విలాపవాక్యాలు
א [ఆలెఫ్]*
1 అయ్యో, ఒకప్పుడు ప్రజలతో నిండివున్న నగరం+ ఇప్పుడు ఒంటరిగా కూర్చుందే!
దేశాల మధ్య ప్రసిద్ధికెక్కిన*+ ఆమె ఇప్పుడు విధవరాలు అయ్యిందే!
ఆయా సంస్థానాల మధ్య రాకుమారిగా ఉన్న ఆమె ఇప్పుడు వెట్టిచాకిరి చేస్తోందే!+
ב [బేత్]
2 రాత్రిపూట ఆమె వెక్కివెక్కి ఏడుస్తోంది, ఆమె చెంపల మీద కన్నీళ్లు కారుతున్నాయి.
ఆమె ప్రియులందర్లో ఆమెను ఓదార్చేవాళ్లు ఒక్కరూ లేరు.+
ఆమె సహవాసులంతా ఆమెకు ద్రోహం చేశారు; వాళ్లు ఆమెకు విరోధులయ్యారు.
ג [గీమెల్]
3 యూదా చెరలోకి వెళ్లింది;+ కష్టాల్లోకి, కఠిన బానిసత్వంలోకి వెళ్లింది.+
ఆమె దేశాల మధ్య నివసించాలి;+ ఆమెకు విశ్రాంతి లేదు.
ఆమెను హింసించేవాళ్లు కష్టకాలంలో ఆమెను తరిమి పట్టుకున్నారు.
ד [దాలెత్]
4 పండుగకు ఎవ్వరూ రాకపోవడం వల్ల సీయోనుకు వెళ్లే దారులు విలపిస్తున్నాయి.+
ఆమె ద్వారాలన్నీ పాడైపోయాయి;+ ఆమె యాజకులు నిట్టూరుస్తున్నారు.
ఆమె కన్యలు* రోదిస్తున్నారు, ఆమె తీవ్రంగా వేదన పడుతోంది.
ה [హే]
5 ఆమె విరోధులు ఇప్పుడు ఆమెకు యజమానులు అయ్యారు; ఆమె శత్రువులు నిశ్చింతగా ఉన్నారు.+
ఆమె చేసిన ఎన్నో అపరాధాల్ని బట్టి యెహోవా ఆమెకు దుఃఖం కలిగించాడు.+
శత్రువు ఆమె పిల్లల్ని చెరలోకి తీసుకెళ్లాడు.+
ו [వావ్]
6 సీయోను కూతురి వైభవమంతా పోయింది.+
ఆమె అధిపతులు పచ్చిక దొరకని దుప్పిలా ఉన్నారు,
వెంటాడేవాడి ముందు వాళ్లు నీరసంగా పారిపోతున్నారు.
ז [జాయిన్]
7 ఇల్లు లేకుండా కష్టాలు పడుతున్న రోజుల్లో
యెరూషలేము ఒకప్పుడు తనకున్న అమూల్యమైన వాటన్నిటినీ+ గుర్తుచేసుకుంటోంది.
ఆమె ప్రజలు శత్రువు చేతికి చిక్కినప్పుడు, ఆమెకు సహాయం చేసేవాళ్లెవ్వరూ లేనప్పుడు+
శత్రువులు ఆమెను చూసి ఆమె పతనాన్ని బట్టి నవ్వారు.+
ח [హేత్]
8 యెరూషలేము ఘోరంగా పాపం చేసింది.+
అందుకే ఆమె హీన స్థితికి చేరుకుంది.
ఒకప్పుడు ఆమెను గౌరవించిన వాళ్లంతా ఇప్పుడు నీచంగా చూస్తున్నారు; ఎందుకంటే వాళ్లు ఆమె మానం చూశారు.+
ఆమె మూలుగుతూ+ సిగ్గుతో ముఖం పక్కకు తిప్పుకుంటోంది.
ט [తేత్]
9 ఆమె అపవిత్రత ఆమె బట్టలకు అంటుకుంది.
ఆమె తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించలేదు.+
ఆమె పతనం ఆశ్చర్యం కలిగించేలా ఉంది; ఆమెను ఓదార్చేవాళ్లు ఎవ్వరూ లేరు.
యెహోవా, నా కష్టాన్ని చూడు; శత్రువు తనను తాను హెచ్చించుకున్నాడు.+
י [యోద్]
10 శత్రువు ఆమె సంపదలన్నిటి మీద చెయ్యి వేశాడు.+
నీ సమాజంలోకి ప్రవేశించకూడదని నువ్వు ఆజ్ఞాపించిన దేశాలు
తన పవిత్రమైన స్థలంలో అడుగుపెట్టడం ఆమె చూసింది.+
כ [కఫ్]
11 ఆమె ప్రజలంతా నిట్టూరుస్తున్నారు; వాళ్లు ఆహారం కోసం చూస్తున్నారు.+
కేవలం బ్రతికుండడం కోసం ఆహారం కొనుక్కోవడానికి తమ విలువైనవాటిని ఇచ్చేశారు.
యెహోవా, ఇదిగో చూడు, నేను పనికిరాని స్త్రీని* అయ్యాను.
ל [లామెద్]
12 దారిన పోతున్న మీకందరికీ ఇదేమీ పట్టదా?
ఇదిగో చూడండి!
నాకు కలిగిన బాధలాంటి బాధ ఏదైనా ఉందా?
తన కోపాగ్ని కుమ్మరించిన రోజున, యెహోవా నాకు కలిగించిన బాధలాంటి బాధ ఏదైనా ఉందా?+
מ [మేమ్]
13 ఆయన పైనుండి నా ఎముకల్లోకి అగ్నిని పంపించాడు,+ వాటిలో ప్రతీదాన్ని లోబర్చుకుంటున్నాడు.
ఆయన నా పాదాల కోసం ఒక వల పరిచాడు; నేను బలవంతంగా వెనక్కి వెళ్లిపోయేలా చేశాడు.
ఆయన నన్ను వదిలేయబడిన స్త్రీలా చేశాడు.
నేను రోజంతా జబ్బుతో బాధపడుతున్నాను.
נ [నూన్]
14 నా అపరాధాలు కాడిలా కట్టబడ్డాయి, ఆయన తన చేతితో వాటిని గట్టిగా కట్టాడు.
ఆయన వాటిని నా మెడ మీద పెట్టాడు, నా బలం క్షీణించింది.
నేను ఎదిరించలేనివాళ్ల చేతికి యెహోవా నన్ను అప్పగించాడు.+
ס [సామెఖ్]
15 నాలోని బలాఢ్యులందర్నీ యెహోవా పక్కకు విసిరేశాడు.+
నా యువకుల్ని నలగ్గొట్టడానికి నా మీదికి ఒక సమూహాన్ని రప్పించాడు.+
యూదా కన్యను యెహోవా ద్రాక్షతొట్టిలో వేసి తొక్కాడు.+
ע [అయిన్]
16 వీటన్నిటి వల్ల నేను ఏడుస్తున్నాను;+ నా కళ్లలో నుండి కన్నీళ్లు వరదలా పారుతున్నాయి.
నాకు ఓదార్పును, సేదదీర్పును ఇవ్వగలిగేవాళ్లు దూరంగా ఉన్నారు.
శత్రువు పైచేయి సాధించడంతో నా పిల్లలు దిక్కులేనివాళ్లు అయ్యారు.
פ [పే]
17 సీయోను చేతులు చాపింది;+ ఆమెను ఓదార్చేవాళ్లు ఎవ్వరూ లేరు.
యాకోబు చుట్టూ ఉన్నవాళ్లంతా అతని శత్రువుల్లా ప్రవర్తించాలని యెహోవా ఆదేశించాడు.+
యెరూషలేము వాళ్లకు అసహ్యమైనదిగా తయారైంది.+
צ [సాదె]
18 నన్ను శిక్షించినా యెహోవా నీతిమంతుడే,+ ఎందుకంటే నేనే ఆయన ఆజ్ఞలకు* ఎదురుతిరిగాను.+
దేశదేశాల ప్రజలారా, మీరంతా వినండి, నా బాధను చూడండి.
నా కన్యలు,* యువకులు చెరలోకి వెళ్లారు.+
ק [ఖొఫ్]
19 నేను నా ప్రియుల్ని పిలిచాను, కానీ వాళ్లు నన్ను మోసం చేశారు.+
బ్రతికుండడానికి ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ
నా యాజకులు, పెద్దలు నగరంలో నశించిపోయారు.+
ר [రేష్]
20 యెహోవా, చూడు, నేను పెద్ద కష్టంలో ఉన్నాను.
నా అంతరంగం* అల్లకల్లోలంగా ఉంది.
నా హృదయం వేదన పడుతోంది, నేను ఘోరంగా తిరుగుబాటు చేశాను.+
బయట ఖడ్గం చంపుతోంది;+ ఇంట్లో కూడా మరణం ఉంది.
ש [షీన్]
21 ప్రజలు నా నిట్టూర్పులు విన్నారు; నన్ను ఓదార్చేవాళ్లు ఎవ్వరూ లేరు.
శత్రువులంతా నా విపత్తు గురించి విన్నారు.
నువ్వే దాన్ని రప్పించావని వాళ్లు సంతోషిస్తున్నారు.+
అయితే నువ్వు ప్రకటించిన రోజును తీసుకొస్తావు,+ అప్పుడు వాళ్లు కూడా నాలా అవుతారు.+
ת [తౌ]
22 వాళ్ల చెడుతనమంతా నీ ముందు వెల్లడవ్వాలి,
నా అపరాధాలన్నిటిని బట్టి నువ్వు నాతో కఠినంగా వ్యవహరించినట్టే వాళ్లతో కూడా కఠినంగా వ్యవహరించాలి.+
నేను ఎంతగానో నిట్టూరుస్తున్నాను, నా హృదయం బలహీనపడింది.
א [ఆలెఫ్]
2 యెహోవా తన కోపం అనే మేఘంతో సీయోను కూతురిని కప్పేశాడు!
ఆయన ఇశ్రాయేలు సౌందర్యాన్ని ఆకాశం నుండి భూమ్మీదికి పడేశాడు.+
ఆయన తన ఉగ్రత రోజున తన పాదపీఠాన్ని+ గుర్తుచేసుకోలేదు.
ב [బేత్]
2 యెహోవా ఏమాత్రం కనికరం లేకుండా యాకోబు నివాసాలన్నిటినీ మింగేశాడు.
తన కోపాన్ని బట్టి యూదా కూతురి ప్రాకారాలుగల స్థలాలన్నిటినీ పడగొట్టాడు.+
రాజ్యాన్ని, ఆమె అధిపతుల్ని నేలకూల్చి, అపవిత్రం చేశాడు.+
ג [గీమెల్]
3 ఆయన కోపావేశంలో ఇశ్రాయేలు ప్రతీ కొమ్మును* నరికేశాడు.
శత్రువు సమీపించినప్పుడు ఆయన తన కుడిచేతిని వెనక్కి తీసుకున్నాడు,+
చుట్టూ ఉన్న ప్రతీదాన్ని దహించేసే అగ్నిలా ఆయన కోపం యాకోబులో మండుతూ వచ్చింది.+
ד [దాలెత్]
4 శత్రువులా ఆయన తన విల్లును వంచాడు;* విరోధిలా దాడి చేయడానికి తన కుడిచేతిని సిద్ధం చేశాడు;+
మా కళ్లకు ప్రియంగా ఉన్నవాళ్లందర్నీ చంపుతూ వచ్చాడు.+
సీయోను కూతురి డేరాలో+ తన కోపాన్ని అగ్నిలా కుమ్మరించాడు.+
ה [హే]
5 యెహోవా మాకు శత్రువులా తయారయ్యాడు;+
ఆయన ఇశ్రాయేలును మింగేశాడు.
ఆమె బురుజులన్నిటినీ మింగేశాడు;
ప్రాకారాలుగల ఆమె స్థలాలన్నిటినీ నాశనం చేశాడు.
యూదా కూతురిలో ఏడుపు, ప్రలాపం ఎక్కువయ్యేలా చేశాడు.
ו [వావ్]
6 తోటలోని గుడిసెను పడగొట్టినట్టు ఆయన తన పర్ణశాలను పడగొట్టాడు.+
యెహోవా సీయోనులో పండుగను, విశ్రాంతి రోజును* మర్చిపోయేలా చేశాడు,
తన విపరీతమైన కోపాన్ని బట్టి రాజును, యాజకుణ్ణి కూడా ఆయన లెక్క చేయట్లేదు.+
ז [జాయిన్]
7 యెహోవా తన బలిపీఠాన్ని తిరస్కరించాడు;
తన పవిత్రమైన స్థలాన్ని నిరాకరించాడు.+
సీయోను పటిష్ఠమైన బురుజుల గోడల్ని శత్రువు చేతికి అప్పగించాడు.+
పండుగ రోజున కేకలు వేసినట్టు వాళ్లు యెహోవా మందిరంలో కేకలు వేశారు.+
ח [హేత్]
8 యెహోవా సీయోను కూతురి ప్రాకారాల్ని నాశనం చేయాలని తీర్మానించుకున్నాడు.+
ఆయన కొలనూలుతో వాటిని కొలిచాడు.+
నాశనం రప్పించకుండా ఆయన తన చేతిని వెనక్కి తీసుకోలేదు.
ప్రాకారం, ప్రహరీగోడ విలపించేలా చేస్తున్నాడు.
అవి రెండూ పడిపోయాయి.
ט [తేత్]
9 ఆమె ద్వారాలు భూమిలోకి కుంగిపోయాయి.+
ఆమె అడ్డగడియల్ని ఆయన నాశనం చేశాడు, విరగ్గొట్టాడు.
ఆమె రాజు, ఆమె అధిపతులు వేరే దేశాల్లో ఉన్నారు.+
ధర్మశాస్త్రం* లేదు; చివరికి ఆమె ప్రవక్తలకు కూడా యెహోవా నుండి ఎలాంటి దర్శనమూ రావట్లేదు.+
י [యోద్]
10 సీయోను కూతురి పెద్దలు మౌనంగా నేలమీద కూర్చున్నారు.+
వాళ్లు తలల మీద దుమ్ము పోసుకుంటున్నారు, గోనెపట్ట కట్టుకున్నారు.+
యెరూషలేము కన్యలు నేల వరకు తమ తలలు వంచారు.
כ [కఫ్]
11 ఏడ్చీ ఏడ్చీ నా కళ్లు క్షీణించిపోయాయి.+
నా అంతరంగం* అల్లకల్లోలంగా ఉంది.
నా ప్రజల కూతురి* పతనాన్ని బట్టి నా గుండె పగిలిపోయింది,*+
ఎందుకంటే చిన్నపిల్లలు, పసివాళ్లు పట్టణ సంతవీధుల్లో సొమ్మసిల్లి పడిపోతున్నారు.+
ל [లామెద్]
12 వాళ్లు గాయపడిన వ్యక్తిలా నగర సంతవీధుల్లో సొమ్మసిల్లి పడిపోతూ,
מ [మేమ్]
13 యెరూషలేము కూతురా, నేను దేన్ని సాక్ష్యంగా పెట్టను?
నువ్వు దేనిలా ఉన్నావని చెప్పను?
సీయోను కన్యా, నిన్ను ఓదార్చడానికి దేనితో నిన్ను పోల్చను?
నీ నాశనం సముద్రమంత గొప్పది.+ నిన్ను ఎవరు బాగుచేయగలరు?+
נ [నూన్]
14 నీ ప్రవక్తలు నీ గురించి చూసిన దర్శనాలు తప్పుడువి, వ్యర్థమైనవి,+
నువ్వు చెరలోకి వెళ్లకుండా ఉండేలా వాళ్లు నీ తప్పుల్ని బయటపెట్టలేదు,+
బదులుగా వాళ్లు నీకు తప్పుడు దర్శనాల్ని, మోసపూరిత దర్శనాల్ని చెప్తూ వచ్చారు.+
ס [సామెఖ్]
15 దారిన వెళ్లేవాళ్లందరూ నిన్ను ఎగతాళి చేస్తూ చప్పట్లు కొడుతున్నారు.+
ఆశ్చర్యంతో ఈల వేస్తూ,+ యెరూషలేము కూతుర్ని చూసి తలలు ఆడిస్తూ ఇలా అంటున్నారు:
“ ‘అది పరిపూర్ణ సౌందర్యం గలది, భూమంతటికీ సంతోష కారణం’ అని ప్రజలు చెప్పుకున్న నగరం ఇదేనా?”+
פ [పే]
16 నీ శత్రువులంతా నీ వైపు నోళ్లు తెరిచారు.
వాళ్లు ఈల వేస్తూ, పళ్లు కొరుకుతూ ఇలా అంటున్నారు: “మనం దాన్ని మింగేశాం.+
ఈ రోజు కోసమే మనం ఎదురుచూశాం!+ అది వచ్చేసింది, మనం దాన్ని చూశాం!”+
ע [అయిన్]
ఆయన కనికరం చూపించకుండా నాశనం చేశాడు.+
శత్రువు నీ పతనాన్ని చూసి సంతోషించేలా ఆయన చేశాడు; ఆయన నీ విరోధుల బలాన్ని* హెచ్చించాడు.
צ [సాదె]
18 సీయోను కూతురి ప్రాకారమా, వాళ్ల హృదయం యెహోవాకు మొరపెడుతోంది.
రాత్రింబగళ్లు కన్నీళ్లు వరదలా ప్రవహించనీ.
ఏమాత్రం విరామం తీసుకోకు, నీ కంటికి* విశ్రాంతినివ్వకు.
ק [ఖొఫ్]
19 లే! రాత్రంతా* ఏడుస్తూ ఉండు.
నీ హృదయాన్ని యెహోవా ముఖం ఎదుట నీళ్లలా కుమ్మరించు.
కరువువల్ల ప్రతీ వీధి మూల దగ్గర సొమ్మసిల్లి పడిపోతున్న
నీ పిల్లల ప్రాణాల కోసం+ చేతులెత్తి ఆయన్ని వేడుకో.
ר [రేష్]
20 యెహోవా, ఇదిగో, నువ్వు ఎంతో కఠినంగా వ్యవహరించిన నీ ప్రజల వైపు చూడు.
స్త్రీలు తమ కన్న బిడ్డల్ని,* ఆరోగ్యంగా పుట్టిన తమ పిల్లల్ని తింటూనే ఉండాలా?+
యాజకులు, ప్రవక్తలు యెహోవా పవిత్రమైన స్థలంలో చంపబడాలా?+
ש [షీన్]
21 పిల్లలు, వృద్ధులు చనిపోయి వీధుల్లో నేలమీద పడివున్నారు.+
నా కన్యలు,* యువకులు కత్తి పాలయ్యారు.+
నీ ఉగ్రత రోజున నువ్వు వాళ్లను చంపావు; కనికరం లేకుండా వధించావు.+
ת [తౌ]
22 పండుగ రోజు కోసం అన్నట్టు,+ నువ్వు అన్నివైపుల నుండి భయాల్ని పిలిపిస్తున్నావు.
యెహోవా ఉగ్రత రోజున ఎవ్వరూ తప్పించుకోలేదు, బ్రతికి బయటపడలేదు;+
א [ఆలెఫ్]
3 ఆయన ఉగ్రత దండం వల్ల ప్రజలు కష్టాలు పడడం చూసినవాణ్ణి నేనే.
2 ఆయన నన్ను వెళ్లగొట్టి, వెలుగులో కాకుండా చీకట్లో నడిచేలా చేస్తున్నాడు.+
3 నిజానికి, రోజంతా ఆయన చెయ్యి నాకు వ్యతిరేకంగా ఉంది.+
ב [బేత్]
4 ఆయన నా మాంసాన్ని, చర్మాన్ని కృశించిపోయేలా చేశాడు;
నా ఎముకల్ని విరగ్గొట్టాడు.
5 ఆయన నన్ను ముట్టడించాడు; నా చుట్టూ విషపు మొక్కల్ని,*+ కష్టాల్ని ఉంచాడు.
6 చాలాకాలం క్రితం చనిపోయినవాళ్లలా నన్ను చీకటి స్థలాల్లో కూర్చోబెట్టాడు.
ג [గీమెల్]
7 నేను పారిపోకుండా నా చుట్టూ గోడ కట్టాడు;
బరువైన రాగి సంకెళ్లతో నన్ను బంధించాడు.+
8 సహాయం కోసం నేను దీనంగా మొరపెట్టినప్పుడు, ఆయన నా ప్రార్థనను తిరస్కరిస్తున్నాడు.*+
9 చెక్కుడు రాళ్లను నా దారికి అడ్డంగా పెట్టాడు;
నా త్రోవల్ని వంకరగా చేశాడు.+
ד [దాలెత్]
10 ఎలుగుబంటిలా, దాక్కొని ఉన్న సింహంలా ఆయన నామీద దాడిచేయడానికి పొంచివున్నాడు.+
12 తన విల్లును వంచి,* బాణాన్ని నా మీదికి గురి పెట్టాడు.
ה [హే]
13 తన అంబులపొదిలోని బాణాలతో* నా మూత్రపిండాల్ని చీల్చేశాడు.
14 అన్నిదేశాల ప్రజలు నన్ను చూసి నవ్వుకుంటున్నారు, రోజంతా నా మీద పాటలు పాడుకుంటున్నారు.
15 ఆయన నాతో చేదైన వాటిని తినిపించాడు, మాచిపత్రిని* తాగించాడు.+
ו [వావ్]
17 నువ్వు నాకు మనశ్శాంతి లేకుండా చేశావు; మంచిది అంటే ఏంటో నేను మర్చిపోయాను.
18 కాబట్టి నేనిలా అనుకున్నాను: “నా వైభవం, యెహోవా మీద నేను పెట్టుకున్న ఆశ నశించిపోయాయి.”
ז [జాయిన్]
19 నేను కష్టాల్లో ఉన్నానని, ఇల్లు లేకుండా ఉన్నానని,+ మాచిపత్రిని, విషపుమొక్కల్ని తింటున్నానని+ గుర్తుచేసుకో.
20 నువ్వు తప్పకుండా నన్ను గుర్తుచేసుకుంటావు, నా దగ్గరికి వచ్చి* సహాయం చేస్తావు.+
21 నా మనసులో ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటున్నాను; అందుకే నీ కోసం ఓపిగ్గా ఎదురుచూస్తాను.+
ח [హేత్]
23 ప్రతీ ఉదయం ఆయన సరికొత్తగా కరుణ చూపిస్తాడు;+ ఆయన ఎప్పుడూ నమ్మదగినవాడు.+
24 నేనిలా అన్నాను: “యెహోవాయే నా వంతు,+ అందుకే నేను ఆయన కోసం ఓపిగ్గా ఎదురుచూస్తాను.”+
ט [తేత్]
25 తన మీద ఆశపెట్టుకునే వాళ్లకు, తనను వెతుకుతూ ఉండేవాళ్లకు+ యెహోవా మంచి చేస్తాడు.+
26 యెహోవా దయచేసే రక్షణ+ కోసం మౌనంగా* ఎదురుచూడడం మంచిది.
27 యౌవనంలో ఉన్నప్పుడే కాడి మోయడం మంచిది.+
י [యోద్]
28 దేవుడు దాన్ని అతని మీద పెట్టినప్పుడు అతను ఒంటరిగా కూర్చొని మౌనంగా ఉండాలి.+
29 అతను తన ముఖాన్ని మట్టిలో పెట్టాలి;*+ బహుశా అప్పటికీ ఏదైనా ఆశ ఉంటుందేమో.+
30 తనను కొట్టేవాడికి అతను తన చెంపను చూపించాలి; అతను పూర్తిగా అవమానాలపాలు అవ్వాలి.
כ [కఫ్]
31 ఎందుకంటే యెహోవా తన ప్రజల్ని శాశ్వతంగా విడిచిపెట్టడు.+
32 ఆయన దుఃఖం కలిగించినా, తన అపారమైన విశ్వసనీయ ప్రేమను బట్టి కరుణ కూడా చూపిస్తాడు.+
33 ఆయన మనుషుల్ని బాధపెట్టాలని, దుఃఖపెట్టాలని అనుకోడు.+
ל [లామెద్]
34 భూమ్మీది ఖైదీలందర్నీ+ కాళ్ల కింద చితకతొక్కడం,
35 సర్వోన్నతుని సన్నిధిలో న్యాయం చేయకపోవడం,+
36 వ్యాజ్యంలో మోసం చేయడం లాంటి వాటిని యెహోవా సహించడు.
מ [మేమ్]
37 యెహోవా ఆజ్ఞాపిస్తే తప్ప, ఒక మాట చెప్పి అది జరిగేలా చేయడం ఎవరివల్ల అవుతుంది?
38 సర్వోన్నతుని నోటి నుండి
మంచి విషయాలు, చెడు విషయాలు కలిసి రావు.
39 తాము చేసిన పాపాల పర్యవసానాల గురించి బ్రతికున్నవాళ్లు ఎందుకు ఫిర్యాదు చేయాలి?+
נ [నూన్]
40 మన మార్గాల్ని పరిశీలించుకొని, జాగ్రత్తగా పరీక్షించుకొని యెహోవా దగ్గరికి తిరిగెళ్దాం.+
41 పరలోకంలో ఉన్న దేవుని వైపు మన చేతులతో పాటు మన హృదయాల్ని కూడా ఎత్తి ఇలా వేడుకుందాం:+
42 “మేము తప్పుచేశాం, తిరుగుబాటు చేశాం; నువ్వు మమ్మల్ని క్షమించలేదు.+
ס [సామెఖ్]
44 మా ప్రార్థనలు నిన్ను చేరకుండా, మేము నీ దగ్గరికి రాకుండా మేఘాన్ని అడ్డుపెట్టావు.+
45 దేశదేశాల ప్రజల మధ్య మమ్మల్ని మురికిలా, చెత్తలా చేశావు.”
פ [పే]
46 మా శత్రువులంతా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.+
47 మేము ఎప్పుడూ భయపడుతూ ఉన్నాం, ఉచ్చులో చిక్కుకున్నాం,+ దిక్కులేని స్థితిలో ఉన్నాం, నాశనమైపోయాం.+
48 నా ప్రజల కూతురి పతనాన్ని చూసి నా కళ్లలో నుండి కన్నీళ్లు వరదలా పారుతున్నాయి.+
ע [అయిన్]
51 నా నగర కూతుళ్లందరికీ* జరిగింది చూసినప్పుడు+ నాకు దుఃఖం కలుగుతోంది.
צ [సాదె]
52 కారణం లేకుండానే నా శత్రువులు పక్షిని వేటాడినట్టు నన్ను వేటాడారు.
53 వాళ్లు నన్ను గోతిలో పడేసి నాశనం చేయాలని చూశారు; నా మీదికి రాళ్లు విసురుతూ వచ్చారు.
54 నీళ్లు నా తలమీదుగా ప్రవహించాయి, “నేను నాశనమైపోయాను!” అని అనుకున్నాను.
ק [ఖొఫ్]
55 యెహోవా, నేను గోతి అట్టడుగు స్థలాల్లో నుండి నీ పేరున మొరపెట్టాను.+
56 నా స్వరం విను; సహాయం కోసం, ఉపశమనం కోసం నేను పెట్టే మొర వినకుండా నీ చెవి మూసుకోకు.
57 నేను మొరపెట్టిన రోజున నువ్వు దగ్గరికి వచ్చావు. “భయపడకు” అని నాతో అన్నావు.
ר [రేష్]
58 యెహోవా, నువ్వు నా తరఫున వాదించావు, నా ప్రాణాన్ని విడిపించావు.+
59 యెహోవా, నాకు జరిగిన అన్యాయం నువ్వు చూశావు; దయచేసి నాకు న్యాయం చేయి.+
60 వాళ్ల ప్రతీకారాన్ని, వాళ్లు నా మీద పన్నిన పన్నాగాలన్నిటినీ నువ్వు చూశావు.
ש [సీన్] లేదా [షీన్]
61 యెహోవా, వాళ్లు నా మీద వేసిన నిందలు, పన్నిన పన్నాగాలు అన్నీ నీకు తెలుసు;+
62 నా మీదికి లేచేవాళ్ల మాటల్ని, రోజంతా వాళ్లు నా గురించి చెప్పుకునే గుసగుసల్ని నువ్వు విన్నావు.
63 వాళ్లను చూడు; వాళ్లు కూర్చున్నా, నిల్చున్నా నన్ను ఎగతాళి చేస్తూ పాటలు పాడుతున్నారు!
ת [తౌ]
64 యెహోవా, వాళ్ల పనుల్ని బట్టి నువ్వు వాళ్లకు తగిన శాస్తి చేస్తావు.
65 నువ్వు వాళ్ల హృదయాన్ని కఠినం చేస్తావు, అదే నువ్వు వాళ్లకు ఇచ్చే శాపం.
66 యెహోవా, నువ్వు కోపంతో వాళ్లను తరుముతావు, నీ ఆకాశం కింద లేకుండా వాళ్లను సర్వనాశనం చేస్తావు.
א [ఆలెఫ్]
4 అయ్యో! మెరిసే బంగారం, మేలిమి బంగారం+ వెలవెలబోయిందే!
పవిత్రమైన రాళ్లు+ ప్రతీ వీధి మూలన చెల్లాచెదురుగా పడివున్నాయే!+
ב [బేత్]
2 మేలిమి బంగారమంత ప్రశస్తమైన* సీయోను కుమారులు
మట్టి కుండల్లా, కుమ్మరివాడి చేతి పనిలా ఎంచబడుతున్నారే!
ג [గీమెల్]
3 నక్కలు కూడా తమ పిల్లలకు పాలిస్తాయి,
కానీ నా ప్రజల కూతురు ఎడారిలోని* నిప్పుకోళ్లలా+ క్రూరంగా తయారైంది.+
ד [దాలెత్]
4 పాలు తాగే పసిపిల్లల నాలుక దాహంతో అంగిలికి అంటుకుపోతోంది.
పిల్లలు రొట్టె కోసం అడుక్కుంటున్నారు+ కానీ ఎవ్వరూ ఏమీ ఇవ్వట్లేదు.+
ה [హే]
5 రుచికరమైన భోజనం తినేవాళ్లు ఇప్పుడు ఆకలితో* వీధుల్లో పడివున్నారు.+
ఖరీదైన* వస్త్రాలు వేసుకుని పెరిగినవాళ్లు+ బూడిద కుప్పల్లో పడివున్నారు.
ו [వావ్]
6 నా ప్రజల కూతురి శిక్ష* సొదొమ శిక్ష* కన్నా గొప్పది,+
ఆ నగరం ఒక్క క్షణంలో నాశనమైపోయింది, ఎవ్వరూ దానికి సహాయం చేయలేదు.+
ז [జాయిన్]
7 ఆమె నాజీరులు+ మంచుకన్నా స్వచ్ఛంగా, పాలకన్నా తెల్లగా ఉండేవాళ్లు.
వాళ్లు పగడం కన్నా ఎర్రగా ఉండేవాళ్లు, వాళ్ల చర్మం నీలం రాయిలా మెరిసిపోయేది.
ח [హేత్]
8 అయితే ఇప్పుడు వాళ్లు మసిబొగ్గు* కన్నా నల్లగా తయారయ్యారు;
వీధుల్లో ఎవ్వరూ వాళ్లను గుర్తుపట్టట్లేదు.
వాళ్ల చర్మం ముడతలు పడి ఎముకలకు అంటుకుపోయింది;+ అది ఎండు కర్రలా తయారైంది.
ט [తేత్]
9 కరువువల్ల చనిపోయినవాళ్ల కన్నా ఖడ్గంవల్ల చనిపోయినవాళ్ల పరిస్థితి నయం;+
పొలం పంట లేనందువల్ల కరువు బారినపడి వాళ్లు నశించిపోతున్నారు.
י [యోద్]
10 కనికరంగల స్త్రీలు తమ సొంత చేతులతో తమ కన్న బిడ్డల్ని ఉడకబెట్టారు.+
నా ప్రజల కూతురి మీదికి నాశనం వచ్చినప్పుడు వాళ్లే ఆ స్త్రీలకు ఆహారమయ్యారు.+
כ [కఫ్]
11 యెహోవా తన కోపాన్ని చూపించాడు;
తన కోపాగ్నిని కుమ్మరించాడు.+
ఆయన సీయోనులో అగ్ని రాజేశాడు, అది ఆమె పునాదుల్ని దహించేస్తుంది.+
ל [లామెద్]
12 యెరూషలేము ద్వారాల్లోకి శత్రువు, విరోధి ప్రవేశిస్తాడంటే
భూరాజులు, దాని నివాసులు ఎవ్వరూ నమ్మలేదు.+
מ [మేమ్]
13 ఆమె ప్రవక్తల పాపాలవల్ల, ఆమె యాజకుల తప్పులవల్ల అలా జరిగింది.+
వాళ్లు ఆమె మధ్య నీతిమంతుల రక్తం చిందించారు.+
נ [నూన్]
14 వాళ్లు వీధుల్లో గుడ్డివాళ్లలా తిరిగారు.+
రక్తం వల్ల అపవిత్రులయ్యారు,+
దానివల్ల ఎవ్వరూ వాళ్ల బట్టల్ని ముట్టుకోలేకపోతున్నారు.
ס [సామెఖ్]
15 ప్రజలు వాళ్లతో “అపవిత్రులారా, వెళ్లిపోండి! మమ్మల్ని ముట్టుకోకండి! దూరంగా వెళ్లండి! వెళ్లిపోండి!” అని అంటున్నారు.
ఎందుకంటే వాళ్లు ఇల్లు లేక అటూఇటూ తిరుగుతున్నారు.
దేశాల ప్రజలు ఇలా చెప్పుకున్నారు: “వాళ్లు మనతో పాటు ఇక్కడ ఉండడానికి* వీల్లేదు.+
פ [పే]
ప్రజలు యాజకుల్ని ఏమాత్రం గౌరవించరు,+ పెద్దల మీద దయ చూపించరు.”+
ע [అయిన్]
17 రాని సహాయం కోసం చూసీచూసీ మా కళ్లు క్షీణించాయి.+
మమ్మల్ని రక్షించలేని దేశం చేసే సహాయం కోసం మేము ఎంతగానో ఎదురుచూశాం.+
צ [సాదె]
18 మేము సంతవీధుల్లో నడవలేకుండా వాళ్లు అడుగడుగునా మమ్మల్ని వేటాడారు.+
మా అంతం దగ్గరపడింది; మా రోజులు ముగిశాయి, మా అంతం వచ్చేసింది.
ק [ఖొఫ్]
19 మమ్మల్ని వేటాడేవాళ్లు ఆకాశంలో ఎగిరే గద్దల కంటే వేగంగా వచ్చారు.+
వాళ్లు పర్వతాల మీద మమ్మల్ని తరిమారు; ఎడారిలో మా కోసం పొంచివున్నారు.
ר [రేష్]
20 మా ఊపిరి, యెహోవా అభిషేకించిన వ్యక్తి,+
“దేశాల మధ్య మేము అతని నీడలో బ్రతుకుతాం” అని మేము చెప్పుకున్న వ్యక్తి
వాళ్లు తవ్విన పెద్ద గోతిలో చిక్కుకుపోయాడు.+
ש [సీన్]
21 ఎదోము కూతురా, నువ్వు ఊజు దేశంలో నివసిస్తున్నట్టే సంతోషించు, ఉల్లసించు.+
అయితే ఆ గిన్నె నీ దగ్గరికి కూడా వస్తుంది,+ నువ్వు మత్తుగా తాగి నీ మానాన్ని వెల్లడిచేసుకుంటావు.+
ת [తౌ]
22 సీయోను కూతురా, నీ దోషశిక్ష పూర్తయింది.
ఆయన నిన్ను మళ్లీ చెరలోకి తీసుకెళ్లడు.+
అయితే ఎదోము కూతురా, ఇప్పుడాయన నీ తప్పు మీద దృష్టిపెడతాడు.
నీ పాపాల్ని బయటపెడతాడు.+
5 యెహోవా, మా మీదికి వచ్చిన కష్టాన్ని గుర్తుచేసుకో.
మాకు కలిగిన అవమానాన్ని చూడు.+
2 మా వారసత్వ ఆస్తి పరాయివాళ్లకు, మా ఇళ్లు పరదేశులకు అప్పగించబడ్డాయి.+
3 మేము తండ్రిలేనివాళ్లం అయ్యాం, అనాథలం అయ్యాం; మా తల్లులు విధవరాళ్లు అయ్యారు.*+
4 మా సొంత నీళ్లను, మా సొంత కట్టెల్ని డబ్బిచ్చి కొనుక్కోవాల్సి వచ్చింది.+
5 మమ్మల్ని వెంటాడుతున్న వాళ్లు మా మెడ దగ్గర ఉన్నారు;
మేము అలసిపోయాం, కానీ మాకు విశ్రాంతి దొరకట్లేదు.+
6 ఆహారం కోసం మేము ఐగుప్తు* మీద, అష్షూరు మీద ఆధారపడ్డాం.+
7 పాపం చేసిన మా పూర్వీకులు ఇప్పుడు లేరు, కానీ మేం మాత్రం వాళ్ల దోషాల్ని భరిస్తున్నాం.
8 సేవకులు మమ్మల్ని ఏలుతున్నారు; వాళ్ల చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించే వాళ్లెవ్వరూ లేరు.
9 ఎడారిలోని ఖడ్గం వల్ల మేము ప్రాణాలకు తెగించి ఆహారం తెచ్చుకుంటున్నాం.+
10 తీవ్రమైన ఆకలి వల్ల మా చర్మం కొలిమిలా కాలిపోతోంది.+
11 సీయోనులోని భార్యల్ని, యూదా నగరాల్లోని కన్యల్ని వాళ్లు అవమానించారు.*+
12 తమ చేతితో అధిపతుల్ని వేలాడదీశారు,+ పెద్దల మీద ఏమాత్రం గౌరవం చూపించలేదు.+
13 యువకులు తిరుగలి మోస్తున్నారు, పిల్లలు కట్టెల మోపులు మోయలేక తడబడుతున్నారు.
14 నగర ద్వారం దగ్గర పెద్దలు లేరు;+ యువకులు సంగీతం వాయించట్లేదు.
15 మా హృదయంలో ఇక సంతోషం లేదు; మా నాట్యం దుఃఖంగా మారింది.+
16 మా తల మీద నుండి కిరీటం పడిపోయింది. అయ్యో, మాకు శ్రమ! మేము పాపం చేశాం!
17 అందువల్ల మా హృదయం బలహీనపడింది,
ఈ విషయాల వల్ల మా కళ్లు మసకబారాయి;+
18 ఎందుకంటే సీయోను పర్వతం నిర్జనంగా మారింది;+ ఇప్పుడు దానిమీద నక్కలు సంచరిస్తున్నాయి.
19 యెహోవా, నువ్వు ఎప్పటికీ సింహాసనం మీద కూర్చొని ఉంటావు.
నీ సింహాసనం తరతరాలు ఉంటుంది.+
20 నువ్వు మమ్మల్ని ఎందుకు శాశ్వతంగా మర్చిపోయావు? ఇంతకాలం పాటు మమ్మల్ని ఎందుకు వదిలేశావు?+
21 యెహోవా, మమ్మల్ని మళ్లీ నీ దగ్గరికి తెచ్చుకో, మేము ఇష్టపూర్వకంగా నీ దగ్గరికి తిరిగొస్తాం.+
మళ్లీ మాకు పాత రోజుల్ని తీసుకురా.+
22 అయితే నువ్వు మమ్మల్ని పూర్తిగా తిరస్కరించావు.
మా మీద చాలా కోపంగా ఉన్నావు.+
1-4 అధ్యాయాలు హీబ్రూ అక్షరక్రమంలో ఉన్న శోకగీతాలు.
లేదా “అధిక జనాభాగల.”
లేదా “యువతులు.”
ఇక్కడ యెరూషలేమును ఒక స్త్రీలా వర్ణించారు.
అక్ష., “నోటికి.”
లేదా “యువతులు.”
అక్ష., “పేగులు.”
లేదా “బలాన్నంతటినీ.”
అక్ష., “తొక్కాడు.”
లేదా “నాశనం చేశాడు.”
లేదా “సబ్బాతును.”
లేదా “ఉపదేశం.”
అక్ష., “పేగులు.”
బహుశా జాలిని లేదా సానుభూతిని కావ్యరూపంలో ఇలా వ్యక్తం చేసివుండవచ్చు.
అక్ష., “నా కాలేయం భూమి మీదికి ఒలికింది.”
అక్ష., “ధాన్యం, ద్రాక్షారసం ఎక్కడ?”
అక్ష., “కొమ్మును.”
అక్ష., “నీ కనుపాపకు.”
అక్ష., “రాత్రివేళ, జాముల ఆరంభంలో.”
లేదా “ఫలాన్ని.”
లేదా “యువతులు.”
లేదా “ఆరోగ్యంగా కని.”
లేదా “చేదు విషాన్ని.”
లేదా “అడ్డుకుంటున్నాడు.”
లేదా “కదల్లేని స్థితిలో వదిలేశాడు” అయ్యుంటుంది.
అక్ష., “తొక్కి.”
అక్ష., “కుమారులతో.”
పదకోశం చూడండి.
లేదా “కిందికి వంగి.”
లేదా “ఓపిగ్గా.”
లేదా “పూర్తిగా లోబడాలి.”
లేదా “చుట్టుపక్కల పట్టణాలన్నిటికీ.”
లేదా “మేలిమి బంగారంతో తూచబడిన.”
పదకోశం చూడండి.
అక్ష., “దిక్కులేకుండా.”
అక్ష., “ముదురు ఎరుపు.”
అక్ష., “దోషం.”
అక్ష., “పాపం.”
అక్ష., “నలుపు.”
లేదా “పరదేశుల్లా నివసించడానికి.”
అక్ష., “యెహోవా ముఖం.”
అక్ష., “విధవరాళ్లలా ఉన్నారు.”
లేదా “ఈజిప్టు.”
లేదా “చెరిచారు.”