శ్రావ్యగీతం.
98 యెహోవాకు ఒక కొత్త పాట పాడండి,+
ఎందుకంటే ఆయన అద్భుతమైన పనులు చేశాడు.+
ఆయన కుడిచెయ్యి, అంటే పవిత్రమైన ఆయన బాహువు రక్షణ తీసుకొచ్చింది.+
2 యెహోవా తన రక్షణను వెల్లడిచేశాడు;+
దేశాల ముందు తన నీతిని బయల్పర్చాడు.+
3 ఆయన ఇశ్రాయేలు ఇంటివాళ్ల పట్ల తన విశ్వసనీయ ప్రేమను, నమ్మకత్వాన్ని గుర్తుచేసుకున్నాడు.+
మన దేవుని రక్షణను భూమంతా చూసింది.+
4 భూమ్మీది సమస్త ప్రజలారా, విజయోత్సాహంతో కేకలు వేస్తూ యెహోవాను స్తుతించండి.
ఆనందిస్తూ, సంతోషంతో కేకలు వేస్తూ స్తుతిగీతాలు పాడండి.+
5 వీణతో యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడండి,
వీణతో, శ్రావ్యమైన గీతంతో ఆయన్ని స్తుతించండి.
6 బాకాలతో, బూర ధ్వనితో+
రాజైన యెహోవా ముందు విజయోత్సాహంతో కేకలు వేయండి.
7 సముద్రం, దానిలో ఉన్నవన్నీ,
భూమి, దాని నివాసులు సంతోషంతో కేకలు వేయాలి.
8 నదులు చప్పట్లు కొట్టాలి;
పర్వతాలు కలిసి సంతోషంతో కేకలు వేయాలి,+
9 అవి యెహోవా ముందు సంతోషంతో కేకలు వేయాలి, ఎందుకంటే ఆయన భూమికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు.
ఆయన నీతితో భూలోకానికి,
న్యాయంతో దేశదేశాల ప్రజలకు తీర్పు తీరుస్తాడు.+