1 తిమోతి
4 అయితే, తర్వాతి కాలాల్లో కొందరు విశ్వాసాన్ని విడిచిపెడతారని దేవుని పవిత్రశక్తి స్పష్టంగా చెప్తోంది. వాళ్లు దేవుని నుండి వచ్చాయనిపించే మోసపూరిత సందేశాల్ని, చెడ్డదూతల* బోధల్ని వినడం వల్ల అలా జరుగుతుంది. 2 వాత వేయబడిన మనస్సాక్షి కలిగివున్న, అబద్ధాలాడే వేషధారుల వల్ల వాళ్లు అలా తప్పుదోవ పడతారు. 3 వాళ్లు పెళ్లిని నిషేధిస్తారు. కొన్నిరకాల ఆహారపదార్థాల్ని తినకూడదని ప్రజలకు ఆజ్ఞాపిస్తారు. నిజానికి విశ్వాసం, అలాగే సత్యం గురించిన సరైన జ్ఞానం ఉన్నవాళ్లు కృతజ్ఞతలు చెల్లించి తినడానికి దేవుడు వాటిని సృష్టించాడు. 4 దేవుడు సృష్టించిన ప్రతీది మంచిదే; కృతజ్ఞతలు చెల్లించి తింటే, ఏదీ నిషిద్ధం కాదు. 5 ఎందుకంటే దేవుని మాట ద్వారా, ప్రార్థన ద్వారా అది పవిత్రమౌతుంది.
6 నువ్వు ఈ సలహాను సోదరులకు ఇస్తే విశ్వాసానికి సంబంధించిన మాటలతో, అలాగే నువ్వు జాగ్రత్తగా పాటించిన మంచి బోధకు సంబంధించిన మాటలతో పోషించబడుతూ క్రీస్తుయేసుకు మంచి పరిచారకునిగా ఉంటావు. 7 అయితే, ముసలమ్మలు చెప్పే కథల్లా ఉండే భక్తిహీనమైన కట్టుకథల్ని తిరస్కరించు. ఇంకోవైపున, దైవభక్తి చూపించడమే లక్ష్యంగా పెట్టుకొని నీకు నువ్వు శిక్షణ ఇచ్చుకో. 8 ఎందుకంటే శారీరక వ్యాయామం* కొంతవరకు ప్రయోజనకరమే, కానీ దైవభక్తి అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. దానివల్ల ఇప్పుడు, అలాగే భవిష్యత్తులో దీవెనలు వస్తాయి. 9 ఆ మాట నిజమైనది, పూర్తిగా నమ్మదగినది. 10 ఇందుకే మనం కష్టపడి పనిచేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం. ఎందుకంటే అన్నిరకాల ప్రజలకు, ముఖ్యంగా నమ్మకమైన వాళ్లకు రక్షకుడైన జీవంగల దేవుని మీద మనం నిరీక్షణ ఉంచాం.
11 ఈ ఆజ్ఞల్ని తెలియజేస్తూ, బోధిస్తూ ఉండు. 12 నీ యౌవనాన్ని బట్టి నిన్ను ఎవ్వరూ, ఎప్పుడూ చిన్నచూపు చూడకుండా జాగ్రత్తపడు. మాట్లాడే విషయంలో, ప్రవర్తన విషయంలో, ప్రేమ విషయంలో, విశ్వాసం విషయంలో, పవిత్రత* విషయంలో నమ్మకస్థులకు ఆదర్శంగా ఉండు. 13 నేను వచ్చేంతవరకు బహిరంగంగా చదివే విషయంలో, ప్రోత్సహించే* విషయంలో, బోధించే విషయంలో నిమగ్నమవ్వు. 14 నీలో ఉన్న వరాన్ని నిర్లక్ష్యం చేయకు. పెద్దల సభ నీమీద చేతులు ఉంచినప్పుడు ప్రవచనం ద్వారా నీకు ఆ వరం ఇవ్వబడింది. 15 వీటిని ధ్యానించు; నీ ప్రగతి అందరికీ స్పష్టంగా కనిపించేలా వీటిలో నిమగ్నమవ్వు. 16 నీ గురించి, నీ బోధ గురించి జాగ్రత్తగా ఉండు. వీటి విషయంలో పట్టుదల చూపించు. అలాచేస్తే నిన్ను నువ్వు రక్షించుకుంటావు, నువ్వు బోధించేది వినేవాళ్లను కూడా రక్షిస్తావు.