కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w20 ఫిబ్రవరి పేజీలు 26-30
  • మంచి ఆదర్శాల నుండి నేర్చుకోవడం ఎన్నో దీవెనల్ని తీసుకొచ్చింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మంచి ఆదర్శాల నుండి నేర్చుకోవడం ఎన్నో దీవెనల్ని తీసుకొచ్చింది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరిచర్యను ప్రేమించడం నేర్చుకున్నాను
  • తిరిగి క్విబెక్‌ నగరంలో ప్రత్యేక పయినీర్లుగా . . .
  • ప్రాంతీయ పనికి ఆహ్వానం
  • గుర్తుండిపోయే సంవత్సరం
  • వేరే భాషా క్షేత్రంలో కొత్త నియామకం
  • యెహోవా నాకు చిన్నప్పటి నుండి శిక్షణ ఇచ్చాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఇతరుల మీద శ్రద్ధ చూపిస్తే చిరకాలం ఉండే దీవెనలు వస్తాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • యెహోవా సంస్థకు సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • క్విబెక్‌లో మన పనిని చట్టబద్ధం చేయడం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
w20 ఫిబ్రవరి పేజీలు 26-30

జీవిత కథ

మంచి ఆదర్శాల నుండి నేర్చుకోవడం ఎన్నో దీవెనల్ని తీసుకొచ్చింది

లేయాన్స్‌ క్రేపో చెప్పినది

లేయాన్స్‌ క్రేపో యువకునిగా ఉన్నప్పుడు.

చిన్నప్పుడు నాకు పరిచర్య చేయడం చాలా కష్టం అనిపించేది. పెద్దయ్యాక, నా వల్ల కాదని అనుకున్న నియామకాలు నాకు వచ్చాయి. కాబట్టి నా భయాల్ని అధిగమించడానికి, 58 ఏళ్ల పూర్తికాల సేవ చేయడానికి నాకు కొందరు సహోదర సహోదరీలు సహాయం చేశారు. పూర్తికాల సేవ నాకు ఎన్నో అద్భుతమైన దీవెనల్ని తీసుకొచ్చింది. నాకు సహాయం చేసినవాళ్ల గురించి చెప్తాను వినండి.

నేను ఫ్రెంచ్‌ భాష మాట్లాడే ప్రాంతమైన కెనడాలోని క్విబెక్‌లో పుట్టాను. మా అమ్మానాన్నల పేర్లు లూయి, జేలీయ. వాళ్లు నన్ను ప్రేమాప్యాయతల మధ్య పెంచారు. మా నాన్న స్వతహాగా సిగ్గరి, చదవడమంటే ఆయనకు చాలా ఇష్టం. నాకు రాయడమంటే ఇష్టం, పెద్దయ్యాక ఏదోక రోజు జర్నలిస్టు అవ్వాలనుకున్నాను.

నాకు 12 ఏళ్లున్నప్పుడు, మా నాన్నతో పాటు పనిచేసే రాడల్ఫ్‌ సూసీ తన స్నేహితునితో కలిసి మా ఇంటికి వచ్చాడు. వాళ్లిద్దరూ యెహోవాసాక్షులు. అప్పట్లో నాకు యెహోవాసాక్షుల గురించి పెద్దగా తెలీదు, వాళ్ల మతం మీద కూడా అంత ఆసక్తి ఉండేదికాదు. అయినప్పటికీ, వాళ్లు మా ప్రశ్నలకు బైబిల్ని ఉపయోగించి దయగా, తర్కబద్ధంగా జవాబులు చెప్పడం నాకు బాగా నచ్చింది. మా అమ్మానాన్నలకు కూడా బాగా నచ్చింది కాబట్టి మేము బైబిలు అధ్యయనం తీసుకోవడం మొదలుపెట్టాం.

అప్పుడు నేను క్యాథలిక్‌ స్కూల్‌లో చదువుకుంటున్నాను. అప్పుడప్పుడు బైబిలు అధ్యయనంలో నేను నేర్చుకునే విషయాల్ని నా తోటి విద్యార్థులతో మాట్లాడేవాణ్ణి. కొన్ని రోజులకు ఆ విషయం మా టీచర్ల దాకా పాకిపోయింది. వాళ్లు క్యాథలిక్‌ మతగురువులు. నేను చెప్పేది సరైనది కాదని బైబిలు ఉపయోగించి చెప్పకుండా, వాళ్లలో ఒకరు నన్ను క్లాసులో అందరిముందు తిట్టి, నేను తిరుగుబాటుదారుణ్ణని నిందించాడు! అది చాలా ఒత్తిడి కలిగించే పరిస్థితే, కానీ ఆ సంఘటన వల్ల నాకు జ్ఞానోదయం అయ్యింది. ఎందుకంటే, మా స్కూల్‌ మత బోధలు బైబిలు ప్రకారం లేవని నాకు అర్థమైంది. ఇక ఆ స్కూల్‌లో చదవకూడదని నిర్ణయించుకున్నాను. అమ్మానాన్నల్ని అడిగి స్కూల్‌ మారాను.

పరిచర్యను ప్రేమించడం నేర్చుకున్నాను

నేను బైబిలు అధ్యయనం కొనసాగించినప్పటికీ, ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడానికి సమయం పట్టింది. ఎందుకంటే నాకు ఇంటింటి పరిచర్య అంటే చాలా భయం ఉండేది. అప్పట్లో క్యాథలిక్‌ చర్చీకి చాలా అధికారం ఉండేది, వాళ్లు మన పరిచర్యను ఆపడానికి బలంగా ప్రయత్నించారు. క్విబెక్‌ రాజకీయ నాయకుడైన మోరీస్‌ డ్యుప్లిసీకి ఆ చర్చీతో చాలా దగ్గరి సంబంధం ఉండేది. ఆయన అండ చూసుకుని, అల్లరిమూకలు సాక్షుల్ని వేధించారు, కొన్నిసార్లు దాడులు కూడా చేశారు. అలాంటి పరిస్థితుల్లో పరిచర్య చేయాలంటే చాలా ధైర్యం అవసరమైంది.

నా భయాల్ని అధిగమించడానికి జాన్‌ రే అనే సహోదరుడు సహాయం చేశాడు. ఆయన తొమ్మిదో గిలియడ్‌ తరగతి పట్టభద్రుడు. జాన్‌కి చాలా అనుభవం ఉంది, ఆయన మృదు స్వభావి, అణకువ గలవాడు, సమీపించదగిన వ్యక్తి. తను నాకు నేరుగా సలహా ఇవ్వడం చాలా అరుదు. ఆయన మంచి ఆదర్శం నుండే నేను ఎక్కువ నేర్చుకున్నాను. జాన్‌కి ఫ్రెంచ్‌లో మాట్లాడడం కష్టంగా ఉండేది కాబట్టి భాష విషయంలో సహాయం చేయడానికి పరిచర్యలో నేను ఆయనతో పాటు వెళ్లేవాణ్ణి. జాన్‌తో సమయం గడపడం వల్ల ఆఖరికి నేను యెహోవాసాక్షి అవ్వాలని నిర్ణయించుకున్నాను. సాక్షుల్ని కలిసిన పది సంవత్సరాలకు అంటే మే 26, 1951⁠లో నేను బాప్తిస్మం తీసుకున్నాను.

లేయాన్స్‌ క్రేపో, జాన్‌ రే మరి కొంతమంది స్నేహితులతో.

జాన్‌ రే (A) ఉంచిన మంచి ఆదర్శం వల్ల నేను (B) ఇంటింటి పరిచర్య మీదున్న భయం పోగొట్టుకోగలిగాను

క్విబెక్‌ నగరంలోని మా చిన్న సంఘంలో ఎక్కువమంది పయినీర్లే. వాళ్ల మంచి ప్రభావం వల్ల నేను కూడా పయినీరు సేవ మొదలుపెట్టాను. అప్పట్లో, మేము ఇంటింటి పరిచర్యలో బైబిలును మాత్రమే ఉపయోగించి మాట్లాడేవాళ్లం. సాహిత్యం లేకుండా మాట్లాడేవాళ్లం కాబట్టి లేఖనాల్ని సమర్థవంతంగా ఉపయోగించాల్సి వచ్చేది. అందుకే, సత్యాన్ని సమర్థించడానికి సహాయం చేసే లేఖనాల్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాను. కానీ చాలామంది, బైబిలు మీద క్యాథలిక్‌ చర్చీ అధికారిక లైసెన్సు లేదా ఆమోద ముద్ర లేకపోతే బైబిలు కూడా చదివేవాళ్లు కాదు.

నేను 1952⁠లో, స్థానిక సంఘంలోని సీమన్‌ పాట్రీ అనే నమ్మకమైన సహోదరిని పెళ్లి చేసుకున్నాను. తర్వాత మేము మాట్రియల్‌ ప్రాంతానికి వెళ్లిపోయాం. సంవత్సరం తిరిగే లోపే మాకు ఒక పాప పుట్టింది, ఆమె పేరు లీజ్‌. మా పెళ్లి అవడానికి కొంతకాలం ముందే నేను పయినీరు సేవను ఆపేశాను. కానీ నేనూ సీమన్‌ కుటుంబంగా సంఘ పనుల్లో బిజీగా ఉండేలా సాదాసీదా జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాం.

పయినీరు సేవ గురించి మళ్లీ ఆలోచించడానికి పది సంవత్సరాలు పట్టింది. 1962⁠లో, కెనడా బెతెల్‌లో పెద్దల కోసం నెల రోజులపాటు జరిగిన రాజ్య పరిచర్య పాఠశాలకు హాజరయ్యాను. అక్కడ నాతోపాటు నా రూమ్‌లో ఉండడానికి కామీల్‌ వాలెట్‌ అనే సహోదరుణ్ణి నియమించారు. కామీల్‌కు పరిచర్య పట్ల ఉన్న ఉత్సాహం నన్ను నిజంగా ఆకట్టుకుంది. భార్యాపిల్లలు ఉన్నా ఆయన అలా ఉత్సాహం చూపించడం ఆసక్తిగా అనిపించింది. అప్పట్లో, క్విబెక్‌లో పిల్లల్ని పెంచుతూ పయినీరు సేవ చేయడం చాలా అరుదు. కానీ కామీల్‌ దాన్ని చేయడానికి ప్రయత్నించాడు. మేము కలిసి ఉన్న నెల రోజుల్లో, నా పరిస్థితి గురించి ఆలోచించమని ఆయన నన్ను ప్రోత్సహించాడు. కొన్ని నెలల్లోనే, నేను మళ్లీ పయినీరు సేవ చేయవచ్చని అనిపించింది. అది సరైన నిర్ణయం కాదని కొంతమంది అన్నారు, కానీ ఎక్కువ పరిచర్య చేసేలా యెహోవా నాకు సహాయం చేస్తాడనే నమ్మకంతో పయినీరు సేవ మొదలుపెట్టాను.

తిరిగి క్విబెక్‌ నగరంలో ప్రత్యేక పయినీర్లుగా . . .

1964⁠లో నేనూ సీమన్‌ మా సొంతూరైన క్విబెక్‌ నగరంలో ప్రత్యేక పయినీర్లుగా నియమించబడ్డాం. అక్కడే మేము చాలా సంవత్సరాలు సేవ చేశాం. ఆ సమయానికి పరిచర్య చేయడానికి పరిస్థితులు అనువుగా మారాయి, కానీ వ్యతిరేకత మాత్రం ఎదురౌతూ ఉంది.

ఓ శనివారం మధ్యాహ్నం సాంటా-మారీలో నన్ను అరెస్ట్‌ చేశారు. అది క్విబెక్‌ నగరానికి దగ్గర్లోని ఒక చిన్న ఊరు. ఒక అధికారి నన్ను పోలీస్‌ స్టేషన్‌ తీసుకెళ్లి, అనుమతి లేకుండా ఇంటింటి పరిచర్య చేస్తున్నానని చెప్పి జైల్లో వేశాడు. తర్వాత నన్ను భైయార్జోన్‌ అనే జడ్జి ముందు నిలబెట్టారు. అతన్ని చూస్తేనే జనాలు భయపడేవాళ్లు. కోర్టులో నా తరఫున వాదించే లాయరు ఎవరని అతను నన్ను అడిగాడు. నేను గ్లెన్‌ హౌa అని చెప్పాను. ఆ సహోదరుడు సాక్షుల కేసులు వాదించడంలో పేరుగాంచిన లాయరు. అప్పుడు ఆ జడ్జి భయపడి: “అబ్బా! మళ్లీ ఆయనా!” అని అన్నాడు. ఆ రోజుల్లో గ్లెన్‌కి మన కేసులు వాదించడంలో దిట్ట అనే మంచి పేరుంది. కొద్దిసేపటికే నా మీద మోపబడిన అభియోగాలు కొట్టేశారని కోర్టు చెప్పింది.

క్విబెక్‌లో ఉన్న వ్యతిరేకత మూలంగా, అక్కడ కూటాలకు అనువైన స్థలాలు దొరకడం కష్టమైంది. మా చిన్న సంఘం కోసం చల్లగా ఉండే ఒక పాత గ్యారేజ్‌ దొరికింది. ఎముకలు కొరికే చలికాలాల్లో వెచ్చదనం కోసం సహోదరులు ఆయిల్‌ హీటర్లు పెట్టేవాళ్లు. కూటాలు జరగడానికి కొన్ని గంటల ముందు మేము తరచూ ఆ హీటర్‌ చుట్టూ చేరి, ప్రోత్సాహకరమైన అనుభవాలు చెప్పుకునేవాళ్లు.

ప్రకటనా పనికి వచ్చిన మంచి ఫలితాల్ని చూడడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. 1960లలో క్విబెక్‌ నగరంలో ఉన్న ప్రాంతాల్లో అలాగే కోట్నోర్‌, గాస్పే పెనిన్సులా వంటి ప్రాంతాల్లో అన్నీ కలిపి కొన్ని చిన్నచిన్న సంఘాలు మాత్రమే ఉండేవి. నేడు, ఆ ప్రాంతాల్లో రెండు కన్నా ఎక్కువ సర్క్యూట్‌లు ఉన్నాయి, సహోదరసహోదరీలు మంచి రాజ్యమందిరాల్లో కూటాలు జరుపుకుంటున్నారు.

ప్రాంతీయ పనికి ఆహ్వానం

1977⁠లో కెనడాలోని టోరెంటోలో జరిగిన ఒక కూటానికి హాజరైనప్పుడు లేయాన్స్‌ క్రేపో కొంతమంది ప్రాంతీయ పర్యవేక్షకులతో కలిసి దిగిన ఫోటో.

1977⁠లో, ప్రయాణ పర్యవేక్షకుల కోసం కెనడాలోని టోరెంటోలో జరిగిన ఒక కూటానికి నేను హాజరయ్యాను

1970⁠లో నాకూ సీమన్‌కి ప్రాంతీయ సేవకు రమ్మనే ఆహ్వానం వచ్చింది. ఆ తర్వాత 1973⁠లో మమ్మల్ని జిల్లా సేవకు నియమించారు. ఆ సంవత్సరాల్లో లోర్యా సోమ్యూర్‌b, డేవిడ్‌ స్ప్లేన్‌c వంటి సమర్థవంతులైన సహోదరుల నుండి ఎంతో నేర్చుకున్నాను. వాళ్లిద్దరూ ప్రాంతీయ పనిలో సేవచేశారు. ప్రతీ ప్రాంతీయ సమావేశం తర్వాత, డేవిడ్‌ నేనూ మా బోధనా నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునే సలహాలు ఒకరికొకరం ఇచ్చుకునేవాళ్లం. డేవిడ్‌ ఒక సందర్భంలో ఇలా చెప్పడం నాకు గుర్తుంది: “లేయాన్స్‌, నీ ముగింపు ప్రసంగాన్ని నేను చాలా ఆనందించాను. అది బాగుంది, కానీ ఆ సమాచారంతో నేనైతే మూడు ప్రసంగాలు తయారు చేసుకునేవాణ్ణి!” నా ప్రసంగాల్లో చాలా సమాచారాన్ని ఇరికించాలని చూసేవాణ్ణి. నేను ప్రసంగాల్ని క్లుప్తంగా తయారుచేసుకోవడం నేర్చుకోవాల్సి వచ్చింది.

లేయాన్స్‌ క్రేపో సేవ చేసిన నగరాల్ని చూపించే ఒక మ్యాప్‌: సాంటా-మారీ, క్విబెక్‌ నగరం, మాంట్రియల్‌, టోరెంటో.

తూర్పు కెనడాలోని వేర్వేరు పట్టణాల్లో నేను సేవ చేశాను

ప్రాంతీయ పర్యవేక్షకుల్ని ప్రోత్సహించడానికి జిల్లా పర్యవేక్షకులు నియమించబడేవాళ్లు. అయితే, క్విబెక్‌లో చాలామంది ప్రచారకులకు నేను బాగా పరిచయం కాబట్టి సర్క్యూట్లను సందర్శించడానికి వెళ్లినప్పుడు వాళ్లు తరచూ నాతో పరిచర్య చేయాలని కోరుకునేవాళ్లు. వాళ్లతో కలిసి పరిచర్య చేయడం ఆనందంగా ఉన్నప్పటికీ, ప్రాంతీయ పర్యవేక్షకునితో ఎక్కువ సమయం వెచ్చించలేకపోయాను. ఒక సందర్భంలో, ఓ ప్రేమగల ప్రాంతీయ పర్యవేక్షకుడు నాకు ఇలా గుర్తుచేశాడు: “మీరు సహోదరుల కోసం సమయం ఇవ్వడం బాగుంది. కానీ ఈ వారం మీరు వచ్చింది నాకోసం అని మర్చిపోకండి. నాకూ ప్రోత్సాహం కావాలి కదా!” నేను దయగల ఆ సలహా నుండి సమతూకంగా ఉండడం నేర్చుకున్నాను.

1976⁠లో ఊహించని విషాదకరమైన సంఘటన ఒకటి జరిగింది. నా ప్రియమైన భార్య సీమన్‌కు బాగా జబ్బు చేసి, చనిపోయింది. ఆమె స్వయంత్యాగ స్ఫూర్తి చూపిస్తూ యెహోవా మీదున్న ప్రేమతో నాకు మంచి సహకారిగా నిలిచింది. పరిచర్యలో బిజీగా ఉండడం వల్ల ఆమె లేని లోటును తట్టుకోగలిగాను. అంతేకాదు, ఆ కష్ట సమయంలో యెహోవా నాకు ప్రేమపూర్వకంగా ఇచ్చిన మద్దతును బట్టి ఆయనకు నేనెంతో కృతజ్ఞుణ్ణి. తర్వాత, నేను ఇంగ్లీష్‌ మాట్లాడే ఉత్సాహవంతురాలైన పయినీరు సహోదరి కారలన్‌ ఇల్లీయట్‌ని పెళ్లి చేసుకున్నాను. అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవ చేయడానికి ఆమె క్విబెక్‌ వచ్చింది. ఆమె సమీపించదగిన మహిళ, ఇతరుల పట్ల ముఖ్యంగా సిగ్గు లేదా ఒంటరితనంతో బాధపడేవాళ్ల పట్ల నిజమైన శ్రద్ధ చూపిస్తుంది. ప్రాంతీయ సేవలో ఆమె నాతోపాటు కలవడం నాకో దీవెనగా అనిపించింది.

గుర్తుండిపోయే సంవత్సరం

1978 జనవరిలో, క్విబెక్‌లో జరిగే మొట్టమొదటి పయినీరు సేవా పాఠశాలకు ఉపదేశకునిగా నియమించబడ్డాను. నాకు చాలా కంగారుగా అనిపించింది. ఎందుకంటే, నేను ఇంతవరకు ఆ పాఠశాలకు హాజరవ్వలేదు ఆఖరికి ఆ పుస్తకం కూడా చూడలేదు, కాబట్టి విద్యార్థులతో సహా నాక్కూడా ఆ పుస్తకం కొత్తే. సంతోషకరమైన విషయమేమిటంటే, ఆ పాఠశాలకు చాలామంది అనుభవంగల పయినీర్లు వచ్చారు. నేను ఉపదేశకుణ్ణే అయినా ఆ పాఠశాలకు వచ్చిన విద్యార్థుల నుండి ఎంతో నేర్చుకున్నాను!

ఆ తర్వాత 1978⁠లో, మాంట్రియల్స్‌ ఒలింపిక్‌ స్టేడియంలో “విజయవంతమైన విశ్వాసం” అనే అంతర్జాతీయ సమావేశం జరిగింది. క్విబెక్‌లో జరిగిన అతిపెద్ద సమావేశం అదే. దానికి 80,000 కన్నా ఎక్కువమంది హాజరయ్యారు. నేను సమావేశంలో న్యూస్‌ సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేయడానికి నియమించబడ్డాను. దాంట్లో భాగంగా నేను చాలామంది జర్నలిస్టులతో మాట్లాడాను. అంతేకాదు వాళ్లు మన గురించి ఎన్నో సానుకూలమైన విషయాలు రాయడం చూసి చాలా సంతోషించాను. వాళ్లు మాతో ఇంటర్వ్యూలు, రేడియో ప్రోగ్రామ్‌లు తీసుకున్నారు. అవి మొత్తం కలిపి 20 కన్నా ఎక్కువ గంటలు వచ్చాయి. మన గురించి వందల సంఖ్యలో ఆర్టికల్స్‌ రాశారు. దానివల్ల గొప్ప సాక్ష్యం ఇవ్వబడింది!

వేరే భాషా క్షేత్రంలో కొత్త నియామకం

1996⁠లో నా జీవితంలో పెద్ద మార్పు జరిగింది. నేను బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి ఫ్రెంచ్‌ భాషా క్షేత్రంలోనే సేవ చేశాను. కానీ ఇప్పుడు టోరెంటో ప్రాంతంలోని ఒక ఇంగ్లీష్‌ భాషా క్షేత్రానికి నియమించబడ్డాను. నేను ఇంగ్లీష్‌ అంత బాగా మాట్లాడలేను కాబట్టి ప్రసంగాలు ఇవ్వడానికి చాలా భయపడ్డాను. నేను ఇంకా ఎక్కువసార్లు యెహోవాకు ప్రార్థించాల్సి వచ్చింది, ఆయనపై ఎక్కువ ఆధారపడాల్సి వచ్చింది.

అక్కడికి వెళ్లిన మొదట్లో చాలా నిరుత్సాహంగా అనిపించింది, కానీ అక్కడ గడిపిన రెండు సంవత్సరాలు అద్భుతంగా ఉన్నాయి, నేను నిజంగా ఆనందించాను. నేను ధైర్యంగా ఇంగ్లీష్‌ మాట్లాడేలా కారలన్‌ ఓపిగ్గా సహాయం చేసింది. అక్కడి సహోదరులు కూడా చాలా మద్దతును, ప్రోత్సాహాన్ని ఇచ్చారు. మేము చాలా త్వరగా కొత్త స్నేహితుల్ని సంపాదించుకున్నాం.

వారాంతంలో జరిగే సమావేశం కోసం చేసే ఏర్పాట్లలో, మరితర పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, నేను తరచూ శుక్రవారాలు సాయంత్రం ఒక గంటసేపు ఇంటింటి పరిచర్యలో గడిపేవాణ్ణి. ‘వారాంతంలో సమావేశ పనుల్లో బిజీగా ఉంటాం కదా, పరిచర్యకు వెళ్లడం దేనికి?’ అని కొంతమంది అనుకొనివుంటారు. కానీ, పరిచర్యలో ప్రజలతో మాట్లాడడం నాకు ఉత్తేజంగా అనిపించేది. ఇప్పటికీ, పరిచర్యకు వెళ్లిన ప్రతీసారి నేను చాలా సంతోషంగా ఉంటాను.

1998⁠లో నేనూ కారలన్‌ మాంట్రియల్‌లో తిరిగి ప్రత్యేక పయినీర్లుగా నియమించబడ్డాం. కొన్ని సంవత్సరాల వరకు, ప్రత్యేక బహిరంగ సాక్ష్యాన్ని ఏర్పాటు చేయడం, యెహోవాసాక్షుల మీద ఉన్న తప్పుడు అభిప్రాయాన్ని తీసేయడానికి మీడియా వాళ్లతో కలిసి పనిచేయడం నా నియామకంలో భాగంగా ఉండేది. ఇప్పుడు నేనూ, కారలన్‌ వేరే దేశం నుండి ఇటీవల కెనడాకు వచ్చిన విదేశీయులకు పరిచర్య చేయడాన్ని ఆనందిస్తున్నాం. తరచూ బైబిలు గురించి ఎక్కువ నేర్చుకోవడానికి వాళ్లు ఆసక్తి చూపిస్తారు.

లేయాన్స్‌ క్రేపో తన భార్య కారలన్‌తో.

నా భార్య కారలన్‌తో

బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి యెహోవా సేవలో నేను గడిపిన 68 సంవత్సరాల జీవితాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుంటే, ఆయన నన్ను ఎంతో ఆశీర్వదించాడు అనిపిస్తుంది. పరిచర్య చేయడాన్ని ఆనందించడం నేర్చుకున్నందుకు, ఎంతోమంది సత్యం నేర్చుకునేలా సహాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కూతురు లీజ్‌ ఆమె భర్త వాళ్ల పిల్లల్ని పెంచి పెద్ద చేశాక, వాళ్లిద్దరూ పయినీరు సేవ చేయడం మొదలుపెట్టారు. పరిచర్య పట్ల నా కూతురుకి ఉన్న ఉత్సాహం చూస్తే నాకు చాలా సంతోషమేస్తుంది. తమ మంచి ఆదర్శం ద్వారా, తెలివైన సలహాల ద్వారా నేను ఆధ్యాత్మికంగా ఎదిగేలా, వేర్వేరు నియామకంలో సేవచేసేలా నాకు సహాయం చేసిన తోటి క్రైస్తవులకు నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. ఏదైనా నియామకంలో నమ్మకంగా కొనసాగాలంటే కేవలం యెహోవా శక్తివంతమైన పవిత్రశక్తి మీద ఆధారపడితేనే అది సాధ్యమని నేను గుర్తించాను. (కీర్త. 51:11) తన పేరును స్తుతించడానికి ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి యెహోవాకు కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాను.—కీర్త. 54:6.

a డబ్ల్యు. గ్లెన్‌ హౌ జీవిత కథ కోసం తేజరిల్లు! (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 22, 2000⁠లో “యుద్ధం మనది కాదు, దేవునిదే” అనే ఆర్టికల్‌ చూడండి.

b కావలికోట (ఇంగ్లీష్‌) నవంబరు 15, 1976⁠లో వచ్చిన ‘నేను పోరాడి సంపాదించుకోవాల్సినంత విలువైన దాన్ని కనుగొన్నాను’ అనే ఆర్టికల్‌ చూడండి.

c డేవిడ్‌ స్ప్లేన్‌ యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యునిగా సేవచేస్తున్నాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి