పక్షులగానం కేవలం ఓ సాధారణ రాగమా?
బృందగానం చేసేవారంతా ప్రదర్శనకు పరిశుభ్రమైన దుస్తులను ధరించి తమతమ స్థానాలలో చేరుచుండగా సుదూరంలో నుండి విరజిమ్మే కాంతి జిలుగువెలుగులను వారిపై ప్రసరింపజేస్తుంది. బాల్యంనుండి కుటుంబ సాంప్రదాయంగా శిక్షణపొంది, ప్రతిఒక్కరూ గొంతువిప్పి సులభంగా గానం చేస్తున్నారు. వారిలో కొందరు అప్పటికప్పుడు రాగాలను కూర్పుచేసే సామర్ధ్యమున్నవారివలే వివిధ నూతన రాగాలకు స్వరకల్పన చేస్తున్నట్లున్నారు.
ఈ ప్రదర్శన ఎక్కడ జరుగుతుంది? ఇది ప్రపంచ ప్రఖ్యాత గానకచ్చేరి హాలులో కాదు. బదులుగా, ఒక తెర పైకెత్తబడినట్లు చీకటి మరుగయ్యే సంధ్యవేళ ఒక గొప్పసమూహంవలే బారులు తీరి ఈకలు కలిగిన ప్రాణులు కన్పించే ప్రాంతమే అది. చెట్లపై, కంచెలపై, టెలిఫోను తీగెలపై గానంచేసే పక్షిజాతులనేకం వాటి స్వరాలను ప్రపంచంలోకెల్ల అత్యంత ఆహ్లాదకరమైన బృందగానంలో కలుపుతాయి. వాటి స్వరకంపనాలు, సౌమ్యమైన స్వరాలు, ఈలలు, పిల్లనగ్రోవిలాంటి నాదాలన్నీ కలిసి క్రొత్త రోజుకు సంతోషభరిత స్వాగతపలుకులు పలుకుతున్నాయి.
అయితే కేవలం యివి ఇంపైన స్వరాలు మాత్రమే కావు. మన చెవులకు వినిపించే దానికంటే చాలా ఎక్కువ ఈ పక్షులగానాల్లో ఉంది. పక్షులెందుకు గానం చేస్తాయి? ఈ పాటలు భావం కల్గియున్నవా? పక్షులు వాటి పాటలు ఎలా నేర్చుకుంటాయి? అవి ఎప్పుడైనా క్రొత్తపాటలు నేర్చుకుంటాయా?
దాగియున్న సమాచారాలు
ఉల్లాసమైన పక్షుల కిలకిలారాగాలు తొలిసంధ్యలోనూ సాయంసంధ్యలోనూ వినిపిస్తాయి. మీరు బహుశ ఎక్కువగా బృందగానంలోని మగ స్వరాలనే వింటారు. వాటి సమాచారం రెండువిధాలుగా ఉంటుంది. ఇతర మగపక్షులకు ఇది ప్రాంతీయ హద్దులను దాటిపోవద్దని చెప్పే ఒక గట్టి హెచ్చరికైయున్నది. ఆడపక్షులకు ఇది అర్హతగల ఒంటరి పక్షులనుండి జతకూడుటకు ఒక ఆహ్వానమైయుంది. గానంచేసే పక్షులు, ఒక భాష మాట్లాడే ప్రాంతీయ పద్ధతికి అనుగుణ్యంగా ఎలా పదాలను యాసగా పలుకుతారో అలాగే అవి వాటి స్వంత ప్రాంతీయ పాటలు వృద్ధిచేస్తాయి. జోడుపక్షి గానానికి చెందిన వేర్వేరు మాండలికాలు, గానంచేసే పక్షికి చెందిన ప్రత్యేక ప్రాంతంలోని ఆడపక్షులను మాత్రమే ఆకర్షిస్తాయి. గ్రుడ్లను పెట్టే సమయంలో చాలా చురుకైన, క్లిష్టమైన పాటలు వినవచ్చును—ఆడ పక్షులను మెప్పించడానికి చేసే ప్రదర్శనే ఇది.
తన రాగంతో, తన స్థితిగతులను గూర్చి తన మిత్రునికి అలాగే శత్రువుకు చెబుతుంది. కాబట్టి, రంగుల పక్షులు, విశాల ప్రదేశాల్లో జీవించుటకు కోరుకునే పక్షులు తెలివిగా పిలవని పేరంటాలను ఆకర్షించకుండా తప్పించుకోడానికి గోలపెట్టే పాటలు పాడవు. మరొక విధంగా, బాగా నిగూఢమైన పక్షులు, దట్టమైన అడవులున్న ప్రాంతాల్లో జీవించే పక్షులు, తాము కనపడతామేమో అనే ప్రమాదం అంతగా లేదనకుని, మనస్ఫూర్తిగా గళంవిప్పి పాడగలవు.
కొన్ని సమయాల్లో మీరు వినే పాటలు మన రెక్కల మిత్రులనుండి వచ్చే నిజమైన పాటలు కావు, కాని కేవలం జతలమధ్య బంధాన్ని స్థాపించడానికి లేదా పక్షి గుంపులను ఒక్కటిగా కూర్చడానికి యిచ్చే క్లుప్తమైన సూచనాపిలుపే. అది హఠాత్తుగా సంభవించబోయే ప్రమాదాన్ని సూచిస్తూ హెచ్చరించే పిలుపు కావచ్చు, లేదా పిల్లి, యితర అనధికారంగా ప్రవేశించిన వాటిపైబడుటకు యిచ్చే పిలుపు కావచ్చు. వాటి స్వరాలతో, పక్షులు తమ మనోభావాన్ని—కోపమైనా, భయమైనా, లేదా ఆందోళనైనను—అలాగే అవి జత కట్టేందుకు కూడ సంభాషించుకుంటాయి.
నైపుణ్యం, ప్రజ్ఞగలిగిన సంగీతవిద్వాంసులు
గానంచేసే పక్షుల గాత్ర సామర్ధ్యాలు నిజంగా ప్రశంశాయోగ్యమైనవి. కొన్ని మూడు లేదా నాలుగు నాదాలను ఒకేసారి పాడగలవు. మరికొన్ని ఒక సెకనుకు 80 నాదాలను పాడగలవు. మానవుని చెవికి, ఈ స్వరం ఒక తదేకంగా వచ్చే నాదంలా వినిపిస్తుంది, కాని పక్షులు వాటికున్న సూక్ష్మమైన వినికిడి శక్తివల్ల వాటి భేదాన్ని గుర్తించగలవు.
పక్షులు సంగీతాన్ని క్షుణ్ణంగా విని దాని భావాన్ని అనువదించగలవేమోనని పరిశోధకులు ఆశ్చర్యపడుతున్నారు. బేచ్ సంగీతానికి స్ట్రావిన్‌స్కిస్ “రైట్ ఆఫ్ స్ప్రింగ్” అనే సంగీత ఖండంలోని తేడాను పక్షులు చెప్పగలవా? స్వరకర్తను గుర్తించే విధంగా రెండు డిస్క్‌లలో ఒక దానినిసరైన స్వరరచన కలిగిన డిస్క్ ఏదో ముక్కుతో పొడిచి గుర్తించి, ఆహారాన్ని అందుకోమని నాలుగు పావురాలకు పరిశోధకులు శిక్షణనిచ్చారు. వెంటనే బేచ్ సమకూర్చిన 20 నిమిషాల స్వరరచనలో సరైన డిస్క్‌ను పావురాలు ఎన్నుకున్నాయి. చిన్న పొరపాట్లతో, అదే సరళిలో వేరేవాళ్లు కూర్చిన సంగీతంలోనున్న తేడానుకూడా గుర్తించి సరైన దానిని ఎన్నుకోగల్గాయి.
కొన్ని ఉష్ణమండల పక్షులు యుగళగీతాలను సమకూర్చి, పాడగలవు. జతకూడిన పక్షులజంట రిహార్సలు చేసుకుంటాయని, క్రొత్త పదబంధాలతో లేదా ఒకదాని తర్వాత ఒకటి పరస్పరంగా పిలుచుట, పలుకుట అనే పద్ధతిలో పాడతాయన్నట్లు కన్పిస్తున్నది. అవి ఎంత సూక్ష్మంగా పాడతాయి అంటే సాధనచేయబడని చెవికి, అది ఒకే పక్షి తదేకంగా పాడుతున్నట్లుంటుంది. ప్రతీ జతపక్షి తన సహవాసి లేనప్పుడు పాటలో భాగాన్ని లేదా పాటనంతటిని పాడగలదు. ఈ ప్రత్యేక సామర్ధ్యం బహుశ వర్షంపడే దట్టమైన అడవుల్లో పక్షులు వాటి స్వంత జతలను గుర్తించడానికి, కనుగొనడానికి సహాయపడుతుంది.
రచించేవి, అనుకరించేవి
పక్షులు వాటి పాటలను ఎలా నేర్చుకుంటాయి, కనుగొంటాయి అనే విషయం యింకా పరిశోధింపబడుతూనే ఉంది, కాని ఒకటి మాత్రం నిశ్చయం: అవి నేర్చుకునే పద్ధతులు చాలావున్నవి వివిధ రకాలుగా ఉన్నవి. పక్షుల ప్రపంచంలో పాటలు నేర్చుకునే పద్ధతుల్లోని మాదిరి ఈ క్రింద యివ్వబడింది.
ఒకరకమైన మగ సీమపిట్టకు (చాఫించ్) దాని పాట అది జన్మించే సమయానికే, కొంత పాక్షికంగా దాని మెదడులో అమర్చబడుతుంది. పూర్తిగా యితర పక్షులకు దూరంగా ఒంటరిగా పెరిగినప్పటికి, దాని పాట, అస్వాభావికమైనప్పటికి కూడా అది ప్రమాణిక సీమపిట్ట పాటలో వున్న నాదాల సంఖ్యనే కల్గి, అంతే వ్యవధి కల్గివుంటుంది. అయినను, సరిగ్గా అదే సరళిని వృద్ధి చేసుకొనుటకు, పాడే వయస్సు వచ్చేముందు అది యితర మగ సీమపిట్టల పాటను వినాలి, మరలా వచ్చే వసంత ఋతువులో కూడ తిరిగి వినాలి. ఆ తర్వాత, నైపుణ్యంగల మానవ గాయకుని వలే, ఈకలుగల ఈ కళాభిమాని పాడి, పాడి, పాడి—తన యౌవ్వన స్వరాన్ని దాని మెదడులోనున్న రాగానికి అనుగుణ్యంగా ఉండేందుకు, మరలా మరలా పాడుటకు ప్రయత్నిస్తుంది.
ఓరిగెన్ జుంకో అనే పక్షి దాని ప్రాంతీయ పాట వినబడకపోతే దాని స్వంత పాటలు తయారుచేసుకుంటుంది. కాని ఒకసారి స్పష్టమైన జుంకో పాట వినిన వెంటనే, అది పాటలు కనిపెట్టడం మాని, మిగిలిన పక్షులవలె పాడటం మొదలు పెడుతుంది. మరొక విధంగా, అరిజోనా జుంకో అనే అదేజాతికి చెందిన మరొక పక్షి, ఎదిగిన జుంకో పక్షి అరుపు వినడంతో, దాని ఉత్పాదకత పురికొల్పబడుతుంది. అది విన్నదానినే అనుకరించదు కాని ప్రత్యేకమైన దాని స్వంత పాటను కట్టడానికి ప్రేరణపొందుతుంది.
కొన్ని పాటలు జన్యుసంబంధంగా అమర్చబడతాయనడానికి బలమైన ఆధారం “గ్రుడ్లను పొదిగే పరాన్నజీవుల” ద్వారా యివ్వబడింది. ఉదాహరణకు, కోయిల దాని గ్రుడ్లను వేరే జాతి పక్షుల గూళ్లల్లో పెడుతుంది, అవి పెంపుడు తలిదండ్రులుగా వ్యవహరిస్తాయి. అది పొదిగినప్పుడు, కోయిల పిల్ల దాని పెంపుడు తండ్రిలా లేదని, దానిలా పాడకూడదని ఎలా తెలుసుకుంటుంది? కోయిల పాట ఖచ్ఛితంగా అది జన్మించే సమయానికే దాని మెదడులో దృఢంగా నాటబడే ఉంటుంది.
కాబట్టి చాలా సందర్భాల్లో, పక్షిపాట అనేది జన్యుసంబంధమే అన్నట్లు అగపడుతున్నది. ఒకవేళ పక్షి దాని స్వంత ప్రాంతీయ పాటను ఎన్నడూ నేర్చుకొనకపోతే కూడ, అది వట్టిగా వేరే జాతి పాటను అనుకరించదు, అనుగుణ్యంగా పాడదు. పరిశోధకులు కొందరు సలహా యిచ్చేదేమంటే, ప్రాంతీయ పాటలోని అస్పష్టమైన నమూనా దాని మెదడులో ఉంటుంది, పక్షి అది వినేదానిని పరీక్షించి, అదే నమూనాకు తగినట్లుగా స్వరాన్ని చాలామట్టుకు అనుకరించగలదు.
వాటికెంతటి అద్భుతమైన మెదడుందో కదా! ఫెర్నాండో నెటెబోమ్ గానంచేసే పక్షుల మెదడు పార్శ్వచిత్రీకరణ చేయబడిందని విస్మయమొందే అన్వేషణను చేశాడు, అనగా అవి కుడి ఎడమ ప్రక్కలకు సంబంధించిన ప్రత్యేక స్థానాల్లో సంస్థీకరించబడి ఉంటాయి, అంటే ప్రతి వైపు దాని స్వంత విధులను కల్గియుంటుంది. ఆయన పక్షుల మెదడులో గానంచేసే సామర్ధ్యంగల ఒక ప్రత్యేకమైన భాగాన్ని వేరుచేశాడు. పెరుగుతున్న మగ క్యానరీ పక్షిలో, ఈ భాగం వాస్తవంగా దాని రాబోయే సంక్రమణా సమయానికి క్రొత్త రాగాలను నేర్చుకునే అవసరతపై ఆధారపడి పెరుగుతుంది, కుదించుకుంటుంది. క్యానరీ పక్షులు జీవితంలోని తొలి దశల్లో పాడుటకు ప్రయత్నిస్తాయి, అయితే గాన కోకిలలైన ఈ పక్షులు సహితం ఎనిమిది లేదా తొమ్మిది మాసాలు వచ్చే వరకూ నైపుణ్య స్థాయిని పొందలేవు.
గానంచేసే మరితర పక్షులు ఒక అంశం మీద వ్యత్యాసం సృష్టించుటలో ప్రత్యేకత కలిగి, ప్రస్తుతమున్న పాటను తీసికొని దానిని పెద్దది చేస్తాయి, లేదా దాని నాదాలను లేదా స్వరాల క్రమాన్ని మారుస్తాయి. అలాంటి అనుకరణ చేసే పక్షులు, ప్రాముఖ్యంగా మానవ స్వరాన్ని అనుకరించే లేదా “మాట్లాడే” సామర్ధ్యమున్న పక్షులు ఎంతోకాలంగా మనలను విభ్రాంతిపరుస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని లిరిబర్డ్, ఐరోపాలోని పెడిసెవంటి ఒక పక్షి (స్టార్లింగ్), బాడువ జిట్ట (మార్స్ వార్‌బ్లర్), ఉత్తర అమెరికాకు చెందిన మెడ క్రిందిబాగం పసుపు రంగుగల నల్లంచిగాడు అను పిట్ట (యల్లోబ్రస్టెడ్ చాట్), వనభూషణము (మోకింగ్‌బర్డ్) అనేవి పక్షి ప్రపంచంలో అనుకరించి పాడేపక్షుల్లో చేరియున్నాయి. ఆ తర్వాత కప్ప లేదా ఇలకోడి మొదలైనవాటిని అనుకరించే వాటితో కలిపి ఆయన తెలియజేసిన సంగీతస్వరాల జాబితాలో డజన్లకొద్దీ పాటలున్నాయి. నిజంగా, పక్షిసామ్రాజ్యంలో పేరుగాంచిన సాంప్రదాయ శబ్దాలనుండి సంగ్రహించిన మోకింగ్‌బర్డ్ యొక్క ఆనంద స్వరసమ్మేళనాలను వినడం చమత్కారంగా ఉంటుంది.
ఈ రెక్కలుగల ప్రాణులు వాటి సొగసైన రాగాలను పాడినప్పుడు, మీరు వినడమే కాదుగాని గుణగ్రహణంతో మీరు శ్రద్ధగా ఆలకించగలరు. రేపటి ప్రదర్శన ప్రకాశమానమైన తొలిసంధ్యలోనే మొదలౌతుంది. మరి మీరు విని ఆనందిస్తారా? (g93 6/22)
[19వ పేజీలోని బాక్సు]
సుపరిచిత ధ్వని
బ్రిటన్‌లో ఒక శాస్త్రవేత్త అనేకమైన థ్రెసెస్ (మనోహరంగా పాడే ఒక రకమైన పిట్టలు) పాడిన పాటలలో సుపరిచితమైన ఒక ధ్వనిని గుర్తించాడు. ఆయన ఆ పాటను రికార్డుచేసి, ఎలక్ట్రానికల్‌గా విశ్లేషించాడు. ఆయన ఆశ్చర్యపోయేలా, అది బ్రిటన్‌లో చాలా గృహాల్లో ఆ దేశ టెలీకమ్ కంపెనీవారు అందించిన ఆధునిక టెలిఫోన్ చేసే బీప్ శబ్దానికి చాలా సమాంతరంగావుంది. బహుశ, ఈ గానంచేసే పక్షులు ఆ స్వరాన్ని విని, గ్రహించి, వాటి సంగీతస్వరాల జాబితాలో దాన్ని యిమిడ్చియుండవచ్చును. సంగీతం వినిపించే ఈ థ్రెసెస్ పక్షులు వాటి స్వరాలతో మభ్యపెట్టి, నిజంగా ఒకవేళ కొంతమంది బ్రిటీషువారిని కంగారుగా ఫోను దగ్గరకు పరుగెత్తేటట్లు చేసియుండవచ్చును.
[Picture Credit Lines on page 18]
Camerique/H. Armstrong Roberts
T. Ulrich/H. Armstrong Roberts