1 తిమోతి
2 కాబట్టి మొట్టమొదటిగా నేను మిమ్మల్ని కోరేదేమిటంటే, మీరు అన్నిరకాల ప్రజల కోసం అభ్యర్థనలు, ప్రార్థనలు, విన్నపాలు చేయండి, కృతజ్ఞతలు చెల్లించండి. 2 రాజుల కోసం, ఉన్నత స్థానాల్లో* ఉన్నవాళ్ల కోసం కూడా అలా చేయండి. అప్పుడు మనం అన్నివిషయాల్లో దైవభక్తిని, పట్టుదలను చూపిస్తూ నెమ్మది కలిగి, ప్రశాంతంగా జీవించగలుగుతాం. 3 ఇది మన రక్షకుడైన దేవుని దృష్టిలో మంచిది, ఆయనకు ఇష్టమైనది. 4 అన్నిరకాల ప్రజలు సత్యం గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకొని రక్షించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. 5 దేవుడు ఒక్కడే. దేవునికి, మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తుయేసు అనే మనిషి. 6 ఆయన అందరి* కోసం సరిసమానమైన విమోచన క్రయధన బలిగా తనను తాను అర్పించుకున్నాడు. తగిన సమయంలో ప్రజలు దాని గురించి సాక్ష్యమిస్తారు. 7 దీని గురించి సాక్ష్యమివ్వడానికే నేను ప్రచారకుడిగా, అపొస్తలుడిగా నియమించబడ్డాను; విశ్వాసం విషయంలో, సత్యం విషయంలో అన్యులకు బోధకునిగా నియమించబడ్డాను. నేను నిజమే చెప్తున్నాను, అబద్ధమాడట్లేదు.
8 కాబట్టి, మీరు సమావేశమయ్యే ప్రతీచోట పురుషులు కోపానికి, వాదులాటలకు చోటివ్వకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. 9 అలాగే స్త్రీలు రకరకాల జడలతో, బంగారంతో, ముత్యాలతో లేదా ఖరీదైన బట్టలతో అలంకరించుకోవడం కాదుగానీ అణకువ, మంచి వివేచన ఉట్టిపడేలా గౌరవప్రదమైన* బట్టలతో తమను తాము అలంకరించుకోవాలి. 10 అంతేకాదు దైవభక్తిగల స్త్రీలకు తగినట్టుగా మంచి పనులతో తమను తాము అలంకరించుకోవాలి.
11 స్త్రీలు పూర్తిగా లోబడివుంటూ, మౌనంగా* ఉండి నేర్చుకోవాలి. 12 బోధించడానికి గానీ, పురుషుని మీద అధికారం చెలాయించడానికి గానీ స్త్రీకి నేను అనుమతి ఇవ్వను; ఆమె మౌనంగా* ఉండాలి. 13 ఎందుకంటే ముందు ఆదాము సృష్టించబడ్డాడు, ఆ తర్వాతే హవ్వ సృష్టించబడింది. 14 అంతేకాదు, ఆదాము మోసపోలేదు కానీ స్త్రీయే పూర్తిగా మోసపోయింది, పాపం చేసింది. 15 ఏదేమైనా, పిల్లల్ని కనడం ద్వారా స్త్రీ సురక్షితంగా ఉంటుంది; అయితే, మంచి వివేచన చూపించడంతోపాటు విశ్వాసంతో, ప్రేమతో, పవిత్రతతో నడుచుకుంటూ ఉంటేనే ఆమె* సురక్షితంగా ఉంటుంది.