కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • nwt ప్రకటన 1:1-22:21
  • ప్రకటన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటన
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ప్రకటన

యోహానుకు ఇచ్చిన ప్రకటన

1 ఇవి యేసుక్రీస్తు బయల్పర్చిన* విషయాలు. దేవుడు త్వరలో జరగబోయేవాటిని తన దాసులకు చూపించడానికి+ వాటిని యేసుకు ఇచ్చాడు.+ యేసు తన దూతను పంపించి, తన దాసుడైన యోహానుకు+ సూచనల ద్వారా వాటిని చూపించాడు. 2 దేవుడు ఇచ్చిన వాక్యం గురించీ యేసుక్రీస్తు ఇచ్చిన సాక్ష్యం గురించీ, అవును, తాను చూసిన వాటన్నిటి గురించీ యోహాను సాక్ష్యమిచ్చాడు. 3 ఈ ప్రవచనంలోని మాటల్ని చదివి వినిపించేవాళ్లు, వాటిని వినేవాళ్లు, అందులో రాసివున్న వాటిని పాటించేవాళ్లు సంతోషంగా ఉంటారు.+ ఎందుకంటే, నిర్ణయించిన సమయం దగ్గరపడింది.

4 ఆసియా ప్రాంతంలో ఉన్న ఏడు సంఘాలకు యోహాను రాస్తున్న విషయాలు:

“ఇప్పుడూ గతంలోనూ ఉన్నవాడు, రాబోతున్నవాడు అయిన దేవుడు,”+ అలాగే ఆయన సింహాసనం ముందున్న ఏడు శక్తులు+ మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి. 5 అంతేకాదు, “నమ్మకమైన సాక్షి,”+ “మృతుల్లో నుండి మొదట బ్రతికినవాడు,”*+ “భూరాజులకు పరిపాలకుడు”+ అయిన యేసుక్రీస్తు కూడా మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.

మనల్ని ప్రేమిస్తున్న, తన సొంత రక్తంతో మన పాపాల నుండి మనల్ని విడిపించిన,+ 6 తన తండ్రైన దేవునికి మనల్ని రాజ్యంగా,+ యాజకులుగా+ చేసిన యేసుకు ఎప్పటికీ మహిమ, శక్తి కలగాలి. ఆమేన్‌.

7 ఇదిగో! ఆయన మేఘాలతో వస్తున్నాడు,+ ప్రతీ ఒక్కరు ఆయన్ని చూస్తారు, ఆయన్ని పొడిచినవాళ్లు కూడా ఆయన్ని చూస్తారు; భూమ్మీదున్న అన్ని తెగలవాళ్లు దుఃఖంతో గుండెలు బాదుకుంటారు. అవును, ఆమేన్‌.

8 “నేనే ఆల్ఫాను, ఓమెగను;*+ ఇప్పుడూ గతంలోనూ ఉన్నవాణ్ణి, రాబోతున్నవాణ్ణి; సర్వశక్తిమంతుణ్ణి”+ అని యెహోవా* దేవుడు చెప్తున్నాడు.

9 యోహాను అనే నేను మీ సహోదరుణ్ణి, అలాగే యేసుకు అనుచరుడిగా ఉండడం వల్ల వచ్చే శ్రమల్లో,+ రాజ్యంలో,+ సహనంలో+ మీతోపాటు భాగస్థుణ్ణి. దేవుని గురించి మాట్లాడడం వల్ల, యేసు గురించి సాక్ష్యమివ్వడం వల్ల నేను పత్మాసు ద్వీపంలో ఉన్నాను. 10 నేను పవిత్రశక్తితో నిండిపోయి ప్రభువు రోజున జరిగే విషయాల్ని చూశాను. నా వెనక నుండి బాకా శబ్దం లాంటి పెద్ద స్వరం వినిపించింది. 11 ఆ స్వరం ఇలా అంది: “నువ్వు చూసే విషయాల్ని గ్రంథపు చుట్టలో రాసి ఎఫెసు,+ స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియ, లవొదికయ అనే ఏడు సంఘాలకు పంపించు.”

12 నాతో మాట్లాడుతున్నది ఎవరో చూడాలని నేను అటువైపు తిరిగాను. అప్పుడు నాకు ఏడు బంగారు దీపస్తంభాలు కనిపించాయి. 13 ఆ దీపస్తంభాల మధ్యలో మానవ కుమారుడి+ లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పొడవాటి వస్త్రం వేసుకొని ఉన్నాడు, ఆయన ఛాతి చుట్టూ బంగారు దట్టీ ఉంది. 14 అంతేకాదు ఆయన తల, తలవెంట్రుకలు తెల్లని ఉన్నిలా, మంచులా తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్లు అగ్నిజ్వాలలా ఉన్నాయి. 15 ఆయన పాదాలు కొలిమిలో మెరిసే రాగిలా ఉన్నాయి.+ ఆయన స్వరం అనేక జలాల శబ్దంలా ఉంది. 16 ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలు ఉన్నాయి. ఆయన నోటి నుండి రెండువైపులా పదునున్న పొడవాటి ఖడ్గం వస్తోంది.+ ఆయన ముఖం ఎంతో తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది.+ 17 నేను ఆయన్ని చూసినప్పుడు, చచ్చినవాడిలా ఆయన పాదాల దగ్గర పడిపోయాను.

ఆయన నా మీద తన కుడిచెయ్యి పెట్టి ఇలా అన్నాడు: “భయపడకు. నేను మొదటివాణ్ణి,+ చివరివాణ్ణి.+ 18 నేను జీవిస్తున్నవాణ్ణి.+ నేను చనిపోయాను, కానీ ఇదిగో యుగయుగాలు జీవిస్తూనే ఉన్నాను.+ మరణపు తాళంచెవులు, సమాధి* తాళంచెవులు నా దగ్గర ఉన్నాయి.+ 19 కాబట్టి నువ్వు చూసినవాటి గురించి, ఇప్పుడు జరుగుతున్నవాటి గురించి, వీటి తర్వాత జరగబోయేవాటి గురించి రాయి. 20 నా కుడిచేతిలో నువ్వు చూసిన ఏడు నక్షత్రాల గురించిన, ఏడు బంగారు దీపస్తంభాల గురించిన పవిత్ర రహస్యం ఇదే: ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాల దూతల్ని సూచిస్తున్నాయి, ఆ ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాల్ని సూచిస్తున్నాయి.+

2 “ఎఫెసు+ సంఘ దూతకు+ ఇలా రాయి: కుడిచేతిలో ఏడు నక్షత్రాలు పట్టుకొని, ఏడు బంగారు దీపస్తంభాల మధ్య నడిచే వ్యక్తి ఈ మాటలు చెప్తున్నాడు: 2 ‘నీ పనుల గురించి, నీ కష్టం గురించి, నీ సహనం గురించి నాకు తెలుసు. నీ మధ్య చెడ్డవాళ్లను ఉండనివ్వవని కూడా నాకు తెలుసు. అపొస్తలులు కాకపోయినా అపొస్తలులమని చెప్పుకునేవాళ్లను నువ్వు పరీక్షించి,+ వాళ్లు అబద్ధాలకోరులని కనిపెట్టావు. 3 అంతేకాదు నువ్వు నా పేరు కోసం+ ఎన్నో సహించావు, అయినా అలసిపోకుండా స్థిరంగా ఉన్నావు.+ 4 అయితే నీలో ఒక లోపం ఉందని నేను గమనించాను. అదేమిటంటే, మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలేశావు.

5 “ ‘కాబట్టి నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావో గుర్తుచేసుకొని, పశ్చాత్తాపపడి,+ మొదట్లో చేసిన పనులు చేయి. నువ్వు పశ్చాత్తాపపడకపోతే,+ నేను నీ దగ్గరికి వచ్చి నీ దీపస్తంభాన్ని+ దాని చోటు నుండి తీసేస్తాను. 6 అయితే ఒక విషయంలో నువ్వు సరిగ్గా ఉన్నావు. నీకొలాయితు తెగవాళ్ల+ పనులంటే నీకు అసహ్యం, అవంటే నాకూ అసహ్యమే. 7 సంఘాలకు పవిత్రశక్తి చెప్తున్న ఈ మాటల్ని చెవులు ఉన్నవాడు వినాలి:+ జయించే వ్యక్తికి+ దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షం పండ్లు తినే అవకాశం ఇస్తాను.’+

8 “స్ముర్న సంఘ దూతకు ఇలా రాయి: ‘మొదటివాడు, చివరివాడు,’+ చనిపోయి మళ్లీ బ్రతికినవాడు+ ఈ మాటలు చెప్తున్నాడు: 9 ‘నీ శ్రమల గురించి, నీ పేదరికం గురించి నాకు తెలుసు; అయినా నువ్వు ధనవంతుడివే.+ అంతేకాదు, యూదులు కాకపోయినా యూదులమని చెప్పుకుంటూ నిన్ను దూషించేవాళ్ల గురించి నాకు తెలుసు. నిజానికి వాళ్లు సాతాను గుంపుకు చెందినవాళ్లు.*+ 10 నీకు రాబోతున్న కష్టాల గురించి భయపడకు.+ ఇదిగో! మీరు పూర్తిగా పరీక్షించబడేలా అపవాది మీలో కొందర్ని చెరసాలలో వేస్తూనే ఉంటాడు. మీరు పది రోజులు శ్రమ అనుభవిస్తారు. చనిపోయేవరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తాను.+ 11 సంఘాలకు పవిత్రశక్తి చెప్తున్న ఈ మాటల్ని చెవులు ఉన్నవాడు వినాలి:+ జయించే వ్యక్తికి+ రెండో మరణం*+ వల్ల అసలు ఏ హానీ జరగదు.’

12 “పెర్గము సంఘ దూతకు ఇలా రాయి: రెండువైపులా పదునున్న పొడవాటి ఖడ్గంగల వ్యక్తి+ ఈ మాటలు చెప్తున్నాడు: 13 ‘సాతాను సింహాసనం ఉన్న చోట నువ్వు నివసిస్తున్నావని నాకు తెలుసు. అయినా నువ్వు నాకు విశ్వసనీయంగా ఉన్నావు.*+ సాతాను నివాసముంటున్న మీ నగరంలో అంతిప అనే నా నమ్మకమైన సాక్షి+ చంపబడిన+ రోజుల్లో కూడా నువ్వు నా మీదున్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు.*+

14 “ ‘అయితే నీలో కొన్ని లోపాలు ఉన్నాయని నేను గమనించాను. బిలాము బోధను+ అనుసరించేవాళ్లను నీ మధ్య ఉండనిస్తున్నావు. ఇశ్రాయేలీయులు పాపం చేసేలా, అంటే విగ్రహాలకు బలి ఇచ్చినవాటిని తినేలా, లైంగిక పాపం* చేసేలా+ ప్రలోభపెట్టమని ఆ బిలాము బాలాకుకు+ నేర్పించాడు. 15 అంతేకాదు, నీకొలాయితు తెగవాళ్ల బోధను అనుసరించేవాళ్లు కూడా నీ మధ్య ఉన్నారు.+ 16 కాబట్టి పశ్చాత్తాపపడు. లేకపోతే నేను త్వరగా నీ దగ్గరికి వస్తాను; నా నోటి నుండి వస్తున్న పొడవాటి ఖడ్గంతో+ వాళ్ల మీద యుద్ధం చేస్తాను.

17 “ ‘సంఘాలకు పవిత్రశక్తి చెప్తున్న ఈ మాటల్ని చెవులు ఉన్నవాడు వినాలి:+ జయించే వ్యక్తికి+ దాచివున్న మన్నాలో+ కొంతభాగం, తెల్లని గులకరాయి ఇస్తాను. దానిమీద ఒక కొత్త పేరు రాసివుంటుంది, ఆ పేరు దాన్ని పొందిన వ్యక్తికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు.’

18 “తుయతైర+ సంఘ దూతకు ఇలా రాయి: అగ్నిజ్వాలలాంటి కళ్లు,+ మెరిసే రాగిలాంటి పాదాలు ఉన్న+ దేవుని కుమారుడు ఈ మాటలు చెప్తున్నాడు: 19 ‘నీ పనుల గురించి, నీ ప్రేమ గురించి, నీ విశ్వాసం గురించి, నీ పరిచర్య గురించి, నీ సహనం గురించి నాకు తెలుసు. మొదట్లో నువ్వు చేసిన పనులకన్నా ఈమధ్య చేసిన పనులు మెరుగ్గా ఉన్నాయని కూడా నాకు తెలుసు.

20 “ ‘అయితే నీలో ఒక లోపం ఉందని నేను గమనించాను. యెజెబెలు+ అనే స్త్రీని నీ మధ్య ఉండనిస్తున్నావు. ఆమె ప్రవక్త్రిని అని చెప్పుకుంటూ నా దాసులు లైంగిక పాపం* చేసేలా,+ విగ్రహాలకు బలి ఇచ్చినవాటిని తినేలా తన బోధలతో వాళ్లను తప్పుదారి పట్టిస్తోంది. 21 పశ్చాత్తాపపడేందుకు నేను ఆమెకు సమయమిచ్చాను. కానీ తన లైంగిక పాపం* విషయంలో పశ్చాత్తాపపడడం ఆమెకు ఇష్టంలేదు. 22 ఇదిగో, నేను ఆమెను మంచాన పడేలా చేయబోతున్నాను. ఆమెతో వ్యభిచారం చేస్తున్నవాళ్లు ఆమె పనుల విషయంలో పశ్చాత్తాపపడకపోతే వాళ్లను తీవ్రమైన శ్రమలపాలు చేయబోతున్నాను. 23 ఆమె పిల్లల్ని నేను ప్రాణాంతకమైన జబ్బుతో చంపుతాను. అప్పుడు, నేను అంతరంగంలోని ఆలోచనల్ని,* హృదయాల్ని పరిశోధించేవాడినని సంఘాలన్నీ తెలుసుకుంటాయి. అలాగే, మీలో ఒక్కొక్కరికి మీ పనుల్ని బట్టి ప్రతిఫలం ఇస్తాను.+

24 “ ‘అయితే, తుయతైరలో ఉన్న మిగతావాళ్లతో, అంటే యెజెబెలు బోధను అనుసరించనివాళ్లతో, సాతాను అబద్ధ బోధలు*+ తెలియనివాళ్లతో నేను చెప్పేది ఏమిటంటే: మీ మీద నేను వేరే ఏ భారం పెట్టట్లేదు. 25 నేను వచ్చేవరకు మీ దగ్గర ఉన్నవాటిని గట్టిగా పట్టుకొని ఉండండి.+ 26 నేను ఆజ్ఞాపించినవాటిని చివరివరకు పాటించి జయించే వ్యక్తికి లోకంలోని దేశాల మీద అధికారం ఇస్తాను.+ 27 అలాంటి అధికారాన్నే నేను నా తండ్రి నుండి పొందాను. జయించే వ్యక్తి ఇనుప దండంతో ఆ ప్రజల్ని శిక్షిస్తాడు,*+ వాళ్లు మట్టిపాత్రల్లా పగలగొట్టబడతారు. 28 నేను అతనికి వేకువ చుక్కను ఇస్తాను.+ 29 సంఘాలకు పవిత్రశక్తి చెప్తున్న మాటల్ని చెవులు ఉన్నవాడు వినాలి.’

3 “సార్దీస్‌లో ఉన్న సంఘ దూతకు ఇలా రాయి: దేవుని ఏడు శక్తులు,+ ఏడు నక్షత్రాలు ఉన్నవాడు ఈ మాటలు చెప్తున్నాడు: ‘నీ పనులు నాకు తెలుసు, నువ్వు పేరుకే బ్రతికున్నావు గానీ నిజానికి నువ్వు చచ్చిపోయావు.+ 2 కాబట్టి మేలుకో.+ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న మిగతావాళ్లను* బలపర్చు. ఎందుకంటే, నువ్వు ఏ పని చేయాలని నా దేవుడు కోరుతున్నాడో దాన్ని నువ్వు పూర్తిచేయలేదు.* 3 కాబట్టి నువ్వు వేటిని పొందావో, వేటిని విన్నావో వాటిని గుర్తుచేసుకుంటూ పాటిస్తూ ఉండు, పశ్చాత్తాపపడు.+ ఒకవేళ నువ్వు మేలుకోకపోతే, నేను దొంగలా వస్తాను. నేను ఏ గంటలో నీ మీదికి వస్తానో నువ్వు అస్సలు తెలుసుకోలేవు.+

4 “ ‘అయితే, తమ వస్త్రాలు మురికి చేసుకోని కొందరు* సార్దీస్‌లో నీ మధ్య ఉన్నారు.+ వాళ్లు తెల్లని వస్త్రాలు వేసుకుని నాతో నడుస్తారు.+ ఈ గౌరవానికి వాళ్లు అర్హులు. 5 జయించే వ్యక్తి+ అలా తెల్లని వస్త్రాలు వేసుకుంటాడు.+ అతని పేరును నేను జీవగ్రంథంలో నుండి అస్సలు తుడిచేయను.+ బదులుగా, నా తండ్రి ముందు, ఆయన దూతల ముందు అతను నాకు తెలుసని* ఒప్పుకుంటాను. 6 సంఘాలకు పవిత్రశక్తి చెప్తున్న మాటల్ని చెవులు ఉన్నవాడు వినాలి.’

7 “ఫిలదెల్ఫియలో ఉన్న సంఘ దూతకు ఇలా రాయి: పవిత్రుడు,+ ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాడు,+ దావీదు తాళంచెవి ఉన్నవాడు,+ ఎవరూ మూయకుండా తెరిచేవాడూ ఎవరూ తెరవకుండా మూసేవాడూ ఈ మాటలు చెప్తున్నాడు: 8 ‘నీ పనులు నాకు తెలుసు. ఇదిగో! నీ ముందు తలుపు తెరిచి ఉంచాను,+ దాన్ని ఎవరూ మూయలేరు. నీకు కనీసం కొంచెం బలం ఉందని, నువ్వు నా ఆజ్ఞల్ని పాటించావని, నాకు* నమ్మకంగా ఉన్నావని నాకు తెలుసు. 9 ఇదిగో! యూదులు కాకపోయినా యూదులమని చెప్పుకుంటూ అబద్ధాలాడే సాతాను గుంపుకు* చెందినవాళ్లు+ వచ్చి నీ కాళ్ల ముందు వంగి నమస్కరించేలా* చేస్తాను. నేను నిన్ను ప్రేమించానని వాళ్లు తెలుసుకునేలా చేస్తాను. 10 నా సహనం గురించి నువ్వు విన్నదాన్ని పాటించావు*+ కాబట్టి, భూమ్మీద ఉన్నవాళ్లను పరీక్షించడానికి భూమంతటి మీదికి రాబోతున్న పరీక్షా సమయంలో* నేను నిన్ను కాపాడతాను. 11 నేను త్వరగా వస్తున్నాను.+ నీ దగ్గర ఉన్నదాన్ని ఎప్పుడూ గట్టిగా పట్టుకో, అప్పుడు నీ కిరీటాన్ని ఎవరూ తీసుకోరు.+

12 “ ‘జయించే వ్యక్తిని నా దేవుని ఆలయంలో స్తంభంగా చేస్తాను. అతను ఇక ఎప్పటికీ అక్కడి నుండి బయటికి వెళ్లడు. నేను అతని మీద నా దేవుని పేరును,+ నా దేవుని నగరం పేరును, అంటే పరలోకంలో నుండి నా దేవుని దగ్గర నుండి దిగివచ్చే కొత్త యెరూషలేము+ పేరును, అలాగే నా కొత్త పేరును రాస్తాను.+ 13 సంఘాలకు పవిత్రశక్తి చెప్తున్న మాటల్ని చెవులు ఉన్నవాడు వినాలి.’

14 “లవొదికయలో+ ఉన్న సంఘ దూతకు ఇలా రాయి: ఆమేన్‌ అనే పేరున్నవాడు,+ నమ్మకమైన సత్యసాక్షి,+ దేవుని మొట్టమొదటి సృష్టి అయినవాడు+ ఈ మాటలు చెప్తున్నాడు: 15 ‘నీ పనులు నాకు తెలుసు. నువ్వు చల్లగా లేవు, వేడిగా లేవు. నువ్వు చల్లగానైనా వేడిగానైనా ఉంటే బావుండేది. 16 నువ్వు వేడిగా+ గానీ చల్లగా+ గానీ లేకుండా గోరువెచ్చగా ఉన్నావు కాబట్టి నిన్ను నా నోట్లో నుండి ఊసివేయబోతున్నాను. 17 నువ్వు, “నేను ధనవంతుణ్ణి,+ ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాను, నాకు ఇంకేమీ అవసరం లేదు” అని చెప్పుకుంటున్నావు. కానీ నువ్వు దుర్భరమైన, దయనీయమైన స్థితిలో ఉన్నావని, పేదవాడివని, గుడ్డివాడివని, దిగంబరంగా ఉన్నావని నీకు తెలీదు. 18 కాబట్టి నేను నీకు ఇచ్చే సలహా ఏమిటంటే, అగ్నిలో శుద్ధి చేసిన బంగారం నా దగ్గర కొనుక్కో; అప్పుడు నువ్వు ధనవంతుడివి అవుతావు. వేసుకోవడానికి తెల్లని వస్త్రాలు నా దగ్గర కొనుక్కో; అప్పుడు, దిగంబరంగా ఉండడంవల్ల ఇతరుల ముందు సిగ్గుపడే పరిస్థితి నీకు రాదు. అలాగే నీ కళ్లకు రాసుకోవడానికి నా దగ్గర కాటుక కొనుక్కో;+ అప్పుడు నువ్వు చూడగలుగుతావు.+

19 “ ‘నేను ప్రేమించే వాళ్లందర్నీ గద్దిస్తాను, వాళ్లకు క్రమశిక్షణ ఇస్తాను. కాబట్టి దేవుని సేవలో నీకు ఉత్సాహం ఉందని చూపించు, పశ్చాత్తాపపడు.+ 20 ఇదిగో! నేను తలుపు దగ్గర నిలబడి తడుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే, నేను అతని ఇంట్లోకి వెళ్లి అతనితో కలిసి రాత్రి భోజనం చేస్తాను; అతను నాతో కలిసి భోజనం చేస్తాడు. 21 నేను జయించి, నా తండ్రితోపాటు ఆయన సింహాసనం మీద కూర్చున్నట్టే,+ జయించిన వ్యక్తిని+ నాతోపాటు నా సింహాసనం మీద కూర్చోనిస్తాను.+ 22 సంఘాలకు పవిత్రశక్తి చెప్తున్న మాటల్ని చెవులు ఉన్నవాడు వినాలి.’ ”

4 ఆ తర్వాత నేను చూసినప్పుడు పరలోకంలో తెరిచివున్న ఒక తలుపు కనిపించింది. నేను మొదట విన్న స్వరం బాకా శబ్దంలా ఉంది. అది నాతో, “ఇక్కడికి ఎక్కి రా, జరగాల్సిన సంగతుల్ని నీకు చూపిస్తాను” అంది. 2 వెంటనే దేవుని పవిత్రశక్తి నా మీదికి వచ్చింది. ఇదిగో, పరలోకంలో ఒక సింహాసనాన్ని చూశాను, దానిమీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.+ 3 ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి రూపం సూర్యకాంతపు రాయిలా,+ కెంపులా* ఉంది. సింహాసనం చుట్టూ మరకతం లాంటి ఇంద్రధనుస్సు ఉంది.+

4 ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. వాటిమీద 24 మంది పెద్దలు+ కూర్చొని ఉండడం చూశాను. వాళ్లు తెల్లని వస్త్రాలు వేసుకొని ఉన్నారు. వాళ్ల తలల మీద బంగారు కిరీటాలు ఉన్నాయి. 5 సింహాసనం నుండి మెరుపులు,+ స్వరాలు, ఉరుములు+ వస్తున్నాయి. సింహాసనం ముందు మండుతున్న ఏడు పెద్ద దీపాలు ఉన్నాయి. అవి దేవుని ఏడు శక్తుల్ని సూచిస్తున్నాయి.+ 6 సింహాసనం ముందు గాజు లాంటి, స్ఫటికం లాంటి సముద్రం+ ఉంది.

మధ్యలో, సింహాసనం ఉన్న చోట,* సింహాసనం చుట్టూ నాలుగు జీవులు+ ఉన్నాయి. వాటి ముందుభాగం, వెనుకభాగం కళ్లతో నిండిపోయాయి. 7 మొదటి జీవి సింహంలా+ ఉంది, రెండో జీవి ఎద్దులా+ ఉంది, మూడో జీవి+ ముఖం మనిషి ముఖంలా ఉంది, నాలుగో జీవి+ ఎగిరే గద్దలా+ ఉంది. 8 ఆ నాలుగు జీవుల్లో ప్రతీ దానికి ఆరు రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కల నిండా కళ్లు ఉన్నాయి.+ ఆ జీవులు రాత్రింబగళ్లు ఇలా అంటూనే ఉన్నాయి: “సర్వశక్తిమంతుడు, ఇప్పుడూ గతంలోనూ ఉన్నవాడు, రాబోతున్నవాడు+ అయిన యెహోవా* దేవుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు.”+

9 సింహాసనం మీద కూర్చున్న, యుగయుగాలు జీవించే దేవునికి+ ఆ జీవులు మహిమ, ఘనత, కృతజ్ఞతలు చెల్లించే ప్రతీసారి 10 ఆ 24 మంది పెద్దలు+ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ముందు మోకరించి యుగయుగాలు జీవించే దేవుణ్ణి ఆరాధిస్తారు. వాళ్లు తమ కిరీటాల్ని ఆ సింహాసనం ముందు వేసి ఇలా అంటారు: 11 “యెహోవా* మా దేవా, నువ్వు అన్నిటినీ సృష్టించావు;+ నీ ఇష్టాన్ని బట్టే అవి ఉనికిలోకి వచ్చాయి, సృష్టించబడ్డాయి. కాబట్టి మహిమ,+ ఘనత,+ శక్తి+ పొందడానికి నువ్వు అర్హుడవు.”

5 ఆ తర్వాత నేను, సింహాసనం మీద కూర్చున్న దేవుని కుడిచేతిలో ఒక గ్రంథపు చుట్ట ఉండడం చూశాను. అది రెండువైపులా* రాయబడి, ఏడు ముద్రలతో గట్టిగా ముద్రించబడి ఉంది. 2 అంతేకాదు, బలంగా ఉన్న ఒక దేవదూతను నేను చూశాను. అతను పెద్ద స్వరంతో, “గ్రంథపు చుట్ట మీదున్న ముద్రలు విప్పి దాన్ని తెరవడానికి ఎవరు అర్హులు?” అన్నాడు. 3 అయితే పరలోకంలో, భూమ్మీద, భూమికింద ఉన్నవాళ్లలో ఏ ఒక్కరూ ఆ గ్రంథపు చుట్టను తెరవలేకపోయారు, దానిలో ఏముందో చూడలేకపోయారు. 4 గ్రంథపు చుట్టను తెరవడానికి, దానిలో ఏముందో చూడడానికి అర్హులైనవాళ్లు ఎవరూ కనిపించకపోయేసరికి నేను చాలా ఏడ్చాను. 5 అయితే ఆ పెద్దల్లో ఒకతను నాతో ఇలా అన్నాడు: “ఏడ్వకు. ఇదిగో! యూదా గోత్రపు సింహం,+ దావీదు వేరు+ అయిన వ్యక్తి జయించాడు+ కాబట్టి గ్రంథపు చుట్టను, దాని ఏడు ముద్రల్ని విప్పడానికి ఆయన అర్హుడు.”

6 సింహాసనానికి దగ్గర్లో,* నాలుగు జీవుల మధ్యలో, ఆ పెద్దల మధ్యలో నేను ఒక గొర్రెపిల్లను+ చూశాను. అది వధించబడినట్టు ఉంది. దానికి ఏడు కొమ్ములు, ఏడు కళ్లు ఉన్నాయి. ఆ ఏడు కళ్లు, భూమంతటి మీదికి పంపించబడిన దేవుని ఏడు శక్తుల్ని సూచిస్తున్నాయి. 7 ఆయన* వెంటనే ముందుకొచ్చి, సింహాసనం మీద కూర్చున్న దేవుని+ కుడిచేతిలో నుండి ఆ గ్రంథపు చుట్టను తీసుకున్నాడు. 8 ఆయన గ్రంథపు చుట్టను తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులు, 24 మంది పెద్దలు+ గొర్రెపిల్ల ముందు మోకరించారు. ఆ పెద్దలలో ప్రతీ ఒక్కరి దగ్గర ఒక వీణ,* ధూపంతో నిండిన ఒక బంగారు గిన్నె ఉన్నాయి. (ఆ ధూపం పవిత్రుల ప్రార్థనల్ని సూచిస్తుంది.)+ 9 వాళ్లు ఒక కొత్త పాట పాడుతూ+ ఇలా అన్నారు: “గ్రంథపు చుట్టను తీసుకొని దాని ముద్రలు విప్పడానికి నువ్వు అర్హుడివి. ఎందుకంటే నువ్వు వధించబడి, నీ రక్తంతో ప్రతీ తెగకు, భాషకు, జాతికి, దేశానికి చెందినవాళ్లలో నుండి దేవుని కోసం ప్రజల్ని కొన్నావు;+ 10 మన దేవుణ్ణి సేవించడానికి వాళ్లను ఒక రాజ్యంగా,+ యాజకులుగా+ చేశావు. వాళ్లు రాజులుగా ఈ భూమిని పరిపాలిస్తారు.”+

11 నేను సింహాసనం చుట్టూ, ఆ జీవుల చుట్టూ, పెద్దల చుట్టూ ఎంతోమంది దేవదూతలు ఉండడం చూశాను, వాళ్ల స్వరం విన్నాను. ఆ దేవదూతల సంఖ్య లక్షల్లో-కోట్లలో ఉంది.+ 12 వాళ్లు పెద్ద స్వరంతో ఇలా అంటూ ఉన్నారు: “వధించబడిన గొర్రెపిల్ల+ శక్తిని, ఐశ్వర్యాన్ని, తెలివిని, బలాన్ని, ఘనతను, మహిమను, స్తుతిని పొందడానికి అర్హుడు.”+

13 పరలోకంలో, భూమ్మీద, భూమికింద, సముద్రం మీద ఉన్న ప్రతీ ప్రాణి,+ అవును వాటిలో ఉన్నవన్నీ, “సింహాసనం మీద కూర్చున్న దేవునికి, గొర్రెపిల్లకు+ యుగయుగాలు స్తుతి, ఘనత,+ మహిమ, శక్తి కలగాలి” అని అనడం నేను విన్నాను. 14 ఆ నాలుగు జీవులు, “ఆమేన్‌!” అంటూ ఉండగా ఆ పెద్దలు మోకరించి దేవుణ్ణి ఆరాధించారు.

6 గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రల్లో+ ఒకదాన్ని విప్పడం నేను చూశాను. అప్పుడు నాలుగు జీవుల్లో+ ఒక జీవి ఉరుము లాంటి స్వరంతో, “రా!” అని చెప్పడం విన్నాను. 2 నేను చూసినప్పుడు ఇదిగో, ఒక తెల్లని గుర్రం+ కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి దగ్గర ఒక విల్లు ఉంది. ఆయనకు ఒక కిరీటం ఇవ్వబడింది.+ ఆయన జయిస్తూ తన విజయాన్ని పూర్తి చేయడానికి బయల్దేరాడు.+

3 ఆయన రెండో ముద్ర విప్పినప్పుడు రెండో జీవి, “రా!” అని చెప్పడం విన్నాను. 4 అప్పుడు ఎర్రగా ఉన్న ఇంకో గుర్రం వచ్చింది. దానిమీద కూర్చున్న వ్యక్తికి భూమ్మీద శాంతి లేకుండా చేసేందుకు అనుమతి ఇవ్వబడింది. ప్రజలు ఒకరినొకరు చంపుకోవాలనే ఉద్దేశంతో అలా అనుమతి ఇవ్వబడింది. అంతేకాదు అతనికి ఒక పెద్ద ఖడ్గం+ ఇవ్వబడింది.

5 ఆయన మూడో ముద్ర విప్పినప్పుడు+ మూడో జీవి,+ “రా!” అని చెప్పడం విన్నాను. నేను చూసినప్పుడు ఇదిగో, ఒక నల్లని గుర్రం కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి చేతిలో ఒక త్రాసు ఉంది. 6 ఆ నాలుగు జీవుల మధ్యలో ఒక స్వరం ఇలా అనడం విన్నాను: “దేనారానికి* ఒక కిలో* గోధుమలు,+ దేనారానికి మూడు కిలోల* బార్లీ; ఒలీవ నూనెను, ద్రాక్షారసాన్ని పాడుచేయొద్దు.”+

7 ఆయన నాలుగో ముద్ర విప్పినప్పుడు నాలుగో జీవి,+ “రా!” అని చెప్పడం విన్నాను. 8 నేను చూసినప్పుడు ఇదిగో, పాలిపోయిన ఒక గుర్రం కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తికి “మరణం” అనే పేరు ఉంది. సమాధి* అతని వెనకాలే వెళ్తూ ఉంది. ఖడ్గంతో, ఆహారకొరతతో,+ ప్రాణాంతకమైన జబ్బుతో, క్రూరమృగాలతో ప్రజల్ని చంపేలా భూమి నాల్గవ భాగం మీద వాళ్లకు అధికారం ఇవ్వబడింది.+

9 ఆయన ఐదో ముద్ర విప్పినప్పుడు, దేవుని వాక్యాన్ని పాటించడం వల్ల, తాము ఇచ్చిన సాక్ష్యం వల్ల+ వధించబడినవాళ్ల రక్తాన్ని*+ బలిపీఠం కింద+ చూశాను. 10 ఆ రక్తం పెద్ద స్వరంతో ఇలా అరిచింది: “సర్వోన్నత ప్రభువా, పవిత్రుడా, సత్యవంతుడా,+ భూమ్మీద జీవిస్తున్నవాళ్లకు ఎప్పుడు తీర్పుతీరుస్తావు? మా రక్తం చిందించినందుకు వాళ్ల మీద ఎప్పుడు పగతీర్చుకుంటావు?”+ 11 వధించబడిన వాళ్లలో ప్రతీ ఒక్కరికి ఒక తెల్లని వస్త్రం ఇవ్వబడింది.+ ఇంకొంతకాలం పాటు వేచివుండమని, అంటే వాళ్లలాగే చంపబడబోతున్న+ తోటి దాసుల, సహోదరుల సంఖ్య పూర్తయ్యేవరకు వేచివుండమని వాళ్లకు చెప్పబడింది.

12 ఆయన ఆరో ముద్ర విప్పడం నేను చూశాను, అప్పుడు ఒక పెద్ద భూకంపం వచ్చింది. సూర్యుడు వెంట్రుకలతో* చేసిన గోనెపట్టలా నల్లగా అయ్యాడు; చంద్రుడు రక్తంలా ఎర్రగా అయ్యాడు;+ 13 ఆకాశంలోని నక్షత్రాలు, పెద్ద గాలికి ఊగుతున్న అంజూర చెట్టు నుండి కాయలు రాలినట్టు భూమ్మీద రాలాయి. 14 ఆకాశం గ్రంథపు చుట్టలా చుట్టుకొని+ కనుమరుగైపోయింది. ప్రతీ పర్వతం, ప్రతీ ద్వీపం వాటివాటి స్థానాల నుండి తొలగిపోయాయి.+ 15 తర్వాత భూరాజులు, ఉన్నతాధికారులు, సహస్రాధిపతులు,* ధనవంతులు, బలవంతులు, ప్రతీ దాసుడు, ప్రతీ స్వతంత్రుడు గుహల్లో, కొండల్లోని బండల మధ్య దాక్కున్నారు.+ 16 పర్వతాలతో, బండలతో వాళ్లిలా అంటూ ఉన్నారు: “మా మీద పడండి.+ సింహాసనం మీద కూర్చున్న దేవుని+ నుండి, గొర్రెపిల్ల+ ఆగ్రహం నుండి మమ్మల్ని దాచేయండి. 17 ఎందుకంటే వాళ్లు ఆగ్రహం చూపించే మహారోజు వచ్చేసింది,+ దాన్ని ఎవరు తట్టుకోగలరు?”+

7 ఆ తర్వాత, నలుగురు దేవదూతలు భూమి నాలుగు మూలల్లో నిలబడి ఉండడం నేను చూశాను. భూమ్మీద గానీ, సముద్రంమీద గానీ, ఏ చెట్టుమీద గానీ గాలి అనేదే వీచకుండా వాళ్లు భూమి నాలుగు గాలుల్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు. 2 అప్పుడు తూర్పు* నుండి ఇంకో దేవదూత పైకి రావడం నేను చూశాను. అతను జీవంగల దేవుని ముద్ర పట్టుకొని ఉన్నాడు. భూమికి, సముద్రానికి హాని చేసేందుకు అనుమతి పొందిన నలుగురు దేవదూతలతో ఆ దేవదూత బిగ్గరగా 3 ఇలా అన్నాడు: “మన దేవుని దాసుల నొసళ్ల మీద మేము ముద్ర వేసే+ వరకు భూమికి గానీ, సముద్రానికి గానీ, చెట్లకు గానీ హాని చేయొద్దు.”+

4 ముద్రించబడిన వాళ్ల సంఖ్య నేను విన్నాను. ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిట్లో+ ముద్రించబడిన వాళ్ల సంఖ్య 1,44,000.+

5 యూదా గోత్రంలో ముద్రించబడిన వాళ్లు 12,000 మంది;

రూబేను గోత్రంలో 12,000 మంది;

గాదు గోత్రంలో 12,000 మంది;

6 ఆషేరు గోత్రంలో 12,000 మంది;

నఫ్తాలి గోత్రంలో 12,000 మంది;

మనష్షే+ గోత్రంలో 12,000 మంది;

7 షిమ్యోను గోత్రంలో 12,000 మంది;

లేవి గోత్రంలో 12,000 మంది;

ఇశ్శాఖారు గోత్రంలో 12,000 మంది;

8 జెబూలూను గోత్రంలో 12,000 మంది;

యోసేపు గోత్రంలో 12,000 మంది;

బెన్యామీను గోత్రంలో 12,000 మంది;

9 ఆ తర్వాత నేను చూసినప్పుడు, ఇదిగో! ఏ మనిషీ లెక్కపెట్టలేని ఒక గొప్పసమూహం కనిపించింది. వాళ్లు అన్నిదేశాల నుండి, గోత్రాల నుండి, జాతుల నుండి, భాషల+ నుండి వచ్చారు. వాళ్లు తెల్లని వస్త్రాలు వేసుకొని ఆ సింహాసనం ముందు, గొర్రెపిల్ల ముందు నిలబడి ఉన్నారు. వాళ్ల చేతుల్లో ఖర్జూర మట్టలు+ ఉన్నాయి. 10 వాళ్లు పెద్ద స్వరంతో ఇలా అంటూ ఉన్నారు: “సింహాసనం మీద కూర్చున్న మన దేవుని నుండి, గొర్రెపిల్ల నుండి మా రక్షణ వస్తుంది.”+

11 దేవదూతలందరూ ఆ సింహాసనం చుట్టూ, పెద్దల+ చుట్టూ, నాలుగు జీవుల చుట్టూ నిలబడి ఉన్నారు. ఆ దేవదూతలు సింహాసనం ముందు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తూ 12 ఇలా అన్నారు: “ఆమేన్‌! యుగయుగాలు మన దేవునికి స్తుతి, మహిమ, తెలివి, కృతజ్ఞతలు, ఘనత, శక్తి, బలం చెందాలి.+ ఆమేన్‌.”

13 అప్పుడు ఆ పెద్దల్లో ఒకతను, “తెల్లని వస్త్రాలు వేసుకున్న వీళ్లు+ ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు?” అని నన్ను అడిగాడు. 14 వెంటనే నేను అతనితో, “నా ప్రభువా, అది నీకే తెలుసు” అన్నాను. అప్పుడతను నాతో ఇలా అన్నాడు: “వీళ్లు మహాశ్రమను+ దాటి వచ్చేవాళ్లు. వీళ్లు గొర్రెపిల్ల రక్తంలో+ తమ వస్త్రాలు ఉతుక్కొని వాటిని తెల్లగా చేసుకున్నారు. 15 అందుకే వీళ్లు దేవుని సింహాసనం ముందు ఉన్నారు, దేవుని ఆలయంలో రాత్రింబగళ్లు ఆయనకు పవిత్రసేవ చేస్తున్నారు. సింహాసనం మీద కూర్చున్న దేవుడు+ వాళ్లమీద తన డేరా కప్పుతాడు.*+ 16 ఇప్పటినుండి వాళ్లకు ఆకలి వేయదు, దాహం వేయదు; ఎండదెబ్బ గానీ వడగాలి గానీ వాళ్లకు తగలదు.+ 17 ఎందుకంటే సింహాసనం పక్కన* ఉన్న గొర్రెపిల్ల+ వాళ్లను కాపరిలా చూసుకుంటూ,+ జీవజలాల ఊటల* దగ్గరికి నడిపిస్తాడు.+ దేవుడు వాళ్ల కళ్ల నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును తుడిచేస్తాడు.”+

8 ఆయన+ ఏడో ముద్ర విప్పినప్పుడు,+ పరలోకంలో సుమారు అరగంటసేపు నిశ్శబ్దం అలుముకుంది. 2 అప్పుడు, దేవుని ముందు నిలబడి ఉండే ఏడుగురు దేవదూతల్ని+ నేను చూశాను, దేవుడు వాళ్లకు ఏడు బాకాలు ఇచ్చాడు.

3 బంగారు ధూపపాత్ర పట్టుకొని ఉన్న ఇంకొక దేవదూత వచ్చి బలిపీఠం+ దగ్గర నిలబడ్డాడు. పవిత్రులందరూ ప్రార్థనలు చేస్తున్నప్పుడు సింహాసనం ముందున్న బంగారు బలిపీఠం+ మీద అర్పించడానికి ఆ దూతకు పెద్ద మొత్తంలో ధూపద్రవ్యం+ ఇవ్వబడింది. 4 పవిత్రుల ప్రార్థనలతో పాటు దేవదూత చేతిలో నుండి ధూపం పొగ పైకి లేచి+ దేవుని సన్నిధికి చేరింది. 5 అయితే ఆ దూత వెంటనే ధూపపాత్రను తీసుకొని, బలిపీఠం మీదున్న నిప్పుల్లో కొన్నిటితో దాన్ని నింపి భూమ్మీద పడేశాడు. దానివల్ల ఉరుములు, మెరుపులు,+ భూకంపం వచ్చాయి; స్వరాలు వినిపించాయి. 6 ఏడు బాకాలు+ పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలు వాటిని ఊదడానికి సిద్ధమయ్యారు.

7 మొదటి దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు రక్తంతో కలిసిన వడగండ్లు, అగ్ని భూమ్మీద కురిశాయి.+ దానివల్ల భూమిలో మూడోభాగం, చెట్లలో మూడోభాగం కాలిపోయింది; పచ్చని మొక్కలన్నీ కాలిపోయాయి.+

8 రెండో దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు అగ్నితో మండుతున్న పెద్ద పర్వతం లాంటిది సముద్రంలో పడేయబడింది.+ దాంతో సముద్రంలో మూడోభాగం రక్తంగా మారిపోయింది.+ 9 దానివల్ల సముద్ర జీవుల్లో మూడోభాగం చనిపోయాయి,+ ఓడల్లో మూడోభాగం నాశనమయ్యాయి.

10 మూడో దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు, దీపంలా మండుతున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలింది. అది నదుల్లో మూడోభాగం మీద, నీటి ఊటల* మీద పడింది.+ 11 ఆ నక్షత్రం పేరు మాచిపత్రి.* దానివల్ల నీళ్లలో మూడోభాగం చేదుగా మారిపోయాయి. నీళ్లు చేదుగా+ మారడంవల్ల చాలామంది చనిపోయారు.

12 నాలుగో దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు సూర్యుడిలో,+ చంద్రుడిలో, నక్షత్రాల్లో మూడోభాగం చీకటిగా చేయబడ్డాయి.+ దానివల్ల పగటిలో మూడోభాగం, రాత్రిలో మూడోభాగం వెలుగు లేకుండా పోయింది.

13 నేను చూసినప్పుడు ఆకాశం మధ్యలో ఎగురుతున్న ఒక గద్ద కనిపించింది. అది పెద్ద స్వరంతో ఇలా అనడం విన్నాను: “బాకాలు ఊదడానికి సిద్ధంగా ఉన్న మిగతా ముగ్గురు దేవదూతలు తమ బాకాలు ఊదినప్పుడు+ భూమ్మీద జీవించేవాళ్లకు పెద్దపెద్ద కష్టాలు వస్తాయి!”+

9 ఐదో దేవదూత తన బాకా ఊదాడు.+ అప్పుడు ఆకాశం నుండి ఒక నక్షత్రం భూమ్మీదికి రాలడం చూశాను; అగాధపు తాళంచెవి+ ఆయనకు ఇవ్వబడింది. 2 ఆయన అగాధాన్ని తెరిచాడు. అప్పుడు పెద్ద కొలిమిలో నుండి పొగ లేచినట్టు దానిలో నుండి పొగ పైకి లేచింది. ఆ పొగ వల్ల సూర్యుడు, గాలి చీకటిమయం అయ్యాయి.+ 3 ఆ పొగలో నుండి మిడతలు బయల్దేరాయి, అవి భూమ్మీదికి వచ్చాయి.+ భూమ్మీది తేళ్లకు ఉన్న శక్తినే దేవుడు వాటికి ఇచ్చాడు. 4 నొసళ్ల మీద దేవుని ముద్రలేని ప్రజలకు తప్ప పచ్చగడ్డికి గానీ, మొక్కకు గానీ, చెట్టుకు గానీ హాని చేయవద్దని వాటికి చెప్పబడింది.+

5 ఐదు నెలలపాటు వాళ్లను హింసించే అధికారం ఆ మిడతలకు ఇవ్వబడింది కానీ చంపే అధికారం ఇవ్వబడలేదు. వాటివల్ల కలిగిన బాధ, తేలు+ కుట్టినప్పుడు కలిగే బాధలా ఉంది. 6 ఆ రోజుల్లో ప్రజలు చావు కోసం వెతుకుతారు కానీ అది వాళ్లకు అస్సలు దొరకదు. వాళ్లు చనిపోవాలని ఎంతో కోరుకుంటారు కానీ చావు వాళ్ల నుండి పారిపోతుంది.

7 ఆ మిడతలు చూడడానికి యుద్ధానికి సిద్ధంగా ఉన్న గుర్రాల్లా ఉన్నాయి.+ వాటి తలల మీద బంగారు కిరీటాల లాంటివి ఉన్నాయి. వాటి ముఖాలు మనుషుల ముఖాల్లా ఉన్నాయి. 8 కానీ వాటి వెంట్రుకలు స్త్రీల తలవెంట్రుకల్లా ఉన్నాయి. వాటి పళ్లు సింహపు కోరల్లా ఉన్నాయి.+ 9 వాటికి ఇనుప కవచాల* లాంటి ఛాతి కవచాలు ఉన్నాయి. వాటి రెక్కల శబ్దం యుద్ధానికి పరుగులు తీస్తున్న గుర్రపురథాల శబ్దంలా ఉంది.+ 10 అంతేకాదు, వాటికి తోకలు ఉన్నాయి. ఆ తోకలకు తేలు కొండి లాంటి కొండ్లు ఉన్నాయి. ఐదు నెలలపాటు ప్రజల్ని బాధించే శక్తి వాటి తోకల్లోనే ఉంది.+ 11 అగాధపు దూత+ వాటికి రాజు. హీబ్రూ భాషలో ఆయన పేరు అబద్దోను.* అయితే, గ్రీకు భాషలో ఆయన పేరు అపొల్లుయోను.*

12 ఒక కష్టం పోయింది. ఇదిగో! ఇంకో రెండు కష్టాలు+ వస్తున్నాయి.

13 ఆరో దేవదూత+ తన బాకా ఊదాడు.+ అప్పుడు, దేవుని ముందున్న బంగారు బలిపీఠం+ కొమ్ముల నుండి ఒక స్వరం నాకు వినిపించింది. 14 బాకా పట్టుకొని ఉన్న ఆరో దూతతో ఆ స్వరం ఇలా చెప్పింది: “యూఫ్రటీసు మహానది+ దగ్గర బంధించబడివున్న నలుగురు దేవదూతల్ని విడిపించు.” 15 అప్పుడు ఆ గంట కోసం, ఆ రోజు కోసం, ఆ నెల కోసం, ఆ సంవత్సరం కోసం సిద్ధం చేయబడిన ఆ నలుగురు దేవదూతలు విడిపించబడ్డారు. ప్రజల్లో మూడోభాగాన్ని చంపడానికి వాళ్లు అలా విడిపించబడ్డారు.

16 గుర్రపు దండ్లలోని రౌతుల సంఖ్య 20 కోట్లు అని నేను విన్నాను. 17 దర్శనంలోని గుర్రాలు, వాటిమీద కూర్చున్న రౌతులు నాకు ఇలా కనిపించారు: వాళ్లకు నిప్పు లాంటి ఎర్రని రంగులో, ముదురు నీలం రంగులో, పసుపుపచ్చ రంగులో ఉన్న ఛాతి కవచాలు ఉన్నాయి. ఆ గుర్రాల తలలు సింహాల తలల్లా ఉన్నాయి.+ వాటి నోళ్లలో నుండి అగ్ని, పొగ, గంధకం బయటికి వచ్చాయి. 18 ఈ మూడు తెగుళ్ల వల్ల, అంటే వాటి నోళ్లలో నుండి బయటికి వచ్చిన అగ్ని వల్ల, పొగ వల్ల, గంధకం వల్ల ప్రజల్లో మూడోభాగం చంపబడ్డారు. 19 ఎందుకంటే ఆ గుర్రాల శక్తి వాటి నోళ్లలో, వాటి తోకల్లో ఉంది. వాటి తోకలు పాముల్లా ఉన్నాయి, వాటికి తలలు ఉన్నాయి. ఆ తోకలతో అవి హాని చేస్తాయి.

20 అయితే ఈ తెగుళ్ల వల్ల చనిపోని మిగతా ప్రజలు తమ చేతులతో చేసిన పనుల విషయంలో పశ్చాత్తాపపడలేదు. వాళ్లు చెడ్డదూతల్ని,* విగ్రహాల్ని పూజించడం మానలేదు. బంగారంతో, వెండితో, రాగితో, రాయితో, చెక్కతో చేసిన ఆ విగ్రహాలు చూడలేవు, వినలేవు, నడవలేవు.+ 21 అంతేకాదు, ఆ ప్రజలు తాము చేసిన హత్యల విషయంలో గానీ, మంత్రతంత్రాల విషయంలో గానీ, లైంగిక పాపం* విషయంలో గానీ, దొంగతనాల విషయంలో గానీ పశ్చాత్తాపపడలేదు.

10 అప్పుడు, బలంగా ఉన్న ఇంకో దేవదూత పరలోకం నుండి దిగిరావడం నేను చూశాను. ఆయన మేఘాన్ని ధరించి ఉన్నాడు; ఆయన తలమీద ఇంద్రధనుస్సు ఉంది; ఆయన ముఖం సూర్యునిలా ఉంది;+ ఆయన కాళ్లు* అగ్నిస్తంభాల్లా ఉన్నాయి; 2 ఆయన చేతిలో తెరిచివున్న చిన్న గ్రంథపు చుట్ట ఉంది. ఆయన తన కుడి పాదాన్ని సముద్రంమీద, ఎడమ పాదాన్ని భూమ్మీద పెట్టి, 3 సింహం గర్జించినట్టు పెద్ద స్వరంతో అరిచాడు.+ ఆయన అరిచినప్పుడు, ఏడు ఉరుములు+ మాట్లాడాయి.

4 ఆ ఏడు ఉరుములు మాట్లాడినప్పుడు నేను ఆ మాటలు రాయబోయాను. అయితే పరలోకం నుండి ఒక స్వరం+ ఇలా చెప్పడం విన్నాను: “ఆ ఏడు ఉరుములు చెప్పిన వాటిని రహస్యంగా ఉంచు, వాటిని రాయొద్దు.” 5 సముద్రంమీద, భూమ్మీద నిలబడివున్నట్టు నేను చూసిన ఆ దేవదూత తన కుడిచేతిని పరలోకం వైపు ఎత్తి, 6 యుగయుగాలు జీవించే దేవుని+ పేరున అంటే ఆకాశాన్ని, అందులో ఉన్నవాటిని; భూమిని, అందులో ఉన్నవాటిని; సముద్రాన్ని, అందులో ఉన్నవాటిని సృష్టించిన దేవుని+ పేరున ఒట్టేసి ఇలా అన్నాడు: “ఇక ఏమాత్రం ఆలస్యం ఉండదు. 7 దేవుడు తన దాసులైన ప్రవక్తలకు మంచివార్తగా ప్రకటించిన+ పవిత్ర రహస్యం,+ ఏడో దేవదూత+ తన బాకా ఊదబోతున్న+ రోజుల్లో తప్పకుండా ముగింపుకు వస్తుంది.”

8 పరలోకం నుండి వచ్చిన ఆ స్వరం+ మళ్లీ నాతో మాట్లాడుతూ ఇలా చెప్పడం విన్నాను: “నువ్వు వెళ్లి సముద్రంమీద, భూమ్మీద నిలబడిన దేవదూత చేతిలోని తెరిచివున్న గ్రంథపు చుట్టను తీసుకో.”+ 9 నేను ఆ దేవదూత దగ్గరికి వెళ్లి, ఆ చిన్న గ్రంథపు చుట్టను నాకు ఇవ్వమని అడిగాను. అప్పుడు ఆ దేవదూత నాతో ఇలా అన్నాడు: “దీన్ని తీసుకొని తిను,+ ఇది నీ కడుపుకు చేదుగా ఉంటుంది, కానీ నీ నోటికి మాత్రం తేనెలా తియ్యగా ఉంటుంది.” 10 నేను ఆ దేవదూత చేతిలో నుండి ఆ చిన్న గ్రంథపు చుట్టను తీసుకొని తిన్నాను.+ అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది,+ కానీ దాన్ని తిన్నప్పుడు నా కడుపు చేదు అయింది. 11 తర్వాత నేను ఈ మాటలు విన్నాను: “నువ్వు జాతుల గురించి, దేశాల గురించి, భాషల గురించి, చాలామంది రాజుల గురించి మళ్లీ ప్రవచించాలి.”

11 ఆయన నాతో ఈ మాటలు అంటున్నప్పుడు, కొలవడానికి నాకొక రెల్లుకర్ర*+ ఇవ్వబడింది: “నువ్వు లేచి దేవుని ఆలయాన్ని, బలిపీఠాన్ని కొలువు; అందులో ఆరాధించేవాళ్లను లెక్కపెట్టు. 2 అయితే ఆలయం బయట ఉన్న ప్రాంగణాన్ని పూర్తిగా వదిలేయి, దాన్ని కొలవద్దు. ఎందుకంటే అది అన్యజనులకు ఇవ్వబడింది, వాళ్లు పవిత్ర నగరాన్ని+ 42 నెలల పాటు+ కాళ్లతో తొక్కుతారు. 3 నేను నా ఇద్దరు సాక్షుల్ని పంపిస్తాను, వాళ్లు గోనెపట్ట కట్టుకొని 1,260 రోజులు ప్రవచిస్తారు.” 4 ఆ ఇద్దరు సాక్షులు రెండు ఒలీవ చెట్లను,+ రెండు దీపస్తంభాల్ని+ సూచిస్తున్నారు, వాళ్లు భూమికి ప్రభువైన వ్యక్తి ముందు నిలబడి ఉన్నారు.+

5 ఎవరైనా ఆ ఇద్దరు సాక్షులకు హాని చేయాలనుకుంటే, వాళ్ల నోళ్లలో నుండి అగ్ని వచ్చి ఆ శత్రువుల్ని కాల్చేస్తుంది. వాళ్లకు హాని చేయాలని ఎవరైనా అనుకుంటే, అతను ఈ విధంగా చంపబడాలి. 6 వాళ్లు ప్రవచిస్తున్న రోజుల్లో అసలు వర్షమే పడకుండా+ ఆకాశాన్ని* మూసివేసే శక్తి+ వాళ్లకు ఉంది. అంతేకాదు, నీళ్లను రక్తంగా మార్చే+ శక్తి, తాము అనుకున్నప్పుడల్లా భూమ్మీదికి రకరకాల తెగుళ్లను రప్పించే శక్తి వాళ్లకు ఉంది.

7 ఆ ఇద్దరు సాక్షులు సాక్ష్యమివ్వడం పూర్తయినప్పుడు, అగాధం నుండి పైకి వచ్చిన క్రూరమృగం వాళ్లతో యుద్ధం చేసి వాళ్లను జయిస్తుంది, వాళ్లను చంపుతుంది.+ 8 వాళ్ల శవాలు మహానగర ప్రధాన వీధిలో పడివుంటాయి. ఆ నగరానికి అలంకారికంగా సొదొమ, ఐగుప్తు* అనే పేర్లు ఉన్నాయి. వాళ్ల ప్రభువు కూడా అక్కడే కొయ్య మీద మరణశిక్ష పొందాడు. 9 వేర్వేరు జాతులకు, తెగలకు, భాషలకు, దేశాలకు చెందిన ప్రజలు ఆ శవాల్ని మూడున్నర రోజుల పాటు+ చూస్తారు; వాళ్లు వాటిని పాతిపెట్టనివ్వరు. 10 ఆ ఇద్దరు ప్రవక్తలు తమ సందేశంతో భూమ్మీదున్న ప్రజలకు వేదన కలిగించారు కాబట్టి వాళ్లు చనిపోయినందుకు ప్రజలు సంతోషంతో వేడుకలు జరుపుకుంటారు, ఒకరికొకరు బహుమతులు పంపుకుంటారు.

11 ఆ మూడున్నర రోజుల తర్వాత, దేవుని దగ్గర నుండి జీవశక్తి వచ్చి ఆ ఇద్దరిలోకి ప్రవేశించింది.+ దాంతో వాళ్లు లేచి నిలబడ్డారు, వాళ్లను చూసిన ప్రజలు ఎంతో భయపడ్డారు. 12 ఆకాశం నుండి ఒక పెద్ద స్వరం, “ఇక్కడికి పైకి రండి” అని తమతో చెప్పడం వాళ్లు విన్నారు. కాబట్టి వాళ్లు మేఘంలో ఆకాశానికి వెళ్లారు, వాళ్ల శత్రువులు వాళ్లను చూశారు.* 13 ఆ క్షణమే* పెద్ద భూకంపం వచ్చింది, దానివల్ల ఆ నగరంలో పదోభాగం కూలిపోయింది. భూకంపం వల్ల 7,000 మంది చనిపోయారు. మిగిలినవాళ్లు చాలా భయపడిపోయి, పరలోకంలో ఉన్న దేవుణ్ణి మహిమపర్చారు.

14 రెండో కష్టం+ పోయింది. ఇదిగో! మూడో కష్టం త్వరగా వస్తోంది.

15 ఏడో దేవదూత తన బాకా ఊదాడు.+ అప్పుడు పరలోకంలో పెద్ద స్వరాలు ఇలా చెప్పాయి: “ఈ లోక రాజ్యం మన దేవునిది,+ ఆయన క్రీస్తుది+ అయింది. దేవుడు యుగయుగాలు రాజుగా పరిపాలిస్తాడు.”+

16 అప్పుడు, దేవుని ముందు తమ సింహాసనాల్లో కూర్చొని ఉన్న ఆ 24 మంది పెద్దలు+ సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తూ 17 ఇలా అన్నారు: “యెహోవా* దేవా, సర్వశక్తిమంతుడా, ఇప్పుడూ+ గతంలోనూ ఉన్నవాడా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే, నీ గొప్ప శక్తిని ఉపయోగించి నువ్వు రాజుగా పరిపాలించడం మొదలుపెట్టావు.+ 18 దేశాలు ఆగ్రహించినందువల్ల నీకు ఆగ్రహం వచ్చింది. చనిపోయినవాళ్లు తీర్పుపొందడానికి; నీ దాసులైన ప్రవక్తలకు,+ పవిత్రులకు, సామాన్యులే గానీ గొప్పవాళ్లే గానీ నీ పేరుకు భయపడేవాళ్లకు ప్రతిఫలం ఇవ్వడానికి;+ భూమిని నాశనం చేస్తున్న వాళ్లను నాశనం చేయడానికి+ నిర్ణయించిన సమయం వచ్చింది.”

19 తర్వాత, పరలోకంలో ఉన్న దేవుని ఆలయం* తెరవబడింది. అక్కడున్న ఒప్పంద* మందసం* నాకు కనిపించింది.+ అప్పుడు మెరుపులు, ఉరుములు, భూకంపం, పెద్ద వడగండ్ల వర్షం వచ్చాయి; స్వరాలు వినిపించాయి.

12 ఆ తర్వాత పరలోకంలో ఒక గొప్ప సూచన కనిపించింది. ఒక స్త్రీ+ సూర్యుణ్ణి ధరించి ఉంది, ఆమె పాదాల కింద చంద్రుడు ఉన్నాడు, ఆమె తల మీద 12 నక్షత్రాల కిరీటం ఉంది. 2 ఆమె గర్భవతి. బిడ్డను కనే సమయం దగ్గరపడడంతో ఆమె పురిటినొప్పుల వల్ల కేకలు పెడుతోంది.

3 పరలోకంలో ఇంకొక సూచన కనిపించింది. ఇదిగో! ఏడు తలలు, పది కొమ్ములు ఉన్న ఎర్రని మహాసర్పం+ కనిపించింది. దాని తలల మీద ఏడు కిరీటాలు ఉన్నాయి. 4 దాని తోక ఆకాశ నక్షత్రాల్లో+ మూడో భాగాన్ని ఈడ్చి భూమ్మీద పడేసింది.+ ఆ స్త్రీ బిడ్డను కనగానే ఆ బిడ్డను మింగేయాలని మహాసర్పం ఆమె ముందు అలాగే నిలబడి ఉంది.

5 ఆ స్త్రీ ఒక మగబిడ్డను+ కన్నది. ఆయన ఇనుప దండంతో అన్నిదేశాల్ని పరిపాలిస్తాడు.+ వెంటనే ఆ బిడ్డను సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుని దగ్గరికి తీసుకెళ్లారు. 6 అప్పుడు ఆ స్త్రీ ఎడారికి* పారిపోయింది. అక్కడ దేవుడు ఆమె కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేశాడు. అక్కడ ఆమె 1,260 రోజులు పోషించబడుతుంది.+

7 అప్పుడు పరలోకంలో యుద్ధం మొదలైంది. మిఖాయేలు,*+ ఆయన దూతలు మహాసర్పంతో యుద్ధం చేశారు. మహాసర్పం, దాని దూతలు కూడా యుద్ధం చేశారు 8 కానీ ఓడిపోయారు.* కాబట్టి పరలోకంలో వాళ్లకు ఇక స్థలం లేకుండా పోయింది. 9 దాంతో ఆ మహాసర్పం కిందికి పడేయబడింది. అది మొదటి సర్పం.+ దానికి అపవాది,+ సాతాను+ అనే పేర్లు ఉన్నాయి. అతను లోకమంతటినీ మోసం చేస్తున్నాడు.+ అతను భూమ్మీద పడేయబడ్డాడు,+ అతని దూతలు కూడా అతనితోపాటు పడేయబడ్డారు. 10 అప్పుడు పరలోకంలో ఒక పెద్ద స్వరం ఇలా చెప్పడం నేను విన్నాను:

“ఇప్పుడు రక్షణ,+ శక్తి, రాజ్యం మన దేవునివి అయ్యాయి. అధికారం ఆయన క్రీస్తుకు వచ్చింది. ఎందుకంటే, మన దేవుని ముందు రాత్రింబగళ్లు మన సహోదరుల్ని నిందించేవాడు+ కిందికి పడేయబడ్డాడు! 11 వాళ్లు గొర్రెపిల్ల రక్తం వల్ల, తాము ప్రకటించిన సందేశం వల్ల+ అతన్ని జయించారు.+ చనిపోవాల్సి వచ్చినా వాళ్లు తమ ప్రాణాల్ని* లెక్కచేయలేదు.+ 12 కాబట్టి పరలోకమా, పరలోక నివాసులారా, సంతోషించండి! అయితే భూమీ, సముద్రమా, మీకు శ్రమ.+ ఎందుకంటే అపవాది తనకు కొంచెం సమయమే ఉందని తెలిసి+ చాలా కోపంతో మీ దగ్గరికి దిగివచ్చాడు.”

13 ఆ మహాసర్పం తాను భూమ్మీదికి పడేయబడ్డానని+ తెలుసుకున్నప్పుడు, మగబిడ్డను కన్న స్త్రీని+ హింసించింది. 14 అయితే ఆ స్త్రీ ఎడారిలో ఉన్న తన స్థలానికి ఎగిరిపోయేలా, పెద్ద గద్దరెక్కలు+ రెండు ఆమెకు ఇవ్వబడ్డాయి. అక్కడ సర్పానికి+ దూరంగా ఆమె ఒక కాలం, రెండు కాలాలు, అర్ధ కాలం*+ పోషించబడాలి.

15 సర్పం ఆ స్త్రీని ముంచేయాలని తన నోటితో ఆమె వెనక నీళ్లను నదిలా వెళ్లగక్కింది. 16 అయితే భూమి ఆమెకు సహాయం చేసింది. భూమి నోరు తెరిచి, మహాసర్పం తన నోటితో వెళ్లగక్కిన నదిని మింగేసింది. 17 దాంతో మహాసర్పానికి ఆ స్త్రీ మీద చాలా కోపం వచ్చింది. కాబట్టి దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ యేసు గురించి సాక్ష్యమివ్వడానికి+ నియమించబడిన ఆమె సంతానంలో* మిగిలినవాళ్లతో యుద్ధం చేయడానికి+ అది బయల్దేరింది.

13 అది* సముద్రపు ఇసుక మీద కదలకుండా నిలబడింది.

అప్పుడు పది కొమ్ములు, ఏడు తలలు ఉన్న ఒక క్రూరమృగం సముద్రంలో+ నుండి పైకి రావడం నేను చూశాను. దాని కొమ్ముల మీద పది కిరీటాలు ఉన్నాయి. దాని తలల మీద దేవుణ్ణి దూషించే పేర్లు ఉన్నాయి. 2 నేను చూసిన ఆ క్రూరమృగం చిరుతపులిలా ఉంది. దాని పాదాలు మాత్రం ఎలుగుబంటి పాదాల్లా ఉన్నాయి. దాని నోరు సింహం నోరులా ఉంది. ఆ క్రూరమృగం తన శక్తిని, సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని ఆ మహాసర్పం+ నుండి పొందింది.+

3 దాని తలల్లో ఒకదానికి చావుదెబ్బ తగిలి ఉండడం నేను చూశాను, కానీ ఆ దెబ్బ మానిపోయింది.+ దాంతో భూమ్మీదున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయి ఆ క్రూరమృగాన్ని పొగుడుతూ దాన్ని అనుసరించారు. 4 అంతేకాదు, క్రూరమృగానికి అధికారం ఇచ్చినందుకు వాళ్లు ఆ మహాసర్పాన్ని పూజించారు. అలాగే వాళ్లు ఆ క్రూరమృగాన్ని కూడా పూజిస్తూ, “ఈ క్రూరమృగానికి సాటి ఎవరు? దీనితో ఎవరు యుద్ధం చేయగలరు?” అన్నారు. 5 గర్వపు మాటలు, దేవుణ్ణి దూషించే మాటలు మాట్లాడేలా దానికి ఒక నోరు ఇవ్వబడింది. అలాగే 42 నెలలపాటు+ తనకు నచ్చినట్టు చేసే అధికారం కూడా దానికి ఇవ్వబడింది. 6 అది దేవుణ్ణి దూషించడానికి+ అంటే ఆయన పేరును, ఆయన నివాస స్థలాన్ని, చివరికి పరలోకంలో నివసించేవాళ్లను+ కూడా దూషించడానికి తన నోరు తెరిచింది. 7 పవిత్రులతో యుద్ధం చేసి, వాళ్లను జయించేందుకు ఆ క్రూరమృగానికి అనుమతి ఇవ్వబడింది.+ అంతేకాదు ప్రతీ తెగ, జాతి, భాష, దేశం మీద దానికి అధికారం ఇవ్వబడింది. 8 భూమ్మీద నివసించే వాళ్లందరూ దాన్ని పూజిస్తారు. ప్రపంచం పుట్టిన* దగ్గర నుండి వాళ్లలో ఏ ఒక్కరి పేరూ జీవగ్రంథంలో రాయబడలేదు.+ ఆ గ్రంథం వధించబడిన గొర్రెపిల్లది.+

9 ఎవరికైనా చెవులు ఉంటే, వాళ్లు వినాలి. 10 ఎవరైనా చెరలోకి వెళ్లాల్సి ఉంటే అతను చెరలోకి వెళ్తాడు. ఎవరైనా ఖడ్గంతో చంపితే,* అతను ఖడ్గంతో చంపబడాలి.+ అందుకే పవిత్రులకు+ సహనం,+ విశ్వాసం+ అవసరం.

11 తర్వాత ఇంకో క్రూరమృగం భూమిలో నుండి పైకి రావడం చూశాను. దానికి గొర్రెపిల్ల కొమ్ముల లాంటి రెండు కొమ్ములు ఉన్నాయి. అయితే అది ఒక మహాసర్పంలా మాట్లాడడం మొదలుపెట్టింది. 12 అది మొదటి క్రూరమృగం+ అధికారమంతటినీ దాని ముందే చెలాయిస్తోంది; భూమి, దానిలో నివసించేవాళ్లు చావుదెబ్బ తగిలి బాగుపడిన మొదటి క్రూరమృగాన్ని పూజించేలా అది చేస్తోంది. 13 అది గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తోంది. మనుషులు చూస్తుండగా, ఆకాశం నుండి భూమ్మీదికి అగ్ని దిగివచ్చేలా కూడా చేస్తోంది.

14 మొదటి క్రూరమృగం ముందు ఏ ఆశ్చర్యకార్యాలు చేయడానికి అది అనుమతి పొందిందో వాటితో అది భూమ్మీద నివసించేవాళ్లను మోసం చేస్తోంది. అదే సమయంలో, కత్తి దెబ్బ తిని కోలుకున్న+ మొదటి క్రూరమృగపు ప్రతిమను+ చేయమని అది భూమ్మీద నివసించేవాళ్లకు చెప్తోంది. 15 అంతేకాదు, ఆ మొదటి క్రూరమృగపు ప్రతిమకు ఊపిరి* పోసేందుకు ఈ రెండో క్రూరమృగానికి అనుమతి ఇవ్వబడింది. ఆ క్రూరమృగపు ప్రతిమ మాట్లాడేలా, దాన్ని పూజించని వాళ్లందర్నీ చంపించేలా దానికి ఆ అనుమతి ఇవ్వబడింది.

16 సామాన్యులు-గొప్పవాళ్లు, ధనవంతులు-పేదవాళ్లు, స్వతంత్రులు-దాసులు అందరూ తమ కుడిచేతి మీద గానీ నొసటి మీద గానీ గుర్తు వేయించుకోవాలని+ అది ప్రజలందర్నీ బలవంతం చేస్తోంది. 17 ఎవరికైనా ఆ గుర్తు లేకపోతే, అంటే ఆ క్రూరమృగం పేరుగానీ+ దాని పేరుకు సంబంధించిన సంఖ్యగానీ+ లేకపోతే వాళ్లు కొనలేరు, అమ్మలేరు. 18 లోతైన అవగాహన ఉన్న వ్యక్తి క్రూరమృగం సంఖ్యను లెక్కించాలి. అది ఒక మనిషి సంఖ్య,* ఆ సంఖ్య 666.+ తెలివి ఉన్నవాళ్లు మాత్రమే దీన్ని అర్థం చేసుకుంటారు.

14 నేను చూసినప్పుడు, ఇదిగో! ఆ గొర్రెపిల్ల+ సీయోను పర్వతం+ మీద నిలబడి ఉంది. ఆయన పేరు, ఆయన తండ్రి పేరు+ నొసళ్ల మీద రాయబడిన 1,44,000 మంది+ ఆయనతో పాటు ఉన్నారు. 2 ఆ తర్వాత, పరలోకం నుండి ఒక శబ్దం రావడం నేను విన్నాను. అది అనేక జలాల శబ్దంలా, పెద్ద ఉరుము శబ్దంలా ఉంది. నేను విన్న ఆ శబ్దం తమ వీణలు* వాయిస్తూ, పాడుతున్న గాయకుల స్వరంలా ఉంది. 3 వాళ్లు సింహాసనం ముందు, నాలుగు జీవుల+ ముందు, పెద్దల+ ముందు కొత్త పాట+ లాంటిది పాడుతున్నారు. దేవుడు భూమ్మీది నుండి కొన్న ఆ 1,44,000 మంది+ తప్ప ఇంకెవ్వరూ ఆ పాట నేర్చుకోలేకపోయారు. 4 వీళ్లు స్త్రీలతో సంబంధాలు పెట్టుకోకుండా తమను తాము స్వచ్ఛంగా ఉంచుకున్నారు. నిజానికి వీళ్లు పవిత్రులు.+ వీళ్లు గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్లినా సరే, ఆయన వెంట వెళ్తూ ఉంటారు.+ వీళ్లు దేవుని కోసం, గొర్రెపిల్ల కోసం మనుషుల్లో నుండి ప్రథమఫలాలుగా+ కొనబడ్డారు.+ 5 వీళ్ల నోళ్లలో ఏ మోసం కనిపించలేదు, వీళ్లు మచ్చలేనివాళ్లు.+

6 అప్పుడు ఆకాశం మధ్యలో* ఎగురుతున్న ఇంకో దేవదూతను నేను చూశాను. అతను భూమ్మీద నివసించేవాళ్లకు అంటే ప్రతీ దేశానికి, తెగకు, భాషకు, జాతికి చెందిన ప్రజలకు నిత్యసువార్త* ప్రకటిస్తున్నాడు.+ 7 అతను పెద్ద స్వరంతో ఇలా అంటున్నాడు: “దేవునికి భయపడండి, ఆయన్ని మహిమపర్చండి. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చే గంట వచ్చేసింది.+ కాబట్టి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నీటి ఊటల్ని* చేసిన+ దేవుణ్ణే ఆరాధించండి.”

8 తర్వాత రెండో దేవదూత వచ్చి ఇలా అన్నాడు: “ఆమె కూలిపోయింది! మహాబబులోను+ కూలిపోయింది.+ లైంగిక పాపం* చేయాలన్న కోరిక* అనే తన మద్యాన్ని దేశాలన్నిటితో ఆమె తాగించింది.”+

9 వాళ్ల వెంట మూడో దేవదూత వచ్చి పెద్ద స్వరంతో ఇలా అన్నాడు: “ఎవరైనా క్రూరమృగాన్ని,+ దాని ప్రతిమను పూజించి, నొసటిమీద గానీ చేతిమీద గానీ గుర్తు వేయించుకుంటే,+ 10 అతను దేవుని కోపం అనే మద్యాన్ని కూడా తాగుతాడు. అది ఘాటైన మద్యం. దేవుడు తన ఆగ్రహం అనే గిన్నెలో దాన్ని పోస్తాడు.+ ఆ వ్యక్తి పవిత్ర దేవదూతల ముందు, గొర్రెపిల్ల ముందు అగ్నిగంధకాలతో+ బాధించబడతాడు. 11 వాళ్లను బాధించే* అగ్ని నుండి వచ్చే పొగ యుగయుగాలు పైకి లేస్తుంది.+ వాళ్లకు అంటే క్రూరమృగాన్ని, దాని ప్రతిమను పూజించేవాళ్లకు, దాని పేరుకు సంబంధించిన గుర్తును వేయించుకునేవాళ్లకు+ రాత్రింబగళ్లు విశ్రాంతి ఉండదు. 12 అందుకే పవిత్రులకు, అంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ యేసు మీదున్న విశ్వాసానికి కట్టుబడి+ ఉండేవాళ్లకు సహనం అవసరం.”+

13 అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం ఇలా చెప్పడం విన్నాను: “ఈ మాటలు రాయి: ఇప్పటినుండి ప్రభువు శిష్యులుగా* చనిపోయేవాళ్లు+ సంతోషంగా ఉంటారు. అవును, వాళ్లు చేసిన పనులు వాళ్లతోపాటే వెళ్తాయి కాబట్టి వాళ్లను విశ్రాంతి తీసుకోనివ్వమని దేవుని పవిత్రశక్తి చెప్తుంది.”

14 తర్వాత నేను చూసినప్పుడు, ఇదిగో! ఒక తెల్లని మేఘం కనిపించింది. దానిమీద మానవ కుమారుడి లాంటి ఒక వ్యక్తి+ కూర్చొని ఉన్నాడు. ఆయన తలమీద బంగారు కిరీటం ఉంది, ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది.

15 ఇంకో దేవదూత ఆలయం* నుండి బయటికి వచ్చి, మేఘం మీద కూర్చొని ఉన్న వ్యక్తికి పెద్ద స్వరంతో ఇలా చెప్పాడు: “భూమ్మీది పంట పండింది, కోత కోసే సమయం* వచ్చేసింది కాబట్టి నీ కొడవలితో భూమ్మీది పంట కొయ్యి.”+ 16 అప్పుడు మేఘం మీద కూర్చొని ఉన్న వ్యక్తి తన కొడవలితో భూమ్మీది పంటను కోశాడు.

17 ఆ తర్వాత ఇంకో దేవదూత పరలోకంలోని ఆలయం నుండి బయటికి వచ్చాడు. అతని చేతిలో కూడా పదునైన కొడవలి ఉంది.

18 అప్పుడు మరో దేవదూత బలిపీఠం వైపు నుండి వచ్చాడు. అతనికి అగ్ని మీద అధికారం ఉంది. అతను పదునైన కొడవలి పట్టుకొనివున్న దేవదూతకు పెద్ద స్వరంతో ఇలా చెప్పాడు: “భూమ్మీదున్న ద్రాక్షపండ్లు పండాయి కాబట్టి నీ పదునైన కొడవలితో ద్రాక్షగెలల్ని కోసి సమకూర్చు.”+ 19 ఆ దేవదూత తన కొడవలితో భూమ్మీదున్న ద్రాక్షతీగను కోసి ఆ తీగను, దానికున్న పండ్లను దేవుని కోపమనే పెద్ద ద్రాక్షతొట్టిలో పడేశాడు.+ 20 ఆ ద్రాక్షతొట్టిని నగరం బయట తొక్కారు. అప్పుడు దానిలో నుండి రక్తం బయటికి వచ్చింది. ఆ రక్తం గుర్రం కళ్లెం అంత ఎత్తు వరకు, దాదాపు 300 కిలోమీటర్ల* దూరం వరకు ప్రవహించింది.

15 అప్పుడు పరలోకంలో అద్భుతమైన ఇంకొక గొప్ప సూచన చూశాను. ఏడుగురు దేవదూతలు ఏడు తెగుళ్లు పట్టుకొని ఉన్నారు. ఇవి చివరి తెగుళ్లు, వీటితో దేవుని కోపం తీరిపోతుంది.

2 తర్వాత, అగ్ని కలిసివున్న గాజు సముద్రం+ లాంటిదాన్ని నేను చూశాను. క్రూరమృగాన్ని, దాని ప్రతిమను,+ దాని పేరుకు సంబంధించిన సంఖ్యను+ జయించినవాళ్లు+ ఆ గాజు సముద్రం దగ్గర నిలబడివున్నారు. వాళ్ల చేతుల్లో దేవుని వీణలు* ఉన్నాయి. 3 వాళ్లు దేవుని దాసుడైన మోషే పాటను,+ గొర్రెపిల్ల పాటను పాడుతూ ఇలా అంటున్నారు:

“యెహోవా* దేవా, సర్వశక్తిమంతుడా,+ నీ పనులు గొప్పవి, అద్భుతమైనవి.+ యుగయుగాలకు రాజా,+ నీ మార్గాలు న్యాయమైనవి, సత్యమైనవి.+ 4 యెహోవా,* నువ్వు మాత్రమే విశ్వసనీయుడివి; నీకు భయపడని వాళ్లెవరు?+ నీ పేరును మహిమపర్చని వాళ్లెవరు? నీతియుక్తమైన నీ తీర్పులు వెల్లడి చేయబడ్డాయి కాబట్టి అన్నిదేశాల ప్రజలు నీ ముందుకు వచ్చి నిన్ను ఆరాధిస్తారు.”+

5 ఆ తర్వాత నేను పరలోకంలో సాక్ష్యపు గుడార పవిత్ర స్థలం+ తెరవబడి ఉండడం చూశాను. 6 ఆ పవిత్ర స్థలంలో నుండి ఏడుగురు దేవదూతలు ఏడు తెగుళ్లను పట్టుకొని వచ్చారు. వాళ్లు స్వచ్ఛమైన, మెరిసే నారవస్త్రాలు వేసుకొని ఉన్నారు, వాళ్ల ఛాతి చుట్టూ బంగారు దట్టీ ఉంది. 7 నాలుగు జీవుల్లో ఒక జీవి ఆ ఏడుగురు దేవదూతలకు ఏడు బంగారు గిన్నెలు ఇచ్చింది. ఆ గిన్నెలు యుగయుగాలు జీవించే దేవుని కోపంతో నిండివున్నాయి.+ 8 దేవుని మహిమవల్ల, ఆయన శక్తివల్ల ఆ పవిత్ర స్థలం పొగతో నిండిపోయింది.+ ఏడుగురు దేవదూతలు పట్టుకొని ఉన్న ఏడు తెగుళ్లు+ పూర్తయ్యేవరకు ఎవ్వరూ పవిత్ర స్థలంలోకి వెళ్లలేకపోయారు.

16 అప్పుడు పవిత్ర స్థలం నుండి ఒక పెద్ద స్వరం ఆ ఏడుగురు దేవదూతలతో ఇలా చెప్పడం విన్నాను: “మీరు వెళ్లి, దేవుని కోపంతో నిండిన ఏడు గిన్నెలు భూమ్మీద కుమ్మరించండి.”+

2 మొదటి దేవదూత వెళ్లి తన గిన్నెను భూమ్మీద కుమ్మరించాడు.+ అప్పుడు క్రూరమృగం గుర్తు ఉన్నవాళ్లను,+ దాని ప్రతిమను పూజిస్తున్నవాళ్లను+ హానికరమైన, ఘోరమైన పుండ్లు+ బాధించాయి.

3 రెండో దేవదూత తన గిన్నెను సముద్రం మీద కుమ్మరించాడు.+ అప్పుడు సముద్రం చనిపోయిన వ్యక్తి రక్తంలా+ మారిపోయింది. దాంతో సముద్రంలోని జీవులన్నీ+ చనిపోయాయి.

4 మూడో దేవదూత తన గిన్నెను నదుల మీద, నీటి ఊటల* మీద కుమ్మరించాడు.+ దాంతో అవి రక్తంగా మారిపోయాయి.+ 5 అప్పుడు నీళ్ల మీద అధికారం ఉన్న దేవదూత ఇలా అనడం విన్నాను: “ఇప్పుడూ గతంలోనూ ఉన్నవాడా,+ విశ్వసనీయుడా,+ ఈ తీర్పులు జారీ చేశావు కాబట్టి నువ్వు నీతిమంతుడివి.+ 6 వాళ్లు పవిత్రుల రక్తాన్ని, ప్రవక్తల రక్తాన్ని చిందించారు.+ అందుకే నువ్వు వాళ్లకు తాగడానికి రక్తాన్ని ఇచ్చావు.+ వాళ్లకు అలా జరగాల్సిందే.”+ 7 అప్పుడు బలిపీఠం నుండి ఒక స్వరం ఇలా చెప్పడం విన్నాను: “అవును, యెహోవా* దేవా, సర్వశక్తిమంతుడా,+ నీ తీర్పులు* సత్యమైనవి, న్యాయమైనవి.”+

8 నాలుగో దేవదూత తన గిన్నెను సూర్యుడి మీద కుమ్మరించాడు.+ అప్పుడు తన వేడితో ప్రజల్ని కాల్చేసేందుకు సూర్యుడికి అనుమతి ఇవ్వబడింది. 9 ఆ తీవ్రమైన వేడికి ప్రజలు మాడిపోయారు. అయితే వాళ్లు, ఈ తెగుళ్ల మీద అధికారం ఉన్న దేవుని పేరును దూషించారే తప్ప పశ్చాత్తాపపడి ఆయన్ని మహిమపర్చలేదు.

10 ఐదో దేవదూత తన గిన్నెను క్రూరమృగం సింహాసనంమీద కుమ్మరించాడు. అప్పుడు దాని రాజ్యం చీకటిమయం అయిపోయింది.+ ఆ బాధవల్ల ప్రజలు పళ్లు* కొరుక్కోవడం మొదలుపెట్టారు. 11 అయితే వాళ్లు తమ బాధల్ని బట్టి, పుండ్లను బట్టి పరలోకంలో ఉన్న దేవుణ్ణి దూషించారే తప్ప తమ పనుల విషయంలో పశ్చాత్తాపపడలేదు.

12 ఆరో దేవదూత తన గిన్నెను యూఫ్రటీసు మహానది+ మీద కుమ్మరించాడు. అప్పుడు, తూర్పు* నుండి వచ్చే రాజుల కోసం దారి ఏర్పడేలా+ ఆ నది నీళ్లు ఎండిపోయాయి.+

13 తర్వాత మహాసర్పం+ నోటి నుండి, క్రూరమృగం నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల లాంటి మూడు అపవిత్రమైన ప్రేరేపిత సందేశాలు* రావడం నేను చూశాను. 14 నిజానికి అవి చెడ్డదూతలు* ప్రేరేపించిన సందేశాలు. అవి* ఆశ్చర్యకార్యాలు చేస్తాయి.+ అవి సర్వశక్తిమంతుడైన దేవుని మహారోజున+ జరిగే యుద్ధం కోసం+ భూమంతటా ఉన్న రాజుల్ని పోగు చేయడానికి వాళ్ల దగ్గరికి వెళ్తాయి.

15 తర్వాత ఒక స్వరం ఇలా చెప్పడం నేను విన్నాను: “ఇదిగో! నేను దొంగలా వస్తున్నాను.+ మెలకువగా ఉంటూ+ తన పైవస్త్రాలు కాపాడుకునే వ్యక్తి సంతోషంగా ఉంటాడు, లేకపోతే అతను పైవస్త్రం లేకుండా* నడవడం ప్రజలు చూస్తారు, దానివల్ల అతను సిగ్గుపడాల్సి వస్తుంది.”+

16 అవి ఆ రాజుల్ని ఒక చోటికి పోగుచేశాయి. హీబ్రూ భాషలో దాని పేరు హార్‌మెగిద్దోన్‌.*+

17 ఏడో దేవదూత తన గిన్నెను గాలి మీద కుమ్మరించాడు. అప్పుడు పవిత్ర స్థలంలో ఉన్న సింహాసనం నుండి ఒక పెద్ద స్వరం వినిపించింది. ఆ స్వరం ఇలా అంది: “సమాప్తమైంది!” 18 అప్పుడు మెరుపులు, ఉరుములు వచ్చాయి; స్వరాలు వినిపించాయి; పెద్ద భూకంపం వచ్చింది. భూమ్మీద మనిషి సృష్టించబడినప్పటి నుండి అలాంటి భూకంపం ఎప్పుడూ రాలేదు.+ అది చాలా శక్తివంతమైన, పెద్ద భూకంపం. 19 అప్పుడు మహానగరం+ మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల నగరాలు కూలిపోయాయి. దేవుడు తన మహా కోపమనే మద్యాన్ని మహాబబులోనుతో+ తాగించడానికి+ ఆమెను గుర్తుచేసుకున్నాడు. 20 అంతేకాదు ప్రతీ ద్వీపం పారిపోయింది, పర్వతాలు కనిపించకుండా పోయాయి.+ 21 తర్వాత ఆకాశం నుండి పెద్దపెద్ద వడగండ్లు ప్రజల మీద పడ్డాయి.+ వాటిలో ఒక్కో దాని బరువు దాదాపు 20 కిలోలు.* ఈ తెగులు+ చాలా తీవ్రంగా ఉండడంతో ప్రజలు దాన్నిబట్టి దేవుణ్ణి దూషించారు.

17 ఏడు గిన్నెలు+ పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒక దేవదూత వచ్చి నాతో ఇలా అన్నాడు: “రా, అనేక జలాల మీద కూర్చున్న గొప్ప వేశ్య పొందే తీర్పును+ నీకు చూపిస్తాను. 2 భూమ్మీది రాజులు ఆమెతో లైంగిక పాపం* చేశారు.+ భూమ్మీది ప్రజలు ఆమె మద్యం మత్తులో ఉన్నారు. ఆ మద్యం ఆమె లైంగిక పాపాన్ని* సూచిస్తుంది.”+

3 ఆ దేవదూత పవిత్రశక్తి ద్వారా నన్ను ఎడారిలోకి తీసుకెళ్లాడు. అప్పుడు నేను ఒక స్త్రీని చూశాను. ఆమె ఒక ఎర్రని క్రూరమృగం మీద కూర్చొని ఉంది. ఆ మృగం ఒంటి నిండా దేవుణ్ణి దూషించే పేర్లు ఉన్నాయి; దానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి. 4 ఆ స్త్రీ ఊదారంగు వస్త్రం,+ ఎర్రని వస్త్రం వేసుకొని ఉంది; బంగారంతో, విలువైన రాళ్లతో, ముత్యాలతో+ చేసిన నగలు పెట్టుకొని ఉంది. ఆమె చేతిలో ఒక బంగారు గిన్నె ఉంది. ఆ గిన్నె అసహ్యమైన వాటితో, ఆమె లైంగిక పాపానికి* సంబంధించిన అపవిత్రమైన వాటితో నిండి ఉంది. 5 ఆమె నొసటి మీద ఒక పేరు ఉంది. ఆ పేరు ఒక రహస్యం. ఆ పేరు: “వేశ్యలకు, భూమ్మీదున్న అసహ్యమైన వాటికి తల్లియైన మహాబబులోను.”+ 6 ఆ స్త్రీ పవిత్రుల రక్తాన్ని, యేసు గురించి సాక్ష్యం ఇచ్చినవాళ్ల రక్తాన్ని తాగడంవల్ల+ మత్తుగా ఉండడం నేను చూశాను.

ఆమెను చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. 7 కాబట్టి ఆ దేవదూత నాతో ఇలా అన్నాడు: “నువ్వెందుకు ఆశ్చర్యపోయావు? ఆ స్త్రీ గురించిన రహస్యాన్ని,+ ఆ స్త్రీ కూర్చొని ఉన్న ఏడు తలలు, పది కొమ్ములు గల క్రూరమృగం+ గురించిన రహస్యాన్ని నీకు చెప్తాను: 8 నువ్వు చూసిన ఆ క్రూరమృగం అంతకుముందు ఉంది, ఇప్పుడు లేదు, కానీ త్వరలో అది అగాధం+ నుండి పైకి వచ్చి, నాశనం చేయబడుతుంది. భూమ్మీది ప్రజలు, అంటే ప్రపంచం పుట్టిన* దగ్గర నుండి ఎవరి పేర్లయితే జీవగ్రంథంలో రాయబడలేదో+ వాళ్లు ఆ క్రూరమృగం అంతకుముందు ఉండడం, ఆ తర్వాత లేకపోవడం, అది మళ్లీ రావడం చూసి ఆశ్చర్యపోతారు.

9 “దీన్ని అర్థం చేసుకోవడానికి తెలివిగల మనసు అవసరం: ఆ ఏడు తలలు,+ ఆ స్త్రీ కూర్చొని ఉన్న ఏడు పర్వతాల్ని సూచిస్తున్నాయి. 10 ఏడుగురు రాజులు ఉన్నారు. వాళ్లలో ఐదుగురు పడిపోయారు, ఒక రాజు ఇప్పుడు ఉన్నాడు, ఇంకొక రాజు ఇంకా రాలేదు. అయితే అతను వచ్చినప్పుడు కొంతకాలంపాటు ఉండాలి. 11 అంతకుముందు ఉండి, ఇప్పుడు లేని ఆ క్రూరమృగమే+ ఎనిమిదో రాజు. అయితే అది ఆ ఏడుగురు రాజుల్లో నుండి వస్తుంది. చివరికి అది నాశనం చేయబడుతుంది.

12 “నువ్వు చూసిన ఆ పది కొమ్ములు ఇంకా పరిపాలన మొదలుపెట్టని పదిమంది రాజుల్ని సూచిస్తున్నాయి. అయితే వాళ్లు ఒక గంటపాటు ఆ క్రూరమృగంతో కలిసి రాజులుగా పరిపాలించడానికి అధికారం పొందుతారు. 13 వాళ్లకు ఒకే ఆలోచన ఉంటుంది. అందుకే వాళ్లు తమ శక్తిని, అధికారాన్ని ఆ క్రూరమృగానికి ఇస్తారు. 14 వాళ్లు గొర్రెపిల్లతో+ యుద్ధం చేస్తారు. కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు+ కాబట్టి ఆయన వాళ్లను జయిస్తాడు.+ అంతేకాదు దేవుడు పిలిచినవాళ్లు, దేవుడు ఎంచుకున్నవాళ్లు, దేవునికి నమ్మకంగా ఉన్నవాళ్లు ఆయనతోపాటు జయిస్తారు.”+

15 ఆ దేవదూత నాతో ఇలా అన్నాడు: “ఆ వేశ్య ఏ నీళ్ల మీద కూర్చొని ఉండడం నువ్వు చూశావో ఆ నీళ్లు జాతుల్ని, ప్రజల గుంపుల్ని, దేశాల్ని, భాషల్ని సూచిస్తున్నాయి.+ 16 నువ్వు చూసిన ఆ పది కొమ్ములు,+ అలాగే ఆ క్రూరమృగం+ ఈ వేశ్యను+ ద్వేషించి, ఆమెను కొల్లగొట్టి, ఆమె బట్టలు తీసేసి, ఆమె మాంసాన్ని తిని, అగ్నితో ఆమెను పూర్తిగా కాల్చివేస్తాయి.+ 17 ఎందుకంటే తాను అనుకున్నట్టు జరగాలని దేవుడే తన ఆలోచనను వాళ్లలో పెట్టాడు.+ వాళ్లందరికీ ఒకే ఆలోచన ఉంది. దేవుని మాటలు నెరవేరేవరకు తమ రాజ్యాన్ని క్రూరమృగానికి ఇవ్వాలన్నదే+ ఆ ఆలోచన. 18 నువ్వు చూసిన ఆ స్త్రీ+ మహానగరాన్ని సూచిస్తోంది. ఆ మహానగరం భూమ్మీది రాజుల్ని పరిపాలిస్తుంది.”

18 ఆ తర్వాత ఇంకో దేవదూత గొప్ప అధికారంతో పరలోకం నుండి దిగిరావడం నేను చూశాను. అతని మహిమ వల్ల భూమి ప్రకాశించింది. 2 అతను గట్టి స్వరంతో అరుస్తూ ఇలా అన్నాడు: “ఆమె కూలిపోయింది! మహాబబులోను కూలిపోయింది.+ చెడ్డదూతలకు,* అపవిత్రమైన-అసహ్యమైన ప్రతీ పక్షికి ఆమె నివాస స్థలంగా మారింది! విషపూరితమైన గాలితో* నిండిన స్థలంగా మారింది!+ 3 ఎందుకంటే, లైంగిక పాపం* చేయాలనే కోరిక* అనే తన మద్యాన్ని ఆమె అన్నిదేశాలతో తాగించింది.+ భూమ్మీది రాజులు ఆమెతో లైంగిక పాపం చేశారు.+ భూమ్మీది వర్తకులు* ఆమె సుఖభోగాల వల్ల ధనవంతులయ్యారు.”

4 అప్పుడు పరలోకం నుండి ఇంకొక స్వరం ఇలా చెప్పడం విన్నాను: “నా ప్రజలారా, మీరు ఆమె పాపాల్లో భాగస్థులు అవ్వకూడదని, ఆమె తెగుళ్లలో పాలుపంచుకోకూడదని అనుకుంటే అక్కడి* నుండి బయటికి రండి.+ 5 ఎందుకంటే, ఆమె పాపాలు ఆకాశాన్నంటాయి.+ ఆమె చేసిన అన్యాయాల్ని* దేవుడు గుర్తుచేసుకున్నాడు.+ 6 ఆమె ఇతరులకు చేసిందే ఆమెకూ చేయండి,+ రెండింతలు చేయండి;+ ఆమె కలిపిన గిన్నెలో+ ఆమెకు రెండు రెట్లు కలపండి.+ 7 ఆమె తనను తాను ఎంతగానో మహిమపర్చుకుంది, ఎన్నో సుఖభోగాలు అనుభవించింది. కాబట్టి ఆమె అంతగా బాధను, దుఃఖాన్ని అనుభవించాలి. ఎందుకంటే ఆమె తన హృదయంలో, ‘నేను రాణిలా కూర్చున్నాను, నేను విధవరాలిని కాను, దుఃఖపడాల్సిన పరిస్థితి నాకు ఎప్పటికీ రాదు’ అని అనుకుంటూ ఉంది.+ 8 కాబట్టి ఒక్క రోజులోనే ఆమె మీదికి తెగుళ్లు, అంటే మరణం, దుఃఖం, కరువు వస్తాయి. ఆమె అగ్నితో పూర్తిగా కాల్చేయబడుతుంది.+ ఎందుకంటే, ఆమెకు తీర్పు తీర్చిన యెహోవా* దేవుడు శక్తిమంతుడు.+

9 “ఆమెతో లైంగిక పాపం* చేసి, ఆమెతోపాటు సుఖభోగాలు అనుభవించిన భూరాజులు ఆమె కాలిపోతున్నప్పుడు వచ్చే పొగను చూసి ఏడుస్తూ, దుఃఖంతో గుండెలు బాదుకుంటారు. 10 ఆమెలా బాధించబడతామేమో అనే భయంతో వాళ్లు దూరంగా నిలబడి, ‘అయ్యో! అయ్యో! మహానగరమా,+ బలమైన బబులోను నగరమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చిందే!’ అని అంటారు.

11 “భూమ్మీది వర్తకులు ఆమెను చూసి ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ఎందుకంటే వాళ్ల సరుకులన్నీ కొనేవాళ్లు ఎవ్వరూ లేరు; 12 అవేమిటంటే: బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, సన్నని నారవస్త్రం, ఊదారంగు వస్త్రం, పట్టు వస్త్రం, ఎర్రని వస్త్రం; సువాసనగల కలప నుండి తయారుచేసిన అన్ని వస్తువులు; దంతంతో, ఖరీదైన కలపతో, రాగితో, ఇనుముతో, చలువరాయితో చేసిన అన్నిరకాల వస్తువులు; 13 అంతేకాదు దాల్చినచెక్క, ఏలక్కాయ, ధూపద్రవ్యం, పరిమళ తైలం, సాంబ్రాణి, ద్రాక్షారసం, ఒలీవ నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు, గుర్రాలు, బండ్లు, దాసులు, ప్రజలు. 14 నువ్వు* కోరుకున్న మంచివన్నీ నీకు దూరమయ్యాయి. రుచికరమైన ఆహారపదార్థాలన్నీ, వైభవంగల వస్తువులన్నీ శాశ్వతంగా నీకు దూరమైపోయాయి.

15 “ఈ సరుకులు అమ్ముకొని, ఆమె వల్ల ధనవంతులైన వర్తకులు ఆమెలా బాధించబడతామేమో అనే భయంతో దూరంగా నిలబడి ఏడుస్తూ, దుఃఖిస్తూ 16 ఇలా అంటారు: ‘అయ్యో! అయ్యో! సన్నని నారవస్త్రం, ఊదారంగు వస్త్రం, ఎర్రని వస్త్రం ధరించుకొని బంగారు నగలతో, అమూల్యమైన రాళ్లతో, ముత్యాలతో ఆడంబరంగా అలంకరించుకున్న మహానగరానికి+ ఇలా జరిగిందే! 17 ఆమె గొప్ప సంపదలన్నీ ఒక్క గంటలోనే నాశనమైపోయాయే!’

“ప్రతీ ఓడ అధికారి, ప్రతీ సముద్ర ప్రయాణికుడు, నావికులు, సముద్రం మీద ఆధారపడి జీవనం సంపాదించుకునే వాళ్లందరూ దూరంగా నిలబడి, 18 ఆమె కాలిపోతున్నప్పుడు వచ్చే పొగను చూసి గట్టిగా అరుస్తూ, ‘ఈ మహానగరం లాంటి నగరం ఏదైనా ఉందా?’ అన్నారు. 19 వాళ్లు తలల మీద దుమ్ము పోసుకుంటూ ఏడుస్తూ, దుఃఖిస్తూ, ‘అయ్యో! అయ్యో! మహానగరానికి ఇలా జరిగిందే! సముద్రంలో ఓడలు ఉన్న వాళ్లందరూ ఆమె సంపదల వల్ల ధనవంతులయ్యారు; అలాంటిది ఒక్క గంటలోనే ఆమె నాశనమైపోయిందే!’+ అని అరిచారు.

20 “పరలోకమా,+ పవిత్రులారా,+ అపొస్తలులారా, ప్రవక్తలారా, ఆమెకు జరిగినదాన్ని బట్టి సంతోషించండి. ఎందుకంటే, ఆమె మీకు చేసినదాన్ని బట్టి దేవుడు ఆమె మీద తీర్పు ప్రకటించాడు!”+

21 అప్పుడొక బలమైన దేవదూత, పెద్ద తిరుగలి రాయి లాంటి ఒక రాయిని ఎత్తి సముద్రంలో విసిరేస్తూ ఇలా అన్నాడు: “బబులోను మహానగరం ఇలా వేగంగా పడేయబడుతుంది, అది ఇక ఎప్పటికీ కనిపించదు.+ 22 వీణ* వాయించే గాయకుల శబ్దం, సంగీతకారుల శబ్దం, పిల్లనగ్రోవి* ఊదేవాళ్ల శబ్దం, బాకా ఊదేవాళ్ల శబ్దం ఇక మళ్లీ నీలో వినిపించదు. ఏదైనా వృత్తిపని చేసేవాళ్లెవ్వరూ ఇక ఎప్పటికీ నీలో కనిపించరు, తిరుగలి రాయి శబ్దం ఇక ఎప్పటికీ నీలో వినిపించదు. 23 దీపకాంతి ఇక ఎప్పటికీ నీలో ప్రకాశించదు; పెళ్లికుమారుడి స్వరం, పెళ్లికూతురి స్వరం మళ్లీ నీలో వినిపించదు. ఎందుకంటే నీ వర్తకులు భూమ్మీదున్న వాళ్లలో ప్రముఖులుగా ఉండేవాళ్లు, నీ మంత్రతంత్రాల+ వల్ల దేశాలన్నీ మోసపోయాయి. 24 అవును, ప్రవక్తల రక్తం, పవిత్రుల రక్తం,+ భూమ్మీద దారుణంగా చంపబడిన వాళ్లందరి రక్తం ఈ నగరంలో కనిపించింది.”+

19 ఆ తర్వాత, చాలామంది దేవదూతల స్వరం లాంటి పెద్ద స్వరం పరలోకం నుండి రావడం నేను విన్నాను. వాళ్లు ఇలా అన్నారు: “యెహోవాను స్తుతించండి!* రక్షణ, మహిమ, శక్తి మన దేవునికి చెందుతాయి. 2 ఆయన తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.+ ఎందుకంటే, గొప్ప వేశ్య మీద ఆయన తీర్పు అమలుచేశాడు. ఆమె తన లైంగిక పాపంతో* భూమిని పాడుచేసింది. దేవుడు తన సేవకుల రక్తం విషయంలో ఆమె మీద పగ తీర్చుకున్నాడు.”+ 3 వెంటనే రెండోసారి వాళ్లు ఇలా అన్నారు: “యెహోవాను స్తుతించండి!* ఆమె కాలిపోవడం వల్ల వచ్చే పొగ యుగయుగాలు పైకి లేస్తుంది.”+

4 అప్పుడు 24 మంది పెద్దలు, నాలుగు జీవులు మోకరించి, సింహాసనం మీద కూర్చునే దేవుణ్ణి ఆరాధిస్తూ ఇలా అన్నారు: “ఆమేన్‌! యెహోవాను స్తుతించండి!”*

5 అంతేకాదు, సింహాసనం నుండి వచ్చిన ఒక స్వరం ఇలా అంది: “సామాన్యులే గానీ గొప్పవాళ్లే గానీ దేవునికి భయపడే+ ఆయన దాసులారా, మన దేవుణ్ణి స్తుతిస్తూ ఉండండి.”

6 అప్పుడు ఒక శబ్దం విన్నాను. అది పెద్ద గుంపు స్వరంలా, అనేక జలాల శబ్దంలా, పెద్ద ఉరుముల శబ్దంలా ఉంది. వాళ్లు ఇలా అన్నారు: “యెహోవాను స్తుతించండి,* సర్వశక్తిమంతుడూ+ మన దేవుడూ అయిన యెహోవా* రాజుగా పరిపాలించడం మొదలుపెట్టాడు!+ 7 మనం సంతోషిస్తూ సంబరపడుతూ ఆయన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే గొర్రెపిల్ల పెళ్లి దగ్గరపడింది, ఆయనకు కాబోయే భార్య పెళ్లికోసం సిద్ధంగా ఉంది. 8 శుభ్రమైన, మెరిసే, సన్నని నారవస్త్రం వేసుకోవడానికి ఆమెకు అనుమతి ఇవ్వబడింది. ఎందుకంటే, సన్నని నారవస్త్రం పవిత్రుల నీతికార్యాల్ని సూచిస్తుంది.”+

9 ఆ దేవదూత నాతో ఇలా అన్నాడు: “ఈ మాటలు రాయి: గొర్రెపిల్ల గొప్ప పెళ్లివిందుకు ఆహ్వానించబడిన వాళ్లు ధన్యులు.”*+ అంతేకాదు అతను నాతో, “ఇవి దేవుని నమ్మదగిన మాటలు” అని కూడా అన్నాడు. 10 అప్పుడు నేను అతన్ని ఆరాధించడానికి అతని పాదాల ముందు మోకరించాను. కానీ అతను, “వద్దు! అలా చేయొద్దు!+ నేను కూడా నీలాగే, యేసు గురించి సాక్ష్యమివ్వడానికి నియమించబడిన నీ సహోదరుల్లాగే ఒక దాసుణ్ణి మాత్రమే.+ దేవుణ్ణే ఆరాధించు!+ ఎందుకంటే యేసు గురించి సాక్ష్యమివ్వడమే ప్రవచనాల ఉద్దేశం”+ అని నాతో అన్నాడు.

11 ఆ తర్వాత, పరలోకం తెరవబడి ఉండడం నేను చూశాను. అప్పుడు ఇదిగో! ఒక తెల్లని గుర్రం+ కనిపించింది. దానిమీద కూర్చొని ఉన్న వ్యక్తికి నమ్మకమైనవాడు-సత్యవంతుడు+ అనే పేరు ఉంది. దేవుని నీతి ప్రమాణాల ప్రకారం ఆయన తీర్పుతీరుస్తాడు, యుద్ధం చేస్తాడు.+ 12 ఆయన కళ్లు అగ్నిజ్వాలలా ఉన్నాయి.+ ఆయన తల మీద చాలా కిరీటాలు ఉన్నాయి. ఆయన మీద ఒక పేరు రాయబడివుంది, అది ఆయనకు తప్ప ఇంకెవరికీ తెలీదు. 13 రక్తం మరకలు ఉన్న* పైవస్త్రాన్ని ఆయన వేసుకొని ఉన్నాడు. ఆయనకు దేవుని వాక్యం అనే పేరుంది.+ 14 అంతేకాదు, పరలోక సైన్యాలు తెల్లని గుర్రాల మీద ఆయన్ని అనుసరిస్తున్నాయి. వాళ్లు శుభ్రమైన, తెల్లని, సన్నని నారవస్త్రాలు వేసుకొని ఉన్నారు. 15 దేశాల్ని నాశనం చేయడానికి ఆయన నోటి నుండి పదునైన, పొడవాటి ఖడ్గం+ వస్తోంది. ఆయన ఇనుప దండంతో వాళ్లను పరిపాలిస్తాడు.+ అంతేకాదు, సర్వశక్తిమంతుడైన దేవుని మహా కోపమనే ద్రాక్షతొట్టిని ఆయన తొక్కుతాడు.+ 16 రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనే పేరు+ ఆయన పైవస్త్రం తొడ భాగం మీద రాయబడివుంది.

17 అంతేకాదు, సూర్యుని మధ్యలో నిలబడివున్న ఒక దేవదూతను నేను చూశాను. అతను పెద్ద స్వరంతో అరిచి, ఆకాశం మధ్యలో* ఎగిరే పక్షులన్నిటితో ఇలా అన్నాడు: “ఇక్కడికి రండి, దేవుని గొప్ప విందు కోసం సమకూడండి.+ 18 రాజుల మాంసాన్ని, సహస్రాధిపతుల* మాంసాన్ని, బలవంతుల మాంసాన్ని,+ గుర్రాల మాంసాన్ని, వాటిమీద కూర్చున్న వాళ్ల మాంసాన్ని,+ అందరి మాంసాన్ని అంటే స్వతంత్రుల-దాసుల, సామాన్యుల-గొప్పవాళ్ల మాంసాన్ని తినడానికి రండి.”

19 ఆ తర్వాత, గుర్రం మీద కూర్చున్న వ్యక్తితో, ఆయన సైన్యంతో యుద్ధం చేయడానికి క్రూరమృగం, భూమ్మీది రాజులు, వాళ్ల  సైన్యాలు సమకూడడం+ నేను చూశాను. 20 గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఆ క్రూరమృగాన్ని, అబద్ధ ప్రవక్తను+ పట్టుకున్నాడు. క్రూరమృగం ముందు ఆశ్చర్యకార్యాలు చేసి, క్రూరమృగం గుర్తును వేయించుకున్నవాళ్లనూ+ దాని ప్రతిమను పూజించేవాళ్లనూ+ మోసం చేసింది ఈ అబద్ధ ప్రవక్తే. ఆ క్రూరమృగం, అబద్ధ ప్రవక్త ఇంకా బ్రతికుండగానే అగ్నిగంధకాలతో మండుతున్న సరస్సులో  పడేయబడ్డారు.+ 21 అయితే మిగతావాళ్లు మాత్రం, గుర్రం మీద కూర్చున్న వ్యక్తి నోటి నుండి వచ్చిన పొడవాటి ఖడ్గంతో చంపబడ్డారు.+ వాళ్ల మాంసాన్ని పక్షులన్నీ కడుపునిండా తిన్నాయి.+

20 అప్పుడు పరలోకం నుండి ఒక దేవదూత కిందికి దిగిరావడం నేను చూశాను. ఆయన చేతిలో అగాధపు తాళంచెవి,+ పెద్ద గొలుసు ఉన్నాయి. 2 ఆయన ఆ మహాసర్పాన్ని+ పట్టుకొని 1,000 సంవత్సరాల పాటు బంధించాడు. అదే మొదటి సర్పం,+ అపవాది,+ సాతాను.+ 3 ఆ దేవదూత అతన్ని అగాధంలో+ పడేసి, దాన్ని మూసేసి, ముద్రవేశాడు. ఆ 1,000 సంవత్సరాలు ముగిసేవరకు అతను దేశాల్ని ఇక మోసం చేయకుండా ఉండాలని అలా చేశాడు. ఆ తర్వాత అతను కొంతకాలం విడుదల చేయబడాలి.+

4 తర్వాత నేను సింహాసనాల్ని చూశాను. వాటిమీద కూర్చున్న వాళ్లు తీర్పుతీర్చే అధికారం పొందారు. అవును, యేసు గురించి సాక్ష్యమిచ్చినందుకు, దేవుని గురించి ప్రకటించినందుకు చంపబడిన* వాళ్ల రక్తాన్ని;* అలాగే క్రూరమృగాన్ని గానీ దాని ప్రతిమను గానీ పూజించకుండా, తమ నొసటిమీద, చేతిమీద గుర్తు వేయించుకోకుండా ఉన్నవాళ్లను నేను చూశాను.+ వాళ్లు బ్రతికి, క్రీస్తుతోపాటు 1,000 సంవత్సరాలు రాజులుగా పరిపాలించారు.+ 5 (చనిపోయిన వాళ్లలో మిగిలినవాళ్లు+ ఆ 1,000 సంవత్సరాలు పూర్తయ్యేవరకు బ్రతకలేదు.) ఇది మొదటి పునరుత్థానం.+ 6 ఈ మొదటి పునరుత్థానంలో బ్రతికేవాళ్లు సంతోషంగా ఉంటారు,+ వీళ్లు పవిత్రులు. వీళ్ల మీద రెండో మరణానికి+ అధికారం లేదు.+ వీళ్లు దేవునికి, క్రీస్తుకు యాజకులుగా+ ఉంటారు, క్రీస్తుతో కలిసి 1,000 సంవత్సరాలు రాజులుగా పరిపాలిస్తారు.+

7 ఆ 1,000 సంవత్సరాలు పూర్తవ్వగానే చెరలో నుండి సాతాను విడుదల చేయబడతాడు. 8 అప్పుడు అతను భూమి నలుమూలలా ఉన్న దేశాల్ని, అంటే గోగును, మాగోగును మోసం చేసి యుద్ధం కోసం సమకూర్చడానికి బయల్దేరతాడు. వాళ్ల సంఖ్య సముద్రపు ఇసుక రేణువులంత ఉంది. 9 వాళ్లు భూమంతటా విస్తరించి పవిత్రుల శిబిరాన్ని, దేవుడు ప్రేమించే నగరాన్ని చుట్టుముట్టారు. అయితే పరలోకం నుండి అగ్ని దిగివచ్చి వాళ్లను కాల్చేసింది.+ 10 వాళ్లను మోసం చేస్తున్న అపవాది అగ్నిగంధకాల సరస్సులో పడేయబడ్డాడు. అప్పటికే అందులో క్రూరమృగం, అబద్ధ ప్రవక్త ఉన్నారు. వాళ్లు రాత్రింబగళ్లు, యుగయుగాలు బాధించబడతారు.*

11 అప్పుడు తెల్లగా ఉన్న ఒక పెద్ద సింహాసనాన్ని, దానిమీద కూర్చొని ఉన్న దేవుణ్ణి+ నేను చూశాను. భూమ్యాకాశాలు ఆయన ముందు నుండి పారిపోయాయి,+ వాటికి ఎక్కడా స్థలం దొరకలేదు. 12 గొప్పవాళ్లే గానీ, సామాన్యులే గానీ చనిపోయిన వాళ్లందరూ ఆ సింహాసనం ముందు నిలబడి ఉండడం నేను చూశాను. అప్పుడు గ్రంథపు చుట్టలు విప్పబడ్డాయి. అయితే ఇంకో గ్రంథపు చుట్ట విప్పబడింది, అది జీవగ్రంథం.+ చనిపోయినవాళ్లు గ్రంథపు చుట్టల్లో రాసివున్న వాటి ప్రకారం తమతమ పనుల్ని బట్టి తీర్పు పొందారు.+ 13 సముద్రం దానిలో ఉన్న మృతుల్ని అప్పగించింది. మరణం, సమాధి* వాటిలో ఉన్న మృతుల్ని అప్పగించాయి. వాళ్లలో ప్రతీ ఒక్కరు తమతమ పనుల్ని బట్టి తీర్పు పొందారు.+ 14 మరణం, సమాధి* అగ్ని సరస్సులో పడేయబడ్డాయి.+ ఈ అగ్ని సరస్సు రెండో మరణాన్ని సూచిస్తుంది.+ 15 అంతేకాదు, ఎవరి పేర్లయితే జీవగ్రంథంలో లేవో వాళ్లు అగ్ని సరస్సులో పడేయబడ్డారు.

21 అప్పుడు నేను కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని చూశాను.+ ఎందుకంటే ముందున్న ఆకాశం, భూమి గతించిపోయాయి;+ సముద్రం ఇక లేదు. 2 అంతేకాదు, పవిత్ర నగరమైన కొత్త యెరూషలేము, కాబోయే భర్త కోసం అలంకరించబడిన పెళ్లికూతురిలా+ పరలోకంలోని దేవుని దగ్గర నుండి దిగిరావడం+ నేను చూశాను. 3 అప్పుడు సింహాసనం నుండి వచ్చిన ఒక పెద్ద స్వరం ఇలా చెప్పడం నేను విన్నాను: “ఇదిగో! దేవుని నివాసం* మనుషులతో ఉంది. ఆయన వాళ్లతో పాటు నివసిస్తాడు. వాళ్లు ఆయన ప్రజలుగా ఉంటారు. దేవుడే స్వయంగా వాళ్లతోపాటు ఉంటాడు.+ 4 వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు.+ మరణం ఇక ఉండదు,+ దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.+ అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి.”

5 అప్పుడు సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుడు ఇలా అన్నాడు: “ఇదిగో! నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను.”+ ఆయన ఇంకా ఇలా అన్నాడు: “ఈ మాటలు నమ్మదగినవి,* సత్యమైనవి కాబట్టి రాయి.” 6 ఆయన నాతో ఇలా అన్నాడు: “అవి నెరవేరాయి! నేనే ఆల్ఫాను, ఓమెగను.* నేనే ఆరంభాన్ని, ముగింపును.+ ఎవరికైనా దాహంగా ఉంటే, వాళ్లకు నేను జీవజలాల ఊట* నుండి ఉచితంగా నీళ్లు ఇస్తాను.+ 7 జయించే ప్రతీ వ్యక్తి వీటిని పొందుతాడు.* నేను అతనికి దేవునిగా ఉంటాను, అతను నాకు కుమారుడిగా ఉంటాడు. 8 అయితే పిరికివాళ్లు, విశ్వాసం లేనివాళ్లు,+ అసహ్యమైన పనులు చేసే అపవిత్రులు, హంతకులు,+ లైంగిక పాపం* చేసేవాళ్లు,+ మంత్రతంత్రాలు చేసేవాళ్లు, విగ్రహాల్ని పూజించేవాళ్లు, అబద్ధాలకోరులందరూ+ అగ్నిగంధకాలతో మండుతున్న సరస్సులో పడేయబడతారు.+ ఇది రెండో మరణాన్ని సూచిస్తుంది.”+

9 చివరి ఏడు తెగుళ్లతో+ నిండిన ఏడు గిన్నెలు పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒక దేవదూత వచ్చి నాతో ఇలా అన్నాడు: “రా, గొర్రెపిల్లకు భార్య కాబోయే పెళ్లికూతుర్ని+ నీకు చూపిస్తాను.” 10 అతను పవిత్రశక్తి ద్వారా నన్ను ఒక ఎత్తైన గొప్ప పర్వతానికి తీసుకెళ్లాడు. అతను, పవిత్ర నగరమైన యెరూషలేము పరలోకంలోని దేవుని దగ్గర నుండి దిగిరావడం+ నాకు చూపించాడు. 11 దానికి దేవుని మహిమ ఉంది.+ అది ఎంతో అమూల్యమైన రాయిలా, స్ఫటికమంత స్పష్టంగా మెరిసే సూర్యకాంతపు రాయిలా ప్రకాశిస్తోంది.+ 12 ఆ నగరానికి ఎత్తైన పెద్ద ప్రాకారం, 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ గుమ్మాల దగ్గర 12 మంది దేవదూతలు ఉన్నారు. ఆ గుమ్మాల మీద ఇశ్రాయేలీయుల 12 గోత్రాల పేర్లు చెక్కబడి ఉన్నాయి. 13 తూర్పు వైపు మూడు గుమ్మాలు, ఉత్తరం వైపు మూడు గుమ్మాలు, దక్షిణం వైపు మూడు గుమ్మాలు, పడమటి వైపు మూడు గుమ్మాలు ఉన్నాయి.+ 14 ఆ నగర ప్రాకారానికి 12 పునాదిరాళ్లు కూడా ఉన్నాయి. వాటిమీద గొర్రెపిల్ల 12 మంది అపొస్తలుల 12 పేర్లు+ ఉన్నాయి.

