కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 3/8 పేజీలు 7-10
  • మీరు దేవున్ని నమ్మగలరు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు దేవున్ని నమ్మగలరు
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడు మిమ్మల్నెన్నడూ నిరాశపరచడు
  • బైబిలును నమ్మనికి గల కారణాలు
  • బైబిలు​—⁠దేవుడు ఇచ్చిన పుస్తకం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • సంతోషకరమైన జీవితానికి నమ్మకం ఆవశ్యం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • సహోదర సహోదరీల్ని మీరు నమ్మవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • మీ పూర్ణహృదయంతో యెహోవాపై నమ్మకం ఉంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 3/8 పేజీలు 7-10

మీరు దేవున్ని నమ్మగలరు

మీరు దేవున్ని, ఆయన వాక్యమైన బైబిలును సంపూర్ణంగా నమ్మగలరు. 100 కన్నా ఎక్కువ వయస్సు గల, ఎంతోకాలంగా దేవునియందు నమ్మకముంచిన ఒక వ్యక్తి తన నమ్మకానికిగల కారణాన్ని ఇలా తెలియజేశాడు: ‘ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్లుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. వాటిలో ఒక్క మాట కూడా తప్పియుండలేదు.’—యెహోషువ 23:14.

ప్రాచీన ఇశ్రాయేలు నాయకుడైన యెహోషువ అనే ఈ మనిషి దేవుని యొక్క మరియు ఆయన వాక్యం యొక్క పూర్ణ విశ్వసనీయతను అనుభవించాడు. ఇశ్రాయేలుకు దేవుడు వాగ్దానం చేసినదంతా నెరవేరింది. మీరు సృష్టికర్త గురించి, ఆయన వాక్యాన్ని గూర్చి ఎక్కువగా తెలుసుకున్నట్లయితే, మీరు కూడా అదే నమ్మకాన్ని వృద్ధిచేసుకోగలరు. దేవుని తరువాతి ఆరాధికుడును రాజునైన దావీదు దాన్ని ఈ విధంగా వ్యక్తపరిచాడు: “యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు.”—కీర్తన 9:10.

దేవుడు మిమ్మల్నెన్నడూ నిరాశపరచడు

‘దేవుని నామాన్ని,’ ఆ నామం దేనిని సూచిస్తుందన్న దానిని—ఆయన సంకల్పాలను పనులను గుణాలను—మీరు ఎంత ఎక్కువగా ‘తెలుసుకుంటే’ అంత ఎక్కువగా ఆయనను నమ్ముతారు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ నిరాశపరచని లేక తన మాటను తప్పని ఆధారపడదగిన స్నేహితుడు. దేవుని ప్రతినిధులమని చెప్పుకునేవారి మరియు ఇతరులతో వంచనాత్మకంగా వ్యవహరించేవారి వేషధారణ వల్ల నిరుత్సాహం చెందకండి. అలాంటి ప్రజలు నమ్మదగనివారని బైబిలు సూచిస్తుంది. మత వేషధారులు ఒకటి చెప్పి, దానికి వ్యతిరేకమైనది చేస్తారు. వారు తమ మందలను స్వలాభానికి ఉపయోగించుకుంటారని అపొస్తలుడైన పేతురు హెచ్చరించాడు. ‘వారినిబట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు’ అని పేతురు వ్రాశాడు.—2 పేతురు 2:2, 3.

అలాంటి ప్రజలు దేవుని ప్రతినిధులు కారు. వారు ఆయన వాక్యాన్ని అగౌరవపరుస్తారు. బైబిలులో బయల్పరచబడిన దేవుని స్వంత వృత్తాంతాన్ని మరియు రుజువులను మీ అంతట మీరే ఎందుకు పరిశీలించకూడదు? ‘కాని, మరే పుస్తకం కన్నా ఎక్కువగా బైబిలునే నేనెందుకు నమ్మాలి?’ అని మీరు అడగవచ్చు. చరిత్ర అంతటిలోను లెక్కలేనన్ని మత సంబంధమైన వంచనలు జరిగాయన్నది నిజమే, కాని బైబిలు చాలా భిన్నమైనది. బైబిలును నమ్మేందుకు, ఈ క్రింది కారణాలను పరిశీలించండి.

బైబిలును నమ్మనికి గల కారణాలు

మీరు బైబిలును నమ్మగలరు ఎందుకంటే, దాని వాగ్దానాలు మరియు ప్రవచనాలు ఎల్లప్పుడు నెరవేరుతాయి. ఇక్కడ ఒక ఉదాహరణ. చెరలోవున్న ఇశ్రాయేలీయులకు నమ్మశక్యం కానిదిగా అనిపించి ఉండవచ్చు, అయినప్పటికీ, శక్తివంతమైన బబులోను చెర నుండి తాను వారిని స్వతంత్రులను చేస్తానని, వారిని యెరూషలేములోకి తిరిగి చేరుస్తానని బైబిలు రచయితయైన యెహోవా దేవుడు వాగ్దానం చేశాడు. బబులోను ఆ కాలంలోని బలమైన ప్రపంచ శక్తిగా ఉండి, యెరూషలేమును పూర్తిగా నాశనం చేసింది కనుక, అది నిరీక్షించలేనిదిగా అనిపించింది. కాని దాదాపు రెండు వందల సంవత్సరాలు ముందుగానే, బబులోనును పడద్రోసి, తన ప్రజలను కాపాడేవానిగా పారసీక పాలకుడైన కోరెషు పేరును కూడ యెహోవా చెప్పాడు, బబులోనుకు రక్షణగా ఉండే నదులు ఎలా విఫలమౌతాయో కూడా ముందుగానే చెప్పాడు. యెషయా 44:24–యెషయా 44:24 నుండి45:4నందు మీరు ఈ వృత్తాంతాన్ని చదవగలరు.

లేఖనాల నుండి తర్కించుట (ఆంగ్లం) అనే పుస్తకం ఆ వాగ్దానం ఎలా నెరవేరిందో వివరిస్తుంది: “ప్రవచనం వ్రాయబడినప్పుడు కోరెషు జన్మించలేదు. . . . సా.శ.పూ. 539 మొదలుకొని ప్రవచనం విశదంగా నెరవేరింది. కోరెషు యూఫ్రటీసు నది నీళ్ళను ఒక కృత్రిమ చెరువులోనికి మళ్ళించాడు, నగరంలో విందు జరుగుతున్న సమయంలో బబులోను నది తలుపులు అజాగ్రత్తగా తెరిచి ఉంచబడ్డాయి, కోరెషు నేతృత్వంలో బబులోను మాదీయులకు మరియు పారసీకులకు లోబరచబడింది. ఆ తరువాత, కోరెషు యూదా ప్రవాసులను విడుదల చేసి యెరూషలేములో యెహోవా ఆలయాన్ని పునర్నిర్మించాలనే నిర్దేశాలతో వారిని అక్కడికి తిరిగి పంపించాడు.”a దేవుడు చేసిన ఇలాంటి ప్రతి వాగ్దానం, బైబిలులో ఉన్న ప్రతి ప్రవచనం కచ్చితంగా నెరవేరింది.

మన శతాబ్దంలో నమ్మకం తగ్గిపోయిందన్న వాస్తవం నెరవేరిన ప్రవచనానికి మరో ఉదాహరణ. ఇది మనం జీవిస్తున్న కాలం యొక్క లక్షణమని బైబిలు ప్రవచించింది, ఎందుకంటే 1914లో మొదటి ప్రపంచ యుద్ధంతో ఆరంభమైన సమయాన్ని ‘అంత్య దినాలు’ అని అది పిలుస్తుంది, మరి అవి ‘వ్యవహరించడం కష్టంగా ఉండే క్లిష్టమైన సమయాలను’ తెస్తాయి అని అది చెబుతుంది. మన కాలంలోని ప్రజలు ‘స్వార్థప్రియులు, . . . అహంకారులు, దూషకులు, . . . కృతజ్ఞత లేనివారు, అపనమ్మకస్థులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు . . . ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులునై’ ఉంటారని అది తెలియజేసింది. ‘దుర్జనులును, వంచకులును అంతకంతకు చెడిపోవుదురు’ అని కూడా అది ముందే చెప్పింది. (2 తిమోతి 3:1-4, 13) మన కాలంలో మనం చూస్తున్నదదే.

