టివి లేకుండా కుటుంబ జీవితం సంతోషభరితంగా ఉండగలదా?
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, ది వాల్ స్ట్రీట్ జర్నల్ “ట్యూబును తీసేయడం: టివి లేకపోవడంతో కొన్ని కుటుంబాలు వర్థిల్లుతున్నాయి,” అనే శీర్షికను ప్రచురించింది. ఆ పత్రికిలా నివేదిస్తుంది: “అమెరికాలో కొన్ని మంచి కారణాలనుబట్టి టివి చూడడాన్ని పూర్తిగా మానేసిన కుటుంబాలు పోల్చి చూస్తే తక్కువే ఉన్నా, అలా టివి లేకుండా వాళ్లు ఆ తర్వాత ఎంతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు.”
కుటుంబంపై దూరదర్శిని ప్రభావాన్ని గూర్చి యిటీవల, రోజర్ బానిస్టర్ పరుగెత్తిన సబ్-ఫోర్-మినిట్-మైల్ (నాలుగు నిమిషాలకంటే తక్కువ వ్యవధిలో ఒక మైలు పరుగెత్తడం) యొక్క 40వ వార్షికోత్సవం జరుపుకోడానికి తిరిగి కలుసుకునప్పుడు చర్చించబడింది. మరి 1960వ దశకంలో మైలు పరుగు పందెంలో చాంపియన్ అయిన జిమ్ రియాన్ ప్రకారం, 1968 ఒలంపిక్స్‌కు ముందు రోజర్‌తో కలిసి రాత్రి భోజనం చేస్తునప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
“నా భార్య ఆన్‌కు, నాకు అప్పట్లో వివాహం నిశ్చయమై ప్రధానం జరిగిందని,” రియాన్ వివరించాడు, “కాబట్టి, తన కుటుంబ జీవితం యొక్క నాణ్యతను వాస్తవంగా మెరుగుపర్చిన దాన్ని తాను కనుగొన్నానని రోజర్ మాతో చెప్పాడు. మేమందరం ఎంతో ఆసక్తితో వింటున్నాం. తాము కుటుంబంగా కలిసి ఉండడానికి, కలిసి మాట్లాడుకోడానికి, కలిసి చదువుకోడానికి ఎక్కువ సమయం లభించాలని, తాను యింట్లోంచి టివిని తీసేశానని ఆయన చెప్పాడు.”
రియాన్ యిలా చెబుతున్నాడు: “ఆయన చెప్పినది మాపై చాలా ప్రభావం చూపింది. ‘మనకు టివి వాస్తవంగా అవసరం లేదు.’ అని మేము గుర్తించడం మొదలుపెట్టాము.”
చాలామంది ప్రజలు అదే ముగింపుకు వచ్చారు. ఎందుకు? ఎందుకంటే, ప్రాముఖ్యంగా పిల్లలపై అది కలిగుండగల ఆకర్షించే ప్రభావాన్నిబట్టియే. అమెరికా, మేరిలాండ్‌లోని ఒక తల్లి చెప్పిన ప్రకారంగా, టివి ఎదురుగా కూర్చుని తన పసి పాపకు పాలిస్తున్నప్పుడు, ఆ పాప “ఉన్నట్టుండి తన తలను అకస్మాత్తుగా ప్రక్కకు తిప్పి, స్క్రీన్ వైపు అలాగే చూస్తుండిపోయింది. ఆమె ఈ వయస్సులోనే అలా చేస్తుందంటే, ఆమె పెద్దదయినప్పుడు యింకా ఎలా ఉంటుంది? అని మేము ఆలోచించాము.” కాబట్టి ఆ కుటుంబం తమ యింట్లోంచి టివిని తీసేశారు.
ఒకవేళ మీరు టివిని పూర్తిగా తీసేయకపోయినా, కనీసం దాన్ని చూసే సమయాన్ని తగ్గించడం, అర్థవంతంగా ఉండదా? ఇంగ్లాండ్ యొక్క ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువు కొరకు రోడ్స్ స్కాలర్షిప్ పొందిన వారిలో మొదటి నల్లజాతి మహిళ అయిన కారెన్ స్టీవెన్సన్, తన చిన్నతనాన్ని గురించి యిలా చెప్పింది: “వారపు దినాల్లో దూరదర్శినిని చూడటం అనుమతింపబడేది కాదు. మేము ప్రాముఖ్యంగా చూడవలసినది ఏదైనా [ఉంటే] . . . , దాని గురించి ముందు ఆదివారమే మేము [అమ్మతో] మాట్లాడి పధకం వేసుకునే వాళ్లము.”
మీయింట్లో టివి చూడడం ఏవిధంగా ఉంది? దాన్ని కొద్ది సమయానికి పూర్తిగా తొలగించక పోయినా, దాన్ని తిలకించడాన్ని తక్కువ చేయడం యొక్క విలువను మీరు గమనించగల్గుతున్నారా? (g94 8/22)