యిర్మీయా
52 సిద్కియా+ రాజైనప్పుడు అతని వయసు 21 ఏళ్లు, అతను యెరూషలేములో 11 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు,+ ఆమె లిబ్నాకు చెందిన యిర్మీయా కూతురు. 2 అతను యెహోయాకీములాగే యెహోవా దృష్టిలో చెడ్డపనులు చేస్తూ వచ్చాడు.+ 3 యెహోవా కోపం వల్లే యెరూషలేములో, యూదాలో ఇవన్నీ జరిగాయి. చివరికి ఆయన వాటిని తన ఎదుట నుండి వెళ్లగొట్టాడు.+ సిద్కియా బబులోను రాజుకు ఎదురుతిరిగాడు.+ 4 సిద్కియా పరిపాలనలోని తొమ్మిదో సంవత్సరం పదో నెల పదో రోజున, బబులోను రాజు నెబుకద్నెజరు* తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి వచ్చాడు. వాళ్లు దానికి ఎదురుగా మకాం వేసి, దాని చుట్టూ ముట్టడిదిబ్బ కట్టారు.+ 5 రాజైన సిద్కియా పరిపాలనలోని 11వ సంవత్సరం వరకు నగరం ముట్టడి కింద ఉంది.
6 నాలుగో నెల తొమ్మిదో రోజున+ నగరంలో కరువు తీవ్రమైంది. దేశ ప్రజలకు ఆహారం లేకుండా పోయింది.+ 7 చివరికి నగర ప్రాకారం పడగొట్టబడింది; కల్దీయులు నగరాన్ని చుట్టుముడుతుండగా, రాత్రిపూట సైనికులందరూ రాజు తోట దగ్గర రెండు గోడల మధ్య ఉన్న ద్వారం గుండా పారిపోయారు; వాళ్లు అరాబా మార్గంలో ముందుకు సాగారు.+ 8 కానీ కల్దీయుల సైన్యం సిద్కియా రాజును తరిమి యెరికో ఎడారి మైదానాల్లో అతన్ని పట్టుకుంది,+ దాంతో అతని సైన్యాలన్నీ అతని దగ్గర నుండి చెదిరిపోయాయి. 9 వాళ్లు సిద్కియా రాజును పట్టుకుని హమాతు దేశంలో రిబ్లా దగ్గరున్న బబులోను రాజు దగ్గరికి తీసుకొచ్చారు. బబులోను రాజు అతనికి శిక్ష విధించాడు. 10 బబులోను రాజు అక్కడే రిబ్లా దగ్గర సిద్కియా కళ్లముందు అతని కుమారుల్ని చంపించాడు; అలాగే యూదా అధిపతులందర్నీ చంపించాడు. 11 తర్వాత బబులోను రాజు సిద్కియాను గుడ్డివాణ్ణి చేసి,+ అతన్ని రాగి సంకెళ్లతో బంధించి బబులోనుకు తీసుకొచ్చాడు; సిద్కియా చనిపోయే రోజు వరకు అతన్ని చెరసాలలోనే ఉంచాడు.
12 ఐదో నెల పదో రోజున, అంటే బబులోను రాజైన నెబుకద్నెజరు* పరిపాలన 19వ సంవత్సరంలో, రాజ సంరక్షకుల అధిపతీ బబులోను రాజు సేవకుడూ అయిన నెబూజరదాను యెరూషలేములోకి వచ్చాడు.+ 13 అతను యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని, యెరూషలేములోని ఇళ్లన్నిటినీ తగలబెట్టాడు;+ అంతేకాదు అతను పెద్దపెద్ద ఇళ్లన్నిటినీ తగలబెట్టాడు. 14 రాజ సంరక్షకుల అధిపతితో ఉన్న కల్దీయుల సైన్యమంతా యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాల్ని పడగొట్టింది.+
15 రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను కొంతమంది పేదవాళ్లను, ఆ నగరంలో మిగిలిన ప్రజల్ని బందీలుగా తీసుకెళ్లాడు. అలాగే అతను బబులోను రాజు దగ్గరికి చేరినవాళ్లను, నైపుణ్యంగల మిగతా చేతిపనివాళ్లను కూడా తీసుకెళ్లాడు.+ 16 అయితే రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను కొంతమంది నిరుపేదల్ని దేశంలో ఉండనిచ్చి, వాళ్లను ద్రాక్షతోటల్లో పనికి పెట్టాడు, వాళ్లతో వెట్టిచాకిరి చేయించాడు.+
17 కల్దీయులు యెహోవా మందిరంలో ఉన్న రాగి స్తంభాల్ని, యెహోవా మందిరంలో ఉన్న బండ్లను,+ రాగి సముద్రాన్ని+ ముక్కలుముక్కలు చేసి+ ఆ రాగినంతా బబులోనుకు తీసుకెళ్లారు.+ 18 అంతేకాదు, ఆలయ సేవ కోసం ఉపయోగించే బాల్చీల్ని, పారల్ని, ఒత్తులు కత్తిరించే కత్తెరల్ని, పాత్రల్ని,+ గిన్నెల్ని,+ రాగి పాత్రలన్నిటినీ తీసుకెళ్లారు. 19 రాజ సంరక్షకుల అధిపతి మేలిమి బంగారంతో, వెండితో చేయబడిన పళ్లేల్ని,+ నిప్పు పాత్రల్ని, పాత్రల్ని, బాల్చీల్ని, దీపస్తంభాల్ని,+ గిన్నెల్ని, అర్పణల కోసం ఉపయోగించే పాత్రల్ని తీసుకెళ్లాడు.+ 20 యెహోవా మందిరం కోసం సొలొమోను రాజు చేయించిన రెండు స్తంభాలు, సముద్రం, సముద్రం కింద ఉన్న 12 రాగి ఎద్దులు,+ బండ్ల విషయానికొస్తే, వాటన్నిటి రాగి బరువు ఎంతో తూచడం సాధ్యం కాదు.
21 స్తంభాల విషయానికొస్తే, ఒక్కో స్తంభం ఎత్తు 18 మూరలు.* దాని చుట్టుకొలత 12 మూరలు;+ దాని మందం బెత్తెడు;* అది లోపల ఖాళీగా ఉండేది. 22 దాని మీద ఉండే స్తంభ శీర్షం రాగిది; శీర్షం ఎత్తు ఐదు మూరలు.+ శీర్షం చుట్టూ ఉన్న అల్లిక, దానిమ్మ పండ్లు రాగితో చేసినవి. రెండో స్తంభం, దాని దానిమ్మ పండ్లు అచ్చం మొదటిదానిలాగే ఉండేవి. 23 దాని పక్కలకు 96 దానిమ్మ పండ్లు ఉండేవి; మొత్తం, అల్లిక చుట్టూ 100 దానిమ్మ పండ్లు ఉండేవి.+
24 రాజ సంరక్షకుల అధిపతి ముఖ్య యాజకుడైన శెరాయాను,+ రెండో యాజకుడైన జెఫన్యాను,+ ముగ్గురు ద్వారపాలకుల్ని కూడా తీసుకెళ్లాడు.+ 25 అతను సైనికుల మీద అధికారిగా ఉన్న ఆస్థాన అధికారినీ, నగరంలో ఉన్న ఏడుగురు రాజు సలహాదారుల్నీ, ప్రజల్ని సైన్యంలో చేర్చే సైన్యాధిపతి కార్యదర్శినీ, నగరంలో కనిపించిన 60 మంది సామాన్య ప్రజల్నీ తీసుకెళ్లాడు. 26 రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను వాళ్లను రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తీసుకొచ్చాడు. 27 బబులోను రాజు, హమాతు దేశంలో ఉన్న రిబ్లాలో వాళ్లను చంపించాడు.+ అలా యూదావాళ్లు తమ దేశంలో నుండి చెరలోకి వెళ్లారు.+
28 నెబుకద్నెజరు* బందీలుగా తీసుకెళ్లిన ప్రజలు వీళ్లు: అతని పరిపాలన ఏడో సంవత్సరంలో 3,023 మంది యూదులు తీసుకెళ్లబడ్డారు.+
29 నెబుకద్నెజరు* పరిపాలన 18వ సంవత్సరంలో,+ యెరూషలేము నుండి 832 మంది తీసుకెళ్లబడ్డారు.
30 నెబుకద్నెజరు* పరిపాలన 23వ సంవత్సరంలో, రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను 745 మంది యూదుల్ని బందీలుగా తీసుకెళ్లాడు.+
మొత్తం 4,600 మంది బందీలుగా తీసుకెళ్లబడ్డారు.
31 యూదా రాజైన యెహోయాకీను+ బందీగా వెళ్లిన 37వ సంవత్సరం, 12వ నెల, 25వ రోజున, అంటే బబులోను రాజు ఎవీల్మెరోదకు తాను రాజైన సంవత్సరంలో, యూదా రాజైన యెహోయాకీనును విడుదల చేసి చెరసాల నుండి బయటికి తీసుకొచ్చాడు.+ 32 అతను యెహోయాకీనుతో దయగా మాట్లాడి, బబులోనులో తన దగ్గరున్న ఇతర రాజుల సింహాసనాల కన్నా అతనికి ఉన్నతమైన సింహాసనాన్ని ఇచ్చాడు. 33 కాబట్టి యెహోయాకీను తన ఖైదీ వస్త్రాల్ని తీసేసి, తాను బ్రతికున్నంత కాలం రాజు బల్ల దగ్గర భోజనం చేస్తూ వచ్చాడు. 34 యెహోయాకీను చనిపోయే రోజు వరకు, అతను బ్రతికున్నంత కాలం ప్రతీరోజు బబులోను రాజు అతనికి ఆహారం ఇస్తూ వచ్చాడు.