువబడి, పొరలు రాలిపోయినట్లయ్యింది. మా హృదయాలు నీతిగలవైతే, వినడానికి అదే సమయం. ఆరాధనలో ఐక్యమగుట అనే పుస్తకం 21వ అధ్యాయం తెరవమని ఆ సహోదరుడు అందరినీ కోరాడు, యేసును గూర్చి మరియు ఆయన ‘ఈ లోక సంబంధి కాకపోవడాన్ని’ గూర్చినదది. చర్చించేందుకు అంతకన్నా మంచిది వేరే లేదు. అది యేసు జీవితం, పరిచర్య, చివరి దినాలు మరియు ఆయన తటస్థతను గూర్చినవి. మాకు తెలియని ఎన్నో విషయాలను గూర్చి చిన్న పిల్లలు వ్యాఖ్యానమివ్వడం మేము విన్నాము. కూటాన్ని ముగిస్తూ సహోదరుడు మళ్ళీ యేసు నామమున ప్రార్థించాడు!
మేము ఆత్మీయంగా పోషించబడడం
మేము సత్యంకోసం ఆత్మీయంగా దప్పిగొంటూ రాజ్య మందిరంలోకి నడిచాం, అక్కడ అది ఉంది, ఇకెన్నటికీ దూరంలో లేదు. మేము ఆత్మీయంగా పోషించబడుతున్నామని తెలుసుకున్నాం, మళ్ళీ మేము చర్చిలోకి అడుగు పెట్టలేదు. మరుసటి రోజు రాత్రి, బట్టలుదికేచోట మేము మా బట్టలుతుక్కుంటుండగా, సోడా మెషీన్ ప్రక్కన కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల పెద్ద కుప్ప కనిపించింది—అవి కనీసం 150 ఉంటాయి. క్రితమైతే మేము చదివేవాళ్ళమే కాదు, కాని ఇప్పుడు వాటిని మేము దొంతరగా తీసుకు వెళ్ళాం, ఎందుకంటే వాటిలోని చాలా విషయాల్లో మాకు ఆసక్తి ఉంది.
ఆ శీర్షికల్లోని ఒకటి ఈ విధంగా అడిగింది: “మీరు త్రిత్వమునందు విశ్వసిస్తారా?” మరొకటి ఈ విధంగా అడిగింది: “నిజంగా నరకముందా?” ఒక తేజరిల్లు!లో విగ్రహాలను గూర్చిన ఒక శీర్షిక ఉంది. స్టీవ్ ఆ రాత్రి త్రిత్వాన్ని గూర్చిన ఒక శీర్షికను చదివి, చాలా పరిశోధన జరిపాడు, అన్ని లేఖనాలను చదివాడు, తాను నేర్చుకున్న విషయమై రాత్రి 12:30కి స్కాట్‌ను లేపాడు. ఆ మరుసటి రోజు, బుధవారంనాడు, పని ముగిసిన తరువాత, నరకాన్ని గూర్చిన శీర్షికను స్టీవ్ చదివాడు. లాజరు నిద్రపోతున్నాడు అని యేసు చెప్పాడని చెబుతున్న యోహాను 11:11 ఆధారంగా అది వ్యాఖ్యానించింది. స్కాట్ కనిపించినప్పుడు “నరకాగ్ని ఉందని నా బైబిలు చెప్పడం లేదు” అని స్టీవ్ చెప్పాడు. విగ్రహాలను గూర్చి, రకరకాల సిలువ రూపాలను గూర్చిన తేజరిల్లు! శీర్షికను చదివిన తర్వాత మేము వాటిని చెత్త బండిలో వేసి, అది వెళ్తుంటే చూస్తూ ఉండిపోయాం. మేము ఒకరినొకరం చూసుకుని తృప్తిగా తలలు ఆడిస్తూ చిన్నగా నవ్వుకున్నాం. చాలా ప్రత్యేకమైనదానిని అంటే సత్యాన్ని మేము కనుగొన్నామని మాకు తెలుసు.
ఒక రోజు తరువాత రెండు పెట్టెలు అందాయి. మీరు పశ్చత్తాపపడనట్లయితే నరకానికి పోతారు అని చెప్పే 5,000 కరపత్రాలు వాటిలో ఉన్నాయి. ఈ కరపత్రాల్లో అనేకం బైబిలు బోధకు కచ్చితంగా అనుగుణ్యంగా లేవని మాకిప్పుడు తెలుసు. కొంత గందరగోళంగా ఉంది, మా కరపత్రాలను తీసుకుని మేము సోమవారం రాత్రి పుస్తక పఠనానికి మళ్ళీ హాజరయ్యాం. “ఇది పర్వాలేదా?” అని మేమడిగాము. ఒక రాత్రి మేము వాటినన్నింటిని పరిశీలించాము. కొంచెం సేపట్లోనే కరపత్రాలు కుప్పగా నేలపై పడి ఉన్నాయి; వాటిలో ఒక్కటి కూడా బైబిలు బోధకు పొందికగా లేవు. మేము వాటినన్నింటిని వదిలిపెట్టాం. మేము క్రొత్తగా కనుగొన్న సత్యం మా జీవితాలకు మరియు మా బోధను వినేవారి జీవితాలకు ప్రాముఖ్యమని మాకు తెలుసు. ఏ ఆటంకం కలుగకుండా బైబిలు పఠించేందుకు దూర ప్రాంతానికి వెళ్ళాలని మేము ఆశించాం.
మేము అలాస్కాకు తరలివెళ్ళాం. అక్కడ మా మొదటి కూటంలో మాతో ప్రతి రోజు పఠిస్తారా అని మేము ఒక పెద్దను అడిగాం. హాజరైనవారందరూ మా అభ్యర్థనను విన్నారనుకుంటాను. మేము మంచి అభివృద్ధిని సాధించి, నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని పూర్తిచేసి, రెండు రోజుల ఒక సమావేశంలో బాప్తిస్మం పొందాలని ఆశించాము.* కాని మేము కొంత కాలం వేచివుండవలసి ఉండింది. పయినీరు అవ్వాలన్నది మా లక్ష్యం. అకస్మాత్తుగా మా తండ్రి రోగగ్రస్థుడయ్యాడు, మరి సహాయపడేందుకు మేము ఫ్లోరిడా తిరిగివెళ్ళవలసి వచ్చింది.
మేము ఆత్మీయ పరిపక్వతకు రావడం
ఫ్లోరిడాలో మేము మంచి అభివృద్ధిని సాధించాము, ఆరాధనలో ఐక్యమగుట అనే పుస్తకాన్ని ముగించాం, 1987లో బాప్తిస్మం పొందాం. మేము పఠనం ఆరంభించిన 11 నెలల తర్వాత అది జరిగిందన్నమాట. మేము అప్పటినుండి ఆరు నెలలు సహాయ పయినీరు చేసి, ఆ పిమ్మట క్రమ పయినీర్లు అయ్యాం. కేవలం ఒకటిన్నర సంవత్సరాల తర్వాత మేమిరువురం పరిచర్య సేవకులంగా నియమించబడ్డాం. బాప్తిస్మం పొందిన రెండు సంవత్సరాల తర్వాత మేము బ్రూక్లిన్ బేతేలులో సేవ చేయనారంభించాం, ఇప్పటికీ స్కాట్ అక్కడే సేవ చేస్తున్నాడు, రెండు సంవత్సరాలుగా చైనీస్ నేర్చుకుంటున్నాడు. రష్యానందలి మాస్కోలో స్టీవ్ ఇప్పుడు క్రమ పయినీరుగా సేవ చేస్తున్నాడు. మేమిరువురం సత్యాన్ని కనుగొన్నాం, మరి దానికొరకైన మా పరిశోధన “నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును” అని సామెతలు 2:1-5 వర్ణించబడినట్లే ఉంది.
స్టీవ్ మాస్కోలో చేరుకోవడం
న్యూయార్క్‌లో నివసించేటప్పుడు ఒక భాష అదనంగా తెలిసివుండడం ప్రకటన పనిని మరింత ఆసక్తిదాయకంగా చేస్తుంది—బహుశ యెహోవా త్వరలోనే రష్యాకు ద్వారాన్ని తెరుస్తాడని అనుకుంటూ నేను రష్యాకు వెళ్ళాలని తీర్మానించుకున్నాను. బ్రూక్లిన్ బేతేలులో సేవ చేస్తున్న ఆ సమయంలో నేను రష్యా భాషలోని పుస్తక పఠనానికి హాజరు కావడం మొదలుపెట్టాను. శుక్రవారాల్లో జరిగే రష్యన్ పుస్తక పఠనం ఒకటి మాత్రమే ఉండేది. సమయం గడుస్తున్న కొలది, నేను రష్యా గుంపులో మరింతగా మిళితం కావడం మొదలెట్టాను. ప్రకటన కార్యక్రమంలో నేను వాళ్ళతో కలిశాను, రష్యావారి ఆప్యాయత కారణంగా అది మరింత ఆస్వాదించేదిగా ఉంది. రష్యా గుంపుకు నన్ను బదిలీ చేయమని అడుగుతూ నేను సేవా సిబ్బందికి వ్రాశాను. వాళ్ళు దీనికి అంగీకరించినప్పుడు నేను సంతోషించాను.
