హగ్గయి
1 దర్యావేషు రాజు పరిపాలన రెండో సంవత్సరం ఆరో నెల మొదటి రోజున, యెహోవా వాక్యం హగ్గయి* ప్రవక్త+ ద్వారా యూదా అధిపతీ షయల్తీయేలు కుమారుడూ అయిన జెరుబ్బాబెలుకు,+ ప్రధానయాజకుడూ యెహోజాదాకు కుమారుడూ అయిన యెహోషువకు ఇలా చెప్పింది:
2 “సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్పేదేమిటంటే, ‘ఈ ప్రజలు “యెహోవా మందిరాన్ని* నిర్మించాల్సిన* సమయం ఇంకా రాలేదు” అని అంటున్నారు.’ ”+
3 యెహోవా వాక్యం మళ్లీ హగ్గయి+ ప్రవక్త ద్వారా ఇలా చెప్పింది: 4 “ఈ మందిరం పాడైన స్థితిలో ఉండగా,+ మీరు అందమైన ఇళ్లలో నివసించడానికి ఇది సమయమా? 5 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇప్పుడు ఇలా అంటున్నాడు: ‘మీ మార్గాల్ని జాగ్రత్తగా పరిశీలించుకోండి. 6 మీరు చాలా ఎక్కువగా విత్తారు, కానీ కొంచెం పంటనే కోస్తున్నారు.+ మీరు తింటున్నారు, కానీ మీ కడుపు నిండట్లేదు. మీరు తాగుతున్నారు, కానీ మీకు తృప్తి కలగట్లేదు. మీరు బట్టలు వేసుకుంటున్నారు, కానీ ఎవ్వరికీ వెచ్చదనం కలగట్లేదు. పనివాడు తన జీతాన్ని చిల్లులు పడ్డ సంచిలో వేసుకుంటున్నాడు.’ ”
7 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘మీ మార్గాల్ని జాగ్రత్తగా పరిశీలించుకోండి.’
8 “ ‘పర్వతాల మీదికి వెళ్లి కలపను తీసుకొచ్చి,+ నా మందిరాన్ని కట్టండి.+ అప్పుడు నేను దాని విషయంలో సంతోషిస్తాను, నేను మహిమపర్చబడతాను’+ అని యెహోవా చెప్తున్నాడు.”
9 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘మీరు ఎక్కువ పంటను ఆశిస్తూ వచ్చారు, కానీ కొంచెమే పండింది; మీరు దాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను నా ఊపిరితో దాన్ని చెదరగొట్టేశాను.+ ఎందుకు? నా మందిరం పాడైన స్థితిలో ఉంటే, మీరేమో మీ మీ ఇళ్లను చూసుకోవడంలో మునిగిపోయారు.+ 10 కాబట్టి మీ పైన ఉన్న ఆకాశం మంచును కురిపించలేదు, భూమి దాని పంటను ఇవ్వలేదు. 11 నేను భూమి మీదికి, పర్వతాల మీదికి, ధాన్యం మీదికి, ద్రాక్షారసం మీదికి, నూనె మీదికి, మొక్కల మీదికి, మనుషుల మీదికి, పశువుల మీదికి, మీ చేతుల కష్టమంతటి మీదికి కరువు రప్పిస్తూ వచ్చాను.’ ”
12 షయల్తీయేలు+ కుమారుడైన జెరుబ్బాబెలు,+ అలాగే ప్రధానయాజకుడూ యెహోజాదాకు+ కుమారుడూ అయిన యెహోషువ, మిగతా ప్రజలందరూ తమ దేవుడైన యెహోవా స్వరాన్ని, హగ్గయి ప్రవక్త మాటల్ని విన్నారు. ఎందుకంటే తమ దేవుడైన యెహోవాయే అతన్ని పంపించాడు; అంతేకాదు ప్రజలు యెహోవాకు భయపడడం మొదలుపెట్టారు.
13 తర్వాత యెహోవా సందేశకుడైన హగ్గయి, యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, “ ‘నేను మీతో ఉన్నాను’+ అని యెహోవా అంటున్నాడు” అనే సందేశాన్ని ప్రజలకు ప్రకటించాడు.
14 కాబట్టి యూదా అధిపతీ షయల్తీయేలు కుమారుడూ అయిన జెరుబ్బాబెలు+ హృదయాన్ని; ప్రధానయాజకుడూ యెహోజాదాకు కుమారుడూ అయిన యెహోషువ+ హృదయాన్ని; మిగతా ప్రజలందరి హృదయాల్ని యెహోవా కదిలించాడు.+ దాంతో వాళ్లు వచ్చి, సైన్యాలకు అధిపతీ తమ దేవుడూ అయిన యెహోవా మందిరపు పని చేయడం మొదలుపెట్టారు.+ 15 దర్యావేషు రాజు పరిపాలన రెండో సంవత్సరం+ ఆరో నెల 24వ రోజున ఇది జరిగింది.