బైబిలు, విజ్ఞానశాస్త్రం కంటె ముందే రోగాలను నిరోధించింది
ఈనాడు బైబిలు మాట ఎత్తితేనే, తెలియని అనేకమంది అది అయోగ్యమైనదని భావించి దాన్ని త్రోసిపుచ్చుతారు. ఆధునిక మానవుడు యిటీవలనే నేర్చుకున్న లేక నేర్చుకోవలసిన వాటిని గూర్చి అది వేల సంవత్సరాల క్రితమే తెల్పిన వాటిని పరిశోధించుటకు, వారి మనస్సులను విప్పుటకు నిరాకరిస్తున్నారు. ప్రపంచ పరిస్థితులు, ప్రభుత్వం, ఖగోళశాస్త్రం, పర్యావరణం, ప్రకృతి పదార్థ చరిత్ర, శరీరశాస్త్రం, మరియు మనస్తత్వశాస్త్రం విషయాల్లో ఇది వాస్తవం. రోగం విషయంలో కూడ అది నిజమే.
బైబిలు జీవగ్రంథం. ఏ ఇతర గ్రంథం లేదా సాహిత్య గ్రంథ సంచయము కూడ జీవితపు అనేక రంగాలకు సంబంధించి అంత విస్తారమైన వర్తింపు నివ్వలేదు. మంచి ఆరోగ్యానికి జీవితానికి సంబంధమున్నది, గనుక ఆరోగ్యాన్ని గూర్చిన అనేక సూత్రాలు బైబిలు నందున్నవనుటలో ఆశ్చర్యం లేదు. బైబిలు అనేక రోగాలు అంటే కుష్టు, మూలవ్యాధి, జలోధర రోగం మరియు ఉదర రోగం మొదలగువాటిని గూర్చి తెల్పుతుంది.—ద్వితీయోపదేశకాండము 24:8; 28:27; లూకా 14:2; 1 తిమోతి 5:23.
శరీర రోగాలను గూర్చి మనల్ని ఉపదేశించుటకు బైబిలు ముఖ్యంగా వ్రాయబడలేదు. అయిననూ, అందించే సమాచారం విజ్ఞానపరంగా నిర్దిష్టమై, పునఃపరిశీలనకు ప్రయోజనకరంగా వుంది. ప్రాచీనకాల కీర్తన రచయితకు మానవశరీరం మహాశ్చర్యకరంగా వున్నట్లు కనబడింది, ఆయన దాన్ని గూర్చి ఇలా వ్రాశాడు: “నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగిన యెముకలును నీకు మరుగై యుండలేదు. నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములన్నియు నీ గ్రంథములో లిఖితములాయెను.”—కీర్తన 139:13-16.
పిండం గర్భమందు కనబడకుండ దాగివున్నను అది తయారైన విధానాన్ని ఎముకలు పెరిగే పద్ధతిని యెహోవా చూడగలడు. ఆయనకు “చీకటియు వెలుగును ఏకరీతిగా ఉన్నవి.” (12 వచనము) యెహోవాకు మరుగైన దేదియు లేదు. వైద్యపరంగా చెప్పాలంటే తల్లి తనదికాని వేరే శరీర భాగమనుకొని బయటికి విసర్జించకుండ గర్భవేష్టనమనేది ఆ పిండాన్ని పరిరక్షిస్తుంది. అయినను కీర్తన రచయిత వెలిబుచ్చిన సత్యం మాత్రము ఆత్మీయమైనది, అంటే యెహోవా గర్భమందు చీకటిలో కూడా సమస్తం చూస్తాడు.
గర్భం దాల్చిన క్షణం నుండే, తల్లి గర్భమందు ఫలదీకరణం చెందిన కణాండంలోని మౌలిక నియమావళిలో ‘మన శరీర భాగాలన్ని లిఖితమైయున్నవి.’ మరియు అవి నిర్మింపబడవలసిన దినముల విషయములోనైతే ప్రతిదాని క్రమము చొప్పున దాని కాలములోనే అది తయారగుటకు జన్యుసంబంధ కార్యక్రమంలో ఏర్పాటు చేయబడిన జీవశాస్త్ర కాలమునుబట్టి కాలనిర్ణయం జరుగుతుంది.
కీర్తన రచయితయైన దావీదుకు ఈ విజ్ఞాన శాస్త్రవివరాలేమి తెలియవు గానీ కీర్తన రచయితను ప్రేరేపించిన యెహోవాకు తెలుసు, ఎందుకంటే ఆయనే మానవున్ని సృజించింది. విమర్శకులు దావీదును గ్రంథకర్తగా అంగీకరించకపోయినప్పటకినీ క్రీస్తుకంటే ముందు అనేక శతాబ్దాల పూర్వమే కీర్తనలు వ్రాయబడినట్లు వారు ఒప్పుకోవలసిందే.
బైబిలు, నిరోధకం మీద దృష్టి సారిస్తుంది
క్రీస్తుపూర్వం 15 శతాబ్దాల క్రితమే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకిచ్చిన శాసనాలను పునర్విమర్శిస్తే ఆరోగ్యం విషయంలో ధర్మశాస్త్రం ముఖ్యంగా నిరోధకం మీద స్పష్టంగా దృష్టి సారించినట్లు కనబడుతుంది. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండము 23:13 ఇలా తెలుపుతుంది: “మరియు నీ ఆయుధములుగాక గసిక యొకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్లునప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను.” ఈగల ద్వారా వ్యాపించే చలన సూక్ష్మ క్రిమివలన కలిగే విషపూరిత విరేచనాలు, నిశ్చల సూక్ష్మ క్రిమి మూలంగా కడుపు నొప్పితో వచ్చే విరేచనాలు సన్నిపాత విషజ్వరం వంటి వాటిని నివారించుటలో మలమును మట్టితో కప్పివేయాలనే ఈ నియమం మహాగొప్పగా నిరోధించే పద్ధతిగా ఉండేది. ఈ సూత్రాన్ని పాటించని ప్రాంతాల్లో నేడును వేలాదిమంది చనిపోతున్నారు.
లేవీయకాండము 11 అధ్యాయము సూత్రప్రాయంగా తెలిపేదేమంటే రోగం ఒక కీటకంవల్ల, ఎలుకవల్ల, ముఖ్యంగా కలుషితనీటివల్ల వ్యాప్తిచెందవచ్చును. ఈ చివరి కారణం నిస్సంకోచంగా రుజువు పరచేదేమంటే రోగం సూక్ష్మ జీవులద్వారా వ్యాపిస్తుందని, లీవెన్ హాక్ (1683) లేదా పాశ్చర్ (19 శతాబ్దం) కంటె వేలాది సంవత్సరాల ముందే ఈ విషయంలో బైబిలు పురోభివృద్ధి చెందిందని నిరూపించింది. అలాగే లేవీయకాండం 13 అధ్యాయంలో కుష్టురోగాన్ని గూర్చి ఆజ్ఞాపించబడిన అంటురోగంగల వారిని వేరుగా ఉంచుట విషయంలో కూడ అదే సత్యమని చెప్పవచ్చును.
లేవీయకాండం 11:13-20 నందు వ్రాయబడిన ఆహార నిషేధాలలో ఇతరవాటిని చంపి తినే పక్షిరాజులు, డేగలు, గుడ్లగూబల వంటివి క్రుళ్లిన మాంసాహారాన్ని తినే నల్లకాకి, రాబందు వంటివి చేర్చబడినవి. పర్యావరణ ఆహార వరుసలో ప్రథమస్థానమందున్నందున అవి విషపదార్థాలున్న పెద్ద ఆహార మొత్తాలను తినడానికి శ్రద్ధచూపుతాయి. ఈ పర్యావరణ ఆహార వరుసలో తరువాత ఉన్న జంతువులు తక్కువ విషపదార్థాలను కలిగి ఉంటాయి, అయితే పర్యావరణ ఆహార వరుసలో ప్రథమ స్థానమందున్నవి మాత్రం అధిక మొత్తంలో విషపదార్థాలను కలిగి ఉంటాయి. కొన్ని శాఖాహార జంతువులను అనగా విషపదార్థాలున్న వాటిని తినే పర్యావరణ ఆహార వరుసలో లేని జంతువులను తినవచ్చని మోషే ధర్మశాస్త్రం అనుమతించింది. కొన్ని నిషేధ మాంసాహారములలో పరోపజీవి మూలంగా వచ్చు ప్రాణాంతక రోగమును కలిగించే పరాన్నజీవులు దాగివుంటాయి.
మోషే ధర్మశాస్త్రమందు పలుచోట్ల తెలుపబడిన రక్తదుర్వినియోగం చేయకూడదనే బైబిలు నిషేధం 3,500 సంవత్సరాల తరువాత కూడ యిప్పుడు వైద్యపరంగా ఉత్తమమైనదిగా రుజువౌతుంది. (ఆదికాండము 9:4; లేవీయకాండము 3:17; 7:26; 17:10-16; 19:26; ద్వితీయోపదేశకాండము 12:16; 15:23) ఇది మరల క్రైస్తవ గ్రీకు లేఖనాలలోని అపొస్తలుల కార్యములు 15:20, 29, మరియు 21:25 లో నొక్కి తెలుపబడింది. మూత్రపిండ భిన్నీకరణ ప్రక్రియలోను, గుండె-శ్వాస నాళాల యంత్రములోను, సాధారణ శస్త్రచికిత్సలోను దానం చేయబడిన రక్తాన్ని పూర్తిగా ఉపయోగించకుండ వుండుటకు లేక తగ్గించుటకు వైద్యరంగం ప్రయత్నిస్తుంది. అనేకరకాల కాలేయవ్యాధి, ఎయిడ్స్, జీవకణరోగగ్రస్తమగు అంటువ్యాధి మరియు రక్తం వల్ల వచ్చే వేలాది ఇతర రోగాలు దేవుని శాసనములను ధిక్కరించే యిహలోక తర్క వాదులకు జ్ఞాపికలుగా నిలిచియున్నవి.
వ్యాయామం ఆరోగ్యానికి చాలప్రాముఖ్యం, మరి బైబిలు దాని ప్రయోజనాలను అంగీకరిస్తుంది. వారానికి మూడు సార్లు 20 నిమిషాలపాటు బాగా వ్యాయామం చేస్తే గుండెపోటు, నాడీమండల వ్యవస్థ అనర్థాలు తగ్గిపోతాయి. అది సురక్షితమైన హెచ్డియల్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది, నీ శక్తిస్థాయిని అధికం చేస్తుంది, నీవు ఆరోగ్యంగా వున్నావనే భావాన్ని కల్గించే, హుషారును పెంచుతుంది. వ్యాయామం విలువను గుర్తిస్తూనే బైబిలు అంతకంటె ప్రాముఖ్యత కల్గివున్న ఆత్మీయత తర్వాత స్థానాన్నే దానికిస్తుంది: “శరీరసంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయములలో ప్రయోజనకరమవును.”—1 తిమోతి 4:8.
బైబిలునందలి నైతిక సూత్రాలు సుఖరోగాలను నివారించే ప్రాథమిక సురక్షణగా పనిచేస్తున్నవి. ఈ సుఖరోగాలు నిశ్చయంగా వున్నవి గానీ అవి వున్నవని కొన్ని శతాబ్దాలుగా విద్వాంసులు బహుశా సంశయించి యుండకపోవచ్చును లేదా యింకను వాటిని గుర్తించలేదు.—నిర్గమకాండము 20:14; రోమీయులు 1:26, 27; 1 కొరింథీయులు 6:9, 18; గలతీయులు 5:19.
“అదొక నిజమైన విజ్ఞానశాస్త్ర గ్రంథం”
హిప్పోక్రాట్స్ అనేవ్యక్తి సా.శ.పూ. ఐదు, నాలుగు శతాబ్దాలలో గ్రీకు వైద్యునిగాను “వైద్యరంగానికే పితామహుని” గాను పేరుపొందాడు, అయిననూ అప్పటికి వేయి సంవత్సరాల క్రితమే బైబిలునందు తెలుపబడిన అనేక రోగాలను గూర్చి మోషే వ్రాశాడు, మరి ప్రాముఖ్యంగా, ఒక డాక్టరు వ్రాసిన ఉత్తరాన్ని ది ఎయంఎ న్యూస్ ప్రచురించింది: “ఇప్పుడు శ్రేష్ఠమైన పని చేస్తున్న ఉత్తమ వైద్య నిపుణులు బైబిలు చాలా విజ్ఞానశాస్త్ర గ్రంథమనే ముగింపుకు వస్తున్నారు . . . ఇప్పటికీ రుజువు కానటువంటి, మరియు చాల తప్పులతడికగా వున్నట్లు కనుగొనబడిన హిప్పోక్రాట్స్ సిద్ధాంతాలకంటె బైబిలు నందివ్వబడిన జీవితవాస్తవాలు, రోగ కారణములు, చికిత్స మరియు నివారణమందు ఎంతో ఆధునికమైనవియు, నమ్మదగినవై యున్నవి.”
డా. రెండల్ షార్ట్, పురాతన ఇశ్రాయేలీయుల చుట్టున్న జనాంగముల పారిశుద్ధ్య నియమాలు, ఒక వేళ ఉంటే చాలా ప్రాథమిక దశలో వుండెనని తెలిపిన తర్వాత యింకను ది బైబిలు అండ్ మాడ్రన్ మెడిసిన్ అనే తన పుస్తకంలో ఇలా అన్నాడు: “గనుక అవిజ్ఞాన శాస్త్రమని ఆరోపించబడిన బైబిలు వంటి గ్రంథంలో పారిశుద్ధ్య నియమావళి వుండుట ఎంతో ఆశ్చర్యకరం, మరియు అప్పుడే చెరనుండి విముక్తిచెందిన జనాంగం, తరచూ శత్రువులచేత తరుమబడి, అప్పుడప్పుడు చెరలోనికి తీసుకొనిపోబడే జనాంగం అంతటి జ్ఞానయుక్తమైన సహేతుకమగు ఆరోగ్య నియమమున్న గ్రంథములను కల్గియుండుట మరింత ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది.”
మనశ్శరీరక సమస్యలు
వైద్యరంగాలలో సర్వత్రా అంగీకరింపబడుటకు చాలాకాలం ముందే మనశ్శరీరక సమస్యలవల్ల కొన్ని అనారోగ్య పరిస్థితులుండునని గుర్తించుటలో బైబిలు వైద్యపరంగా ఎంతో ముందంజ వేసిందని రుజువైంది. అదియునుగాక శరీర రోగాన్ని తెలియజేయుటలో మనస్సు యొక్క పాత్రను గూర్చిన బైబిలు వివరణ, స్పష్టమైన గ్రాహ్యమునకు ఒక మాదిరిగా నిలిచివుంది. సామెతలు 17:22: “సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండి పోజేయును.” ఇక్కడ ఎటువంటి విమర్శలేదు, కేవలం వాస్తవము ప్రస్తావించబడింది. అదేదో అంత సులభమైందన్నట్లు దిగులు పడనక్కర్లేదని అసంతోషకరంగా వుండే వ్యక్తికి చెప్పడంలేదు.
