యాకోబు
5 ఓ ధనవంతులారా, మీమీదికి రాబోయే కష్టాల్ని బట్టి దుఃఖించండి, బోరున ఏడ్వండి. 2 మీ సిరిసంపదలు కుళ్లిపోయాయి, మీ బట్టలకు చిమ్మెట పట్టింది. 3 మీ బంగారానికి, వెండికి కిలం* పట్టింది. వాటి కిలమే మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది, మీ శరీరాన్ని తినేస్తుంది. మీరు కూడబెట్టుకున్నవి చివరి రోజుల్లో అగ్నిలా మారతాయి. 4 ఇదిగో, మీ పొలంలో కోత కోసిన పనివాళ్లకు ఇవ్వకుండా మీ దగ్గరే ఉంచుకున్న కూలీ కేకలు వేస్తోంది, సహాయం కోసం వాళ్లు చేసిన ఆర్తనాదాలు సైన్యాలకు అధిపతైన యెహోవా* చెవులకు చేరాయి. 5 మీరు ఈ భూమ్మీద భోగభాగ్యాల్లో జీవించారు, సుఖాల కోసం బ్రతికారు. వధించే రోజు కోసం మీ హృదయాల్ని కొవ్వెక్కేలా చేసుకున్నారు. 6 మీరు నీతిమంతుణ్ణి దోషి అని తీర్పుతీర్చి, హత్య చేశారు. ఆయన* మిమ్మల్ని వ్యతిరేకించడం లేదా?
7 కాబట్టి సోదరులారా, ప్రభువు ప్రత్యక్షత వరకు ఓపికపట్టండి. రైతు విషయమే తీసుకోండి, భూమి ఇచ్చే విలువైన పంట కోసం రైతు ఎదురుచూస్తూ ఉంటాడు; తొలకరి వానలు, కడవరి వానలు కురిసే వరకు ఓపికపడతాడు. 8 మీరు కూడా ఓపిక పట్టండి; ప్రభువు ప్రత్యక్షత దగ్గరపడింది కాబట్టి, మీరు గుండె నిబ్బరం చేసుకోండి.
9 సోదరులారా, మీరు తీర్పుకు గురవ్వకుండా ఉండేందుకు ఒకరి మీద ఒకరు సణుగుకోకండి.* అదిగో, న్యాయమూర్తి గుమ్మం ముందే ఉన్నాడు. 10 సోదరులారా, కష్టాలు అనుభవించే విషయంలో, ఓర్పు చూపించే విషయంలో యెహోవా* పేరున మాట్లాడిన ప్రవక్తల్ని ఆదర్శంగా తీసుకోండి. 11 సహించినవాళ్లు సంతోషంగలవాళ్లని* మనం అంటాం. యోబు సహనం గురించి మీరు విన్నారు, యెహోవా* అతన్ని ఎలా దీవించాడో మీకు తెలుసు. యెహోవా* దేవుడు అనురాగాన్ని ఎంతో సున్నితంగా చూపిస్తాడని,* ఆయన కరుణామయుడని కూడా మీకు తెలుసు.
12 నా సోదరులారా, అన్నిటికన్నా ముఖ్యంగా ఒట్టేయడం మానేయండి. ఆకాశంమీద గానీ, భూమ్మీద గానీ, ఇంక దేనిమీద గానీ ఒట్టేయడం మానేయండి. మీరు “అవును” అంటే అవునన్నట్టూ, “కాదు” అంటే కాదన్నట్టూ ఉండాలి. అప్పుడు మీరు తీర్పుకు లోనవ్వరు.
13 మీలో ఎవరికైనా కష్టాలు ఉన్నాయా? అతను ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎవరైనా ఉల్లాసంగా ఉన్నారా? అతను స్తుతిగీతాలు* పాడాలి. 14 మీలో ఎవరికైనా అనారోగ్యంగా* ఉందా? అతను సంఘ పెద్దల్ని పిలవాలి. వాళ్లు అతనికి నూనె రాసి, అతని కోసం యెహోవా* పేరున ప్రార్థన చేయాలి. 15 విశ్వాసంతో చేసే ప్రార్థన ఆ రోగిని* బాగుచేస్తుంది, యెహోవా* అతన్ని లేపుతాడు. అంతేకాదు, ఒకవేళ అతను పాపాలు చేసివుంటే, క్షమాపణ పొందుతాడు.
16 కాబట్టి దాపరికం లేకుండా ఒకరి దగ్గర ఒకరు పాపాల్ని ఒప్పుకోండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి, అప్పుడు మీరు బాగవుతారు. నీతిమంతుడు పట్టుదలగా చేసే ప్రార్థనకు చాలా శక్తి ఉంటుంది.* 17 ఏలీయా కూడా మనలాంటి మనిషే.* అయినా, వర్షం పడకూడదని అతను పట్టుదలగా ప్రార్థించినప్పుడు, ఆ దేశంలో మూడు సంవత్సరాల ఆరు నెలలు వర్షం పడలేదు. 18 ఆ తర్వాత, అతను మళ్లీ ప్రార్థించాడు. అప్పుడు ఆకాశం నుండి వర్షం కురిసింది, భూమ్మీద పంట పండింది.
19 నా సోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుండి తొలగి దారితప్పితే, మరొకరు అతన్ని దారిలో పెట్టారనుకోండి. 20 అలా చెడు మార్గం నుండి పాపిని దారిలోకి తెచ్చిన వ్యక్తి అతన్ని* మరణం నుండి రక్షించినవాడౌతాడని, ఎన్నో పాపాల నుండి బయటపడడానికి సహాయం చేసినవాడౌతాడని* తెలుసుకోండి.