15 నాతో మాట్లాడుతున్న దేవదూత ఆ నగరాన్ని, దాని గుమ్మాల్ని, ప్రాకారాన్ని కొలవడానికి పొడవైన బంగారు కొలకర్ర చేతితో పట్టుకొని ఉన్నాడు.+ 16 ఆ నగరం చతురస్రాకారంలో ఉంది; దాని పొడవు, వెడల్పు సమానం. అతను ఆ కొలకర్రతో నగరాన్ని కొలిచినప్పుడు అది దాదాపు 2,220 కిలోమీటర్లు* ఉంది. దాని పొడవు, వెడల్పు, ఎత్తు అన్నీ సమానంగా ఉన్నాయి. 17 అతను ఆ నగర ప్రాకారాన్ని కూడా కొలిచాడు. మనిషి కొలత ప్రకారం అది 144 మూరలు* ఉంది. దేవదూత కొలత ప్రకారం కూడా అంతే ఉంది. 18 ఆ ప్రాకారం సూర్యకాంతపు రాయితో చేయబడింది;+ ఆ నగరం స్పష్టమైన గాజు లాంటి స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. 19 ఆ నగర ప్రాకారం పునాదులు అన్నిరకాల అమూల్యమైన రాళ్లతో అలంకరించబడి ఉన్నాయి: మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండో పునాది నీలం రాయి, మూడో పునాది యమునారాయి, నాలుగో పునాది మరకతం, 20 ఐదో పునాది వైడూర్యం, ఆరో పునాది కెంపు, ఏడో పునాది లేతపచ్చ రాయి, ఎనిమిదో పునాది గోమేధికం, తొమ్మిదో పునాది పుష్యరాగం, పదో పునాది సువర్ణ సునీయం, పదకొండో పునాది పద్మరాగం, పన్నెండో పునాది ఊదారంగు రాయి. 21 అంతేకాదు, దాని 12 గుమ్మాలు 12 ముత్యాలు. ఒక్కో గుమ్మం ఒక ముత్యంతో చేయబడింది. ఆ నగర ముఖ్యవీధి పారదర్శక గాజు లాంటి స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది.

22 ఆ నగరంలో నాకు ఆలయం కనిపించలేదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన యెహోవా* దేవుడే+ దాని ఆలయం, అలాగే గొర్రెపిల్ల కూడా. 23 ఆ నగరం మీద సూర్యుడు గానీ చంద్రుడు గానీ ప్రకాశించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని మహిమ దాన్ని ప్రకాశింపజేసింది.+ గొర్రెపిల్లే దానికి దీపం.+ 24 ఆ నగరం వెలుగులో దేశాలు నడుస్తాయి.+ భూమ్మీది రాజులు తమ మహిమను దానిలోకి తీసుకొస్తారు. 25 పగలు దాని గుమ్మాలు అస్సలు మూయబడవు. ఎందుకంటే అక్కడ రాత్రి అనేదే ఉండదు.+ 26 దేశాల మహిమను, ఘనతను వాళ్లు దానిలోకి తీసుకొస్తారు.+ 27 అయితే అపవిత్రమైనది ఏదీ, అసహ్యమైన-మోసకరమైన పనులుచేసే వాళ్లెవ్వరూ ఏ విధంగానూ దానిలో ప్రవేశించరు.+ గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లయితే రాయబడ్డాయో వాళ్లు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు.+

22 తర్వాత ఆ దేవదూత నాకు జీవజలాల నదిని+ చూపించాడు. ఆ నది స్ఫటికంలా స్పష్టంగా ఉంది. అది దేవునికి, గొర్రెపిల్లకు చెందిన సింహాసనం నుండి ప్రవహిస్తోంది. 2 ఆ నది, నగర ముఖ్యవీధి మధ్యలో ప్రవహిస్తోంది. నదికి రెండువైపులా జీవవృక్షాలు ఉన్నాయి. అవి ప్రతీనెల ఫలిస్తూ సంవత్సరానికి 12 కాపులు కాస్తున్నాయి. ఆ వృక్షాల ఆకులు దేశాల్ని స్వస్థపర్చడం కోసం ఉన్నాయి.+

3 ఇక ఎప్పటికీ ఆ నగరం మీద శాపం అనేదే ఉండదు. అయితే దేవునికి, గొర్రెపిల్లకు చెందిన సింహాసనం+ ఆ నగరంలో ఉంటుంది. దేవుని దాసులు ఆయనకు పవిత్రసేవ చేస్తారు. 4 వాళ్లు ఆయన ముఖం చూస్తారు,+ ఆయన పేరు వాళ్ల నొసళ్ల మీద ఉంటుంది. 5 అంతేకాదు, రాత్రి ఇక ఉండదు. దీపకాంతి గానీ సూర్యకాంతి గానీ వాళ్లకు అవసరం లేదు. ఎందుకంటే యెహోవా* దేవుడే వాళ్లమీద వెలుగు ప్రసరిస్తాడు.+ వాళ్లు యుగయుగాలు రాజులుగా పరిపాలిస్తారు.+

6 ఆ దేవదూత నాతో ఇలా అన్నాడు: “ఈ మాటలు నమ్మదగినవి,* సత్యమైనవి.+ అవును, ప్రవక్తల్ని ప్రేరేపించిన యెహోవా* దేవుడే,+ త్వరలో జరగబోయేవాటిని తన దాసులకు చూపించడానికి తన దూతను పంపించాడు. 7 ఇదిగో! నేను త్వరగా వస్తున్నాను.+ ఈ గ్రంథపు చుట్టలోని ప్రవచన మాటల్ని పాటించే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.”+

8 యోహాను అనే నేను ఈ విషయాలు విన్నాను, చూశాను. నేను వాటిని విన్నప్పుడు, చూసినప్పుడు నాకు వాటిని చూపించిన దేవదూతను ఆరాధించడానికి అతని పాదాల ముందు మోకరించాను. 9 అయితే అతను నాతో ఇలా అన్నాడు: “వద్దు! అలా చేయొద్దు! నేను కూడా నీలాగే, ప్రవక్తలైన నీ సహోదరుల్లాగే, ఈ గ్రంథపు చుట్టలోని మాటల్ని పాటిస్తున్న వాళ్లలాగే ఒక దాసుణ్ణి మాత్రమే. దేవుణ్ణే ఆరాధించు.”+

10 అతను నాతో ఇంకా ఇలా అన్నాడు: “ఈ గ్రంథపు చుట్టలోని ప్రవచన మాటల్ని రహస్యంగా ఉంచొద్దు. ఎందుకంటే, నిర్ణయించిన సమయం దగ్గర్లో ఉంది. 11 అన్యాయస్థుణ్ణి అన్యాయంగానే నడుచుకోనివ్వు, అపవిత్రుణ్ణి అపవిత్రంగానే నడుచుకోనివ్వు; అయితే, నీతిమంతుణ్ణి నీతిగానే నడుచుకోనివ్వు, పవిత్రుణ్ణి పవిత్రంగానే నడుచుకోనివ్వు.

12 “ ‘ఇదిగో! నేను త్వరగా వస్తున్నాను. నేనిచ్చే బహుమతి నా దగ్గరే ఉంది. నేను ప్రతీ ఒక్కరికి వాళ్ల పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాను.+ 13 నేనే ఆల్ఫాను, ఓమెగను;*+ మొదటివాణ్ణి, చివరివాణ్ణి; ఆరంభాన్ని, ముగింపును. 14 తమ వస్త్రాలు ఉతుక్కున్న వాళ్లు+ సంతోషంగా ఉంటారు. వాళ్లకు జీవవృక్షాల దగ్గరికి వెళ్లే అధికారం ఉంటుంది,+ వాళ్లు గుమ్మాల+ ద్వారా నగరంలోకి వెళ్లగలుగుతారు. 15 అయితే కుక్కల లాంటివాళ్లు,* మంత్రతంత్రాలు చేసేవాళ్లు, లైంగిక పాపం* చేసేవాళ్లు, హంతకులు, విగ్రహాల్ని పూజించేవాళ్లు, అబద్ధాన్ని ప్రేమించి అబద్ధాలాడే ప్రతీ ఒక్కరు నగరం బయట ఉంటారు.’+

16 “ ‘యేసు అనే నేను, సంఘాల ప్రయోజనం కోసం ఈ విషయాల గురించి మీకు సాక్ష్యమివ్వడానికి నా దూతను పంపించాను. నేను దావీదు వేరును, దావీదు సంతానాన్ని;+ ప్రకాశవంతమైన వేకువ చుక్కను.’ ”+

17 పవిత్రశక్తి, పెళ్లికూతురు,+ “రండి!” అని అంటూ ఉన్నారు. దాన్ని వింటున్నవాళ్లు ఎవరైనా సరే “రండి!” అని చెప్పాలి. దాహంగా ఉన్న ఎవరినైనా సరే రానివ్వండి.+ ఇష్టమున్న ఎవరినైనా ఉచితంగా జీవజలాలు తాగనివ్వండి.+

18 “ఈ గ్రంథపు చుట్టలోని ప్రవచన మాటల్ని వినే ప్రతీ ఒక్కరికి నేను సాక్ష్యమిస్తున్నాను: వీటికి ఎవరైనా ఏదైనా కలిపితే,+ ఈ గ్రంథపు చుట్టలో రాసివున్న తెగుళ్లను దేవుడు అతని మీదికి రప్పిస్తాడు.+ 19 ఎవరైనా ఈ ప్రవచనానికి సంబంధించిన గ్రంథపు చుట్టలోని మాటల్లో నుండి ఏదైనా తీసేస్తే, దేవుడు అతన్ని ఈ గ్రంథపు చుట్టలో వర్ణించిన మంచివాటిని పొందనివ్వడు. అంటే దేవుడు అతన్ని జీవవృక్షాల పండ్లు+ తిననివ్వడు, పవిత్ర నగరంలో+ అడుగుపెట్టనివ్వడు.

20 “ఈ విషయాల గురించి సాక్ష్యమిచ్చే వ్యక్తి ఇలా అంటున్నాడు: ‘అవును, నేను త్వరగా వస్తున్నాను.’ ”+

“ఆమేన్‌! ప్రభువైన యేసూ, రా.”

21 యేసు ప్రభువు అపారదయ పవిత్రులకు తోడుండాలి.

లేదా “ప్రకటించిన.”

అక్ష., “మృతుల్లో నుండి బ్రతికినవాళ్లలో జ్యేష్ఠుడు.”

ఆల్ఫా, ఓమెగ అనేవి గ్రీకు అక్షరమాలలో మొదటి, చివరి అక్షరాలు.

అనుబంధం A5 చూడండి.

లేదా “హేడిస్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.

అక్ష., “వాళ్లు సాతాను సమాజమందిరం.”

అంటే, శాశ్వత మరణం.

అక్ష., “నా పేరును గట్టిగా పట్టుకునే ఉన్నావు.”

లేదా “నిరాకరించలేదు.”

పదకోశం చూడండి.

పదకోశం చూడండి.

గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.

లేదా “లోతైన భావోద్వేగాల్ని.” అక్ష., “మూత్రపిండాల్ని.”

అక్ష., “సాతాను లోతైన విషయాలు.”

లేదా “పరిపాలిస్తాడు.”

అక్ష., “మిగతావాటిని.”

లేదా “నా దేవుని ముందు నీ పనులు సంపూర్ణంగా లేవు.”

అక్ష., “కొన్ని పేర్లు.”

అక్ష., “అతని పేరును.”

అక్ష., “నా పేరుకు.”

అక్ష., “సమాజమందిరానికి.”

లేదా “సాష్టాంగ నమస్కారం చేసేలా.”

లేదా “సహనం విషయంలో నా ఆదర్శాన్ని పాటించావు” అయ్యుంటుంది.

అక్ష., “గంటలో.”

లేదా “అమూల్యమైన ఎర్రని రాయిలా.”

లేదా “సింహాసనంతో పాటు.”

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

లేదా “లోపల, బయట.”

లేదా “మధ్యలో.”

లేదా “గొర్రెపిల్ల.”

ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.

ఇది ఒక రోజు కూలితో సమానమైన రోమా వెండి నాణెం. అనుబంధం B14 చూడండి.

అక్ష., “ఒక క్వార్ట్‌.” అనుబంధం B14 చూడండి.

అక్ష., “మూడు క్వార్ట్‌ల.” అనుబంధం B14 చూడండి.

లేదా “హేడిస్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.

లేదా “ప్రాణాల్ని.” పదకోశం చూడండి.

బహుశా మేక వెంట్రుకలు కావచ్చు.

వీళ్ల కింద 1,000 మంది సైనికులు ఉండేవాళ్లు.

లేదా “సూర్యోదయం వైపు.”

లేదా “వాళ్లను కాపాడతాడు.”

లేదా “మధ్యలో.”

లేదా “బుగ్గల.”

లేదా “బుగ్గల.”

పదకోశం చూడండి.

లేదా “ఛాతి కవచాల.”

“నాశనం” అని అర్థం.

“నాశకుడు” అని అర్థం.

పదకోశం చూడండి.

గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.

అక్ష., “పాదాలు.”

లేదా “కొలకర్ర.”

లేదా “పరలోకాన్ని.”

లేదా “ఈజిప్టు.”

లేదా “చూస్తూ ఉన్నారు.”

అక్ష., “ఆ గంటలోనే.”

అనుబంధం A5 చూడండి.

అంటే, ఆలయంలోని అతి పవిత్ర స్థలం.

లేదా “నిబంధన.”

లేదా “పెద్దపెట్టె.”

పదకోశం చూడండి.

“దేవుని వంటి వాడు ఎవడు?” అని అర్థం.

లేదా “కానీ అది [అంటే, ఆ మహాసర్పం] ఓడిపోయింది” అయ్యుంటుంది.

పదకోశం చూడండి.

అంటే, మూడున్నర కాలాలు.

అక్ష., “విత్తనంలో.”

అంటే, మహాసర్పం.

అక్ష., “(విత్తనం) పడిన,” అంటే ఆదాముహవ్వలకు పిల్లలు పుట్టిన.

లేదా “ఎవరైనా ఖడ్గంతో చంపబడాల్సి ఉంటే” అయ్యుంటుంది.

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

లేదా “మానవ సంఖ్య.”

ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.

లేదా “తల పైన.”

లేదా “శాశ్వతకాల మంచివార్త.”

లేదా “బుగ్గల్ని.”

గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.

లేదా “ఉద్రేకం.”

లేదా “నిర్బంధించే; బంధించే.”

లేదా “ప్రభువుతో ఐక్యంగా ఉండి.”

అంటే, ఆలయంలోని అతి పవిత్ర స్థలం.

అక్ష., “గంట.”

అక్ష., “1,600 స్టేడియా.” అప్పట్లో ఒక స్టేడియం 185 మీటర్లతో (606.95 అడుగులతో) సమానం. అనుబంధం B14 చూడండి.

ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

లేదా “బుగ్గల.”

అనుబంధం A5 చూడండి.

లేదా “న్యాయనిర్ణయాలు.”

లేదా “నాలుకలు.”

లేదా “సూర్యోదయం వైపు.”

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

పదకోశం చూడండి.

లేదా “ఆ సందేశాలు.”

అక్ష., “దిగంబరంగా.”

“మెగిద్దో పర్వతం” అని అర్థం. లేదా “అర్మగిద్దోను.”

అక్ష., “ఒక తలాంతు బరువు.” అప్పట్లో ఒక గ్రీకు తలాంతు 20.4 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.

పదకోశం చూడండి.

గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.

గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.

అక్ష., “(విత్తనం) పడిన,” అంటే ఆదాముహవ్వలకు పిల్లలు పుట్టిన.

పదకోశం చూడండి.

లేదా “ఊపిరితో; నిశ్వాసతో; ప్రేరేపిత సందేశంతో” అయ్యుంటుంది.

గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.

లేదా “ఉద్రేకం.”

లేదా “ప్రయాణ వర్తకులు.”

అక్ష., “ఆమెలో.”

లేదా “ఆమె నేరాల్ని.”

అనుబంధం A5 చూడండి.

పదకోశం చూడండి.

లేదా “నీ ప్రాణం.”

ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.

అంటే, ఫ్లూటు.

లేదా “హల్లెలూయా!” “యా” అనేది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.

గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.

లేదా “హల్లెలూయా!” “యా” అనేది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.

లేదా “హల్లెలూయా!” “యా” అనేది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.

లేదా “హల్లెలూయా!” “యా” అనేది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.

అనుబంధం A5 చూడండి.

లేదా “సంతోషంగా ఉంటారు.”

లేదా “రక్తం చిమ్మబడిన” అయ్యుంటుంది.

లేదా “తల పైన.”

వీళ్ల కింద 1,000 మంది సైనికులు ఉండేవాళ్లు.

అక్ష., “గొడ్డలితో నరకబడిన.”

లేదా “ప్రాణాల్ని.” పదకోశం చూడండి.

లేదా “అదుపుచేయబడతారు; బంధించబడతారు.” ప్రకటన 14:11 అధస్సూచి చూడండి.

లేదా “హేడిస్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.

లేదా “హేడిస్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.

అక్ష., “డేరా.”

లేదా “నమ్మకమైనవి.”

ఆల్ఫా, ఓమెగ అనేవి గ్రీకు అక్షరమాలలో మొదటి, చివరి అక్షరాలు.

లేదా “బుగ్గ.”

అక్ష., “స్వాస్థ్యంగా పొందుతాడు.”

పదకోశం చూడండి.

అక్ష., “12,000 స్టేడియా.” అప్పట్లో ఒక స్టేడియం 185 మీటర్లతో (606.95 అడుగులతో) సమానం. అనుబంధం B14 చూడండి.

దాదాపు 64 మీటర్లు (210 అడుగులు). అనుబంధం B14 చూడండి.

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

లేదా “నమ్మకమైనవి.”

అనుబంధం A5 చూడండి.

ఆల్ఫా, ఓమెగ అనేవి గ్రీకు అక్షరమాలలో మొదటి, చివరి అక్షరాలు.

అంటే, ఎవరి పనులైతే దేవుని దృష్టికి అసహ్యంగా ఉన్నాయో వాళ్లు.

పదకోశం చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి