సంఖ్యాకాండం
19 యెహోవా మళ్లీ మోషే, అహరోనులతో మాట్లాడుతూ ఇలా అన్నాడు: 2 “ఇది యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రంలోని ఒక శాసనం: ‘ఏ లోపంలేని,+ ఇప్పటివరకు ఏ కాడినీ మోయని ఒక ఎర్రని ఆవును నీ కోసం తీసుకురమ్మని ఇశ్రాయేలీయులకు చెప్పు. 3 మీరు దాన్ని యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వాలి, అతను దాన్ని పాలెం బయటికి తోలుకెళ్లాలి; తర్వాత అది అతని ముందు వధించబడుతుంది. 4 యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలో కొంచెం తన వేలితో తీసుకొని నేరుగా ప్రత్యక్ష గుడారం ముందుభాగం వైపు ఏడుసార్లు చిమ్ముతాడు.+ 5 తర్వాత అతని కళ్లముందే ఆ ఆవు కాల్చబడుతుంది. దాని చర్మం, మాంసం, రక్తం, పేడ కూడా కాల్చబడతాయి.+ 6 యాజకుడు దేవదారు చెక్కను, హిస్సోపును,+ ముదురు ఎరుపు దారాన్ని తీసుకొని ఆ ఆవు ఎక్కడైతే కాల్చబడుతోందో ఆ అగ్నిలో వేస్తాడు. 7 తర్వాత యాజకుడు తన వస్త్రాల్ని ఉతుక్కొని నీళ్లతో స్నానం చేస్తాడు, ఆ తర్వాత అతను పాలెంలోకి రావచ్చు; అయితే సాయంకాలం వరకు అతను అపవిత్రుడిగా ఉంటాడు.
8 “ ‘ఆ ఆవును కాల్చిన వ్యక్తి కూడా తన వస్త్రాల్ని ఉతుక్కొని నీళ్లతో స్నానం చేస్తాడు, అయితే సాయంకాలం వరకు అతను అపవిత్రుడిగా ఉంటాడు.
9 “ ‘పవిత్రంగా ఉన్న ఒక వ్యక్తి ఆ ఆవు బూడిదను+ పోగుచేసి, పాలెం బయట ఒక పవిత్రమైన చోట వేయాలి; శుద్ధీకరణ కోసం ఉపయోగించే నీళ్లను+ తయారుచేయడానికి ఇశ్రాయేలీయుల సమాజం ఆ బూడిదను భద్రపర్చాలి. అది పాపపరిహారార్థ బలి. 10 ఆ ఆవు బూడిదను పోగుచేసే వ్యక్తి తన వస్త్రాల్ని ఉతుక్కొని, సాయంకాలం వరకు అపవిత్రుడిగా ఉంటాడు.
“ ‘ఇది ఇశ్రాయేలీయులకు, వాళ్లమధ్య నివసించే పరదేశులకు శాశ్వత శాసనం.+ 11 చనిపోయిన వ్యక్తిని* ముట్టుకునే ఏ వ్యక్తయినా ఏడురోజుల పాటు అపవిత్రుడిగా ఉంటాడు.+ 12 అలాంటి వ్యక్తి మూడో రోజున ఆ నీళ్లతో తనను తాను శుద్ధీకరించుకోవాలి, ఏడో రోజున అతను పవిత్రుడౌతాడు. ఒకవేళ మూడో రోజున అతను తనను తాను శుద్ధీకరించుకోకపోతే, ఏడో రోజున అతను పవిత్రుడు అవ్వడు. 13 చనిపోయిన వ్యక్తిని* ముట్టుకొని తనను తాను శుద్ధీకరించుకోని ప్రతీ వ్యక్తి యెహోవా గుడారాన్ని అపవిత్రపర్చినట్టే,+ ఆ వ్యక్తి ఇశ్రాయేలీయుల్లో నుండి కొట్టివేయబడాలి.*+ శుద్ధీకరించే నీళ్లు+ అతని మీద చిలకరించబడలేదు కాబట్టి అతను అపవిత్రుడిగానే ఉంటాడు. అతని అపవిత్రత అతని మీద అలాగే నిలిచివుంటుంది.
14 “ ‘ఒక వ్యక్తి డేరాలో చనిపోయినప్పుడు, పాటించాల్సిన నియమం ఇది: ఆ డేరాలోకి వెళ్లే ప్రతీ ఒక్కరు, అప్పటికే ఆ డేరాలో ఉన్న ప్రతీ ఒక్కరు ఏడురోజుల పాటు అపవిత్రులుగా ఉంటారు. 15 మూత లేని* ప్రతీ పాత్ర అపవిత్రం అవుతుంది.+ 16 బయట, కత్తి చేత చంపబడిన వ్యక్తిని గానీ, శవాన్ని గానీ, చనిపోయిన వ్యక్తి ఎముకను గానీ, సమాధిని గానీ ఎవరైనా ముట్టుకుంటే అతను ఏడురోజుల పాటు అపవిత్రుడిగా ఉంటాడు.+ 17 అపవిత్రుడైన ఆ వ్యక్తి కోసం వాళ్లు పాపపరిహారార్థ బలి బూడిదలో కొంచెం ఒక పాత్రలో తీసుకొని, దానిమీద స్వచ్ఛమైన నీళ్లు పోయాలి. 18 ఆ తర్వాత పవిత్రుడిగా ఉన్న ఒక వ్యక్తి+ హిస్సోపును+ తీసుకొని, ఆ నీళ్లలో ముంచి వాటిని ఆ డేరా మీద, దాని పాత్రలన్నిటి మీద, ఆ డేరాలో ఉన్న మనుషుల మీద, అలాగే చనిపోయిన వ్యక్తి ఎముకను గానీ, కత్తి చేత చంపబడిన వ్యక్తిని గానీ, శవాన్ని గానీ, సమాధిని గానీ తాకిన వ్యక్తి మీద చిమ్ముతాడు. 19 పవిత్రుడిగా ఉన్న వ్యక్తి మూడో రోజున, అలాగే ఏడో రోజున ఆ నీళ్లను అపవిత్రుడైన వ్యక్తి మీద చిమ్ముతాడు; అలా ఏడో రోజున అతను ఆ వ్యక్తిని పాపం నుండి శుద్ధీకరిస్తాడు.+ తర్వాత ఆ వ్యక్తి తన వస్త్రాల్ని ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి; ఆ రోజు సాయంకాలం అతను పవిత్రుడౌతాడు.
20 “ ‘అయితే అపవిత్రుడిగా ఉండి తనను తాను శుద్ధీకరించుకోని వ్యక్తి, సమాజం నుండి కొట్టివేయబడాలి;*+ ఎందుకంటే అతను యెహోవా పవిత్రమైన స్థలాన్ని అపవిత్రం చేశాడు. శుద్ధీకరించే నీళ్లు అతని మీద చిలకరించబడలేదు, కాబట్టి అతను అపవిత్రుడు.
21 “ ‘ఇది వాళ్లకు శాశ్వత శాసనంగా పనిచేస్తుంది: శుద్ధీకరించే నీళ్లను చిమ్మే+ వ్యక్తి తన వస్త్రాల్ని ఉతుక్కోవాలి; అంతేకాదు, శుద్ధీకరించే ఆ నీళ్లను ముట్టుకునే వ్యక్తి సాయంకాలం వరకు అపవిత్రుడిగా ఉంటాడు. 22 అపవిత్రుడైన వ్యక్తి దేన్ని ముట్టుకుంటే అది అపవిత్రమౌతుంది; దాన్ని ముట్టుకునే వ్యక్తి కూడా సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు.’ ”+