ఒక ఉదయం, బేతేలు ఉదయకాల ఆరాధనలో, వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ అధ్యక్షుడు మిల్టన్ జి. హెన్‌షెల్ ఒక ప్రత్యేక నివేదిక ఉందని కుటుంబానికి చెప్పారు. రష్యాలో యెహోవాసాక్షులు చట్టబద్ధంగా గుర్తించబడ్డారని, మన సహోదరులు ఇప్పుడు ఆరాధనా స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నారని ఆయన ప్రకటించాడు. బేతేలులో ఆ ఉదయం, ఆ అద్భుతమైన వార్తను విని సంతోషించిన ఎవరైనా ఆ విషయాన్ని మరచిపోతారని నేను అనుకోను. ఆ విస్తారమైన క్రొత్త ప్రాంతంలో భాగమై ఉండగలగడం ఒక గొప్ప ఆధిక్యతయని నేను ఆ క్షణంలో అనుకున్నాను.
రష్యాలోని క్రాస్నోడార్‌లో నివసిస్తున్న వలోద్య అనే పేరుగల రష్యా దేశస్థుడైన సహోదరునికి ఉత్తరాలు వ్రాయడం మొదలుపెట్టాను. రష్యాను సందర్శించమని ఆయన నన్ను ఆహ్వానించాడు. కనుక జూన్ 1992లో నేను సామాను సర్దుకుని మాస్కోకు బయలుదేరాను. నేను విమానాశ్రయానికి చేరుకునేసరికి సహోదరుడు వలోద్య అక్కడ వేచివుండడం చూసి, నేను చాలా సంతోషించాను. 45 సంవత్సరాలుగా సత్యంలోవున్న సహోదరుడు స్టీఫన్ లవిన్స్‌కీతో నేను మొదట ఉన్నాను. నేను మాస్కోలో కలిసిన మొదటి సాక్షి ఆయన, సత్యం ఎడల తన వైఖరినిబట్టి ఆయన అనేక సంవత్సరాలు జైలులో గడిపాడు. వారి ఆతిథ్యం నిజంగా అద్భుతంగా ఉంది.
అలా నేను మాస్కోలో ఉన్నాను, భాష అంతగా రాదు. ఆ సమయంలో కేవలం నాలుగు సంఘాలే ఉండేవి, సహోదరులందరికీ ఒకరికొకరు తెలుసు. ఎన్నో ప్రయత్నాల ద్వారా నేను నా విసాలను పొడిగించుకోగలిగాను. నా ఖర్చుల కొరకు నేను అప్పుడప్పుడు పనిచేయగలిగాను. చాలా కష్టమైనదేమంటే, సంభాషించేందుకు మరియు కూటాల్లో ఆత్మీయంగా పోషించబడేందుకు రష్యా భాష కావలసినంత నేర్చుకోవడమన్నదే. అది నెమ్మదిగా వచ్చింది, అయితే ఇప్పటికీ నేను దానికోసం కృషి చేస్తున్నాను.
అనేక సమావేశాలకు హాజరయ్యే మరియు అద్భుతమైన పెరుగుదలను బాప్తిస్మాల పెద్ద సంఖ్యను చూసే ఆధిక్యత నాకు కలిగింది ఇక్కడి సహోదరుల నిర్మలమైన ఆసక్తిని చూడడం, విశ్వాసాన్ని బలపరచే గొప్ప అనుభవంగా ఉంటుంది. దీనికి బదులుగా మరి దేనిని నేను కోరుకోను. నేను కలిసిన సహోదర సహోదరీలలో చాలా మంది నేనిక్కడికి వచ్చినప్పుడు కేవలం పఠిస్తున్నారు, అప్పుడే బాప్తిస్మం పొందారు, వారు ఇప్పుడు పూర్తికాల పయినీరులుగా, లేదా పరిచర్య సేవకులుగా లేదా రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపాన ఉన్న సోల్నెక్నోయాలో బేతేలు సేవకులుగా సేవచేస్తున్నారు.
