న్యాయాధిపతులు
17 ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలో+ మీకా అనే ఒక వ్యక్తి ఉండేవాడు. 2 అతను వాళ్ల అమ్మతో ఇలా అన్నాడు: “ఎవరో నీ దగ్గర నుండి 1,100 వెండి రూకలు దొంగిలించారు, నువ్వు ఆ దొంగను శపించడం నేను విన్నాను. ఇదిగో, ఆ వెండి నా దగ్గరే ఉంది, వాటిని తీసుకుంది నేనే.” అప్పుడు వాళ్ల అమ్మ, “యెహోవా నా కుమారుణ్ణి దీవించాలి” అంది. 3 అతను ఆ 1,100 వెండి రూకల్ని వాళ్ల అమ్మకు తిరిగిచ్చేశాడు; కానీ ఆమె, “నేను ఆ వెండిని యెహోవా కోసం ప్రతిష్ఠిస్తాను. వాటితో నీ కోసం ఒక చెక్కుడు విగ్రహాన్ని, ఒక పోత* విగ్రహాన్ని చేయించుకో.+ ఇదిగో వాటిని మళ్లీ నీకే ఇస్తున్నాను” అని చెప్పింది.
4 అతను వెండిని వాళ్ల అమ్మకు తిరిగిచ్చేశాక, ఆమె 200 వెండి రూకలు తీసి ఒక కంసాలికి ఇచ్చింది. అతను ఒక చెక్కుడు విగ్రహాన్ని, ఒక పోత విగ్రహాన్ని తయారుచేశాడు; వాటిని మీకా ఇంట్లో ఉంచారు. 5 ఈ మీకాకు దేవుళ్ల గుడి ఒకటి ఉంది; అతను ఒక ఏఫోదును,+ గృహదేవతల విగ్రహాల్ని+ తయారుచేసి, తన కోసం యాజకునిగా సేవ చేయడానికి తన కుమారుల్లో ఒకతన్ని ప్రతిష్ఠించాడు.*+ 6 ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకు రాజు లేడు.+ ప్రతీ ఒక్కరు తమ దృష్టికి ఏది సరైనది అనిపిస్తే అది చేస్తున్నారు.+
7 ఆ కాలంలో యూదాలోని బేత్లెహేములో+ ఒక యువకుడు ఉండేవాడు. అతను ఒక లేవీయుడు,+ అతను కొంతకాలంగా యూదా వంశస్థుల మధ్య నివసిస్తున్నాడు. 8 అతను తాను నివసించడం కోసం ఒక స్థలం వెదకడానికి యూదాలోని బేత్లెహేము నగరం నుండి బయల్దేరాడు. అతను ప్రయాణిస్తూ, ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలో ఉన్న మీకా ఇంటికి వచ్చాడు.+ 9 అప్పుడు మీకా అతన్ని, “నువ్వు ఎక్కడి నుండి వచ్చావు?” అని అడిగాడు. దానికి అతను, “నేను యూదాలోని బేత్లెహేముకు చెందిన లేవీయుణ్ణి, నేను నివసించడానికి ఒక స్థలం వెదుకుతున్నాను” అని చెప్పాడు. 10 అందుకు మీకా అతనితో, “నాతో పాటు ఉండి, నాకు తండ్రిగా,* యాజకునిగా సేవ చేయి. నీకు భోజనంతో పాటు ఒక జత బట్టలు, సంవత్సరానికి పది వెండి రూకలు ఇస్తాను” అన్నాడు. దాంతో లేవీయుడు ఇంట్లోకి వెళ్లాడు. 11 అలా ఆ లేవీయుడు మీకాతో పాటు ఉండడానికి ఒప్పుకున్నాడు. అతను మీకా కుమారుల్లో ఒకడిలా అయ్యాడు. 12 అంతేకాదు, మీకా తన కోసం యాజకునిగా సేవ చేయడానికి ఆ లేవీయుణ్ణి ప్రతిష్ఠించాడు.*+ అతను మీకా ఇంట్లో నివసించాడు. 13 అప్పుడు మీకా ఇలా అన్నాడు: “ఒక లేవీయుడు నాకు యాజకుడు అయ్యాడు కాబట్టి యెహోవా నాకు మేలు చేస్తాడని ఇప్పుడు నాకు తెలుసు.”