2 కొరింథీయులు
3 మమ్మల్ని మేము మళ్లీ కొత్తగా సిఫారసు చేసుకోవాల్సిన అవసరం ఉందా? వేరేవాళ్లలా మా గురించిన సిఫారసు ఉత్తరాలు మేము మీకు చూపించాలా? పోనీ మీ నుండి సిఫారసు ఉత్తరాలు మాకు అవసరమా? 2 నిజానికి, మీరే మా సిఫారసు ఉత్తరం; అది మా హృదయాల మీద చెక్కబడింది. ఆ ఉత్తరం మనుషులందరికీ తెలుసు, దాన్ని అందరూ చదువుతున్నారు. 3 మా పరిచర్య ద్వారా మేము రాసిన క్రీస్తు ఉత్తరం మీరు అని స్పష్టమౌతోంది. మేము దాన్ని సిరాతో రాయలేదు, జీవంగల దేవుని పవిత్రశక్తితో చెక్కాం; రాతి పలకల మీద కాదు, హృదయాల మీద దాన్ని చెక్కాం.
4 క్రీస్తు ద్వారా దేవుని మీద మాకు ఈ నమ్మకం ఉంది. 5 మా సొంత శక్తితో ఈ పనికి అర్హులమయ్యామని మేము అనట్లేదు, దేవుడే మమ్మల్ని అర్హుల్ని చేశాడు. 6 ఆయన వల్లే మేము కొత్త ఒప్పందానికి* పరిచారకులుగా ఉండేందుకు అర్హులమయ్యాం. మేము రాతపూర్వక ధర్మశాస్త్రానికి పరిచారకులం కాదు, పవిత్రశక్తికి పరిచారకులం; ఎందుకంటే రాతపూర్వక ధర్మశాస్త్రం మరణశిక్ష విధిస్తుంది, కానీ పవిత్రశక్తి బ్రతికిస్తుంది.
7 మరణశిక్షను అమలు చేసే ధర్మశాస్త్రం, రాతి పలకల మీద అక్షరాలతో చెక్కబడిన ధర్మశాస్త్రం ఎంత మహిమతో వచ్చిందంటే, మోషే ముఖం మీద ప్రకాశిస్తున్న ఆ మహిమ వల్ల ఇశ్రాయేలీయులు అతని ముఖాన్ని చూడలేకపోయారు. కనుమరుగైపోయే మహిమతో వచ్చిన ధర్మశాస్త్రానికే అంత మహిమ ఉంటే, 8 పవిత్రశక్తితో చేసే పరిచర్యకు ఇంకెంత మహిమ ఉండాలి? 9 శిక్షను అమలు చేసే ధర్మశాస్త్రానికే మహిమ ఉందంటే, నీతిని అమలు చేసే పరిచర్యకు ఇంకెంత మహిమ ఉండాలి! 10 నిజానికి, ఒకప్పుడు మహిమగలదిగా చేయబడినదాని మహిమ ఇప్పుడు తీసివేయబడింది. ఎందుకంటే ఇప్పుడున్న దానికి అంతకన్నా చాలా ఎక్కువ మహిమ ఉంది. 11 కనుమరుగైపోయేదే మహిమతో వచ్చిందంటే, ఇప్పుడున్నదానికి ఇంకెంత మహిమ ఉండాలి!
12 మనకు అలాంటి నిరీక్షణ ఉంది కాబట్టే చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాం. 13 కనుమరుగైపోయే దానికి ఏమౌతుందో ఇశ్రాయేలీయులకు కనబడకుండా మోషే తన ముఖానికి ముసుగు వేసుకున్నాడు. మేము అతనిలా చేయట్లేదు. 14 అయితే ఇశ్రాయేలీయుల మనసులు మొద్దుబారాయి. నేటికీ, పాత ఒప్పందం* చదువుతున్నప్పుడు ఆ ముసుగు అలాగే ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు ద్వారా మాత్రమే అది తీసివేయబడుతుంది. 15 నిజం చెప్పాలంటే, నేటికీ మోషే పుస్తకాలు చదువుతున్నప్పుడల్లా వాళ్ల హృదయాల మీద ముసుగు ఉంటుంది. 16 కానీ ఓ వ్యక్తి మారి యెహోవా* ఆరాధకుడైనప్పుడు ఆ ముసుగు తీసివేయబడుతుంది. 17 యెహోవా* అదృశ్య వ్యక్తి. యెహోవా* పవిత్రశక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. 18 ముసుగు తీసివేయబడిన ముఖాలతో మనమందరం యెహోవా* మహిమను అద్దాల్లా ప్రతిఫలిస్తున్నాం. మనం అంతకంతకూ ఎక్కువ మహిమను ప్రతిఫలిస్తూ ఆయన ప్రతిబింబంలా మారుతున్నాం. అదృశ్యుడైన యెహోవా* స్వయంగా మనల్ని ఎలా మారుస్తున్నాడో* సరిగ్గా అలాగే మారుతున్నాం.