నేను వెళ్ళే సంఘపు మందిరంలో ప్రతి ఆదివారం 530 మంది హాజరౌతారు, ప్రతి నెల సరాసరి 12 మంది బాప్తిస్మం పొందని క్రొత్త ప్రచారకులుంటారు. పోయిన సారి మా సంఘ ప్రచారకుల సంఖ్య 380, పెద్దల సంఖ్య 3, పరిచర్య సేవకుల సంఖ్య 7. మా సంఘం 486 కన్నా ఎక్కువ గృహ బైబిలు పఠనాలను నివేదిస్తుంది. ఫిబ్రవరి 1995లో సేవా ప్రసంగాన్నిచ్చేందుకు 29 పుస్తక పఠనాలను సందర్శించే ఆధిక్యతను నేను పొందాను. నేను ఒకవారం నాలుగు గుంపులను సందర్శించాను. అలాగే ప్రతి సమావేశం ముందు బాప్తిస్మ అభ్యర్థులతో ప్రశ్నలు చర్చించడంలో నిమగ్నమైవున్నాము. మే 1995లో ప్రత్యేక సమావేశ దినంలో మా సంఘం నుండి 30 మంది బాప్తిస్మం పొందారు. హాజరైన 10,000 మందిలో 607 మంది బాప్తిస్మం పొందారు. వేసవిలోని జిల్లా సమావేశంలో బాప్తిస్మం పొందిన 877 మందిలో 24 మంది మా సంఘంలోనివారే! మా సంఘంలో 13 మంది పయినీర్లు ముగ్గురు ప్రత్యేక పయినీర్లు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి దాదాపు 110 పఠనాలను నిర్వహిస్తున్నారు! ప్రస్తుతం మా సంఘంలో 132 మంది బాప్తిస్మం పొందని ప్రచారకులున్నారు.
1995 జ్ఞాపకార్థ ఆచరణకు 1,012 మంది హాజరయ్యారు! మా సంఘానికి పోలిష్ సహోదరుడైన మాతీష్‌ను ఈ మధ్యే సొసైటీ పంపింది. పరిచారకుల శిక్షణా పాఠశాల నుండి ఆయన పట్టభద్రుడయ్యాడు, ఆయన మాకు గొప్ప సహాయంగా ఉంటాడు. మాకిప్పుడు ముగ్గురు పెద్దలున్నారు. కాబట్టి అదనంగా ఒక సంఘం రూపొందించబడింది, దాదాపు పది లక్షల మంది ఉన్న మా సేవా ప్రాంతం సగానికి విభజించబడుతుంది. ఒక్కో సంఘంలో దాదాపు 200 మంది ప్రచారకులుంటారు. ఒక సంఘంలో ఇద్దరు పెద్దలు, మరొక సంఘంలో ఒక పెద్ద ఉంటారు. మాకు మరొక సమావేశం దగ్గరపడుతోంది, కనుక మేము తరువాతి సమావేశంలో బాప్తిస్మం పొందడానికి సిద్ధంగా ఉన్న 44 మందితో ప్రశ్నలను చర్చిస్తున్నాము. నమ్మశక్యం కానిదిగా అనిపిస్తుంది! నిజంగా ఆత్మీయ పరదైసే! ఇది ఆశ్చర్యకరం! నిజంగా యెహోవా చెయ్యే పనిచేస్తోంది. ఆయన రథం ఈసారి రష్యా గుండా వేగంగా కదులుతున్నట్లుంది. 1995 అక్టోబరునాటికి మాస్కోలో దాదాపు 40 సంఘాలున్నాయి. అక్కడ కావలసినంత మంది పెద్దలుంటే అది సులభంగా రెండు రెట్లయ్యేదే.
మా సంత పరిచర్య రోజులు గడిచి చాలా కాలమయ్యింది. స్కాట్ బ్రూక్లిన్ బేతేలులో ఉన్నాడు, స్టీవ్ మాస్కోలోని ఒక సంఘంలో పెద్దగా సేవ చేస్తున్నాడు—మేము దేవున్ని కనుగొనడానికి ఆయన అనుమతించినందుకు మేమిరువురము కృతజ్ఞులము. లక్షలాది మంది ఆయనను అన్వేషిస్తారని, వారాయనను కనుగొనేందుకు ఆయన అనుమతిస్తాడని మేము ప్రార్థిస్తున్నాము.—స్కాట్ మరియు స్టీవ్ డేవిస్ చెప్పినట్లు.
[అధస్సూచి]
a వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీవారు ప్రచురించినది.
[18వ పేజీలోని చిత్రం]
స్కాట్
[19వ పేజీలోని చిత్రం]
స్టీవ్
[21వ పేజీలోని చిత్రం]
మాస్కో సంఘంలో ప్రతి ఆదివారం 530 కన్నా ఎక్కువమంది హాజరౌతారు