కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • nwt ఓబద్యా 1-21
  • ఓబద్యా

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఓబద్యా
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఓబద్యా

ఓబద్యా

1 ఓబద్యాకు* వచ్చిన దర్శనం.

ఎదోము గురించి సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే:+

“మేము యెహోవా నుండి ఒక వార్త విన్నాం.

‘లెండి, ఆమెతో యుద్ధం చేయడానికి సిద్ధమౌదాం’

అని చెప్పడానికి దేశాల మధ్యకు ఒక రాయబారి పంపబడ్డాడు.”+

 2 “ఇదిగో! దేశాల మధ్య నిన్ను తక్కువవాడిగా చేశాను;

నువ్వు పూర్తిగా తిరస్కరించబడ్డావు.+

 3 నీ అహంకార హృదయం నిన్ను మోసం చేసింది,+

బండ సందుల్లో నివసించేవాడా,

ఎత్తులో ఉండేవాడా,

‘నన్నెవరు కింద పడేస్తారు?’ అని నీ హృదయంలో అనుకుంటున్నావు.

 4 నువ్వు గద్దలా ఎత్తులో నివాసం ఏర్పర్చుకున్నా,*

నక్షత్రాల మధ్య గూడు కట్టుకున్నా,

అక్కడి నుండి నేను నిన్ను కింద పడేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

 5 “దొంగలు గానీ, రాత్రివేళ దోచుకునేవాళ్లు గానీ నీ దగ్గరికి వస్తే,

(నువ్వు ఎంత ఘోరంగా నాశనం చేయబడతావో!)*

వాళ్లు తమకు కావాల్సినంత మాత్రమే దోచుకుంటారు కదా?

ద్రాక్షలు సమకూర్చేవాళ్లు నీ దగ్గరికి వస్తే,

కొంత పరిగె విడిచిపెడతారు కదా?+

 6 ఏశావు పూర్తిగా సోదా చేయబడ్డాడు!

అతను దాచుకున్న సంపదలన్నీ కొల్లగొట్టబడ్డాయి!

 7 వాళ్లు నిన్ను సరిహద్దు వరకు తరిమారు.

నీతో సంధి* చేసుకున్నవాళ్లంతా నిన్ను మోసం చేశారు.

నీతో శాంతిగా ఉన్నవాళ్లు నీకు ఎదురుతిరిగారు.

నీతో కలిసి భోజనం చేస్తున్నవాళ్లు నీ కింద వల పరుస్తారు,

కానీ నువ్వు దాన్ని గ్రహించలేవు.”

 8 యెహోవా ఇలా అంటున్నాడు:

“ఆ రోజున ఎదోములోని తెలివిగలవాళ్లను,

ఏశావు పర్వత ప్రాంతంలోని వివేచనాపరుల్ని

నేను నాశనం చేయకుండా ఉంటానా?+

 9 తేమానూ,+ నీ యోధులు భయంతో వణికిపోతారు,+

ఎందుకంటే, ఏశావు పర్వత ప్రాంతంలోని ప్రతీ ఒక్కరు వధించబడతారు.+

10 నీ తమ్ముడైన యాకోబును హింసించినందుకు,+

నువ్వు అవమానాలపాలు అవుతావు,+

శాశ్వతంగా నాశనమౌతావు.+

11 పరాయివాళ్లు అతని సైన్యాన్ని చెరపట్టుకుపోయిన రోజున,+

విదేశీయులు అతని ద్వారం లోపలికి ప్రవేశించి, యెరూషలేము మీద చీట్లు* వేసిన రోజున,+

నువ్వు పక్కకు నిలబడి చూస్తూ ఉండిపోయావు, వాళ్లలో ఒకడిలా ప్రవర్తించావు.

12 నీ సహోదరుడికి కష్టం వచ్చిన రోజున అతన్ని చూసి సంతోషించావు,+

యూదా ప్రజలు నాశనమౌతున్న రోజున వాళ్లను చూసి ఆనందించావు,+

వాళ్లకు కష్టం ఎదురైన రోజున చాలా పొగరుగా మాట్లాడావు, అది తప్పు.

13 నా ప్రజల మీదికి విపత్తు వచ్చిన రోజున వాళ్ల ద్వారం లోపలికి ప్రవేశించావు,+

అతనికి కష్టం వచ్చిన రోజున అతని ఆపదను చూసి సంతోషించావు,

అతని మీదికి విపత్తు వచ్చిన రోజున అతని సంపదను ముట్టావు, నువ్వలా చేసి ఉండకూడదు.+

14 పారిపోతున్న అతని మనుషుల్ని వధించడానికి అడ్డదారుల్లో నిలబడ్డావు,+

ఆపద రోజున తప్పించుకున్న అతని మనుషుల్ని అప్పగించావు, అలా చేయడం తప్పు.+

15 యెహోవా రోజు దగ్గర్లో ఉంది, అది అన్నిదేశాల మీదికి వస్తుంది.+

నువ్వు చేసినట్టే నీకు జరుగుతుంది.+

నువ్వు ఇతరులకు చేసింది నీ తల మీదికే వస్తుంది.

16 మీరు నా పవిత్ర పర్వతం మీద ఎలా తాగారో,

అలాగే దేశాలన్నీ అదేపనిగా తాగుతూ ఉంటాయి.+

వాళ్లు ఒక్క చుక్క కూడా మిగల్చకుండా తాగేస్తారు,

వాళ్లు అసలెన్నడూ ఉనికిలో లేనట్టుగా అయిపోతారు.

17 కానీ తప్పించుకున్నవాళ్లు సీయోను పర్వతం మీద ఉంటారు,+

అది పవిత్రంగా ఉంటుంది;+

యాకోబు ఇంటివాళ్లు తమకు చెందిన వాటిని స్వాధీనం చేసుకుంటారు.+

18 యాకోబు ఇంటివాళ్లు అగ్నిలా అవుతారు,

యోసేపు ఇంటివాళ్లు మంటలా అవుతారు,

ఏశావు ఇంటివాళ్లు కొయ్యకాలులా* అవుతారు;

వాళ్లు వాళ్లను కాల్చి బూడిద చేస్తారు,

ఏశావు ఇంటివాళ్లలో తప్పించుకునేవాళ్లు ఎవ్వరూ ఉండరు,+

ఎందుకంటే, యెహోవాయే స్వయంగా చెప్పాడు.

19 వాళ్లు నెగెబును, ఏశావు పర్వత ప్రాంతాన్ని,

షెఫేలాను, ఫిలిష్తీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.+

వాళ్లు ఎఫ్రాయిము భూముల్ని, సమరయ భూముల్ని స్వాధీనం చేసుకుంటారు,+

బెన్యామీను గిలాదును స్వాధీనం చేసుకుంటాడు.

20 ఈ ప్రాకారం+ నుండి చెరగా తీసుకెళ్లబడినవాళ్లకు,

అంటే ఇశ్రాయేలు ప్రజలకు సారెపతు+ వరకున్న కనానీయుల దేశం ఇవ్వబడుతుంది.

యెరూషలేము నుండి చెరగా తీసుకెళ్లబడి సెఫారాదులో ఉంటున్న ప్రజలు

నెగెబు నగరాల్ని స్వాధీనం చేసుకుంటారు.+

21 ఏశావు పర్వత ప్రాంతానికి తీర్పుతీర్చడానికి+

రక్షకులు సీయోను పర్వతం మీదికి వెళ్తారు,

రాజ్యాధికారం యెహోవాది అవుతుంది.”+

“యెహోవా సేవకుడు” అని అర్థం.

లేదా “ఎత్తులో ఎగిరినా” అయ్యుంటుంది.

లేదా “వాళ్లు ఎంత నాశనం చేస్తారు?” అయ్యుంటుంది.

లేదా “ఒప్పందం.”

పదకోశం చూడండి.

పంట కోసిన తర్వాత నేలమీద మిగిలే కాడల దుబ్బు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి