యోబు
3 ఆ తర్వాత యోబు నోరు తెరిచి, తాను పుట్టిన రోజును శపించడం మొదలుపెట్టాడు.+ 2 యోబు ఇలా అన్నాడు:
3 “నేను పుట్టిన రోజు,
‘మగపిల్లాడు పుట్టాడు!’ అని చెప్పుకున్న రాత్రి నశించిపోవాలి.+
4 ఆ రోజు చీకటైపోవాలి.
పైనున్న దేవుడు దాన్ని ఏమాత్రం పట్టించుకోకూడదు;
ఏ వెలుగూ దానిమీద ప్రకాశించకూడదు.
5 కటిక చీకటి* దాన్ని సొంతం చేసుకోవాలి.
కారుమబ్బు దాన్ని కమ్ముకోవాలి.
భయంకరమైన చీకటి దాని వెలుగును మింగేయాలి.
6 కటిక చీకటి ఆ రాత్రిని పట్టుకోవాలి;+
సంవత్సరంలోని మిగతా రోజులతోపాటు అది సంతోషించకూడదు,
అది ఏ నెలలోనూ చేరకూడదు.
7 ఆ రాత్రి ఎవ్వరూ పుట్టకపోతే బావుండేది;
సంతోష ధ్వనులు వినబడకపోతే బావుండేది.
9 దాని వేకువ* చుక్కలు చీకటైపోవాలి;
పగటి కోసం అది చూసే ఎదురుచూపులు వృథా అవ్వాలి,
ఉదయ కిరణాలు దానిమీద ప్రసరించకూడదు.
10 ఎందుకంటే, నేను కష్టాన్ని చూడకుండా ఉండేలా
అది నా తల్లి గర్భాన్ని మూసేయలేదు.+
11 పుట్టినప్పుడే నేనెందుకు చనిపోలేదు?
గర్భం నుండి బయటపడగానే నేనెందుకు నశించిపోలేదు?+
12 నన్నెందుకు మోకాళ్ల మీదికి తీసుకున్నారు?
ఎందుకు పాలిచ్చారు?
13 లేకపోతే ఈపాటికి నేను ప్రశాంతంగా పడుకుని ఉండేవాణ్ణి;+
నిద్రపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాణ్ణి;+
14 భూరాజులతో పాటు, వాళ్ల సలహాదారులతో పాటు నిద్రిస్తూ ఉండేవాణ్ణి,
వాళ్లు తమ కోసం కట్టుకున్న స్థలాలు ఇప్పుడు శిథిలాలయ్యాయి;*
15 లేదా బంగారాన్ని సంపాదించుకుని,
తమ ఇళ్లను వెండితో నింపుకున్న అధిపతులతో నిద్రిస్తూ ఉండేవాణ్ణి.
16 నేను పడిపోయిన పిండంలా,
ఎన్నడూ వెలుగు చూడని బిడ్డలా ఉంటే బావుండేది.
17 దుష్టులు కూడా అక్కడ ఏ ఆందోళన లేకుండా ఉంటారు;
అలసిపోయిన వాళ్లు అక్కడ విశ్రాంతి తీసుకుంటారు.+
18 ఖైదీలంతా అక్కడ ప్రశాంతంగా ఉంటారు;
తమతో బలవంతంగా పనిచేయించేవాళ్ల స్వరం వాళ్లకు అక్కడ వినబడదు.
19 సామాన్యులు, గొప్పవాళ్లు అందరూ అక్కడ సమానం,+
దాసుడు తన యజమాని నుండి విడుదల పొందుతాడు.
20 ఆయన బాధల్లో ఉన్నవాళ్లకు వెలుగును,
తీవ్రమైన వేదనలో ఉన్నవాళ్లకు+ జీవాన్ని ఎందుకు ఇవ్వాలి?
21 వాళ్లు చావు కోసం ఎదురుచూస్తున్నా,
దాచబడిన నిధుల్ని వెదికినట్టు వెదుకుతున్నా
అది వాళ్లకు ఎందుకు దొరకట్లేదు?+
22 అది దొరికినప్పుడు వాళ్లు ఎంతో సంతోషిస్తారు,
సమాధిని చూసి చాలా ఆనందిస్తారు.
23 దారి తెలియనివాళ్లకు, తాను చుట్టూ కంచె వేసినవాళ్లకు+
దేవుడు ఎందుకు వెలుగు ఇస్తున్నాడు?
25 నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది,
దేనికైతే భయపడ్డానో అదే నా మీదికి వచ్చింది.
26 మనశ్శాంతి, నెమ్మది, విశ్రాంతి నాకు కరువయ్యాయి,
కష్టాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.”