అనుకూల దృక్పధం సహాయకరం; విచారమనేది ప్రతికూల దృక్పధం గనుక ఆటంకంగా ఉంటుంది. “ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును. దయగల మాట దాని సంతోషపెట్టును.” (సామెతలు 12:25) సామెతలు 18 అధ్యాయము 14 వచనం యోచించయోగ్యమైనదే: “నరుని ఆత్మ వాని వ్యాధినోర్చును. నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు.” ఒకని ఆత్మీయ శక్తులను కూడగట్టుకొనుట ద్వారా తనకున్న శరీర రోగాన్ని తట్టుకోగల శక్తిని వృద్ధిచేసికొనవచ్చునని ఈ లేఖనము సూచిస్తుంది.
మనస్తత్వ శాస్త్రజ్ఞుడైన జేమ్స్ టి. ఫిషర్, యేసు ఇచ్చిన కొండమీది ప్రసంగంలోని విలువను గూర్చి ఇలా చెప్పాడు: “మానసిక ఆరోగ్య విషయంలో మనస్తత్వ శాస్త్రవేత్తలు, మనోవ్యాధుల వైద్యులలోని మహామేధావుల అధికారపూరిత వచనముల యందున్న సారాంశమును నీవు తీసుకొని—నీవు వాటిని కలిపి శుద్ధీకరించి, అదనంగావున్న పదజాలాన్ని తీసివేసి—బలమైన సమాచారాన్ని తీసికొని తమాషా వాక్యాలను తొలగించి, ఆ కల్తీలేని స్వచ్ఛమైన శాస్త్రీయమైన జ్ఞానపు ముక్కలను, జీవిస్తున్న కవీశ్వరులలో అత్యంత సామర్థ్యంగల వ్యక్తి చెప్పవలసివస్తే, కొండమీది ప్రసంగము యొక్క అసంబద్ధమైన క్లుప్తీకరణయే మీకు దొరుకుతుంది. అట్టి అధికార రచనలను కొండమీది ప్రసంగముతో పోలిస్తే అవి ఎంతో అసమర్థంగా కనిపిస్తాయి.—ఏ ఫ్యి భటనస్స్ మిసింగ్, పేజి 273
మనశ్శరీర సంబంధమైన భావాలు మన శరీర స్థితిమీద ప్రభావం చూపిస్తాయి, అయితే అసలు శరీర రుగ్మతలేదని దీని అర్థం కాదు. గనుక మొదట శరీరక అవసరాలను తీర్చుటకు తోడ్పడుచు, ఆ తర్వాత రోగాన్ని గుర్తించి, అదేసమయంలో ఒక వ్యక్తి సహించుటకు దోహదపడే మానసిక భావోద్రేక అనుకూల దృక్పథాన్ని వృద్ధి చేసుకొనుట ప్రాముఖ్యం. ఈ ప్రస్తుత విధానంలో ఎటువంటి నిర్దిష్టమైన చికిత్స లేదనే తలంపు వచ్చినపుడు అలాచేయుట ఎంతో ప్రాముఖ్యం.
ఆదాము పాపము చేసిన తర్వాత మరణం మానవజాతి యంతటికి పారంపర్యంగా సంక్రమించింది. (రోమీయులు 5:12) కావున, ఒకని ఆత్మీయస్థితికి తన రోగాన్ని ముడివేయుట సమంజసం కాదు. భావోద్రేక బలహీనతా స్థితిలోవున్న వ్యక్తుల సమస్యలను గూర్చి పరిశీలించునపుడు దీనిని మనస్సు నందుంచుకొనుట ప్రాముఖ్యం.
వైద్యుని పాత్ర
క్రైస్తవుడెట్లు వైద్యులతోను ఆధునికవైద్య చికిత్సతోను తత్సంబంధం కల్గివుండాలి? బైబిలును పరిశీలిస్తే, వైద్యులను అనవసరమైన అందలమెక్కించడానికి గాని, మంచి ఆరోగ్యానికి అంతిమ నిరీక్షణ వైద్యసాంకేతిక జ్ఞానమేనని అనుకోవడానికిగాని లేఖనాధారమేమి లేదు. అయితే అందుకు భిన్నమైన సాక్ష్యాధారమున్నది. అనేక సంవత్సరాల నుండి “రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ యుండెను ఆమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి తనకు కలిగినదంతయు వ్యయము చేసికొని, యెంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను” అని మార్కు ఒక స్త్రీని గూర్చి తెలియజేస్తున్నాడు. (మార్కు 5:25-29) ఇటువంటి సాధారణ రోగానికిప్పుడు తరచూ జయప్రదంగానే చికిత్స చేస్తున్నప్పటికి అనేక రోగాలు చికిత్సకు నోచుకొనుట లేదు, చికిత్స చేయలేని క్రొత్తరోగాలెన్నో బయటపడుతున్నాయి.
అయిననూ, వైద్యానికి విలువేలేదని లేక స్వల్ప విలువగలదనే వ్యతిరేక అభిప్రాయానికి బైబిలు మద్దతు ఇవ్వడంలేదు. కొందరు వైద్యుని వద్దకు వెళ్లకుండా తమకుతామే చికిత్స చేసుకుంటారు లేదా ఆ క్షణానికి ఏదొక వైద్యేతర చికిత్స అవలంబిస్తారు. కొలొస్సయులు 4:14 నందు లూకాను “ప్రియమైన” వైద్యుడని సంబోధించడంలో అది ఆయన వైద్యపరమైన నైపుణ్యములను గూర్చి గాక ఆత్మీయార్హతలను గూర్చి నిశ్చయంగా తెలుపుతుంది. అయినను ఆయన ప్రేరేపణతో పరిశుద్ధ లేఖనాలలోని కొంత భాగాన్ని వ్రాసే ఆధిక్యతను పొందుటయనేది ఆయన అనైతిక లేక లేఖన విరుద్ధమైన వైద్య చికిత్సా విధానము ననుసరిస్తే అట్టి ఆధిక్యతను బహుశా పొందియుండేవాడు కాదు.
లూకా, తన కాలానికి ఆధునికంగా వుండిన వైద్యచికిత్సనే వాడెనని, హిప్పోక్రాట్స్ ప్రభావము కల్గియున్న వైద్య పదజాలాన్ని, వివరాలను ఉపయోగించాడనుటకు ఆధారమున్నది. హిప్పోక్రాట్స్ అన్ని సమయాల్లో కచ్చితమైన చికిత్స చేయకపోయినను అతడు మూఢనమ్మకాన్ని, కపటమత సిద్ధాంతాలను తృణీకరించి, సరియైన చికిత్సా విధానమును ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాడు. ఒకవేళ రోగానికి చికిత్స చేసేవారి వైద్యాన్ని అంగీకరించకపోతే లూకా 5:31 లో “రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు” అని యేసు ఇచ్చిన సామాన్య దృష్టాంతమునకు అంతగా విలువ వుండేది కాదు.
యాంటిబయోటిక్స్, యాంటిసెప్టిక్స్ లేక నొప్పి నివారణ మందు వాడవలసిన అవసరమున్నదని తెలిపినపుడు వాటిని వాడకూడదనే అభిప్రాయం కల్గియుండుటకు లేఖనాధారమేమి లేదు. యిర్మీయా 46:11 మరియు 51:8 లో గిలాదులో గుగ్గిలమును గూర్చి వివరిస్తుంది, బహుశా అందులో క్రిమిసంహారక బాధ నివారించే గుణం వుండవచ్చును. శరీరంలోనికి మందు తీసుకొనకూడదనే సిద్ధాంతంగానీ లేఖనానుసారమైన ఆటంకంగానీ ఏమీ లేదు.
అయిననూ పెద్దమొత్తాల్లో వున్న యాంటిబయోటిక్స్ కూడ ఈగలు, దోమలు మరియు నత్తల ద్వారా వ్యాప్తిచెందే అంటు రోగ వ్యాపకమును అడ్డుకోలేకపొతున్నవి. ఇవే అతి ముఖ్యంగా లోకమంతట మరణాలకు కారణమౌతున్నవి. ఆరోగ్యశాఖ సేవకులు మరల బైబిలు ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగా, పారిశుద్ధ్యం, సరఫరా పరిరక్షణ, క్రిములను అరికట్టు పద్ధతి మరియు పరస్పర సంబంధం, తినే తిండి విషయంలో మందు జాగ్రత్తలు తీసుకోవలసిన విషయాలతో మొదలు పెట్టవలసి వచ్చింది. ఇటీవల 1970 దశకం వరకు కూడ ఆసుపత్రిలో రోగుల పడకదగ్గర, చేతులు కడుక్కునేచోట నర్సులను డాక్టర్లను మాటిమాటికి జ్ఞాపకము చేసే వాక్యాలు ఇలా వ్రాయబడివుండేవి: “చేతులు కడుక్కోండి” ఇదే రోగం అంటకుండ చేయుటకు అతి ప్రాముఖ్యమైన పద్ధతి.
ముందు జాగ్రత్త మాట
ఆరోగ్య సలహాయిచ్చేవారు—ఒక వైద్యుడేగాని, నాటువైద్యుడేగాని, హోమియో డాక్టరేగాని లేదా, మంచి భావముగల, అంతగా తెలియని మిత్రుడేగాని—అనారోగ్యంగా వున్నవారికి ఎప్పుడైనా సలహాయిస్తే ఎక్కువ బాధ్యత వహిస్తారు. వారిచ్చే సలహా హానికరమైనప్పుడు లేక, పెడత్రోవపట్టినపుడు, పక్షపాత ధోరణితోను లేదా తరచూ సత్పరిణామమునిచ్చే సహాయం ఆలస్యం చేసినప్పుడు ప్రత్యేకంగా అట్టి బాధ్యత వహించవలసి వుంటుంది. సహాయం కొరకు తంటాలుపడే సమయంలో బూటకపు వైద్యం, అభిచారం విషయంలో బహుజాగ్రత్తగా వుండాలని అటు వైద్యులకు ఇటు రోగులకు కావలసిన హెచ్చరికలు బైబిలునందున్నవి. సామెతలు 14:15 జ్ఞాపకముంచుకోండి: “జ్ఞానములేని వాడు ప్రతిమాట నమ్మును. వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.”
పరిశుద్ధలేఖనములలో పొందుపరచబడిన సూత్రాలు ఈనాడు ఆరోగ్యాన్ని కాపాడుకొనుటకు వుపయోగపడతాయా? మోషే ధర్మశాస్త్రం రోగ నిరోధకం మీద ప్రధానంగా దృష్టిని సారించినట్లే ఈనాడు కూడా ఆరోగ్యాన్ని కాపాడుటలో నిరోధకం ఎంతో అధిక విలువ కల్గియున్నదని రుజువయ్యింది. అభివృద్ధిచెందని దేశాలలో ఆధునిక చికిత్స విధానాన్ని అమలు పరచుటకు ప్రయత్నించుటలో ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నవీన పద్ధతియిదే: “నయం చేయుట కంటె నిరోధించడమే మేలు.”
చివరిగా చెప్పేదేమిటంటే క్రైస్తవుడు సంతోషభరితమైన పరిచర్యలో దేవుని మహిమపరచుటకు మంచి ఆరోగ్యాన్ని వినియోగించే గురితో ఆరోగ్యాన్ని గూర్చి గౌరవప్రదమైన దీర్ఘకాలదృష్టిని కల్గియుండాలి. ఆ రాజ్యపరిపాలన క్రింద ఇలా వుంటుందనే వాగ్దానమున్నది: “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.”—యెషయా 33:24. (g91 11/22)
[4వ పేజీలోని చిత్రం]
“నా తల్లిగర్భములో మరుగైయుండలేదు”