ఆమోసు
1 తెకోవలోని+ గొర్రెల కాపరుల్లో ఒకడైన ఆమోసుకు* ఇశ్రాయేలు గురించి వచ్చిన దర్శనంలోని మాటలు. ఉజ్జియా రాజు+ యూదాను పరిపాలిస్తున్న కాలంలో, యోవాషు+ కుమారుడైన యరొబాము+ ఇశ్రాయేలును పరిపాలిస్తున్న కాలంలో, భూకంపం+ రావడానికి రెండు సంవత్సరాల ముందు అతనికి ఈ దర్శనం వచ్చింది. 2 అతను ఇలా చెప్పాడు:
“యెహోవా సీయోనులో నుండి గర్జిస్తాడు,
యెరూషలేములో నుండి తన స్వరం వినిపిస్తాడు.
కాపరుల పచ్చిక మైదానాలు విలపిస్తాయి,
కర్మెలు పర్వత శిఖరం ఎండిపోతుంది.”+
3 “యెహోవా ఇలా అంటున్నాడు:
‘ “దమస్కు మూడుసార్లు, నాలుగుసార్లు చేసిన తిరుగుబాటును* బట్టి నేను దాన్ని శిక్షిస్తాను, నా నిర్ణయం మార్చుకోను.
ఎందుకంటే, వాళ్లు పంట నూర్చే ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చారు.+
4 కాబట్టి నేను హజాయేలు+ ఇంటి మీదికి అగ్నిని పంపిస్తాను,
అది బెన్హదదు పటిష్ఠమైన బురుజుల్ని దహించేస్తుంది.+
5 నేను దమస్కు అడ్డ గడియలు విరగ్గొడతాను;+
బికత్తావెను నివాసుల్ని నాశనం చేస్తాను,
బెతేదేను నుండి పరిపాలిస్తున్న రాజును* నాశనం చేస్తాను;
సిరియా ప్రజలు కీరుకు బందీలుగా తీసుకెళ్లబడతారు”+ అని యెహోవా చెప్తున్నాడు.’
6 యెహోవా ఇలా అంటున్నాడు:
‘ “గాజా మూడుసార్లు, నాలుగుసార్లు చేసిన తిరుగుబాటును బట్టి+ నేను దాన్ని శిక్షిస్తాను, నా నిర్ణయం మార్చుకోను.
ఎందుకంటే, వాళ్లు బందీల గుంపంతటినీ+ ఎదోముకు అప్పగించారు.
7 కాబట్టి నేను గాజా ప్రాకారం మీదికి అగ్నిని పంపిస్తాను,+
అది దాని పటిష్ఠమైన బురుజుల్ని దహించేస్తుంది.
8 నేను అష్డోదు నివాసుల్ని నాశనం చేస్తాను,+
అష్కెలోను నుండి పరిపాలిస్తున్న రాజును* నాశనం చేస్తాను;+
ఎక్రోనుకు వ్యతిరేకంగా నా చెయ్యి తిప్పుతాను,+
మిగిలిన ఫిలిష్తీయులు తుడిచిపెట్టుకుపోతారు”+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.’
9 యెహోవా ఇలా అంటున్నాడు:
‘తూరు మూడుసార్లు, నాలుగుసార్లు చేసిన తిరుగుబాటును బట్టి+ నేను దాన్ని శిక్షిస్తాను, నా నిర్ణయం మార్చుకోను.
ఎందుకంటే, వాళ్లు బందీల గుంపంతటినీ ఎదోముకు అప్పగించారు,
10 కాబట్టి నేను తూరు ప్రాకారం మీదికి అగ్నిని పంపిస్తాను,
అది దాని పటిష్ఠమైన బురుజుల్ని దహించేస్తుంది.’+
11 యెహోవా ఇలా అంటున్నాడు:
‘ఎదోము మూడుసార్లు, నాలుగుసార్లు చేసిన తిరుగుబాటును బట్టి+ నేను దాన్ని శిక్షిస్తాను, నా నిర్ణయం మార్చుకోను.
ఎందుకంటే, అతను కత్తి పట్టుకుని సొంత తమ్ముణ్ణి వెంటాడాడు,+
ఏమాత్రం కరుణ చూపించలేదు;
కోపంతో అతను వాళ్లను క్రూరంగా చీల్చేస్తూ ఉన్నాడు,
వాళ్ల మీద అతని కోపం చల్లారడం లేదు.+
13 యెహోవా ఇలా అంటున్నాడు:
‘ “అమ్మోనీయులు మూడుసార్లు, నాలుగుసార్లు చేసిన తిరుగుబాటును బట్టి+ నేను వాళ్లను శిక్షిస్తాను, నా నిర్ణయం మార్చుకోను.
ఎందుకంటే, వాళ్లు తమ సరిహద్దులు విశాలపర్చుకోవడానికి గిలాదులోని గర్భిణుల కడుపుల్ని చీల్చారు.+
14 కాబట్టి నేను రబ్బా ప్రాకారానికి నిప్పు అంటిస్తాను;+
అది, యుద్ధం జరిగే రోజున యుద్ధకేకతో,
తుఫాను గాలి వీచే రోజున అల్లకల్లోలంతో
దాని పటిష్ఠమైన బురుజుల్ని దహించేస్తుంది.
15 వాళ్ల రాజు తన రాకుమారులతో పాటు బందీగా తీసుకెళ్లబడతాడు”+ అని యెహోవా చెప్తున్నాడు.’
2 “యెహోవా ఇలా అంటున్నాడు:
‘ “మోయాబు మూడుసార్లు, నాలుగుసార్లు చేసిన తిరుగుబాటును* బట్టి+ నేను దాన్ని శిక్షిస్తాను, నా నిర్ణయం మార్చుకోను.
ఎందుకంటే, సున్నం కోసం అతను ఎదోము రాజు ఎముకల్ని కాల్చాడు.
2 కాబట్టి నేను మోయాబు మీదికి అగ్నిని పంపిస్తాను,
అది కెరీయోతు పటిష్ఠమైన బురుజుల్ని దహించేస్తుంది;+
యుద్ధకేకతో, బూర* శబ్దంతో,
హాహాకారాల మధ్య మోయాబు చనిపోతుంది.+
3 నేను దాని మధ్య నుండి పరిపాలకుణ్ణి* తొలగిస్తాను,
రాజుతోపాటు దాని రాకుమారులందర్నీ చంపేస్తాను”+ అని యెహోవా చెప్తున్నాడు.’
4 యెహోవా ఇలా అంటున్నాడు:
‘యూదా మూడుసార్లు, నాలుగుసార్లు చేసిన తిరుగుబాటును బట్టి+ నేను దాన్ని శిక్షిస్తాను, నా నిర్ణయం మార్చుకోను.
ఎందుకంటే, వాళ్లు యెహోవా ధర్మశాస్త్రాన్ని* తిరస్కరించారు,
ఆయన నియమాల్ని పాటించలేదు;+
వాళ్ల పూర్వీకులు అనుసరించిన అబద్ధాలే వాళ్లను తప్పుదారి పట్టించాయి.
6 యెహోవా ఇలా అంటున్నాడు:
‘ఇశ్రాయేలు మూడుసార్లు, నాలుగుసార్లు చేసిన తిరుగుబాటును బట్టి+ నేను దాన్ని శిక్షిస్తాను, నా నిర్ణయం మార్చుకోను.
ఎందుకంటే, వాళ్లు వెండి కోసం నీతిమంతుల్ని,
ఒక జత చెప్పుల కోసం పేదవాళ్లను అమ్మేస్తారు.
తండ్రీ కుమారుడూ ఒకే అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకుంటూ,
పవిత్రమైన నా పేరును అపవిత్రపరుస్తున్నారు.
8 తాకట్టుగా* తీసుకున్న బట్టలు పర్చుకొని+ ప్రతీ బలిపీఠం పక్కన కాళ్లు చాచుకొని పడుకుంటారు,+
తమ దేవుళ్ల గుడి దగ్గర వాళ్లు తాగే ద్రాక్షారసం, వాళ్లు వసూలు చేసిన జరిమానా డబ్బుతో కొన్నది.’
9 ‘నిజానికి, వాళ్ల ముందు అమోరీయుల్ని పూర్తిగా నాశనం చేసింది నేనే,+
వాళ్లు దేవదారు చెట్లంత పొడవైనవాళ్లు, సింధూర చెట్లంత బలమైనవాళ్లు;
పైన వాళ్ల పండ్లను, కింద వాళ్ల వేర్లను నేను నాశనం చేశాను.+
ఇశ్రాయేలు ప్రజలారా, అది నిజం కాదా?’ అని యెహోవా అంటున్నాడు.
12 ‘కానీ మీరు నాజీరులకు ద్రాక్షారసం ఇస్తూ వచ్చారు,+
ప్రవక్తలకు, “మీరు ప్రవచించకూడదు” అని ఆజ్ఞాపించారు.+
13 కాబట్టి, అప్పుడే కోసిన ధాన్యంతో నిండిన బండి దానికింద ఉన్నవాటిని నలగ్గొట్టినట్టు,
మీరు ఉన్న చోటనే నేను మిమ్మల్ని నలగ్గొడతాను.
14 వేగంగా పరుగెత్తేవాడికి పారిపోవడానికి చోటే ఉండదు,+
బలవంతుడు తన శక్తిని కోల్పోతాడు,
యోధులెవ్వరూ ప్రాణాలతో బయటపడరు.
15 విలుకాడు తానున్న చోట నిలబడలేడు,
వేగంగా పరుగెత్తేవాడు తప్పించుకోలేడు,
గుర్రపురౌతులు ప్రాణాలతో బయటపడలేరు.
3 “ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మీ గురించి చెప్పిన మాట వినండి;
ఐగుప్తు దేశం నుండి ఆయన బయటికి తీసుకొచ్చిన ఇశ్రాయేలు కుటుంబమంతటి గురించి ఆయన చెప్పిన ఈ మాట వినండి:
2 ‘భూమ్మీదున్న కుటుంబాలన్నిట్లో మీరు మాత్రమే నాకు తెలుసు,+
అందుకే, మీ తప్పులన్నిటి విషయంలో మిమ్మల్ని లెక్క అడుగుతాను.+
3 ముందే అనుకుని కలుసుకుంటే తప్ప, ఇద్దరు వ్యక్తులు కలిసి నడుస్తారా?
4 జంతువు కనబడకుండానే అడవిలో సింహం గర్జిస్తుందా?
ఏమీ పట్టుకోకుండానే గుహలో ఉన్న కొదమ సింహం గుర్రుమంటుందా?
5 నేలమీద ఉచ్చు* లేకుండానే పక్షి ఉచ్చులో చిక్కుకుంటుందా?
ఏమీ చిక్కుకోకుండానే ఉచ్చు నేలమీద నుండి పైకి లేస్తుందా?
6 నగరంలో బూర* ఊదినప్పుడు, ప్రజలు భయంతో వణికిపోకుండా ఉంటారా?
నగరంలో విపత్తు వచ్చిందంటే, అది యెహోవా రప్పించింది కాదా?
8 సింహం గర్జించింది!+ భయపడని వాళ్లెవరు?
సర్వోన్నత ప్రభువైన యెహోవా మాట్లాడాడు! ప్రవచించని వాళ్లెవరు?’+
9 ‘అష్డోదు పటిష్ఠమైన బురుజుల మీద,
ఐగుప్తు దేశపు పటిష్ఠమైన బురుజుల మీద దీన్ని చాటించండి:
“సమరయ పర్వతాలకు వ్యతిరేకంగా సమకూడండి,+
దాని మధ్య చెలరేగిన అల్లకల్లోలాన్ని,
దానిలో జరుగుతున్న మోసాల్ని చూడండి.+
10 సరైనది ఎలా చేయాలో వాళ్లకు తెలీదు” అని యెహోవా అంటున్నాడు,
“వాళ్లు తమ పటిష్ఠమైన బురుజుల్లో హింసను, నాశనాన్ని పోగుచేసుకుంటున్నారు.” ’
11 కాబట్టి, సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:
‘దేశాన్ని శత్రువు చుట్టుముడతాడు,+
అతను నీ బలాన్ని లాగేసుకుంటాడు,
నీ పటిష్ఠమైన బురుజుల్ని కొల్లగొడతాడు.’+
12 యెహోవా ఇలా అంటున్నాడు:
‘కాపరి, సింహం నోటి నుండి గొర్రె రెండు కాళ్లనో, చెవి ముక్కనో లాగేసినట్టు,
ఇశ్రాయేలు ప్రజలు లాగేయబడతారు,
ఇప్పుడు సమరయలో అందమైన మంచాల మీద, శ్రేష్ఠమైన* ఆసనాల* మీద కూర్చున్నవాళ్లు లాగేయబడతారు.’+
13 ‘నేను చెప్పేది విని, యాకోబు ఇంటివాళ్లను హెచ్చరించు’* అని సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు దేవుడూ అయిన యెహోవా అంటున్నాడు.
14 ‘ఇశ్రాయేలు చేసిన తిరుగుబాట్లన్నిటిని* బట్టి నేను దాన్ని లెక్క అడిగే రోజున,+
బేతేలులో ఉన్న బలిపీఠాల్ని కూడా లెక్క అడుగుతాను;+
బలిపీఠపు కొమ్ములు నరికేయబడి, నేలమీద పడతాయి.+
15 చలికాలపు ఇళ్లను, వేసవికాలపు ఇళ్లను నేను పడగొడతాను.’
బాషాను ఆవులారా,
దీనుల్ని దగా చేస్తూ+ పేదవాళ్లను అణగదొక్కుతున్న స్త్రీలారా,
‘తాగడానికి మా కోసం ఏమైనా తీసుకురండి!’ అని మీ భర్తలతో* చెప్తున్న స్త్రీలారా, ఈ మాట వినండి.
2 సర్వోన్నత ప్రభువైన యెహోవా తన పవిత్రత మీద ప్రమాణం చేస్తూ ఇలా అంటున్నాడు:
‘ “ఇదిగో! కసాయివాడి కొక్కేలతో ఆయన మిమ్మల్ని పైకెత్తే రోజులు,
మీలో మిగిలినవాళ్లను చేపలుపట్టే కొక్కేలతో పైకెత్తే రోజులు మీ మీదికి రాబోతున్నాయి.
3 మీలో ప్రతీ ఒక్కరు ప్రాకారాల పగుళ్ల గుండా తిన్నగా బయటికి వెళ్తారు;
మీరు హర్మోనులోకి విసిరేయబడతారు” అని యెహోవా చెప్తున్నాడు.’
5 కృతజ్ఞతార్పణలుగా పులిసిన రొట్టెల్ని+ కాల్చండి;
మీ స్వేచ్ఛార్పణల గురించి బిగ్గరగా చాటించండి!
ఇశ్రాయేలు ప్రజలారా, అలా చేయడమే కదా మీకు ఇష్టం’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.
6 ‘నేనైతే, మీ నగరాలన్నిట్లో మీ పళ్లను శుభ్రంగా ఉంచాను,*
మీ ఇళ్లన్నిట్లో రొట్టె లేకుండా చేశాను;+
అయినా మీరు నా దగ్గరికి తిరిగి రాలేదు’+ అని యెహోవా అంటున్నాడు.
7 ‘కోతకాలానికి మూడు నెలల ముందే వర్షం పడకుండా చేశాను;+
ఒక నగరం మీద వర్షం కురిపించాను, ఇంకో నగరం మీద కురిపించలేదు.
పొలంలో కొంత భాగం మీద వర్షం కురిసింది,
వర్షం కురవని భాగమేమో ఎండిపోయింది.
8 రెండు మూడు నగరాలకు చెందిన ప్రజలు ఆయాసంగా నడుస్తూ నీళ్లు తాగడానికి ఒకే నగరానికి వెళ్లారు,+
కానీ వాళ్ల దాహం తీరలేదు;
అయినా మీరు నా దగ్గరికి తిరిగి రాలేదు’+ అని యెహోవా అంటున్నాడు.
9 ‘మంట పుట్టించే వేడితో, మొక్కల తెగులుతో* నేను మిమ్మల్ని మొత్తాను.+
మీరు మీ తోటల్ని, ద్రాక్షతోటల్ని విస్తరింపజేసుకున్నారు,
అయితే మిడతలు వచ్చి మీ అంజూర చెట్లను, ఒలీవ చెట్లను మింగేశాయి;+
అప్పటికీ మీరు నా దగ్గరికి తిరిగి రాలేదు’+ అని యెహోవా అంటున్నాడు.
10 ‘ఐగుప్తు తెగులు లాంటి తెగులును నేను మీ మధ్యకు పంపించాను.+
ఖడ్గంతో మీ యువకుల్ని చంపేశాను,+ మీ గుర్రాల్ని తీసుకెళ్లిపోయాను.+
మీ డేరాల కంపు మీ ముక్కు రంధ్రాల్లోకి ఎక్కేలా చేశాను;+
అయినా మీరు నా దగ్గరికి తిరిగి రాలేదు’ అని యెహోవా అంటున్నాడు.
11 ‘నేను సొదొమ గొమొర్రాల్ని పడద్రోసినట్టు+
మిమ్మల్ని పడద్రోశాను.
మీరు మంటల్లో నుండి లాగేయబడిన కొయ్యలా అయ్యారు;
అయినా మీరు నా దగ్గరికి తిరిగి రాలేదు’+ అని యెహోవా అంటున్నాడు.
12 ఇశ్రాయేలూ, నేను నీకు అదే చేస్తాను.
నేను నీకు అలా చేస్తాను కాబట్టి,
ఇశ్రాయేలూ, నీ దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడు.
13 ఇదిగో! పర్వతాల్ని రూపొందించింది,+ గాలిని సృష్టించింది ఆయనే;+
ఆయన తన ఆలోచనల్ని మనుషులకు తెలియజేస్తాడు,
ఆయన సూర్యోదయాన్ని చీకటిగా మారుస్తాడు,+
ఆయన భూమ్మీది ఎత్తైన స్థలాలపై సంచరిస్తాడు;+
ఆయన పేరు సైన్యాలకు దేవుడైన యెహోవా.”
5 “ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, నేను మీ మీద పాడుతున్న ఈ శోకగీతం వినండి:
2 ‘కన్యయైన ఇశ్రాయేలు పడిపోయింది;
ఆమె ఇక మళ్లీ లేవలేదు.
తానున్న చోటే ఆమె వదిలేయబడింది;
ఆమెను పైకి లేపేవాళ్లు ఎవరూ లేరు.’
3 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:
‘ఒక నగరం నుండి వెయ్యిమంది యుద్ధానికి వెళ్తే వందమందే మిగులుతారు;
వందమంది వెళ్తే పదిమందే మిగులుతారు, ఇశ్రాయేలు ఇంటివాళ్లకు ఇలాగే జరుగుతుంది.’+
4 “ఇశ్రాయేలు ఇంటివాళ్లకు యెహోవా ఇలా చెప్తున్నాడు:
‘నన్ను వెదకండి, ప్రాణాలతో ఉండండి.+
గిల్గాలుకు గానీ బెయేర్షెబాకు+ గానీ వెళ్లకండి,+
ఎందుకంటే, గిల్గాలు ఖచ్చితంగా చెరలోకి వెళ్తుంది,+
బేతేలు నిర్మానుష్యం అవుతుంది.*
6 యెహోవాను వెదకండి, ప్రాణాలతో ఉండండి,+
లేదంటే, ఆయన యోసేపు ఇంటివాళ్లమీద అగ్నిలా విరుచుకుపడతాడు,
బేతేలును దహించేస్తాడు, ఆ మంటల్ని ఆర్పడానికి ఎవరూ ఉండరు.
8 కిమా నక్షత్రరాశిని,* కెసిల్ నక్షత్రరాశిని* సృష్టించిన దేవుడు+
కారుచీకటిని ఉదయకాంతిలా మార్చే దేవుడు,
పగటిని రాత్రంత చీకటిగా చేసే దేవుడు,+
భూమ్మీద కుమ్మరించడానికి
సముద్ర జలాల్ని పిలిచే దేవుడు,+
–ఆయన పేరు యెహోవా.
9 ఆయన బలవంతుల మీదికి నాశనం ముంచుకొచ్చేలా,
బలమైన ప్రాకారాలుగల ప్రాంతాలు నాశనమయ్యేలా చేస్తాడు.
10 నగర ద్వారం దగ్గర గద్దింపు ఇచ్చేవాళ్లను వాళ్లు ద్వేషిస్తారు,
నిజం చెప్పేవాళ్లను అసహ్యించుకుంటారు.+
11 మీరు పేదవాళ్ల దగ్గర పొలం అద్దె* వసూలు చేస్తున్నారు,
వాళ్ల ధాన్యాన్ని కప్పంగా తీసుకుంటున్నారు+ కాబట్టి,
మీరిక చెక్కిన రాళ్లతో కట్టుకున్న ఇళ్లలో నివసించరు,+
మీరు నాటుకున్న శ్రేష్ఠమైన ద్రాక్షతోటల ద్రాక్షారసాన్ని తాగరు.+
12 మీరు ఎన్నిసార్లు తిరుగుబాటు* చేశారో,
మీ పాపాలు ఎంత ఘోరమైనవో నాకు తెలుసు.
మీరు నీతిమంతుల్ని వేధిస్తారు,
లంచాలు* తీసుకుంటారు,
నగర ద్వారం దగ్గర పేదవాళ్ల హక్కుల్ని కాలరాస్తారు.+
13 కాబట్టి లోతైన అవగాహన ఉన్నవాళ్లు ఆ సమయంలో మౌనంగా ఉంటారు,
ఎందుకంటే అది విపత్తు సమయం.+
అప్పుడు ఆయన మీకు తోడుగా ఉన్నాడని మీరు అంటున్నట్టే
సైన్యాలకు దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉంటాడు.+
అప్పుడు యోసేపు ఇంటివాళ్లలో మిగిలినవాళ్ల మీద
సైన్యాలకు దేవుడైన యెహోవా అనుగ్రహం చూపిస్తాడేమో.’+
16 “యెహోవా, సైన్యాలకు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు:
‘సంతవీధులన్నిట్లో ఏడ్పులు వినిపిస్తాయి,
వీధులన్నిట్లో వాళ్లు “అయ్యో! అయ్యో!” అంటారు.
ఏడ్వడానికి రైతుల్ని,
డబ్బు తీసుకుని ఏడ్చేవాళ్లను పిలుస్తారు.’
17 ‘ప్రతీ ద్రాక్షతోటలో ఏడ్పులు వినిపిస్తాయి;+
ఎందుకంటే, నేను మీ మధ్య నుండి దాటి వెళ్తాను’ అని యెహోవా అంటున్నాడు.
18 ‘యెహోవా రోజు కోసం తపించే వాళ్లకు శ్రమ!+
యెహోవా రోజున ఏమి జరుగుతుందని మీరనుకుంటున్నారు?+
అది చీకటే కానీ వెలుగు కాదు.+
19 ఆ రోజు ఇలా ఉంటుంది: సింహం నుండి పారిపోయిన వ్యక్తికి ఎలుగుబంటి ఎదురౌతుంది,
అతను ఇంట్లోకి వెళ్లి గోడ మీద చెయ్యి చాపినప్పుడు పాము అతన్ని కాటేస్తుంది.
20 యెహోవా రోజు వెలుగు కాదు, చీకటే;
అది తేజస్సు కాదు, అంధకారమే.
21 నేను మీ పండుగల్ని ద్వేషిస్తున్నాను, అసహ్యించుకుంటున్నాను;+
మీ ప్రత్యేక సమావేశాల సువాసన నాకు అస్సలు ఇష్టం లేదు.
22 మీరు నాకు సంపూర్ణ దహనబలులు, కానుకలు అర్పించినా,
నేను వాటిని ఏమాత్రం ఇష్టపడను;+
కొవ్విన జంతువులతో మీరు అర్పించే సమాధాన బలుల్ని నేను ఆమోదించను.+
23 చికాకు పుట్టించే మీ పాటల ధ్వనిని నాకు వినిపించకండి;
మీ తంతివాద్యాల శ్రావ్యమైన సంగీతాన్ని నాకు వినిపించకండి.+
24 న్యాయాన్ని నీళ్లలా పారనివ్వండి,+
నీతిని నిరంతరం పారే సెలయేరులా ప్రవహించనివ్వండి.
25 ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, ఎడారిలో సంచరించిన ఆ 40 ఏళ్లు
మీరు నాకు బలులు, కానుకలు తీసుకొచ్చారా?+
26 ఇప్పుడు మీరు మీ రాజైన సక్కూతును, కైవానును,*
మీ విగ్రహాల్ని, మీరు చేసుకున్న మీ దేవుని నక్షత్రాన్ని మీరు మోసుకెళ్లాల్సిందే.
27 నేను మిమ్మల్ని దమస్కు అవతల ఉన్న దేశానికి బందీలుగా పంపిస్తాను’+ అని ఆయన అంటున్నాడు, ఆయన పేరు సైన్యాలకు దేవుడైన యెహోవా.”+
6 “సీయోనులో నిశ్చింతగా ఉన్న ప్రజలారా, మీకు శ్రమ!
సమరయ పర్వతం మీద సురక్షితంగా ఉన్నాం అనుకుంటున్న ప్రజలారా, మీకు శ్రమ!+
అత్యంత ప్రాముఖ్యమైన జనంలోని ప్రముఖులకు,
ఇశ్రాయేలు ఇంటివాళ్లు ఎవరి దగ్గరికైతే వెళ్తున్నారో ఆ ప్రముఖులకు శ్రమ!
2 కల్నేకు వెళ్లి చూడండి.
అక్కడి నుండి హమాతు+ మహా నగరానికి వెళ్లండి,
ఫిలిష్తీయుల నగరమైన గాతుకు వెళ్లండి.
అవి వీటి* కన్నా గొప్ప రాజ్యాలా?
వాళ్ల ప్రాంతం మీకన్నా పెద్దదా?
4 వాళ్లు మందలోని పొట్టేళ్లను, కొవ్విన దూడల్ని* తింటూ+
దంతపు+ మంచాల మీద పడుకుంటున్నారు, పాన్పుల* మీద వాలిపోతున్నారు;+
5 వీణ* శబ్దానికి తగ్గట్టు పాటలు కడుతున్నారు,+
దావీదులా సంగీత వాద్యాల్ని కనిపెడుతున్నారు;+
6 వాళ్లు గిన్నె నిండా ద్రాక్షారసం తాగుతున్నారు,+
అతి శ్రేష్ఠమైన తైలాలు ఒంటికి రాసుకుంటున్నారు.
కానీ వాళ్లు యోసేపు వినాశనాన్ని పట్టించుకోవడం లేదు.*+
7 కాబట్టి మొదట వాళ్లే బందీలుగా తీసుకెళ్లబడతారు,+
వాళ్ల అల్లరి విందులు ఆగిపోతాయి.
8 ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా తన జీవం తోడని ప్రమాణం చేశాడు’+ అని సైన్యాలకు దేవుడైన యెహోవా ప్రకటిస్తున్నాడు,
‘ “యాకోబు గర్వాన్ని నేను అసహ్యించుకుంటున్నాను,+
అతని పటిష్ఠమైన బురుజుల్ని నేను ద్వేషిస్తున్నాను,+
నగరాన్ని, దానిలో ఉన్న వాటన్నిటినీ నేను శత్రువుల చేతికి అప్పగిస్తాను.+
9 “ ‘ “ఒక ఇంట్లో పదిమంది మిగిలివుంటే వాళ్లు కూడా చనిపోతారు. 10 వాళ్ల బంధువు* వచ్చి, ఆ శవాల్ని బయటికి తీసుకొచ్చి ఒకదాని తర్వాత ఒకటి కాలుస్తాడు. అతను ఇంట్లో నుండి వాళ్ల ఎముకల్ని బయటికి తెస్తాడు; తర్వాత ఆ ఇంటి లోపలి గదుల్లో ఎవరైనా ఉంటే అతను, ‘నీతోపాటు ఇంకెవరైనా ఉన్నారా?’ అని అడుగుతాడు. లోపలున్న వ్యక్తి, ‘ఇంకెవ్వరూ లేరు!’ అని జవాబిస్తాడు. అప్పుడతను, ‘సరే, నిశ్శబ్దంగా ఉండు! ఇది యెహోవా పేరు ఎత్తే సమయం కాదు’ అని అంటాడు.”
11 ఎందుకంటే, ఆజ్ఞ ఇస్తున్నది యెహోవాయే,+
ఆయన గొప్ప ఇంటిని కూలగొట్టి ముక్కలుముక్కలు చేస్తాడు,
చిన్న ఇంటిని చెత్తకుప్పగా మార్చేస్తాడు.+
12 గుర్రాలు బండ మీద పరుగెత్తుతాయా?
లేదా ఎవరైనా పశువులతో అక్కడ దున్నుతారా?
13 మీరు వ్యర్థమైన దాని విషయంలో సంతోషిస్తున్నారు,
“మనం బలవంతులమైంది మన సొంత శక్తితో కాదా?” అని అంటున్నారు.+
14 కాబట్టి ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, నేను మీ మీదికి ఒక దేశాన్ని రప్పిస్తాను’+ అని సైన్యాలకు దేవుడైన యెహోవా అంటున్నాడు.
‘వాళ్లు మిమ్మల్ని లెబో-హమాతు*+ నుండి అరాబా వాగు* వరకు అణగదొక్కుతారు.’ ”
7 సర్వోన్నత ప్రభువైన యెహోవా దర్శనంలో నాకు ఇది చూపించాడు: ఇదిగో! చివరి పంట మొలకెత్తే సమయంలో* ఆయన ఒక మిడతల దండును పుట్టించాడు. రాజుకు చెందిన ఎండుగడ్డిని కోసిన తర్వాత వేసే పంట అది. 2 మిడతల దండు నేలమీది పంటంతటినీ తినేసిన తర్వాత నేనిలా అన్నాను: “సర్వోన్నత ప్రభువైన యెహోవా, దయచేసి క్షమించు!+ యాకోబు ఎలా లేస్తాడు? అతను బలహీనంగా ఉన్నాడు!”+
3 దాంతో యెహోవా దాని గురించి ఇంకోసారి ఆలోచించాడు.*+ యెహోవా, “అది జరగదు” అన్నాడు.
4 సర్వోన్నత ప్రభువైన యెహోవా దర్శనంలో నాకు ఇది చూపించాడు: ఇదిగో! సర్వోన్నత ప్రభువైన యెహోవా అగ్నిని ఉపయోగించి శిక్షించాడు. అది విస్తారమైన అగాధ జలాల్ని, దేశంలోని ఒక భాగాన్ని దహించివేసింది. 5 అప్పుడు నేను, “సర్వోన్నత ప్రభువైన యెహోవా, దయచేసి అలా చేయకు.+ యాకోబు ఎలా లేస్తాడు? అతను బలహీనంగా ఉన్నాడు!” అన్నాను.+
6 దాంతో యెహోవా దాని గురించి ఇంకోసారి ఆలోచించాడు.*+ సర్వోన్నత ప్రభువైన యెహోవా, “అది కూడా జరగదు” అన్నాడు.
7 ఆయన దర్శనంలో నాకు ఇది చూపించాడు: ఇదిగో! లంబసూత్రం* ఉపయోగించి కట్టిన గోడపై యెహోవా నిల్చొని ఉన్నాడు, ఆయన చేతిలో ఒక లంబసూత్రం ఉంది. 8 అప్పుడు యెహోవా నన్ను, “ఆమోసూ, నీకేం కనిపిస్తోంది?” అని అడిగాడు. దానికి నేను, “ఒక లంబసూత్రం” అన్నాను. తర్వాత యెహోవా ఇలా అన్నాడు: “ఇదిగో, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య నేను ఒక లంబసూత్రాన్ని పెడుతున్నాను. నేనిక వాళ్లను క్షమించను.+ 9 ఇస్సాకు ఉన్నత స్థలాలు+ పాడైపోతాయి, ఇశ్రాయేలు పవిత్రమైన స్థలాలు నాశనమైపోతాయి;+ నేను యరొబాము ఇంటివాళ్ల మీదికి ఖడ్గంతో వస్తాను.”+
10 బేతేలు యాజకుడైన+ అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబాముకు+ ఈ సందేశం పంపించాడు: “ఆమోసు ఏకంగా ఇశ్రాయేలు ఇంటివాళ్ల మధ్యే నీ మీద కుట్ర పన్నుతున్నాడు.+ దేశంలోని ప్రజలు అతను చెప్పే మాటలన్నీ భరించలేరు.+ 11 ‘యరొబాము ఖడ్గం చేత చంపబడతాడు, ఇశ్రాయేలీయులు ఖచ్చితంగా తమ దేశం నుండి బందీలుగా తీసుకెళ్లబడతారు’ అని ఆమోసు చెప్తున్నాడు.”+
12 తర్వాత అమజ్యా ఆమోసుతో ఇలా అన్నాడు: “దర్శనాలు చూసేవాడా, యూదా దేశానికి పారిపో, అక్కడే నీ రొట్టె సంపాదించుకో,* అక్కడే ప్రవచించు.+ 13 కానీ ఇకమీదట నువ్వు బేతేలులో ప్రవచించకూడదు,+ ఎందుకంటే ఇది ఒక రాజు పవిత్రమైన స్థలం,+ ఒక రాజ్యానికి రాజధాని.”
14 అప్పుడు ఆమోసు అమజ్యాతో ఇలా చెప్పాడు: “నేను ప్రవక్తను కాదు, ప్రవక్త కుమారుణ్ణీ కాదు; నేనొక పశువుల కాపరిని,+ అత్తి చెట్లను చూసుకునేవాణ్ణి.* 15 అయితే పశువులు కాస్తున్న నన్ను యెహోవా పిలిచాడు. యెహోవా నాతో ఇలా అన్నాడు, ‘వెళ్లు, ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు ప్రవచించు.’+ 16 కాబట్టి ఇప్పుడు యెహోవా చెప్తున్న ఈ మాట విను: ‘ “ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ప్రవచించకు,+ ఇస్సాకు ఇంటివాళ్లకు వ్యతిరేకంగా ప్రకటించకు”+ అని నువ్వు అంటున్నావు. 17 కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు: “నగరంలో నీ భార్య వేశ్య అవుతుంది; నీ కుమారుల్ని, కూతుళ్లను ఖడ్గంతో చంపుతారు. నీ భూమిని కొలనూలుతో కొలిచి పంచుకుంటారు, నువ్వేమో అపవిత్రమైన దేశంలో చనిపోతావు; ఇశ్రాయేలీయులు ఖచ్చితంగా తమ దేశం నుండి బందీలుగా తీసుకెళ్లబడతారు.” ’ ”+
8 సర్వోన్నత ప్రభువైన యెహోవా నాకు దర్శనంలో వేసవికాల పండ్ల గంప ఒకటి చూపించాడు. 2 తర్వాత ఆయన నన్ను, “ఆమోసూ, నీకేం కనిపిస్తోంది?” అని అడిగాడు. అందుకు నేను, “వేసవికాల పండ్ల గంప కనిపిస్తోంది” అని చెప్పాను. అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “నా ప్రజలైన ఇశ్రాయేలీయుల అంతం వచ్చేసింది. నేనిక వాళ్లను క్షమించను.+ 3 ‘ఆ రోజు, ఆలయంలో పాడే పాటలు ఏడ్పులుగా మారతాయి,+ ప్రతీచోట శవాలు కుప్పలుగా పడివుంటాయి,+ అంతటా నిశ్శబ్దం ఆవరిస్తుంది!’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.
4 పేదల్ని అణగదొక్కుతున్న వాళ్లారా,
దేశంలోని సాత్వికుల్ని అంతం చేస్తున్న వాళ్లారా,+ ఈ మాట వినండి.
5 మీరు ఇలా అంటున్నారు: ‘మనం ధాన్యం అమ్ముకునేలా అమావాస్య పండుగ ఎప్పుడు అయిపోతుందో?+
ధాన్యాన్ని అమ్మకానికి పెట్టేలా విశ్రాంతి రోజు*+ ఎప్పుడు ముగుస్తుందో?
అప్పుడు మనం ఈఫా* కొలతను చిన్నది చేసి,
షెకెల్* బరువును పెంచి,
దొంగత్రాసుతో మోసం చేయవచ్చు;+
6 అవసరంలో ఉన్నవాళ్లను వెండితో,
పేదవాళ్లను ఒక జత చెప్పులతో కొనవచ్చు.+
పనికిరాని ధాన్యాన్ని అమ్ముకోవచ్చు.’
7 యాకోబు వైభవమైన యెహోవా తన తోడని ప్రమాణం చేసి+ ఇలా అంటున్నాడు:
‘వాళ్లు చేసిన ఏ పనినీ నేను ఎప్పటికీ మర్చిపోను.+
దేశమంతా నైలు నదిలా ఉప్పొంగుతుంది,
పోటెత్తే ఐగుప్తు దేశపు నైలు నదిలా అల్లకల్లోలంగా మారుతుంది.’+
9 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:
‘ఆ రోజు నేను మిట్టమధ్యాహ్నమే సూర్యుడు అస్తమించేలా చేస్తాను,
పట్టపగలే దేశాన్ని చీకటిమయం చేస్తాను.+
10 మీ పండుగల్ని దుఃఖించే రోజులుగా,+
మీ పాటలన్నిటినీ శోకగీతాలుగా మారుస్తాను.
నేను వాళ్లందరి నడుముకు గోనెపట్ట కడతాను, ప్రతీ తలను బోడి చేస్తాను;
ఆ దుఃఖం, ఒక్కగానొక్క కుమారుడు చనిపోయినప్పుడు కలిగే దుఃఖంలా ఉంటుంది,
అది చాలా బాధాకరమైన రోజుగా ముగుస్తుంది.’
11 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:
‘ఇదిగో! నేను దేశం మీదికి కరువు రప్పించే రోజులు వస్తున్నాయి,
అది ఆహారం కోసమో, నీళ్ల కోసమో తపించే కరువు కాదు,
యెహోవా మాటలు వినడం కోసం తపించే కరువు.+
12 వాళ్లు సముద్రం నుండి సముద్రం వరకు,
ఉత్తరం నుండి తూర్పు* వరకు ఆయాసపడుతూ తిరుగుతారు.
వాళ్లు యెహోవా మాటల కోసం వెదుకుతూ అటూఇటూ తిరుగుతారు, కానీ అవి వాళ్లకు దొరకవు.
13 ఆ రోజు అందమైన కన్యలు, అలాగే యువకులు
దాహంతో మూర్ఛపోతారు;
14 సమరయ అపరాధం+ మీద ప్రమాణం చేసి,
“దానూ! నీ దేవుని జీవం తోడు,”+
“బెయేర్షెబా మార్గం+ తోడు!”
అని చెప్పేవాళ్లు పడిపోతారు, వాళ్లు మళ్లీ లేవరు.’ ”+
9 బలిపీఠానికి పైన యెహోవా ఉండడం నేను చూశాను,+ ఆయన ఇలా అన్నాడు: “స్తంభాల పైభాగాల్ని కొట్టు, పునాదులు కదిలిపోతాయి. వాటి పైభాగాల్ని నరికేయి, నేను వాళ్లలో చివరి వ్యక్తిని ఖడ్గంతో చంపేస్తాను. ఒక్కరు కూడా తప్పించుకోలేరు, పారిపోలేరు.+
2 వాళ్లు నేలను తవ్వి సమాధిలోకి* వెళ్లినా,
అక్కడి నుండి నా చెయ్యి వాళ్లను బయటికి తెస్తుంది;
వాళ్లు ఆకాశానికి ఎక్కిపోయినా,
అక్కడి నుండి నేను వాళ్లను కిందికి లాక్కొస్తాను.
3 వాళ్లు కర్మెలు పర్వత శిఖరం పైన దాక్కున్నా,
అక్కడ కూడా నేను వాళ్లను వెదికి పట్టుకుంటాను.+
వాళ్లు నా కంటికి కనబడకుండా సముద్రం అడుగున దాక్కున్నా,
అక్కడ వాళ్లను కాటేయమని నేను సర్పానికి ఆజ్ఞాపిస్తాను.
4 వాళ్లు తమ శత్రువుల చేతికి చిక్కి బందీలుగా వెళ్లినా,
అక్కడ నేను ఖడ్గానికి ఆజ్ఞాపిస్తాను, అది వాళ్లను చంపేస్తుంది;+
మేలు చేయడానికి కాదు కీడు చేయడానికే వాళ్ల మీద నా దృష్టి నిలుపుతాను.+
5 సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా దేశాన్ని* తాకుతాడు,
అది కరిగిపోతుంది,+ దాని నివాసులందరూ విలపిస్తారు;+
దేశమంతా నైలు నదిలా ఉప్పొంగుతుంది,
పోటెత్తే ఐగుప్తు దేశపు నైలు నదిలా అల్లకల్లోలంగా మారుతుంది.+
6 ‘ఆకాశంలో తన మెట్లను నిర్మించే దేవుడు,
భూమికి పైన తన భవనాన్ని* కట్టే దేవుడు;
భూమ్మీద కుమ్మరించడానికి
సముద్ర జలాల్ని పిలిచే దేవుడు,+
–ఆయన పేరు యెహోవా.’+
7 ‘ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా దృష్టిలో కూషీయుల లాంటివాళ్లు కాదా?’ అని యెహోవా అంటున్నాడు.
‘నేను ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకురాలేదా?+
క్రేతు నుండి ఫిలిష్తీయుల్ని,+ కీరు నుండి సిరియన్లను+ బయటికి తీసుకురాలేదా?’
8 ‘ఇదిగో! సర్వోన్నత ప్రభువైన యెహోవా దృష్టి పాపిష్ఠి రాజ్యం మీద ఉంది,
ఆయన దాన్ని భూమ్మీద నుండి పూర్తిగా తుడిచిపెట్టేస్తాడు.+
అయితే నేను యాకోబు ఇంటివాళ్లను సమూలంగా నాశనం చేయను’+ అని యెహోవా అంటున్నాడు.
9 ‘ఇదిగో! నేను ఆజ్ఞాపిస్తున్నాను,
ఒకడు జల్లెడ పట్టినట్టు,
దేశాలన్నిటి మధ్య నేను ఇశ్రాయేలు ఇంటివాళ్లను జల్లెడ పడతాను,+
ఒక్క రాయి కూడా నేలమీద పడదు.
10 నా ప్రజల్లో పాపం చేసిన వాళ్లందరూ,
“విపత్తు మా దగ్గరికి రాదు, మమ్మల్ని అందుకోలేదు” అని అంటున్న వాళ్లందరూ ఖడ్గం చేత చనిపోతారు.’
11 ‘ఆ రోజు నేను, పడిపోయిన దావీదు ఇంటిని* నిలబెడతాను,+
దాని* పగుళ్లకు మరమ్మతు చేస్తాను,
దాని శిథిలాల్ని బాగుచేస్తాను;
అది ఒకప్పుడు ఎలా ఉండేదో, మళ్లీ అలా ఉండేలా దాన్ని తిరిగి కడతాను,+
12 అప్పుడు వాళ్లు ఎదోములో మిగిలిపోయిన దాన్ని స్వాధీనం చేసుకుంటారు,+
నా పేరుతో పిలవబడే దేశాలన్నిటినీ స్వాధీనం చేసుకుంటారు’ అని ఇదంతా చేస్తున్న యెహోవా అంటున్నాడు.
13 ‘ఇదిగో! ఆ రోజులు వస్తున్నాయి’ అని యెహోవా అంటున్నాడు,
‘అప్పుడు, కోత కోసేవాళ్ల పని పూర్తికాక ముందే దున్నేవాళ్లు వస్తారు,
ద్రాక్షల్ని తొక్కేవాళ్ల పని పూర్తికాక ముందే విత్తనాలు విత్తేవాళ్లు వస్తారు;+
పర్వతాల మీద నుండి తియ్యని ద్రాక్షారసం కారుతుంది,
అది కొండలన్నిటి మీద పారుతుంది.*
14 బందీలుగా ఉన్న నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని నేను మళ్లీ సమకూరుస్తాను,+
వాళ్లు నిర్మానుష్యం అయిపోయిన నగరాల్ని మళ్లీ కట్టి, వాటిలో నివసిస్తారు,+
ద్రాక్షతోటలు నాటుకొని, వాటి ద్రాక్షారసం తాగుతారు,
తోటలు వేసి, వాటి పండ్లు తింటారు.’+
15 ‘నేను వాళ్లను వాళ్ల దేశంలో నాటుతాను,
నేను వాళ్లకు ఇచ్చిన దేశం నుండి
వాళ్లు మళ్లీ ఇంకెప్పుడూ పెకిలించబడరు’+ అని మీ దేవుడైన యెహోవా అంటున్నాడు.”
“బరువుగా ఉండడం” లేదా “బరువు మోయడం” అని అర్థం.
లేదా “నేరాన్ని.”
అక్ష., “రాజదండం పట్టుకొనివున్న వ్యక్తిని.”
అక్ష., “రాజదండం పట్టుకొనివున్న వ్యక్తిని.”
లేదా “నిబంధనను.”
లేదా, “నేరాన్ని.”
అక్ష., “కొమ్ము.”
అక్ష., “న్యాయమూర్తిని.”
లేదా “ఉపదేశాన్ని.”
లేదా “జామీనుగా.”
లేదా “ఈజిప్టు.”
పదకోశం చూడండి.
లేదా “గుండెబలం గలవాడు.”
లేదా “ఎర” అయ్యుంటుంది.
అక్ష., “కొమ్ము.”
లేదా “దమస్కుకు చెందిన.”
లేదా “విశాలమైన కుర్చీల.”
లేదా “యాకోబు ఇంటివాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పు.”
లేదా “నేరాలన్నిటిని.”
లేదా “చాలా” అయ్యుంటుంది.
లేదా “యజమానులతో.”
లేదా “తిరుగుబాటు.”
లేదా “దశమభాగాల్ని.”
లేదా “తినడానికి మీకు ఆహారమేమీ ఇవ్వలేదు.”
అక్ష., “బూజుతో.”
లేదా “దుష్టశక్తులకు నివాసమౌతుంది” అయ్యుంటుంది.
లేదా “చేదుగా.” పదకోశం చూడండి.
వృషభ నక్షత్రరాశిలోని సప్తఋషి నక్షత్రాలు కావచ్చు.
మృగశీర్ష నక్షత్రరాశి కావచ్చు.
లేదా “భూమి పన్ను.”
లేదా “ఎన్ని నేరాలు.”
లేదా “నోరు నొక్కేయడానికి లంచాలు.”
ఈ రెండూ, దేవునిగా పూజించబడిన శని గ్రహాన్ని సూచించవచ్చు.
యూదా, ఇశ్రాయేలు రాజ్యాల్ని సూచిస్తున్నాయని స్పష్టమౌతోంది.
అక్ష., “పీఠాన్ని.”
లేదా “కోడెదూడల్ని.”
లేదా “సోఫాల.”
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
లేదా “విషయంలో బెంగ పెట్టుకోలేదు.”
అక్ష., “తండ్రి సహోదరుడు.”
లేదా “చేదుగా.” పదకోశం చూడండి.
లేదా “హమాతు ప్రవేశ ద్వారం.”
పదకోశం చూడండి.
అంటే జనవరి, ఫిబ్రవరి నెలల్లో.
లేదా “విచారపడ్డాడు.”
లేదా “విచారపడ్డాడు.”
లేదా “మట్టపుగుండు.”
అక్ష., “తిను.”
లేదా “అత్తి పండ్లకు గాట్లు పెట్టేవాణ్ణి.”
లేదా “సబ్బాతు.”
అనుబంధం B14 చూడండి.
అనుబంధం B14 చూడండి.
లేదా “భూమి.”
లేదా “సూర్యోదయం వైపు.”
లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.
లేదా “భూమిని.”
లేదా “గుమ్మటాన్ని; గోపురాన్ని.”
లేదా “డేరాను; గుడిసెను.”
లేదా “వాళ్ల.”
అక్ష., “కొండలన్నీ కరిగిపోతాయి.”