కీర్తనలు
రెండో భాగం
(42-72 కీర్తనలు)
సంగీత నిర్దేశకునికి సూచన. కోరహు కుమారుల+ మాస్కిల్.*
42 జింక నీళ్ల కోసం ఆశపడినట్టు,
దేవా, నా ప్రాణం నీ కోసం ఆశపడుతోంది.
2 దేవుని కోసం, జీవంగల దేవుని కోసం నేను దప్పికతో ఉన్నాను.+
నేనెప్పుడు నా దేవుని సన్నిధిలోకి వచ్చి కనబడతానో?+
3 రాత్రింబగళ్లు నా కన్నీళ్లే నాకు ఆహారంగా ఉన్నాయి;
“నీ దేవుడు ఎక్కడ?” అంటూ ప్రజలు రోజంతా నన్ను దెప్పిపొడుస్తున్నారు.+
4 ఈ విషయాలు గుర్తుచేసుకుంటూ నేను నా హృదయాన్ని* కుమ్మరిస్తున్నాను,
ఒకప్పుడు నేను జనసమూహంతో పాటు నడిచాను;
సంతోష ధ్వనులతో, కృతజ్ఞతలతో
జనసమూహం పండుగ చేసుకుంటుండగా,
నేను వాళ్ల ముందు నెమ్మదిగా* నడుస్తూ దేవుని మందిరానికి వెళ్లేవాణ్ణి.+
5 నా ప్రాణం ఎందుకు కృంగిపోయింది?+
నా లోపల ఎందుకు ఈ అలజడి?
6 నా దేవా, నేను కృంగిపోయాను.+
అందుకే యొర్దాను ప్రాంతం నుండి, హెర్మోను శిఖరాల నుండి,
మిసారు కొండ* దగ్గర నుండి
నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను.+
7 నీ జలపాతాల శబ్దం విని,
కెరటాలు కెరటాల్ని పిలిచాయి.
ఉప్పొంగే నీ అలలన్నీ నా మీదుగా పొంగిపొర్లాయి.
8 పగలు యెహోవా తన విశ్వసనీయ ప్రేమను నా దగ్గరికి పంపిస్తాడు,
రాత్రివేళ ఆయన కీర్తన, అంటే నా జీవదాత అయిన దేవుని+ ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది.
9 నా శైలమైన* దేవునితో నేను,
“నన్ను ఎందుకు మర్చిపోయావు?+
నా శత్రువు అణచివేయడం వల్ల నేను ఎందుకు బాధతో తిరగాలి?” అని అంటాను.+
10 నా శత్రువులు క్రూరంగా* నన్ను దెప్పిపొడుస్తున్నారు;
“నీ దేవుడు ఎక్కడ?” అంటూ రోజంతా నన్ను దెప్పిపొడుస్తున్నారు.+
11 నా ప్రాణం ఎందుకు కృంగిపోయింది?
నా లోపల ఎందుకు ఈ అలజడి?