నైపుణ్యంగల చిన్న గృహనిర్వాహకులు
దక్షిణాఫ్రికాలోని తేజరిల్లు! ప్రతినిధి
ఆఫ్రికా నందలి వర్షపాత అడవులలోని ఖాళీ స్థలాలు తొఱ్ఱలుగల కొమ్మలున్న బార్టీరియా అని పిలవబడే వృక్షములతో తరుచుగా నింపబడుతున్నాయి. దాని గరిష్ఠ ఎత్తునకు చేరడానికి, అరణ్యపు ఉపరితలానికి చేరుకోడానికి పోరాడే ఇతర వృక్షములతో, ఈ వృక్షం పోటీపడాల్సి ఉంటుంది. ఈ పోరాటమందు విజయం సాధించడానికి, ఉక్కిరిబిక్కిరి చేసి చంపే ప్రాకెడి తీగెల నుండి మరియు ఆకులకు సూర్యరశ్మి చేరకుండా అడ్డుకొనే నాచు మొక్కల నుండి విడుదల పొంది భద్రపర్చబడడానికి బార్టీరియాకు సహాయమవసరం. గృహనిర్వాహకులుగ కండచీమలు ఇక్కడ ఒక ప్రముఖమైన పాత్రను వహిస్తాయి. పిల్ అగ్లాన్డ్ మరియు మైఖెల్ రొసెన్బర్గ్ల చేత నిర్మింపబడిన కొరూప్ అనే ఆఫ్రికన్ రెయిన్ ఫారెస్ట్ దూరదర్శిని డాక్యుమెంటరీలో భాగంగా, కొరూప్ నందలి ఒక కమెరూన్ రెయిన్ ఫారెస్ట్‌లో చీమలు, వృక్షముల మధ్యనున్న సంబంధం చిత్రీకరింపబడింది.
ఒక క్రొత్త రాణి చీమ ఒక బార్టీరియా వృక్షాన్ని అన్వేషించడాన్ని డాక్యుమెంటరీ చూపిస్తుంది. స్వాభావికంగా, తన వలస స్థావరాన్ని నిర్మించుటకు అసలైన స్థలం బార్టీరియా యొక్క తొఱ్ఱలుగల కొమ్మలేనని దానికి తెలుసు. ఒక కొమ్మకి రంధ్రాన్ని చేసిన తరువాత, దానిలోపల అది తన గ్రుడ్లను పెడుతుంది. వృక్ష సారాన్ని సేవించే చిన్న పొలుసులు గల కీటకాలకు కూడా తొఱ్ఱలుగల కొమ్మలే గృహలు. ఈ చీమలు జీవనాధారంవలే ఈ కీటకాలను సంరక్షిస్తాయి మరియు ఒక పౌష్ఠక ద్రవమును పొందుటకు వాటిని పీల్చుతాయి.
చీమల వలస స్థావరం పెరగగానే, ఇతరుల నివాస స్థలములను జప్తు చేసుకోవడం ఆరంభించి, వృక్షాన్ని శుభ్రపరుస్తాయి. ఈ తెలివైన చిన్న గృహనిర్వాహకులను గమనించుట ఎంత పారవశ్యాన్ని కలుగజేస్తుంది! కొన్ని వృక్షం పైనుండి క్రిందికి దిగి, వృక్షాన్ని చుట్టిముట్టి బాధించే తీగెలపై దాడి చేస్తాయి. అవి కాండాలను కొరికి తింటూ ఈ తీగెలను చంపుతాయి. శిథిలమైన, నాచుపట్టిన, పాకుడు పట్టిన ఆకులను మిగిలిన చీమలు శుభ్రపర్చడాన్ని చూడొచ్చు. ఒక ఆకు క్రింది భాగంలో దాగివున్న గొంగళి పురుగును సహితం తొలగిస్తాయి.
దూరదర్శిని డాక్యుమెంటరీ ఇలా వివరిస్తుంది: “సూక్ష్మంగా పరీక్షిస్తూ, చీమలు ప్రతీ చెత్తను శుభ్ర పరుస్తాయి. పాడుచేస్తున్న కీటకాలు మరియు తీగలులేకుండా శుభ్రపర్చబడిన బార్టీరియా, దాని చీమల వల్ల సంరక్షింపబడి, యిప్పుడు ఇతర వృక్షములతో ప్రభావవంతంగా పోటీ పడగలదు. దానికి ప్రతిగా, తమ చిన్న పిల్లలను పెంచుటకు—తమ ఆహారానికున్న ఒకే మూలమైన—చిన్న పొలుసులుగల కీటకాలను కాచి కాపాడడానికి, బార్టీరియా తొఱ్ఱలుగల కొమ్మలను చీమలు ఉపయోగించుకోవచ్చును.”
ఈ చీమలు ఎంతటి శ్రమ జీవులో కదా! ఒక పురాతన సామెత ఇలా చెపుతుంది: “సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.”—సామెతలు 6:6. (g94 5/8)