బైబిలు పూర్తిగా ప్రామాణికత కలది కనుక మీరు దానిని నమ్మగలరు. బైబిలు యొక్క ప్రామాణికతను ఎవరూ విజయవంతంగా సవాలు చేయలేదు. ప్రసిద్ధిగాంచిన శాస్త్రజ్ఞుడైన సర్‌ ఐసక్‌ న్యూటన్‌ ఈ విధంగా చెప్పాడు: “మరే లౌకిక చరిత్రలో కన్నా కూడా బైబిలులోనే ప్రామాణికతకు మరిన్ని కచ్చితమైన సూచనలను నేను కనుగొంటాను.” ఇక్కడ హిట్లర్‌ “డైరీస్‌” వంటి కూటా రచనలు లేవు! బైబిలు ఇతర ప్రాచీన వ్రాతలకు ఎలా భిన్నంగా ఉంది? ది బైబిల్‌ ఫ్రమ్‌ ది బిగినింగ్‌ అనే పుస్తకం ఈ విధంగా చెబుతుంది: “ఒక్కో లేఖనాన్ని ధృవీకరించే ప్రాచీన వ్రాతప్రతుల సంఖ్యలోనూ, మూలప్రతులకు మరియు ధృవీకరించే వ్రాతప్రతులకు మధ్యనున్న సంవత్సరాల నిడివి విషయంలోను, [హామర్‌, ప్లాటో మరియు ఇతరుల] సాహిత్య రచనల కన్నా బైబిలు నిస్సందేహంగా అగ్రశ్రేణిలో ఉంది. . . . బైబిలు వ్రాతప్రతులతో పోలిస్తే, సాహిత్య రచనలన్నీ కలిసినా కేవలం పిడికెడు క్రిందికే వస్తాయి. బైబిలులా మరే ప్రాచీన పుస్తకం కూడా అంతగా ధృవీకరించబడలేదు.” బైబిలును గూర్చి చెప్పే ప్రతిదీ దాని పూర్ణ నిజత్వాన్ని సూచిస్తుంది.

మీరు బైబిలును నమ్మగలరు, ఎందుకంటే అది చెప్పే విషయాలన్నీ పూర్తిగా కచ్చితమైనవి. దేవుడు ‘శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశ విశాలమును పరచెను. శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను’ అని బైబిలు చెబుతుంది. (యోబు 26:7) భూమిని ఏనుగులు మోయడం వంటి ఆ నాటి కాల్పనికమైన సిద్ధాంతాలను పునరుక్తి చేసే బదులు, తరువాత శాస్త్ర సత్యంగా స్థాపించబడినదని చెప్పబడిన దానిని అంటే భూమి అంతరిక్షంలో ‘వ్రేలాడుతుందనే’ విషయాన్ని బైబిలు తెలియజేసింది. అంతేకాక, భూమి గుండ్రనిదని కొలంబస్‌ కంటే రెండు వేల సంవత్సరాల కన్నా ముందే బైబిలు స్పష్టంగా చెప్పింది.—యెషయా 40:22.

బైబిలును దాని నిజాయితీనిబట్టి, దాని నిష్కాపట్యాన్నిబట్టి మీరు నమ్మగలరు. బైబిలు రచయితలు దేనినీ అబద్ధీకరించలేదు. వారు చెప్పినవి వారిని, వారి స్వదేశీయులను, వారి పాలకులను చెడుగా ప్రతిబింబించినప్పటికీ, వారు వాస్తవాలను నిజాయితీగా నివేదించారు. ఉదాహరణకు, యేసుక్రీస్తు యొక్క అపొస్తలులు కొన్నిసార్లు అవిశ్వాసాన్ని కనబరచారని, ఎవరు గొప్ప అని తమలో తాము పోట్లాడుకున్నారని, యేసు బంధించబడినప్పుడు వారు ఆయనను వదిలేశారని కూడా అపొస్తలుడైన మత్తయి తన సువార్తలో బాహాటంగా ఒప్పుకున్నాడు.—మత్తయి 17:18-20; 20:20-28; 26:56.

ప్రజలు బైబిలు సలహాలను అన్వయించుకునేంతగా వాటిని నమ్మినప్పుడెల్లా అవి ఆచరణాత్మకమైనవని, ప్రయోజనకరమైనవని నిరూపించబడినదన్నది బైబిలును నమ్మడానికి మరో ముఖ్య కారణం. (సామెతలు 2:1-9) జీవిత సమస్యలను ఎదుర్కొనే విషయంలో బైబిలు ఇచ్చే సలహా “నిపుణుల” మారుతున్న సలహాకు తరచూ ఎంతో భిన్నంగా ఉంటుంది. అనేక జాతీయ వార్తాపత్రికల్లో అలాంటి సలహానిచ్చే కాలమ్‌ రచయితలను గూర్చి లండన్‌లోని ది సన్‌డే టైమ్స్‌ ఇలా అడుగుతుంది: “అప్పటికప్పుడు జవాబులు చెప్పే ఈ కాలమ్‌ రచయితలకు వేల కొలది ప్రజలు ప్రతి సంవత్సరం తమ ఆంతర్య భావాలను తెలుపుతున్నారా?” బైబిలు రచయితలు అప్పటికప్పుడు చెప్పే వారు కారు. వారు నమ్మదగిన, కాల పరీక్షను నిలదొక్కుకున్న దైవ ప్రేరేపితమైన సలహాను వ్రాసిపెట్టారు.—2 తిమోతి 3:16, 17.

“నా జీవితాన్ని నాశనం చేసివుండగలదాని నుండి బైబిలు సలహా నన్ను కాపాడింది” అని ముప్పయిలలో ఉన్న వివాహితయైన సంతోషం గల ఎలన్‌ చెబుతుంది. “విడాకులు పొందిన నా తలిదండ్రులు వివాహ ఏర్పాటులో విశ్వాసాన్ని కనబరచలేదు, నేను వివాహం చేసుకోకుండానే ఎవరో ఒకరితో జీవించడమే మంచిదని వారు నిజంగా నన్ను ప్రోత్సహించారు. బైబిలు సూత్రాలను అనుసరించడం నా జీవితానికి ఇచ్చిన స్థిరత్వాన్ని గూర్చి నేను ఆలోచించినప్పుడు, నా స్వంత తలిదండ్రుల సలహా కన్నా ఎక్కువగా నేను బైబిలునే నమ్మినందుకు సంతోషిస్తున్నాను.”—ఎఫెసీయులు 5:22-31; హెబ్రీయులు 13:4 చూడండి.

“విషయాలను గూర్చి బైబిలు ఏమి చెబుతుంది అని నేను నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు నాకు కేవలం 14 ఏండ్లు. 1960ల గురించి, ఆ నాటి విలువలను నైతిక ధర్మాలను అనుసరించడం ద్వారా సమస్యలను తెచ్చుకున్న నా తోటివారి గురించి నేను తిరిగి ఆలోచిస్తే, యౌవనస్థురాలిగా, అనుభవంలేని స్త్రీగా బైబిలు సలహా నాకిచ్చిన రక్షణనుబట్టి నేనెంతో కృతజ్ఞురాలిని” అని ఫ్లోరన్స్‌ చెబుతుంది.—1 కొరింథీయులు 6:9-11 చూడండి.

“నా విషయానికొస్తే, నేను జూదానికి, పొగత్రాగడానికి, మద్యపానానికి అలవాటుపడ్డాను” అని జేమ్స్‌ చెబుతున్నాడు. అతడు ఇంకా ఈ విధంగా చెబుతున్నాడు: “ఇది అనేకులకు, వారి కుటుంబాలకు చేసిన హాని గురించి నాకు తెలుసు. నా సమస్యలకు బైబిలు చెప్పేదానికి సంబంధమేమిటో మొదట్లో నేను గ్రహించలేకపోయాను. కాని ఇప్పుడు, మంచిదాని కొరకు ఆలోచించడానికి అది నన్ను ఎలా ప్రభావితం చేసిందో, మరింత ఆరోగ్యకరమైన జీవిత విధానాన్ని సాగించడానికి అది నాకు ఎలా సహాయపడిందో స్పష్టంగా చూస్తున్నాను.”—2 కొరింథీయులు 7:1 చూడండి.

మేరి ఆని జీవిత ఒత్తిళ్ళవలన, సమస్యలతో నిండిన పరిస్థితుల్లో కలిగే భావోద్రేక క్లిష్టతల వలన ఆత్మహత్య గురించి తలంచేది. “ఆ సమయంలో ఆత్మహత్యే ఏకైక పరిష్కారమనిపించేది. కాని బైబిలు నా ఆలోచనావిధానాన్ని సవరించింది. నేను బైబిలులో చదివిన విషయం కారణంగా ఆత్మహత్య చేసుకోలేదు” అని ఆమె అంటుంది.—ఫిలిప్పీయులు 4:4-8 చూడండి.

ఈ ప్రజలకందరికీ సహాయపడినదేమిటి? వారు దేవునియందు, దేవుని వాక్యమైన బైబిలునందు పూర్ణ విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు. కష్ట సమయాల్లో దేవుడు వారి చెవుల్లో సలహా చెప్పి, నమ్మిన ప్రియమైన స్నేహితునిగా అయ్యాడు. (యెషయా 30:21 పోల్చండి.) వారు బైబిలు సూత్రాలను నేర్చుకున్నారు, జీవిత ఒత్తిళ్ళను సమస్యలను ఎదుర్కొనేందుకు అవి వారికి సహాయపడ్డాయి. అన్ని రకాల వంచన, అబద్ధాలు, దోపిళ్ళు, దుఃఖం, రోగం, మరణం కూడా లేని అందమైన “క్రొత్త భూమి”ని గూర్చిన వాగ్దానం వంటి అబద్ధమాడజాలని దేవుని అద్భుతమైన వాగ్దానాల్లో నమ్మకముంచడానికి వారు నేర్చుకున్నారు!—2 పేతురు 3:13; కీర్తన 37:11, 29; ప్రకటన 21:4, 5.

మీరు అదే నమ్మకాన్ని వృద్ధిచేసుకోవచ్చు. నేటి లోకం మీ నమ్మకాన్ని మోసం చేయవచ్చు, కాని దేవునియందలి మరియు ఆయన వాక్యమందలి మీ నమ్మకానికి ఎన్నడూ భంగం కలుగదని హామీ కలిగి ఉండగలరు. ఈ పత్రిక ప్రకాశకులు దేవుని గురించి, ఆయన వాక్యమైన బైబిలు గురించి మరెక్కువగా తెలుసుకునేలా మీకు సహాయపడేందుకు ఎవరినైనా ఏర్పాటు చేయడానికి సంతోషిస్తారు.

[అధస్సూచి]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించినది.

[8వ పేజీలోని చిత్రం]

దాదాపు 200 సంవత్సరాలు ముందే, బబులోను ఎలా పతనమౌతుందో దేవుని ప్రవక్త ప్రవచించాడు

[9వ పేజీలోని చిత్రం]

బైబిలు నమ్మదగినదని సర్‌ ఐసక్‌ న్యూటన్‌ కనుగొన్నాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి