1 కొరింథీయులు
3 సోదరులారా, పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం ప్రవర్తించేవాళ్లతో మాట్లాడినట్టు కాకుండా శరీర కోరికల ప్రకారం ప్రవర్తించేవాళ్లతో మాట్లాడినట్టు మీతో మాట్లాడాను; క్రైస్తవులుగా ఉండే విషయంలో పసిపిల్లల్లా ఉన్నవాళ్లతో మాట్లాడినట్టు మీతో మాట్లాడాను. 2 అప్పటికి ఇంకా మీరు బలమైన ఆహారం తినే స్థితిలో లేరు కాబట్టి నేను మిమ్మల్ని బలమైన ఆహారంతో కాకుండా పాలతో పోషించాను. నిజానికి, ఇప్పుడు కూడా మీరు అంత బలంగా ఏమీ లేరు. 3 ఇప్పటికీ మీరు శరీర కోరికల ప్రకారమే ప్రవర్తిస్తున్నారు. మీ మధ్య అసూయలు, గొడవలు ఉన్నాయంటే మీరు శరీర కోరికల ప్రకారం ప్రవర్తిస్తున్నట్టే కదా? లోక ప్రజల్లా ప్రవర్తిస్తున్నట్టే కదా? 4 ఒకరు “నేను పౌలు శిష్యుణ్ణి” అని, ఇంకొకరు “నేను అపొల్లో శిష్యుణ్ణి” అని అంటున్నారంటే మీరు లోక ప్రజల్లా ప్రవర్తిస్తున్నట్టు కాదా?
5 ఇంతకీ అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? వాళ్లు ప్రభువు అప్పగించిన పనిని చేసే పరిచారకులు మాత్రమే. వాళ్ల ద్వారా మీరు విశ్వాసులయ్యారు. 6 నేను నాటాను, అపొల్లో నీళ్లు పోశాడు. కానీ దాన్ని పెరిగేలా చేసింది దేవుడే. 7 నాటేవాడిది ఏమిలేదు, నీళ్లు పోసేవాడిది ఏమిలేదు; దాన్ని పెరిగేలా చేసిన దేవునిదే గొప్పతనమంతా. 8 నాటేవాడు చేసే పని, నీళ్లు పోసేవాడు చేసే పని ఒక్కటే.* అయితే ఇద్దరూ వాళ్లవాళ్ల పనిని బట్టి తగిన ప్రతిఫలం పొందుతారు. 9 మేము దేవుని తోటి పనివాళ్లం. మీరేమో దేవుడు సాగుచేస్తున్న పొలం, దేవుడు నిర్మిస్తున్న భవనం.
10 దేవుడు నాకు ప్రసాదించిన అపారదయకు తగ్గట్టు నేను నైపుణ్యంగల నిర్మాణకుడిగా* పునాది వేశాను, కానీ ఇంకొకరు దాని మీద కడుతున్నారు. అయితే కట్టే ప్రతీ ఒక్కరు ఎలా కడుతున్నారో చూసుకుంటూ ఉండాలి. 11 ఎందుకంటే, ఇప్పటికే వేసివున్న పునాది కాకుండా వేరే ఏ పునాదిని ఎవ్వరూ వేయలేరు. ఆ పునాది యేసుక్రీస్తు. 12 ఎవరైనా పునాది మీద బంగారం, వెండి, అమూల్యమైన రాళ్లు, చెక్క, ఎండుగడ్డి లేదా గడ్డిపోచలతో నిర్మిస్తే 13 పరీక్ష రోజు వచ్చినప్పుడు, వాళ్లవాళ్ల పని ఎలాంటిదో బయటపడుతుంది.* ఎందుకంటే అగ్ని ప్రతీదాన్ని బయటపెడుతుంది, అప్పుడు ఒక్కొక్కరి పని ఎంత నాణ్యంగా ఉందో తెలిసిపోతుంది. 14 పునాది మీద ఓ వ్యక్తి కట్టింది మంటల్లో కాలిపోకుండా ఉంటే, అతను ప్రతిఫలం పొందుతాడు; 15 ఒకవేళ కాలిపోతే, అతను బాగా నష్టపోతాడు, కానీ అతను మాత్రం తప్పించుకుంటాడు. కాకపోతే, అతను మంటల్లో నుండి బయటపడిన వ్యక్తిలా ఉంటాడు.
16 మీరే దేవుని ఆలయమని, దేవుని పవిత్రశక్తి మీలో నివసిస్తుందని మీకు తెలీదా? 17 ఎవరైనా దేవుని ఆలయాన్ని నాశనం చేస్తే, దేవుడు అతన్ని నాశనం చేస్తాడు; ఎందుకంటే దేవుని ఆలయం పవిత్రమైనది, మీరే ఆ ఆలయం.
18 ఎవరూ తమను తాము మోసం చేసుకోకూడదు: మీలో ఎవరైనా ఈ వ్యవస్థలో* తెలివిగలవాణ్ణని అనుకుంటే అతను మూర్ఖుడవ్వాలి, అప్పుడే అతను నిజంగా తెలివిగలవాడు అవుతాడు. 19 ఎందుకంటే ఈ లోకపు తెలివి దేవుని దృష్టిలో మూర్ఖత్వం. లేఖనాల్లో ఇలా రాసివుంది: “తెలివిగలవాళ్లు కుయుక్తితో తాము పన్నిన ఉచ్చుల్లో తామే చిక్కుకుపోయేలా దేవుడు చేస్తాడు.” 20 అంతేకాదు, “తెలివిగలవాళ్ల ఆలోచనలు వ్యర్థమైనవని యెహోవాకు* తెలుసు.” 21 కాబట్టి ఎవ్వరూ మనుషులు చేసేవాటి విషయంలో గొప్పలు చెప్పుకోకూడదు; ఎందుకంటే అన్నీ మీవే. 22 పౌలు గానీ, అపొల్లో గానీ, కేఫా* గానీ, లోకం గానీ, జీవం గానీ, మరణం గానీ, ఇప్పుడు ఉన్నవి గానీ, రాబోయేవి గానీ, అన్నీ మీవే; 23 మీరేమో క్రీస్తుకు చెందినవాళ్లు; క్రీస్తేమో దేవునికి చెందినవాడు.