యిర్మీయా
11 యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “ప్రజలారా, ఈ ఒప్పంద మాటలు వినండి!
“నువ్వు* యూదా ప్రజలతో, యెరూషలేము నివాసులతో మాట్లాడి, 3 వాళ్లకు ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఈ ఒప్పంద మాటలకు లోబడని వ్యక్తి శాపగ్రస్తుడు,+ 4 ఐగుప్తు అనే ఇనుప కొలిమి నుండి మీ పూర్వీకుల్ని బయటికి రప్పించిన+ రోజున నేను ఆ మాటల్ని వాళ్లకు ఆజ్ఞాపించాను,+ అప్పుడు నేను ఇలా అన్నాను: ‘నా మాటకు లోబడండి, నేను ఆజ్ఞాపించేవన్నీ చేయండి; అప్పుడు మీరు నాకు ప్రజలుగా ఉంటారు, నేను మీకు దేవునిగా ఉంటాను,+ 5 పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని నేను మీ పూర్వీకులకు ఒట్టేసి చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటాను.’+ ఈ రోజు వరకు మీరు అక్కడే నివసిస్తున్నారు.” ’ ”
అప్పుడు నేను ఇలా అన్నాను: “ఆమేన్,* యెహోవా.”
6 తర్వాత యెహోవా నాకు ఇలా చెప్పాడు: “యూదా నగరాల్లో, యెరూషలేము వీధుల్లో ఈ మాటలన్నీ ప్రకటించు: ‘ఈ ఒప్పంద మాటలు వినండి, వాటిని పాటించండి. 7 నేను మీ పూర్వీకుల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చిన రోజు, “నా మాటకు లోబడండి” అంటూ వాళ్లను హెచ్చరించాను. ఈ రోజు వరకు వాళ్లను పదేపదే* హెచ్చరిస్తూ ఉన్నాను.+ 8 కానీ వాళ్లు వినలేదు, పట్టించుకోలేదు; బదులుగా ప్రతీ ఒక్కరు తమ దుష్ట హృదయాన్ని మొండిగా అనుసరిస్తూ వచ్చారు.+ కాబట్టి నేను ఏ ఒప్పందాన్ని పాటించమని వాళ్లకు చెప్పానో, ఏ ఒప్పందాన్ని వాళ్లు పాటించలేదో ఆ ఒప్పంద మాటలన్నీ వాళ్లమీదికి రప్పించాను.’ ”
9 తర్వాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “యూదా ప్రజలు, యెరూషలేము నివాసులు కుట్ర పన్నుతున్నారు. 10 వాళ్లు, గతంలో తమ పూర్వీకులు చేసిన తప్పుల వైపు తిరిగారు. వాళ్ల పూర్వీకులు నా మాటలకు లోబడడానికి ఇష్టపడలేదు.+ వాళ్లు కూడా వేరే దేవుళ్లను అనుసరించారు, పూజించారు.+ ఇశ్రాయేలు ఇంటివాళ్లు, యూదా ఇంటివాళ్లు తమ పూర్వీకులతో నేను చేసిన ఒప్పందాన్ని మీరారు.+ 11 కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను వాళ్లమీదికి ఒక విపత్తును తీసుకొస్తున్నాను,+ దాన్నుండి వాళ్లు తప్పించుకోలేరు. వాళ్లు సహాయం కోసం నాకు మొరపెట్టినప్పుడు, నేను వినను.+ 12 అప్పుడు యూదా నగరాలు, యెరూషలేము నివాసులు తాము బలులు అర్పిస్తున్న దేవుళ్ల దగ్గరికి వెళ్లి సహాయం కోసం మొరపెడతారు,+ కానీ విపత్తు సమయంలో అవి ఏవిధంగానూ వాళ్లను కాపాడలేవు. 13 ఎందుకంటే యూదా, నీ నగరాలు ఎన్ని ఉన్నాయో నీకు అంతమంది దేవుళ్లు ఉన్నారు; యెరూషలేములో ఎన్ని వీధులు ఉన్నాయో అన్ని బలిపీఠాల్ని ఆ పనికిరాని* దేవుని కోసం కట్టావు, వాటిమీద బయలుకు బలులు అర్పించావు.’+
14 “నువ్వైతే,* ఈ ప్రజల కోసం ప్రార్థించకు. వాళ్ల కోసం మొరపెట్టకు, ప్రార్థన చేయకు,+ ఎందుకంటే విపత్తును బట్టి వాళ్లు పెట్టే మొరను నేను వినను.
15 వాళ్లలో ఇంతమంది దుష్ట పన్నాగాలు పన్నాక,
ఇక నా మందిరంలో ఉండే హక్కు నా ప్రియమైన ప్రజలకు ఎక్కడుంది?
విపత్తు వచ్చినప్పుడు పవిత్ర మాంసంతో* నువ్వు దాన్ని తప్పించగలవా?
ఆ సమయంలో నువ్వు ఉల్లసిస్తావా?
16 యెహోవా ఒకప్పుడు నిన్ను శ్రేష్ఠమైన పండ్లు ఉన్న
అందమైన, పచ్చని ఒలీవ చెట్టు అని పిలిచాడు.
ఇప్పుడు మహా గర్జన శబ్దంతో ఆయన దానికి నిప్పంటించాడు,
వాళ్లు దాని కొమ్మల్ని విరగ్గొట్టారు.
17 “నిన్ను నాటిన+ సైన్యాలకు అధిపతైన యెహోవా నీమీదికి విపత్తు వస్తుందని ప్రకటించాడు. బయలుకు బలులు అర్పించి ఆయనకు కోపం తెప్పించిన ఇశ్రాయేలు ఇంటివాళ్లు, యూదా ఇంటివాళ్లు చేసిన చెడును బట్టి ఆ విపత్తు నీమీదికి వస్తుంది.”+
18 యెహోవా చెప్పడం వల్ల అది నాకు తెలిసింది;
ఆ సమయంలో, వాళ్లు ఏం చేస్తున్నారో నువ్వు నాకు చూపించావు.
19 నేను వధకు తేబడుతున్న సాధువైన గొర్రెపిల్లలా ఉన్నాను.
వాళ్లు నా మీద ఇలా కుట్ర పన్నుతున్నారని నాకు తెలీదు:+
“పండ్లతో సహా చెట్టును నాశనం చేద్దాం,
అతని పేరు ఇక వినిపించకుండా
సజీవుల దేశంలో నుండి అతన్ని నిర్మూలిద్దాం.”
20 కానీ సైన్యాలకు అధిపతైన యెహోవా నీతితో తీర్పు తీరుస్తాడు;
నువ్వు వాళ్లమీద పగ తీర్చుకోవడం నన్ను చూడనివ్వు,
ఎందుకంటే, నీకే నా వ్యాజ్యాన్ని అప్పగించాను.
21 కాబట్టి నీ ప్రాణం తీయాలని చూస్తూ, “యెహోవా పేరున నువ్వు ప్రవచించకూడదు,+ లేదంటే నువ్వు మా చేతుల్లో చస్తావు” అని అంటున్న అనాతోతు+ మనుషుల గురించి యెహోవా ఇలా అంటున్నాడు: 22 సైన్యాలకు అధిపతైన యెహోవా ఏమంటున్నాడంటే, “నేను వాళ్లను లెక్క అడగబోతున్నాను. వాళ్ల యువకులు కత్తి వల్ల చనిపోతారు,+ వాళ్ల కుమారులూ కూతుళ్లూ కరువు వల్ల చనిపోతారు.+ 23 వాళ్లలో ఎవ్వరూ మిగలరు, ఎందుకంటే అనాతోతు+ వాళ్లను నేను లెక్క అడిగే సంవత్సరంలో వాళ్లమీదికి విపత్తు తీసుకొస్తాను.”