1 తిమోతి
6 దాసులుగా ఉన్నవాళ్లు ఎప్పుడూ తమ యజమానుల్ని పూర్తి గౌరవానికి అర్హులుగా ఎంచాలి. అలాచేస్తే దేవుని పేరు గురించి, ఆయన బోధ గురించి ప్రజలు చెడుగా మాట్లాడుకునే పరిస్థితి ఎప్పుడూ రాదు. 2 అంతేకాదు, విశ్వాసులైన యజమానులు ఉన్న దాసులు తమ యజమానులు సోదరులే కదా అని వాళ్లతో గౌరవం లేనట్టు ప్రవర్తించకూడదు. బదులుగా, వాళ్లు ఇంకా చక్కగా సేవచేయాలి; ఎందుకంటే వాళ్ల మంచి సేవ నుండి ప్రయోజనం పొందేది తోటి విశ్వాసులు, ప్రియ సోదరులు.
ఈ విషయాల్ని బోధిస్తూ, ఈ ఆజ్ఞల్ని తెలియజేస్తూ ఉండు. 3 ఎవరైనా తప్పుడు సిద్ధాంతాన్ని బోధించినా, మన ప్రభువైన క్రీస్తుయేసు నుండి వచ్చిన మంచి* బోధతో, దైవభక్తికి అనుగుణంగా ఉన్న బోధతో ఏకీభవించకపోయినా 4 అతను గర్వంతో ఉప్పొంగిపోతున్నట్టు; అతనికి ఏమీ అర్థంకాదు. అతనికి పదాల గురించి వాదించడం, చర్చించడమే లోకం.* వాటివల్ల అసూయలు, గొడవలు, లేనిపోనివి కల్పించి చెప్పడాలు,* హానికరమైన సందేహాలు, 5 చిన్నచిన్న విషయాల గురించిన వాదోపవాదాలు తలెత్తుతాయి. మనసు కలుషితమై, సత్యాన్ని ఇక అర్థం చేసుకునే స్థితిలో లేని మనుషులు ఆ వాదోపవాదాల్ని ఉసిగొల్పుతారు. దైవభక్తి స్వలాభానికి ఉపయోగపడుతుందని వాళ్లు అనుకుంటారు. 6 నిజమే, దైవభక్తితో జీవిస్తే గొప్ప లాభమే ఉంటుంది. అయితే దైవభక్తితో పాటు సంతృప్తి కలిగి* జీవిస్తేనే లాభం. 7 మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకం నుండి ఏమీ తీసుకుపోలేం. 8 కాబట్టి ఆహారం,* బట్టలు* ఉంటే చాలు; వాటితోనే తృప్తిపడదాం.
9 ధనవంతులు అవ్వాలని నిశ్చయిం చుకున్నవాళ్లు ప్రలోభంలో, ఉరిలో, ఎన్నో హానికరమైన వెర్రి కోరికల్లో చిక్కుకుంటారు; అవి మనుషుల్ని నాశనం చేస్తాయి, కూలదోస్తాయి. 10 ఎందుకంటే డబ్బు మీద మోజు అన్నిరకాల హానికరమైన విషయాలకు మూలం. దాని మోజులో పడి కొందరు విశ్వాసం నుండి తొలగిపోయారు, ఎన్నో బాధలతో తమను తాము పొడుచుకున్నారు.*
11 దేవుని సేవకుడా, నువ్వైతే వీటి నుండి పారిపో. నీతిని, దైవభక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సహనాన్ని, సౌమ్యతను చూపించడానికి అన్నివిధాలా కృషి చేయి. 12 క్రైస్తవ విశ్వాసం కోసం మంచి పోరాటం పోరాడు; శాశ్వత జీవితం మీద గట్టి పట్టు సాధించు. దీనికోసమే నువ్వు పిలవబడ్డావు; ఎంతోమంది ముందు బహిరంగంగా మంచి సాక్ష్యం ఇచ్చావు.
13 అన్నిటినీ సజీవంగా ఉంచే దేవుని ముందు, పొంతి పిలాతుకు మంచి సాక్ష్యం ఇచ్చిన క్రీస్తుయేసు ముందు నేను నీకు ఈ ఆదేశాల్ని ఇస్తున్నాను: 14 మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు, నేను నీకు ఇచ్చిన ఆజ్ఞల్ని ఏ కళంకం గానీ, లోపం గానీ లేకుండా పాటిస్తూ ఉండు. 15 సంతోషంగల, శక్తిమంతుడైన ప్రభువు నియమిత సమయంలో ప్రత్యక్షమౌతాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. 16 ఆయన మాత్రమే అమరుడు; దగ్గరికి వెళ్లలేనంత తేజస్సులో ఆయన నివసిస్తున్నాడు; ఆయన్ని ఏ మనిషీ చూడలేదు, చూడలేడు కూడా. ఘనత, శాశ్వత బలం ఆయనకు చెందాలి. ఆమేన్.
17 ఈ వ్యవస్థలో* ధనవంతులుగా ఉన్నవాళ్లు గర్విష్ఠులుగా ఉండకూడదనీ,* నశించిపోయే సిరిసంపదల మీద కాకుండా మనం ఆస్వాదిస్తున్న వాటన్నిటిని పుష్కలంగా ఇచ్చే దేవుని మీద నిరీక్షణ ఉంచాలనీ వాళ్లకు ఉపదేశించు.* 18 మంచి చేయమని, మంచిపనులు ఎక్కువగా చేయమని, ఉదార* స్ఫూర్తి చూపించమని, తమకున్నవాటిని ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండమని వాళ్లకు చెప్పు. 19 అలాచేస్తే వాళ్లు దేవుని నుండి వచ్చే సంపదల్ని పోగు చేసుకుంటారు. అంటే, భవిష్యత్తు కోసం జాగ్రత్తగా మంచి పునాది వేసుకొని, వాస్తవమైన జీవితం మీద గట్టి పట్టు సాధించగలుగుతారు.
20 ప్రియమైన తిమోతీ, నీకు అప్పగించబడినదాన్ని కాపాడు. పవిత్రమైన దాన్ని తిరస్కరించే వట్టి మాటలు వినకు, సత్యానికి విరుద్ధంగా మాట్లాడేలా చేసే తప్పుడు “జ్ఞానానికి” దూరంగా ఉండు. 21 కొందరు ఆ జ్ఞానాన్ని ప్రదర్శించి, విశ్వాసం నుండి తొలగిపోయారు.
దేవుని అపారదయ నీకు తోడుండాలి.