ఎవరినైనా నమ్మవచ్చా?
“మా కుటుంబం పూర్తి నమ్మకముంచే కొంతమంది బయటివారిలో ఆయన ఒకడు. . . . మాకు బాధ కలిగించే దేనినైనా ఎన్నడూ చేయని మంచి వ్యక్తి, శ్రద్ధ తీసుకునే వ్యక్తి అనే అభిప్రాయాన్ని ఆయన కలిగించాడు. . . . నా జీవితంలో నేను ప్రగాఢమైన నమ్మకముంచిన కొంతమందిలో ఆయన ఒకడు.”
తమ కుటుంబ వైద్యునియందు తనకుండిన నమ్మకాన్ని గూర్చి ఒక యువతి అలా వర్ణించింది. విచారకరంగా, అది ఉంచరానిచోట ఉంచిన అపాయకరమైన నమ్మకం. ఆమెకు 16 ఏండ్లున్నప్పటి నుండి ఈ వైద్యుడు ఆమెపై లైంగికంగా అత్యాచారం చేసేవాడు. ఆమెకు ఆ తర్వాత న్యాయాన్ని చేకూర్చిన న్యాయస్థాన అధికారులతో, “ఆయన నాతో అబద్ధం చెప్పాడు, నన్ను వంచించాడు” అని ఆమె చెప్పింది.—ది టొరొంటో స్టార్.
అన్నిచోట్లా నమ్మకం లేకుండాపోయింది
నమ్మకమనేది అందంగాను అయితే సున్నితంగాను ఉండే పువ్వులాగే సులభంగా పెరికివేయబడగలదు, పాదాల క్రింద నలిపివేయబడగలదు. అది అన్నిచోట్ల నలిపివేయబడుతుంది! “ప్రతి ఒక్కరు మతగురువును నమ్మిన ఒక కాలముండేది. అప్పట్లో కుటుంబాలవారు తమ పిల్లలను చూసుకోవడానికి వారికి అప్పగించేవారు. నేను ఇప్పుడు దానిని ఆశించలేను. మనం ఆ నమ్మకాన్ని శాశ్వతంగా కోల్పోయాం” అని ఇంగ్లాండులోని కార్డినల్‌కు మరియు ఆర్చ్‌బిషప్‌కు సెక్రటరీ అయిన మిఖాయేల్ గేన్ అన్నాడు.—ది గార్డియన్ వీకెన్డ్.
వ్యాపారస్థులు పోటీదారులను మోసం చేస్తారు. కుతంత్రులైన ప్రకటనదారులు వినియోగదారులను తప్పుదోవపట్టించి, దోచుకుంటారు. కఠినుడైన ఒక అధికారి తన స్వంత కంపెనీలోని ఫించన్ ఫండ్‌లను, ఉద్యోగస్థుల స్వంత రిజర్వ్ ఫండ్‌లను దోచుకున్నాడు. ఉద్యోగస్థులు తమ యజమానులను ఎప్పుడూ దోచుకుంటుంటారు. ఉదాహరణకు, “కెనడా వ్యాపారాలు అంతర్గత దొంగతనాల వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 2,000 కోట్ల అమెరికన్ డాలర్లను నష్టపోతుంది” అని ఒక నివేదిక పేర్కొన్నది.—కెనడియన్ బిజినెస్.
రాజకీయవేత్తలందరూ నమ్మదగనివారు కారు. ఈ క్రింది వాటి వంటి నివేదికలు చాలా కొద్ది మంది ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది: మధ్యదరా తీరప్రాంతంలోని ప్రభుత్వ వ్యాపార ముసుగులో ఉన్న రాజకీయ వంచనను నేరస్థుల కుట్రను ఫ్రాన్సులో తీవ్ర వివాదాలను రేపిన స్త్రీ రాజకీయవేత్తల్లో ఒకరి హత్య జరిగిన రెండు వారాల తరువాత పోలీసులు బయల్పరుస్తున్నారు.”—ది సండే టైమ్స్, లండన్.
తరచూ సన్నిహిత సంబంధాల్లో నమ్మకమనేది వమ్ము చేయబడుతోంది. భార్యాభర్తలు ఒకరినొకరు వంచించుకుంటున్నారు. తలిదండ్రులు పిల్లలపై అత్యాచారం చేస్తున్నారు. పిల్లలు తలిదండ్రులను మోసం చేస్తున్నారు. మునుపటి తూర్పు జర్మనీనందలి రహస్య పోలీసుల దస్తావేజైన స్టాసీ ప్రారంభమైనప్పుడు, స్నేహితులు అని ఎంచబడిన వారి “ప్రబలివున్న మోసపూరిత విధానాన్ని” అవి బయల్పర్చాయి. మోసపు అల్లికలో “స్టాసీ ప్రభావం తరగతి గదిలో, ప్రసంగవేదికపై, పడక గదిలో, పాప సంకీర్తనం చేసే చోట వరకు కూడా వ్యాపించింది” అని ఒక నివేదిక చెబుతుంది.—టైమ్.
ఐర్లాండ్‌లోని ఒక కాలమిస్ట్ ఈ విధంగా వ్రాశాడు: “అధికార స్థానంలో మనం నిలబెట్టిన వారే మనకు అబద్ధం చెబుతున్నారు, మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, మనల్ని ఉపయోగించుకుంటున్నారు, మనల్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు, మనల్ని ద్వేషిస్తున్నారు.” (ది కెరీమాన్) వారు చాలా తరచూ మోసం చేస్తారు గనుక, చాలా మంది ప్రజలు ఎవరినీ నమ్మరు. మనం నమ్మకూడనిదానిని నమ్మడం లేదని రూఢి చేసుకునేందుకు మనం ఏమి చేయాలి? తరువాయి రెండు శీర్షికలు ఈ ప్రశ్నను పరిశీలిస్తాయి.