కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • nwt నిర్గమకాండము 1:1-40:38
  • నిర్గమకాండం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నిర్గమకాండం
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నిర్గమకాండం

నిర్గమకాండం

1 యాకోబు ఐగుప్తుకు* వచ్చినప్పుడు, అతని కుమారులు కూడా తమ కుటుంబాల్ని తీసుకొని అతనితోపాటు వచ్చారు. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవి:+ 2 రూబేను, షిమ్యోను, లేవి, యూదా;+ 3 ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను; 4 దాను, నఫ్తాలి; గాదు, ఆషేరు.+ 5 యాకోబుకు పుట్టినవాళ్లు మొత్తం 70 మంది, అయితే యోసేపు అప్పటికే ఐగుప్తులో ఉన్నాడు.+ 6 కొంతకాలానికి యోసేపు, అతని సహోదరులందరూ, అలాగే ఆ తరం వాళ్లందరూ చనిపోయారు.+ 7 ఇశ్రాయేలీయులు* పిల్లల్ని కని చాలామంది అయ్యారు. వాళ్ల సంఖ్య అసాధారణ రీతిలో పెరుగుతూ పోయింది, వాళ్లు చాలా బలంగా తయారౌతూ వచ్చారు. దాంతో ఆ ప్రాంతమంతా వాళ్లతో నిండిపోయింది.+

8 కొంతకాలానికి, యోసేపు గురించి తెలియని ఒక కొత్త రాజు ఐగుప్తును పరిపాలించడం మొదలుపెట్టాడు. 9 అతను తన ప్రజలతో ఇలా అన్నాడు: “ఇదిగో! ఇశ్రాయేలు ప్రజలు మనకన్నా ఎక్కువమంది అయ్యారు, మనకన్నా బలంగా తయారయ్యారు.+ 10 మనం వాళ్ల విషయంలో తెలివిగా* ప్రవర్తించాలి. లేకపోతే వాళ్ల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతుంది. ఒకవేళ యుద్ధం వస్తే, వాళ్లు మన శత్రువులతో చెయ్యి కలిపి మనతో పోరాడి, ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతారు.”

11 కాబట్టి వాళ్లు ఇశ్రాయేలీయులతో వెట్టిచాకిరి చేయించడానికి, వాళ్లను అణచివేసి వాళ్లతో కష్టమైన పనులు చేయించడానికి+ వాళ్లమీద ప్రధానుల్ని నియమించారు; ఇశ్రాయేలీయుల్ని ఉపయోగించుకొని ఫరో కోసం ధాన్యాన్ని, ఇతర వస్తువుల్ని నిల్వచేయడానికి పీతోము, రామెసేసు+ అనే నగరాల్ని కట్టించారు. 12 కానీ అలా అణచివేసే కొద్దీ, ఇశ్రాయేలీయుల సంఖ్య పెరుగుతూ పోయింది, వాళ్లు ఇంకా ఎక్కువగా విస్తరిస్తూ వచ్చారు. దాంతో ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులంటే భయపడిపోయారు, వాళ్లను అసహ్యించుకున్నారు.+ 13 కాబట్టి ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని బానిసలుగా చేసుకొని వాళ్లతో వెట్టిచాకిరి చేయించారు.+ 14 వాళ్లతో వెట్టిచాకిరి చేయిస్తూ వాళ్ల జీవితాల్ని దుర్భరం చేశారు; వాళ్లతో బంకమట్టి పని, ఇటుకల పని, అన్నిరకాల పొలం పనులు చేయించారు. వాళ్లతో కఠినంగా వ్యవహరిస్తూ, బానిసలతో చేయించే అన్నిరకాల కష్టమైన పనుల్ని వాళ్లతో చేయించారు.+

15 తర్వాత ఐగుప్తు రాజు షిఫ్రా, పూయా అనే హెబ్రీ మంత్రసానులతో* మాట్లాడుతూ 16 ఇలా అన్నాడు: “మీరు హెబ్రీ స్త్రీలకు పురుడు పోసే సమయంలో,+ వాళ్లు కాన్పుపీట మీద ఉన్నప్పుడు మీరు ఇలా చేయాలి: పుట్టింది మగపిల్లవాడైతే అతన్ని చంపేయాలి, ఆడపిల్ల అయితే బ్రతకనివ్వాలి.” 17 అయితే, ఆ మంత్రసానులు సత్యదేవునికి భయపడేవాళ్లు కాబట్టి ఐగుప్తు రాజు తమకు చెప్పినట్టు చేయకుండా మగపిల్లల్ని బ్రతకనిచ్చారు.+ 18 తర్వాత ఐగుప్తు రాజు ఆ మంత్రసానుల్ని పిలిపించి, “మీరు మగపిల్లల్ని ఎందుకు బ్రతకనిచ్చారు?” అని అడిగాడు. 19 అప్పుడు వాళ్లు ఫరోతో ఇలా అన్నారు: “హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల లాంటివాళ్లు కాదు; వాళ్లు చాలా చురుగ్గా ఉంటారు, మంత్రసాని వెళ్లేలోగా బిడ్డను కనేస్తారు.”

20 అందుకే దేవుడు ఆ మంత్రసానుల్ని దీవించాడు. ఇశ్రాయేలీయుల సంఖ్య పెరుగుతూ పోయింది, వాళ్లు చాలా బలంగా తయారౌతూ ఉన్నారు. 21 ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు కాబట్టి ఆ తర్వాత దేవుడు వాళ్లకు కుటుంబాల్ని ఇచ్చి దీవించాడు. 22 చివరికి ఫరో తన ప్రజలందరికీ ఇలా ఆజ్ఞాపించాడు: “హెబ్రీయులకు పుట్టే ప్రతీ మగపిల్లవాణ్ణి మీరు నైలు నదిలో పారేయాలి, ఆడపిల్లల్ని మాత్రం బ్రతకనివ్వాలి.”+

2 దాదాపు ఆ సమయంలోనే, లేవి వంశస్థుడైన ఒకతను లేవి గోత్రానికి చెందిన ఒకామెను పెళ్లి చేసుకున్నాడు.+ 2 ఆమె గర్భవతి అయ్యి ఒక కుమారుణ్ణి కన్నది. ఆ బిడ్డ చాలా అందంగా ఉండడం చూసి, ఆమె అతన్ని మూడు నెలలపాటు దాచివుంచింది.+ 3 తర్వాత ఇక ఆ బిడ్డను దాచివుంచడం వీలుకాక,+ ఒక జమ్ము పెట్టె* తీసుకొని దానికి తారు, కీలు పూసి బిడ్డను అందులో పెట్టింది; తర్వాత ఆ పెట్టెను నైలు నది ఒడ్డున ఉన్న జమ్ముగడ్డి మధ్యలో ఉంచింది. 4 ఆ పిల్లవాడి అక్క,+ అతనికి ఏం జరుగుతుందో చూద్దామని కాస్త దూరంలో నిలబడింది.

5 కాసేపటికి ఫరో కూతురు నైలు నదిలో స్నానం చేయడానికి వచ్చింది, ఆమె చెలికత్తెలు నైలు నది ఒడ్డున నడుస్తున్నారు. అప్పుడు ఆమెకు జమ్ముగడ్డి మధ్యలో ఒక పెట్టె కనిపించింది. వెంటనే ఆమె తన దాసురాలిని పంపి ఆ పెట్టెను తెప్పించింది.+ 6 ఆమె ఆ పెట్టెను తెరిచి ఆ బిడ్డను చూసింది, వాడు ఏడుస్తున్నాడు. అప్పుడు ఆమెకు ఆ బిడ్డ మీద కనికరం కలిగింది. ఆమె, “ఇతను హెబ్రీయుల పిల్లల్లో ఒకడు” అంది. 7 తర్వాత, ఆ పిల్లవాడి అక్క ఫరో కూతురును ఇలా అడిగింది: “నీ కోసం ఆ పిల్లవాడికి పాలిచ్చి పెంచడానికి నేను వెళ్లి ఒక హెబ్రీ స్త్రీని తీసుకురానా?” 8 అప్పుడు ఫరో కూతురు, “వెళ్లు!” అంది. వెంటనే ఆ అమ్మాయి వెళ్లి, ఆ పిల్లవాడి తల్లిని+ తీసుకొచ్చింది. 9 ఫరో కూతురు ఆ స్త్రీతో, “ఈ బిడ్డను నీతోపాటు తీసుకెళ్లి నా కోసం వాడికి పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను” అంది. కాబట్టి ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకెళ్లి, పాలిచ్చి పెంచింది. 10 ఆ పిల్లవాడు కాస్త పెద్దయ్యాక, ఆ స్త్రీ అతన్ని ఫరో కూతురు దగ్గరికి తీసుకొచ్చింది, అతను ఆమె కుమారుడు అయ్యాడు.+ ఆమె అతనికి మోషే* అని పేరు పెట్టింది. “ఎందుకంటే ఇతన్ని నేను నీళ్లలో నుండి బయటికి తీశాను”+ అని ఆమె అంది.

11 మోషే పెద్దవాడైన తర్వాత* ఒకరోజు అతను తన సహోదరులైన హెబ్రీయులు మోస్తున్న భారాల్ని చూడడానికి బయటికి వెళ్లాడు.+ అప్పుడొక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుణ్ణి కొడుతుండడం అతను చూశాడు. 12 కాబట్టి అతను అటూఇటూ చూసి, ఎవరూ లేకపోవడంతో ఆ ఐగుప్తీయుణ్ణి చంపి ఇసుకలో కప్పిపెట్టేశాడు.+

13 అయితే తర్వాతి రోజు అతను మళ్లీ బయటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుకుంటున్నారు. అప్పుడతను తప్పు చేసిన వ్యక్తిని, “నీ సహోదరుణ్ణి ఎందుకు కొడుతున్నావు?” అని అడిగాడు.+ 14 దానికి ఆ వ్యక్తి, “నిన్ను మా మీద అధికారిగా, న్యాయమూర్తిగా ఎవరు నియమించారు? ఆ ఐగుప్తీయుణ్ణి చంపినట్టే నన్ను కూడా చంపుదామని అనుకుంటున్నావా?” అన్నాడు.+ దాంతో మోషేకు భయమేసి, “సందేహం లేదు, ఈ విషయం అందరికీ తెలిసిపోయింది!” అనుకున్నాడు.

15 తర్వాత ఫరోకు ఆ విషయం గురించి తెలిసింది, దాంతో అతను మోషేను చంపడానికి ప్రయత్నించాడు. అయితే మోషే ఫరో దగ్గర నుండి పారిపోయి, మిద్యాను దేశంలో+ నివసించడానికి వెళ్లాడు; అక్కడికి వెళ్లాక, ఒక బావి పక్కన కూర్చున్నాడు. 16 మిద్యానులో ఉన్న ఒక పూజారికి+ ఏడుగురు కూతుళ్లు ఉన్నారు. వాళ్లు నీళ్లు చేది, తొట్లను నింపి, తమ తండ్రి మందకు నీళ్లు పెట్టడానికి అక్కడికి వచ్చారు. 17 అయితే ఎప్పటిలాగే గొర్రెల కాపరులు వచ్చి వాళ్లను అక్కడి నుండి వెళ్లగొట్టారు. దాంతో మోషే లేచి, ఆ స్త్రీలకు సహాయం చేసి,* వాళ్ల మందకు నీళ్లు పెట్టాడు. 18 వాళ్లు ఇంట్లో ఉన్న తమ తండ్రి రగూయేలు*+ దగ్గరికి వచ్చినప్పుడు, అతను ఆశ్చర్యంతో “ఈ రోజు ఇంత త్వరగా ఎలా వచ్చారు?” అని అడిగాడు. 19 దానికి వాళ్లు, “ఒక ఐగుప్తీయుడు+ గొర్రెల కాపరుల నుండి మమ్మల్ని కాపాడాడు. అంతేకాదు, అతను మా కోసం నీళ్లు చేది, మందకు నీళ్లు పెట్టాడు” అని చెప్పారు. 20 అప్పుడతను తన కూతుళ్లతో ఇలా అన్నాడు: “ఇంతకీ అతను ఎక్కడున్నాడు? ఎందుకు అతన్ని అక్కడే వదిలేసి వచ్చారు? అతన్ని పిలవండి, అతను కూడా మనతో కలిసి భోంచేస్తాడు.” 21 తర్వాత మోషే అతని దగ్గర ఉండడానికి ఒప్పుకున్నాడు, అతను తన కూతురు సిప్పోరాను+ మోషేకు ఇచ్చి పెళ్లిచేశాడు. 22 తర్వాత ఆమె ఒక కుమారుణ్ణి కన్నది. అప్పుడు మోషే, “నేను వేరే దేశంలో పరదేశిని అయ్యాను”+ అంటూ ఆ పిల్లవాడికి గెర్షోము*+ అని పేరు పెట్టాడు.

23 చాలాకాలం* తర్వాత, ఆ ఐగుప్తు రాజు చనిపోయాడు.+ అయితే ఇశ్రాయేలీయులు ఇంకా బానిసలుగానే ఉన్నారు. వాళ్లు మూల్గుతూ, ఆర్తనాదాలు పెడుతూ ఉన్నారు. బానిసత్వం కారణంగా సహాయం కోసం వాళ్లు పెడుతున్న మొర సత్యదేవుని దగ్గరికి చేరుతూ ఉంది.+ 24 దేవుడు వాళ్ల మూల్గుల్ని విని,+ తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ఒప్పందాన్ని* గుర్తుచేసుకున్నాడు.+ 25 దేవుడు ఇశ్రాయేలీయుల్ని చూశాడు; వాళ్ల మీద దృష్టి పెట్టాడు.

3 మోషే మిద్యాను పూజారైన తన మామ యిత్రో+ మందను కాస్తూ గొర్రెల కాపరి అయ్యాడు. అతను ఎడారికి* పడమటి వైపుగా మందను నడిపిస్తూ, చివరికి సత్యదేవుని పర్వతమైన హోరేబు+ దగ్గరికి వచ్చాడు. 2 అప్పుడు యెహోవా దూత ఒక ముళ్లపొద మధ్య అగ్నిజ్వాలలో అతనికి కనిపించాడు.+ మోషే అలాగే చూస్తూ ఉన్నాడు, ఆ ముళ్లపొద మండుతోంది కానీ కాలిపోవట్లేదు. 3 కాబట్టి మోషే, “నేను వెళ్లి ఈ అసాధారణ దృశ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి, ముళ్లపొద ఎందుకు కాలిపోవట్లేదో తెలుసుకుంటాను” అనుకున్నాడు. 4 మోషే దాన్ని చూడడానికి వెళ్లడం యెహోవా గమనించినప్పుడు, దేవుడు ఆ ముళ్లపొదలో నుండి “మోషే! మోషే!” అని పిలిచాడు. దానికి మోషే, “చెప్పు ప్రభువా” అన్నాడు. 5 తర్వాత ఆయన ఇలా అన్నాడు: “ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయకు. నీ కాళ్లకున్న చెప్పులు తీసేయి. ఎందుకంటే నువ్వు నిలబడిన స్థలం పవిత్రమైనది.”

6 ఆయన ఇంకా ఇలా అన్నాడు: “నేను నీ తండ్రికి దేవుణ్ణి, అబ్రాహాముకు దేవుణ్ణి,+ ఇస్సాకుకు దేవుణ్ణి,+ యాకోబుకు దేవుణ్ణి.”+ అప్పుడు మోషే సత్యదేవుని వైపు చూడడానికి భయపడి తన ముఖాన్ని కప్పేసుకున్నాడు. 7 యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “ఐగుప్తులో ఉన్న నా ప్రజల కష్టాన్ని నేను నిజంగా చూశాను, వాళ్లతో బలవంతంగా పని చేయిస్తున్నవాళ్ల కారణంగా నా ప్రజలు పెడుతున్న మొరను నేను విన్నాను; వాళ్లు పడుతున్న వేదన నాకు బాగా తెలుసు.+ 8 నేను దిగివెళ్లి ఐగుప్తీయుల చేతుల్లో నుండి వాళ్లను కాపాడి,+ విశాలమైన మంచి దేశంలోకి వాళ్లను తీసుకొస్తాను. అది పాలుతేనెలు ప్రవహించే దేశం;+ కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు+ నివసిస్తున్న ప్రాంతం. 9 ఇదిగో! ఇశ్రాయేలు ప్రజల మొర నా దగ్గరికి చేరింది. ఐగుప్తీయులు వాళ్లను ఎంత కఠినంగా అణచివేస్తున్నారో కూడా నేను చూశాను.+ 10 కాబట్టి రా, నేను నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొస్తావు.”+

11 అయితే మోషే సత్యదేవునితో ఇలా అన్నాడు: “ఫరో దగ్గరికి వెళ్లి ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకురావడానికి నేను ఎంతటివాణ్ణి?” 12 దానికి ఆయన ఇలా అన్నాడు: “నేను తప్పకుండా నీకు తోడుగా ఉంటాను.+ నిన్ను పంపించింది నేనే అనడానికి గుర్తు ఇదే: నువ్వు ఆ ప్రజల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాక, మీరంతా ఈ పర్వతం మీద సత్యదేవుణ్ణి ఆరాధిస్తారు.”*+

13 అయితే మోషే సత్యదేవుణ్ణి ఇలా అడిగాడు: “ఒకవేళ నేను ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్లి, ‘మీ పూర్వీకుల దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించాడు’ అని చెప్పినప్పుడు వాళ్లు, ‘ఆయన పేరేంటి?’+ అని నన్ను అడిగితే నేను వాళ్లకు ఏం చెప్పాలి?” 14 అందుకు దేవుడు మోషేతో ఇలా అన్నాడు: “నేను ఎలా అవ్వాలని అనుకుంటే* అలా అవుతాను.”*+ దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాలి: ‘ “నేను అవుతాను” అనే వ్యక్తి నన్ను మీ దగ్గరికి పంపించాడు.’ ”+ 15 తర్వాత దేవుడు ఇంకొకసారి మోషేతో ఇలా అన్నాడు:

“నువ్వు ఇశ్రాయేలీయులతో, ‘మీ పూర్వీకుల దేవుడు, అంటే అబ్రాహాముకు దేవుడు,+ ఇస్సాకుకు దేవుడు,+ యాకోబుకు దేవుడు+ అయిన యెహోవా నన్ను మీ దగ్గరికి పంపించాడు’ అని చెప్పాలి. ఎప్పటికీ నా పేరు ఇదే. తరతరాలు ప్రజలు నన్ను ఇలాగే గుర్తుచేసుకోవాలి. 16 ఇప్పుడు నువ్వు వెళ్లి, ఇశ్రాయేలు పెద్దల్ని సమావేశపర్చి వాళ్లతో ఇలా అను: ‘మీ పూర్వీకుల దేవుడు, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అయిన యెహోవా నాకు కనిపించి ఇలా అన్నాడు: “నేను మీ పరిస్థితిని నిజంగా చూశాను,+ ఐగుప్తులో మీకు జరుగుతున్నదంతా గమనించాను. 17 అందుకే నేను చెప్తున్నాను, ఐగుప్తీయుల చేతుల్లో మీరు పడుతున్న కష్టాల నుండి మిమ్మల్ని విడిపించి+ కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు,+ పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసిస్తున్న పాలుతేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను.” ’+

18 “వాళ్లు తప్పకుండా నీ మాట వింటారు.+ నువ్వూ, ఇశ్రాయేలు పెద్దలూ ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్తారు. అప్పుడు మీరు అతనితో ఇలా చెప్పాలి: ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా మాతో మాట్లాడాడు. కాబట్టి, మేము మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి ఎడారిలో మా దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి దయచేసి మాకు అనుమతి ఇవ్వు.’+ 19 అయితే శక్తివంతమైన* చెయ్యి బలవంతం చేస్తే తప్ప ఐగుప్తు రాజు మీకు అనుమతి ఇవ్వడని నాకు బాగా తెలుసు.+ 20 కాబట్టి నేను నా చెయ్యి చాపి, ఐగుప్తులో నేను చేయబోయే అసాధారణమైన పనులన్నిటితో ఆ దేశాన్ని కొట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతను మిమ్మల్ని పంపించేస్తాడు.+ 21 అంతేకాదు, ఐగుప్తీయుల దృష్టిలో ఈ ప్రజలు అనుగ్రహం పొందేలా చేస్తాను. మీరు వెళ్లిపోయేటప్పుడు, ఏమాత్రం వట్టి చేతులతో వెళ్లరు.+ 22 ప్రతీ స్త్రీ తన పొరుగింట్లో ఉన్న స్త్రీని, తన ఇంట్లో ఉంటున్న స్త్రీని వెండి-బంగారు వస్తువులు, అలాగే బట్టలు అడిగి తీసుకోవాలి. వాటిని మీ కుమారులకు, కూతుళ్లకు తొడగాలి. మీరు ఐగుప్తీయుల్ని కొల్లగొడతారు.”+

4 అయితే మోషే ఇలా అన్నాడు: “ఒకవేళ వాళ్లు నన్ను నమ్మకపోతే, నా మాట వినకపోతే, నేనేం చేయాలి?+ ఎందుకంటే వాళ్లు ‘యెహోవా నీకు కనిపించలేదు’ అంటారు.” 2 అందుకు యెహోవా, “నీ చేతిలో ఉన్నదేంటి?” అని అడిగాడు. దానికి మోషే, “కర్ర” అన్నాడు. 3 అప్పుడు దేవుడు, “దాన్ని నేలమీద పడేయి” అన్నాడు. మోషే దాన్ని నేలమీద పడేశాడు, అప్పుడది పాము అయింది;+ అతను దాని దగ్గర నుండి పారిపోయాడు. 4 తర్వాత యెహోవా మోషేతో, “నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకో” అన్నాడు. అతను తన చెయ్యి చాపి దాన్ని పట్టుకున్నాడు, అది అతని చేతిలో కర్ర అయింది. 5 అప్పుడు దేవుడు ఇలా అన్నాడు: “నువ్వు ఇలా చేస్తే, వాళ్ల పూర్వీకుల దేవుడు, అంటే అబ్రాహాముకు దేవుడు, ఇస్సాకుకు దేవుడు, యాకోబుకు దేవుడు+ అయిన యెహోవా నీకు కనిపించాడని వాళ్లు నమ్ముతారు.”+

6 యెహోవా ఇంకోసారి అతనితో, “దయచేసి, నీ చెయ్యి నీ వస్త్రం పైమడతలో పెట్టు” అన్నాడు. అతను తన చేతిని తన వస్త్రం మడతలో పెట్టాడు. తర్వాత అతను తన చేతిని బయటికి తీసి చూసినప్పుడు, ఇదిగో! అది కుష్ఠుతో నిండిపోయి మంచు అంత తెల్లగా ఉంది.+ 7 అప్పుడు దేవుడు, “నీ చెయ్యి మళ్లీ నీ వస్త్రం పైమడతలో పెట్టు” అన్నాడు. అతను తన చేతిని మళ్లీ తన వస్త్రంలో పెట్టాడు. అతను తన చేతిని బయటికి తీసి చూసేసరికి, అది మళ్లీ మిగతా శరీరంలా మారిపోయింది! 8 తర్వాత దేవుడు ఇలా అన్నాడు: “ఒకవేళ వాళ్లు నిన్ను నమ్మకుండా, మొదటి అద్భుతం* చూసిన తర్వాత కూడా నీ మాట వినకుండా ఉంటే, రెండో అద్భుతం చూశాక వాళ్లు తప్పకుండా నీ మాట వింటారు.+ 9 ఒకవేళ వాళ్లు ఈ రెండు అద్భుతాలు చూశాక కూడా ఇంకా నిన్ను నమ్మకుండా, నీ మాట వినకుండా ఉంటే, నువ్వు నైలు నదిలో నుండి కొన్ని నీళ్లు తీసుకొని పొడినేల మీద పోయాలి; అప్పుడు నైలు నది నుండి నువ్వు తీసిన నీళ్లు పొడినేల మీద రక్తంగా మారతాయి.”+

10 అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు: “యెహోవా, నన్ను మన్నించు, ఇంతకుముందు గానీ నువ్వు నీ సేవకుడితో మాట్లాడినప్పటి నుండి గానీ నేను అనర్గళంగా మాట్లాడే వ్యక్తిని కాదు. ఎందుకంటే నా నోరు మందం, నా నాలుక మందం.”+ 11 అప్పుడు యెహోవా అతనితో ఇలా అన్నాడు: “మనిషికి నోరు ఇచ్చింది ఎవరు? వాళ్లను మూగవాళ్లుగా గానీ చెవిటివాళ్లుగా గానీ చక్కగా చూడగలిగేవాళ్లుగా గానీ గుడ్డివాళ్లుగా గానీ చేసేది ఎవరు? యెహోవానైన నేను కాదా? 12 కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్లు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను నీకు* తోడుగా ఉంటాను, నువ్వు ఏం మాట్లాడాలో నేను నీకు నేర్పిస్తాను.”+ 13 కానీ మోషే, “యెహోవా, నన్ను మన్నించు, దయచేసి నన్ను కాకుండా ఇంకెవరినైనా ఎంచుకొని పంపించు” అన్నాడు. 14 అప్పుడు యెహోవాకు మోషే మీద చాలా కోపమొచ్చి ఇలా అన్నాడు: “లేవీయుడైన నీ అన్న అహరోను+ ఉన్నాడు కదా? అతను చాలా బాగా మాట్లాడగలడని నాకు తెలుసు. ఇప్పుడతను నిన్ను కలవడానికి ఇక్కడికి వస్తున్నాడు. అతను నిన్ను చూసినప్పుడు హృదయంలో చాలా సంతోషిస్తాడు.+ 15 నువ్వు అతనితో మాట్లాడి, నా మాటలు అతనికి చెప్పాలి.+ నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను నీకు, అతనికి తోడుగా ఉంటాను,+ మీరు ఏం చేయాలో నేను మీకు నేర్పిస్తాను. 16 నీ తరఫున అతను ప్రజలతో మాట్లాడతాడు, అతను నీకు నోరుగా ఉంటాడు, నువ్వు అతనికి దేవుడిగా* ఉంటావు.+ 17 నువ్వు నీ చేతిలో ఈ కర్రను తీసుకెళ్లి దానితో అద్భుతాలు చేస్తావు.”+

18 కాబట్టి మోషే తన మామ యిత్రో+ దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు: “నేను ఐగుప్తులో ఉన్న నా సహోదరుల దగ్గరికి తిరిగెళ్లి, వాళ్లు ఎలా ఉన్నారో చూడాలని అనుకుంటున్నాను. దయచేసి నన్ను వెళ్లనివ్వు.” అప్పుడు యిత్రో మోషేతో, “క్షేమంగా వెళ్లు” అన్నాడు. 19 తర్వాత మిద్యానులో యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు ఐగుప్తుకు తిరిగెళ్లు, ఎందుకంటే నిన్ను చంపాలని చూసిన వాళ్లంతా చనిపోయారు.”+

20 అప్పుడు మోషే తన భార్యను, తన కుమారుల్ని గాడిద మీదికి ఎక్కించి ఐగుప్తు దేశానికి ప్రయాణమయ్యాడు; అంతేకాదు, చేతిలో సత్యదేవుని కర్రను కూడా తీసుకెళ్లాడు. 21 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు ఐగుప్తుకు తిరిగెళ్లాక, ఏ అద్భుతాలు చేయడానికి నేను నీకు శక్తిని ఇచ్చానో అవన్నీ నువ్వు తప్పకుండా ఫరో ముందు చేయాలి.+ అయితే నేను అతని హృదయాన్ని కఠినం అవ్వనిస్తాను,+ అతను ప్రజల్ని అక్కడి నుండి పంపించడు.+ 22 నువ్వు ఫరోతో ఇలా చెప్పాలి: ‘యెహోవా చెప్పేదేమిటంటే, “ఇశ్రాయేలు నా కుమారుడు, నా మొదటి సంతానం.+ 23 నేను నీకు చెప్తున్నాను, నా కుమారుడు నన్ను సేవించేలా అతన్ని పంపించేయి. కానీ నువ్వు అతన్ని పంపించడానికి ఒప్పుకోకపోతే, నేను నీ కుమారుణ్ణి, అంటే నీ మొదటి సంతానాన్ని చంపుతాను.” ’ ”+

24 వాళ్లు బస చేసే చోట దారిలో యెహోవా+ అతన్ని కలుసుకొని, అతన్ని* చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు.+ 25 చివరికి సిప్పోరా+ ఒక పదునైన రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి, అతని ముందోలు ఆయన పాదాల్ని తాకేలా చేసి, “నువ్వు నాకు రక్తసంబంధివైన పెళ్లికుమారుడివి కాబట్టి ఇలా చేశాను” అంది. 26 దాంతో ఆయన అతన్ని వదిలేశాడు. అప్పుడామె, ఆ సున్నతి కారణంగా, “రక్తసంబంధియైన పెళ్లికుమారుడు” అని అంది.

27 తర్వాత యెహోవా అహరోనుతో, “నువ్వు మోషేను కలవడానికి ఎడారిలోకి వెళ్లు”+ అని చెప్పాడు. కాబట్టి అతను వెళ్లి సత్యదేవుని పర్వతం+ దగ్గర అతన్ని కలుసుకొని, అతనికి ముద్దుపెట్టి పలకరించాడు. 28 అప్పుడు మోషే తనను పంపిన యెహోవా చెప్పిన మాటలన్నీ అహరోనుకు తెలియజేశాడు.+ అలాగే ఆయన చేయమని ఆజ్ఞాపించిన అద్భుతాలన్నిటి+ గురించి కూడా అతనికి చెప్పాడు. 29 తర్వాత మోషే, అహరోను వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలందర్నీ సమావేశపర్చారు.+ 30 యెహోవా మోషేతో మాట్లాడిన మాటలన్నీ అహరోను వాళ్లకు చెప్పాడు, మోషే ఆ అద్భుతాలన్నీ ప్రజల ముందు చేసి చూపించాడు.+ 31 అప్పుడు ప్రజలు నమ్మారు.+ యెహోవా ఇశ్రాయేలీయుల్ని గుర్తుచేసుకున్నాడని,+ వాళ్ల కష్టాన్ని చూశాడని+ విన్నప్పుడు వాళ్లు వంగి సాష్టాంగ నమస్కారం చేశారు.

5 తర్వాత మోషే, అహరోను వెళ్లి ఫరోతో ఇలా అన్నారు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నా ప్రజలు ఎడారిలో నాకు పండుగ ఆచరించేలా వాళ్లను పంపించేయి.’ ” 2 కానీ ఫరో ఇలా అన్నాడు: “నేను అతని మాట విని ఇశ్రాయేలీయుల్ని పంపించడానికి యెహోవా ఎవరు?+ యెహోవా ఎవరో నాకు అస్సలు తెలీదు, అంతేకాదు ఇశ్రాయేలీయుల్ని నేను పంపించను.”+ 3 అయితే వాళ్లు ఇలా అన్నారు: “హెబ్రీయుల దేవుడు మాతో మాట్లాడాడు. మేము మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి ఎడారిలో మా దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి దయచేసి మాకు అనుమతి ఇవ్వు;+ లేకపోతే ఆయన మమ్మల్ని వ్యాధితో, ఖడ్గంతో శిక్షిస్తాడు.” 4 అప్పుడు ఐగుప్తు రాజు వాళ్లతో ఇలా అన్నాడు: “మోషే, అహరోనూ, మీరెందుకు ప్రజల్ని పనిచేయనివ్వడం లేదు? మీరంతా వెళ్లి మీ పనులు చేసుకోండి!”+ 5 ఫరో ఇంకా ఇలా అన్నాడు: “ఈ దేశంలో మీ ప్రజలు ఎంతమంది ఉన్నారో చూడండి, మీరు వాళ్లందర్నీ పనిచేయకుండా ఆపిన వాళ్లౌతారు.”

6 పనులు చేయించేవాళ్లకు, ఇశ్రాయేలీయుల్లోని పర్యవేక్షకులకు ఫరో అదే రోజున ఇలా ఆజ్ఞాపించాడు: 7 “మీరు ఇక మీదట ఇటుకలు చేయడానికి వాళ్లకు గడ్డి ఇవ్వకూడదు.+ వాళ్లకు కావాల్సిన గడ్డి వాళ్లే వెళ్లి తెచ్చుకోవాలి. 8 అయితే వాళ్లు ఇంతకుముందు ఎన్ని ఇటుకలు చేసేవాళ్లో ఇప్పుడు కూడా అన్నే ఇటుకలు తయారుచేయాలి. లెక్క తగ్గించొద్దు, వాళ్లు సోమరులు; అందుకే, ‘మేము వెళ్లాలనుకుంటున్నాం, మా దేవునికి బలులు అర్పించాలనుకుంటున్నాం!’ అని అరుస్తున్నారు. 9 వాళ్లతో ఇంకా కష్టమైన పనులు చేయించండి, వాళ్లను ఖాళీగా ఉంచకండి; అప్పుడే వాళ్లు అబద్ధాల మీద మనసు పెట్టకుండా ఉంటారు.”

10 కాబట్టి పనులు చేయించేవాళ్లు,+ ఇశ్రాయేలీయుల్లోని పర్యవేక్షకులు వెళ్లి ప్రజలతో ఇలా చెప్పారు: “ఫరో ఇలా అన్నాడు: ‘ఇప్పటినుండి నేను మీకు గడ్డి ఇవ్వను. 11 గడ్డి ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్లి మీకు కావాల్సిన గడ్డి మీరే తెచ్చుకోండి, చేయాల్సిన ఇటుకల లెక్క మాత్రం తగ్గించబడదు.’ ” 12 అప్పుడు ప్రజలు గడ్డికి బదులు కొయ్యకాలు* తెచ్చుకోవడానికి ఐగుప్తు దేశ నలుమూలలకు చెదిరిపోయారు. 13 పనులు చేయించేవాళ్లు, “గడ్డిని ఇచ్చినప్పుడు మీరు ప్రతీరోజు ఎన్ని ఇటుకలు తయారుచేశారో ఇప్పుడు కూడా అన్నే ఇటుకలు తయారుచేయాలి” అని అంటూ వాళ్లను ఒత్తిడిచేశారు. 14 అంతేకాదు ఫరో కింద ఉండే ఆ అధికారులు* తాము నియమించిన ఇశ్రాయేలీయుల్లోని పర్యవేక్షకుల్ని కొట్టారు.+ వాళ్లను, “ఇంతకుముందు చేసినన్ని ఇటుకలు ఎందుకు చేయలేదు? నిన్న అలాగే జరిగింది, ఈరోజూ అలాగే జరిగింది” అని అడిగారు.

15 కాబట్టి ఇశ్రాయేలీయుల్లోని పర్యవేక్షకులు వెళ్లి ఫరోకు ఇలా ఫిర్యాదు చేశారు: “నీ సేవకులమైన మాతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? 16 నీ సేవకులమైన మాకు వాళ్లు గడ్డి ఇవ్వట్లేదు, అయినా ‘ఇటుకలు చేయండి!’ అంటున్నారు. నీ సేవకులమైన మమ్మల్ని కొడుతున్నారు, నిజానికి తప్పు నీ ప్రజలదే.” 17 కానీ ఫరో ఇలా అన్నాడు: “మీరు సోమరులు, బద్దకస్తులు!+ అందుకే మీరు, ‘మేము వెళ్లాలనుకుంటున్నాం, యెహోవాకు బలులు అర్పించాలనుకుంటున్నాం’ అంటున్నారు.+ 18 కాబట్టి ఇప్పుడు వెళ్లి పని చేసుకోండి! మీకు గడ్డి ఇవ్వము, అయినా అన్నే ఇటుకలు చేయాలి.”

19 “ఏదేమైనా ఇటుకల లెక్క తగ్గకూడదు” అనే ఆదేశాన్ని విన్నప్పుడు, తాము పెద్ద సమస్యలో చిక్కుకున్నామని ఇశ్రాయేలీయుల్లోని పర్యవేక్షకులకు అర్థమైంది. 20 తర్వాత వాళ్లు, తాము ఫరో దగ్గర నుండి వచ్చినప్పుడు తమను కలవడానికి దారిలో నిలబడి ఉన్న మోషే, అహరోనుల్ని కలిశారు. 21 వెంటనే వాళ్లు ఇలా అన్నారు: “మీరు చేసిందంతా యెహోవా చూడాలి, ఆయన మీకు తీర్పు తీర్చాలి. ఎందుకంటే మీరు ఫరో, అతని సేవకులు మమ్మల్ని నీచంగా చూసేలా చేశారు, మమ్మల్ని చంపడానికి వాళ్ల చేతిలో ఖడ్గం పెట్టారు.”+ 22 అప్పుడు మోషే యెహోవా వైపు తిరిగి ఇలా అన్నాడు: “యెహోవా, ఈ ప్రజల్ని ఎందుకు కష్టపెట్టావు? నన్నెందుకు పంపించావు? 23 నేను నీ పేరున మాట్లాడడానికి+ ఫరో ముందుకు వెళ్లినప్పటి నుండి అతను ఈ ప్రజలతో ఇంకా దారుణంగా ప్రవర్తించాడు,+ నువ్వు నీ ప్రజల్ని ఏమాత్రం విడిపించలేదు.”+

6 కాబట్టి యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నేను ఫరోకు ఏం చేస్తానో ఇప్పుడు నువ్వు చూస్తావు.+ నా ప్రజల్ని పంపించేలా శక్తివంతమైన* చెయ్యి అతన్ని బలవంతం చేస్తుంది, వాళ్లను తన దేశంలో నుండి వెళ్లగొట్టేలా శక్తివంతమైన చెయ్యి అతన్ని బలవంతం చేస్తుంది.”+

2 తర్వాత దేవుడు మోషేతో ఇలా అన్నాడు: “నేను యెహోవాను. 3 నేను సర్వశక్తిగల దేవుడిగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యేవాణ్ణి.+ కానీ యెహోవా అనే నా పేరు+ విషయానికొస్తే, నన్ను నేను వాళ్లకు బయల్పర్చుకోలేదు.+ 4 అంతేకాదు, వాళ్లు ఏ దేశంలోనైతే పరదేశులుగా జీవించారో ఆ కనాను దేశాన్ని వాళ్లకు ఇస్తానని అంటూ వాళ్లతో నా ఒప్పందాన్ని స్థిరపర్చాను.+ 5 ఐగుప్తీయులు బానిసలుగా చేసుకుంటున్న ఇశ్రాయేలీయుల మూల్గుల్ని నేను స్వయంగా విన్నాను, నా ఒప్పందం నాకు గుర్తుంది.+

6 “కాబట్టి ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘నేను యెహోవాను, ఐగుప్తీయులు మీ మీద పెట్టిన భారాల నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను, వాళ్ల బానిసత్వం నుండి మిమ్మల్ని విడిపిస్తాను;+ ఐగుప్తు మీద నా తీర్పులు అమలు చేసి, చాచిన* బాహువుతో మిమ్మల్ని కాపాడతాను.+ 7 నేను మిమ్మల్ని నా ప్రజలుగా స్వీకరిస్తాను, నేను మీకు దేవుడిగా ఉంటాను.+ ఐగుప్తు భారాల నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తున్న మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. 8 అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని నేను ఒట్టేసి* ప్రమాణం చేసిన దేశంలోకి మిమ్మల్ని తీసుకొస్తాను; దాన్ని మీకు ఆస్తిగా ఇస్తాను.+ నేను యెహోవాను.’ ”+

9 తర్వాత మోషే ఆ సందేశాన్ని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. కానీ నిరుత్సాహం వల్ల, కఠినమైన బానిసత్వం వల్ల వాళ్లు మోషే చెప్పింది వినలేదు.+

10 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 11 “మీరు వెళ్లి ఐగుప్తు రాజైన ఫరోతో, ఇశ్రాయేలీయుల్ని తన దేశంలో నుండి పంపించేయాలని చెప్పండి.” 12 అయితే మోషే యెహోవాతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు;+ అలాంటిది, సరిగ్గా మాట్లాడలేని* నాలాంటివాడి మాటలు ఫరో ఎప్పటికైనా ఎలా వింటాడు?”+ 13 అయితే యెహోవా, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకురావడానికి ఇశ్రాయేలీయులకు, ఐగుప్తు రాజైన ఫరోకు ఏ ఆజ్ఞలు ఇవ్వాలో మోషే, అహరోనులకు మళ్లీ చెప్పాడు.

14 ఇశ్రాయేలీయుల కుటుంబాల పెద్దలు వీళ్లు: ఇశ్రాయేలు పెద్ద కుమారుడైన రూబేను+ కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.+ ఇవి రూబేను కుటుంబాలు.

15 షిమ్యోను కుమారులు: యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, షావూలు. ఈ షావూలు ఒక కనానీయురాలి కుమారుడు.+ ఇవి షిమ్యోను కుటుంబాలు.

16 వాళ్లవాళ్ల వంశాల ప్రకారం లేవి+ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారి.+ లేవి మొత్తం 137 ఏళ్లు బ్రతికాడు.

17 వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం గెర్షోను కుమారులు: లిబ్నీ, షిమీ.+

18 కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.+ కహాతు మొత్తం 133 ఏళ్లు బ్రతికాడు.

19 మెరారి కుమారులు: మహలి, మూషి.

ఇవి వాళ్లవాళ్ల వంశాల ప్రకారం లేవీయుల కుటుంబాలు.+

20 అమ్రాము తన తండ్రి సహోదరి యోకెబెదును పెళ్లి చేసుకున్నాడు.+ ఆమె అతనికి అహరోనును, మోషేను కన్నది.+ అమ్రాము మొత్తం 137 ఏళ్లు బ్రతికాడు.

21 ఇస్హారు కుమారులు: కోరహు,+ నెపెగు, జిఖ్రీ.

22 ఉజ్జీయేలు కుమారులు: మిషాయేలు, ఎలీషాపాను,+ సిత్రీ.

23 అహరోను అమ్మీనాదాబు కూతురూ, నయస్సోను+ సహోదరీ అయిన ఎలీషెబను పెళ్లి చేసుకున్నాడు. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును+ కన్నది.

24 కోరహు కుమారులు: అస్సీరు, ఎల్కానా, అబీయాసాపు.+ ఇవి కోరహీయుల+ కుటుంబాలు.

25 అహరోను కుమారుడైన ఎలియాజరు+ పూతీయేలు కూతుళ్లలో ఒకర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె అతనికి ఫీనెహాసును+ కన్నది.

వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం లేవీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలు వీళ్లు.+

26 ఇది అహరోను, మోషేల వంశావళి. “వాళ్లవాళ్ల సేనల ప్రకారం ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకురండి” అని యెహోవా చెప్పింది వీళ్లకే.+ 27 ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకురావడానికి ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడింది ఈ మోషే, అహరోనులే.+

28 యెహోవా ఐగుప్తు దేశంలో మోషేతో మాట్లాడిన రోజున, 29 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నేను యెహోవాను. నేను నీతో మాట్లాడుతున్న ప్రతీ మాటను నువ్వు ఐగుప్తు రాజైన ఫరోతో చెప్పు.” 30 అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు: “సరిగ్గా మాట్లాడలేని* నాలాంటివాడి మాటలు ఫరో ఎప్పటికైనా ఎలా వింటాడు?”

7 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఇదిగో, నేను నిన్ను ఫరోకు దేవుడిలా* చేశాను, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు.+ 2 నేను నీకు ఆజ్ఞాపించబోయే ప్రతీ మాటను నువ్వు నీ అన్న అహరోనుకు చెప్పాలి, అతను ఫరోతో మాట్లాడతాడు. ఫరో ఇశ్రాయేలీయుల్ని తన దేశం నుండి పంపించేస్తాడు. 3 అయితే నేను ఫరో హృదయాన్ని కఠినం అవ్వనిస్తాను;+ ఐగుప్తు దేశంలో ఇంకా ఎక్కువ సూచనల్ని, అద్భుతాల్ని చేస్తాను.+ 4 కానీ ఫరో నీ మాట వినడు. నేను ఐగుప్తు మీద నా చెయ్యి పెట్టి, గొప్ప తీర్పులు అమలు చేసి నా సమూహాల్ని,* అంటే నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొస్తాను.+ 5 నేను ఐగుప్తుకు వ్యతిరేకంగా నా చెయ్యి చాపి, దానిలో నుండి ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు నేనే యెహోవానని ఐగుప్తీయులు ఖచ్చితంగా తెలుసుకుంటారు.”+ 6 మోషే, అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేశారు, వాళ్లు సరిగ్గా అలాగే చేశారు. 7 వాళ్లు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏళ్లు, అహరోనుకు 83 ఏళ్లు.

8 తర్వాత యెహోవా మోషేకు, అహరోనుకు ఇలా చెప్పాడు: 9 “ఒకవేళ ఫరో మీతో, ‘ఒక అద్భుతం చేయండి’ అని అంటే, నువ్వు అహరోనుతో, ‘నీ కర్ర తీసుకొని ఫరో ముందు కింద పడేయి’ అని చెప్పు. అప్పుడది పెద్ద పాము అవుతుంది.” 10 కాబట్టి మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్లి సరిగ్గా యెహోవా ఆజ్ఞాపించినట్టే చేశారు. అహరోను తన కర్రను ఫరో ముందు, అతని సేవకుల ముందు కింద పడేశాడు. అప్పుడది పెద్ద పాము అయింది. 11 అయితే ఫరో జ్ఞానుల్ని, మంత్రగాళ్లను పిలిపించాడు; ఇంద్రజాలం చేసే ఐగుప్తు పూజారులు+ కూడా తమ ఇంద్రజాలంతో అలాగే చేశారు.+ 12 ప్రతీ ఒక్కరు తమ కర్రను కింద పడేశారు, అవి పెద్ద పాములు అయ్యాయి. అయితే అహరోను కర్ర వాళ్ల కర్రల్ని మింగేసింది. 13 అయినా యెహోవా ముందే చెప్పినట్టు, ఫరో హృదయం కఠినం అయింది,+ అతను వాళ్ల మాట వినలేదు.

14 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఫరో హృదయం మొద్దుబారింది.+ అతను ప్రజల్ని పంపించడానికి ఒప్పుకోలేదు. 15 ఉదయం నువ్వు ఫరో దగ్గరికి వెళ్లు. ఇదిగో! అతను నైలు నది దగ్గరికి వస్తున్నాడు! అతన్ని కలుసుకోవడానికి నువ్వు నైలు నది ఒడ్డున నిలబడి ఉండాలి; పాములా మారిన నీ కర్రను నీతోపాటు చేతిలో తీసుకెళ్లు. 16 నువ్వు అతనితో ఇలా అనాలి: ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ దగ్గరికి పంపించాడు.+ “నా ప్రజలు ఎడారిలో నన్ను సేవించేలా వాళ్లను పంపించేయి” అని ఆయన అంటున్నాడు. అయితే నువ్వు ఇప్పటివరకూ ఆయన చెప్పింది చేయలేదు. 17 యెహోవా ఇలా అంటున్నాడు: “నేనే యెహోవాను అని దీనివల్ల నీకు తెలుస్తుంది.+ ఇదిగో, నేను నా చేతిలో ఉన్న కర్రతో నైలు నది నీళ్లను కొడుతున్నాను, అవి రక్తంగా మారతాయి. 18 అప్పుడు నైలు నదిలోని చేపలు చచ్చిపోతాయి, నైలు నది కంపు కొడుతుంది, ఐగుప్తీయులు దానిలోని నీళ్లను అస్సలు తాగలేరు.” ’ ”

19 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు అహరోనుతో, ‘నీ కర్ర తీసుకొని ఐగుప్తులోని నీళ్ల మీద, దాని నదుల మీద, కాలువల* మీద, నీటి గుంటల మీద, చెరువులన్నిటి మీద చాపు; అప్పుడవి రక్తంగా మారతాయి’ అని చెప్పు. ఐగుప్తు దేశంలో ఎక్కడ చూసినా రక్తమే ఉంటుంది; చివరికి చెక్క పాత్రల్లో, రాతి పాత్రల్లో కూడా.” 20 వెంటనే మోషే, అహరోనులు సరిగ్గా యెహోవా ఆజ్ఞాపించినట్టే చేశారు. అహరోను తన కర్ర ఎత్తి ఫరో కళ్లముందు, అతని సేవకుల కళ్లముందు నైలు నది నీళ్లను కొట్టాడు. అప్పుడు ఆ నదిలో ఉన్న నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి.+ 21 నదిలోని చేపలు చచ్చిపోయాయి,+ దాంతో నది కంపు కొట్టసాగింది. దానివల్ల ఐగుప్తీయులు నైలు నది నీళ్లను తాగలేకపోయారు.+ ఐగుప్తు దేశమంతటా ఎక్కడ చూసినా రక్తమే.

22 అయితే, ఇంద్రజాలం చేసే ఐగుప్తు పూజారులు కూడా తమ రహస్య కళలు ఉపయోగించి అలాగే చేశారు.+ దాంతో యెహోవా ముందే చెప్పినట్టు, ఫరో హృదయం ఎప్పటిలాగే కఠినంగా ఉండిపోయింది, అతను వాళ్ల మాట వినలేదు.+ 23 తర్వాత ఫరో తన ఇంటికి తిరిగెళ్లిపోయాడు, ఆ విషయం గురించి ఏమాత్రం ఆలోచించలేదు. 24 ఐగుప్తీయులందరూ తాగేనీళ్ల కోసం నైలు నది చుట్టుపక్కలంతా తవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్లు నైలు నది నీళ్లను తాగలేకపోయారు. 25 యెహోవా నైలు నదిని కొట్టాక, పూర్తిగా ఏడురోజులు గడిచిపోయాయి.

8 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పు: ‘యెహోవా ఏమంటున్నాడంటే, “నా ప్రజలు నన్ను సేవించేలా వాళ్లను పంపించేయి.+ 2 ఒకవేళ నువ్వు వాళ్లను పంపించడానికి ఇలాగే ఒప్పుకోకుండా ఉంటే, నేను నీ ప్రాంతమంతటినీ కప్పలతో బాధిస్తాను.+ 3 అప్పుడు నైలు నది కప్పలతో నిండిపోతుంది. అవి పైకి వచ్చి నీ ఇంట్లోకి, నీ పడకగదిలోకి, నీ మంచం మీదికి, నీ సేవకుల ఇళ్లలోకి, నీ ప్రజల మీదికి వస్తాయి; నీ పొయ్యిల్లోకి, నీ పిండి పిసికే పాత్రల్లోకి* వెళ్తాయి.+ 4 అవి నీ మీదికి, నీ ప్రజల మీదికి, నీ సేవకులందరి మీదికి వస్తాయి.” ’ ”

5 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు అహరోనుతో ఇలా చెప్పు: ‘నీ కర్రను పట్టుకొని నదుల మీద, నైలు నది కాలువల మీద, నీటి గుంటల మీద నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదికి కప్పలు వచ్చేలా చేయి.’ ” 6 కాబట్టి అహరోను ఐగుప్తు నదుల మీద తన చెయ్యి చాపాడు, దాంతో కప్పలు వచ్చి ఐగుప్తు దేశాన్ని కప్పేయడం మొదలుపెట్టాయి. 7 అయితే, ఇంద్రజాలం చేసే పూజారులు కూడా తమ రహస్య కళలు ఉపయోగించి అలాగే చేశారు, వాళ్లు కూడా ఐగుప్తు దేశం మీదికి కప్పలు రప్పించారు.+ 8 తర్వాత ఫరో మోషే, అహరోనుల్ని పిలిపించి ఇలా అన్నాడు: “నా దగ్గర నుండి, నా ప్రజల దగ్గర నుండి కప్పల్ని తీసేయమని యెహోవాను వేడుకోండి.+ ఎందుకంటే యెహోవాకు బలులు అర్పించేలా నేను మీ ప్రజల్ని పంపించేయాలని అనుకుంటున్నాను.” 9 అప్పుడు మోషే ఫరోతో ఇలా అన్నాడు: “నీ దగ్గర నుండి, నీ సేవకుల దగ్గర నుండి, నీ ప్రజల దగ్గర నుండి, నీ ఇళ్లలో నుండి కప్పల్ని తీసేయమని నేను ఎప్పుడు వేడుకోవాలో నువ్వే చెప్పు, ఆ గౌరవం నీకే ఇస్తున్నాను. ఆ తర్వాత కప్పలు నైలు నదిలో మాత్రమే మిగిలి ఉంటాయి.” 10 దానికి ఫరో, “రేపు” అన్నాడు. అందుకు మోషే ఇలా అన్నాడు: “నీ మాట ప్రకారమే జరుగుతుంది. అప్పుడు మా దేవుడైన యెహోవా లాంటివాళ్లు ఎవరూ లేరని నువ్వు తెలుసుకుంటావు.+ 11 నీ దగ్గర నుండి, నీ ఇళ్లలో నుండి, నీ సేవకుల దగ్గర నుండి, నీ ప్రజల దగ్గర నుండి కప్పలు వెళ్లిపోతాయి. నైలు నదిలో మాత్రమే అవి మిగిలి ఉంటాయి.”+

12 కాబట్టి మోషే, అహరోనులు ఫరో దగ్గర నుండి బయటికి వెళ్లిపోయారు. ఫరో మీదికి రప్పించిన కప్పల్ని తీసేయమని మోషే యెహోవాను వేడుకున్నాడు.+ 13 అప్పుడు యెహోవా మోషే అడిగినట్టే చేశాడు. దాంతో ఇళ్లలో, వాకిళ్లలో,* పొలాల్లో ఉన్న కప్పలు చచ్చిపోసాగాయి. 14 వాళ్లు వాటిని కుప్పలుకుప్పలుగా పోగేశారు. దాంతో దేశం కంపు కొట్టడం మొదలైంది. 15 పరిస్థితి మెరుగైందని ఫరో గమనించినప్పుడు, యెహోవా ముందే చెప్పినట్టు అతను తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు,+ వాళ్ల మాట వినలేదు.

16 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు అహరోనుతో, ‘నీ కర్ర చాపి భూమ్మీదున్న ధూళిని కొట్టు, అది ఐగుప్తు దేశమంతటా దోమలుగా* మారుతుంది’ అని చెప్పు.” 17 అప్పుడు వాళ్లు అలాగే చేశారు. అహరోను తన చెయ్యి చాపి తన కర్రతో భూమ్మీదున్న ధూళిని కొట్టాడు, దాంతో మనుషుల మీదికి, జంతువుల మీదికి దోమలు వచ్చాయి. ఐగుప్తు దేశమంతటా భూమ్మీదున్న ధూళంతా దోమలుగా మారిపోయింది.+ 18 ఇంద్రజాలం చేసే పూజారులు కూడా తమ రహస్య కళలు ఉపయోగించి దోమల్ని పుట్టించడానికి ప్రయత్నించారు,+ కానీ అది వాళ్ల వల్ల కాలేదు. దోమలు మనుషుల మీదికి, జంతువుల మీదికి వచ్చాయి. 19 కాబట్టి ఇంద్రజాలం చేసే పూజారులు ఫరోతో “ఇది దేవుని వ్రేలు!”+ అన్నారు. కానీ యెహోవా ముందే చెప్పినట్టు, ఫరో హృదయం ఎప్పటిలాగే కఠినంగా ఉండిపోయింది, అతను వాళ్ల మాట వినలేదు.

20 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు తెల్లవారుజామునే లేచి, వెళ్లి ఫరో ముందు నిలబడు. ఇదిగో! అతను నైలు నది దగ్గరికి వస్తున్నాడు! నువ్వు అతనితో ఇలా చెప్పాలి: ‘యెహోవా ఇలా అన్నాడు: “నన్ను సేవించేలా నా ప్రజల్ని పంపించేయి. 21 నువ్వు నా ప్రజల్ని పంపించకపోతే నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి, నీ ఇళ్లలోకి జోరీగల్ని* పంపిస్తాను. ఐగుప్తులోని ఇళ్లు జోరీగలతో నిండిపోతాయి, అవి వాళ్లు* నిలబడిన నేలను కూడా కప్పేస్తాయి. 22 ఆ రోజున నేను నా ప్రజలు నివసిస్తున్న గోషెను ప్రాంతాన్ని వేరుగా ఉంచుతాను. అక్కడ జోరీగలు ఉండవు.+ దీనివల్ల, యెహోవానైన నేను ఇక్కడ ఈ దేశంలో ఉన్నానని నీకు తెలుస్తుంది.+ 23 నా ప్రజలకు, నీ ప్రజలకు మధ్య తేడా చూపిస్తాను. ఈ అద్భుతం రేపు జరుగుతుంది.” ’ ”

24 యెహోవా అలాగే చేశాడు. అప్పుడు జోరీగలు గుంపులుగుంపులుగా వచ్చి ఫరో ఇంటిమీద, అతని సేవకుల ఇళ్లమీద, ఐగుప్తు దేశమంతటి మీద దాడి చేయడం మొదలుపెట్టాయి.+ వాటివల్ల దేశం పాడైపోయింది.+ 25 ఫరో చివరికి మోషే, అహరోనుల్ని పిలిపించి, “వెళ్లండి, ఈ దేశంలోనే మీ దేవుడికి బలులు అర్పించుకోండి” అన్నాడు. 26 కానీ మోషే ఇలా అన్నాడు: “మేము అలా చేయలేం. ఎందుకంటే, మా దేవుడైన యెహోవాకు మేము బలి అర్పించబోయేవి ఐగుప్తీయులకు అసహ్యమైనవి.+ ఐగుప్తీయులు అసహ్యించుకునే బలిని వాళ్ల కళ్లముందే అర్పిస్తే, వాళ్లు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపరా? 27 కాబట్టి మా దేవుడు మాతో చెప్పినట్టే, మేము మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి ఎడారిలో మా దేవుడైన యెహోవాకు బలులు అర్పిస్తాం.”+

28 అప్పుడు ఫరో ఇలా అన్నాడు: “మీరు ఎడారిలో మీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించేలా నేను మిమ్మల్ని పంపించేస్తాను. కాకపోతే ఒక్కమాట, మీరు మరీ దూరం వెళ్లకూడదు. నా తరఫున మీ దేవుణ్ణి వేడుకోండి.”+ 29 తర్వాత మోషే ఇలా అన్నాడు: “ఇప్పుడు నేను నీ దగ్గర నుండి వెళ్లిపోతున్నాను. నేను యెహోవాను వేడుకుంటాను. రేపు ఫరో దగ్గర నుండి, అతని సేవకుల దగ్గర నుండి, అతని ప్రజల దగ్గర నుండి జోరీగలు వెళ్లిపోతాయి. కాకపోతే, యెహోవాకు బలులు అర్పించడానికి ప్రజల్ని పంపించనని అంటూ ఫరో మాతో ఆటలు ఆడడం మానేయాలి.”+ 30 తర్వాత మోషే ఫరో దగ్గర నుండి వెళ్లిపోయి యెహోవాను వేడుకున్నాడు.+ 31 కాబట్టి యెహోవా మోషే మాట ప్రకారమే చేశాడు. దాంతో ఫరో దగ్గర నుండి, అతని సేవకుల దగ్గర నుండి, అతని ప్రజల దగ్గర నుండి జోరీగలు వెళ్లిపోయాయి. ఒక్కటి కూడా మిగల్లేదు. 32 అయితే ఫరో మళ్లీ తన హృదయాన్ని కఠినం చేసుకొని ఆ ప్రజల్ని పంపించలేదు.

9 కాబట్టి యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పు: ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే, “నా ప్రజలు నన్ను సేవించేలా వాళ్లను పంపించేయి.+ 2 కానీ నువ్వు వాళ్లను పంపించకుండా ఇలా నీ దగ్గరే ఉంచుకుంటే, 3 ఇదిగో! యెహోవా చెయ్యి+ పొలంలో ఉన్న నీ పశువులన్నిటి మీదికి వస్తుంది. గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, పశువులు, మందలు అన్నిటికీ భయంకరమైన వ్యాధి వస్తుంది.+ 4 యెహోవా తప్పకుండా ఇశ్రాయేలు పశువులకు, ఐగుప్తు పశువులకు మధ్య తేడా చూపిస్తాడు. ఇశ్రాయేలీయులకు చెందినదేదీ చనిపోదు.” ’ ”+ 5 అంతేకాదు యెహోవా దానికి ఒక సమయాన్ని నియమించి, “రేపు యెహోవా ఈ దేశంలో దాన్ని చేస్తాడు” అని అన్నాడు.

6 యెహోవా తర్వాతి రోజే దాన్ని చేశాడు, దాంతో ఐగుప్తులోని అన్నిరకాల పశువులు చనిపోసాగాయి.+ అయితే ఇశ్రాయేలీయుల పశువుల్లో ఒక్కటి కూడా చనిపోలేదు. 7 ఫరో దాని గురించి వాకబు చేసినప్పుడు, ఇదిగో! ఇశ్రాయేలీయుల పశువుల్లో ఒక్కటి కూడా చనిపోలేదు. అయినా, ఫరో హృదయం ఎప్పటిలాగే మొద్దుబారిపోయి ఉంది, అతను ఆ ప్రజల్ని పంపించలేదు.+

8 తర్వాత యెహోవా మోషే, అహరోనులతో ఇలా అన్నాడు: “మీరు రెండు చేతుల నిండా కొలిమిలోని బూడిదను తీసుకోండి. మోషే దాన్ని ఫరో ముందు గాల్లోకి చల్లాలి. 9 అది ఐగుప్తు దేశమంతటా సన్నని ధూళి అవుతుంది; అది ఐగుప్తు దేశమంతటా మనుషుల మీద, జంతువుల మీద చీముపొక్కులు అవుతుంది.”

10 కాబట్టి వాళ్లు కొలిమిలోని బూడిద తీసుకొని ఫరో ముందు నిలబడ్డారు. మోషే దాన్ని గాల్లోకి చల్లాడు. అప్పుడది మనుషుల మీద, జంతువుల మీద చీముపొక్కులు అయింది. 11 ఆ పొక్కులు ఇంద్రజాలం చేసే పూజారుల ఒంటిమీద, ఐగుప్తీయులందరి ఒంటిమీద వచ్చాయి కాబట్టి, వాటి కారణంగా వాళ్లు మోషే ముందు నిలబడలేకపోయారు.+ 12 అయితే యెహోవా మోషేకు ముందే చెప్పినట్టు, యెహోవా ఫరో హృదయాన్ని కఠినం అవ్వనిచ్చాడు, ఫరో వాళ్ల మాట వినలేదు.+

13 అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “నువ్వు తెల్లవారుజామునే లేచి, ఫరో ముందు నిలబడి అతనితో ఇలా అను: ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలా చెప్పాడు: “నా ప్రజలు నన్ను సేవించేలా వాళ్లను పంపించేయి. 14 ఇప్పుడు నేను తెగుళ్లన్నిటినీ నీ హృదయం మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి గురిపెడుతున్నాను. అప్పుడు నువ్వు భూమంతట్లో నాలాంటి వాళ్లు ఎవ్వరూ లేరని తెలుసుకుంటావు.+ 15 ఇప్పటికల్లా నేను నా చెయ్యి చాపి నీ మీదికి, నీ ప్రజల మీదికి భయంకరమైన తెగులు రప్పించి భూమ్మీద లేకుండా నిన్ను తుడిచిపెట్టి ఉండేవాణ్ణి. 16 అయితే నీకు నా బలాన్ని చూపించాలి, భూమంతటా నా పేరు ప్రకటించబడాలి అనే ఒక్క కారణంతోనే నిన్ను ఇంకా ప్రాణాలతో ఉండనిచ్చాను.+ 17 నువ్వు నా ప్రజల్ని పంపించకుండా వాళ్ల విషయంలో ఇప్పటికీ అహంకారం చూపిస్తున్నావా? 18 ఇదిగో, రేపు దాదాపు ఈ సమయానికి నేను పెద్దపెద్ద వడగండ్ల వాన కురిపిస్తాను, ఐగుప్తు దేశం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ఎప్పుడూ అలాంటిది రాలేదు. 19 కాబట్టి, పొలాల్లో ఉన్న నీ పశువుల్ని, అక్కడ నీకు ఉన్న వాటన్నిటినీ సురక్షితమైన చోటికి తెమ్మని కబురు పంపు. వడగండ్ల వాన వచ్చినప్పుడు, పొలంలో చిక్కుకుపోయి ఇంటికి తీసుకురాబడని ప్రతీ మనిషి చనిపోతాడు, ప్రతీ జంతువు చచ్చిపోతుంది.” ’ ”

20 ఫరో సేవకుల్లో యెహోవా మాటకు భయపడిన ప్రతీ ఒక్కరు వెంటనే తమ సేవకుల్ని, తమ పశువుల్ని ఇళ్లకు తెచ్చుకున్నారు. 21 ఎవరైతే యెహోవా మాటను పట్టించుకోలేదో వాళ్లు తమ సేవకుల్ని, పశువుల్ని పొలంలోనే వదిలేశారు.

22 అప్పుడు యెహోవా మోషేతో, “ఐగుప్తు దేశమంతటి మీదికి, అంటే దానిలోని మనుషుల మీదికి, జంతువుల మీదికి, పొలంలో ఉన్న మొక్కలన్నిటి మీదికి+ వడగండ్ల వాన వచ్చేలా+ నీ చెయ్యి ఆకాశం వైపు చాపు” అన్నాడు. 23 దాంతో మోషే తన కర్రను ఆకాశం వైపు చాపాడు. అప్పుడు యెహోవా ఉరుముల్ని, వడగండ్ల వానను రప్పించాడు; భూమ్మీద అగ్ని* కురిసింది. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్ల వాన కురిపిస్తూ ఉన్నాడు. 24 వడగండ్ల వాన కురిసింది, దానితో పాటు మధ్యమధ్యలో మెరుపులు కనిపించాయి. అది ఎంత పెద్ద వడగండ్ల వాన అంటే, ఐగుప్తు ఒక జనంగా ఏర్పడినప్పటి నుండి ఎన్నడూ అలాంటిది కురవలేదు.+ 25 ఐగుప్తు దేశమంతటా పొలంలో ఉన్న మనుషుల్ని, జంతువుల్ని, ప్రతీదాన్ని ఆ వడగండ్ల వాన నాశనం చేసింది. అది పొలంలో ఉన్న మొక్కలన్నిటినీ పాడుచేసింది, చెట్లన్నిటినీ కూల్చేసింది.+ 26 ఇశ్రాయేలీయులు ఉన్న గోషెను ప్రాంతంలో మాత్రమే వడగండ్ల వాన కురవలేదు.+

27 కాబట్టి ఫరో మోషే, అహరోనుల్ని పిలిపించి వాళ్లతో ఇలా అన్నాడు: “ఈసారి నేను పాపం చేశాను. యెహోవా చేసింది సరైనదే. నేను, నా ప్రజలు చేసిందే తప్పు. 28 ఉరుములు, వడగండ్ల వాన ఆగిపోవాలని యెహోవాను వేడుకోండి. అప్పుడు నేను సంతోషంగా మిమ్మల్ని పంపించేస్తాను, ఇక ఎంతమాత్రం మిమ్మల్ని ఆపను.” 29 కాబట్టి మోషే అతనితో ఇలా అన్నాడు: “నేను ఈ నగరంలో నుండి బయటికి వెళ్లగానే యెహోవా ముందు నా చేతులు చాపి వేడుకుంటాను. అప్పుడు ఉరుములు, వడగండ్ల వాన ఆగిపోతాయి. దానివల్ల, భూమి యెహోవాదని నువ్వు తెలుసుకుంటావు.+ 30 అయితే అప్పటికీ నువ్వు, నీ సేవకులు యెహోవా దేవునికి భయపడరని నాకు తెలుసు.”

31 జనుప, బార్లీ పంటలు కూడా వడగండ్ల వాన వల్ల పాడైపోయాయి. ఎందుకంటే, అప్పటికి బార్లీ మొక్కలు గింజ పట్టాయి, జనుప మొక్కలు మొగ్గ తొడిగాయి. 32 అయితే గోధుమ పంట, పొడుగు గోధుమల* పంట పాడవ్వలేదు. ఎందుకంటే, అవి ఆ తర్వాత కోతకు వస్తాయి. 33 మోషే ఫరో దగ్గర నుండి బయల్దేరి నగరం బయటికి వెళ్లి, యెహోవా ముందు తన చేతులు చాపి వేడుకున్నాడు. అప్పుడు ఉరుములు, వడగండ్ల వాన ఆగిపోయాయి; భూమ్మీద వర్షం కురవడం ఆగిపోయింది.+ 34 వర్షం, వడగండ్లు, ఉరుములు ఆగిపోయాయని చూసినప్పుడు ఫరో, అతని సేవకులు మళ్లీ పాపం చేశారు, వాళ్లు తమ హృదయాల్ని కఠినం చేసుకున్నారు.+ 35 యెహోవా మోషే ద్వారా ముందే చెప్పినట్టు, ఫరో హృదయం ఎప్పటిలాగే కఠినంగా ఉండిపోయింది, అతను ఇశ్రాయేలీయుల్ని పంపించలేదు.+

10 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు ఫరో దగ్గరికి వెళ్లు, ఎందుకంటే నేను అతని హృదయాన్ని, అతని సేవకుల హృదయాల్ని మొద్దుబారిపోనిచ్చాను.+ నేను ఈ అద్భుతాల్ని అతని కళ్లముందే చేయాలనీ,+ 2 అలాగే నేను ఐగుప్తు దేశాన్ని ఎంత కఠినంగా శిక్షించానో, ఆ ప్రజల మధ్య ఎలాంటి అద్భుతాలు చేశానో నువ్వు నీ కుమారులకు, నీ మనవళ్లకు ప్రకటించాలనీ+ అలా చేశాను; నేను యెహోవానని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు.”

3 కాబట్టి మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా అన్నారు: “హెబ్రీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే, ‘ఎంతకాలం నువ్వు నాకు లొంగకుండా ఉంటావు?+ నా ప్రజలు నన్ను సేవించేలా వాళ్లను పంపించేయి. 4 నువ్వు నా ప్రజల్ని పంపించకుండా ఇలాగే నిరాకరిస్తూ ఉంటే, ఇదిగో! రేపు నీ సరిహద్దుల లోపలికి నేను మిడతల్ని తీసుకొస్తాను. 5 అవి నేల కనిపించనంతగా భూమిని కప్పేస్తాయి. వడగండ్ల వాన తర్వాత మీకు మిగిలిందంతా అవి తినేస్తాయి, పొలంలో పెరిగే చెట్లన్నిటినీ అవి తినేస్తాయి.+ 6 నీ ఇళ్లు, నీ సేవకులందరి ఇళ్లు, ఐగుప్తులోని వాళ్లందరి ఇళ్లు వాటితో నిండిపోతాయి. ఎంతగా అంటే నీ తాతలు, తండ్రులు తాము ఈ దేశంలో ఉన్నప్పటి నుండి ఇప్పటివరకు అలాంటిది చూడలేదు.’ ”+ తర్వాత మోషే ఫరో దగ్గర నుండి వెళ్లిపోయాడు.

7 ఆ తర్వాత ఫరో సేవకులు అతనితో, “ఈ మనిషి ఎంతకాలం మనకు ఉరిగా* ఉంటాడు? ఆ ప్రజలు తమ దేవుడైన యెహోవాను సేవించేలా వాళ్లను పంపించేయి. ఐగుప్తు నాశనమైపోయిందనే విషయం నీకింకా అర్థంకావట్లేదా?” అన్నారు. 8 కాబట్టి మోషే, అహరోనుల్ని మళ్లీ ఫరో దగ్గరికి తీసుకొచ్చారు, అప్పుడు ఫరో వాళ్లతో ఇలా అన్నాడు: “వెళ్లి, మీ దేవుడైన యెహోవాను సేవించండి. అయితే ఎవరెవరు వెళ్తారో చెప్పండి.” 9 అప్పుడు మోషే ఇలా అన్నాడు: “మేము మా యౌవనుల్ని, వృద్ధుల్ని, మా కుమారుల్ని, కూతుళ్లను, మా గొర్రెల్ని, పశువుల్ని తీసుకొని వెళ్తాం.+ ఎందుకంటే మేము యెహోవాకు పండుగ ఆచరిస్తాం.”+ 10 అప్పుడు ఫరో వాళ్లతో ఇలా అన్నాడు: “నేను నిజంగా మిమ్మల్ని, మీ పిల్లల్ని పంపిస్తానని అనుకుంటున్నారా? అదే జరిగితే, యెహోవా నిజంగా మీకు తోడు ఉన్నట్టే!+ మీ మనసులో ఏదో దురుద్దేశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. 11 మీ అందర్నీ నేను పంపించను! యెహోవాను సేవించడానికి మీలోని పురుషులు మాత్రమే వెళ్లొచ్చు. మీరు అడిగింది కూడా అదే కదా.” దాంతో మోషే, అహరోనుల్ని ఫరో ముందు నుండి వెళ్లగొట్టేశారు.

12 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “మిడతలు వచ్చేలా ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపు. అప్పుడవి ఐగుప్తు దేశం మీదికి వచ్చి దేశంలోని మొక్కలన్నిటినీ, వడగండ్ల వాన తర్వాత మిగిలిన దాన్నంతటినీ తినేస్తాయి.” 13 వెంటనే మోషే తన కర్రను ఐగుప్తు దేశం మీద చాపాడు. అప్పుడు యెహోవా ఆ రోజంతా, అలాగే ఆ రాత్రంతా దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశాడు. తెల్లవారినప్పుడు, తూర్పు గాలితో పాటు మిడతలు వచ్చాయి. 14 ఐగుప్తు దేశమంతటి మీదికి మిడతలు వచ్చి ఆ దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉండిపోయాయి.+ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది;+ అన్ని మిడతలు అంతకుముందు ఎప్పుడూ లేవు, ఇకముందు కూడా ఉండవు. 15 అవి దేశంలోని నేల అంతటినీ కప్పేశాయి, వాటివల్ల దేశం నల్లగా మారింది; అవి దేశంలోని మొక్కలన్నిటినీ, అలాగే వడగండ్ల వాన తర్వాత మిగిలిన చెట్ల పండ్లన్నిటినీ మింగేశాయి; ఐగుప్తు దేశమంతటా చెట్ల మీద గానీ, పొలంలోని మొక్కల మీద గానీ పచ్చనిది ఏదీ మిగల్లేదు.

16 ఫరో వెంటనే మోషే, అహరోనుల్ని పిలిపించి ఇలా అన్నాడు: “నేను మీ దేవుడైన యెహోవాకు, మీకు వ్యతిరేకంగా పాపం చేశాను. 17 దయచేసి ఈ ఒక్కసారి నా పాపాన్ని మన్నించి, ఈ భయంకరమైన తెగులును నా మీద నుండి తీసేయమని మీ దేవుడైన యెహోవాను వేడుకోండి.” 18 కాబట్టి అతను* ఫరో దగ్గర నుండి వెళ్లిపోయి, యెహోవాను వేడుకున్నాడు.+ 19 అప్పుడు యెహోవా గాలిని మలుపు తిప్పి, దాన్ని బలమైన పడమటి గాలిగా మార్చాడు; ఆ గాలికి మిడతలు కొట్టుకుపోయి ఎర్రసముద్రంలో పడ్డాయి. ఐగుప్తు దేశమంతట్లో ఒక్క మిడత కూడా మిగల్లేదు. 20 అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం అవ్వనిచ్చాడు,+ కాబట్టి అతను ఇశ్రాయేలీయుల్ని పంపించలేదు.

21 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఐగుప్తు దేశాన్ని కటిక చీకటి కమ్ముకునేలా నీ చేతిని ఆకాశం వైపు చాపు.” 22 మోషే వెంటనే తన చేతిని ఆకాశం వైపు చాపాడు, దాంతో మూడు రోజుల పాటు ఐగుప్తు దేశమంతా కటిక చీకటి కమ్ముకుంది.+ 23 దానివల్ల వాళ్లు ఒకరినొకరు చూడలేకపోయారు, మూడు రోజులపాటు ఎక్కడున్నవాళ్లు అక్కడే ఉండిపోయారు. అయితే ఇశ్రాయేలీయులు నివసించిన ప్రాంతాలన్నిట్లో వెలుగు ఉంది.+ 24 తర్వాత ఫరో మోషేను పిలిపించి ఇలా అన్నాడు: “వెళ్లి యెహోవాను సేవించండి.+ మీ గొర్రెలు, పశువులు మాత్రమే ఇక్కడుంటాయి. మీ పిల్లల్ని కూడా మీతోపాటు తీసుకెళ్లొచ్చు.” 25 కానీ మోషే ఇలా అన్నాడు: “అర్పణల్ని, దహనబలుల్ని అర్పించడానికి కావాల్సిన జంతువుల్ని కూడా నువ్వే మాకిస్తావు,* వాటిని మేము మా దేవుడైన యెహోవాకు అర్పిస్తాం.+ 26 మా పశువుల్ని కూడా మాతోపాటు తీసుకెళ్తాం. ఒక్క జంతువును* కూడా ఇక్కడ ఉండనివ్వం. ఎందుకంటే వాటిలో కొన్నిటిని మేము మా దేవుడైన యెహోవాను ఆరాధించడానికి ఉపయోగిస్తాం. పైగా మేము అక్కడికి వెళ్లే వరకు యెహోవా ఆరాధనలో వేటిని అర్పిస్తామో మాకు తెలీదు.” 27 అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం అవ్వనిచ్చాడు, కాబట్టి అతను వాళ్లను పంపించడానికి ఒప్పుకోలేదు.+ 28 తర్వాత ఫరో మోషేతో ఇలా అన్నాడు: “నా కళ్లముందు నుండి వెళ్లిపో! మళ్లీ నా ముఖం చూడకుండా జాగ్రత్తపడు. ఏ రోజైతే నువ్వు నా ముఖం చూస్తావో, ఆ రోజు నువ్వు చస్తావు.” 29 దానికి మోషే, “సరే, నువ్వు చెప్పినట్టే నేను మళ్లీ నీ ముఖం చూడడానికి ప్రయత్నించను” అన్నాడు.

11 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నేను ఫరో మీదికి, ఐగుప్తు మీదికి ఇంకొక తెగులు రప్పించబోతున్నాను. ఆ తర్వాత అతను మిమ్మల్ని ఇక్కడి నుండి పంపించేస్తాడు, నిజానికి అతను మిమ్మల్ని ఇక్కడినుండి వెళ్లగొడతాడు.+ 2 కాబట్టి స్త్రీలు, పురుషులు అందరూ తమ ఇరుగుపొరుగువాళ్లను వెండి-బంగారు వస్తువులు అడిగి తీసుకోవాలని ప్రజలతో చెప్పు.”+ 3 యెహోవా ఐగుప్తీయుల దృష్టిలో ఆ ప్రజలు అనుగ్రహం పొందేలా చేశాడు. అంతేకాదు, ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో సేవకుల దృష్టిలో, ప్రజల దృష్టిలో మోషే చాలా గొప్పవాడు అయ్యాడు.

4 తర్వాత మోషే ఫరోతో ఇలా అన్నాడు: “యెహోవా ఏం చెప్పాడంటే, ‘దాదాపు అర్ధరాత్రి సమయంలో నేను ఐగుప్తు మధ్యలోకి వెళ్తున్నాను.+ 5 ఐగుప్తు దేశంలోని ప్రతీ మొదటి సంతానం చనిపోతుంది.+ తన సింహాసనంలో కూర్చున్న ఫరో మొదటి సంతానం దగ్గర నుండి తిరుగలి విసిరే దాసురాలి మొదటి సంతానం వరకు ప్రతీ మొదటి సంతానం చనిపోతుంది; పశువుల్లో కూడా ప్రతీ మొదటి సంతానం చనిపోతుంది.+ 6 ఐగుప్తు దేశమంతటా గొప్ప ఏడ్పు వినిపిస్తుంది. అంత గొప్ప ఏడ్పు ఇప్పటివరకూ లేదు, ఇకమీదట కూడా ఉండదు.+ 7 అయితే ఇశ్రాయేలీయుల్లోని మనుషుల్ని చూసి గానీ వాళ్ల పశువుల్ని చూసి గానీ కనీసం కుక్క కూడా మొరగదు. అప్పుడు, యెహోవా ఐగుప్తీయులకు, ఇశ్రాయేలీయులకు మధ్య తేడా చూపించగలడని మీకు తెలుస్తుంది.’+ 8 నీ సేవకులందరూ ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి నాకు సాష్టాంగ నమస్కారం చేసి, ‘నువ్వూ, నీ ప్రజలందరూ వెళ్లిపోండి’ అని అంటారు. అప్పుడు నేను వెళ్లిపోతాను.” ఆ మాట అని అతను చాలా కోపంగా ఫరో దగ్గర నుండి వెళ్లిపోయాడు.

9 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఐగుప్తు దేశంలో నేను ఇంకా ఎక్కువ అద్భుతాలు చేసేలా+ ఫరో మీ మాట వినడు.”+ 10 మోషే, అహరోనులు ఫరో ముందు ఈ అద్భుతాలన్నీ చేశారు. అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం అవ్వనిచ్చాడు, కాబట్టి అతను ఇశ్రాయేలీయుల్ని తన దేశం నుండి పంపించలేదు.+

12 తర్వాత యెహోవా ఐగుప్తు దేశంలో మోషే, అహరోనులతో ఇలా అన్నాడు: 2 “ఈ నెల మీకు మొదటి నెలగా ఉంటుంది. దీన్ని మీరు సంవత్సరంలో మొదటి నెలగా ఎంచాలి.+ 3 మీరు ఇశ్రాయేలీయులందరితో ఇలా అనండి: ‘ఈ నెల పదో రోజున మీలో ప్రతీ ఒక్కరు, కుటుంబానికి* ఒక గొర్రె+ చొప్పున, ఇంటికి ఒక గొర్రెను తీసుకోవాలి. 4 అయితే ఒక ఇంట్లో ఆ గొర్రెను తినలేనంత తక్కువమంది ఉంటే, వాళ్లూ వాళ్లకు దగ్గర్లో ఉన్న పొరుగువాళ్లూ కలిసి తమ ఇంట్లో దాన్ని పంచుకోవాలి. మొత్తం ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్కరు ఎంత తినగలరు అనే దాన్నిబట్టి వాళ్లు లెక్కగట్టాలి. 5 మీరు ఏ లోపంలేని+ ఏడాది వయసున్న మగ గొర్రెపిల్లను తీసుకోవాలి. గొర్రెపిల్లకు బదులు మీరు మేకపిల్లను కూడా తీసుకోవచ్చు. 6 ఈ నెల 14వ రోజు వరకు+ దాన్ని మీ దగ్గరే ఉంచుకొని, ఆ రోజు సంధ్య వెలుగు సమయంలో*+ ఇశ్రాయేలీయులందరూ దాన్ని వధించాలి. 7 వాళ్లు దాని రక్తంలో కొంచెం తీసుకొని, తాము ఏ ఇంట్లో ఆ గొర్రెను తింటారో ఆ ఇంటి గుమ్మపు రెండు నిలువు కమ్ముల మీద, పైకమ్మి మీద ఆ రక్తాన్ని చిమ్మాలి.+

8 “ ‘ఆ రాత్రి వాళ్లు దాని మాంసం తినాలి.+ దాన్ని నిప్పుల మీద కాల్చి, పులవని రొట్టెలతో,+ చేదుగా ఉండే పచ్చి ఆకుకూరలతో తినాలి.+ 9 దానిలో కొంచెం కూడా పచ్చిగా గానీ నీళ్లలో ఉడకబెట్టి గానీ తినకూడదు. బదులుగా దాన్ని తల, కాళ్లు,* లోపలి భాగాలతో పాటు నిప్పుల మీద కాల్చి తినాలి. 10 దానిలో కొంచెం కూడా పొద్దున వరకు ఉంచుకోకూడదు. పొద్దున వరకు ఏమైనా మిగిలితే దాన్ని మీరు అగ్నిలో కాల్చేయాలి.+ 11 మీరు మీ నడుము* కట్టుకొని, కాళ్లకు చెప్పులు తొడుక్కొని, మీ చేతికర్ర పట్టుకొని హడావిడిగా దాన్ని తినాలి. అది యెహోవాకు పస్కా పండుగ. 12 ఎందుకంటే, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం గుండా సంచరిస్తూ, మనుషుల మొదటి సంతానం నుండి జంతువుల మొదటి సంతానం వరకు ఐగుప్తు దేశంలోని ప్రతీ మొదటి సంతానాన్ని చంపుతాను.+ అంతేకాదు, ఐగుప్తు దేవుళ్లందరి మీద నా తీర్పులు అమలు చేస్తాను.+ నేను యెహోవాను. 13 అయితే ఆ రక్తం మీరున్న ఇళ్లకు గుర్తుగా ఉంటుంది. నేను ఆ రక్తాన్ని చూసి మీ ఇళ్లను దాటి వెళ్తాను. నేను ఐగుప్తు దేశాన్ని శిక్షించినప్పుడు, ఆ తెగులు మిమ్మల్ని నాశనం చేయడానికి మీ మీదికి రాదు.+

14 “ ‘ఆ రోజు మీకు జ్ఞాపకార్థంగా ఉంటుంది, మీరు తరతరాలపాటు యెహోవాకు పండుగగా దీన్ని జరుపుకోవాలి. ఇది శాశ్వత శాసనం. 15 మీరు ఏడురోజులు పులవని రొట్టెలు తినాలి.+ అవును, మొదటి రోజున మీరు మీ ఇళ్లలో నుండి పులిసిన పిండిని తీసేయాలి. ఎందుకంటే, మొదటి రోజు నుండి ఏడో రోజు వరకు ఎవరైనా పులిసినదాన్ని తింటే, ఆ వ్యక్తి ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడాలి.* 16 మొదటి రోజున మీరు పవిత్ర సమావేశం ఏర్పాటుచేయాలి, ఏడో రోజున ఇంకో పవిత్ర సమావేశం ఏర్పాటుచేయాలి. ఆ రోజుల్లో ఏ పనీ చేయకూడదు.+ ప్రతీ ఒక్కరు తాము తినడానికి కావల్సింది మాత్రం సిద్ధం చేసుకోవచ్చు.

17 “ ‘మీరు పులవని రొట్టెల పండుగను ఆచరించాలి.+ ఎందుకంటే, ఆ రోజే నేను మీ సమూహాల్ని* ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొస్తాను. మీరు తరతరాలపాటు ఆ రోజును ఆచరించాలి. ఇది శాశ్వత శాసనం. 18 మొదటి నెల 14వ రోజు సాయంత్రం నుండి 21వ రోజు సాయంత్రం వరకు మీరు పులవని రొట్టెలు తినాలి.+ 19 ఏడురోజుల పాటు మీ ఇళ్లలో పులిసిన పిండి ఏమాత్రం కనిపించకూడదు. ఎందుకంటే, ఎవరైనా పులిసినదాన్ని తింటే, అతను విదేశీయుడైనా స్వదేశీయుడైనా,+ అతను ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడాలి.*+ 20 మీరు పులిసింది ఏదీ తినకూడదు. మీ ఇళ్లన్నిట్లో మీరు పులవని రొట్టెలు తినాలి.’ ”

21 మోషే వెంటనే ఇశ్రాయేలు పెద్దలందర్నీ పిలిపించి+ వాళ్లతో ఇలా అన్నాడు: “మీలో ప్రతీ ఒక్కరు వెళ్లి మీ మీ కుటుంబాల కోసం మందలో నుండి జంతువును* ఎంచుకొని, పస్కా బలిని వధించండి. 22 తర్వాత మీరు దాని రక్తాన్ని ఒక గిన్నెలో తీసుకొని, ఆ రక్తంలో హిస్సోపు రెమ్మల కట్టను ముంచి, గుమ్మపు పైకమ్మి మీద, రెండు నిలువు కమ్ముల మీద చిమ్మాలి. ఉదయం వరకు మీలో ఎవ్వరూ మీ ఇంటి గడప దాటి వెళ్లకూడదు. 23 తర్వాత యెహోవా ఐగుప్తీయుల్ని తెగులుతో శిక్షించడానికి ఆ దేశం గుండా సంచరిస్తూ గుమ్మపు పైకమ్మి మీద, రెండు నిలువు కమ్ముల మీద రక్తాన్ని చూసినప్పుడు, యెహోవా తప్పకుండా ఆ గుమ్మాన్ని దాటి వెళ్లిపోతాడు, నాశనం చేసే* తెగులును ఆయన మీ ఇళ్లలోకి ప్రవేశించనివ్వడు.+

24 “మీరు దీన్ని మీ కోసం, మీ కుమారుల కోసం ఒక నియమంగా ఎప్పటికీ ఆచరించాలి.+ 25 యెహోవా ముందే చెప్పినట్టుగా, ఆయన మీకిచ్చే దేశంలోకి మీరు వచ్చినప్పుడు మీరు ఈ ఆచరణను జరుపుకోవాలి.+ 26 మీ కుమారులు, ‘మీరు ఈ ఆచరణ ఎందుకు జరుపుకుంటున్నారు?’ అని మిమ్మల్ని అడిగినప్పుడు+ 27 మీరు ఇలా చెప్పాలి: ‘ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయుల్ని తెగులుతో శిక్షించినప్పుడు, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల ఇళ్లను దాటివెళ్లిపోయాడు, మన ఇళ్లలో ఉన్నవాళ్లను వదిలేశాడు.’ ”

అప్పుడు ప్రజలు వంగి, సాష్టాంగ నమస్కారం చేశారు. 28 కాబట్టి ఇశ్రాయేలీయులు వెళ్లి యెహోవా మోషే, అహరోనులకు ఆజ్ఞాపించినట్టే చేశారు.+ వాళ్లు సరిగ్గా అలాగే చేశారు.

29 తర్వాత అర్ధరాత్రి సమయంలో, యెహోవా ఐగుప్తు దేశంలోని ప్రతీ మొదటి సంతానాన్ని చంపేశాడు.+ తన సింహాసనంలో కూర్చొని ఉన్న ఫరో మొదటి సంతానం నుండి చెరసాలలో ఉన్న ఖైదీ మొదటి సంతానం వరకు అందర్నీ చంపేశాడు. జంతువుల్లో కూడా ప్రతీ మొదటి సంతానాన్ని చంపేశాడు.+ 30 ఆ రాత్రి ఫరో తన సేవకులందరితో పాటు, మిగతా ఐగుప్తీయులందరితో పాటు నిద్రలేచాడు. ఐగుప్తీయుల మధ్య గొప్ప ఏడ్పు వినిపించింది. ఎందుకంటే, ప్రతీ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయారు.+ 31 ఫరో రాత్రికిరాత్రే మోషే, అహరోనుల్ని పిలిపించి+ ఇలా అన్నాడు: “లెండి, మీరూ మిగతా ఇశ్రాయేలీయులూ నా ప్రజల మధ్య నుండి వెళ్లిపోండి. మీరు అడిగినట్టే వెళ్లి యెహోవాను సేవించండి.+ 32 మీరు అడిగినట్టే మీ మందల్ని, పశువుల్ని కూడా తీసుకెళ్లండి.+ కానీ మీరు నన్ను దీవించాలి.”

33 అప్పుడు ఐగుప్తీయులు ఆ ప్రజలతో, “మీరు వెళ్లిపోండి, లేకపోతే మేమంతా చనిపోయేలా ఉన్నాం!”+ అని అంటూ ఆ దేశం నుండి త్వరగా+ వెళ్లిపొమ్మని వాళ్లను బలవంతం చేయడం మొదలుపెట్టారు. 34 కాబట్టి ప్రజలు తమ పిండి ముద్ద ఇంకా పులవకముందే, పిండి పిసికే పాత్రలతో* పాటు దాన్ని తమ వస్త్రంలో చుట్టుకొని భుజాలమీద పెట్టుకున్నారు. 35 మోషే ముందే తమకు చెప్పినట్టు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల దగ్గర వెండి-బంగారు వస్తువుల్ని, బట్టల్ని అడిగి తీసుకున్నారు.+ 36 యెహోవా ఐగుప్తీయుల దృష్టిలో ఆ ప్రజలు అనుగ్రహం పొందేలా చేశాడు, కాబట్టి ఐగుప్తీయులు ఆ ప్రజలు అడిగినవి వాళ్లకు ఇచ్చారు. అలా వాళ్లు ఐగుప్తీయుల్ని కొల్లగొట్టారు.+

37 తర్వాత ఇశ్రాయేలీయులు రామెసేసు+ నుండి బయల్దేరి సుక్కోతుకు+ ప్రయాణమయ్యారు; పిల్లలు కాకుండా పురుషులే* దాదాపు 6,00,000 మంది ఉన్నారు.+ 38 చాలామంది విదేశీయులు*+ కూడా వాళ్లతోపాటు వెళ్లారు; పశువులు, మందలు కూడా పెద్ద సంఖ్యలో వాళ్లతోపాటు వెళ్లాయి. 39 వాళ్లు ఐగుప్తు నుండి తమతోపాటు తెచ్చుకున్న పులవని పిండి ముద్దతో గుండ్రని రొట్టెలు చేసి కాల్చడం మొదలుపెట్టారు. అది పులవలేదు, ఎందుకంటే వాళ్లను ఉన్నపళంగా ఐగుప్తు నుండి వెళ్లగొట్టారు. దానివల్ల, వాళ్లు తమ కోసం ఏ ఆహారం సిద్ధం చేసుకోలేదు.+

40 ఐగుప్తు నుండి బయటికి వచ్చే సమయానికి ఇశ్రాయేలీయులు పరాయి దేశంలో+ 430 సంవత్సరాలు ఉన్నారు.+ 41 ఆ 430 సంవత్సరాలు గడిచాక, సరిగ్గా అదే రోజున, యెహోవా సమూహాలన్నీ* ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చాయి. 42 అది యెహోవా మహిమ కోసం పండుగ చేసుకునే రాత్రి. ఎందుకంటే, ఆ రాత్రి ఆయన వాళ్లను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలీయులందరూ తరతరాలపాటు యెహోవా మహిమ కోసం ఆ రాత్రిని ఆచరించాలి.+

43 తర్వాత యెహోవా మోషే, అహరోనులతో ఇలా అన్నాడు: “పస్కా పండుగ గురించిన శాసనం ఇదే: పరదేశులు ఎవరూ పస్కా భోజనం తినకూడదు.+ 44 అయితే ఎవరికైనా డబ్బుతో కొన్న దాసుడు ఉంటే, ఆ దాసుడికి సున్నతి చేయాలి.+ తర్వాతే అతను దాన్ని తినొచ్చు. 45 వలస వచ్చినవాళ్లు గానీ జీతానికి పనిచేసేవాళ్లు గానీ దాన్ని తినకూడదు. 46 ఒక ఇంటి లోపలే దాన్ని తినాలి. దాని మాంసంలో కొంచెం కూడా మీరు ఆ ఇంటినుండి బయటికి తీసుకెళ్లకూడదు. అంతేకాదు, దాని ఎముకల్లో ఒక్కటి కూడా మీరు విరగ్గొట్టకూడదు.+ 47 ఇశ్రాయేలీయులందరూ ఈ పండుగ జరుపుకోవాలి. 48 ఒకవేళ మీతోపాటు నివసించే పరదేశుల్లో ఎవరైనా యెహోవాకు పస్కా పండుగ ఆచరించాలని అనుకుంటే, అతనికి చెందిన ప్రతీ పురుషుడు సున్నతి చేయించుకోవాలి. తర్వాత అతను పండుగ ఆచరించవచ్చు, అప్పుడు అతను స్వదేశీయుల్లో ఒకడిలా అవుతాడు. అయితే సున్నతి చేయించుకోని వాళ్లెవ్వరూ దాన్ని తినకూడదు.+ 49 స్వదేశీయుడికీ, మీ మధ్య నివసించే పరదేశికీ ఒకే నియమం వర్తిస్తుంది.”+

50 కాబట్టి ఇశ్రాయేలీయులందరూ యెహోవా మోషే, అహరోనులకు ఆజ్ఞాపించినట్టే చేశారు. వాళ్లు సరిగ్గా అలాగే చేశారు. 51 అదే రోజున యెహోవా ఇశ్రాయేలీయుల్ని వాళ్ల సమూహాలతో* పాటు ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చాడు.

13 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 2 “ఇశ్రాయేలీయుల్లో మొదట పుట్టిన ప్రతీ మగ సంతానాన్ని నా కోసం ప్రత్యేకపర్చు.* మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా మొదట పుట్టే ప్రతీ మగ సంతానం నాకు చెందుతుంది.”+

3 తర్వాత మోషే ప్రజలతో ఇలా అన్నాడు: “దాస్య గృహమైన ఐగుప్తు నుండి మీరు బయటికి వచ్చిన ఈ రోజును గుర్తుంచుకోండి.+ ఎందుకంటే యెహోవా తన బలమైన చేతితో మిమ్మల్ని అక్కడి నుండి బయటికి తీసుకొచ్చాడు.+ కాబట్టి మీరు పులిసింది ఏదీ తినకూడదు. 4 అబీబు* నెలలోని ఈ రోజున మీరు బయటికి వెళ్తున్నారు.+ 5 యెహోవా నీకు ఇస్తానని నీ పూర్వీకులకు ప్రమాణం చేసిన+ పాలుతేనెలు ప్రవహించే దేశానికి,+ అంటే కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసించే దేశానికి నిన్ను తీసుకొచ్చినప్పుడు,+ ఈ నెలలో నువ్వు దీన్ని ఆచరించాలి. 6 ఏడురోజుల పాటు నువ్వు పులవని రొట్టెలు తినాలి,+ ఏడో రోజున యెహోవాకు పండుగ ఉంటుంది. 7 ఆ ఏడురోజులూ నువ్వు పులవని రొట్టెలు తినాలి;+ పులిసింది ఏదీ నీ దగ్గర కనిపించకూడదు.+ నీ ప్రాంతమంతట్లో* నీ దగ్గర పులిసిన పిండి ఏమాత్రం కనిపించకూడదు. 8 ఆ రోజు నువ్వు నీ కుమారునితో, ‘ఐగుప్తు నుండి యెహోవా నన్ను ఎలా బయటికి తీసుకొచ్చాడో గుర్తుచేసుకోవడానికి నేను ఇది చేస్తున్నాను’ అని చెప్పాలి.+ 9 యెహోవా బలమైన చేతితో నిన్ను ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు కాబట్టి యెహోవా నియమం నీ నోట ఉండేలా ఇది నీ చేతి మీద సూచనగా, నీ నుదుటి మీద* జ్ఞాపకార్థంగా* పనిచేస్తుంది.+ 10 ప్రతీ సంవత్సరం దాని నియమిత సమయంలో నువ్వు ఈ శాసనాన్ని పాటించాలి.+

11 “నీకు ఇస్తానని యెహోవా నీకూ, నీ పూర్వీకులకూ ప్రమాణం చేసిన+ కనానీయుల దేశానికి నిన్ను తీసుకొచ్చినప్పుడు, 12 మొదట పుట్టిన ప్రతీ మగబిడ్డను, అలాగే నువ్వు సంపాదించే పశువుల్లో మొదట పుట్టే ప్రతీ మగపిల్లను యెహోవాకు అంకితం చేయాలి. మగ సంతానం యెహోవాకు చెందుతుంది.+ 13 మొదట పుట్టే ప్రతీ గాడిద పిల్లను నువ్వు ఒక గొర్రెతో విడిపించాలి, ఒకవేళ దాన్ని విడిపించకపోతే దాని మెడను విరగ్గొట్టాలి. అలాగే నీ కుమారుల్లో మొదట పుట్టిన ప్రతీ ఒకర్ని నువ్వు విడిపించాలి.+

14 “తర్వాత ఒకవేళ నీ కుమారుడు, ‘దీని అర్థం ఏంటి?’ అని నిన్ను అడిగితే, నువ్వు అతనితో ఇలా చెప్పాలి: ‘యెహోవా తన బలమైన చేతితో దాస్య గృహమైన ఐగుప్తు నుండి మనల్ని బయటికి తీసుకొచ్చాడు.+ 15 మనల్ని పంపించడానికి ఫరో మొండిగా నిరాకరించినప్పుడు,+ మనుషుల మొదటి సంతానం దగ్గర నుండి జంతువుల మొదటి సంతానం వరకు ఐగుప్తు దేశంలోని ప్రతీ మొదటి సంతానాన్ని యెహోవా చంపేశాడు.+ అందుకే మొదట పుట్టిన ప్రతీ మగ సంతానాన్ని యెహోవాకు అర్పిస్తున్నాను, నా కుమారుల్లో మొదట పుట్టిన ప్రతీ ఒక్కడిని విడిపిస్తున్నాను.’ 16 ఇది నీ చేతి మీద సూచనగా, నీ నుదుటి మీద* బాసికంగా పనిచేయాలి,+ ఎందుకంటే యెహోవా తన బలమైన చేతితో ఐగుప్తు నుండి మనల్ని విడిపించాడు.”

17 ఫరో ఆ ప్రజల్ని పంపించినప్పుడు దేవుడు వాళ్లను ఫిలిష్తీయుల దేశానికి వెళ్లే దారి గుండా తీసుకెళ్లలేదు. నిజానికి అదే దగ్గరి దారి. ఎందుకంటే దేవుడు ఇలా అన్నాడు: “యుద్ధం వచ్చినప్పుడు ఈ ప్రజలు తమ మనసు మార్చుకొని ఐగుప్తుకు తిరిగెళ్లిపోతారు.” 18 కాబట్టి దేవుడు వాళ్లను చుట్టూ తిప్పి ఎర్రసముద్రం పక్కన ఉన్న ఎడారి మార్గం గుండా తీసుకెళ్లాడు.+ అయితే ఇశ్రాయేలీయులు యుద్ధ పంక్తులు తీరి ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చారు. 19 మోషే యోసేపు ఎముకల్ని కూడా తనతోపాటు తీసుకెళ్లాడు. ఎందుకంటే యోసేపు, “దేవుడు తప్పకుండా మిమ్మల్ని గుర్తుచేసుకుంటాడు, అప్పుడు మీరు మీతోపాటు నా ఎముకల్ని ఇక్కడి నుండి తీసుకెళ్లాలి” అని అంటూ ఇశ్రాయేలు కుమారులతో ప్రమాణం చేయించుకున్నాడు.+ 20 వాళ్లు సుక్కోతు నుండి బయల్దేరి ఎడారి అంచున ఉన్న ఏతాములో తమ డేరాలు వేసుకున్నారు.

21 యెహోవా దారిలో వాళ్లను నడిపించడానికి పగలేమో మేఘస్తంభంలో,+ రాత్రేమో వాళ్లకు వెలుగివ్వడానికి అగ్నిస్తంభంలో వాళ్ల ముందు వెళ్తూ ఉన్నాడు. అలా వాళ్లు పగలూ రాత్రీ ప్రయాణించగలిగారు.+ 22 పగలు మేఘస్తంభం గానీ, రాత్రి అగ్నిస్తంభం గానీ ఆ ప్రజల ముందు నుండి తొలగిపోయేది కాదు.+

14 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 2 “ఇశ్రాయేలీయులు వెనక్కి తిరిగి పీహహీరోతు ముందు, అంటే మిగ్దోలుకూ సముద్రానికీ మధ్య, బయల్సెఫోను ఎదురుగా డేరాలు వేసుకోవాలని వాళ్లకు చెప్పు.+ మీరు సముద్రం* దగ్గర బయల్సెఫోను ఎదురుగా డేరాలు వేసుకోవాలి. 3 అప్పుడు ఫరో ఇశ్రాయేలీయుల గురించి, ‘వాళ్లు దేశంలో దారి తప్పిపోయి తిరుగుతున్నారు. ఎడారిలో చిక్కుకుపోయారు’ అని అనుకుంటాడు. 4 నేను ఫరో హృదయాన్ని కఠినం అవ్వనిస్తాను.+ అతను వాళ్లను వెంటాడతాడు. అప్పుడు నేను ఫరోను, అతని సైన్యమంతటినీ ఓడించి నన్ను నేను మహిమపర్చుకుంటాను;+ నేను యెహోవానని ఐగుప్తీయులు ఖచ్చితంగా తెలుసుకుంటారు.”+ కాబట్టి ఇశ్రాయేలీయులు అలాగే చేశారు.

5 తర్వాత, ఆ ప్రజలు పారిపోయారని ఐగుప్తు రాజుకు వార్త అందింది. వెంటనే ఆ ప్రజల విషయంలో ఫరో మనసు, అతని సేవకుల మనసు మారిపోయింది.+ కాబట్టి వాళ్లు, “మనమెందుకు ఇలా చేశాం? మనకు బానిసలుగా సేవచేయకుండా ఇశ్రాయేలీయుల్ని ఎందుకు వదిలేశాం?” అని అనుకున్నారు. 6 దాంతో అతను తన యుద్ధ రథాల్ని సిద్ధం చేయించి, యోధుల్ని కూడా తనతోపాటు తీసుకెళ్లాడు.+ 7 అతను శ్రేష్ఠమైన 600 రథాల్ని, ఐగుప్తులోని మిగతా రథాలన్నిటినీ తీసుకెళ్లాడు. వాటిలో ప్రతీదాని మీద యోధుల్ని తీసుకెళ్లాడు. 8 అలా యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయాన్ని కఠినం అవ్వనిచ్చాడు, దాంతో అతను ఇశ్రాయేలీయుల్ని వెంటాడాడు. మరోవైపున ఇశ్రాయేలీయులు ధైర్యంగా ముందుకు సాగిపోతూ ఉన్నారు.+ 9 ఐగుప్తీయులు వాళ్లను వెంటాడారు.+ ఇశ్రాయేలీయులు సముద్రం పక్కన, బయల్సెఫోను ఎదుట పీహహీరోతు దగ్గర తమ డేరాలు వేసుకుంటుండగా ఫరో రథాలు, అతని అశ్వదళం, అతని సైన్యం వాళ్లకు దగ్గరగా రాసాగాయి.

10 ఫరో కాస్త దగ్గరగా వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయులు తమ తలలెత్తి ఐగుప్తీయులు తమను వెంటాడుతున్నారని గమనించారు. దాంతో ఇశ్రాయేలీయులు భయపడిపోయి యెహోవాకు మొరపెట్టడం మొదలుపెట్టారు.+ 11 వాళ్లు మోషేతో ఇలా అన్నారు: “ఐగుప్తులో సమాధులు లేవని ఈ ఎడారిలో చనిపోవడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా?+ నువ్వు మాకు ఎందుకిలా చేశావు? మమ్మల్ని ఎందుకు ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చావు? 12 ‘మమ్మల్ని ఇలా వదిలేయి. మేము ఐగుప్తీయులకు సేవచేసుకుంటాం’ అని ఐగుప్తులో మేము నీతో చెప్పలేదా? మేము ఈ ఎడారిలో చనిపోవడం కన్నా ఐగుప్తీయులకు సేవచేయడమే మంచిది.”+ 13 తర్వాత మోషే ప్రజలతో ఇలా అన్నాడు: “భయపడకండి.+ స్థిరంగా నిలబడి, ఈ రోజు యెహోవా మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో చూడండి.+ ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయుల్ని మీరు మళ్లీ ఇంకెప్పుడూ చూడరు.+ 14 యెహోవాయే మీ తరఫున పోరాడతాడు,+ మీరు మౌనంగా నిలబడి చూస్తారు.”

15 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వెందుకు నాకు మొరపెడుతూ ఉన్నావు? నువ్వు ఇశ్రాయేలీయులతో తమ డేరాలు తీసేసి ముందుకు సాగిపోవాలని చెప్పు. 16 నువ్వైతే నీ కర్ర పైకెత్తి, సముద్రం మీద నీ చెయ్యి చాపి దాన్ని రెండు పాయలుగా చేయి. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్య ఆరిన నేలమీద నడిచివెళ్తారు. 17 నేనైతే ఐగుప్తీయుల హృదయాల్ని కఠినం అవ్వనిస్తున్నాను, కాబట్టి వాళ్లు ఇశ్రాయేలీయుల్ని వెంటాడుతూ సముద్రంలోకి వస్తారు; అప్పుడు నేను ఫరోను, అతని సైన్యమంతటినీ, అతని యుద్ధ రథాల్ని, అతని అశ్వదళాన్ని ఓడించి నన్ను నేను మహిమపర్చుకుంటాను.+ 18 నేను ఫరోను, అతని యుద్ధ రథాల్ని, అతని అశ్వదళాన్ని ఓడించి నన్ను నేను మహిమపర్చుకున్నప్పుడు, నేను యెహోవానని ఐగుప్తీయులు ఖచ్చితంగా తెలుసుకుంటారు.”+

19 అప్పుడు ఇశ్రాయేలీయుల ముందు వెళ్తున్న సత్యదేవుని దూత+ వాళ్ల వెనక్కి వెళ్లాడు, వాళ్ల ముందున్న మేఘస్తంభం కూడా వెనక్కి వెళ్లి వాళ్ల వెనక నిలిచింది.+ 20 అది ఆ ఐగుప్తీయులకు, ఇశ్రాయేలీయులకు మధ్య నిలిచింది. అది ఒకవైపేమో చీకటిని కలిగిస్తోంది, ఇంకోవైపేమో రాత్రిపూట వెలుగును ఇస్తోంది. దానివల్ల ఐగుప్తీయులు రాత్రంతా ఇశ్రాయేలీయుల దగ్గరికి రాలేదు.

21 తర్వాత మోషే తన చేతిని సముద్రం మీద చాపాడు;+ అప్పుడు యెహోవా ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలితో ఆ సముద్రంలోని నీళ్లను వెనక్కి పంపించి, సముద్రం అడుగుభాగాన్ని ఆరిన నేలగా మార్చాడు.+ నీళ్లు రెండు పాయలుగా విడిపోయాయి.+ 22 కాబట్టి ఇశ్రాయేలీయులు సముద్రం గుండా ఆరిన నేలమీద నడిచివెళ్లారు;+ వాళ్ల కుడిచేతి వైపు, ఎడమచేతి వైపు నీళ్లు గోడల్లా నిలిచాయి.+ 23 ఐగుప్తీయులు వాళ్లను వెంటాడారు. ఫరో గుర్రాలు, అతని యుద్ధ రథాలు, అతని అశ్వదళం వాళ్ల వెంటే సముద్రం మధ్యలోకి వెళ్లడం మొదలుపెట్టాయి.+ 24 వేకువ జామున* యెహోవా అగ్ని-మేఘ స్తంభంలో+ నుండి ఐగుప్తీయుల వైపు చూసి, వాళ్లను అయోమయంలో పడేశాడు. 25 ఆయన వాళ్ల రథాలకున్న చక్రాలు ఊడిపోయేలా చేస్తూ ఉన్నాడు, దాంతో వాళ్లకు రథాల్ని తోలడం కష్టమైపోయింది. అప్పుడు ఆ ఐగుప్తీయులు, “మనం ఇశ్రాయేలీయుల దగ్గర నుండి పారిపోదాం పదండి, యెహోవా వాళ్ల తరఫున ఐగుప్తీయులమైన మనతో యుద్ధం చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు.+

26 తర్వాత యెహోవా మోషేతో, “ఆ ఐగుప్తీయుల మీదికి, వాళ్ల యుద్ధ రథాల మీదికి, వాళ్ల అశ్వదళం మీదికి నీళ్లు తిరిగి వచ్చేలా నీ చేతిని సముద్రం మీద చాపు” అన్నాడు. 27 వెంటనే మోషే సముద్రం మీద చెయ్యి చాపాడు. తెల్లవారుతుండగా సముద్రం మళ్లీ మామూలు స్థితికి వచ్చింది. ఐగుప్తీయులు దాని దగ్గర నుండి పారిపోతున్నప్పుడు, యెహోవా వాళ్లను కుదిపేసి సముద్రం మధ్యలో పడేశాడు.+ 28 తిరిగొస్తున్న నీళ్లు యుద్ధ రథాల్ని, అశ్వదళాన్ని, ఇశ్రాయేలీయుల వెంట సముద్రంలోకి వెళ్లిన ఫరో సైన్యమంతటినీ ముంచేశాయి.+ వాళ్లలో ఒక్కరు కూడా బ్రతికి బయటపడలేదు.+

29 అయితే ఇశ్రాయేలీయులు సముద్రం మధ్య ఆరిన నేల మీద నడిచివెళ్లారు;+ వాళ్ల కుడిచేతి వైపు, ఎడమచేతి వైపు నీళ్లు గోడల్లా నిలిచాయి.+ 30 అలా యెహోవా ఆ రోజు ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయుల్ని రక్షించాడు.+ ఆ ఐగుప్తీయులు చనిపోయి సముద్రం ఒడ్డున పడివుండడం ఇశ్రాయేలీయులు చూశారు. 31 యెహోవా ఐగుప్తీయులకు వ్యతిరేకంగా ప్రయోగించిన గొప్ప శక్తిని* కూడా ఇశ్రాయేలీయులు చూశారు. దాంతో వాళ్లు యెహోవాకు భయపడడం, యెహోవా మీద, ఆయన సేవకుడైన మోషే మీద విశ్వాసముంచడం మొదలుపెట్టారు.+

15 ఆ సమయంలో మోషే, ఇశ్రాయేలీయులు యెహోవాకు ఈ పాట పాడారు:+

“నేను యెహోవాకు పాట పాడతాను, ఎందుకంటే ఆయన ఘనవిజయం సాధించాడు.+

గుర్రాన్ని, దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోశాడు.+

 2 నా శక్తి, నా బలం యెహోవాయే;* ఎందుకంటే నన్ను రక్షించేది ఆయనే.+

ఆయనే నా దేవుడు, నేను ఆయన్ని స్తుతిస్తాను;+ ఆయనే నా తండ్రికి దేవుడు,+ నేను ఆయన్ని ఘనపరుస్తాను.+

 3 యెహోవా బలమైన యోధుడు.+ ఆయన పేరు యెహోవా.+

 4 ఫరో రథాల్ని, అతని సైన్యాన్ని ఆయన సముద్రంలో పడద్రోశాడు.+

అతని యోధుల్లో శ్రేష్ఠులు ఎర్రసముద్రంలో మునిగిపోయారు.+

 5 ఉప్పొంగే జలాలు వాళ్లను ముంచేశాయి; వాళ్లు రాయిలా సముద్రం లోతుల్లోకి మునిగిపోయారు.+

 6 యెహోవా, నీ కుడిచేతికి ఉన్న శక్తి గొప్పది;+

యెహోవా, నీ కుడిచెయ్యి శత్రువును చితగ్గొడుతుంది.

 7 నువ్వు నీ గొప్ప వైభవంతో, నీకు వ్యతిరేకంగా లేచేవాళ్లను పడద్రోస్తావు;+

నువ్వు నీ కోపాగ్నిని పంపిస్తావు, అది వాళ్లను కొయ్యకాలును* కాల్చినట్టు కాల్చేస్తుంది.

 8 నీ శ్వాసవల్ల నీళ్లు ఉవ్వెత్తున ఒక్కచోటికి వచ్చాయి;

అవి గోడల్లా నిలిచి ప్రవాహాల్ని ఆపాయి;

సముద్ర గర్భంలో, ఉప్పొంగే జలాలు గడ్డకట్టాయి.

 9 శత్రువు ఇలా అన్నాడు: ‘నేను వాళ్లను వెంటాడతాను! వాళ్లను పట్టుకుంటాను!

నాకు తృప్తి కలిగేంతవరకు దోపుడుసొమ్ము పంచుకుంటాను!

నా కత్తి దూస్తాను! నా చెయ్యి వాళ్లను లోబర్చుకుంటుంది!’+

10 నువ్వు నీ శ్వాస ఊదావు, సముద్రం వాళ్లను కప్పేసింది;+

వాళ్లు అగాధ జలాల్లో సీసంలా మునిగిపోయారు.

11 యెహోవా, దేవుళ్లలో నీలాంటివాడు ఎవడు?+

సాటిలేని పవిత్రతను చూపే నీలాంటివాడు ఎవడు?+

స్తుతిగీతాలు పాడుతూ నీకు భయపడాలి, నువ్వు అద్భుతాలు చేస్తావు.+

12 నువ్వు నీ కుడిచేతిని చాపావు, భూమి వాళ్లను మింగేసింది.+

13 నీ విశ్వసనీయ ప్రేమతో, నువ్వు విడిపించిన ప్రజల్ని నడిపించావు.+

నీ బలంతో వాళ్లను నీ పవిత్ర నివాస స్థలానికి తీసుకెళ్తావు.

14 జనాలు వినాలి;+ వాళ్లు వణికిపోతారు;

ఫిలిష్తియ నివాసులు భయాందోళనలకు గురౌతారు.

15 అప్పుడు ఎదోము షేక్‌లు* భయపడిపోతారు,

మోయాబు శక్తివంతమైన పరిపాలకులు* వణికిపోతారు.+

కనాను నివాసులందరి గుండెలు జారిపోతాయి.+

16 తీవ్రమైన భయం వాళ్లను కమ్ముకుంటుంది.+

నీ బాహువు గొప్పతనం వల్ల వాళ్లు రాయిలా చలనం లేకుండా ఉండిపోతారు;

యెహోవా, నీ ప్రజలు దాటిపోయేవరకు,

నువ్వు సృష్టించిన ప్రజలు+ దాటిపోయేవరకు వాళ్లు అలాగే ఉండిపోతారు.+

17 నువ్వు నీ ప్రజల్ని తీసుకొచ్చి నీ సొత్తైన పర్వతం మీద నాటుతావు.+

యెహోవా, అది నువ్వు నివసించడానికి నువ్వు తయారుచేసుకొని స్థాపించిన స్థలం.

యెహోవా, అది నీ చేతులు స్థాపించిన పవిత్రమైన స్థలం.

18 యెహోవా యుగయుగాలు రాజుగా పరిపాలిస్తాడు.+

19 ఫరో గుర్రాలు, యుద్ధ రథాలు, అశ్వదళం సముద్రంలోకి వెళ్లినప్పుడు,+

యెహోవా సముద్ర జలాల్ని వాళ్ల మీదికి తిరిగి రప్పించాడు,+

ఇశ్రాయేలు ప్రజలు మాత్రం సముద్రం మధ్య ఆరిన నేల మీద నడిచారు.”+

20 అప్పుడు అహరోను సహోదరి, ప్రవక్త్రి అయిన మిర్యాము ఒక కంజీరను* పట్టుకుంది. స్త్రీలందరూ కంజీరలు తీసుకొని, నాట్యం చేస్తూ ఆమెను అనుసరించారు. 21 పురుషులు పాడిన పాటకు స్పందిస్తూ మిర్యాము ఇలా పాడింది:

“యెహోవాకు పాట పాడండి, ఎందుకంటే ఆయన ఘనవిజయం సాధించాడు.+

గుర్రాన్ని, దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోశాడు.”+

22 తర్వాత మోషే ఇశ్రాయేలీయుల్ని ఎర్రసముద్రం దగ్గర నుండి ముందుకు నడిపించాడు. వాళ్లు షూరు ఎడారిలోకి ప్రవేశించి దానిలో మూడు రోజులు ప్రయాణించారు. కానీ వాళ్లకు ఎక్కడా నీళ్లు దొరకలేదు. 23 వాళ్లు మారా* దగ్గరికి వచ్చారు.+ కానీ అక్కడున్న నీళ్లను తాగలేకపోయారు, ఎందుకంటే అవి చేదుగా ఉన్నాయి. అందుకే అతను ఆ చోటికి మారా అని పేరు పెట్టాడు. 24 అప్పుడు ప్రజలు, “మేము ఏం తాగాలి?” అంటూ మోషే మీద సణగడం మొదలుపెట్టారు.+ 25 దాంతో అతను యెహోవాకు మొరపెట్టాడు,+ యెహోవా అతనికి ఒక చిన్న చెట్టును చూపించాడు. అతను ఆ చెట్టును నీళ్లలో వేసినప్పుడు అవి తియ్యగా మారిపోయాయి.

అక్కడ ఆయన వాళ్ల కోసం ఒక నియమాన్ని, చట్టాన్ని స్థాపించాడు; అక్కడ ఆయన వాళ్లను పరీక్షించాడు.+ 26 ఆయన ఇలా చెప్పాడు: “మీరు మీ దేవుడైన యెహోవా స్వరాన్ని శ్రద్ధగా విని, ఆయన దృష్టికి ఏది మంచిదో అది చేస్తూ, ఆయన ఆజ్ఞల మీద మనసుపెట్టి ఆయన నియమాలన్నీ పాటిస్తే,+ ఐగుప్తీయుల మీదికి రప్పించిన జబ్బుల్లో దేన్నీ నేను మీ మీదికి రప్పించను.+ ఎందుకంటే, యెహోవానైన నేను మిమ్మల్ని బాగుచేస్తున్నాను.”+

27 తర్వాత వాళ్లు 12 నీటి ఊటలు, 70 ఖర్జూర చెట్లు ఉన్న ఏలీము దగ్గరికి వచ్చి, అక్కడే నీళ్ల పక్కన తమ డేరాలు వేసుకున్నారు.

16 ఏలీము నుండి బయల్దేరిన తర్వాత ఇశ్రాయేలీయులంతా చివరికి సీను ఎడారికి చేరుకున్నారు.+ అది ఏలీముకు, సీనాయికి మధ్య ఉంది. వాళ్లు ఐగుప్తు దేశం నుండి బయల్దేరిన దాదాపు ఒక నెలకు, అంటే రెండో నెల 15వ రోజున అక్కడికి చేరుకున్నారు.

2 తర్వాత ఇశ్రాయేలీయులందరూ ఎడారిలో మోషే మీద, అహరోను మీద సణగడం మొదలుపెట్టారు.+ 3 ఇశ్రాయేలీయులు వాళ్లతో ఇలా అంటూ ఉన్నారు: “మేము ఐగుప్తు దేశంలో మాంసం పాత్రల దగ్గర కూర్చొని కడుపు నిండా ఆహారం తింటున్నప్పుడే యెహోవా చేతిలో చనిపోయి ఉంటే బావుండేది.+ ఇప్పుడేమో మీరు ఈ ప్రజలందర్నీ ఆకలితో చంపడానికి మమ్మల్ని ఈ ఎడారిలోకి తీసుకొచ్చారు.”+

4 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఇదిగో నేను మీకోసం ఆకాశం నుండి ఆహారం కురిపిస్తున్నాను,+ ప్రతీ ఒక్కరు బయటికి వెళ్లి ప్రతీరోజు తనకు ఎంత కావాలో అంత పోగుచేసుకోవాలి.+ అలా నేను వాళ్లను పరీక్షించి, వాళ్లు నా నియమాన్ని పాటిస్తారో లేదో తెలుసుకుంటాను.+ 5 అయితే ఆరో రోజున+ వాళ్లు మిగతా రోజుల్లో ఏరుకున్న దానికి రెండింతలు ఏరుకొని,+ దాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలి.”

6 కాబట్టి మోషే, అహరోనులు ఇశ్రాయేలీయులందరితో ఇలా అన్నారు: “మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చింది యెహోవాయే అని సాయంత్రం మీకు ఖచ్చితంగా తెలుస్తుంది.+ 7 ఉదయం మీరు యెహోవా మహిమను చూస్తారు, ఎందుకంటే మీరు యెహోవా మీద సణుగుతున్న సణుగుల్ని ఆయన విన్నాడు. మీరు మా మీద సణగడానికి మేము ఎంతటివాళ్లం?” 8 మోషే ఇంకా ఇలా అన్నాడు: “మీరు తినడానికి యెహోవా సాయంత్రం మీకు మాంసాన్ని, ఉదయం కావాల్సినంత ఆహారాన్ని ఇచ్చినప్పుడు, మీరు తన మీద సణుగుతున్న సణుగుల్ని యెహోవా విన్నాడని మీకు తెలుస్తుంది. మీరు మా మీద సణగడానికి మేము ఎంతటివాళ్లం? మీరు సణుగుతున్నది మా మీద కాదు యెహోవా మీదే.”+

9 తర్వాత మోషే అహరోనుతో ఇలా అన్నాడు: “నువ్వు ఇశ్రాయేలీయులందరితో, ‘యెహోవా ముందుకు రండి, ఎందుకంటే ఆయన మీ సణుగుల్ని విన్నాడు’+ అని చెప్పు.” 10 అహరోను ఇశ్రాయేలీయులందరితో మాట్లాడడం అయిపోగానే వాళ్లు ఎడారి వైపు తిరిగి చూశారు. అప్పుడు ఇదిగో! యెహోవా మహిమ మేఘస్తంభంలో కనిపించింది.+

11 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 12 “నేను ఇశ్రాయేలీయుల సణుగుల్ని విన్నాను.+ నువ్వు వాళ్లతో ఇలా చెప్పు: ‘సంధ్య వెలుగు సమయంలో* మీరు మాంసం తింటారు, ఉదయం మీరు కడుపునిండా ఆహారం తింటారు.+ అప్పుడు మీరు, మీ దేవుడైన యెహోవాను నేనే అని ఖచ్చితంగా తెలుసుకుంటారు.’ ”+

13 కాబట్టి ఆ సాయంత్రం పూరేడు పిట్టలు వచ్చి పాలెం అంతటినీ కప్పేశాయి,+ ఉదయం పాలెం చుట్టూ మంచు పొర ఉంది. 14 మంచు పొర ఆవిరైపోయినప్పుడు, ఎడారిలో నేలమీద సన్నని నూగులాంటి పదార్థం కనిపించింది.+ అది నేలమీద గడ్డకట్టిన పొడి మంచు అంత సన్నగా ఉంది. 15 ఇశ్రాయేలీయులు దాన్ని చూసినప్పుడు, అదేంటో తెలియక ఒకరితో ఒకరు “ఇది ఏంటి?” అనుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు మోషే వాళ్లతో ఇలా అన్నాడు: “ఇది మీరు తినడానికి యెహోవా ఇచ్చిన ఆహారం.+ 16 యెహోవా ఏమని ఆజ్ఞాపించాడంటే, ‘మీలో ప్రతీ ఒక్కరు ఎంత తినగలరనేదాన్ని బట్టి దాన్ని పోగుచేసుకోవాలి. ప్రతీ ఒక్కరు తన డేరాలో ఎంతమంది ఉన్నారనేదాని ప్రకారం, ఒక్కొక్కరికి ఒక ఓమెరు కొలత*+ చొప్పున తీసుకోవాలి.’ ” 17 ఇశ్రాయేలీయులు అలాగే చేయడం మొదలుపెట్టారు; కొందరు ఎక్కువ పోగుచేసుకున్నారు, కొందరు తక్కువ పోగుచేసుకున్నారు. 18 వాళ్లు ఓమెరుతో కొలిచినప్పుడు, ఎక్కువ పోగుచేసుకున్న వ్యక్తికి ఎక్కువ మిగల్లేదు, తక్కువ పోగుచేసుకున్న వ్యక్తికి తక్కువ కాలేదు.+ వాళ్లలో ప్రతీ ఒక్కరు తాము ఎంత తినగలరో అంత పోగుచేసుకున్నారు.

19 తర్వాత మోషే వాళ్లతో ఇలా అన్నాడు: “మరుసటి రోజు ఉదయం వరకు ఎవ్వరూ దానిలో కొంచెం కూడా మిగుల్చుకోకూడదు.”+ 20 కానీ వాళ్లు మోషే మాట వినలేదు. కొందరు దానిలో కొంచెం మరుసటి ఉదయం వరకు మిగిల్చినప్పుడు అది పురుగులు పట్టి కంపుకొట్టింది. అప్పుడు మోషేకు వాళ్లమీద చాలా కోపం వచ్చింది. 21 వాళ్లు ప్రతీరోజు ఉదయం దాన్ని ఏరుకునేవాళ్లు. ప్రతీ ఒక్కరు తాము ఎంత తినగలరో అంత పోగుచేసుకునేవాళ్లు. ఎండ ఎక్కువైనప్పుడు అది కరిగిపోయేది.

22 ఆరో రోజున వాళ్లు రెండింతల ఆహారాన్ని,+ అంటే ఒక్కొక్కరికి రెండు ఓమెరు కొలతలు వచ్చేలా పోగుచేసుకున్నారు. కాబట్టి ప్రజల ప్రధానులంతా వచ్చి, ఆ విషయం గురించి మోషేకు చెప్పారు. 23 అప్పుడు మోషే వాళ్లతో ఇలా అన్నాడు: “యెహోవానే అలా చెప్పాడు. రేపటి రోజు పూర్తి విశ్రాంతి రోజుగా* ఉంటుంది, అది యెహోవాకు పవిత్రమైన విశ్రాంతి రోజు.+ మీరు కాల్చుకోవాల్సింది కాల్చుకోండి, ఉడకబెట్టుకోవాల్సింది ఉడకబెట్టుకోండి;+ మిగిలిందంతా మరుసటి రోజు ఉదయం వరకు ఉంచుకోండి.” 24 కాబట్టి మోషే ఆజ్ఞాపించినట్టే వాళ్లు దాన్ని ఉదయం వరకు ఉంచుకున్నారు, కానీ అది కంపుకొట్టలేదు, దానికి పురుగులు పట్టలేదు. 25 తర్వాత మోషే ఇలా అన్నాడు: “ఈ రోజు దాన్ని తినండి, ఎందుకంటే ఈ రోజు యెహోవాకు విశ్రాంతి రోజు. ఇవాళ అది నేలమీద మీకు కనిపించదు. 26 ఆరు రోజులు మీరు దాన్ని ఏరుకుంటారు; కానీ ఏడో రోజున, అంటే విశ్రాంతి రోజున+ అది ఏమాత్రం దొరకదు.” 27 అయినాసరే ఏడో రోజున కొంతమంది దాన్ని ఏరుకోవడానికి వెళ్లారు, కానీ వాళ్లకు ఏమీ దొరకలేదు.

28 కాబట్టి యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “మీరు ఎంతకాలం నా ఆజ్ఞల్ని, నియమాల్ని పాటించకుండా ఉంటారు?+ 29 యెహోవా మీకు విశ్రాంతి రోజును ఇచ్చాడనే విషయాన్ని గుర్తుంచుకోండి.+ అందుకే ఆయన ఆరో రోజున రెండు రోజులకు సరిపోయే ఆహారం మీకు ఇస్తున్నాడు. ప్రతీ ఒక్కరు తాము ఉన్న చోటే ఉండాలి; ఏడో రోజున ఎవ్వరూ తమ ప్రాంతం దాటి వెళ్లకూడదు.” 30 కాబట్టి ప్రజలు ఏడో రోజును విశ్రాంతి రోజుగా ఆచరించారు.*+

31 ఇశ్రాయేలు ప్రజలు ఆ ఆహారానికి “మన్నా”* అని పేరు పెట్టారు. అది ధనియాల్లా తెల్లగా ఉండేది. దాని రుచి తేనె కలిపిన పిండివంటకంలా ఉండేది.+ 32 తర్వాత మోషే ఇలా అన్నాడు: “యెహోవా ఏమని ఆజ్ఞాపించాడంటే, ‘మీరు దాన్ని ఒక ఓమెరు కొలత అంత తీసుకొని, అది తరతరాలపాటు ఉండేలా దాన్ని పక్కకుపెట్టండి.+ అలా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తున్నప్పుడు, ఎడారిలో మీరు తినడానికి నేను ఇచ్చిన ఆహారాన్ని వాళ్లు చూస్తారు.’ ” 33 కాబట్టి మోషే అహరోనుతో ఇలా చెప్పాడు: “నువ్వు ఒక పాత్ర తీసుకొని, దానిలో ఒక ఓమెరు కొలత అంత మన్నాను పెట్టి, అది తరతరాలపాటు ఉండేలా దాన్ని యెహోవా ముందు ఉంచు.”+ 34 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే అహరోను చేశాడు. అది భద్రంగా ఉండేలా దాన్ని సాక్ష్యపు మందసం*+ ముందు ఉంచాడు. 35 ఇశ్రాయేలీయులు జనావాస ప్రాంతానికి వచ్చేవరకు,+ కనాను దేశం పొలిమేర్లకు వచ్చేవరకు+ 40 సంవత్సరాల పాటు మన్నా తిన్నారు.+ 36 ఓమెరు అంటే ఈఫా కొలతలో* పదోవంతు.

17 ఇశ్రాయేలీయులందరూ సీను ఎడారి నుండి బయల్దేరి+ యెహోవా ఆదేశం ప్రకారం ఒకచోటి నుండి ఇంకోచోటికి మారుతూ+ చివరికి రెఫీదీములో తమ డేరాలు వేసుకున్నారు.+ అయితే ప్రజలు తాగడానికి అక్కడ నీళ్లు లేవు.

2 కాబట్టి ప్రజలు, “తాగడానికి మాకు నీళ్లు ఇవ్వు” అంటూ మోషేతో గొడవపడడం మొదలుపెట్టారు.+ అయితే మోషే వాళ్లతో, “మీరెందుకు నాతో గొడవపడుతున్నారు? ఎందుకు యెహోవాను పరీక్షిస్తూ ఉన్నారు?”+ అన్నాడు. 3 అయితే అక్కడ ప్రజలకు చాలా దాహం వేసింది, దాంతో వాళ్లు మోషే మీద సణుగుతూ,+ “మమ్మల్ని, మా కుమారుల్ని, మా పశువుల్ని దాహంతో చంపడానికి మమ్మల్ని ఐగుప్తు నుండి ఎందుకు బయటికి తీసుకొచ్చావు?” అని అంటూ ఉన్నారు. 4 చివరికి మోషే యెహోవాకు ఇలా మొరపెట్టాడు: “ఈ ప్రజలతో నేనేం చేయాలి? ఇంకాసేపైతే వాళ్లు నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు!”

5 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు నైలు నదిని కొట్టిన నీ కర్రను+ తీసుకొని, ఇశ్రాయేలు పెద్దల్లో కొంతమందిని వెంటబెట్టుకొని ప్రజలకు ముందుగా వెళ్లు. నువ్వు ఆ కర్రను చేతిలో పట్టుకొని నడుస్తూ ఉండు. 6 ఇదిగో! నేను అక్కడ హోరేబులో బండ మీద నీ ముందు నిలబడి ఉంటాను. నువ్వు ఆ బండను కొట్టాలి, అప్పుడు దానిలో నుండి నీళ్లు వస్తాయి, ప్రజలు వాటిని తాగుతారు.”+ మోషే ఇశ్రాయేలు పెద్దల ముందు అలాగే చేశాడు. 7 ఇశ్రాయేలీయులు గొడవపడినందువల్ల, వాళ్లు “యెహోవా అసలు మన మధ్య ఉన్నాడా, లేడా?” అని అంటూ యెహోవాను పరీక్షించినందువల్ల+ అతను ఆ చోటికి మస్సా*+ అనీ మెరీబా*+ అనీ పేరు పెట్టాడు.

8 తర్వాత అమాలేకీయులు+ వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు.+ 9 అప్పుడు మోషే యెహోషువతో+ ఇలా అన్నాడు: “మన తరఫున కొంతమంది పురుషుల్ని ఎంచుకొని వెళ్లి అమాలేకీయులతో యుద్ధం చేయి. రేపు నేను సత్యదేవుని కర్రను నా చేతిలో పట్టుకొని కొండ పైన నిలబడతాను.” 10 అప్పుడు యెహోషువ సరిగ్గా మోషే చెప్పినట్టే చేసి,+ అమాలేకీయులతో యుద్ధం చేశాడు. మోషే, అహరోను, హూరు+ ఆ కొండ మీదికి ఎక్కివెళ్లారు.

11 మోషే తన చేతుల్ని ఎత్తి ఉంచినంతసేపు ఇశ్రాయేలీయులు గెలవసాగారు, కానీ అతను చేతులు దించగానే అమాలేకీయులు గెలవసాగారు. 12 మోషే చేతులు బరువెక్కినప్పుడు వాళ్లు ఒక రాయిని తీసుకొచ్చారు, అతను దానిమీద కూర్చున్నాడు. అప్పుడు అహరోను, హూరు అతనికి చెరో వైపున ఉండి అతని చేతుల్ని ఎత్తి పట్టుకున్నారు. దానివల్ల సూర్యాస్తమయం వరకు అతని చేతులు కదలకుండ అలాగే ఉన్నాయి. 13 అలా యెహోషువ అమాలేకీయుల్ని, వాళ్లతో ఉన్నవాళ్లను కత్తితో ఓడించాడు.+

14 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు ఈ మాటను జ్ఞాపకార్థంగా* గ్రంథంలో రాసి, యెహోషువకు కూడా ఇలా చెప్పు: ‘నేను ఆకాశం కింద నుండి అమాలేకీయుల్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాను, వాళ్లను ఇక ఎప్పటికీ ఎవరూ గుర్తుచేసుకోరు.’ ”+ 15 తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా-నిస్సీ* అని పేరు పెట్టి, 16 “అమాలేకు చెయ్యి యెహోవా* సింహాసనానికి విరోధంగా ఉంది+ కాబట్టి, యెహోవాకు తరతరాలపాటు అమాలేకుతో యుద్ధం ఉంటుంది”+ అన్నాడు.

18 దేవుడు మోషే కోసం, తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం చేసిందంతా, అంటే యెహోవా ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల్ని ఎలా బయటికి తీసుకొచ్చాడో మిద్యాను పూజారి, మోషే మామ అయిన యిత్రో+ విన్నాడు.+ 2 మోషే తన భార్య సిప్పోరాను వెనక్కి పంపించినప్పుడు అతని మామ యిత్రో ఆమె బాగోగులు చూసుకున్నాడు. 3 ఆమె ఇద్దరు కుమారుల్ని+ కూడా అతనే చూసుకున్నాడు. మోషే, “నేను వేరే దేశంలో పరదేశిని అయ్యాను” అంటూ ఒక కుమారుడికి గెర్షోము* అని పేరు పెట్టాడు.+ 4 అలాగే, “నన్ను ఫరో కత్తి నుండి కాపాడిన దేవుడే,+ నా తండ్రి ఆరాధించిన దేవుడే నా సహాయకుడు” అంటూ ఇంకో కుమారుడికి ఎలీయెజెరు* అని పేరు పెట్టాడు.

5 మోషే మామ యిత్రో మోషే కుమారుల్ని, అతని భార్యను తీసుకొని, ఎడారిలో సత్యదేవుని పర్వతం+ దగ్గర డేరా వేసుకున్న మోషే దగ్గరికి వచ్చాడు. 6 అతను, “నేను నీ మామ యిత్రోను.+ నేను నీ భార్యను, ఆమె ఇద్దరు కుమారుల్ని తీసుకొని నీ దగ్గరికి వస్తున్నాను” అని మోషేకు కబురు పంపాడు. 7 వెంటనే మోషే వెళ్లి తన మామను కలుసుకొని, అతనికి వంగి నమస్కారం చేసి, అతన్ని ముద్దుపెట్టుకున్నాడు. వాళ్లిద్దరూ ఒకరి బాగోగులు ఒకరు తెలుసుకొని, ఆ తర్వాత డేరాలోకి వెళ్లారు.

8 యెహోవా ఇశ్రాయేలీయుల తరఫున ఫరోకూ ఐగుప్తుకూ ఏమి చేశాడో,+ దారిలో వాళ్లకు ఏమేం కష్టాలు ఎదురయ్యాయో,+ యెహోవా వాళ్లను ఎలా విడిపించాడో మోషే తన మామకు చెప్పాడు. 9 ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు* నుండి విడిపించడం ద్వారా యెహోవా వాళ్లకు చేసిన మంచి అంతటిని బట్టి యిత్రో చాలా సంతోషించాడు. 10 తర్వాత యిత్రో ఇలా అన్నాడు: “ఐగుప్తు నుండి, ఫరో నుండి మిమ్మల్ని కాపాడి, ఐగుప్తు గుప్పిట్లో నుండి ఈ ప్రజల్ని విడిపించిన యెహోవా స్తుతించబడాలి. 11 తన ప్రజలతో అహంకారంగా ప్రవర్తించినవాళ్లకు ఆయన చేసినదాన్ని బట్టి, మిగతా దేవుళ్లందరి కన్నా యెహోవానే గొప్పవాడని+ ఇప్పుడు నాకు అర్థమైంది.” 12 తర్వాత మోషే మామ యిత్రో, దేవుని కోసం దహనబలిని, వేరే బలుల్ని తీసుకొచ్చాడు; అహరోనూ, ఇశ్రాయేలు పెద్దలందరూ సత్యదేవుని సన్నిధిలో మోషే మామతో కలిసి భోజనం చేయడానికి వచ్చారు.

13 తర్వాతి రోజు మోషే ఎప్పటిలాగే ప్రజలకు న్యాయం తీర్చడానికి కూర్చున్నాడు. ప్రజలు ఉదయం నుండి సాయంత్రం వరకు మోషే దగ్గరికి వస్తూ, అతని ముందు నిలబడుతూ ఉన్నారు. 14 మోషే ఆ ప్రజల కోసం చేస్తున్నదంతా అతని మామ చూసి, “ఈ ప్రజల కోసం నువ్వు చేస్తున్నదేంటి? న్యాయం తీర్చడానికి నువ్వు ఒక్కడివే ఇక్కడ కూర్చోవడం, ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజలంతా నీ ముందు నిలబడి ఉండడం ఎందుకు?” అన్నాడు. 15 అప్పుడు మోషే తన మామతో ఇలా అన్నాడు: “ఎందుకంటే, ప్రజలు దేవుని నిర్దేశమేంటో అడిగి తెలుసుకోవడానికి నా దగ్గరికి వస్తూ ఉంటారు. 16 ఏదైనా వివాదం తలెత్తితే, వాళ్లు దాన్ని నా దగ్గరికి తీసుకొస్తారు. అప్పుడు నేను వాళ్లిద్దరి మధ్య న్యాయం తీర్చాలి. అంతేకాదు నేను సత్యదేవుని నిర్ణయాల్ని, ఆయన నియమాల్ని వాళ్లకు చెప్తాను.”+

17 అప్పుడు మోషే మామ అతనితో ఇలా అన్నాడు: “ఇది సరైన పద్ధతి కాదు. 18 ఇలా చేస్తే నువ్వు తప్పకుండా అలసిపోతావు. నువ్వే కాదు నీతోపాటు ఉన్న ఈ ప్రజలు కూడా అలసిపోతారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద పని, నువ్వు ఒక్కడివే ఈ భారమంతా మోయలేవు. 19 కాబట్టి నా మాట విను. నేను నీకొక సలహా ఇస్తాను, దేవుడు నీకు తోడుగా ఉంటాడు.+ నువ్వు సత్యదేవుని ముందు ప్రజలకు ప్రతినిధిగా ఉంటూ,+ వివాదాల్ని సత్యదేవుని దగ్గరికి తీసుకురావాలి.+ 20 నువ్వు దేవుని ఆజ్ఞల్ని, నియమాల్ని వాళ్లకు నేర్పించాలి;+ వాళ్లు ఏ మార్గంలో నడవాలో, ఏమేం పనులు చేయాలో వాళ్లకు తెలియజేయాలి. 21 అయితే నువ్వు ప్రజల్లో నుండి సమర్థులైన పురుషుల్ని ఎంచుకోవాలి.+ వాళ్లు దేవునికి భయపడేవాళ్లు, నమ్మదగినవాళ్లు, అక్రమ లాభాన్ని అసహ్యించుకునేవాళ్లు అయ్యుండాలి.+ నువ్వు వాళ్లను వెయ్యిమంది మీద, వందమంది మీద, యాభైమంది మీద, పదిమంది మీద ప్రధానులుగా నియమించాలి.+ 22 వివాదాలు తలెత్తినప్పుడు* వాళ్లు ప్రజలకు న్యాయం తీర్చాలి. కష్టమైన ప్రతీ వివాదాన్ని వాళ్లు నీ దగ్గరికి తీసుకొస్తారు.+ అయితే చిన్నచిన్న వివాదాల విషయంలో వాళ్లే నిర్ణయం చెప్తారు. అలా వాళ్లతో నీ భారం పంచుకొని నీ పని తేలిక చేసుకో.+ 23 నువ్వు ఇలా చేస్తే, దేవుడు దీన్ని ఆమోదిస్తే, నువ్వు ఈ భారం మోయగలుగుతావు. అంతేకాదు, ప్రతీ ఒక్కరు సంతృప్తితో ఇంటికి వెళ్తారు.”

24 మోషే వెంటనే తన మామ మాట విన్నాడు, అతను చెప్పిందంతా చేశాడు. 25 మోషే ఇశ్రాయేలీయులందరిలో నుండి సమర్థులైన పురుషుల్ని ఎంచుకొని వాళ్లను ప్రజల మీద పెద్దలుగా నియమించాడు; అతను వాళ్లను వెయ్యిమంది మీద, వందమంది మీద, యాభైమంది మీద, పదిమంది మీద ప్రధానులుగా నియమించాడు. 26 కాబట్టి వివాదాలు తలెత్తినప్పుడు వాళ్లు ప్రజలకు న్యాయం తీర్చారు. ఏదైనా వివాదం కష్టంగా ఉంటే, వాళ్లు దాన్ని మోషే దగ్గరికి తీసుకొచ్చేవాళ్లు.+ కానీ చిన్నచిన్న వివాదాల విషయంలో వాళ్లే న్యాయం తీర్చేవాళ్లు. 27 తర్వాత మోషే తన మామను సాగనంపాడు,+ అతను తన దేశానికి వెళ్లిపోయాడు.

19 ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చాక, మూడో నెలలో అదే రోజున సీనాయి ఎడారికి చేరుకున్నారు. 2 వాళ్లు రెఫీదీము+ నుండి బయల్దేరి సీనాయి ఎడారికి వచ్చి, ఆ ఎడారిలో తమ డేరాలు వేసుకున్నారు. ఇశ్రాయేలీయులు అక్కడ పర్వతం ఎదుట తమ డేరాలు వేసుకున్నారు.+

3 తర్వాత మోషే సత్యదేవుని ముందు కనిపించడానికి పర్వతం పైకి వెళ్లాడు. అప్పుడు యెహోవా ఆ పర్వతం నుండి అతనితో ఇలా మాట్లాడాడు:+ “నువ్వు యాకోబు ఇంటివాళ్లతో, అంటే ఇశ్రాయేలీయులతో ఇలా అనాలి: 4 ‘మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసుకుంటూ+ నా దగ్గరికి తెచ్చుకోవడానికి నేను ఐగుప్తీయులకు ఏమి చేశానో మీరే స్వయంగా చూశారు.+ 5 మీరు ప్రతీ విషయంలో నా మాటకు లోబడుతూ నా ఒప్పందానికి కట్టుబడి ఉంటే, ఖచ్చితంగా అన్నిదేశాల ప్రజల్లో మీరు నాకు ప్రత్యేకమైన సొత్తు* అవుతారు.+ ఎందుకంటే, భూమంతా నాదే కదా.+ 6 మీరు నాకు యాజకులతో రూపొందిన రాజ్యంగా, పవిత్ర జనంగా తయారౌతారు.’+ నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పాల్సిన మాటలు ఇవే.”

7 కాబట్టి మోషే వెళ్లి ప్రజల పెద్దల్ని పిలిపించి, యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నిటినీ వాళ్లకు చెప్పాడు.+ 8 అప్పుడు ప్రజలందరూ ముక్తకంఠంతో, “యెహోవా చెప్పినవన్నీ చేయడం మాకు ఇష్టమే” అన్నారు.+ వెంటనే మోషే ఆ ప్రజలు అన్న మాటల్ని యెహోవాకు చెప్పడానికి వెళ్లాడు. 9 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఇదిగో! నేను నీతో మాట్లాడేటప్పుడు ప్రజలు వినేలా, వాళ్లు నీ మీద కూడా విశ్వాసం ఉంచేలా నేను కారుమబ్బులో నీ దగ్గరికి వస్తున్నాను.” తర్వాత మోషే, ప్రజలు అన్న మాటల్ని యెహోవాకు చెప్పాడు.

10 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు ప్రజల దగ్గరికి వెళ్లి ఇవాళ, రేపు వాళ్లను పవిత్రపర్చు; అలాగే వాళ్లు తమ వస్త్రాలు ఉతుక్కోవాలి. 11 మూడో రోజు కోసం వాళ్లు సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే మూడో రోజున యెహోవా ప్రజలందరి కళ్లముందు సీనాయి పర్వతం మీదికి దిగివస్తాడు. 12 ప్రజలు ఆ పర్వతం దగ్గరికి రాకుండా దాని చుట్టూ సరిహద్దులు ఏర్పాటుచేసి, వాళ్లకు ఇలా చెప్పు: ‘మీరు పర్వతం మీదికి వెళ్లకుండా, దాని అంచును తాకకుండా జాగ్రత్తపడండి. ఎవరైనా ఆ పర్వతాన్ని తాకితే అతన్ని ఖచ్చితంగా చంపేయాలి. 13 ఏ చెయ్యీ అతన్ని తాకకూడదు. అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి, లేదా బాణాలు వేసి చంపాలి. అది జంతువైనా, మనిషైనా చావాల్సిందే.’+ అయితే బూర* శబ్దం వినబడినప్పుడు+ వాళ్లు ఆ పర్వతం దగ్గరికి రావచ్చు.”

14 అప్పుడు మోషే ఆ పర్వతం మీది నుండి కిందికి దిగి ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్లను పవిత్రపర్చడం మొదలుపెట్టాడు, వాళ్లు తమ వస్త్రాలు ఉతుక్కున్నారు.+ 15 అతను ప్రజలతో, “మూడో రోజు కోసం సిద్ధపడండి. స్త్రీని ముట్టకండి”* అన్నాడు.

16 మూడో రోజు ఉదయం ఉరుములు, మెరుపులు వచ్చాయి; ఆ పర్వతం మీద దట్టమైన మేఘం కనిపించింది,+ చాలా బిగ్గరగా బూర* శబ్దం వినిపించింది; దాంతో పాలెంలో ఉన్న ప్రజలంతా భయంతో వణికిపోసాగారు.+ 17 అప్పుడు ప్రజలు సత్యదేవుణ్ణి కలిసేలా మోషే వాళ్లను పాలెం బయటికి తీసుకొచ్చాడు; వాళ్లు వచ్చి పర్వతం అడుగుభాగం దగ్గర నిలబడ్డారు. 18 యెహోవా అగ్నిలో సీనాయి పర్వతం మీదికి దిగిరావడం వల్ల ఆ పర్వతమంతా పొగతో నిండిపోయింది;+ కొలిమిలో* నుండి పొగ పైకి లేచినట్టు ఆ పొగ పైకి లేస్తోంది, పర్వతమంతా భయంకరంగా కంపిస్తూ ఉంది.+ 19 బూర* శబ్దం అంతకంతకూ బిగ్గరగా వినిపిస్తున్నప్పుడు మోషే మాట్లాడాడు, అప్పుడు సత్యదేవుని స్వరం అతనికి జవాబిచ్చింది.

20 యెహోవా సీనాయి పర్వత శిఖరం మీదికి దిగివచ్చాడు. తర్వాత యెహోవా మోషేను ఆ పర్వత శిఖరం మీదికి రమ్మని పిలిచాడు, మోషే దాని పైకి ఎక్కివెళ్లాడు.+ 21 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు కిందికి వెళ్లి, యెహోవాను చూడడానికి సరిహద్దులు దాటి వచ్చే ప్రయత్నం చేయొద్దని ప్రజల్ని హెచ్చరించు. లేకపోతే వాళ్లలో చాలామంది చనిపోతారు. 22 అలాగే యెహోవా దగ్గరికి వస్తూ ఉండే యాజకులకు తమను తాము పవిత్రపర్చుకోమని చెప్పు, లేకపోతే యెహోవా వాళ్లను చంపేస్తాడు.”+ 23 అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు: “ప్రజలు సీనాయి పర్వతం దగ్గరికి రాలేరు. ఎందుకంటే, ‘పర్వతం చుట్టూ సరిహద్దులు ఏర్పాటుచేసి, దాన్ని పవిత్రపర్చు’ అని నువ్వు మమ్మల్ని ముందే హెచ్చరించావు.”+ 24 అయితే యెహోవా అతనితో ఇలా అన్నాడు: “నువ్వు కిందికి వెళ్లి అహరోనును వెంటబెట్టుకొని ఇక్కడికి ఎక్కిరా. అయితే సరిహద్దులు దాటి యెహోవా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయొద్దని యాజకులకు, ప్రజలకు చెప్పు. లేకపోతే ఆయన వాళ్లను చంపేస్తాడు.”+ 25 కాబట్టి మోషే కిందికి వెళ్లి ప్రజలకు ఆ మాటలు చెప్పాడు.

20 అప్పుడు దేవుడు ఈ మాటలన్నీ చెప్పాడు:

2 “దాస్య గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను బయటికి తీసుకొచ్చిన నీ దేవుడైన యెహోవాను నేనే. 3 నేను కాకుండా* నీకు వేరే ఏ దేవుళ్లూ ఉండకూడదు.+

4 “పైన ఆకాశంలో, కింద భూమ్మీద లేదా భూమికింద నీళ్లలో ఉండే దేని పోలికలోనైనా నువ్వు విగ్రహాన్ని గానీ, రూపాన్ని* గానీ చేసుకోకూడదు.+ 5 వాటికి వంగి నమస్కారం చేయకూడదు, వాటిని పూజించేలా ప్రలోభానికి గురికాకూడదు.+ ఎందుకంటే నీ దేవుడైన యెహోవా అనే నేను సంపూర్ణ భక్తి కోరుకునే దేవుణ్ణి.+ నన్ను ద్వేషించేవాళ్ల విషయంలో, మూడునాలుగు తరాల వరకు తండ్రుల దోషశిక్షను కుమారుల మీదికి రప్పిస్తాను. 6 అయితే నన్ను ప్రేమించి, నా ఆజ్ఞలు పాటించేవాళ్ల విషయంలో, వెయ్యి తరాల వరకు వాళ్లమీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తాను.+

7 “నీ దేవుడైన యెహోవా పేరును వ్యర్థంగా ఉపయోగించకూడదు,+ ఎందుకంటే తన పేరును వ్యర్థంగా ఉపయోగించే వ్యక్తిని యెహోవా తప్పకుండా శిక్షిస్తాడు.+

8 “విశ్రాంతి రోజును ఆచరించడం, దాన్ని పవిత్రంగా ఎంచడం మర్చిపోకు.+ 9 నువ్వు ఆరు రోజులు కష్టపడి నీ పనులన్నీ చేసుకోవాలి; 10 అయితే ఏడో రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి రోజు. ఆ రోజు నువ్వు గానీ, నీ కుమారుడు గానీ, నీ కూతురు గానీ, నీ దాసుడు గానీ, నీ దాసురాలు గానీ, నీ పశువు గానీ, నీ నగరాల్లో నివసించే పరదేశి గానీ ఏ పనీ చేయకూడదు.+ 11 ఎందుకంటే ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న వాటన్నిటినీ చేసి, ఏడో రోజున విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు.+ అందుకే యెహోవా విశ్రాంతి రోజును దీవించి దాన్ని పవిత్రపర్చాడు.

12 “నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో నువ్వు ఎక్కువకాలం జీవించేలా మీ అమ్మానాన్నల్ని గౌరవించు.+

13 “నువ్వు హత్య చేయకూడదు.+

14 “వ్యభిచారం చేయకూడదు.+

15 “దొంగతనం చేయకూడదు.+

16 “నీ సాటిమనిషి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు.+

17 “నీ సాటిమనిషి ఇంటిని ఆశించకూడదు. అతని భార్యను గానీ,+ అతని దాసుణ్ణి గానీ, అతని దాసురాల్ని గానీ, అతని ఎద్దును గానీ, అతని గాడిదను గానీ, అతనికి చెందిన దేన్నీ నువ్వు ఆశించకూడదు.”+

18 అప్పుడు ప్రజలు ఉరుముల శబ్దాన్ని, బూర* శబ్దాన్ని వింటూ ఉన్నారు; మెరుపుల్ని, పర్వతం మీద నుండి పొగ లేవడాన్ని చూస్తూ ఉన్నారు; వాటిని చూసినప్పుడు, విన్నప్పుడు వాళ్లు భయపడిపోయి కాస్త దూరంగా నిలబడ్డారు.+ 19 కాబట్టి వాళ్లు మోషేతో ఇలా అన్నారు: “నువ్వే మాతో మాట్లాడు, మేము వింటాం. కానీ దేవుణ్ణి మాతో మాట్లాడనివ్వకు, ఒకవేళ ఆయన మాతో మాట్లాడితే మేము చనిపోతామని మాకు భయంగా ఉంది.”+ 20 అప్పుడు మోషే ఆ ప్రజలతో ఇలా అన్నాడు: “భయపడకండి, మిమ్మల్ని పరీక్షించడానికే సత్యదేవుడు వచ్చాడు.+ మీరు ఇలాగే తనకు భయపడుతూ ఉండాలని, దానివల్ల పాపం చేయకుండా ఉండాలని ఆయన అలా చేశాడు.”+ 21 కాబట్టి ప్రజలు కాస్త దూరంగా నిలబడి ఉన్నారు, అయితే మోషే కారుమబ్బు దగ్గరికి, అంటే సత్యదేవుడు ఉన్న చోటికి వెళ్లాడు.+

22 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు ఇశ్రాయేలీయులతో ఏమని చెప్పాలంటే, ‘నేను పరలోకం నుండి మీతో మాట్లాడానని మీరే స్వయంగా చూశారు.+ 23 మీరు వెండి-బంగారాలతో దేవుళ్లను చేసుకోకూడదు,+ ఎందుకంటే నేను తప్ప వేరే ఏ దేవుడూ మీకు ఉండకూడదు. 24 నా కోసం మట్టితో ఒక బలిపీఠం కట్టి దానిమీద నీ దహనబలుల్ని, నీ సమాధాన బలుల్ని, నీ మందల్ని, నీ పశువుల్ని అర్పించాలి. నా పేరును గుర్తుచేసుకోవడానికి నేను ఎంచుకునే ప్రతీచోట+ నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను దీవిస్తాను. 25 ఒకవేళ నువ్వు నా కోసం రాళ్లతో బలిపీఠం కడుతుంటే, చెక్కిన రాళ్లతో దాన్ని కట్టకూడదు.+ ఎందుకంటే ఉలి తగిలితే అది అపవిత్రం అవుతుంది. 26 బలిపీఠం మీద నీ దిగంబరత్వం* కనిపించకుండా ఉండేలా, మెట్ల మీదుగా నా బలిపీఠం మీదికి ఎక్కకూడదు.’

21 “నువ్వు వాళ్లకు అందజేయాల్సిన న్యాయనిర్ణయాలు ఇవే:+

2 “నువ్వు ఒక హెబ్రీయుణ్ణి దాసుడిగా కొంటే,+ అతను ఆరు సంవత్సరాలు నీకు దాసుడిగా సేవ చేస్తాడు. అయితే ఏడో సంవత్సరం అతను ఏమీ చెల్లించకుండానే స్వతంత్రుడౌతాడు.+ 3 అతను ఒంటరిగా వచ్చివుంటే ఒంటరిగానే వెళ్లిపోతాడు. కానీ అతనికి భార్య ఉంటే, ఆమె కూడా అతనితోపాటు వెళ్లిపోవాలి. 4 ఒకవేళ అతని యజమానే అతనికి భార్యను ఇచ్చివుంటే, ఆమె అతనికి కుమారుల్ని గానీ కూతుళ్లను గానీ కనివుంటే, ఆ భార్య, ఆమె పిల్లలు ఆమె యజమానికి చెందుతారు, అతను ఒంటరిగా వెళ్లిపోతాడు.+ 5 కానీ ఆ దాసుడు, ‘నేను నా యజమానిని, నా భార్యను, నా కుమారుల్ని ప్రేమిస్తున్నాను; నాకు స్వతంత్రుణ్ణి అవ్వాలని లేదు’ అని అంటూ వెళ్లడానికి ఏమాత్రం ఒప్పుకోకపోతే,+ 6 అతని యజమాని అతన్ని సత్యదేవుని దగ్గరికి తీసుకురావాలి. తర్వాత యజమాని అతన్ని తలుపు దగ్గరికి గానీ గుమ్మం దగ్గరికి గానీ తీసుకొచ్చి కదురుతో అతని చెవిని గుచ్చుతాడు; అప్పుడు అతను జీవితాంతం ఆ యజమానికి దాసుడౌతాడు.

7 “ఒకవేళ ఒక వ్యక్తి తన కూతుర్ని దాసురాలిగా అమ్మేస్తే, ఒక దాసుడు స్వతంత్రుడయ్యే విధంగా ఆమె స్వతంత్రురాలు అవ్వదు. 8 ఆమె యజమానికి ఆమె నచ్చక, అతను ఆమెను ఉపపత్నిగా చేసుకోకపోతే, వేరే వ్యక్తి ఆమెను కొనుక్కోవడానికి* అతను అనుమతించవచ్చు. అయితే ఆమెను పరదేశులకు అమ్మే హక్కు అతనికి లేదు, ఎందుకంటే అతను ఆమెకు నమ్మకద్రోహం చేశాడు. 9 ఒకవేళ అతను తన కుమారుని కోసం ఆమెను ఎంచుకుంటే, కూతురికి ఉండే హక్కుల్నే ఆమెకూ కల్పించాలి. 10 ఒకవేళ అతను ఇంకొక స్త్రీని పెళ్లిచేసుకుంటే, ఆహారం విషయంలో, వస్త్రాల విషయంలో, వివాహ ధర్మం+ విషయంలో మొదటి భార్యకు ఏమీ తక్కువ చేయకూడదు. 11 అతను ఆమెకు ఈ మూడు అవసరాలు తీర్చకపోతే, ఆమె ఏమీ చెల్లించకుండానే స్వతంత్రురాలు అవుతుంది.

12 “ఒక వ్యక్తి ఎవరినైనా కొట్టినప్పుడు అతను చనిపోతే, ఆ వ్యక్తికి మరణశిక్ష విధించాలి.+ 13 కానీ అతను అనుకోకుండా అలాచేస్తే, సత్యదేవుడు అలా జరగనిస్తే, ఆ వ్యక్తి పారిపోవడానికి నేను మీ కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాను.+ 14 ఒక వ్యక్తి తోటివాడి మీద చాలా కోపంతో కావాలని అతన్ని చంపితే+ ఆ వ్యక్తిని చంపేయాలి. ఆ వ్యక్తి తనను తాను కాపాడుకోవడానికి నా బలిపీఠం దగ్గరికి వచ్చినా, అతన్ని అక్కడి నుండి తీసుకెళ్లి చంపాలి.+ 15 అమ్మనైనా, నాన్ననైనా కొట్టే వ్యక్తికి మరణశిక్ష విధించాలి.+

16 “ఒక వ్యక్తి ఎవరినైనా అపహరించి+ అతన్ని అమ్మేస్తే, లేదా అపహరించిన వ్యక్తి దగ్గర అతను దొరికితే,+ అపహరించిన వ్యక్తికి మరణశిక్ష విధించాలి.+

17 “అమ్మనైనా, నాన్ననైనా శపించే వ్యక్తికి మరణశిక్ష విధించాలి.+

18 “మనుషులు గొడవపడుతుండగా, ఒక వ్యక్తి తన తోటివాణ్ణి రాయితో లేదా పిడికిలితో* కొట్టాడనుకోండి, దానివల్ల అతను చనిపోలేదు కానీ మంచం పట్టాడనుకోండి. అప్పుడు ఇలా చేయాలి: 19 అతను లేచి, తన చేతికర్ర సాయంతో బయట తిరగగలిగితే, కొట్టిన వ్యక్తికి శిక్ష వేయకూడదు. అయితే, గాయపడిన వ్యక్తి పూర్తిగా బాగయ్యేవరకు ఎంతకాలం పనిచేయలేకపోయాడో దానికి సరిపడా నష్టపరిహారాన్ని మాత్రం అతను చెల్లించాలి.

20 “ఒక వ్యక్తి తన దాసుణ్ణి గానీ దాసురాలిని గానీ కర్రతో కొట్టినప్పుడు, ఆ దాసుడు లేదా దాసురాలు అతని చేతిలో చనిపోతే, అతనికి తప్పకుండా శిక్ష విధించాలి.+ 21 కానీ ఆ దాసుడు ఒకట్రెండు రోజులు బ్రతికితే, యజమానికి శిక్ష వేయకూడదు, ఎందుకంటే ఆ దాసుడు తన యజమాని సొత్తు.

22 “మనుషులు పోట్లాడుకుంటున్నప్పుడు ఒక గర్భిణీ స్త్రీకి దెబ్బ తగిలి, నెలలు నిండకుండానే ఆమె బిడ్డను కన్నది*+ కానీ ప్రాణాపాయం* ఏమీ జరగలేదనుకోండి; అప్పుడు ఆమె భర్త మోపే నష్టపరిహారాన్ని గాయం చేసిన వ్యక్తి చెల్లించాలి. న్యాయమూర్తుల+ ద్వారా అతను దాన్ని చెల్లించాలి. 23 కానీ ప్రాణాపాయం జరిగితే, ప్రాణానికి ప్రాణం చెల్లించాలి.+ 24 కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు,+ 25 వాతకు వాత, గాయానికి గాయం, దెబ్బకు దెబ్బ చెల్లించాలి.

26 “ఒక వ్యక్తి తన దాసుని కంటిమీద గానీ, దాసురాలి కంటిమీద గానీ కొట్టి దాన్ని పోగొడితే, అందుకు నష్టపరిహారంగా అతను ఆ దాసుణ్ణి లేదా దాసురాలిని స్వతంత్రుల్ని చేయాలి.+ 27 అతను తన దాసుడి పంటిని గానీ, దాసురాలి పంటిని గానీ ఊడగొడితే, అందుకు నష్టపరిహారంగా అతను ఆ దాసుణ్ణి లేదా దాసురాలిని స్వతంత్రుల్ని చేయాలి.

28 “ఒక ఎద్దు పురుషుణ్ణి గానీ స్త్రీని గానీ పొడవడం వల్ల అతను లేదా ఆమె చనిపోతే, ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి,+ దాని మాంసం తినకూడదు; అయితే ఆ ఎద్దు యజమానికి శిక్ష పడదు. 29 ఒకవేళ ఆ ఎద్దుకు పొడిచే అలవాటు ఉండి, ఆ విషయం గురించి దాని యజమానిని హెచ్చరించినా అతను దాన్ని అదుపులో ఉంచకపోవడంవల్ల అది ఒక పురుషుణ్ణి గానీ స్త్రీని గానీ చంపితే, ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి; దాని యజమానికి కూడా మరణశిక్ష విధించాలి. 30 అతని మీద ఏదైనా నష్టపరిహారం* మోపబడితే, అతను తన మీద మోపబడినదంతా తన ప్రాణ విమోచన వెలగా చెల్లించాలి. 31 అది ఒక వ్యక్తి కుమారుణ్ణి గానీ కూతుర్ని గానీ పొడిస్తే, అప్పుడు కూడా ఆ ఎద్దు యజమానికి ఈ న్యాయనిర్ణయం ప్రకారమే చేయాలి. 32 ఒకవేళ ఆ ఎద్దు ఒక దాసుడినో, దాసురాలినో పొడిస్తే, అతను వాళ్ల యజమానికి 30షెకెల్‌లు* చెల్లించాలి, ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి.

33 “ఒకవేళ ఒక వ్యక్తి, ఒక గుంట మీదున్న కప్పు తీసి లేదా గుంట తవ్వి దాన్ని మళ్లీ కప్పకపోవడం వల్ల ఒక ఎద్దు గానీ గాడిద గానీ అందులో పడిపోతే, 34 ఆ గుంట యజమాని నష్టపరిహారం చెల్లించాలి.+ అతను ఆ జంతువు యజమానికి దాన్ని చెల్లించాలి, చనిపోయిన జంతువు అతనిది అవుతుంది. 35 ఒక వ్యక్తి ఎద్దు ఇంకో వ్యక్తి ఎద్దును గాయపర్చడం వల్ల అది చనిపోతే, వాళ్లు బ్రతికున్న ఎద్దును అమ్మి, వచ్చిన డబ్బును ఇద్దరూ పంచుకోవాలి; చనిపోయిన జంతువును కూడా ఇద్దరూ పంచుకోవాలి. 36 కానీ ఆ ఎద్దుకు పొడిచే అలవాటు ఉందని తెలిసి కూడా దాని యజమాని దాన్ని అదుపులో ఉంచకపోతే, అతను ఎద్దుకు ఎద్దునిచ్చి నష్టపరిహారం చెల్లించాలి; చనిపోయిన ఎద్దు అతనిది అవుతుంది.

22 “ఒక వ్యక్తి, ఎద్దును గానీ గొర్రెను గానీ దొంగిలించి దాన్ని వధిస్తే లేదా అమ్మేస్తే, అతను ఆ ఎద్దుకు బదులుగా ఐదు ఎద్దుల్ని, ఆ గొర్రెకు బదులుగా నాలుగు గొర్రెల్ని నష్టపరిహారంగా చెల్లించాలి.+

2 (“ఒక దొంగ,+ ఇంటికి కన్నం వేస్తుండగా దొరికిపోయి, ప్రజలు కొట్టడంవల్ల అతను చనిపోతే, అతని విషయంలో రక్తాపరాధం ఉండదు. 3 కానీ సూర్యోదయం తర్వాత అలా జరిగితే, అతని విషయంలో రక్తాపరాధం ఉంటుంది.)

“అతను నష్టపరిహారం చెల్లించాలి. ఇవ్వడానికి అతని దగ్గర ఏమీ లేకపోతే, అతను దొంగిలించిన వాటికి నష్టపరిహారం చెల్లించడం కోసం అతన్ని అమ్మేయాలి. 4 అతను దొంగిలించిన జంతువు, అది ఎద్దు గానీ, గాడిద గానీ, గొర్రె గానీ అది అతని దగ్గర సజీవంగా దొరికితే, అతను రెండింతలు నష్టపరిహారం చెల్లించాలి.

5 “ఒక వ్యక్తి తన జంతువుల్ని మేపడానికి పొలానికి గానీ, ద్రాక్షతోటకు గానీ తీసుకెళ్లి వేరేవాళ్ల పొలంలో వాటిని మేయనిస్తే, అతను తన పొలంలోని లేదా ద్రాక్షతోటలోని శ్రేష్ఠమైన వాటితో నష్టపరిహారం చెల్లించాలి.

6 “ఒకవేళ నిప్పు చెలరేగి, ముళ్లపొదలకు అంటుకొని పనల్ని* గానీ, కోయని ధాన్యాన్ని గానీ, పొలాన్ని గానీ కాల్చేస్తే, ఆ నిప్పును అంటించిన వ్యక్తే కాలిపోయినవాటికి నష్టపరిహారం చెల్లించాలి.

7 “ఒక వ్యక్తి తన డబ్బును గానీ వస్తువుల్ని గానీ తన పొరుగువాడి దగ్గర ఉంచినప్పుడు, అతని ఇంట్లో నుండి అవి దొంగిలించబడి, దొంగ దొరికితే, ఆ దొంగ రెండింతలు నష్టపరిహారం చెల్లించాలి.+ 8 ఒకవేళ ఆ దొంగ దొరకకపోతే, ఆ ఇంటి యజమాని తన పొరుగువాడి వస్తువుల్ని తీసుకున్నాడో లేదో నిర్ధారించడానికి అతన్ని సత్యదేవుని ముందుకు తీసుకురావాలి.+ 9 అన్యాయంగా సొంతం చేసుకునే వాటికి సంబంధించిన అన్ని వివాదాల విషయంలో, అది ఎద్దు గురించైనా, గాడిద గురించైనా, గొర్రె గురించైనా, వస్త్రం గురించైనా, పోయిన ఇంక దేని గురించైనా అతను, ‘ఇది నాది!’ అని అంటే, దాని విషయంలో ఆ ఇద్దరూ తమ వివాదాన్ని సత్యదేవుని ముందుకు తీసుకురావాలి.+ దేవుడు ఎవరినైతే దోషిగా ప్రకటిస్తాడో ఆ వ్యక్తి తన పొరుగువాడికి రెండింతలు నష్టపరిహారం చెల్లించాలి.+

10 “ఒక వ్యక్తి తన గాడిదనైనా, ఎద్దునైనా, గొర్రెనైనా, వేరే ఏ పశువునైనా పొరుగువాడికి ఇచ్చి అతని దగ్గర ఉంచమన్నప్పుడు అది చనిపోయినా, దెబ్బ తగిలి కుంటిదైనా, ఎవరూ చూడనప్పుడు వేరేవాళ్లు దాన్ని తోలుకెళ్లినా 11 వాళ్లిద్దరి మధ్య యెహోవా ముందు ఒక ప్రమాణం జరగాలి. ఆ వ్యక్తి తన పొరుగువాడి వస్తువుల మీద చెయ్యి వేయలేదని ఒట్టేయాలి; వాటి యజమాని దాన్ని అంగీకరించాలి. రెండో వ్యక్తి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.+ 12 కానీ ఆ జంతువు అతని దగ్గర నుండి దొంగిలించబడితే, అతను దాని యజమానికి నష్టపరిహారం చెల్లించాలి. 13 ఒకవేళ క్రూరమృగం దాన్ని చీల్చేసి ఉంటే, అందుకు రుజువుగా అతను దాన్ని తీసుకురావాలి. క్రూరమృగం చీల్చిన దానికి అతను నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.

14 “కానీ ఒక వ్యక్తి తన పొరుగువాడి దగ్గర చేబదులుగా ఒక జంతువును అడిగి తీసుకున్నాక, దాని యజమాని దాని దగ్గర లేనప్పుడు అది కుంటిదైతే లేదా చనిపోతే, దాన్ని తీసుకున్న వ్యక్తి నష్టపరిహారం చెల్లించాలి. 15 దాని యజమాని దాని దగ్గర ఉంటే, అతను నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ దాన్ని అద్దెకు తీసుకొని ఉంటే, అద్దె కోసం ఇచ్చే డబ్బే నష్టపరిహారం అవుతుంది.

16 “ఒకవేళ ఒక పురుషుడు నిశ్చితార్థంకాని ఒక కన్యను ప్రలోభపెట్టి ఆమెతో పడుకుంటే, ఆమె అతని భార్య అయ్యేలా అతను ఆమె కోసం కన్యాశుల్కం చెల్లించాలి.+ 17 ఒకవేళ ఆమె తండ్రి ఆమెను అతనికి ఇవ్వడానికి ఏమాత్రం ఒప్పుకోకపోతే, అతను కన్యాశుల్కం లెక్క ప్రకారం డబ్బు చెల్లించాలి.

18 “మంత్రగత్తెను బ్రతకనివ్వకూడదు.+

19 “జంతువుతో పడుకునే వ్యక్తిని ఖచ్చితంగా చంపేయాలి.+

20 “యెహోవాకు తప్ప వేరే దేవుళ్లకు బలులు అర్పించేవాళ్లను నాశనం చేయాలి.+

21 “పరదేశితో చెడుగా వ్యవహరించకూడదు, అతన్ని అణచివేయకూడదు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో మీరు పరదేశులుగా నివసించారు.+

22 “విధవరాల్ని గానీ తండ్రిలేని పిల్లల్ని* గానీ బాధించకూడదు.+ 23 నువ్వు వాళ్లను ఎప్పుడైనా బాధించడం వల్ల వాళ్లు నాకు మొరపెడితే, నేను తప్పకుండా వాళ్ల మొర వింటాను;+ 24 అప్పుడు నా కోపం రగులుకుంటుంది, నేను కత్తితో మిమ్మల్ని చంపుతాను; అప్పుడు మీ భార్యలు విధవరాళ్లు అవుతారు, మీ పిల్లలు తండ్రిలేనివాళ్లు అవుతారు.

25 “నీతోపాటు నివసిస్తున్న నా ప్రజల్లోని పేదవాళ్లలో ఎవరికైనా నువ్వు అప్పు ఇస్తే, నువ్వు అతనికి వడ్డీ వ్యాపారిలా* ఉండకూడదు. అతని దగ్గర వడ్డీ వసూలు చేయకూడదు.+

26 “ఒకవేళ నువ్వు నీ పొరుగువాడి వస్త్రాన్ని తాకట్టుగా* తీసుకుంటే, సూర్యుడు అస్తమించేలోపు దాన్ని అతనికి తిరిగిచ్చేయాలి. 27 ఎందుకంటే, తన శరీరాన్ని కప్పుకోవడానికి అతని దగ్గర ఉన్న వస్త్రం అదొక్కటే; అది లేకపోతే అతను దేన్ని కప్పుకొని పడుకుంటాడు? అతను నాకు మొరపెట్టినప్పుడు నేను ఖచ్చితంగా వింటాను, ఎందుకంటే నేను కనికరం* గలవాణ్ణి.+

28 “నువ్వు దేవుణ్ణి గానీ నీ ప్రజల ప్రధానుణ్ణి* గానీ శపించకూడదు.*+

29 “నువ్వు నీ పంట సమృద్ధిలో నుండి, నీ తొట్ల* నుండి పొంగిపొర్లే దానిలో నుండి అర్పణలు తేవడానికి సంకోచించకూడదు.+ నీ కుమారుల్లో మొదటివాణ్ణి నాకివ్వాలి.+ 30 నీ ఎద్దు విషయంలో, నీ గొర్రె విషయంలో నువ్వు చేయాల్సింది ఏమిటంటే, అది పుట్టాక ఏడురోజుల పాటు దాని తల్లితో ఉండాలి; ఎనిమిదో రోజున నువ్వు దాన్ని నాకివ్వాలి.

31 “మీరు నాకు పవిత్రమైన ప్రజలుగా ఉండాలి,+ పొలంలో క్రూరమృగం చేత చీల్చబడిన దేని మాంసాన్నీ మీరు తినకూడదు.+ దాన్ని కుక్కలకు పారేయాలి.

23 “నిజంకాని వార్తను నువ్వు ప్రచారం చేయకూడదు.+ ద్రోహబుద్ధితో అన్యాయపు సాక్ష్యం చెప్పడం ద్వారా దుష్టుడికి సహకరించకు.+ 2 చెడు చేయడానికి సమూహంతో పాటు వెళ్లకూడదు. సమూహాన్ని సంతోషపెట్టాలనే ఉద్దేశంతో అబద్ధ సాక్ష్యం చెప్పి న్యాయాన్ని పక్కదారి పట్టించకూడదు. 3 పేదవాడికి సంబంధించిన వివాదంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.+

4 “నీ శత్రువుకు చెందిన ఎద్దు గానీ గాడిద గానీ దారితప్పి తిరగడం నువ్వు చూస్తే, నువ్వు తప్పకుండా దాన్ని తీసుకెళ్లి అతనికి ఇవ్వాలి.+ 5 నిన్ను ద్వేషించే వ్యక్తికి చెందిన గాడిద దాని బరువు కింద కూలబడి ఉండడం నువ్వు చూస్తే, దాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోకూడదు. ఆ బరువును తీసేయడానికి నువ్వు తప్పకుండా అతనికి సహాయం చేయాలి.+

6 “నీ మధ్య ఉన్న పేదవాడి వివాదం విషయంలో తీర్పు జరుగుతున్నప్పుడు నువ్వు న్యాయాన్ని పక్కదారి పట్టించకూడదు.+

7 “అబద్ధ ఆరోపణ జోలికి వెళ్లొద్దు; నిర్దోషిని, నీతిమంతుణ్ణి చంపొద్దు. ఎందుకంటే దుష్టుణ్ణి నేను నీతిమంతునిగా ప్రకటించను.*+

8 “లంచం తీసుకోకూడదు, ఎందుకంటే అది స్పష్టంగా చూడగలిగేవాళ్లకు గుడ్డితనం కలిగిస్తుంది, నిజాయితీపరుల తీర్పుల్ని మార్చేస్తుంది.+

9 “పరదేశిని అణచివేయకూడదు. పరదేశిగా ఉంటే ఎలా అనిపిస్తుందో* మీకు తెలుసు. ఎందుకంటే, ఐగుప్తు దేశంలో మీరు పరదేశులుగా నివసించారు.

10 “ఆరు సంవత్సరాల పాటు నువ్వు నీ భూమిలో విత్తనాలు విత్తి, దాని పంట కూర్చుకోవాలి.+ 11 కానీ ఏడో సంవత్సరం దాన్ని సాగుచేయకుండా బీడుగా వదిలేయాలి. అప్పుడు దానిలో ఏమైనా పండితే, నీ మధ్య ఉన్న పేదవాళ్లు దాన్ని తింటారు, వాళ్లు తినగా మిగిలింది అడవి జంతువులు తింటాయి. నీ ద్రాక్షతోట విషయంలో, నీ ఒలీవ తోట విషయంలో కూడా నువ్వు ఇలాగే చేయాలి.

12 “ఆరు రోజులు నువ్వు పని చేయాలి; కానీ ఏడో రోజున నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. దానివల్ల నీ ఎద్దు, నీ గాడిద కూడా విశ్రాంతి తీసుకుంటాయి; నీ దాసురాలి కుమారుడు, పరదేశి సేదదీరుతారు.+

13 “నేను మీతో చెప్పిందంతా చేసేలా మీరు జాగ్రత్తపడాలి.+ వేరే దేవుళ్ల పేర్లను మీరు పలకకూడదు; అవి మీ నోట వినిపించకూడదు.+

14 “సంవత్సరానికి మూడుసార్లు మీరు నాకు పండుగ ఆచరించాలి.+ 15 మీరు పులవని రొట్టెల పండుగ ఆచరించాలి.+ నేను మీకు ముందే ఆజ్ఞాపించినట్టు, అబీబు* నెలలో నియమిత సమయంలో ఏడురోజుల పాటు మీరు పులవని రొట్టెలు తింటారు.+ ఎందుకంటే మీరు ఐగుప్తు నుండి బయటికి వచ్చింది ఆ సమయంలోనే. మీలో ఎవ్వరూ నా ముందు వట్టి చేతులతో కనబడకూడదు.+ 16 అంతేకాదు, మీరు కోత పండుగ* కూడా ఆచరించాలి, మీరు పొలంలోని మొదటి పంట కోసే సమయంలో దాన్ని ఆచరించాలి;+ అలాగే సమకూర్చే పండుగ* కూడా ఆచరించాలి; సంవత్సరం చివర్లో, అంటే పొలంలో మీరు చేసిన కష్టానికి ఫలాలు కూర్చుకుంటున్నప్పుడు దాన్ని ఆచరించాలి.+ 17 సంవత్సరంలో మూడుసార్లు మీలోని పురుషులంతా నిజమైన ప్రభువు అయిన యెహోవా ముందు కనిపించాలి.+

18 “నాకు అర్పించే బలుల రక్తంలో పులిసిందేదీ కలపకూడదు. నా పండుగల్లో అర్పించే కొవ్వును తెల్లారేవరకు ఉండనియ్యకూడదు.

19 “నీ భూమిలో మొదట పండిన ఫలాల్లో శ్రేష్ఠమైనవాటిని నీ దేవుడైన యెహోవా మందిరానికి తీసుకురావాలి.+

“మేకపిల్లను దాని తల్లి పాలలో ఉడకబెట్టకూడదు.+

20 “దారిలో మిమ్మల్ని కాపాడడానికి, నేను సిద్ధం చేసిన చోటుకు మిమ్మల్ని తీసుకురావడానికి నేను మీకు ముందుగా ఒక దేవదూతను పంపిస్తున్నాను.+ 21 అతను చెప్పేది శ్రద్ధగా వింటూ, అతని మాటకు లోబడండి. అతని మీద తిరుగుబాటు చేయకండి, అతను మీ తప్పుల్ని మన్నించడు;+ ఎందుకంటే అతను నా పేరున వస్తున్నాడు. 22 అయితే మీరు అతని మాటకు జాగ్రత్తగా లోబడుతూ, నేను చెప్పిందంతా చేస్తే, మీ శత్రువులకు నేను విరోధిగా ఉంటాను, మిమ్మల్ని వ్యతిరేకించేవాళ్లను వ్యతిరేకిస్తాను. 23 ఎలాగంటే, నా దూత మీకు ముందుగా వెళ్లి అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు ఉన్న చోటికి మిమ్మల్ని తీసుకొస్తాడు; నేను వాళ్లను సమూలంగా నాశనం చేస్తాను.+ 24 మీరు వాళ్ల దేవుళ్లకు వంగి నమస్కారం చేయకూడదు, వాటిని పూజించడానికి అస్సలు ఒప్పుకోకూడదు, వాళ్ల పద్ధతుల్ని అనుకరించకూడదు.+ బదులుగా మీరు వాటిని కూల్చేయాలి, వాళ్ల పూజా స్తంభాల్ని నలగ్గొట్టాలి.+ 25 మీరు మీ దేవుడైన యెహోవాను సేవించాలి,+ అప్పుడు ఆయన మీ ఆహారాన్ని, నీళ్లను దీవిస్తాడు.+ నేను మీ మధ్య నుండి అనారోగ్యాన్ని తీసేస్తాను.+ 26 నీ దేశంలో స్త్రీలకు గర్భస్రావం కలగదు, వాళ్లు గొడ్రాళ్లుగా ఉండరు;+ అంతేకాదు, నేను నీకు దీర్ఘాయుష్షును* ఇస్తాను.

27 “మీరు అక్కడికి వెళ్లకముందే ఆ ప్రజలు నేనంటే భయపడేలా చేస్తాను,+ మీకు ఎదురయ్యే ప్రజలందర్నీ నేను అయోమయంలో పడేస్తాను; మీ శత్రువులందరూ మీ ముందు ఓడిపోయి పారిపోయేలా* చేస్తాను.+ 28 మీరు అక్కడికి వెళ్లకముందే వాళ్ల గుండెలు జారిపోయేలా చేస్తాను;*+ దానివల్ల హివ్వీయులు, కనానీయులు, హిత్తీయులు మీ ముందు నుండి పారిపోతారు.+ 29 నేను ఒకే సంవత్సరంలో వాళ్లను మీ ముందు నుండి వెళ్లగొట్టను; అలాచేస్తే దేశం నిర్జనమైపోతుంది, దానివల్ల మీకు హానిచేసే అడవి జంతువుల సంఖ్య పెరిగిపోతుంది.+ 30 కాబట్టి, మీ సంఖ్య పెరిగి మీరు దేశాన్ని సొంతం చేసుకునే వరకు నేను మెల్లమెల్లగా వాళ్లను మీ ముందు నుండి వెళ్లగొడతాను.+

31 “నేను ఎర్రసముద్రం దగ్గర నుండి ఫిలిష్తీయుల సముద్రం* వరకు, ఎడారి దగ్గర నుండి నది* వరకు మీకు సరిహద్దు నియమిస్తాను;+ ఆ దేశంలో నివసించేవాళ్లను నేను మీ చేతికి అప్పగిస్తాను, మీరు వాళ్లను మీ ముందు నుండి వెళ్లగొడతారు.+ 32 మీరు వాళ్లతో గానీ, వాళ్ల దేవుళ్లతో గానీ ఒప్పందం చేసుకోకూడదు.+ 33 నాకు విరోధంగా వాళ్లు మీతో పాపం చేయించకుండా ఉండేలా, వాళ్లు మీ దేశంలో ఉండకూడదు. మీరు వాళ్ల దేవుళ్లను సేవిస్తే, అది తప్పకుండా మీకు ఉరిగా తయారౌతుంది.”+

24 తర్వాత ఆయన మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు, అహరోను, నాదాబు, అబీహు,+ అలాగే ఇశ్రాయేలు పెద్దల్లో 70 మంది యెహోవా దగ్గరికి ఎక్కివెళ్లి, కాస్త దూరం నుండి వంగి నమస్కారం చేయండి. 2 మోషే ఒక్కడే యెహోవా దగ్గరికి వెళ్లాలి; మిగతావాళ్లు దగ్గరికి వెళ్లకూడదు. అలాగే ప్రజలు అతనితో పాటు పైకి వెళ్లకూడదు.”+

3 అప్పుడు మోషే ప్రజల దగ్గరికి వచ్చి యెహోవా చెప్పిన మాటలన్నీ, న్యాయనిర్ణయాలన్నీ వాళ్లకు చెప్పాడు.+ దానికి ప్రజలంతా ముక్తకంఠంతో, “యెహోవా చెప్పిన మాటలన్నీ పాటించడం మాకు ఇష్టమే” అన్నారు.+ 4 కాబట్టి మోషే యెహోవా చెప్పిన మాటలన్నీ రాసిపెట్టాడు.+ తర్వాత అతను ఉదయాన్నే లేచి ఆ పర్వతం అడుగుభాగం దగ్గర ఒక బలిపీఠాన్ని కట్టి, ఇశ్రాయేలు 12 గోత్రాలకు సూచనగా 12 స్తంభాల్ని నిలబెట్టాడు. 5 తర్వాత అతను ఇశ్రాయేలీయుల్లో నుండి కొందరు యువకుల్ని ఎంచుకున్నాడు; వాళ్లు యెహోవాకు దహనబలుల్ని అర్పించారు, అలాగే సమాధాన బలులుగా+ ఎద్దుల్ని అర్పించారు. 6 అప్పుడు మోషే సగం రక్తాన్ని గిన్నెల్లోకి తీసుకొని, ఇంకో సగం రక్తాన్ని బలిపీఠం మీద చిలకరించాడు. 7 తర్వాత అతను ఒప్పంద పుస్తకాన్ని తీసుకొని దానిలో ఉన్న విషయాల్ని ప్రజలకు బిగ్గరగా చదివి వినిపించాడు.+ అప్పుడు వాళ్లు, “యెహోవా చెప్పిందంతా చేయడం మాకు ఇష్టమే, మేము లోబడి ఉంటాం” అన్నారు.+ 8 కాబట్టి మోషే ఆ రక్తాన్ని తీసుకొని ప్రజలమీద చిలకరించి,+ “ఈ రక్తం, ఈ మాటలన్నిటికీ అనుగుణంగా యెహోవా మీతో చేసిన ఒప్పందాన్ని అమల్లోకి తెస్తుంది” అన్నాడు.+

9 మోషే, అహరోను, నాదాబు, అబీహు, అలాగే ఇశ్రాయేలు పెద్దల్లో 70 మంది పర్వతం మీదికి ఎక్కివెళ్లి, 10 ఇశ్రాయేలు దేవుణ్ణి చూశారు.+ ఆయన కాళ్లకింద నీలం రాయితో చేసిన గచ్చు లాంటిది ఉంది; అది ఆకాశమంత స్వచ్ఛంగా ఉంది.+ 11 ఆయన ఇశ్రాయేలీయుల్లోని ఆ ప్రముఖ పురుషులకు+ ఏ హానీ చేయలేదు. వాళ్లు తింటూ, తాగుతూ ఉన్నప్పుడు సత్యదేవుని దర్శనం చూశారు.

12 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు పర్వతం మీదికి ఎక్కి నా దగ్గరికి వచ్చి, అక్కడే ఉండు. వాళ్లకు బోధించడం కోసం నేను రాసే నియమాలు, ఆజ్ఞలు ఉన్న రాతి పలకల్ని నీకు ఇస్తాను.”+ 13 కాబట్టి మోషే తన సేవకుడైన యెహోషువను+ తీసుకొని బయల్దేరాడు, మోషే సత్యదేవుడు ఉన్న పర్వతం మీదికి ఎక్కివెళ్లాడు.+ 14 కానీ ఆ పెద్దలతో అతను ఇలా చెప్పాడు: “మేము మీ దగ్గరికి వచ్చేవరకు మా కోసం ఇక్కడే వేచివుండండి.+ అహరోను, హూరు+ మీతోపాటే ఉన్నారు. కాబట్టి ఎవరికైనా వివాదం ఉంటే వాళ్లు ఆ ఇద్దరి దగ్గరికి వెళ్లాలి.”+ 15 తర్వాత మేఘం ఆ పర్వతాన్ని కమ్ముతుండగా+ మోషే ఆ పర్వతం మీదికి ఎక్కాడు.

16 యెహోవా మహిమ+ సీనాయి పర్వతం+ మీద అలాగే నిలిచివుంది, మేఘం ఆరురోజుల పాటు ఆ పర్వతాన్ని కమ్మేసింది. ఆయన ఏడో రోజున మేఘంలో నుండి మోషేను పిలిచాడు. 17 దాన్ని చూస్తున్న ఇశ్రాయేలీయులకు యెహోవా మహిమ పర్వత శిఖరం మీద దహిస్తున్న అగ్నిలా కనిపించింది. 18 తర్వాత మోషే ఆ మేఘంలోకి ప్రవేశించి పర్వతం పైకి ఎక్కివెళ్లాడు. మోషే 40 పగళ్లు, 40 రాత్రులు ఆ పర్వతం మీద ఉన్నాడు.+

25 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 2 “నా కోసం కానుకలు తీసుకురమ్మని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు; కానుక ఇచ్చేలా ఎవరి హృదయం వాళ్లను ప్రేరేపిస్తుందో వాళ్ల దగ్గర మీరు నా కోసం కానుకలు తీసుకోవాలి.+ 3 మీరు వాళ్ల దగ్గర వేటిని కానుకలుగా తీసుకోవాలంటే: బంగారం,+ వెండి,+ రాగి,+ 4 నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని,* ముదురు ఎరుపు దారం,* సన్నని నార, మేక వెంట్రుకలు, 5 ఎర్రరంగు అద్దిన పొట్టేలు తోళ్లు, సముద్రవత్సల* తోళ్లు, తుమ్మ చెక్క,+ 6 దీపాల కోసం నూనె,+ అభిషేక తైలంలో+ అలాగే పరిమళ ధూపద్రవ్యంలో కలపడానికి సాంబ్రాణి,+ 7 ఏఫోదులో,+ వక్షపతకంలో+ పెట్టడానికి సులిమాని రాళ్లు, ఇతర రంగురాళ్లు. 8 వాళ్లు నా కోసం ఒక పవిత్రమైన స్థలాన్ని నిర్మించాలి, అక్కడ నేను వాళ్లమధ్య నివసిస్తాను.*+ 9 దాన్ని, అంటే గుడారాన్నీ, దాని వస్తువులన్నిటినీ నేను నీకు చూపిస్తున్న నమూనా ప్రకారం ఉన్నదున్నట్టు చేయాలి.+

10 “వాళ్లు తుమ్మ చెక్కతో ఒక మందసం తయారుచేయాలి; దాని పొడవు రెండున్నర మూరలు,* వెడల్పు ఒకటిన్నర మూరలు, ఎత్తు ఒకటిన్నర మూరలు ఉండాలి.+ 11 తర్వాత నువ్వు దానికి స్వచ్ఛమైన బంగారు రేకు తొడగాలి.+ దాని లోపల, బయట దాన్ని తొడగాలి; దాని చుట్టూ బంగారంతో అంచును తయారుచేయాలి.+ 12 ఆ మందసం కోసం నువ్వు నాలుగు బంగారు ఉంగరాలు పోతపోసి, దాని నాలుగు కాళ్లకు పైన వాటిని అంటించాలి; ఒకవైపు రెండు ఉంగరాలు, ఇంకోవైపు రెండు ఉంగరాలు ఉండేలా అంటించాలి. 13 అలాగే నువ్వు తుమ్మ చెక్కతో కర్రలు తయారుచేసి, వాటికి బంగారు రేకు తొడగాలి.+ 14 మందసాన్ని మోసుకెళ్లడం కోసం ఆ కర్రల్ని మందసం రెండు వైపుల ఉన్న ఉంగరాల్లో పెట్టాలి. 15 ఆ కర్రలు మందసం ఉంగరాల్లో అలాగే ఉండిపోతాయి; వాటిని బయటికి తీయకూడదు.+ 16 నువ్వు ఆ మందసంలో నేను నీకిచ్చే రాతి పలకల్ని* పెట్టాలి.+

17 “ఆ మందసానికి నువ్వు స్వచ్ఛమైన బంగారంతో ఒక మూత తయారుచేయాలి; దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూరలు ఉండాలి.+ 18 అలాగే, నువ్వు రెండు బంగారు కెరూబుల్ని తయారుచేయాలి; వాటిని ఆ మూత రెండు కొనల మీద సుత్తితో మలచాలి.*+ 19 ఆ కెరూబుల్ని మూత రెండు కొనల మీద తయారుచేయాలి; ఈ కొన మీద ఒక కెరూబు, ఆ కొన మీద ఒక కెరూబు ఉండాలి. 20 ఆ కెరూబుల రెండు రెక్కలు పైకి విప్పి ఉండాలి, అవి వాటి రెక్కలతో ఆ మూతను కప్పాలి,+ ఆ కెరూబులు ఎదురెదురుగా ఉండాలి. వాటి ముఖాలు మూత వైపు తిరిగి ఉండాలి. 21 నువ్వు ఆ మూతను+ మందసం మీద పెట్టాలి; ఆ మందసంలో నేను నీకిచ్చే రాతి పలకల్ని* ఉంచాలి. 22 అక్కడ నేను నీకు కనిపించి, ఆ మూత మీద నుండి నీతో మాట్లాడతాను.+ సాక్ష్యపు మందసం మీదున్న కెరూబుల మధ్య నుండి నేను నీతో మాట్లాడతాను, నువ్వు ఇశ్రాయేలీయులకు ఇవ్వాల్సిన ఆజ్ఞలన్నిటినీ నీకు తెలియజేస్తాను.

23 “అలాగే నువ్వు తుమ్మ చెక్కతో ఒక బల్ల+ తయారుచేయాలి. దాని పొడవు రెండు మూరలు, వెడల్పు ఒక మూర, ఎత్తు ఒకటిన్నర మూరలు ఉండాలి.+ 24 నువ్వు దానికి స్వచ్ఛమైన బంగారు రేకు తొడిగి, బల్ల చుట్టూ బంగారంతో అంచును తయారుచేయాలి. 25 అలాగే దాని చుట్టూ బెత్తెడు* వెడల్పు ఉండే పట్టీ చేయాలి, ఆ పట్టీ చుట్టూ బంగారంతో అంచును చేయాలి. 26 నువ్వు దాని కోసం నాలుగు బంగారు ఉంగరాలు చేసి, బల్లకు నాలుగు కాళ్లు అంటించిన చోట వాటిని తగిలించాలి. 27 బల్లను మోసుకెళ్లే కర్రల్ని పట్టివుంచడానికి ఆ ఉంగరాలు పట్టీకి దగ్గరగా ఉండాలి. 28 నువ్వు తుమ్మ చెక్కతో కర్రలు తయారుచేసి వాటికి బంగారు రేకు తొడగాలి, ఆ కర్రలతో బల్లను మోసుకెళ్లాలి.

29 “అలాగే నువ్వు దాని పళ్లేలను, గిన్నెల్ని, కూజాల్ని, పానీయార్పణ పాత్రల్ని స్వచ్ఛమైన బంగారంతో తయారుచేయాలి.+ 30 నువ్వు ఆ బల్ల మీద సముఖపు రొట్టెలు* ఉంచాలి, అవి నా ముందు ఎప్పుడూ ఉండాలి.+

31 “అలాగే నువ్వు స్వచ్ఛమైన బంగారంతో ఒక దీపస్తంభం+ చేయాలి. దాన్ని నువ్వు సుత్తితో మలచాలి. దాని అడుగుభాగాన్ని, కాండాన్ని, కొమ్మల్ని, కలశాల్ని, మొగ్గల్ని, పువ్వుల్ని ఒకే బంగారు ముక్కతో తయారుచేయాలి, దేన్నీ విడిగా చేయకూడదు.+ 32 ఆ దీపస్తంభం పక్కల నుండి ఆరు కొమ్మలు బయటికి వస్తాయి; మూడు కొమ్మలు ఒకవైపు నుండి, మూడు కొమ్మలు ఇంకోవైపు నుండి వస్తాయి. 33 ఒక జట్టు కొమ్మల మీద బాదం పువ్వు ఆకారంలో మూడు కలశాలు ఉంటాయి; ఆ కలశాల మధ్య ఒక మొగ్గ, ఒక పువ్వు ఉండేలా తయారుచేయాలి. అలాగే రెండో జట్టు కొమ్మల మీద కూడా బాదం పువ్వు ఆకారంలో మూడు కలశాలు ఉంటాయి; ఆ కలశాల మధ్య ఒక మొగ్గ, ఒక పువ్వు ఉండేలా తయారుచేయాలి. దీపస్తంభం కాండం నుండి ఆరు కొమ్మలు ఈ విధంగా బయటికి రావాలి. 34 దీపస్తంభం కాండం మీద బాదం పువ్వు ఆకారంలో నాలుగు కలశాలు ఉంటాయి; ఆ కలశాల మధ్య ఒక మొగ్గ, ఒక పువ్వు ఉండేలా తయారుచేయాలి. 35 కాండం నుండి మొదలయ్యే మొదటి రెండు కొమ్మల కింద ఒక మొగ్గ, తర్వాతి రెండు కొమ్మల కింద ఒక మొగ్గ, ఆ తర్వాతి రెండు కొమ్మల కింద ఒక మొగ్గ ఉంటుంది. కాండం నుండి మొదలయ్యే ఆరు కొమ్మలకు అలా ఉండాలి. 36 మొగ్గలు, కొమ్మలు, అలాగే దీపస్తంభమంతా స్వచ్ఛమైన, సాగగొట్టిన ఒకే బంగారు ముక్కతో చేయాలి.+ 37 నువ్వు దానికోసం ఏడు దీపాల్ని చేయాలి, వాటిని వెలిగించినప్పుడు అవి ఆ దీపస్తంభం ముందుభాగంలో వెలుగును ఇస్తాయి.+ 38 దాని పట్టుకార్లను, నిప్పు పాత్రల్ని స్వచ్ఛమైన బంగారంతో చేయాలి.+⁠ 39 దీపస్తంభాన్ని, ఈ వస్తువులన్నిటినీ ఒక తలాంతు* స్వచ్ఛమైన బంగారంతో తయారుచేయాలి. 40 పర్వతం మీద నీకు చూపించిన నమూనా ప్రకారమే వాటిని తయారుచేసేలా చూసుకో.+

26 “పేనిన సన్నని నారతో, నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో, ముదురు ఎరుపు దారంతో తయారైన పది తెరలు ఉపయోగించి నువ్వు గుడారాన్ని+ తయారుచేయాలి. వాటిమీద కెరూబుల+ రూపాల్ని బుట్టాపనిగా* చేయాలి.+ 2 ఒక్కో తెర 28 మూరల* పొడవు, 4 మూరల వెడల్పు ఉండాలి. తెరలన్నీ ఒకే కొలతలో ఉండాలి.+ 3 ఐదు తెరల్ని ఒకదానికొకటి జతచేసి తెరల వరుస తయారుచేయాలి, మిగతా ఐదు తెరల్ని కూడా అలాగే జతచేసి ఇంకో తెరల వరుస తయారుచేయాలి. 4 ఒక తెరల వరుస చివర్లో నీలంరంగు దారంతో ఉంగరాలు చేయాలి, ఇంకో తెరల వరుస చివర్లో కూడా దాన్ని జతచేసే వైపు అలాగే చేయాలి. 5 ఒక తెరల వరుసకు 50 ఉంగరాలు, ఇంకో తెరల వరుస చివర్లో 50 ఉంగరాలు చేయాలి; వాటిని జతచేసే చోట అవి ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేలా చేయాలి. 6 అలాగే నువ్వు 50 బంగారు కొక్కేలు చేసి, ఆ తెరల వరుసల్ని ఆ కొక్కేలతో జతచేయాలి. అప్పుడు గుడారమంతా ఒక్కటిగా ఉంటుంది.+

7 “అలాగే గుడారం మీద కప్పడానికి నువ్వు మేక వెంట్రుకలతో తెరలు చేయాలి.+ మొత్తం 11 తెరలు చేయాలి.+ 8 ఒక్కో తెర 30 మూరల పొడవు, 4 మూరల వెడల్పు ఉండాలి. 11 తెరలూ ఒకే కొలతలో ఉండాలి. 9 నువ్వు ఐదు తెరల్ని ఒకటిగా జతచేయాలి, అలాగే మిగతా ఆరు తెరల్ని ఒకటిగా జతచేయాలి. ఆరో తెరను గుడారం ముందుభాగంలో మడవాలి. 10 ఒక తెరల వరుస చివర్లో ఉన్న తెర అంచున 50 ఉంగరాలు, ఇంకో తెరల వరుస చివర్లో ఉన్న తెర అంచున, అంటే వాటిని జతచేసే చోట 50 ఉంగరాలు చేయాలి. 11 అలాగే నువ్వు 50 రాగి కొక్కేలు చేసి, వాటిని ఆ ఉంగరాల్లో పెట్టి తెరల్ని ఒకటి చేయాలి. అప్పుడు అదంతా కలిపి గుడారానికి ఒక్కటే కప్పు అవుతుంది. 12 తెరల్లో మిగిలిన భాగం గుడారం మీదుగా వేలాడుతుంది. దానిలో సగం, గుడారం వెనక భాగం మీదుగా వేలాడుతుంది. 13 ఆ తెరల పొడవులో మిగిలిన భాగం గుడారం ఈ వైపు ఒక మూర, ఆ వైపు ఒక మూర వేలాడుతూ దాన్ని కప్పుతుంది.

14 “అలాగే, ఎర్రరంగు అద్దిన పొట్టేలు తోళ్లతో నువ్వు గుడారం కోసం ఒక కప్పు చేయాలి. దానిమీద కప్పడానికి సముద్రవత్సల* తోళ్లతో ఇంకొక కప్పు చేయాలి.+

15 “అంతేకాదు, గుడారం కోసం నువ్వు తుమ్మ చెక్కతో నిటారుగా ఉండే చట్రాలు*+ చేయాలి.+ 16 ప్రతీ చట్రం పొడవు పది మూరలు, వెడల్పు ఒకటిన్నర మూరలు ఉండాలి. 17 ప్రతీ చట్రానికి రెండు కుసులు ఉండాలి, అవి ఒకదానికొకటి సమాంతరంగా ఉండాలి. గుడారం చట్రాలన్నిటినీ నువ్వు ఇలాగే చేయాలి. 18 గుడారం దక్షిణం వైపు కోసం నువ్వు 20 చట్రాలు చేయాలి.

19 “ఆ 20 చట్రాల కింద ఉంచడానికి నువ్వు 40 వెండి దిమ్మలు తయారుచేయాలి.+ ఒక చట్రానికి ఉండే రెండు కుసుల కోసం రెండు దిమ్మలు, దాని తర్వాత వచ్చే ప్రతీ చట్రానికి ఉండే రెండు కుసుల కోసం రెండు దిమ్మలు చేయాలి.+ 20 గుడారం ఇంకో వైపు కోసం, అంటే దాని ఉత్తరం వైపు కోసం 20 చట్రాలు చేయాలి. 21 అలాగే ఆ చట్రాల కోసం 40 వెండి దిమ్మలు కూడా చేయాలి. ఒక చట్రం కోసం రెండు దిమ్మలు, దాని తర్వాత వచ్చే ప్రతీ చట్రం కోసం రెండు దిమ్మలు చేయాలి. 22 గుడారం వెనక భాగం కోసం, అంటే పడమటి వైపు కోసం ఆరు చట్రాలు చేయాలి.+ 23 అలాగే, గుడారం వెనక భాగం రెండు మూలల్లో నిలబెట్టడానికి నువ్వు రెండు చట్రాలు చేయాలి. 24 ఈ చట్రాలకు ఉండే రెండు చెక్కలు కింది నుండి పైవరకు, అంటే పైన మొదటి ఉంగరంతో జతచేయబడే వరకు ఉండాలి. రెండో మూలన ఉండే చట్రాన్ని కూడా ఇలాగే చేయాలి. ఈ రెండు చట్రాలు గుడారం రెండు మూలలకు ఆధారంగా ఉంటాయి. 25 నువ్వు ఎనిమిది చట్రాలు, వాటికోసం 16 వెండి దిమ్మలు చేయాలి. ఒక చట్రం కోసం రెండు దిమ్మలు, దాని తర్వాత వచ్చే ప్రతీ చట్రం కోసం రెండు దిమ్మలు చేయాలి.

26 “అలాగే నువ్వు తుమ్మ చెక్కతో అడ్డకర్రలు చేయాలి. గుడారం ఒకవైపున ఉన్న చట్రాల కోసం ఐదు అడ్డకర్రలు,+ 27 గుడారం ఇంకోవైపున ఉన్న చట్రాల కోసం ఐదు అడ్డకర్రలు, అలాగే గుడారం పడమటి వైపున ఉన్న చట్రాల కోసం, అంటే గుడారం వెనక భాగం కోసం ఐదు అడ్డకర్రలు చేయాలి. 28 చట్రాల మధ్య భాగం మీదుగా వెళ్లే అడ్డకర్ర మాత్రం ఒక చివరి నుండి ఇంకో చివరి వరకు ఉండాలి.

29 “నువ్వు ఆ చట్రాలకు బంగారు రేకు తొడగాలి.+ అడ్డకర్రలు పెట్టడానికి బంగారంతో వాటికి ఉంగరాలు చేయాలి. అడ్డకర్రలకు కూడా బంగారు రేకు తొడగాలి. 30 పర్వతం మీద నీకు చూపించిన నమూనా ప్రకారం నువ్వు గుడారాన్ని నిలబెట్టాలి.+

31 “అలాగే నువ్వు నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో, ముదురు ఎరుపు దారంతో, పేనిన సన్నని నారతో ఒక తెరను+ చేయాలి. దానిమీద కెరూబుల్ని బుట్టాపనిగా చేయాలి. 32 తుమ్మ చెక్కతో తయారుచేసి బంగారు రేకు తొడిగిన నాలుగు స్తంభాల మీద ఆ తెరను వేలాడదీయాలి. వాటి కొక్కేల్ని బంగారంతో చేయాలి. ఆ స్తంభాల్ని నాలుగు వెండి దిమ్మల మీద నిలబెట్టాలి. 33 నువ్వు ఆ తెరను కొక్కేల కింద వేలాడదీసి, సాక్ష్యపు మందసాన్ని+ తెర లోపలికి తీసుకురావాలి. ఆ తెర పవిత్ర స్థలాన్ని,+ అతి పవిత్ర స్థలాన్ని వేరుచేస్తుంది.+ 34 అలాగే, అతి పవిత్ర స్థలంలో ఉన్న సాక్ష్యపు మందసం మీద నువ్వు మూత పెట్టాలి.

35 “అంతేకాదు, నువ్వు ఆ తెర బయట బల్లను ఉంచాలి, దాని ఎదురుగా గుడారం దక్షిణం వైపున దీపస్తంభాన్ని+ పెట్టాలి; బల్లను ఉత్తరం వైపున ఉంచాలి. 36 నువ్వు గుడారపు ప్రవేశ ద్వారం కోసం నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, పేనిన సన్నని నార ఉపయోగించి ఒక తెరను అల్లాలి.+ 37 అలాగే నువ్వు తెర కోసం తుమ్మ చెక్కతో ఐదు స్తంభాలు చేసి వాటికి బంగారు రేకు తొడగాలి. వాటి కొక్కేల్ని బంగారంతో చేయాలి. ఆ స్తంభాల కోసం ఐదు రాగి దిమ్మల్ని పోత పోయాలి.

27 “నువ్వు తుమ్మ చెక్కతో ఒక బలిపీఠం చేయాలి;+ దాని పొడవు ఐదు మూరలు,* వెడల్పు ఐదు మూరలు ఉండాలి. ఆ బలిపీఠం చతురస్ర ఆకారంలో ఉండాలి, దాని ఎత్తు మూడు మూరలు ఉండాలి.+ 2 నువ్వు బలిపీఠం నాలుగు మూలల్లో కొమ్ములు+ తయారుచేయాలి; ఆ కొమ్ములు బలిపీఠంలో భాగమై ఉండాలి. నువ్వు బలిపీఠానికి రాగి రేకు తొడగాలి.+ 3 దాని బూడిదను* తీసేయడానికి బాల్చీల్ని, పారల్ని, గిన్నెల్ని, ముళ్ల గరిటల్ని, నిప్పు పాత్రల్ని తయారుచేయాలి; దాని పాత్రలన్నిటినీ రాగితో చేయాలి.+ 4 అలాగే బలిపీఠం కోసం ఒక రాగి జల్లెడ తయారుచేయాలి; దాని నాలుగు మూలల్లో నాలుగు రాగి ఉంగరాలు చేయాలి. 5 నువ్వు ఆ జల్లెడను బలిపీఠం అంచు కింద పెట్టాలి, అది బలిపీఠం లోపల మధ్యభాగం వరకు ఉంటుంది. 6 బలిపీఠం కోసం తుమ్మ చెక్కతో కర్రలు చేసి, వాటికి రాగి రేకు తొడగాలి.7 బలిపీఠాన్ని మోస్తున్నప్పుడు ఆ కర్రలు దానికి రెండువైపుల ఉండేలా వాటిని ఉంగరాల్లో పెట్టాలి.+ 8 నువ్వు ఆ బలిపీఠాన్ని పలకలతో ఖాళీ పెట్టెలా తయారుచేయాలి. పర్వతం మీద నేను నీకు చూపించినట్టే దాన్ని చేయాలి.+

9 “అలాగే నువ్వు గుడారానికి ప్రాంగణం ఏర్పాటుచేయాలి.+ ప్రాంగణం దక్షిణం వైపు, పేనిన సన్నని నారతో తయారుచేసిన వేలాడే తెరలు ఉంటాయి. అవి 100 మూరల పొడవు ఉంటాయి.+ 10 దానికి 20 స్తంభాలు, 20 రాగి దిమ్మలు ఉంటాయి. ఆ స్తంభాల కొక్కేల్ని, వాటిని కలిపే ఉంగరాల్ని వెండితో చేయాలి. 11 ప్రాంగణం ఉత్తరం వైపు కూడా 100 మూరల పొడవున వేలాడే తెరలు ఉంటాయి. దానికి 20 స్తంభాలు, 20 రాగి దిమ్మలు ఉంటాయి. ఆ స్తంభాల కొక్కేల్ని, వాటిని కలిపే ఉంగరాల్ని వెండితో చేయాలి. 12 పడమటి వైపున, అంటే ప్రాంగణం వెడల్పున 50 మూరల వరకు వేలాడే తెరలు ఉంటాయి. వాటికి పది స్తంభాలు, పది దిమ్మలు ఉంటాయి. 13 తూర్పు వైపున, అంటే సూర్యుడు ఉదయించే వైపున ప్రాంగణం వెడల్పు 50 మూరలు ఉండాలి. 14 ద్వారానికి కుడిపక్కన 15 మూరల పొడవున వేలాడే తెరలు ఉంటాయి. వాటికి మూడు స్తంభాలు, మూడు దిమ్మలు+ ఉంటాయి. 15 ద్వారానికి ఎడమపక్కన కూడా 15 మూరల పొడవున వేలాడే తెరలు ఉంటాయి. వాటికి మూడు స్తంభాలు, మూడు దిమ్మలు ఉంటాయి.

16 “ప్రాంగణ ప్రవేశ ద్వారానికి 20 మూరల తెర ఉండాలి. ఆ తెరను నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, పేనిన సన్నని నారతో అల్లాలి.+ దానికి నాలుగు స్తంభాలు, నాలుగు దిమ్మలు+ ఉండాలి. 17 ప్రాంగణం చుట్టూ ఉండే స్తంభాలన్నిటికీ వెండి కట్లను, వెండి కొక్కేల్ని చేయాలి. కానీ వాటి దిమ్మల్ని రాగితో చేయాలి.+ 18 ప్రాంగణం పొడవు 100 మూరలు,+ వెడల్పు 50 మూరలు, ఎత్తు 5 మూరలు ఉండాలి. దాన్ని పేనిన సన్నని నారతో చేయాలి. దాని దిమ్మల్ని రాగితో చేయాలి. 19 గుడారపు సేవలో ఉపయోగించే పాత్రలన్నిటినీ, వస్తువులన్నిటినీ, దాని మేకుల్ని, అలాగే ప్రాంగణం మేకులన్నిటినీ రాగితో చేయాలి.+

20 “దీపాలు ఎప్పుడూ మండుతూ వెలుగిచ్చేలా వాటి కోసం స్వచ్ఛమైన, దంచితీసిన ఒలీవ నూనె తెమ్మని నువ్వు ఇశ్రాయేలీయుల్ని ఆజ్ఞాపించాలి.+ 21 ప్రత్యక్ష గుడారంలో, సాక్ష్యపు మందసం+ దగ్గరున్న తెర బయట, యెహోవా ముందు సాయంత్రం నుండి ఉదయం వరకు దీపాలు మండుతూ ఉండేలా+ అహరోను, అతని కుమారులు ఏర్పాటుచేయాలి. ఇది ఇశ్రాయేలీయులు తరతరాలు పాటించాల్సిన శాశ్వత శాసనం.+

28 “నాకు యాజకులుగా సేవచేసేలా నువ్వు ఇశ్రాయేలీయుల్లో నుండి నీ అన్న అహరోనును,+ అతని కుమారులైన+ నాదాబు, అబీహు,+ ఎలియాజరు, ఈతామారులను+ నీ దగ్గరికి పిలిపించాలి.+ 2 నువ్వు నీ అన్న అహరోను కోసం పవిత్ర వస్త్రాలు తయారుచేయాలి; అవి అతనికి ఘనతను, అలంకారాన్ని తీసుకొస్తాయి.+ 3 ఎవరికైతే పనిలో నైపుణ్యం ఉందో, ఎవరిలోనైతే నేను తెలివిని నింపానో+ వాళ్లందరితో నువ్వు మాట్లాడాలి; అహరోను నాకు యాజకుడిగా సేవచేసేలా, అతన్ని పవిత్రపర్చడం కోసం వాళ్లు అతని వస్త్రాల్ని తయారుచేస్తారు.

4 “వాళ్లు తయారు చేయాల్సినవి ఏమిటంటే: ఒక వక్షపతకం,+ ఒక ఏఫోదు,+ చేతుల్లేని నిలువుటంగీ,+ బుట్టాపనిగా* తయారుచేసిన చొక్కా, ఒక తలపాగా,+ ఒక దట్టీ;+ నీ అన్న అహరోను నాకు యాజకుడిగా సేవచేసేలా వాళ్లు అతని కోసం, అతని కుమారుల కోసం ఈ పవిత్ర వస్త్రాల్ని తయారుచేయాలి. 5 నైపుణ్యం ఉన్న పనివాళ్లు బంగారం, నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, సన్నని నార ఉపయోగించి వాటిని తయారుచేస్తారు.

6 “వాళ్లు ఏఫోదును బంగారం, నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, పేనిన సన్నని నార ఉపయోగించి బుట్టాపనిగా తయారుచేయాలి.+ 7 దానికి రెండు భుజం ముక్కలు చేసి వాటిని దాని రెండు పై అంచులకు జతచేయాలి. 8 ఏఫోదును దాని స్థానంలో కదలకుండా పట్టివుంచడం కోసం, దానికి జతచేసి కుట్టే దట్టీని*+ కూడా బంగారం, నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, పేనిన సన్నని నార ఉపయోగించే అల్లాలి.

9 “అలాగే నువ్వు రెండు సులిమాని రాళ్లు+ తీసుకొని, వాటిమీద ఇశ్రాయేలు కుమారుల పేర్లను+ చెక్కాలి. 10 ఆరు పేర్లను ఒక రాయి మీద, మిగిలిన ఆరు పేర్లను ఇంకో రాయి మీద చెక్కాలి; వాళ్లు పుట్టిన క్రమంలో ఆ పేర్లను చెక్కాలి. 11 రాళ్లను చెక్కే పనివాడు, ముద్రమీద చెక్కినట్టుగా ఇశ్రాయేలు కుమారుల పేర్లను ఆ రెండు రాళ్ల మీద చెక్కాలి.+ తర్వాత వాటిని బంగారు జవల్లో పొదగాలి. 12 ఆ రెండు రాళ్లు ఇశ్రాయేలు కుమారులకు జ్ఞాపకార్థ రాళ్లుగా ఉండేలా వాటిని ఏఫోదు పైనున్న రెండు భుజం ముక్కల మీద పెట్టాలి.+ అహరోను యెహోవా ముందు తన రెండు భుజం ముక్కల మీద వాళ్ల పేర్లను జ్ఞాపకార్థంగా మోయాలి. 13 నువ్వు బంగారు జవలు తయారుచేయాలి, 14 అలాగే స్వచ్ఛమైన బంగారంతో, తాడును పేనినట్టు రెండు గొలుసుల్ని పేనాలి;+ తాడులా పేనిన ఆ గొలుసుల్ని జవలకు అంటించాలి.+

15 “న్యాయనిర్ణయ వక్షపతకాన్ని+ బుట్టా పనివాడితో తయారు చేయించాలి. ఏఫోదును చేసినట్టే బంగారం, నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, పేనిన సన్నని నారతో దాన్ని తయారుచేయాలి.+ 16 దాన్ని అడ్డంగా మడతపెట్టినప్పుడు, అది జేనడు* పొడవు, జేనడు వెడల్పు ఉన్న చతురస్రంలా ఉండాలి. 17 నువ్వు దానిలో నాలుగు వరుసల్లో రాళ్లను పొదగాలి. మొదటి వరుసలో మాణిక్యం, పుష్యరాగం, మరకతం ఉండాలి; 18 రెండో వరుసలో లేత నీలం రాయి, నీలం రాయి, సూర్యకాంతపు రాయి ఉండాలి; 19 మూడో వరుసలో లెషెము రాయి,* మలచబడిన రాయి,* ఊదారంగు రాయి ఉండాలి; 20 నాలుగో వరుసలో లేతపచ్చ రాయి, సులిమాని రాయి, పచ్చ రాయి ఉండాలి. వాటిని బంగారు జవల్లో పొదగాలి. 21 ఇశ్రాయేలు 12 మంది కుమారుల్లో ఒక్కొక్కరి పేరుకు ఒక్కో రాయి. ప్రతీ రాయి పైన ముద్రమీద చెక్కినట్టు ఒక పేరును చెక్కాలి, ఒక్కో పేరు 12 గోత్రాల్లో ఒకదాన్ని సూచిస్తుంది.

22 “నువ్వు వక్షపతకం పైన స్వచ్ఛమైన బంగారంతో చేసిన తాళ్లలాంటి గొలుసుల్ని పేనాలి.+ 23 అలాగే వక్షపతకం కోసం రెండు బంగారు ఉంగరాలు చేసి, వక్షపతకం రెండు చివర్లలో వాటిని ఉంచాలి. 24 నువ్వు ఆ రెండు బంగారు తాళ్లను వక్షపతకం చివర్లలో ఉన్న రెండు ఉంగరాల గుండా దూర్చాలి. 25 ఆ రెండు తాళ్ల రెండు చివర్లను ఏఫోదు ముందుభాగంలో భుజం ముక్కల మీదున్న రెండు జవల గుండా దూర్చాలి. 26 అలాగే రెండు బంగారు ఉంగరాలు చేసి వాటిని వక్షపతకం లోపలి అంచు రెండు చివర్లలో తగిలించాలి, అవి ఏఫోదుకు ఎదురుగా ఉండాలి.+ 27 నువ్వు ఏఫోదు ముందుభాగంలో ఇంకో రెండు బంగారు ఉంగరాలు చేయాలి. వాటిని రెండు భుజం ముక్కల కింద, దట్టీ ఏఫోదును అంటుకునే చోటుకు దగ్గర్లో, దట్టీకి కాస్త పైన పెట్టాలి.+ 28 వక్షపతకం కదలకుండా దాని స్థానంలో ఉండేలా, ఒక నీలంరంగు తాడుతో వక్షపతకం ఉంగరాల్ని ఏఫోదు ఉంగరాలకు కట్టాలి. అప్పుడు వక్షపతకం ఏఫోదు మీద, దట్టీ పైన కదలకుండా ఉంటుంది.

29 “అహరోను పవిత్ర స్థలంలోకి వచ్చేటప్పుడు, ఎల్లప్పుడూ యెహోవా ముందు జ్ఞాపకార్థంగా ఉండేలా తన ఛాతి* పైనున్న న్యాయనిర్ణయ వక్షపతకం మీద ఇశ్రాయేలు కుమారుల పేర్లను మోయాలి. 30 అలాగే నువ్వు ఊరీము, తుమ్మీము*+ అనేవాటిని న్యాయనిర్ణయ వక్షపతకంలో పెట్టాలి; అహరోను యెహోవా ముందుకు వచ్చేటప్పుడు అవి అతని ఛాతి మీద ఉండాలి; ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చే ఈ సాధనాలను అహరోను ఎల్లప్పుడూ యెహోవా ముందు తన ఛాతి పైన మోయాలి.

31 “ఏఫోదు లోపల వేసుకునే చేతుల్లేని నిలువుటంగీని పూర్తిగా నీలంరంగు దారంతో చేయాలి.+ 32 తలను దూర్చడం కోసం దాని పైభాగం మధ్యలో ఒక రంధ్రం చేయాలి. ఆ రంధ్రం కవచానికి ఉండే రంధ్రంలా ఉండాలి. దాని చుట్టూ మగ్గం పనివాడు అంచును తయారుచేయాలి; అప్పుడది చిరిగిపోకుండా ఉంటుంది. 33 నిలువుటంగీ అంచు చుట్టూ నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో, ముదురు ఎరుపు దారంతో దానిమ్మ పండ్లను తయారుచేయాలి; అలాగే వాటి మధ్యలో బంగారంతో గంటలు చేయాలి. 34 ఒక బంగారు గంట, ఒక దానిమ్మ పండు; ఒక బంగారు గంట, ఒక దానిమ్మ పండు అలా నిలువుటంగీ అంచు చుట్టూ చేయాలి. 35 అహరోను సేవ చేసే సమయంలో, అతను పవిత్రమైన స్థలంలో యెహోవా ముందుకు వెళ్తున్నప్పుడు, బయటికి వస్తున్నప్పుడు దాని శబ్దం వినిపించి అతను చనిపోకుండా ఉండేలా+ అతను దాన్ని వేసుకోవాలి.

36 “నువ్వు స్వచ్ఛమైన బంగారంతో మెరిసే రేకు తయారుచేసి, ముద్రమీద చెక్కినట్టు దానిపైన ఈ మాటలు చెక్కాలి: ‘పవిత్రత యెహోవాకు చెందుతుంది.’+ 37 నువ్వు ఒక నీలంరంగు దారంతో దాన్ని తలపాగాకు కట్టాలి;+ అది తలపాగా ముందుభాగంలో ఎప్పటికీ అలా ఉండాలి. 38 అది అహరోను నుదుటి మీద ఉంటుంది. పవిత్రమైన వాటి విషయంలో, అంటే ఇశ్రాయేలీయులు పవిత్రమైన కానుకలుగా అర్పించడానికి పక్కకు తీసిన వాటి విషయంలో ఎవరైనా తప్పు చేస్తే అహరోను ఆ బాధ్యతను భరిస్తాడు.+ వాళ్లు యెహోవా ముందు ఆమోదం పొందేలా, అది ఎప్పటికీ అతని నుదుటి మీద ఉండాలి.

39 “నువ్వు సన్నని నారతో బుట్టాపనిగా ఒక చొక్కాను, అలాగే సన్నని నారతో ఒక తలపాగాను చేయాలి; అంతేకాదు ఒక దట్టీని అల్లాలి.+

40 “అలాగే నువ్వు అహరోను కుమారుల కోసం చొక్కాలను, దట్టీలను, తలపాగాలను చేయాలి.+ అవి వాళ్లకు ఘనతను, అలంకారాన్ని తీసుకొస్తాయి.+ 41 నువ్వు నీ అన్న అహరోనుకు, అతని కుమారులకు వాటిని తొడిగి, వాళ్లను అభిషేకించి,+ ప్రతిష్ఠించి,*+ పవిత్రపర్చాలి. అప్పుడు వాళ్లు నాకు యాజకులుగా సేవచేస్తారు. 42 అలాగే వాళ్ల మర్మాంగాల్ని కప్పడానికి వాళ్లకోసం నారతో లాగుల్ని* తయారుచేయాలి.+ అవి తుంటి దగ్గర నుండి తొడల వరకు ఉండాలి. 43 ప్రత్యక్ష గుడారంలోకి వస్తున్నప్పుడు లేదా పవిత్ర స్థలంలో సేవ చేయడానికి బలిపీఠం దగ్గరికి వెళ్తున్నప్పుడు అపరాధులై చనిపోకుండా ఉండేలా అహరోను, అతని కుమారులు వాటిని వేసుకోవాలి. ఇది అతను, అతని తర్వాత అతని సంతానం* ఎప్పటికీ పాటించాల్సిన శాసనం.

29 “వాళ్లు నాకు యాజకులుగా సేవ చేసేలా వాళ్లను పవిత్రపర్చడానికి నువ్వు ఇలా చేయాలి: ఒక కోడెదూడను, ఏ దోషంలేని రెండు పొట్టేళ్లను+ తీసుకోవాలి. 2 అలాగే పులవని రొట్టెను, పులవని పిండితో చేసి నూనె కలిపిన భక్ష్యాల్ని,* పులవని పిండితో చేసి నూనె పూసిన అప్పడాల్ని తీసుకోవాలి. వాటిని నువ్వు మెత్తని గోధుమ పిండితో చేయాలి. 3 నువ్వు వాటిని గంపలో పెట్టి, గంపతోపాటు ఆ కోడెదూడను, రెండు పొట్టేళ్లను నా ముందుకు తీసుకురావాలి.+

4 “నువ్వు అహరోనును, అతని కుమారుల్ని ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం+ దగ్గరికి తీసుకొచ్చి వాళ్లకు నీళ్లతో స్నానం చేయించాలి.+ 5 తర్వాత నువ్వు ఆ వస్త్రాల్ని+ తీసుకొని అందులోని చొక్కాను, ఏఫోదు లోపల వేసుకునే చేతుల్లేని నిలువుటంగీని, ఏఫోదును, వక్షపతకాన్ని అహరోనుకు తొడిగి, ఆ ఏఫోదు కదలకుండా ఉండేలా దాని దట్టీని* అతని నడుము చుట్టూ కట్టాలి.+ 6 అలాగే అతని తలమీద తలపాగా పెట్టి, సమర్పణకు గుర్తుగా ఉన్న పవిత్రమైన బంగారు రేకును* దానిమీద కట్టాలి.+ 7 అలాగే, అభిషేక తైలాన్ని+ తీసుకొని అతని తలమీద పోసి అతన్ని అభిషేకించాలి.+

8 “తర్వాత అతని కుమారుల్ని ముందుకు తీసుకొచ్చి, వాళ్లకు చొక్కాలు తొడిగి,+ 9 అహరోనుకు, అతని కుమారులకు నడుము చుట్టూ దట్టీలు కట్టాలి; అలాగే వాళ్లకు తలపాగాలు పెట్టాలి. అప్పుడు యాజకత్వం వాళ్లదౌతుంది, ఇది ఎప్పటికీ ఉండే శాసనం.+ అహరోను, అతని కుమారులు యాజకులుగా సేవ చేసేలా నువ్వు వాళ్లను ఈ విధంగా ప్రతిష్ఠించాలి.*+

10 “తర్వాత నువ్వు ఆ కోడెదూడను ప్రత్యక్ష గుడారం ముందుకు తీసుకురావాలి, అప్పుడు అహరోను, అతని కుమారులు దాని తలమీద చేతులు ఉంచుతారు.+ 11 నువ్వు ఆ కోడెదూడను ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర యెహోవా ముందు వధించు.+ 12 ఆ కోడెదూడ రక్తంలో కొంచెం నీ వేలితో తీసుకొని దాన్ని బలిపీఠం కొమ్ముల+ మీద పూసి, మిగతా రక్తమంతా బలిపీఠం అడుగుభాగం దగ్గర పోయి.+ 13 తర్వాత పేగుల మీదున్న కొవ్వంతటిని,+ కాలేయం మీదున్న కొవ్వును, రెండు మూత్రపిండాల్ని, వాటి మీదున్న కొవ్వును తీసుకొని బలిపీఠం నుండి పొగ పైకిలేచేలా దాన్ని కాల్చాలి.+ 14 అయితే ఆ కోడెదూడ మాంసాన్ని, దాని చర్మాన్ని, దాని పేడను పాలెం బయట కాల్చేయాలి. ఇది పాపపరిహారార్థ బలి.

15 “తర్వాత నువ్వు ఆ రెండు పొట్టేళ్లలో ఒకదాన్ని తీసుకో. అప్పుడు అహరోను, అతని కుమారులు దాని తలమీద చేతులు ఉంచాలి.+ 16 నువ్వు ఆ పొట్టేలును వధించి, దాని రక్తాన్ని తీసుకొని, బలిపీఠం నాలుగు వైపులా దాన్ని చిలకరించాలి.+ 17 ఆ పొట్టేలును ముక్కలుగా కోసి, దాని పేగుల్నీ కాళ్లనూ* కడిగి,+ ఆ ముక్కల్ని దాని తలతోపాటు చేర్చి పెట్టు. 18 నువ్వు ఆ పొట్టేలు మొత్తాన్ని తీసుకొని, బలిపీఠం నుండి పొగ పైకిలేచేలా దాన్ని కాల్చాలి. అది యెహోవాకు దహనబలి, ఇంపైన* సువాసన.+ ఇది యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ.

19 “తర్వాత నువ్వు రెండో పొట్టేలును తీసుకోవాలి. అప్పుడు అహరోను, అతని కుమారులు దాని తలమీద చేతులు ఉంచాలి.+ 20 నువ్వు ఆ పొట్టేలును వధించి, దాని రక్తంలో కొంచెం తీసుకొని అహరోను కుడిచెవి తమ్మెమీద, అతని కుమారుల కుడిచెవుల తమ్మెలమీద, వాళ్ల కుడిచేతి బొటనవేళ్ల మీద, వాళ్ల కుడికాళ్ల బొటనవేళ్ల మీద దాన్ని పూయాలి; అలాగే, బలిపీఠం నాలుగు వైపులా ఆ రక్తాన్ని చిలకరించాలి. 21 తర్వాత బలిపీఠం మీదున్న రక్తంలో కొంచెం, అభిషేక తైలంలో+ కొంచెం తీసుకొని అహరోను, అతని వస్త్రాలు, అతని కుమారులు, వాళ్ల వస్త్రాలు పవిత్రంగా ఉండేలా వాటిని అతని మీద, అతని వస్త్రాల మీద, అతని కుమారుల మీద, వాళ్ల వస్త్రాల మీద చిమ్మాలి.+

22 “తర్వాత నువ్వు ఆ పొట్టేలు కొవ్వును, దాని కొవ్విన తోకను, పేగుల మీదున్న కొవ్వును, కాలేయం మీదున్న కొవ్వును, రెండు మూత్రపిండాల్ని, వాటిమీద ఉన్న కొవ్వును,+ దాని కుడికాలును తీసుకో; ఎందుకంటే అది ప్రతిష్ఠాపన పొట్టేలు.+ 23 అలాగే, యెహోవా ముందున్న పులవని రొట్టెల గంపలో నుండి ఒక గుండ్రటి రొట్టెను, నూనెతో వండిన ఒక భక్ష్యాన్ని,* ఒక అప్పడాన్ని తీసుకో. 24 నువ్వు వాటన్నిటినీ అహరోను చేతుల్లో, అతని కుమారుల చేతుల్లో ఉంచి, వాటిని అల్లాడించే అర్పణగా యెహోవా ఎదుట ముందుకు, వెనుకకు కదిలించాలి. 25 తర్వాత నువ్వు వాటిని వాళ్ల చేతుల్లో నుండి తీసుకొని యెహోవా ముందు బలిపీఠం మీద, దహనబలి పైన వాటిని కాల్చాలి; అది ఆయనకు ఇంపైన* సువాసన. ఇది యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ.

26 “తర్వాత అహరోను కోసం అర్పించిన ప్రతిష్ఠాపన పొట్టేలు ఛాతి భాగాన్ని తీసుకొని+ దాన్ని అల్లాడించే అర్పణగా యెహోవా ఎదుట ముందుకు, వెనుకకు కదిలించాలి; ఆ భాగం నీది అవుతుంది. 27 అహరోను కోసం, అతని కుమారుల కోసం అర్పించిన అల్లాడించే అర్పణలోని ఛాతి భాగాన్నీ, ప్రతిష్ఠాపన పొట్టేలు నుండి తీసుకొని అల్లాడించిన పవిత్ర భాగంలోని కాలునూ నువ్వు పవిత్రపర్చాలి.+ 28 అది అహరోనుకు, అతని కుమారులకు చెందాలి; ఈ శాసనాన్ని ఇశ్రాయేలీయులు ఎప్పటికీ పాటించాలి. ఎందుకంటే అది పవిత్రమైన భాగం; అది ఇశ్రాయేలీయులు ఇవ్వాల్సిన పవిత్ర భాగం అవుతుంది.+ అది వాళ్లు తమ సమాధాన బలుల్లో నుండి యెహోవాకు ఇచ్చే పవిత్రమైన భాగం.+

29 “అహరోనుకు చెందిన పవిత్ర వస్త్రాల్ని+ అతని తర్వాత అతని కుమారులు ఉపయోగిస్తారు;+ వాళ్లు యాజకులుగా అభిషేకించబడి, ప్రతిష్ఠించబడినప్పుడు వాటిని ఉపయోగిస్తారు. 30 అతని తర్వాత అతని కుమారుల్లో ఎవరైతే యాజకుడు అయ్యి, పవిత్ర స్థలంలో సేవ చేయడానికి ప్రత్యక్ష గుడారంలోకి వస్తాడో అతను ఏడురోజుల పాటు వాటిని వేసుకుంటాడు.+

31 “నువ్వు ప్రతిష్ఠాపన పొట్టేలును తీసుకొని, దాని మాంసాన్ని పవిత్రమైన చోట ఉడకబెట్టాలి.+ 32 అహరోను, అతని కుమారులు ఆ పొట్టేలు మాంసాన్ని, ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరున్న గంపలోని రొట్టెను తింటారు.+ 33 వాళ్లను యాజకులుగా ప్రతిష్ఠించి* పవిత్రపర్చడానికి వేటితోనైతే ప్రాయశ్చిత్తం చేశారో వాటిని వాళ్లు తినాలి. అయితే వేరేవాళ్లు* ఎవ్వరూ వాటిని తినకూడదు, ఎందుకంటే అవి పవిత్రమైనవి.+ 34 ప్రతిష్ఠాపన బలి మాంసంలో, రొట్టెలో కొంచెమైనా ఉదయం వరకు మిగిలితే, ఆ మిగిలినదాన్ని నువ్వు అగ్నితో కాల్చేయాలి.+ దాన్ని తినకూడదు, ఎందుకంటే అది పవిత్రమైనది.

35 “నువ్వు అహరోనుకు, అతని కుమారులకు ఇలా చేయాలి. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి ప్రకారం చేయాలి. వాళ్లను యాజకులుగా ప్రతిష్ఠించడానికి* నువ్వు ఏడురోజులు తీసుకోవాలి.+ 36 నువ్వు ప్రాయశ్చిత్తం కోసం పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను ప్రతీరోజు అర్పించాలి. అలాగే బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం చేసి పాపం నుండి దాన్ని శుద్ధీకరించాలి, అలాగే దాన్ని పవిత్రపర్చడానికి దాన్ని అభిషేకించాలి.+ 37 బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి నువ్వు ఏడురోజులు తీసుకోవాలి, అది అతి పవిత్రమైన బలిపీఠం అయ్యేలా దాన్ని పవిత్రపర్చాలి.+ ఆ బలిపీఠాన్ని ముట్టుకునే ఏ వ్యక్తయినా పవిత్రంగా ఉండాలి.

38 “నువ్వు బలిపీఠం మీద వీటిని అర్పించాలి: ఏడాది వయసున్న రెండు పొట్టేళ్లను ప్రతీరోజు అర్పించాలి, అలా ఎప్పటికీ చేయాలి.+ 39 ఉదయం ఒక పొట్టేలును, సంధ్య వెలుగు సమయంలో* ఒక పొట్టేలును అర్పించాలి.+ 40 ఈఫా కొలతలో* పదోవంతు మెత్తని పిండిని హిన్‌లో* నాలుగో వంతు దంచితీసిన నూనెతో కలపాలి. దాన్నీ, అలాగే పానీయార్పణగా ఒక హిన్‌లో నాలుగో వంతు ద్రాక్షారసాన్నీ తీసుకొని మొదటి పొట్టేలుతో పాటు అర్పించాలి. 41 నువ్వు రెండో పొట్టేలును సంధ్య వెలుగు సమయంలో* అర్పించాలి. దాన్ని కూడా ఉదయం అర్పించినట్టే ధాన్యార్పణ, పానీయార్పణలతో పాటు అర్పించాలి. ఇది నువ్వు యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ, ఇంపైన* సువాసన. 42 ఇది యెహోవా ముందు ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర మీరు తరతరాలపాటు క్రమంగా అర్పించాల్సిన దహనబలి. అక్కడ నేను మీకు కనిపించి మీతో మాట్లాడతాను.+

43 “నేను అక్కడ ఇశ్రాయేలీయులకు కనిపిస్తాను, నా మహిమ వల్ల ఆ చోటు పవిత్రమౌతుంది.+ 44 నేను ప్రత్యక్ష గుడారాన్ని, బలిపీఠాన్ని పవిత్రపరుస్తాను; అలాగే నాకు యాజకులుగా సేవచేసేలా అహరోనును, అతని కుమారుల్ని పవిత్రపరుస్తాను.+ 45 నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తాను, నేను వాళ్ల దేవుడిగా ఉంటాను.+ 46 వాళ్లమధ్య నివసించడానికి వాళ్లను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చిన వాళ్ల దేవుడైన యెహోవాను నేనే అని వాళ్లు తప్పకుండా తెలుసుకుంటారు.+ నేను వాళ్ల దేవుడైన యెహోవాను.

30 “ధూపం వేయడానికి నువ్వు ఒక వేదిక తయారుచేయాలి;+ దాన్ని తుమ్మ చెక్కతో తయారుచేయాలి.+ 2 అది చతురస్ర ఆకారంలో ఉండాలి; దాని పొడవు ఒక మూర,* వెడల్పు ఒక మూర, ఎత్తు రెండు మూరలు ఉండాలి. దాని కొమ్ములు దానిలో భాగమై ఉండాలి, వాటిని విడిగా చేయకూడదు.+ 3 నువ్వు ఆ వేదిక అంతటికీ, అంటే దాని పైభాగానికి, దాని నాలుగు పక్కలకు, దాని కొమ్ములకు స్వచ్ఛమైన బంగారు రేకు తొడగాలి; అలాగే దాని చుట్టూ బంగారంతో అంచును చేయాలి. 4 ఆ అంచు కింద అటువైపు రెండు, ఇటువైపు రెండు బంగారు ఉంగరాలు చేయాలి; ఈ ఉంగరాలు వేదికను మోయడానికి ఉపయోగించే కర్రల్ని పట్టి ఉంచుతాయి. 5 ఆ కర్రల్ని తుమ్మ చెక్కతో చేసి, వాటికి బంగారు రేకు తొడగాలి. 6 నువ్వు దాన్ని సాక్ష్యపు మందసం దగ్గరున్న తెర ముందు,+ నేను ఎక్కడైతే మిమ్మల్ని కలుసుకుంటానో ఆ సాక్ష్యపు మందసం మీదున్న మూతకు ఎదురుగా పెట్టాలి.+

7 “అహరోను+ ప్రతీ ఉదయం దీపాల్ని+ చక్కబెట్టేటప్పుడు, ఆ వేదిక మీద నుండి పొగ పైకిలేచేలా దానిమీద పరిమళ ధూపద్రవ్యం+ కాలుస్తాడు.+ 8 అలాగే, అహరోను సంధ్య వెలుగు సమయంలో* దీపాల్ని వెలిగించేటప్పుడు కూడా ఆ ధూపం వేస్తాడు. ఇది మీరు తరతరాలపాటు యెహోవా ముందు క్రమంగా అర్పించాల్సిన ధూపార్పణ. 9 నువ్వు దానిమీద వేరే ధూపాన్ని+ గానీ, దహనబలిని గానీ, ధాన్యార్పణను గానీ అర్పించకూడదు; అలాగే దానిమీద పానీయార్పణను పోయకూడదు. 10 అహరోను సంవత్సరానికి ఒకసారి దాని కొమ్ముల మీద ప్రాయశ్చిత్తం చేయాలి.+ ప్రాయశ్చిత్తం కోసం అర్పించే పాపపరిహారార్థ బలి రక్తంలో కొంచెం తీసుకొని+ అతను సంవత్సరానికి ఒకసారి దానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు. మీ తరతరాలపాటు ఇలా జరగాలి. ఇది యెహోవాకు అతి పవిత్రం.”

11 తర్వాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 12 “నువ్వు ఇశ్రాయేలీయుల జనాభా లెక్క సేకరించే ప్రతీసారి,+ వాళ్లలో ప్రతీ ఒక్కరు తన ప్రాణ విమోచన కోసం ఆ సమయంలో యెహోవాకు మూల్యం చెల్లించాలి. వాళ్ల పేర్లు నమోదైనప్పుడు వాళ్ల మీదికి తెగులు రాకుండా ఉండాలంటే వాళ్లు అలా చేయాలి. 13 పేర్లు నమోదైన వాళ్లందరూ, పవిత్ర స్థల షెకెల్‌* కొలమానం ప్రకారం+ అర షెకెల్‌* ఇవ్వాలి. ఒక షెకెల్‌ ఇరవై గీరాలతో* సమానం. అర షెకెల్‌ అనేది యెహోవాకు ఇచ్చే కానుక.+ 14 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి తమ పేరు నమోదైన ప్రతీ ఒక్కరు యెహోవాకు ఆ కానుక ఇవ్వాలి.+ 15 తమ ప్రాణాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి యెహోవాకు కానుక ఇస్తున్నప్పుడు, ధనికులు అర షెకెల్‌* కన్నా ఎక్కువ ఇవ్వకూడదు, పేదవాళ్లు అర షెకెల్‌ కన్నా తక్కువ ఇవ్వకూడదు. 16 ఇశ్రాయేలీయులు ప్రాయశ్చిత్తం కోసం ఇచ్చే ఆ వెండి సొమ్మును నువ్వు తీసుకొని, ప్రత్యక్ష గుడారపు సేవకు మద్దతుగా దాన్ని ఇవ్వాలి. తమ ప్రాణాల కోసం ప్రాయశ్చిత్తం చేయాలని గుర్తుచేయడానికి అది యెహోవా ముందు ఇశ్రాయేలీయుల కోసం ఒక జ్ఞాపికగా పనిచేస్తుంది.”

17 యెహోవా మోషేకు ఇంకా ఇలా చెప్పాడు: 18 “నువ్వు ఒక రాగి గంగాళాన్ని, దాని కోసం ఒక పీఠాన్ని తయారుచేయాలి;+ దాన్ని ప్రత్యక్ష గుడారానికి, బలిపీఠానికి మధ్య ఉంచి అందులో నీళ్లు పోయాలి.+ 19 అహరోను, అతని కుమారులు అక్కడ తమ కాళ్లూచేతులు కడుక్కుంటారు.+ 20 ప్రత్యక్ష గుడారంలోకి వెళ్లేటప్పుడు లేదా సేవ చేయడానికి, యెహోవాకు అగ్నితో అర్పణలు అర్పించడానికి బలిపీఠం దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్లు చనిపోకుండా ఉండేలా ఆ నీళ్లతో కడుక్కోవాలి. 21 వాళ్లు చనిపోకుండా ఉండేలా తమ కాళ్లూచేతులు కడుక్కోవాలి. ఈ శాసనాన్ని వాళ్లు అంటే అతను, అతని సంతానం తరతరాలపాటు ఎప్పటికీ పాటించాలి.”+

22 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 23 “తర్వాత అతిశ్రేష్ఠమైన ఈ పరిమళ ద్రవ్యాల్ని తీసుకో: 500 షెకెల్‌ల* గడ్డకట్టిన బోళం, దానిలో సగం అంటే 250 షెకెల్‌ల* సుగంధభరిత దాల్చిన చెక్క, 250 షెకెల్‌ల సుగంధభరిత వస, 24 అలాగే 500 షెకెల్‌ల లవంగిపట్ట. పవిత్ర స్థల షెకెల్‌* కొలమానం ప్రకారం+ వాటిని తూచాలి. అలాగే ఒక హిన్‌* ఒలీవ నూనె తీసుకోవాలి. 25 తర్వాత వాటితో పవిత్రమైన అభిషేక తైలాన్ని తయారుచేయాలి; లేపనాలు తయారుచేసే వ్యక్తిలా వాటిని నేర్పుగా కలుపుతూ ఆ తైలాన్ని తయారుచేయాలి.+ అది పవిత్రమైన అభిషేక తైలంగా ఉండాలి.

26 “నువ్వు దానితో ప్రత్యక్ష గుడారాన్ని, సాక్ష్యపు మందసాన్ని అభిషేకించాలి;+ 27 అలాగే బల్లను, దాని పాత్రలన్నిటినీ, దీపస్తంభాన్ని, దాని పాత్రల్ని, ధూపవేదికను, 28 దహనబలులు అర్పించే బలిపీఠాన్ని, దాని పాత్రలన్నిటినీ, గంగాళాన్ని, దాని పీఠాన్ని కూడా అభిషేకించాలి. 29 అవి అతి పవిత్రం అయ్యేలా నువ్వు వాటిని పవిత్రపర్చాలి.+ వాటిని తాకే వాళ్లెవరైనా పవిత్రంగా ఉండాలి.+ 30 నువ్వు అహరోనును, అతని కుమారుల్ని+ అభిషేకించి,+ నాకు యాజకులుగా సేవచేసేలా వాళ్లను పవిత్రపర్చాలి.+

31 “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాలి: ‘ఇది మీ తరతరాలపాటు ఎప్పటికీ నాకు పవిత్రమైన అభిషేక తైలంగా ఉండాలి.+ 32 దాన్ని మనిషి శరీరానికి రాయకూడదు, దాని పాళ్లలో అలాంటి మిశ్రమం ఏదీ తయారు చేయకూడదు. అది పవిత్రమైనది. అది ఎప్పటికీ మీకు పవిత్రమైనదిగా ఉండాలి. 33 దానిలాంటి లేపనాన్ని తయారుచేసే ఏ వ్యక్తినైనా, దానిలో కొంచెం తీసుకొని వేరేవాళ్ల* మీద పోసే ఏ వ్యక్తినైనా తన ప్రజల్లో ఉండకుండా కొట్టేయాలి.’ ”*+

34 తర్వాత యెహోవా మోషేకు ఇలా చెప్పాడు: “నువ్వు జటామాంసి, గోపి చందనం, గంధపు చెక్క, స్వచ్ఛమైన సాంబ్రాణి అనే పరిమళ ద్రవ్యాల్ని సమపాళ్లలో తీసుకొని,+ 35 వాటితో ధూపద్రవ్యం తయారుచేయి.+ లేపనాలు తయారుచేసే వ్యక్తిలా వాటిని నేర్పుగా కలుపుతూ సువాసనగల ఆ మిశ్రమాన్ని తయారుచేయాలి. దానిలో ఉప్పు కూడా కలపాలి.+ అది స్వచ్ఛమైన, పవిత్రమైన ధూపద్రవ్యంగా ఉండాలి. 36 నువ్వు దానిలో కొంచెం తీసుకొని, దాన్ని దంచి, మెత్తని పొడిగా చేయాలి. ఆ పొడిలో కొంచెం తీసుకొని ప్రత్యక్ష గుడారంలోని సాక్ష్యపు మందసం ముందు, అంటే నేను నిన్ను కలుసుకునే చోట ఉంచాలి. అది మీకు అతి పవిత్రమైనదిగా ఉండాలి. 37 ఈ పాళ్లలో మీరు తయారుచేసే ధూపద్రవ్యాన్ని మీ సొంత ఉపయోగం కోసం చేసుకోకూడదు.+ దాన్ని మీరు యెహోవాకు పవిత్రమైనదిగా ఎంచాలి. 38 దాని సువాసనను ఆస్వాదించడానికి అలాంటిది చేసే ఏ వ్యక్తినైనా తన ప్రజల్లో ఉండకుండా కొట్టేయాలి.”*

31 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 2 “ఇదిగో, యూదా గోత్రానికి చెందిన హూరు మనవడూ, ఊరి కుమారుడూ అయిన బెసలేలును+ నేను ఎంచుకున్నాను.*+ 3 నేను అతన్ని నా పవిత్రశక్తితో నింపి, అతనికి తెలివిని, అవగాహనను, జ్ఞానాన్ని, అన్నిరకాల చేతిపనులు చేసే నైపుణ్యాన్ని ఇస్తాను. 4 దానివల్ల అతను కళాత్మక రూపాల్ని చేయగలుగుతాడు; బంగారం పని, వెండి పని, రాగి పని చేయగలుగుతాడు; 5 అలాగే విలువైన రాళ్లను చెక్కి పొదగడం,+ అన్నిరకాల చెక్క వస్తువులు తయారుచేయడం అతనికి వస్తుంది.+ 6 అంతేకాదు, అతనికి సహాయం చేయడానికి దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడైన అహోలీయాబును+ నేను నియమించాను. అలాగే, పనిలో నైపుణ్యం ఉన్న వాళ్లందరి హృదయాల్ని నేను తెలివితో నింపుతున్నాను. దానివల్ల వాళ్లు నేను నీకు ఆజ్ఞాపించిన ప్రతీది చేయగలుగుతారు.+ అంటే, 7 ప్రత్యక్ష గుడారాన్ని,+ సాక్ష్యపు మందసాన్ని,+ దాని మూతను,+ గుడారంలోని ఉపకరణాలన్నిటినీ, 8 బల్లను,+ దాని పాత్రల్ని, స్వచ్ఛమైన బంగారు దీపస్తంభాన్ని, దాని పాత్రలన్నిటినీ,+ ధూపవేదికను,+ 9 దహనబలులు అర్పించే బలిపీఠాన్ని,+ దాని పాత్రలన్నిటినీ, గంగాళాన్ని, దాని పీఠాన్ని,+ 10 నేర్పుతో అల్లిన వస్త్రాల్ని, యాజకుడైన అహరోను కోసం పవిత్ర వస్త్రాల్ని, యాజకులుగా సేవచేసేలా అతని కుమారుల కోసం వస్త్రాల్ని,+ 11 అభిషేక తైలాన్ని, పవిత్రమైన స్థలం కోసం పరిమళ ధూపద్రవ్యాన్ని,+ అలా నేను నీకు ఆజ్ఞాపించిన ప్రతీదాన్ని వాళ్లు తయారుచేస్తారు.”

12 యెహోవా మోషేకు ఇంకా ఇలా చెప్పాడు: 13 “నువ్వు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వాళ్లకు ఇలా చెప్పు: ‘ముఖ్యంగా మీరు నా విశ్రాంతి రోజుల్ని ఆచరించాలి.+ యెహోవా అనే నేనే మిమ్మల్ని పవిత్రపరుస్తున్నానని మీరు తెలుసుకునేలా మీ తరతరాలపాటు అది నాకు, మీకు మధ్య సూచనగా ఉంటుంది. 14 మీరు విశ్రాంతి రోజును తప్పకుండా ఆచరించాలి, ఎందుకంటే అది మీకు పవిత్రమైనది.+ దాన్ని అపవిత్రపర్చే ఏ వ్యక్తినైనా చంపేయాలి. ఆ రోజున ఎవరైనా ఏదైనా పని చేస్తే, తన ప్రజల్లో ఉండకుండా అతన్ని కొట్టేయాలి.*+ 15 ఆరు రోజులు మీరు పని చేసుకోవచ్చు, కానీ ఏడో రోజు పూర్తి విశ్రాంతి రోజు.+ అది యెహోవాకు పవిత్రమైనది. విశ్రాంతి రోజున పని చేసే ఏ వ్యక్తినైనా చంపేయాలి. 16 ఇశ్రాయేలీయులు తప్పకుండా విశ్రాంతి రోజును ఆచరించాలి; వాళ్లు తరతరాలపాటు ఎప్పటికీ దాన్ని ఆచరించాలి. ఇది శాశ్వతమైన ఒప్పందం. 17 అది నాకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఎప్పటికీ నిలిచివుండే సూచన.+ ఎందుకంటే యెహోవా ఆరు రోజుల్లో ఆకాశాన్ని, భూమిని సృష్టించి ఏడో రోజున విశ్రాంతి తీసుకొని సేదదీరాడు.’ ”+

18 దేవుడు సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడడం అయిపోగానే, సాక్ష్యంగా ఉండే రెండు పలకల్ని అతనికి ఇచ్చాడు;+ అవి దేవుని వేలితో రాయబడిన రాతి పలకలు.+

32 ఈలోగా, మోషే పర్వతం మీద నుండి కిందికి రావడానికి చాలా సమయం తీసుకుంటున్నాడని ప్రజలు గమనించారు.+ కాబట్టి వాళ్లు అహరోను చుట్టూ చేరి ఇలా అన్నారు: “నువ్వు లేచి, మాకు ముందుగా వెళ్లడానికి మా కోసం ఒక దేవుణ్ణి తయారుచేయి.+ ఎందుకంటే, ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని బయటికి నడిపించిన ఈ మోషేకు ఏమైందో మాకు తెలీదు.” 2 అప్పుడు అహరోను వాళ్లతో ఇలా అన్నాడు: “మీ భార్యల చెవులకు, మీ కుమారుల చెవులకు, కూతుళ్ల చెవులకు ఉన్న బంగారు పోగుల్ని+ తీసి వాటిని నా దగ్గరికి తీసుకురండి.” 3 దాంతో ప్రజలందరూ తమ చెవులకు ఉన్న బంగారు పోగుల్ని తీసేసి వాటిని అహరోను దగ్గరికి తీసుకురావడం మొదలుపెట్టారు. 4 అతను వాటిని తీసుకొని, ఆ బంగారాన్ని పోతపోసి, ఉలితో చెక్కి ఒక దూడ విగ్రహాన్ని తయారుచేశాడు.+ అప్పుడు వాళ్లు, “ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశం నుండి నిన్ను బయటికి నడిపించిన నీ దేవుడు ఇదే” అని అనడం మొదలుపెట్టారు.+

5 అహరోను అది చూసినప్పుడు, దాని ముందు ఒక బలిపీఠం కట్టాడు. తర్వాత అహరోను, “రేపు యెహోవాకు పండుగ ఉంటుంది” అని ప్రకటన చేశాడు. 6 కాబట్టి వాళ్లు తర్వాతి రోజు ఉదయాన్నే లేచి దహనబలులు, సమాధాన బలులు అర్పించడం మొదలుపెట్టారు. తర్వాత ఆ ప్రజలు తిని తాగడానికి కూర్చున్నారు. ఆ తర్వాత వాళ్లు లేచి జల్సాగా సమయం గడపడం మొదలుపెట్టారు.+

7 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు కిందికి వెళ్లు, ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి నువ్వు బయటికి నడిపించిన నీ ప్రజలు చెడిపోయారు.+ 8 నేను వాళ్లకు ఆజ్ఞాపించిన మార్గం నుండి వాళ్లు ఇట్టే పక్కకుమళ్లారు.+ వాళ్లు తమకోసం ఒక దూడ విగ్రహాన్ని* చేసుకున్నారు; దానికి వంగి నమస్కరిస్తూ, బలులు అర్పిస్తూ, ‘ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశం నుండి నిన్ను బయటికి నడిపించిన నీ దేవుడు ఇదే’ అని అంటూ ఉన్నారు.” 9 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: “వాళ్లు తలబిరుసు ప్రజలని+ నేను గమనించాను. 10 నాకు వాళ్లమీద చాలా కోపంగా ఉంది, కాబట్టి వాళ్లను సమూలంగా నాశనం చేయనివ్వు, వాళ్లకు బదులుగా నిన్ను గొప్ప జనంగా చేయనివ్వు.”+

11 తర్వాత మోషే తన దేవుడైన యెహోవాను ఇలా వేడుకున్నాడు:+ “యెహోవా, గొప్ప శక్తితో, బలమైన చేతితో ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చిన నీ ప్రజల మీద నువ్వు అంత కోపం చూపించడం దేనికి?+ 12 ఐగుప్తీయులు, ‘ఆయన దురాలోచనలతోనే వాళ్లను బయటికి నడిపించాడు. వాళ్లను పర్వతాల్లో చంపాలని, భూమ్మీద లేకుండా వాళ్లను సమూలంగా నాశనం చేయాలని ఆయన అనుకున్నాడు’ అని ఎందుకు చెప్పుకోవాలి?+ కాబట్టి నీ కోపాగ్నిని తీసేసుకొని, నీ ప్రజల మీదికి ఈ విపత్తు తీసుకురావాలనే నీ నిర్ణయం గురించి ఇంకొకసారి ఆలోచించు.* 13 నువ్వు నీ మీద ఒట్టేసుకొని, ‘నేను నీ సంతానాన్ని* ఆకాశ నక్షత్రాలంతమంది అయ్యేలా చేస్తాను;+ నీ సంతానానికి* ఇవ్వాలని నిర్ణయించిన ఈ దేశమంతటినీ నేను వాళ్లకు ఇస్తాను. అది వాళ్లకు శాశ్వతమైన ఆస్తి అవుతుంది’ అని నీ సేవకులైన అబ్రాహాముకు, ఇస్సాకుకు, ఇశ్రాయేలుకు చెప్పావు. వాళ్లను జ్ఞాపకం చేసుకో.”+

14 కాబట్టి యెహోవా తన ప్రజల మీదికి తీసుకొస్తానని చెప్పిన విపత్తు గురించి ఇంకొకసారి ఆలోచించసాగాడు.*+

15 తర్వాత మోషే వెనక్కి తిరిగి, సాక్ష్యంగా ఉండే రెండు రాతి పలకల్ని+ తన చేతుల్లో తీసుకొని ఆ పర్వతం మీద నుండి కిందికి దిగాడు.+ ఆ రాతి పలకలు రెండు వైపులా చెక్కబడ్డాయి; వాటి ముందువైపూ, వెనకవైపూ మాటలు రాయబడివున్నాయి. 16 ఆ రాతి పలకల్ని దేవుడే తయారుచేశాడు, వాటి మీదున్న రాతల్ని దేవుడే ఆ పలకల మీద చెక్కాడు.+ 17 ప్రజల అరుపులు, ఆ శబ్దం యెహోషువకు వినిపించినప్పుడు అతను మోషేతో, “పాలెంలో యుద్ధ ధ్వని వినిపిస్తోంది” అన్నాడు. 18 అయితే మోషే ఇలా అన్నాడు:

“అది విజయోత్సాహంతో* పాడే పాటల శబ్దం కాదు,

ఓటమి వల్ల విలపిస్తున్న శబ్దం కూడా కాదు;

నాకు వినిపిస్తున్న శబ్దం వేరే రకమైన పాటల శబ్దం.”

19 మోషే పాలెం దగ్గరికి వచ్చి ఆ దూడను,+ వాళ్ల నాట్యాల్ని చూడగానే అతనికి విపరీతమైన కోపమొచ్చింది; దాంతో అతను తన చేతుల్లో ఉన్న రాతి పలకల్ని విసిరేసి, పర్వతం అడుగుభాగాన వాటిని పగలగొట్టాడు.+ 20 అతను వాళ్లు చేసుకున్న దూడ విగ్రహాన్ని తీసుకొని, దాన్ని అగ్నిలో కాల్చేసి, దాన్ని పిండిపిండి చేశాడు;+ తర్వాత దాన్ని నీళ్ల మీద చల్లి, ఇశ్రాయేలీయులతో ఆ నీళ్లు తాగించాడు.+ 21 తర్వాత మోషే అహరోనును, “నువ్వు ఈ ప్రజల మీదికి గొప్ప పాపం తీసుకొచ్చేలా వాళ్లు నీకు ఏం చేశారు?” అని అడిగాడు. 22 అప్పుడు అహరోను ఇలా అన్నాడు: “నా ప్రభువా, కోపగించుకోకు. ఈ ప్రజలు ఎప్పుడూ చెడు చేయడం వైపే మొగ్గుచూపుతారని నీకు బాగా తెలుసు.+ 23 వాళ్లు నాతో, ‘మాకు ముందుగా వెళ్లడానికి మా కోసం ఒక దేవుణ్ణి తయారుచేయి. ఎందుకంటే, ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని బయటికి నడిపించిన ఈ మోషేకు ఏమైందో మాకు తెలీదు’ అన్నారు.+ 24 దాంతో నేను, ‘ఎవరి దగ్గరైతే బంగారం ఉందో వాళ్లు దాన్ని తీసేసి నాకు ఇవ్వాలి’ అన్నాను. దాన్ని నేను మంటలో వేసినప్పుడు ఈ దూడ బయటికి వచ్చింది.”

25 ఆ ప్రజలు అదుపులేకుండా ప్రవర్తించడం మోషే గమనించాడు; వాళ్లు అలా అదుపులేకుండా ప్రవర్తించేలా అహరోను వాళ్లను వదిలేశాడు. దానివల్ల, వాళ్లు తమ శత్రువుల ముందు అవమానం కొనితెచ్చుకున్నారు. 26 తర్వాత మోషే పాలెం ద్వారం దగ్గర నిలబడి, “మీలో యెహోవా పక్షాన ఉన్నవాళ్లు నా దగ్గరికి రండి!”+ అన్నాడు. దాంతో లేవీయులంతా అతని చుట్టూ చేరారు. 27 అప్పుడు అతను వాళ్లతో ఇలా అన్నాడు: “ ‘మీలో ప్రతీ ఒక్కరు తమ కత్తిని ధరించి, ఒక ద్వారం నుండి ఇంకో ద్వారానికి వెళ్తూ పాలెమంతటా తిరిగి తన సహోదరుణ్ణి, తన పొరుగువాణ్ణి, తన సన్నిహిత స్నేహితుణ్ణి చంపాలి’+ అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పాడు.” 28 ఆ లేవీయులు మోషే చెప్పినట్టు చేశారు. కాబట్టి ఆ రోజు దాదాపు 3,000 మంది పురుషులు చంపబడ్డారు. 29 తర్వాత మోషే ఇలా చెప్పాడు: “ఈ రోజు యెహోవా కోసం మిమ్మల్ని మీరు ప్రత్యేకపర్చుకోండి, ఎందుకంటే మీలో ప్రతీ ఒక్కరు తన సొంత కుమారుడికి, తన సొంత సహోదరుడికి వ్యతిరేకంగా పోరాడారు;+ ఈ రోజు ఆయన మిమ్మల్ని దీవిస్తాడు.”+

30 ఆ తర్వాతి రోజే మోషే ప్రజలతో, “మీరు చాలా పెద్ద పాపం చేశారు, ఇప్పుడు నేను యెహోవా దగ్గరికి ఎక్కివెళ్లి మీ పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలనేమో చూస్తాను” అన్నాడు.+ 31 కాబట్టి మోషే తిరిగి యెహోవా దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు: “ఈ ప్రజలు నిజంగా చాలా పెద్ద పాపం చేశారు! వాళ్లు బంగారంతో ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నారు.+ 32 అయితే ఇప్పుడు నీకిష్టమైతే వాళ్ల పాపాన్ని మన్నించు;+ లేకపోతే, నువ్వు రాసిన నీ పుస్తకంలో నుండి దయచేసి నా పేరు తుడిచేయి.”+ 33 కానీ యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఎవరైతే నాకు వ్యతిరేకంగా పాపం చేశారో అతని పేరునే నా పుస్తకంలో నుండి తుడిచేస్తాను. 34 ఇప్పుడు నువ్వు వెళ్లి, నేను నీతో చెప్పిన చోటికి వాళ్లను నడిపించు. ఇదిగో! నీకు ముందుగా నా దూత వెళ్తాడు.+ నేను లెక్క అడిగే రోజున, వాళ్లు చేసిన పాపానికి వాళ్లకు శిక్ష విధిస్తాను.” 35 తర్వాత, ప్రజలు చేసుకున్న దూడను బట్టి, అంటే అహరోను చేసిన దూడను బట్టి, యెహోవా వాళ్ల మీదికి తెగులు రప్పించడం మొదలుపెట్టాడు.

33 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: “నువ్వు ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించిన ఈ ప్రజల్ని తీసుకొని ఇక్కడి నుండి బయల్దేరు. ‘నీ సంతానానికి* దీన్ని ఇస్తాను’ అని ఏ దేశం గురించైతే నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేశానో అక్కడికి ప్రయాణించు.+ 2 నేను నా దూతను నీకు ముందుగా పంపించి+ కనానీయుల్ని, అమోరీయుల్ని, హిత్తీయుల్ని, పెరిజ్జీయుల్ని, హివ్వీయుల్ని, యెబూసీయుల్ని తరిమేస్తాను.+ 3 మీరు లేచి పాలుతేనెలు ప్రవహించే దేశానికి వెళ్లండి.+ మీరు తలబిరుసు ప్రజలు+ కాబట్టి దారిలో మిమ్మల్ని సమూలంగా నాశనం చేయకుండా ఉండేలా నేను మీతోపాటు రాను.”+

4 ప్రజలు ఆ కఠినమైన మాటను విన్నప్పుడు దుఃఖపడడం మొదలుపెట్టారు; వాళ్లలో ఒక్కరు కూడా తమ ఆభరణాలు వేసుకోలేదు. 5 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘మీరు తలబిరుసు ప్రజలు.+ నేను ఒక్క క్షణంలో మీ మధ్య నుండి వెళ్లి, మిమ్మల్ని సమూలంగా నాశనం చేయగలను.+ కాబట్టి నేను మీ విషయంలో ఏంచేయాలో ఆలోచించే వరకు మీ ఆభరణాలు వేసుకోకండి.’ ” 6 అలా, హోరేబు పర్వతం దగ్గర నుండి ఇశ్రాయేలీయులు ఆభరణాలు వేసుకోవడం మానేశారు.*

7 అప్పుడు మోషే తన డేరాను తీసుకొని దాన్ని పాలెం బయట, అంటే పాలేనికి కాస్త దూరంలో వేసుకున్నాడు. అతను దాన్ని ప్రత్యక్ష గుడారం అని పిలిచాడు. యెహోవా నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని అనుకునేవాళ్లు+ పాలెం బయట ఉన్న ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్లేవాళ్లు. 8 మోషే ఆ గుడారం దగ్గరికి వెళ్లగానే ప్రజలందరూ లేచి తమతమ డేరాల బయట నిలబడి, అతను గుడారం లోపలికి వెళ్లేవరకు అతన్నే చూస్తూ ఉండేవాళ్లు. 9 మోషే గుడారం లోపలికి వెళ్లగానే మేఘస్తంభం+ దిగివచ్చి, దేవుడు మోషేతో మాట్లాడుతుండగా అది ఆ గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరే నిలిచివుండేది.+ 10 మేఘస్తంభం ఆ గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర నిలిచివుండడం చూసినప్పుడు ప్రజలందరూ లేచి, ప్రతీ ఒక్కరు తమతమ డేరా ప్రవేశ ద్వారం దగ్గర వంగి నమస్కారం చేసేవాళ్లు. 11 ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడినట్టుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు.+ అతను పాలేనికి తిరిగొచ్చినప్పుడు నూను కుమారుడూ, మోషే పరిచారకుడూ సేవకుడూ+ అయిన యెహోషువ+ మాత్రం ఆ గుడారం దగ్గరే ఉండేవాడు.

12 అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు: “ఇదిగో నువ్వు, ‘ఈ ప్రజల్ని నడిపించు’ అని నాతో అంటున్నావు, కానీ నాతోపాటు ఎవర్ని పంపిస్తావో నువ్వు నాకు తెలియజేయలేదు. పైగా, ‘నేను నిన్ను ఎంచుకున్నాను,* నువ్వు నా దృష్టిలో అనుగ్రహం పొందావు’ అని చెప్పావు. 13 నేను నీ దృష్టిలో అనుగ్రహం పొందివుంటే, దయచేసి నీ మార్గాలు నాకు తెలియజేయి.+ అప్పుడు నేను నిన్ను తెలుసుకొని, ఇలాగే నీ దృష్టిలో అనుగ్రహం పొందుతూ ఉంటాను. ఈ జనం నీ ప్రజలే అన్న విషయం గురించి కూడా ఆలోచించు.”+ 14 కాబట్టి ఆయన, “స్వయంగా నేనే నీతో వస్తాను,+ నీకు విశ్రాంతినిస్తాను”+ అన్నాడు. 15 అప్పుడు మోషే ఆయనతో ఇలా అన్నాడు: “నువ్వే స్వయంగా మాతో రాకపోతే గనుక, మమ్మల్ని ఇక్కడి నుండి ముందుకు నడిపించకు. 16 నేను, అలాగే నీ ప్రజలు నీ దృష్టిలో అనుగ్రహం పొందామనే విషయం ఎలా తెలుస్తుంది? నువ్వు మాతోపాటు వస్తేనే కదా?+ అప్పుడే భూమ్మీదున్న ప్రజలందరిలో నేను, నీ ప్రజలు ప్రత్యేకమైన వాళ్లుగా ఉంటాం.”+

17 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు మనవి చేసినట్టే నీ కోసం ఈ పని కూడా చేస్తాను. ఎందుకంటే నువ్వు నా దృష్టిలో అనుగ్రహం పొందావు; అంతేకాదు, నువ్వు నాకు బాగా తెలుసు.”* 18 అప్పుడతను, “దయచేసి నీ మహిమను నాకు చూపించు” అన్నాడు. 19 కానీ ఆయన ఇలా అన్నాడు: “నేను నా మంచితనం అంతా నీ ముఖం ముందు నుండి వెళ్లేలా చేస్తాను, యెహోవా అనే నా పేరును నీ ముందు ప్రకటిస్తాను;+ నేను ఎవరిమీద అనుగ్రహం చూపించాలనుకుంటానో వాళ్లమీద అనుగ్రహం చూపిస్తాను, ఎవరిమీద కరుణ చూపించాలనుకుంటానో వాళ్లమీద కరుణ చూపిస్తాను.”+ 20 అయితే ఆయన, “నువ్వు నా ముఖాన్ని చూడలేవు, ఎందుకంటే ఏ మనిషీ నన్ను చూసి బ్రతకలేడు” అన్నాడు.

21 యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “ఇదిగో ఇక్కడ నాకు దగ్గరగా ఒక స్థలం ఉంది. నువ్వు ఆ బండమీద నిలబడు. 22 నా మహిమ దాటివెళ్తున్నప్పుడు నేను నిన్ను ఆ బండ సందులో ఉంచుతాను, నేను దాటివెళ్లే వరకు నా చేతితో నిన్ను కప్పుతాను. 23 తర్వాత నా చేతిని తీసేస్తాను, అప్పుడు నువ్వు నా వెనక భాగాన్ని చూస్తావు. కానీ నా ముఖం నీకు కనిపించదు.”+

34 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నీ కోసం మొదటి పలకల లాంటి రెండు రాతి పలకల్ని చెక్కు.+ నువ్వు పగలగొట్టిన ఆ మొదటి రాతి పలకల+ మీదున్న మాటల్ని నేను వాటిమీద రాస్తాను.+ 2 ఉదయం కోసం సిద్ధంగా ఉండు, ఎందుకంటే ఉదయం నువ్వు సీనాయి పర్వతం మీదికి ఎక్కి అక్కడ దాని శిఖరం పైన నా ముందు నిలబడతావు.+ 3 అయితే నీతోపాటు ఎవరూ పైకి ఎక్కకూడదు. నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఆ పర్వతం మీద ఎక్కడా కనిపించకూడదు. కనీసం మందలు, పశువులు కూడా ఆ పర్వతం ముందు మేయకూడదు.”+

4 కాబట్టి మోషే మొదటి రాతి పలకల లాంటి రెండు రాతి పలకల్ని చెక్కి, పొద్దున్నే లేచి యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టే సీనాయి పర్వతం మీదికి ఎక్కాడు; అతను ఆ రెండు రాతి పలకల్ని తన చేతిలో పట్టుకొని వెళ్లాడు. 5 అప్పుడు యెహోవా మేఘంలో దిగివచ్చి,+ అతనితోపాటు అక్కడ నిలబడి, యెహోవా అనే తన పేరును ప్రకటించాడు.+ 6 యెహోవా అతని ముందు నుండి దాటివెళ్తూ ఇలా ప్రకటించాడు: “యెహోవా, యెహోవా, ఆయన కరుణ,+ కనికరం*+ గల దేవుడు; ఓర్పును,*+ అపారమైన విశ్వసనీయ ప్రేమను*+ చూపించే దేవుడు; ఎంతో సత్యవంతుడు;*+ 7 ఆయన వేలమంది పట్ల విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడు; తప్పుల్ని, అపరాధాల్ని, పాపాల్ని మన్నిస్తాడు;+ అయితే దోషిని శిక్షించకుండా అస్సలు విడిచిపెట్టడు;+ మూడునాలుగు తరాల వరకు తండ్రుల దోషశిక్షను కుమారుల మీదికి, మనవళ్ల మీదికి రప్పిస్తాడు.”

8 మోషే వెంటనే వంగి నేలమీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. 9 తర్వాత అతను ఇలా అన్నాడు: “యెహోవా, ఇప్పుడు నీ దృష్టిలో నేను అనుగ్రహం పొందివుంటే, యెహోవా, దయచేసి నువ్వు కూడా మా మధ్యవుండి మాతోపాటు రా;+ మేము తలబిరుసు ప్రజలమే,+ అయితే మా తప్పుల్ని, పాపాల్ని క్షమించి మమ్మల్ని నీ సొత్తుగా చేసుకో.” 10 దానికి ఆయనిలా అన్నాడు: “ఇదిగో, నేను ఒక ఒప్పందం చేస్తున్నాను: భూమంతట గానీ, దేశాలన్నిటి మధ్య గానీ ఎప్పుడూ జరగని అద్భుతమైన పనుల్ని నేను నీ ప్రజలందరి ముందు చేస్తాను;+ నువ్వు ఎవరి మధ్యైతే నివసిస్తున్నావో ఆ ప్రజలందరూ యెహోవా చేసే పనిని చూస్తారు; నేను నీ కోసం చేసే పని సంభ్రమాశ్చర్యాలు పుట్టిస్తుంది.

11 “ఈ రోజు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న దాని మీద మనసుపెట్టు. ఇదిగో నేను మీ ముందు నుండి అమోరీయుల్ని, కనానీయుల్ని, హిత్తీయుల్ని, పెరిజ్జీయుల్ని, హివ్వీయుల్ని, యెబూసీయుల్ని వెళ్లగొడుతున్నాను.+ 12 మీరు ఏ దేశానికి వెళ్తున్నారో ఆ దేశ ప్రజలతో ఒప్పందం చేసుకోకుండా జాగ్రత్తపడండి, లేదంటే అది మీకు ఉచ్చుగా తయారయ్యే అవకాశముంది. 13 అయితే మీరు వాళ్ల బలిపీఠాల్ని కూలగొట్టాలి, వాళ్ల పూజా స్తంభాల్ని పగలగొట్టాలి, వాళ్లు నిలబెట్టిన పూజా కర్రల్ని* విరగ్గొట్టాలి. 14 నువ్వు వేరే దేవుడికి వంగి నమస్కారం చేయకూడదు,+ ఎందుకంటే యెహోవా అంటేనే* సంపూర్ణ భక్తిని కోరుకునే* వ్యక్తి. అవును, ఆయన సంపూర్ణ భక్తిని కోరుకునే దేవుడు.+ 15 ఆ దేశ నివాసులతో ఒప్పందం చేసుకోకుండా జాగ్రత్తపడు. ఎందుకంటే వాళ్లు తమ దేవుళ్లను పూజించడం ద్వారా వ్యభిచారం చేసి, వాటికి బలులు అర్పించినప్పుడు,+ ఎవరో ఒకరు నిన్ను కూడా పిలుస్తారు, అప్పుడు నువ్వు ఆ బలి అర్పించినదాన్ని తింటావు.+ 16 తర్వాత నువ్వు వాళ్ల కూతుళ్లను నీ కుమారులకిచ్చి పెళ్లిచేస్తావు.+ వాళ్ల కూతుళ్లు తమ దేవుళ్లను పూజించడం ద్వారా వాటితో వ్యభిచరించి, నీ కుమారుల్ని కూడా ఆ దేవుళ్లను పూజించేలా, అలా వాటితో వ్యభిచరించేలా చేస్తారు.+

17 “నువ్వు పోతపోసిన దేవుళ్లను తయారు చేయకూడదు.+

18 “మీరు పులవని రొట్టెల పండుగ ఆచరించాలి.+ నేను మీకు ముందే ఆజ్ఞాపించినట్టు మీరు పులవని రొట్టెలు తింటారు. అబీబు* నెలలో నియమిత సమయంలో ఏడురోజుల పాటు మీరు అలా చేయండి.+ ఎందుకంటే, ఐగుప్తు నుండి మీరు బయటికి వచ్చింది అబీబు నెలలోనే.

19 “మొదట పుట్టిన ప్రతీ మగ సంతానం నాదే;+ నీ పశువులన్నిట్లో ప్రతీ మగ సంతానం నాదే, అది ఎద్దే గానీ, గొర్రే గానీ. 20 మొదట పుట్టే గాడిద పిల్లను గొర్రెతో విడిపించాలి. ఒకవేళ దాన్ని విడిపించకపోతే దాని మెడను విరగ్గొట్టాలి. నీ కుమారుల్లో కూడా మొదట పుట్టిన ప్రతీ ఒక్కర్ని విడిపించాలి.+ ఎవ్వరూ నా ముందు వట్టి చేతులతో కనిపించకూడదు.

21 “ఆరు రోజులు మీరు పని చేయాలి, అయితే ఏడో రోజున మీరు విశ్రాంతి తీసుకుంటారు.* అది దున్నే కాలమైనా సరే, కోత కాలమైనా సరే మీరు విశ్రాంతి తీసుకుంటారు.

22 “గోధుమల కోతలోని మొదటి ధాన్యం గింజలతో మీరు వారాల పండుగను ఆచరిస్తారు; అలాగే సంవత్సరం చివర్లో, సమకూర్చే పండుగను* కూడా ఆచరిస్తారు.+

23 “సంవత్సరంలో మూడుసార్లు మీలోని పురుషులంతా నిజమైన ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ముందు కనిపించాలి.+ 24 ఎందుకంటే నేను మీ ముందు నుండి జనాల్ని వెళ్లగొట్టి+ మీ ప్రాంతాన్ని విస్తరింపజేస్తాను; సంవత్సరంలో మూడుసార్లు యెహోవా ముఖం చూడడానికి మీరు వెళ్తున్నప్పుడు ఎవ్వరూ మీ భూమిని ఆశించరు.

25 “నాకు అర్పించే బలుల రక్తంలో పులిసిందేదీ కలపకూడదు.+ పస్కా పండుగప్పుడు అర్పించే బలిని తెల్లారేవరకు ఉండనియ్యకూడదు.+

26 “నీ భూమిలో మొదట పండిన ఫలాల్లో శ్రేష్ఠమైనవాటిని నీ దేవుడైన యెహోవా మందిరానికి తీసుకురావాలి.+

“మేకపిల్లను దాని తల్లి పాలలో ఉడకబెట్టకూడదు.”+

27 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: “ఈ మాటల్ని నువ్వు రాసిపెట్టాలి,+ ఎందుకంటే ఈ మాటల ప్రకారమే నేను నీతో, అలాగే ఇశ్రాయేలీయులతో ఒప్పందం చేస్తున్నాను.”+ 28 అతను అక్కడ యెహోవాతో 40 పగళ్లు, 40 రాత్రులు ఉన్నాడు. అతను ఆహారం తినలేదు, నీళ్లు తాగలేదు.+ ఆయన* ఆ రాతి పలకల మీద ఆ ఒప్పంద మాటల్ని, అంటే ఆ పది ఆజ్ఞల్ని* రాశాడు.+

29 తర్వాత మోషే సీనాయి పర్వతం నుండి కిందికి దిగివచ్చాడు, సాక్ష్యంగా ఉండే ఆ రెండు రాతి పలకలు అతని చేతిలో ఉన్నాయి.+ మోషే పర్వతం నుండి కిందికి దిగివచ్చినప్పుడు, అతను అప్పటివరకూ దేవునితో మాట్లాడుతూ ఉండడంవల్ల అతని ముఖచర్మం కాంతులు విరజిమ్మింది; కానీ మోషేకు ఆ విషయం తెలియలేదు. 30 అహరోను, ఇశ్రాయేలీయులు మోషేను చూసినప్పుడు, అతని ముఖచర్మం కాంతులు విరజిమ్మడం గమనించి అతని దగ్గరికి వెళ్లడానికి భయపడ్డారు.+

31 అయితే మోషే వాళ్లను తన దగ్గరికి రమ్మని పిలిచాడు. దాంతో అహరోను, అలాగే ఆ ప్రజల ప్రధానులందరూ మోషే దగ్గరికి వచ్చారు; అతను వాళ్లతో మాట్లాడాడు. 32 తర్వాత ఇశ్రాయేలీయులందరూ అతని దగ్గరికి వచ్చారు, అప్పుడతను సీనాయి పర్వతం మీద యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ వాళ్లకు అందజేశాడు.+ 33 వాళ్లతో మాట్లాడడం అయిపోగానే మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునేవాడు.+ 34 అయితే మోషే యెహోవాతో మాట్లాడడానికి ఆయన ముందుకు వెళ్లేటప్పుడు ఆ ముసుగు తీసేసేవాడు; అక్కడి నుండి బయటికి వచ్చేవరకు ముసుగు వేసుకునేవాడు కాదు.+ అతను బయటికి వచ్చాక, తాను అందుకున్న ఆజ్ఞల్ని ఇశ్రాయేలీయులకు తెలియజేసేవాడు.+ 35 మోషే ముఖచర్మం కాంతులు విరజిమ్మడం ఇశ్రాయేలీయులు చూసేవాళ్లు; మోషే తిరిగి దేవునితో* మాట్లాడడానికి లోపలికి వెళ్లేవరకు తన ముఖం మీద ముసుగు వేసుకునేవాడు.+

35 తర్వాత మోషే ఇశ్రాయేలీయులందర్నీ సమావేశపర్చి ఇలా అన్నాడు: “మనం పాటించడం కోసం యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు ఇవే: 2 ఆరు రోజులు మీరు పనిచేసుకోవచ్చు, అయితే ఏడో రోజు మీకు పవిత్రమైనదిగా ఉంటుంది; అది యెహోవాకు పూర్తి విశ్రాంతి రోజుగా ఉంటుంది.+ ఆ రోజు పనిచేసే ఏ వ్యక్తికైనా మరణశిక్ష పడుతుంది.+ 3 విశ్రాంతి రోజున మీ నివాసాల్లో ఎక్కడా నిప్పు రాజేయకూడదు.”

4 తర్వాత మోషే ఇశ్రాయేలీయులందరితో ఇలా అన్నాడు: “యెహోవా ఏమని ఆజ్ఞాపించాడంటే, 5 ‘మీలో నుండి యెహోవా కోసం కానుకలు పోగుచేయండి.+ కానుక ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకునే ప్రతీ ఒక్కరు+ యెహోవా కోసం వీటిని తేవాలి: బంగారం, వెండి, రాగి, 6 నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, సన్నని నార, మేక వెంట్రుకలు,+ 7 ఎర్రరంగు అద్దిన పొట్టేలు తోళ్లు, సముద్రవత్సల* తోళ్లు, తుమ్మ చెక్క, 8 దీపాల కోసం నూనె, అభిషేక తైలంలో అలాగే పరిమళ ధూపద్రవ్యంలో కలపడానికి సాంబ్రాణి,+ 9 ఏఫోదులో, వక్షపతకంలో+ పెట్టడానికి సులిమాని రాళ్లు, ఇతర రంగురాళ్లు.+

10 “ ‘మీలో నైపుణ్యం ఉన్నవాళ్లంతా+ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయాలి. 11 అవేమిటంటే: గుడారం, దాని భాగాలన్నీ, దాని పైకప్పు, దాని కొక్కేలు, దాని చట్రాలు,* దాని అడ్డకర్రలు, దాని స్తంభాలు, దాని దిమ్మలు; 12 మందసం,+ దాని కర్రలు,+ దాని మూత,+ మందసం ఎదురుగా వేలాడే తెర;+ 13 బల్ల,+ దాని కర్రలు, దాని పాత్రలన్నీ, సముఖపు రొట్టెలు;*+ 14 వెలుగు కోసం దీపస్తంభం,+ దాని పాత్రలు, దాని దీపాలు, వాటి కోసం నూనె;+ 15 ధూపవేదిక,+ దాని కర్రలు; అభిషేక తైలం, పరిమళ ధూపద్రవ్యం;+ గుడారపు ప్రవేశ ద్వారం కోసం తెర; 16 దహనబలులు అర్పించే బలిపీఠం,+ దాని రాగి జల్లెడ, దాని కర్రలు, దాని పాత్రలన్నీ; గంగాళం, దాని పీఠం;+ 17 ప్రాంగణంలో వేలాడే తెరలు,+ దాని స్తంభాలు, దాని దిమ్మలు; ప్రాంగణ ప్రవేశ ద్వారం కోసం తెర; 18 గుడారం మేకులు, ప్రాంగణం మేకులు, వాటి తాళ్లు;+ 19 పవిత్రమైన స్థలంలో సేవచేయడానికి నేర్పుగా అల్లిన వస్త్రాలు,+ యాజకుడైన అహరోను కోసం పవిత్ర వస్త్రాలు,+ యాజకులుగా సేవచేసేలా అతని కుమారుల కోసం వస్త్రాలు.’ ”

20 తర్వాత ఇశ్రాయేలీయులందరూ మోషే ముందు నుండి వెళ్లిపోయారు. 21 అప్పుడు ఎవరి హృదయం వాళ్లను ప్రేరేపించిందో,+ ఎవరికైతే కానుక ఇవ్వాలని అనిపించిందో వాళ్లందరూ ప్రత్యక్ష గుడారం కోసం, దాని సేవలన్నిటి కోసం, పవిత్ర వస్త్రాల కోసం యెహోవాకు కానుక తీసుకొచ్చారు. 22 కానుక ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకున్న పురుషులు, స్త్రీలు అలంకార పిన్నుల్ని, చెవిపోగుల్ని, ఉంగరాల్ని, నగల్ని, అన్నిరకాల బంగారు వస్తువుల్ని తీసుకొస్తూ ఉన్నారు. వాళ్లందరూ తమ బంగారు వస్తువుల్ని యెహోవాకు అర్పణలుగా* అర్పించారు.+ 23 నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, సన్నని నార, మేక వెంట్రుకలు, ఎర్రరంగు అద్దిన పొట్టేలు తోళ్లు, సముద్రవత్సల తోళ్లు ఉన్నవాళ్లంతా వాటిని తీసుకొచ్చారు. 24 వెండిని, రాగిని ఇవ్వాలనుకున్న వాళ్లంతా వాటిని యెహోవాకు కానుకగా తీసుకొచ్చారు; అలాగే పనిలో దేనికైనా ఉపయోగపడే తుమ్మ చెక్క ఉన్నవాళ్లంతా దాన్ని తీసుకొచ్చారు.

25 పనిలో నైపుణ్యం ఉన్న స్త్రీలందరూ+ తమ చేతులతో వడికి, వాళ్లు వడికిన నీలంరంగు దారాన్ని, ఊదారంగు ఉన్నిని, ముదురు ఎరుపు దారాన్ని, సన్నని నారను తీసుకొచ్చారు. 26 నైపుణ్యం ఉండి, హృదయం ప్రేరేపించిన స్త్రీలందరూ మేక వెంట్రుకల్ని వడికారు.

27 ప్రధానులు ఏఫోదులో, వక్షపతకంలో+ పెట్టడానికి సులిమాని రాళ్లను, ఇతర రంగురాళ్లను తీసుకొచ్చారు; 28 వాళ్లు సాంబ్రాణిని; దీపాలు వెలిగించడం కోసం, అభిషేక తైలం+ కోసం, పరిమళ ధూపద్రవ్యం+ కోసం నూనెను తీసుకొచ్చారు. 29 స్త్రీపురుషుల్లో ఎవరి హృదయాలు వాళ్లను ప్రేరేపించాయో వాళ్లందరూ మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించిన పని కోసం ఏదో ఒకటి తీసుకొచ్చారు; ఇశ్రాయేలీయులు యెహోవాకు స్వేచ్ఛార్పణగా వాటిని తీసుకొచ్చారు.+

30 తర్వాత మోషే ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “ఇదిగో, యూదా గోత్రానికి చెందిన హూరు మనవడూ, ఊరి కుమారుడూ అయిన బెసలేలును యెహోవా ఎంచుకున్నాడు.+ 31 ఆయన అతన్ని తన పవిత్రశక్తితో నింపి, అతనికి తెలివిని, అవగాహనను, జ్ఞానాన్ని, అన్నిరకాల చేతిపనులు చేసే నైపుణ్యాన్ని ఇచ్చాడు. 32 దానివల్ల అతను కళాత్మక రూపాల్ని చేయగలుగుతాడు; బంగారం పని, వెండి పని, రాగి పని చేయగలుగుతాడు; 33 అలాగే విలువైన రాళ్లను చెక్కి పొదగడం, అన్నిరకాల చెక్క వస్తువులు తయారుచేయడం అతనికి వస్తుంది. 34 దేవుడు అతని హృదయంలో, దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడైన అహోలీయాబు+ హృదయంలో ఇతరులకు నేర్పించే కళను పెట్టాడు. 35 అన్నిరకాల చేతిపనుల్ని; బుట్టాపనిని;* నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో, ముదురు ఎరుపు దారంతో, సన్నని నారతో అల్లే పనిని; మగ్గం పనిని చేసే నేర్పును ఆయన వాళ్ల హృదయాల్లో పెట్టాడు.+ ఈ పురుషులు అన్నిరకాల పనుల్ని, అన్నిరకాల కళాత్మక రూపాల్ని చేస్తారు.

36 “బెసలేలు అహోలీయాబుతో, అలాగే యెహోవా ఆజ్ఞాపించినట్టే పవిత్రసేవకు సంబంధించిన పనంతా ఎలా చేయాలో తెలిసేలా యెహోవా ఎవరికైతే తెలివిని, అవగాహనను ఇచ్చాడో ఆ నైపుణ్యంగల ప్రతీ ఒక్కరితో కలిసి పనిచేస్తాడు.”+

2 మోషే బెసలేలును, అహోలీయాబును, అలాగే యెహోవా ఎవరి హృదయంలోనైతే తెలివిని నింపాడో,+ స్వచ్ఛందంగా ఆ పనిచేసేలా ఎవరి హృదయమైతే వాళ్లను కదిలించిందో ఆ నైపుణ్యంగల ప్రతీ ఒక్కర్ని పిలిపించాడు.+ 3 వాళ్లు పవిత్రసేవకు సంబంధించిన పని కోసం ఇశ్రాయేలీయులు తీసుకొచ్చిన కానుకలన్నిటినీ+ మోషే దగ్గర నుండి తీసుకున్నారు. అయితే ప్రజలు ప్రతీ ఉదయం స్వేచ్ఛార్పణలు తెస్తూనే ఉన్నారు.

4 వాళ్లు పవిత్రమైన పని మొదలుపెట్టిన తర్వాత నైపుణ్యం ఉన్న పనివాళ్లందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తూ, 5 మోషేతో ఇలా అంటూ ఉన్నారు: “యెహోవా ఆజ్ఞాపించిన పని చేయడానికి అవసరమైన దానికన్నా ప్రజలు చాలా ఎక్కువ తీసుకొస్తున్నారు.” 6 కాబట్టి మోషే పాలెం అంతటా ఇలా చాటింపు చేయమని ఆజ్ఞాపించాడు: “పురుషులారా, స్త్రీలారా, పవిత్రమైన కానుకగా మీరు ఇక ఏ వస్తువుల్నీ తీసుకురావద్దు.” దాంతో ప్రజలు ఇంకేమీ తీసుకురాలేదు. 7 అప్పటికే పనంతటికీ సరిపడా వస్తువులు వచ్చాయి, నిజానికి అంతకన్నా ఎక్కువే వచ్చాయి.

8 కాబట్టి నైపుణ్యంగల పనివాళ్లందరూ+ పేనిన సన్నని నారతో, నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో, ముదురు ఎరుపు దారంతో తయారైన పది తెరలు ఉపయోగించి గుడారాన్ని తయారుచేశారు;+ అతను* వాటిమీద కెరూబుల రూపాల్ని బుట్టాపనిగా* చేశాడు.+ 9 ఒక్కో తెర 28 మూరల* పొడవు, 4 మూరల వెడల్పు ఉంది. తెరలన్నీ ఒకే కొలతలో ఉన్నాయి. 10 తర్వాత అతను ఐదు తెరల్ని ఒకదానికొకటి జతచేశాడు, అలాగే మిగతా ఐదు తెరల్ని కూడా ఒకదానికొకటి జతచేశాడు. 11 తర్వాత అతను ఒక తెరల వరుస చివర్లో, దాన్ని జతచేసే వైపు నీలంరంగు దారంతో ఉంగరాలు చేశాడు. అలాగే రెండో తెరల వరుస చివర్లో కూడా దాన్ని జతచేసే వైపు అదే చోట ఉంగరాలు చేశాడు. 12 అతను ఒక తెరల వరుసకు 50 ఉంగరాలు; ఇంకో తెరల వరుస చివర్లో, దాన్ని జతచేసే చోట 50 ఉంగరాలు చేశాడు. ఆ ఉంగరాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేలా వాటిని చేశాడు. 13 చివరిగా అతను 50 బంగారు కొక్కేలు చేసి, గుడారమంతా ఒక్కటి అయ్యేలా ఆ తెరల వరుసల్ని కొక్కేలతో జతచేశాడు.

14 తర్వాత అతను గుడారం మీద కప్పడానికి మేక వెంట్రుకలతో తెరలు చేశాడు. అతను మొత్తం 11 తెరలు చేశాడు.+ 15 ఒక్కో తెర 30 మూరల పొడవు, 4 మూరల వెడల్పు ఉంది. 11 తెరలూ ఒకే కొలతలో ఉన్నాయి. 16 అతను ఐదు తెరల్ని ఒకటిగా జతచేశాడు, అలాగే మిగతా ఆరు తెరల్ని కూడా ఒకటిగా జతచేశాడు. 17 తర్వాత అతను ఒక తెరల వరుస చివర్లో ఉన్న తెర అంచున, అంటే దాన్ని జతచేసే చోట, 50 ఉంగరాలు చేశాడు; అలాగే దానికి జతచేయాల్సిన ఇంకో తెరల వరుస చివర్లో కూడా 50 ఉంగరాలు చేశాడు. 18 తర్వాత అతను 50 రాగి కొక్కేలు చేసి, ఆ రెండు తెరల వరుసల్ని జతచేశాడు. అప్పుడు అదంతా కలిపి గుడారానికి ఒక్కటే కప్పు అయింది.

19 అలాగే అతను, ఎర్రరంగు అద్దిన పొట్టేలు తోళ్లతో గుడారం కోసం ఒక కప్పును చేశాడు, దానిమీద కప్పడానికి సముద్రవత్సల* తోళ్లతో ఇంకో కప్పును చేశాడు.+

20 తర్వాత అతను గుడారం కోసం తుమ్మ చెక్కతో+ నిటారుగా ఉండే చట్రాలు* చేశాడు.+ 21 ప్రతీ చట్రం పొడవు పది మూరలు, వెడల్పు ఒకటిన్నర మూరలు. 22 ప్రతీ చట్రానికి రెండు కుసులు ఉన్నాయి, అవి ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. గుడారం చట్రాలన్నిటినీ అతను అలాగే చేశాడు. 23 గుడారం దక్షిణం వైపు కోసం అతను 20 చట్రాలు చేశాడు. 24 తర్వాత అతను ఆ 20 చట్రాల కింద ఉంచడానికి 40 వెండి దిమ్మలు చేశాడు; ఒక చట్రానికి ఉండే రెండు కుసుల కోసం రెండు దిమ్మలు, దాని తర్వాత వచ్చే ప్రతీ చట్రానికి ఉండే రెండు కుసుల కోసం రెండు దిమ్మలు చేశాడు.+ 25 గుడారం ఇంకో వైపు కోసం, అంటే దాని ఉత్తరం వైపు కోసం 20 చట్రాలు చేశాడు. 26 అలాగే ఆ చట్రాల కోసం 40 వెండి దిమ్మలు కూడా చేశాడు. ఒక చట్రం కోసం రెండు దిమ్మలు, మిగతా చట్రాల్లో ప్రతీదాని కోసం రెండు దిమ్మలు చేశాడు.

27 గుడారం వెనక భాగం కోసం, అంటే పడమటి వైపు కోసం అతను ఆరు చట్రాలు చేశాడు.+ 28 అలాగే, గుడారం వెనక భాగం రెండు మూలల్లో నిలబెట్టడానికి అతను రెండు చట్రాలు చేశాడు. 29 ఈ చట్రాలకు ఉండే రెండు చెక్కలు కింది నుండి పైవరకు, అంటే పైన మొదటి ఉంగరంతో జతచేయబడే వరకు ఉన్నాయి. మూలల్లో ఉండే రెండు చట్రాల్ని కూడా అతను ఇలాగే చేశాడు. 30 అలా అతను ఎనిమిది చట్రాల్ని, అలాగే ఒక్కో చట్రం కింద రెండు దిమ్మల చొప్పున 16 వెండి దిమ్మల్ని చేశాడు.

31 అలాగే అతను తుమ్మ చెక్కతో అడ్డకర్రలు చేశాడు. గుడారం ఒకవైపున ఉన్న చట్రాల కోసం ఐదు అడ్డకర్రలు,+ 32 గుడారం ఇంకోవైపున ఉన్న చట్రాల కోసం ఐదు అడ్డకర్రలు, అలాగే గుడారం పడమటి వైపున ఉన్న చట్రాల కోసం, అంటే గుడారం వెనక భాగం కోసం ఐదు అడ్డకర్రలు చేశాడు. 33 అతను చట్రాల మధ్య భాగం మీదుగా వెళ్లే అడ్డకర్రను ఒక చివరి నుండి ఇంకో చివరి వరకు ఉండేలా చేశాడు. 34 అతను ఆ చట్రాలకు బంగారు రేకు తొడిగాడు. అడ్డకర్రలు పెట్టడానికి వాటికి బంగారంతో ఉంగరాలు చేశాడు. ఆ అడ్డకర్రలకు కూడా బంగారు రేకు తొడిగాడు.+

35 తర్వాత అతను నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో, ముదురు ఎరుపు దారంతో, పేనిన సన్నని నారతో ఒక తెరను+ చేశాడు. దానిమీద కెరూబుల్ని+ బుట్టాపనిగా చేశాడు.+ 36 తర్వాత అతను ఆ తెరను వేలాడదీయడం కోసం తుమ్మ చెక్కతో నాలుగు స్తంభాల్ని చేసి, వాటికి బంగారు రేకు తొడిగాడు; వాటి కోసం బంగారు కొక్కేల్ని చేశాడు; అలాగే ఆ స్తంభాల కోసం నాలుగు వెండి దిమ్మల్ని పోతపోశాడు. 37 ఆ తర్వాత గుడారపు ప్రవేశ ద్వారం కోసం నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, పేనిన సన్నని నార ఉపయోగించి ఒక తెరను అల్లాడు.+ 38 ఆ తెరను వేలాడదీయడం కోసం ఐదు స్తంభాల్ని, వాటి కొక్కేల్ని చేశాడు. వాటి పైభాగాలకు, అలాగే వాటిని కలిపే ఉంగరాలకు అతను బంగారు రేకు తొడిగాడు. అయితే వాటి ఐదు దిమ్మల్ని మాత్రం రాగితో చేశాడు.

37 తర్వాత బెసలేలు+ తుమ్మ చెక్కతో ఒక మందసం+ చేశాడు. అది రెండున్నర మూరల* పొడవు, ఒకటిన్నర మూరల వెడల్పు, ఒకటిన్నర మూరల ఎత్తు ఉంది.+ 2 అతను దాని లోపల, బయట స్వచ్ఛమైన బంగారు రేకు తొడిగి, దాని చుట్టూ బంగారంతో అంచును చేశాడు.+ 3 తర్వాత అతను మందసం కోసం నాలుగు బంగారు ఉంగరాలు పోతపోసి, దాని నాలుగు కాళ్లకు పైన అంటించాడు; ఒకవైపు రెండు ఉంగరాలు, ఇంకోవైపు రెండు ఉంగరాలు అంటించాడు. 4 అతను తుమ్మ చెక్కతో కర్రలు చేసి, వాటికి బంగారు రేకు తొడిగాడు.+ 5 మందసాన్ని మోసుకెళ్లడం కోసం ఆ కర్రల్ని మందసం రెండు వైపుల ఉన్న ఉంగరాల్లో పెట్టాడు.+

6 ఆ మందసానికి అతను స్వచ్ఛమైన బంగారంతో ఒక మూతను చేశాడు;+ దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూరలు.+ 7 తర్వాత అతను ఆ మూత+ రెండు కొనల మీద రెండు బంగారు కెరూబుల్ని+ సుత్తితో మలిచాడు.* 8 ఈ కొన మీద ఒక కెరూబును, ఆ కొన మీద ఒక కెరూబును చేశాడు. అతను ఆ కెరూబుల్ని మూత రెండు కొనల మీద చేశాడు. 9 ఆ కెరూబుల రెండు రెక్కలు పైకి విప్పి ఉన్నాయి, అవి వాటి రెక్కలతో ఆ మూతను కప్పాయి.+ ఆ కెరూబులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి, వాటి ముఖాలు మూత వైపు తిరిగి ఉన్నాయి.+

10 తర్వాత అతను తుమ్మ చెక్కతో ఒక బల్లను+ చేశాడు. దాని పొడవు రెండు మూరలు, వెడల్పు ఒక మూర, ఎత్తు ఒకటిన్నర మూరలు.+ 11 అతను దానికి స్వచ్ఛమైన బంగారు రేకు తొడిగి, బల్ల చుట్టూ బంగారంతో అంచును చేశాడు. 12 అలాగే దాని చుట్టూ బెత్తెడు* వెడల్పు ఉండే పట్టీ చేసి, ఆ పట్టీ చుట్టూ బంగారంతో అంచును చేశాడు. 13 అంతేకాదు, అతను దానికోసం నాలుగు బంగారు ఉంగరాలు పోతపోసి, బల్లకు నాలుగు కాళ్లు అంటించిన చోట వాటిని తగిలించాడు. 14 బల్లను మోసుకెళ్లే కర్రల్ని పట్టివుంచడం కోసం ఆ ఉంగరాల్ని పట్టీకి దగ్గరగా తగిలించాడు. 15 తర్వాత అతను బల్లను మోసుకెళ్లే కర్రల్ని తుమ్మ చెక్కతో తయారుచేసి, వాటికి బంగారు రేకు తొడిగాడు. 16 అలాగే అతను బల్లమీద ఉండే పాత్రల్ని, అంటే పళ్లేలను, గిన్నెల్ని, కూజాల్ని, వాటితోపాటు పానీయార్పణ పాత్రల్ని స్వచ్ఛమైన బంగారంతో చేశాడు.+

17 తర్వాత అతను స్వచ్ఛమైన బంగారంతో ఒక దీపస్తంభాన్ని+ చేశాడు. అతను దాన్ని సుత్తితో మలిచాడు. దాని అడుగుభాగాన్ని, కాండాన్ని, కలశాల్ని, మొగ్గల్ని, పువ్వుల్ని ఒకే బంగారు ముక్కతో చేశాడు.+ 18 ఆ దీపస్తంభం కాండం నుండి ఆరు కొమ్మలు బయటికి వచ్చాయి; మూడు కొమ్మలు ఒకవైపు నుండి, మూడు కొమ్మలు ఇంకోవైపు నుండి వచ్చాయి. 19 ఒక జట్టు కొమ్మల మీద బాదం పువ్వు ఆకారంలో మూడు కలశాలు ఉన్నాయి; ఆ కలశాల మధ్య ఒక మొగ్గ, ఒక పువ్వు ఉన్నాయి. అలాగే రెండో జట్టు కొమ్మల మీద కూడా బాదం పువ్వు ఆకారంలో మూడు కలశాలు ఉన్నాయి; ఆ కలశాల మధ్య కూడా ఒక మొగ్గ, ఒక పువ్వు ఉన్నాయి. దీపస్తంభం కాండం నుండి బయటికి వచ్చిన ఆరు కొమ్మలు అలాగే ఉన్నాయి. 20 దీపస్తంభం కాండం మీద బాదం పువ్వు ఆకారంలో నాలుగు కలశాలు ఉన్నాయి; ఆ కలశాల మధ్య ఒక మొగ్గ, ఒక పువ్వు ఉన్నాయి. 21 కాండం నుండి మొదలయ్యే మొదటి రెండు కొమ్మల కింద ఒక మొగ్గ, తర్వాతి రెండు కొమ్మల కింద ఒక మొగ్గ, ఆ తర్వాతి రెండు కొమ్మల కింద ఒక మొగ్గ ఉన్నాయి. దీపస్తంభం కాండం నుండి మొదలయ్యే ఆరు కొమ్మలకు అలాగే ఉన్నాయి. 22 మొగ్గలు, కొమ్మలు, అలాగే దీపస్తంభమంతా స్వచ్ఛమైన, సాగగొట్టిన ఒకే బంగారు ముక్కతో చేయబడ్డాయి. 23 తర్వాత అతను దాని ఏడు దీపాల్ని,+ దాని పట్టుకార్లను, నిప్పు పాత్రల్ని స్వచ్ఛమైన బంగారంతో చేశాడు. 24 అతను దాన్ని, దాని పాత్రలన్నిటినీ ఒక తలాంతు* స్వచ్ఛమైన బంగారంతో చేశాడు.

25 తర్వాత అతను తుమ్మ చెక్కతో ధూపవేదికను+ చేశాడు. అది చతురస్ర ఆకారంలో ఉంది; దాని పొడవు ఒక మూర, వెడల్పు ఒక మూర, ఎత్తు రెండు మూరలు. దాని కొమ్ములు దానిలో భాగమై ఉన్నాయి.+ 26 అతను ఆ వేదిక అంతటికీ, అంటే దాని పైభాగానికి, దాని నాలుగు పక్కలకు, దాని కొమ్ములకు స్వచ్ఛమైన బంగారు రేకు తొడిగాడు. అలాగే దాని చుట్టూ బంగారు అంచును చేశాడు. 27 వేదికను మోయడానికి ఉపయోగించే కర్రల్ని పట్టి ఉంచడానికి ఆ అంచు కింద అటువైపు రెండు, ఇటువైపు రెండు బంగారు ఉంగరాలు చేశాడు. 28 తర్వాత అతను తుమ్మ చెక్కతో కర్రల్ని చేసి, వాటికి బంగారు రేకు తొడిగాడు. 29 అలాగే అతను, లేపనాలు తయారుచేసే వ్యక్తిలా నేర్పుగా కలుపుతూ పవిత్రమైన అభిషేక తైలాన్ని,+ స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యాన్ని+ తయారుచేశాడు.

38 దహనబలులు అర్పించే బలిపీఠాన్ని అతను తుమ్మ చెక్కతో చేశాడు. అది చతురస్ర ఆకారంలో ఉంది; దాని పొడవు ఐదు మూరలు,* వెడల్పు ఐదు మూరలు, ఎత్తు మూడు మూరలు.+ 2 అతను దాని నాలుగు మూలల్లో కొమ్ములు తయారుచేశాడు; ఆ కొమ్ముల్ని బలిపీఠంలో భాగంగా తయారుచేశాడు. తర్వాత ఆ బలిపీఠానికి రాగి రేకు తొడిగాడు.+ 3 ఆ తర్వాత అతను బలిపీఠం పాత్రలన్నిటినీ అంటే బాల్చీల్ని, పారల్ని, గిన్నెల్ని, ముళ్ల గరిటల్ని, నిప్పు పాత్రల్ని చేశాడు. అతను వాటన్నిటినీ రాగితో చేశాడు. 4 అలాగే బలిపీఠం కోసం ఒక రాగి జల్లెడను చేశాడు; అది బలిపీఠం అంచు కింద, మధ్యభాగం వరకు ఉండేలా చేశాడు. 5 బలిపీఠాన్ని మోసే కర్రల్ని పట్టివుంచడానికి అతను నాలుగు ఉంగరాల్ని పోతపోసి, వాటిని బలిపీఠం నాలుగు మూలల్లో రాగి జల్లెడకు దగ్గరగా అంటించాడు. 6 తర్వాత అతను తుమ్మ చెక్కతో కర్రలు చేసి, వాటికి రాగి రేకు తొడిగాడు. 7 బలిపీఠాన్ని మోయడం కోసం అతను ఆ కర్రల్ని దాని పక్కలకు ఉన్న ఉంగరాల్లో పెట్టాడు. అతను ఆ బలిపీఠాన్ని పలకలతో ఖాళీ పెట్టెలా తయారుచేశాడు.

8 తర్వాత అతను రాగి గంగాళాన్ని,+ దాని రాగి పీఠాన్ని చేశాడు; వాటిని తయారుచేయడానికి, ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర సేవచేసే స్త్రీల అద్దాలను* ఉపయోగించాడు.

9 తర్వాత అతను ప్రాంగణాన్ని తయారుచేశాడు.+ అతను ప్రాంగణం దక్షిణం వైపు కోసం, పేనిన సన్నని నారతో 100 మూరల పొడవున వేలాడే తెరల్ని చేశాడు.+ 10 వాటి కోసం 20 స్తంభాల్ని, 20 రాగి దిమ్మల్ని చేశాడు; అయితే ఆ స్తంభాల కొక్కేల్ని, వాటిని కలిపే ఉంగరాల్ని వెండితో చేశాడు. 11 ఉత్తరం వైపున కూడా 100 మూరల పొడవున వేలాడే తెరలు ఉన్నాయి. వాటి 20 స్తంభాల్ని, 20 దిమ్మల్ని రాగితో చేశాడు; ఆ స్తంభాల కొక్కేల్ని, వాటిని కలిపే ఉంగరాల్ని వెండితో చేశాడు. 12 అయితే పడమటి వైపున, వేలాడే తెరలు 50 మూరల పొడవున ఉన్నాయి. వాటికి పది స్తంభాలు, పది దిమ్మలు ఉన్నాయి; స్తంభాల కొక్కేలు, వాటిని కలిపే ఉంగరాలు వెండివి. 13 తూర్పు వైపున, అంటే సూర్యుడు ఉదయించే వైపున ప్రాంగణం వెడల్పు 50 మూరలు. 14 ప్రవేశ ద్వారానికి ఒకవైపు 15 మూరల పొడవున వేలాడే తెరలు, మూడు స్తంభాలు, మూడు దిమ్మలు ఉన్నాయి. 15 ప్రవేశ ద్వారానికి ఇంకోవైపు 15 మూరల పొడవున వేలాడే తెరలు, మూడు స్తంభాలు, మూడు దిమ్మలు ఉన్నాయి. 16 ప్రాంగణం చుట్టూ ఉన్న వేలాడే తెరలన్నీ పేనిన సన్నని నారతో చేయబడ్డాయి. 17 ప్రాంగణం స్తంభాల దిమ్మలు రాగివి; స్తంభాల కొక్కేలు, వాటిని కలిపే ఉంగరాలు వెండివి; స్తంభాల పైభాగాలు వెండి రేకుతో తొడగబడ్డాయి. ప్రాంగణం స్తంభాలన్నిటి కట్లు వెండివి.+

18 ప్రాంగణ ప్రవేశ ద్వారానికి ఉండే తెరను నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, పేనిన సన్నని నారతో అల్లారు. దాని పొడవు 20 మూరలు, ఎత్తు 5 మూరలు. ప్రాంగణంలో వేలాడే తెరల ఎత్తు ఎంతో దాని ఎత్తూ అంతే.+ 19 వాటి నాలుగు స్తంభాల్ని, నాలుగు దిమ్మల్ని రాగితో చేశారు. వాటి కొక్కేల్ని, వాటిని కలిపే ఉంగరాల్ని వెండితో చేశారు; ఆ స్తంభాల పైభాగాలకు వెండి రేకు తొడిగారు. 20 గుడారం మేకులన్నీ, అలాగే ప్రాంగణం చుట్టూ ఉన్న మేకులన్నీ రాగివి.+

21 గుడారాన్ని, అంటే సాక్ష్యపు గుడారాన్ని+ కట్టడానికి ఉపయోగించిన వాటి జాబితా తయారుచేయమని మోషే ఆజ్ఞాపించాడు. యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు పర్యవేక్షణలో+ లేవీయులు+ ఆ జాబితాను తయారుచేశారు. 22 యూదా గోత్రానికి చెందిన హూరు మనవడూ, ఊరి కుమారుడూ అయిన బెసలేలు+ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా చేశాడు. 23 దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడైన అహోలీయాబు+ అతనితో కలిసి పనిచేశాడు. ఈ అహోలీయాబు చేతిపనులు చేయడం; బుట్టాపని* చేయడం; నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో, ముదురు ఎరుపు దారంతో, సన్నని నారతో అల్లడం తెలిసినవాడు.

24 పవిత్ర స్థలం పని అంతటి కోసం ఉపయోగించిన మొత్తం బంగారం, అల్లాడించే అర్పణగా తెచ్చిన బంగారంతో సమానం.+ పవిత్ర స్థల షెకెల్‌* కొలమానం ప్రకారం దాని బరువు 29 తలాంతుల* 730 షెకెల్‌లు.* 25 ఇశ్రాయేలీయుల్లో తమ పేర్లు నమోదైన పురుషులు తెచ్చిన వెండి బరువు పవిత్ర స్థల షెకెల్‌* కొలమానం ప్రకారం 100 తలాంతుల 1,775 షెకెల్‌లు. 26 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి, తన పేరు నమోదైన ప్రతీ పురుషుడు పవిత్ర స్థల షెకెల్‌* కొలమానం ప్రకారం అర షెకెల్‌ తీసుకొచ్చాడు.+ వాళ్ల సంఖ్య 6,03,550.+

27 పవిత్ర స్థలం కోసం, తెరల కోసం దిమ్మలు పోతపోయడానికి ఉపయోగించిన వెండి మొత్తం 100 తలాంతులు; ఒక్కో దిమ్మకు ఒక తలాంతు చొప్పున, 100 దిమ్మలకు 100 తలాంతులు పట్టింది.+ 28 మిగతా 1,775 షెకెల్‌ల వెండితో అతను స్తంభాల కోసం కొక్కేల్ని చేశాడు, అలాగే స్తంభాల పైభాగాలకు వెండి రేకు తొడిగి వాటిని జతచేశాడు.

29 అర్పణగా* తెచ్చిన రాగి బరువు 70 తలాంతుల 2,400 షెకెల్‌లు. 30 దానితో అతను ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం కోసం దిమ్మల్ని, రాగి బలిపీఠాన్ని, దాని రాగి జల్లెడను, బలిపీఠం పాత్రలన్నిటినీ, 31 ప్రాంగణం చుట్టూ ఉండే దిమ్మల్ని, ప్రాంగణ ప్రవేశ ద్వారం కోసం దిమ్మల్ని, గుడారం మేకులన్నిటినీ, ప్రాంగణం చుట్టూ ఉండే మేకులన్నిటినీ+ చేశాడు.

39 వాళ్లు పవిత్ర స్థలంలో సేవచేసే వాళ్లకోసం నీలంరంగు దారాన్ని, ఊదారంగు ఉన్నిని, ముదురు ఎరుపు దారాన్ని+ నేర్పుగా అల్లి వస్త్రాలు తయారుచేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వాళ్లు అహరోను కోసం పవిత్ర వస్త్రాల్ని తయారుచేశారు.+

2 అతను బంగారం, నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, పేనిన సన్నని నార ఉపయోగించి ఏఫోదును చేశాడు.+ 3 వాళ్లు బంగారు పలకల్ని పల్చని రేకులుగా సాగగొట్టారు. అతను వాటిని తీగలుగా కత్తిరించాడు. ఆ తీగల్ని, నీలంరంగు దారాన్ని, ఊదారంగు ఉన్నిని, ముదురు ఎరుపు దారాన్ని, పేనిన సన్నని నారను ఉపయోగించి ఏఫోదును బుట్టాపనిగా* చేశారు. 4 వాళ్లు దానికి అతికించి ఉండే భుజం ముక్కల్ని తయారుచేశారు, అవి ఏఫోదు రెండు పై అంచులకు జతచేయబడ్డాయి. 5 ఏఫోదును దాని స్థానంలో కదలకుండా పట్టివుంచడం కోసం, దానికి జతచేసిన దట్టీని*+ కూడా బంగారం, నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, పేనిన సన్నని నార ఉపయోగించి అల్లారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వాళ్లు చేశారు.

6 తర్వాత వాళ్లు సులిమాని రాళ్లను బంగారు జవల్లో పొదిగి, వాటిమీద ఇశ్రాయేలు కుమారుల పేర్లను ముద్రమీద చెక్కినట్టు చెక్కారు.+ 7 అవి ఇశ్రాయేలు కుమారులకు జ్ఞాపకార్థ రాళ్లుగా ఉండేలా, అతను వాటిని ఏఫోదు పైనున్న రెండు భుజం ముక్కల మీద పెట్టాడు.+ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే అతను చేశాడు. 8 తర్వాత అతను ఏఫోదును చేసినట్టే వక్షపతకాన్ని+ కూడా బంగారం, నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, పేనిన సన్నని నార ఉపయోగించి బుట్టాపనిగా చేశాడు.+ 9 దాన్ని అడ్డంగా మడతపెట్టినప్పుడు అది చతురస్ర ఆకారంలో ఉంది. అలా మడతపెట్టినప్పుడు అది జేనడు* పొడవు, జేనడు వెడల్పు ఉండేలా వాళ్లు దాన్ని తయారుచేశారు. 10 వాళ్లు దానిలో నాలుగు వరుసల్లో రంగురాళ్లను పొదిగారు. మొదటి వరుసలో మాణిక్యం, పుష్యరాగం, మరకతం ఉన్నాయి. 11 రెండో వరుసలో లేత నీలం రాయి, నీలం రాయి, సూర్యకాంతపు రాయి ఉన్నాయి. 12 మూడో వరుసలో లెషెము రాయి,* మలచబడిన రాయి,* ఊదారంగు రాయి ఉన్నాయి. 13 నాలుగో వరుసలో లేతపచ్చ రాయి, సులిమాని రాయి, పచ్చ రాయి ఉన్నాయి. వాటిని బంగారు జవల్లో పొదిగారు. 14 ఇశ్రాయేలు 12 మంది కుమారుల్లో ఒక్కొక్కరి పేరుకు ఒక్కో రాయి; ప్రతీ రాయి పైన ముద్రమీద చెక్కినట్టు ఒక పేరును చెక్కారు, ఒక్కో పేరు 12 గోత్రాల్లో ఒకదాన్ని సూచిస్తుంది.

15 తర్వాత వాళ్లు వక్షపతకం పైన స్వచ్ఛమైన బంగారంతో చేసిన తాళ్లలాంటి గొలుసుల్ని పేనారు.+ 16 అలాగే వాళ్లు రెండు బంగారు జవల్ని, రెండు బంగారు ఉంగరాల్ని చేసి, ఆ రెండు ఉంగరాల్ని వక్షపతకం రెండు మూలల్లో అంటించారు. 17 తర్వాత వాళ్లు ఆ రెండు బంగారు తాళ్లను వక్షపతకం మూలల్లో ఉన్న రెండు ఉంగరాల గుండా దూర్చారు. 18 ఆ రెండు తాళ్ల రెండు చివర్లను రెండు జవల గుండా దూర్చి, వాటిని ఏఫోదు ముందుభాగంలో భుజం ముక్కలకు అంటించారు. 19 తర్వాత వాళ్లు రెండు బంగారు ఉంగరాలు చేసి, వాటిని వక్షపతకం లోపలి అంచు రెండు చివర్లలో ఏఫోదుకు ఎదురుగా తగిలించారు.+ 20 తర్వాత వాళ్లు ఇంకో రెండు బంగారు ఉంగరాలు చేసి, ఏఫోదు ముందుభాగంలో రెండు భుజం ముక్కల కింద, దాన్ని జతచేసిన చోటుకు దగ్గర్లో, ఏఫోదు దట్టీకి పైన వాటిని తగిలించారు. 21 చివరిగా వాళ్లు, ఒక నీలంరంగు తాడుతో వక్షపతకం ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు కట్టారు. వక్షపతకం ఏఫోదు మీద, దట్టీ పైన దాని స్థానంలో కదలకుండా ఉండాలని అలా చేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వాళ్లు చేశారు.

22 తర్వాత అతను మగ్గం పనివాడు నీలంరంగు దారంతో నేసిన వస్త్రాన్ని తీసుకొని, ఏఫోదు లోపల వేసుకునే చేతుల్లేని నిలువుటంగీని చేశాడు.+ 23 తలను దూర్చడం కోసం దాని మధ్యలో కవచానికి ఉన్నట్టు ఒక రంధ్రం ఉంది. అది చిరిగిపోకుండా ఉండేలా ఆ రంధ్రం చుట్టూ ఒక అంచు ఉంది. 24 తర్వాత వాళ్లు చేతుల్లేని నిలువుటంగీ అంచున నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో, ముదురు ఎరుపు దారంతో దానిమ్మ పండ్లను అల్లారు. 25 అలాగే వాళ్లు స్వచ్ఛమైన బంగారంతో గంటలు చేసి, వాటిని చేతుల్లేని నిలువుటంగీ అంచు చుట్టూ ఆ దానిమ్మ పండ్ల మధ్యలో పెట్టారు. 26 సేవ చేయడానికి ఉపయోగించే ఆ చేతుల్లేని నిలువుటంగీ అంచు చుట్టూ ఒక గంట, ఒక దానిమ్మ పండు; ఒక గంట, ఒక దానిమ్మ పండు వచ్చేలా చేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వాళ్లు చేశారు.

27 తర్వాత వాళ్లు మగ్గం పనివాడు సన్నని నారతో నేసిన వస్త్రంతో అహరోను కోసం, అతని కుమారుల కోసం చొక్కాల్ని చేశారు;+ 28 సన్నని నారతో తలపాగాను,+ అలంకార తలపాగాను;+ పేనిన సన్నని నారతో నార లాగుల్ని* చేశారు;+ 29 అలాగే పేనిన సన్నని నారతో, నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో, ముదురు ఎరుపు దారంతో దట్టీని అల్లారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వాళ్లు చేశారు.

30 చివరిగా వాళ్లు స్వచ్ఛమైన బంగారంతో మెరిసే రేకును, అంటే సమర్పణకు గుర్తుగా ఉన్న పవిత్రమైన రేకును* చేసి, ముద్రమీద చెక్కినట్టు దానిపైన “పవిత్రత యెహోవాకు చెందుతుంది” అనే మాటల్ని చెక్కారు.+ 31 దాన్ని తలపాగా మీద పెట్టడం కోసం నీలంరంగు దారంతో చేసిన ఒక తాడును దానికి కట్టారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వాళ్లు చేశారు.

32 అలా గుడారానికి, అంటే ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పనంతా పూర్తయింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రతీది ఇశ్రాయేలీయులు చేశారు.+ వాళ్లు సరిగ్గా అలాగే చేశారు.

33 తర్వాత వాళ్లు ఆ గుడారాన్ని,+ దాని ఉపకరణాలన్నిటినీ మోషే దగ్గరికి తీసుకొచ్చారు. అవేమిటంటే: దాని కొక్కేలు,+ చట్రాలు,*+ అడ్డకర్రలు,+ స్తంభాలు, దిమ్మలు;+ 34 ఎర్రరంగు అద్దిన పొట్టేలు తోళ్లతో చేసిన కప్పు,+ సముద్రవత్సల* తోళ్లతో చేసిన కప్పు, మందసం ఎదురుగా ఉన్న తెర;+ 35 సాక్ష్యపు మందసం, దాని కర్రలు,+ దాని మూత;+ 36 బల్ల, దాని పాత్రలన్నీ,+ సముఖపు రొట్టెలు;* 37 స్వచ్ఛమైన బంగారంతో చేసిన దీపస్తంభం, దాని దీపాలు,+ దీపాల వరుస, దాని పాత్రలన్నీ,+ దీపాల్ని వెలిగించడానికి నూనె;+ 38 బంగారు వేదిక,*+ అభిషేక తైలం,+ పరిమళ ధూపద్రవ్యం,+ గుడారపు ప్రవేశ ద్వారం కోసం తెర;+ 39 రాగి బలిపీఠం,+ దాని రాగి జల్లెడ, దాని కర్రలు,+ దాని పాత్రలన్నీ,+ గంగాళం, దాని పీఠం;+ 40 ప్రాంగణం కోసం వేలాడే తెరలు, దాని స్తంభాలు, వాటి దిమ్మలు,+ ప్రాంగణ ప్రవేశ ద్వారం కోసం తెర,+ దాని తాళ్లు, దాని మేకులు,+ అలాగే గుడార సేవ కోసం, అంటే ప్రత్యక్ష గుడార సేవ కోసం కావాల్సిన పాత్రలన్నీ; 41 పవిత్రమైన స్థలంలో సేవ చేయడానికి నేర్పుగా అల్లిన వస్త్రాలు, యాజకుడైన అహరోను కోసం పవిత్ర వస్త్రాలు, యాజకులుగా సేవచేసేలా అతని కుమారుల కోసం వస్త్రాలు.

42 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటి ప్రకారమే ఇశ్రాయేలీయులు ఆ పనంతా చేశారు.+ 43 మోషే వాళ్లు చేసిన పనంతటినీ తనిఖీ చేసినప్పుడు, వాళ్లు ఆ పనంతా యెహోవా ఆజ్ఞాపించినట్టే చేశారని గమనించాడు; దాంతో మోషే వాళ్లను దీవించాడు.

40 తర్వాత యెహోవా మోషేకు ఇలా చెప్పాడు: 2 “మొదటి నెల మొదటి రోజున నువ్వు గుడారాన్ని, అంటే ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టాలి.+ 3 నువ్వు సాక్ష్యపు మందసాన్ని దాని లోపల పెట్టి, అది కనిపించకుండా తెరను వేలాడదీయి. 4 నువ్వు బల్లను కూడా లోపలికి తీసుకొచ్చి, దానికి సంబంధించిన వస్తువుల్ని దానిమీద సర్దాలి; అలాగే దీపస్తంభాన్ని లోపలికి తీసుకొచ్చి, దాని దీపాల్ని వెలిగించాలి. 5 తర్వాత నువ్వు బంగారు ధూపవేదికను సాక్ష్యపు మందసం ఎదురుగా పెట్టి, గుడారపు ప్రవేశ ద్వారం తెరను వేలాడదీయి.

6 “దహనబలులు అర్పించే బలిపీఠాన్ని నువ్వు గుడారపు ప్రవేశ ద్వారం ముందు, అంటే ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం ముందు పెట్టాలి. 7 గంగాళాన్ని ప్రత్యక్ష గుడారానికి, బలిపీఠానికి మధ్య ఉంచి దానిలో నీళ్లు పోయాలి. 8 తర్వాత దాని చుట్టూ ప్రాంగణాన్ని+ నిలబెట్టి, ప్రాంగణ ప్రవేశ ద్వారం తెరను+ వేలాడదీయి. 9 ఆ తర్వాత నువ్వు అభిషేక తైలం+ తీసుకొని గుడారాన్ని, దానిలో ఉన్న వాటన్నిటినీ అభిషేకించి, దాన్నీ దాని పాత్రలన్నిటినీ పవిత్రపర్చాలి. అప్పుడది పవిత్రమౌతుంది. 10 దహనబలులు అర్పించే బలిపీఠాన్ని, దాని పాత్రలన్నిటినీ నువ్వు అభిషేకించి ఆ బలిపీఠాన్ని పవిత్రపర్చాలి. అప్పుడది అతి పవిత్రమైన బలిపీఠం అవుతుంది.+ 11 అలాగే గంగాళాన్ని, దాని పీఠాన్ని అభిషేకించి దాన్ని పవిత్రపర్చు.

12 “తర్వాత అహరోనును, అతని కుమారుల్ని ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరికి తీసుకొచ్చి వాళ్లకు నీళ్లతో స్నానం చేయించు. 13 నువ్వు అహరోనుకు పవిత్ర వస్త్రాలు తొడిగి,+ అతన్ని అభిషేకించి,+ పవిత్రపర్చాలి. అప్పుడతను నాకు యాజకుడిగా సేవచేస్తాడు. 14 తర్వాత అతని కుమారుల్ని దగ్గరికి తీసుకొచ్చి, వాళ్లకు చొక్కాలు తొడుగు.+ 15 వాళ్లు నాకు యాజకులుగా సేవచేసేలా, నువ్వు వాళ్ల నాన్నను అభిషేకించినట్టే వాళ్లను కూడా అభిషేకించాలి.+ ఈ అభిషేకం వల్ల వాళ్లు తరతరాలపాటు యాజకులుగా సేవచేస్తారు, యాజకత్వం ఎప్పటికీ వాళ్లదౌతుంది.”+

16 యెహోవా తనకు ఆజ్ఞాపించిన వాటన్నిటి ప్రకారం మోషే చేశాడు.+ అతను సరిగ్గా అలాగే చేశాడు.

17 రెండో సంవత్సరం మొదటి నెల మొదటి రోజున గుడారాన్ని నిలబెట్టారు.+ 18 మోషే ఆ గుడారాన్ని నిలబెట్టినప్పుడు అతను దాని దిమ్మల్ని+ కిందపెట్టి, వాటిలో చట్రాల్ని* నిలబెట్టాడు; తర్వాత దాని అడ్డకర్రల్ని+ వాటిలో పెట్టి, దాని స్తంభాల్ని నిలబెట్టాడు. 19 తర్వాత అతను గుడారం+ పైన దాని కప్పుల్ని పరిచాడు.+ యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.

20 తర్వాత అతను సాక్ష్యపు పలకల్ని మందసంలో+ ఉంచి, దానికి కర్రలు+ పెట్టి, దానిపైన మూత+ పెట్టాడు. 21 అతను ఆ మందసాన్ని గుడారం లోపలికి తీసుకొచ్చి, ఆ సాక్ష్యపు మందసం కనిపించకుండా ఉండేలా తెరను+ వేలాడదీశాడు.+ యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.

22 తర్వాత అతను బల్లను+ ప్రత్యక్ష గుడారంలోకి తీసుకొచ్చి, దాన్ని గుడారం ఉత్తరం వైపున, తెర బయట పెట్టాడు. 23 తర్వాత యెహోవా ముందు దానిమీద రొట్టెల వరుసను+ పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.

24 అతను దీపస్తంభాన్ని+ కూడా ప్రత్యక్ష గుడారంలోకి తీసుకొచ్చి, దాన్ని గుడారం దక్షిణం వైపున బల్ల ఎదురుగా పెట్టాడు. 25 తర్వాత అతను యెహోవా ముందు దీపాల్ని+ వెలిగించాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.

26 తర్వాత అతను బంగారు వేదికను*+ ప్రత్యక్ష గుడారంలోకి తీసుకొచ్చి, దాన్ని తెర ఎదురుగా పెట్టాడు. 27 దానిమీద పరిమళ ధూపద్రవ్యాన్ని+ కాల్చి, పొగ పైకిలేచేలా చేస్తారు.+ యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.

28 తర్వాత అతను గుడారపు ప్రవేశ ద్వారం తెరను వేలాడదీశాడు.+

29 అతను దహనబలిని,+ ధాన్యార్పణను అర్పించేలా దహనబలులు అర్పించే బలిపీఠాన్ని+ గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర, అంటే ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.

30 తర్వాత అతను ప్రత్యక్ష గుడారానికి, బలిపీఠానికి మధ్య గంగాళాన్ని పెట్టి, యాజకులు కాళ్లూచేతులు కడుక్కోవడానికి అందులో నీళ్లు పోశాడు. 31 మోషే, అహరోను, అతని కుమారులు అక్కడ తమ కాళ్లూచేతులు కడుక్కునేవాళ్లు. 32 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే, వాళ్లు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్లినప్పుడల్లా లేదా బలిపీఠం దగ్గరికి వెళ్లినప్పుడల్లా కాళ్లూచేతులు కడుక్కునేవాళ్లు.+

33 చివరిగా అతను గుడారం చుట్టూ ప్రాంగణాన్ని,+ బలిపీఠాన్ని నిలబెట్టి, ప్రాంగణ ప్రవేశ ద్వారం తెరను+ వేలాడదీశాడు.

అలా మోషే ఆ పనిని పూర్తిచేశాడు. 34 అప్పుడు ఆ మేఘం ప్రత్యక్ష గుడారాన్ని కప్పడం మొదలుపెట్టింది, గుడారం యెహోవా మహిమతో నిండిపోయింది.+ 35 ఆ మేఘం ప్రత్యక్ష గుడారం పైన నిలిచివుండడం వల్ల, గుడారం యెహోవా మహిమతో నిండిపోవడం వల్ల మోషే దాని లోపలికి వెళ్లలేకపోయాడు.+

36 ఇశ్రాయేలీయులు తమ ప్రయాణమంతటిలో, ఆ మేఘం ఎప్పుడైతే గుడారం మీది నుండి పైకి లేస్తుందో అప్పుడు వాళ్లు తమ డేరాలు తీసేసి ప్రయాణం మొదలుపెట్టేవాళ్లు.+ 37 కానీ ఆ మేఘం పైకి లేవకపోతే, అది లేచే రోజు వరకు వాళ్లు డేరాలు తీసేసేవాళ్లు కాదు.+ 38 ఇశ్రాయేలీయుల ప్రయాణమంతటిలో వాళ్లందరి కళ్లముందు, పగటిపూట యెహోవా మేఘం గుడారం పైన ఉండేది, అలాగే రాత్రిపూట అగ్ని దాని పైన నిలిచివుండేది.+

లేదా “ఈజిప్టుకు.”

అక్ష., “ఇశ్రాయేలు కుమారులు.”

లేదా “యుక్తిగా.”

అంటే, పురుడుపోసే స్త్రీలు.

లేదా “పపైరస్‌ గంప.”

“తీయబడిన” అని అర్థం. అంటే, నీళ్లలో నుండి రక్షించబడినవాడని భావం.

లేదా “మోషే బలంగా తయారౌతున్నప్పుడు.”

లేదా “ఆ స్త్రీల పక్షాన నిలబడి.”

అంటే, యిత్రో.

“అక్కడ నివసించే ఒక పరదేశి” అని అర్థం.

అక్ష., “చాలా రోజుల.”

లేదా “నిబంధనను.”

పదకోశం చూడండి.

లేదా “సేవిస్తారు.”

లేదా “ఎంచుకుంటే.”

అనుబంధం A4 చూడండి.

లేదా “బలమైన.”

లేదా “సూచన.”

అక్ష., “నీ నోటికి.”

లేదా “దేవుని ప్రతినిధిగా.”

బహుశా, మోషే కుమారుణ్ణి సూచిస్తుండవచ్చు.

పంట కోసిన తర్వాత నేలమీద మిగిలే కాడల దుబ్బు.

లేదా “పనులు చేయించేవాళ్లు.”

లేదా “బలమైన.”

లేదా “శక్తివంతమైన.”

అక్ష., “నా చెయ్యి ఎత్తి.”

అక్ష., “సున్నతిలేని పెదవులు గల.”

అక్ష., “సున్నతిలేని పెదవులు గల.”

అక్ష., “దేవుడిగా.”

అక్ష., “సైన్యాల్ని.”

అంటే, నైలు కాలువలు.

లేదా “తొట్లలోకి.”

లేదా “ప్రాంగణాల్లో.”

ఇవి ఐగుప్తులో సాధారణంగా కనిపించే దోమలాంటి చిన్న కీటకాలు.

ఇవి ఒకరకమైన కుట్టే ఈగలు.

అంటే, ఐగుప్తీయులు.

ఇది బహుశా శక్తివంతమైన మెరుపుల్ని వర్ణిస్తుండవచ్చు.

ఇవి ప్రాచీన ఐగుప్తులో పండే తక్కువ రకం గోధుమలు.

లేదా “మనల్ని బెదిరిస్తూ.”

మోషే అని తెలుస్తోంది.

లేదా “తీసుకెళ్లనిస్తావు.”

అక్ష., “ఒక్క డెక్కను.”

అక్ష., “తండ్రుల ఇంటికి.”

అక్ష., “రెండు సాయంత్రాల మధ్య.” సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడడానికి ముందు ఉండే సమయాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.

ఇది మోకాలు కింది భాగాన్ని సూచిస్తోంది.

లేదా “దట్టీ.”

లేదా “చంపబడాలి.”

అక్ష., “సైన్యాల్ని.”

లేదా “చంపబడాలి.”

అంటే, గొర్రెపిల్లను గానీ మేకపిల్లను గానీ.

లేదా “చంపేసే.”

లేదా “తొట్లతో.”

అక్ష., “కాల్బలమే.” సైనిక సేవకు తగిన పురుషుల్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.

అంటే, ఐగుప్తీయులు, అలాగే ఇశ్రాయేలీయులుకాని ఇతరులు.

అక్ష., “సైన్యాలన్నీ.”

అక్ష., “సైన్యాలతో.”

లేదా “పవిత్రపర్చు.”

అనుబంధం B15 చూడండి.

అక్ష., “సరిహద్దులన్నిట్లో.”

అక్ష., “నీ కళ్ల మధ్య.”

లేదా “జ్ఞాపికగా.”

అక్ష., “నీ కళ్ల మధ్య.”

ఇది ఎర్రసముద్రం అని స్పష్టమౌతోంది.

అంటే, దాదాపు రాత్రి 2 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు.

అక్ష., “చేతిని.”

అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.

పంట కోసిన తర్వాత నేలమీద మిగిలే కాడల దుబ్బు.

షేక్‌ అంటే గోత్రపు పెద్ద.

లేదా “నియంతలు.”

అంటే, గిలకల తప్పెట.

“చేదు” అని అర్థం.

అక్ష., “రెండు సాయంత్రాల మధ్య.” సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడడానికి ముందు ఉండే సమయాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.

దాదాపు 2.2 లీటర్లు. అనుబంధం B14 చూడండి.

లేదా “సబ్బాతు ఆచరణగా.”

లేదా “విశ్రాంతి తీసుకున్నారు.”

బహుశా “ఇది ఏంటి?” అనే అర్థమున్న హీబ్రూ పదం నుండి వచ్చింది.

ఇది ముఖ్యమైన దస్తావేజుల్ని భద్రపర్చే ఒక పెట్టె.

అప్పట్లో ఒక ఈఫా 22 లీటర్లతో (13 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

“పరీక్షించడం; పరీక్ష” అని అర్థం.

“గొడవపడడం” అని అర్థం.

లేదా “జ్ఞాపికగా.”

“యెహోవాయే నా ధ్వజస్తంభం” అని అర్థం.

అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.

“అక్కడ నివసించే ఒక పరదేశి” అని అర్థం.

“నా దేవుడే సహాయకుడు” అని అర్థం.

అక్ష., “ఐగుప్తు చేతి.”

అక్ష., “ప్రతీ సమయంలో.”

లేదా “విలువైన సంపద.”

అక్ష., “పొట్టేలు కొమ్ము.”

లేదా “లైంగిక సంబంధాలకు దూరంగా ఉండండి.”

అక్ష., “కొమ్ము.”

లేదా “బట్టీలో.” ఇటుకలు, మట్టి పాత్రలు కాల్చడానికి ఉపయోగించే ఒక రకమైన పొయ్యి.

అక్ష., “కొమ్ము.”

లేదా “నాకు విరోధంగా.”

లేదా “ప్రతిరూపాన్ని.”

అక్ష., “కొమ్ము.”

అక్ష., “మర్మాంగాలు.”

అక్ష., “విడిపించడానికి.”

లేదా “ఒక పనిముట్టుతో” అయ్యుంటుంది.

అక్ష., “ఆమె పిల్లలు బయటికి వచ్చారు.”

లేదా “తీవ్రమైన హాని.”

లేదా “విమోచన క్రయధనం.”

అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

లేదా “ధాన్యపు వెన్నుల కట్టల్ని.”

లేదా “అనాథల్ని.”

లేదా “అక్రమ వడ్డీ వసూలుచేసే వాడిలా.”

లేదా “జామీనుగా.”

లేదా “దయ.”

లేదా “పరిపాలకుణ్ణి.”

లేదా “దూషించకూడదు.”

అంటే, నూనె గానుగలు, ద్రాక్షతొట్లు.

లేదా “దుష్టుణ్ణి నిర్దోషిగా విడుదల చేయను.”

లేదా “పరదేశి జీవితం (ప్రాణం) ఎలా ఉంటుందో.”

అనుబంధం B15 చూడండి.

వారాల పండుగ లేదా పెంతెకొస్తు పండుగ అని కూడా అనేవాళ్లు.

పర్ణశాలల (గుడారాల) పండుగ అని కూడా అనేవాళ్లు.

లేదా “పూర్తి ఆయుష్షును.”

లేదా “మీకు వెన్ను చూపేలా.”

లేదా “వాళ్లకు భయాందోళన కలిగిస్తాను” అయ్యుంటుంది.

అంటే, మధ్యధరా సముద్రం.

అంటే, యూఫ్రటీసు.

లేదా “ఎరుపు-ఊదారంగు కలగలిసిన రంగు అద్దిన ఉన్ని.”

ఈ దారానికి వేసే రంగు, కాక్కస్‌ అనే సూక్ష్మజీవి నుండి వస్తుంది.

అంటే, సీల్‌ అనే సముద్ర జీవి.

లేదా “గుడారంలో నివసిస్తాను.”

అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

లేదా “సాక్ష్యంగా ఉండే రాతి పలకల్ని.”

లేదా “నకిషీ పనిగా చేయాలి.”

లేదా “సాక్ష్యంగా ఉండే రాతి పలకల్ని.”

దాదాపు 7.4 సెంటీమీటర్లు (2.9 అంగుళాలు). అనుబంధం B14 చూడండి.

లేదా “సన్నిధి రొట్టెలు.”

అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.

అంటే, ఎంబ్రాయిడరీ.

అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

అంటే, సీల్‌ అనే సముద్ర జీవి.

లేదా “ఫ్రేములు.”

అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

లేదా “కొవ్వు బూడిదను,” అంటే, బలి ఇచ్చే జంతువుల కొవ్వులో నానిన బూడిద.

అంటే, ఎంబ్రాయిడరీ.

లేదా “అల్లిన దట్టీని.”

దాదాపు 22.2 సెంటీమీటర్లు (8.75 అంగుళాలు). అనుబంధం B14 చూడండి.

ఇది గుర్తుతెలియని ఒక మణి.

లేదా “అగేటు.”

అక్ష., “గుండె.”

పదకోశం చూడండి.

లేదా “వాళ్ల చేతుల్ని అధికారంతో నింపి.”

లేదా “లోదుస్తుల్ని.”

అక్ష., “విత్తనం.”

వడ ఆకారంలో ఉన్న రొట్టెలు.

లేదా “అల్లిన దట్టీని.”

లేదా “పవిత్రమైన కిరీటాన్ని.”

లేదా “వాళ్ల చేతుల్ని అధికారంతో నింపాలి.”

ఇది మోకాలు కింది భాగాన్ని సూచిస్తోంది.

లేదా “శాంతపర్చే.”

వడ ఆకారంలో ఉన్న రొట్టె.

లేదా “శాంతపర్చే.”

లేదా “వాళ్ల చేతుల్ని అధికారంతో నింపి.”

లేదా “అపరిచితులు,” అంటే, అహరోను వంశస్థులు కానివాళ్లు.

లేదా “వాళ్ల చేతుల్ని అధికారంతో నింపడానికి.”

అక్ష., “రెండు సాయంత్రాల మధ్య.” సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడడానికి ముందు ఉండే సమయాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.

అప్పట్లో ఒక ఈఫా 22 లీటర్లతో (13 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

అప్పట్లో ఒక హిన్‌ 3.67 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.

అక్ష., “రెండు సాయంత్రాల మధ్య.” సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడడానికి ముందు ఉండే సమయాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.

లేదా “శాంతపర్చే.”

దాదాపు 44.5 సెంటీమీటర్లు (17.5 అంగుళాలు). అనుబంధం B14 చూడండి.

అక్ష., “రెండు సాయంత్రాల మధ్య.” సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడడానికి ముందు ఉండే సమయాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.

లేదా “పవిత్ర షెకెల్‌.”

అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

అప్పట్లో ఒక గీరా 0.57 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

లేదా “దాదాపు 6 కిలోల.”

లేదా “దాదాపు 3 కిలోల.”

లేదా “పవిత్ర షెకెల్‌.”

అప్పట్లో ఒక హిన్‌ 3.67 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.

లేదా “అపరిచితుల,” అంటే, అహరోను వంశస్థులు కానివాళ్ల.

లేదా “చంపేయాలి.”

లేదా “చంపేయాలి.”

అక్ష., “పేరు పెట్టి పిలిచాను.”

లేదా “చంపేయాలి.”

లేదా “పోత విగ్రహాన్ని.”

లేదా “మనసు మార్చుకో.”

అక్ష., “విత్తనాన్ని.”

అక్ష., “విత్తనానికి.”

లేదా “మనసు మార్చుకున్నాడు.”

లేదా “పరాక్రమ కార్యం గురించి.”

అక్ష., “విత్తనానికి.”

అక్ష., “తీసేశారు.”

అక్ష., “నువ్వు నాకు పేరుతో తెలుసు.”

అక్ష., “నువ్వు నాకు పేరుతో తెలుసు.”

లేదా “దయ.”

లేదా “కోప్పడే విషయంలో నిదానించే.”

లేదా “ప్రేమపూర్వక దయను.”

లేదా “నమ్మకమైనవాడు; ఎల్లప్పుడూ మాట నిలబెట్టుకుంటాడు.”

పదకోశం చూడండి.

అక్ష., “యెహోవా ఆయన పేరు.”

లేదా “ప్రత్యర్థుల్ని సహించని.”

అనుబంధం B15 చూడండి.

లేదా “విశ్రాంతి రోజును ఆచరిస్తారు.”

పర్ణశాలల (గుడారాల) పండుగ అని కూడా అనేవాళ్లు.

యెహోవాను సూచిస్తుందని స్పష్టమౌతోంది.

అక్ష., “ఆ పది మాటల్ని.”

అక్ష., “ఆయనతో.”

అంటే, సీల్‌ అనే సముద్ర జీవి.

లేదా “ఫ్రేములు.”

లేదా “సన్నిధి రొట్టెలు.”

లేదా “అల్లాడించే అర్పణలుగా.”

అంటే, ఎంబ్రాయిడరీ.

బెసలేలును సూచిస్తుందని స్పష్టమౌతోంది.

అంటే, ఎంబ్రాయిడరీ.

అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

అంటే, సీల్‌ అనే సముద్ర జీవి.

లేదా “ఫ్రేములు.”

అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

లేదా “నకిషీ పనిగా చేశాడు.”

దాదాపు 7.4 సెంటీమీటర్లు (2.9 అంగుళాలు). అనుబంధం B14 చూడండి.

అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.

అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

అంటే, బాగా మెరుగుపెట్టిన లోహపు అద్దాలు.

అంటే, ఎంబ్రాయిడరీ.

లేదా “పవిత్ర షెకెల్‌.”

అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.

అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

లేదా “పవిత్ర షెకెల్‌.”

లేదా “పవిత్ర షెకెల్‌.”

లేదా “అల్లాడించే అర్పణగా.”

అంటే, ఎంబ్రాయిడరీ.

లేదా “అల్లిన దట్టీని.”

దాదాపు 22.2 సెంటీమీటర్లు (8.75 అంగుళాలు). అనుబంధం B14 చూడండి.

ఇది గుర్తుతెలియని ఒక మణి.

లేదా “అగేటు.”

లేదా “లోదుస్తుల్ని.”

లేదా “పవిత్రమైన కిరీటాన్ని.”

లేదా “ఫ్రేములు.”

అంటే, సీల్‌ అనే సముద్ర జీవి.

లేదా “సన్నిధి రొట్టెలు.”

అంటే, ధూపవేదిక.

లేదా “ఫ్రేముల్ని.”

అంటే, ధూపవేదిక.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి