యాకోబు
1 దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకు దాసుడైన యాకోబు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయిన 12 గోత్రాల వాళ్లకు శుభాకాంక్షలు చెప్తూ రాస్తున్న ఉత్తరం.
2 నా సోదరులారా, మీకు రకరకాల పరీక్షలు ఎదురైనప్పుడు సంతోషించండి. 3 ఎందుకంటే పరీక్షలకు తట్టుకొని నిలబడిన మీ విశ్వాసం మీలో సహనం పుట్టిస్తుందని మీకు తెలుసు. 4 అయితే సహనం తన పనిని పూర్తి చేయనివ్వండి. అప్పుడు మీరు అన్ని విషయాల్లో సంపూర్ణులుగా, నిర్దోషులుగా, దేనిలోనూ లోపంలేని వాళ్లుగా ఉండగలుగుతారు.
5 కాబట్టి, మీలో ఎవరికైనా తెలివి కొరవడితే అతను దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ఆయన కోప్పడకుండా* అందరికీ ఉదారంగా ఇచ్చే దేవుడు కాబట్టి అతనికి తెలివిని తప్పకుండా ప్రసాదిస్తాడు. 6 అయితే అతను ఏమాత్రం సందేహించకుండా విశ్వాసంతో అడుగుతూ ఉండాలి. ఎందుకంటే సందేహించే మనిషి గాలికి ఎగసిపడే సముద్ర కెరటం లాంటివాడు. 7 నిజానికి, అతను యెహోవా* నుండి ఏదైనా దొరుకుతుందని ఆశపడకూడదు; 8 అతను చంచల స్వభావం గలవాడు, ఏ విషయంలోనూ అతనికి నిలకడ ఉండదు.
9 అయితే దీనస్థితిలో ఉన్న సోదరుడు దేవుని దృష్టిలో ఉన్నతస్థితి పొందినందుకు సంతోషించాలి,* 10 ధనవంతుడేమో దీనస్థితి పొందినందుకు సంతోషించాలి. ఎందుకంటే ఓ ధనవంతుడు తోటలోని పువ్వులా రాలిపోతాడు. 11 మండే సూర్యుని వేడికి మొక్క వాడిపోతుంది, పువ్వు రాలిపోతుంది, దాని అందం చెడిపోతుంది. అలాగే ధనవంతుడు కూడా తన లక్ష్యాల వేటలో పడి కనుమరుగైపోతాడు.
12 కష్టాల్ని సహిస్తూ ఉండేవాడు సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే అతను దేవుని ఆమోదం పొందినప్పుడు జీవమనే కిరీటం సొంతం చేసుకుంటాడు. యెహోవా* తనను ప్రేమిస్తూ ఉండేవాళ్లకు ఆ కిరీటం ఇస్తానని వాగ్దానం చేశాడు. 13 పరీక్షలు ఎదురైనప్పుడు, “దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు” అని ఎవ్వరూ అనకూడదు. ఎందుకంటే చెడు విషయాలతో దేవుణ్ణి ఎవ్వరూ పరీక్షించలేరు, దేవుడు కూడా అలా ఎవ్వరినీ పరీక్షించడు. 14 కానీ ఒక వ్యక్తి కోరికే అతన్ని లాక్కెళ్లి, ప్రలోభపెట్టి* పరీక్షకు గురిచేస్తుంది. 15 తర్వాత ఆ కోరిక వృద్ధి చెంది* పాపాన్ని కంటుంది; ఆ పాపం పండినప్పుడు మరణం వస్తుంది.
16 నా ప్రియ సోదరులారా, మోసపోకండి. 17 ప్రతీ మంచి బహుమానం, ప్రతీ పరిపూర్ణ వరం పైనుండే వస్తాయి. ఆకాశ కాంతులకు మూలమైన తండ్రి నుండే అవి వస్తాయి. నీడలా ఆయన మారుతూ ఉండడు.* 18 మనం మనుషుల్లో మొదట ఎంపికైన వాళ్లమయ్యేందుకు సత్యవాక్యం ద్వారా మనల్ని పుట్టించాలనేది ఆయన సంకల్పం.
19 నా ప్రియ సోదరులారా, ఈ విషయం తెలుసుకోండి: ప్రతీ ఒక్కరు వినడానికి సిద్ధంగా ఉండాలి, తొందరపడి మాట్లాడకూడదు, త్వరగా కోపం తెచ్చుకోకూడదు. 20 ఎందుకంటే మనిషి కోపం దేవుడు కోరే నీతిని సాధించదు. 21 కాబట్టి ప్రతీ మలినాన్ని కడిగేసుకొని, చెడుతనపు గుర్తుల్ని* చెరిపేసుకొని మిమ్మల్ని* రక్షించగల దేవుని వాక్యాన్ని సౌమ్యంగా స్వీకరించి, మీ హృదయాల్లో నాటుకోండి.
22 అయితే తప్పుడు ఆలోచనతో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ వాక్యాన్ని వినేవాళ్లుగా మాత్రమే ఉండకండి, దాన్ని పాటించేవాళ్లుగా ఉండండి. 23 ఎందుకంటే ఓ వ్యక్తి వాక్యాన్ని విని, దాన్ని పాటించకపోతే అతను అద్దంలో తన ముఖం* చూసుకునే మనిషిలా ఉంటాడు. 24 ఆ మనిషి అద్దంలో తనను చూసుకొని, బయటికి వెళ్లిన వెంటనే తాను ఎలా ఉన్నాడో మర్చిపోతాడు. 25 కానీ స్వేచ్ఛను ఇచ్చే పరిపూర్ణ శాసనంలోకి* పరిశీలనగా చూసి, దాన్ని పాటిస్తూ ఉండేవాడు ఊరికే విని మర్చిపోడు గానీ, దానికి లోబడతాడు; అతను చేసేది అతనికి సంతోషాన్నిస్తుంది.
26 దేవుని ఆరాధకుణ్ణని* అనుకునేవాడు, నాలుకను అదుపులో* పెట్టుకోకపోతే అతను తన హృదయాన్ని మోసం చేసుకుంటున్నట్టే; అతని ఆరాధన వ్యర్థం. 27 మన తండ్రైన దేవుని దృష్టిలో శుద్ధమైన, కళంకంలేని ఆరాధనా పద్ధతి* ఏమిటంటే కష్టాల్లో ఉన్న అనాథలను, విధవరాళ్లను ఆదుకోవడం; ఈ లోక మలినం అంటకుండా చూసుకోవడం.