కాల్పనిక విజ్ఞానశాస్త్రం అది ప్రజాదరణ పొందడం
అమెరికా చలనచిత్ర పరిశ్రమలో 1982వ సంవత్సరము ఒక వినూత్నమైన దానిని చూసింది. 1982/83 సీజనులో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్ర ‘పాత్రధారి’ అసలు ఒక వ్యక్తే కాదు. ది ఇల్లస్ట్రేటెడ్ హిస్టరీ ఆఫ్ ద సినిమా ప్రకారం అది, ఈటీ: ది ఎక్స్ట్రాటెర్రెస్ట్రియల్ చిత్రంలో నటించిన బాహ్య అంతరిక్షంలోని వికృతమైన కానీ ఏదోవిధంగా ఆకర్షణీయమైన పాత్ర, ఈటీ.
గత కొన్ని సంవత్సరాలలో కాల్పనిక విజ్ఞానశాస్త్రం (ఎస్.ఎఫ్.) పొందిన ముంచెత్తే ప్రజాదరణకు ఈ విశేషమైన సందర్భం కేవలం ఒక రుజువు మాత్రమే. ఒకప్పుడు చౌకబారు పత్రికల్లో మాత్రమే కనిపిస్తూ, వ్యక్తివాదులు మరియు స్వాప్నికులు మాత్రమే ఆసక్తి చూపేదానిగా పరిగణించబడిన కాల్పనిక విజ్ఞానశాస్త్రం, ప్రస్తుత జనాభీష్ట వినోదంలో స్థిరమైన భాగంగా అయింది. కానీ అది ఆకస్మికంగా ప్రజాదరణ పొందడం వెనుక ఏముంది?
ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి, మనం ముందు కాల్పనిక విజ్ఞానశాస్త్రం యొక్క చరిత్రను పరిగణలోకి తీసుకోవాలి. భయపెట్టడానికి, మెప్పించడానికి, లేక కేవలం వినోదపరచడానికి అనాదికాలం నుండి మనుష్యులు విడ్డూరమైన కథలు చెప్పారు. అయితే 17వ మరియు 18 వ శతాబ్దాలలో, ఐరోపా వైజ్ఞానిక మరియు వస్తుసంబంధమైన అభివృద్ధి శకంలోనికి ప్రవేశించింది. అనేకమంది సాంప్రదాయక ఆలోచనలు మరియు అధికారాలను సవాలు చేయడం మొదలుపెట్టారు. ఈ వాతావరణంలో కొంతమంది, మానవజాతిని భవిష్యత్తులో వైజ్ఞానిక ప్రగతి ఎలా ప్రభావితం చేస్తుందన్న దానిపై ఊహాకల్పనలు చేయడం మొదలు పెట్టారు.
కాల్పనిక విజ్ఞానశాస్త్రాన్ని కచ్చితంగా ఎవరు కనుగొన్నారన్నది వివాదాస్పదంగా ఉంది. పదిహేడవ శతాబ్దపు రచయితలు ఫ్రాన్సస్ గాడ్విన్ మరియు సిరనో డ బెర్జరక్లు రోదసీయానం కూడా చేరివున్న కాల్పనిక రచనలు చేశారు. 1818 లో మేరీ షెల్లీ వ్రాసిన పుస్తకం ఫ్రాంకెన్స్టేన్ ఆర్ ద మాడర్న్ ప్రమీథీయస్, జీవాన్ని సృష్టించే సమర్థత కలిగిన ఒక శాస్త్రవేత్తను వర్ణించింది మరియు ఆ తరువాతి భయానక పరిణామాలను చిత్రించింది.
కొంతమంది రచయితలు ఈ తరహా కల్పనను మానవ సమాజంలోని లోపాలను ఎత్తి చూపడానికి ఉపయోగించారు. జోనాథన్ స్విఫ్ట్ 18 వ శతాబ్దపు ఆంగ్ల సమాజాన్ని ఎగతాళి చేసినప్పుడు, ఆయన తన వ్యంగ్య కావ్యాన్ని కాల్పనిక యాత్రల పరంపరలుగా అల్లాడు. దాని ఫలితమే కాల్పనిక విజ్ఞానశాస్త్రం యొక్క “మొదటి సాహిత్య కళాఖండం” గా పిలువబడిన గులివర్స్ ట్రావెల్స్ అనే ఎత్తిపొడిచే ఒక రూపకం.
కానీ కాల్పనిక విజ్ఞానశాస్త్ర నవలను దాని ఆధునిక రూపంలో పెట్టిన ఘనత రచయితలైన జూల్స్ వెర్న్ మరియు హెచ్. జి. వెల్స్లకు ఆపాదించబడుతుంది. 1865 లో విజయవంత నవలల వరసలో ఒకటైన ఫ్రమ్ ది ఎర్త్ టు ద మూన్ అనే నవలను వెర్న్ వ్రాశాడు. 1895 లో హెచ్. జి. వెల్స్ యొక్క ప్రజాదరణ పొందిన పుస్తకమైన ద టైమ్ మెషీన్ వెలువడింది.
కల్పన వాస్తవమైంది
1900 ల తొలి భాగానికల్లా, శాస్త్రవేత్తలు ఈ దార్శనికవేత్తల స్వప్నాలలో కొన్నింటిని నిజం చేయడం మొదలుపెట్టారు. డీ గ్రోసెన్ (గొప్ప వారు) అనే పుస్తకం ప్రకారం, జూల్స్ వెర్న్ స్వప్నమైన మనుష్యులతో కూడిన రోదసీ ప్రయాణాన్ని ఒక వాస్తవం చేసే ప్రయత్నంలో జర్మన్ భౌతికశాస్త్రవేత్త హెర్మాన్ ఓబెర్ట్, ఎన్నో సంవత్సరాలు గడిపాడు. రోదసీయానానికి ఒక శాస్త్రీయ ఆధారం వేయడానికి ఓబెర్ట్ వేసిన లెక్కలు సహాయం చేశాయి. అయితే, కాల్పనిక విజ్ఞానశాస్త్రంచే ప్రభావితం చెందిన శాస్త్రవేత్త ఆయన ఒక్కడే కాదు. ప్రసిద్ధ కాల్పనిక విజ్ఞానశాస్త్ర రచయిత రే బ్రాడ్బెరీ ఇలా అన్నాడు: “జర్మనీలోని వెర్నర్ ఫాన్ బ్రవున్ మరియు ఆయన తోటి ఉద్యోగులు, హౌస్టన్ మరియు కేప్ కెన్నడీలోని వారందరు వారి చిన్నతనంలో హెచ్. జి. వెల్స్ మరియు జూల్స్ వెర్న్ రచనలను చదివారు. వారు పెద్దవారయ్యాక దానినంతటినీ వాస్తవం చేయాలని నిశ్చయించుకున్నారు.”
నిజానికి, అనేక రంగాలలో నూత్నకల్పనలకు కాల్పనిక విజ్ఞానశాస్త్రం ఆధారమైంది. “కాల్పనిక విజ్ఞానశాస్త్రం, ముందుగానే చెప్పని నూతన కల్పనలు లేక ఆవిష్కరణలు” కొన్ని మాత్రమే ఉన్నవని రచయిత రనే ఆట్ చెప్పుకొన్నాడు. అవి వాస్తవాలవ్వడానికి ఎంతోకాలం ముందే జలాంతర్గాములు, రొబోట్లు మరియు మనుష్యులతో కూడిన రాకెట్లు, కాల్పనిక విజ్ఞానశాస్త్రం యొక్క ప్రధాన అంశాలుగా ఉండినవి. ఈ విధంగా “కాల్పనిక విజ్ఞానశాస్త్రాన్ని చదవడం మనస్సును సాగదీయడమ”ని కాల్పనిక విజ్ఞానశాస్త్ర రచయిత ఫ్రెడరిక్ పోల్ సమర్థించాడు.
నిజమే, కాల్పనిక విజ్ఞానశాస్త్రమంతా నిజానికి విజ్ఞానశాస్త్రం గురించి కాదు. అత్యంత ప్రజాదరణ పొందిన కాల్పనిక విజ్ఞానశాస్త్ర పుస్తకాలు సినిమాలలో కొన్ని, నిజానికి వైజ్ఞానిక స్వైరకల్పన అని కొంతమంది పిలిచే దాని రూపాలు మాత్రమే. కాల్పనిక విజ్ఞానశాస్త్రంలో వైజ్ఞానిక సంభవనీయతే తరచూ ప్రమాణచిహ్నాం, అయితే స్వైరకల్పనలు వాటి రచయిత యొక్క ఊహాశక్తి వలన మాత్రమే పరిమితం చేయబడతాయి. ఇంద్రజాలం మరియు మంత్రవిద్య కూడా ఒక పాత్ర వహించవచ్చు.
అయినా భవిష్యత్తును గూర్చిన కాల్పనిక విజ్ఞానశాస్త్రం యొక్క ఉద్దేశాలు ఎంత కచ్చితమైనవి? కాల్పనిక విజ్ఞానశాస్త్రమంతా చదవడానికి లేక చూడడానికి యోగ్యమైనదేనా? తర్వాతి శీర్షికలు ఈ ప్రశ్నలవైపు అవధానాన్ని మళ్ళిస్తాయి.
[3వ పేజీలోని చిత్రం]
రోదసీయానంలో ఆసక్తిని రేపడానికి జూల్స్ వెర్న్ నవల “ఫ్రమ్ ది ఎర్త్ టు ద మూన్” ఎంతో సహాయం చేసింది
[Picture Credit Line on page 3]
Rocket Ship: General Research Division/The New York Public Library/Astor, Lenox and Tilden Foundations