2 తిమోతి
2 కాబట్టి, నా కుమారుడా, క్రీస్తుయేసు చూపించే అపారదయ ద్వారా నువ్వు శక్తిని పొందుతూ ఉండు; 2 నువ్వు నా దగ్గర విన్న విషయాల్ని, అంటే ఎంతోమంది సాక్షులు ధృవీకరించిన విషయాల్ని నమ్మకస్థులైన పురుషులకు అప్పగించు. దానివల్ల వాళ్లు కూడా ఇతరులకు బోధించడానికి తగినవిధంగా అర్హులౌతారు. 3 క్రీస్తుయేసుకు మంచి సైనికుడిగా కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండు. 4 సైనికుడిగా సేవచేసే ఏ వ్యక్తీ వాణిజ్య సంబంధ వ్యాపారాల్లో* పాల్గొనడు.* ఎందుకంటే అతను, తనను సైనికుడిగా చేర్చుకున్న వ్యక్తి ఆమోదం పొందాలనుకుంటాడు. 5 ఆటల పోటీల్లో కూడా నియమాల ప్రకారం ఆడకపోతే ఎవ్వరూ బహుమతిని* గెల్చుకోలేరు. 6 కష్టపడి పనిచేసే రైతే పంటను మొదట తినాలి. 7 నేను చెప్తున్న విషయాల గురించి ఆలోచిస్తూ ఉండు; ప్రభువు నీకు అన్ని విషయాల్లో అవగాహనను* ప్రసాదిస్తాడు.
8 దావీదు వంశస్థుడైన* యేసుక్రీస్తు మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడని గుర్తుంచుకో; నేను ప్రకటించే మంచివార్త ఇదే. 9 ఆ మంచివార్త కోసమే నేను బాధ అనుభవిస్తున్నాను; నేరస్తుడిగా చెరసాలలో ఉన్నాను. కానీ, దేవుని వాక్యం బంధించబడి లేదు. 10 అందుకే, దేవుడు ఎంచుకున్నవాళ్ల కోసం నేను అన్నిటినీ సహిస్తూ ఉన్నాను. వాళ్లు కూడా క్రీస్తుయేసు ద్వారా కలిగే రక్షణను, శాశ్వతమైన మహిమను పొందాలన్నదే నా ఉద్దేశం. 11 ఈ మాట నమ్మదగినది: మనం ఆయనతో కలిసి చనిపోయి ఉంటే, ఆయనతో కలిసి బ్రతుకుతాం కూడా; 12 మనం సహిస్తూ ఉంటే, ఆయనతో కలిసి రాజులుగా పరిపాలిస్తాం; మనం ఆయన్ని తిరస్కరిస్తే, ఆయన మనల్ని తిరస్కరిస్తాడు; 13 మనం నమ్మకంగా లేకపోయినా, ఆయన మాత్రం నమ్మకంగానే ఉంటాడు; ఎందుకంటే ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించలేడు.
14 ఈ విషయాల గురించి వాళ్లకు గుర్తుచేస్తూ ఉండు. పదాల గురించి పోట్లాడుకోవద్దని వాళ్లకు ఉపదేశిస్తూ* ఉండు. ఎందుకంటే అది వినేవాళ్లకు హాని చేస్తుందే* తప్ప, దానివల్ల ఒరిగేదేమీ లేదు. 15 దేవుడు ఆమోదించిన సేవకుడిగా, ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరంలేని పనివాడిగా, సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించేవాడిగా నిన్ను నువ్వు దేవునికి కనబర్చుకోవడానికి శాయశక్తులా కృషి చేయి. 16 అయితే పవిత్రమైన దాన్ని అగౌరవపర్చే వట్టి మాటల్ని తిరస్కరించు. ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడేవాళ్లు అంతకంతకూ దేవునికి దూరమౌతారు. 17 వాళ్ల మాటలు కొరుకుడు పుండులా వ్యాపిస్తాయి. వాళ్లలో హుమెనైయు, ఫిలేతు ఉన్నారు. 18 పునరుత్థానం ఇప్పటికే జరిగిపోయిందని చెప్తూ వాళ్లు సత్యం నుండి తొలగిపోయారు. అంతేకాదు, వాళ్లు కొందరి విశ్వాసాన్ని పాడుచేస్తున్నారు. 19 అయినా దేవుని గట్టి పునాది ఇంకా నిలిచే ఉంది. దానిమీద ఈ ముద్ర ఉంది: “యెహోవాకు* తనవాళ్లు ఎవరో తెలుసు,” “యెహోవా* పేరు ఉపయోగించి ప్రార్థించే ప్రతీ ఒక్కరు అవినీతిని వదిలేయాలి.”
20 ఓ గొప్ప ఇంట్లో బంగారు పాత్రలు,* వెండి పాత్రలే కాకుండా చెక్క పాత్రలు, మట్టి పాత్రలు కూడా ఉంటాయి. కొన్నిటిని ప్రాముఖ్యమైన పనులకు ఉపయోగిస్తారు, కొన్నిటిని మామూలు పనులకు ఉపయోగిస్తారు. 21 కాబట్టి, ఎవరైనా రెండో కోవకు చెందినవాటికి దూరంగా ఉంటే అతను ప్రాముఖ్యమైన పనులకు ఉపయోగపడే పనిముట్టుగా* ఉంటాడు; శుద్ధీకరించబడినవాడిగా ఉంటాడు; తన యజమానికి పనికొచ్చే పాత్రగా ఉంటాడు; అతను ప్రతీ మంచిపనికి సిద్ధపడి ఉంటాడు. 22 అందుకే నువ్వు యౌవన కోరికల నుండి పారిపో; శుద్ధ హృదయంతో ప్రభువు పేరు ఉపయోగించి ప్రార్థించేవాళ్లతో కలిసి నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, శాంతిని అలవర్చుకోవడానికి శతవిధాలా కృషి చేయి.
23 అంతేకాదు మూర్ఖమైన, అర్థంపర్థంలేని వాదనల్ని తిరస్కరించు. ఎందుకంటే అవి గొడవల్ని రేపుతాయి. 24 ప్రభువు దాసుడు గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బదులుగా అతను అందరితో మృదువుగా* వ్యవహరించాలి; అతనికి బోధించే సామర్థ్యం ఉండాలి; తనకు ఎవరైనా హాని చేస్తే అతను నిగ్రహం పాటించాలి. 25 వ్యతిరేకించేవాళ్లకు అతను సౌమ్యంగా ఉపదేశించాలి. బహుశా, సత్యం గురించిన సరైన జ్ఞానం కలిగివుండేలా దేవుడు వాళ్లలో పశ్చాత్తాపాన్ని* కలిగించవచ్చు. 26 దానివల్ల వాళ్ల కళ్లు తెరుచుకొని, తన ఇష్టం నెరవేర్చేలా అపవాది తమను సజీవంగా పట్టుకున్నాడని గుర్తించి, వాళ్లు అతని ఉచ్చులో నుండి తప్పించుకోవచ్చు.