జీవిత కథ
ఎక్కడైనా సరే, యెహోవా సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం
మునుపెన్నడూ నేను ఒంటరిగా ప్రకటించలేదు. ఎప్పుడు ప్రకటించడానికి వెళ్లినా భయంతో నా కాళ్లు వణికేవి. దానికి తోడు, ఆ క్షేత్రంలోని ప్రజలు అస్సలు వినేవాళ్లు కాదు. కొంతమందైతే కోపంతో ముఖం మీదే తిట్టేవాళ్లు, కొడతామని బెదిరించేవాళ్లు. నా పయినీరు సేవ మొదటి నెలలో నేను కేవలం ఒకే ఒక్క చిన్న పుస్తకాన్ని అందించాను.—మార్కుస్.
అది 1949లో జరిగిన సంఘటన, అంటే దాదాపు 64 ఏళ్ల కిందటి మాట. అయితే నా జీవన పయనం అంతకన్నా ముందే మొదలైంది. మా నాన్న హెండ్రిక్, నెదర్లాండ్స్‌లోని ఉత్తర డ్రెంటలో ఉన్న డోండరన్ అనే చిన్న పల్లెటూరిలో బూట్లు తయారు చేసేవాడు, అలాగే తోటమాలిగా కూడా పని చేసేవాడు. నేను 1927లో జన్మించాను. మేము మొత్తం ఏడుగురు పిల్లలం, నేను నాల్గవ వాణ్ణి. మా ఇల్లు గ్రామీణ ప్రాంతంలో ఓ మట్టి రోడ్డు పక్కన ఉండేది. మా పొరుగువారు చాలామంది రైతులే, నేను కూడా రైతు జీవితాన్ని గడిపాను. 1947లో నాకు 19 ఏళ్లున్నప్పుడు, మా పొరుగువాడైన ట్యూనస్ బేన్ నుండి సత్యం తెలుసుకున్నాను. నాకు గుర్తున్నంత వరకు, ట్యూనస్ను నేను మొదటిసారి కలిసినప్పుడు అతని వ్యక్తిత్వం నాకు అంతగా నచ్చలేదు. అయితే రెండవ ప్రపంచ యుద్ధం పూర్తయిన కొంతకాలానికే, అతను ఒక యెహోవాసాక్షి అయ్యాడు. ఆ తర్వాత అతను మునుపటి కంటే ఎక్కువ కలివిడిగా ఉండడం నేను గమనించాను. అతనిలో ఆ మార్పును చూసి, దేవుడు వాగ్దానం చేసిన పరదైసు గురించి అతను నాతో మాట్లాడినప్పుడు నేను విన్నాను. నేను వెంటనే సత్యాన్ని అంగీకరించాను, ఆ తర్వాత మేమిద్దరం చిరకాల స్నేహితులమయ్యాం.a
నేను 1948 మే నెలలో సువార్త ప్రకటించడం మొదలుపెట్టాను. ఆ తర్వాతి నెలలోనే, జూన్ 20న యూట్రెక్ట్లో జరిగిన సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నాను. 1949 జనవరి 1న నేను పయినీరు సేవను ఆరంభించాను. అప్పుడు నన్ను తూర్పు నెదర్లాండ్స్‌లోని బార్కూలో అనే గ్రామంలో ఉన్న చిన్న సంఘానికి నియమించారు. అది 130 కిలోమీటర్ల ప్రయాణం కాబట్టి నేను నా సైకిలు మీద వెళ్లాలనుకున్నాను. ఆ ప్రయాణానికి 6 గంటలే పడుతుందని అనుకున్నాను గానీ విపరీతమైన వర్షం, బలమైన ఈదురు గాలుల వల్ల 12 గంటలు పట్టింది. చివరి 90 కిలోమీటర్లు రైలులో ప్రయాణించినా అంత సమయం పట్టింది. ఆఖరికి, ఎప్పుడో సాయంత్రానికి ఆ గ్రామంలోని ఓ సాక్షి ఇంటికి చేరుకున్నాను. ఆ ప్రాంతంలో పయినీరు సేవ చేసినంత కాలం నేను వాళ్లింట్లోనే ఉన్నాను.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి సంవత్సరాల్లో, ప్రజల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. నా దగ్గర ఉన్నదల్లా ఒక సూటు, రెండు ప్యాంట్లు. ఆ సూటు మరీ పొడుగ్గా ఉండేది, ప్యాంట్లేమో మరీ పొట్టిగా ఉండేవి! ప్రారంభంలో నేను చెప్పినట్లు, బార్కూలో గ్రామంలో మొదటి నెల చాలా కష్టంగా గడిచింది, కానీ ఎన్నో బైబిలు అధ్యయనాల్ని ఇచ్చి యెహోవా నన్ను ఆశీర్వదించాడు. తొమ్మిది నెలల తర్వాత నన్ను ఆమ్స్టర్డామ్కు నియమించారు.
పల్లె నుండి పట్టణానికి
పచ్చని పంటపొలాలు ఉన్న పల్లెటూర్లో పెరిగిన నేను, ఇప్పుడు నెదర్లాండ్స్‌లోని అతి పెద్ద నగరమైన ఆమ్స్టర్డామ్కు చేరుకున్నాను. అక్కడ పరిచర్యలో మంచి ఫలితాలు వచ్చాయి. ముందటి తొమ్మిది నెలల్లో నేను ఇచ్చిన ప్రచురణల కంటే ఇక్కడ మొదటి నెలలో ఇచ్చినవే ఎక్కువ. అనతికాలంలోనే నేను తక్కువలో తక్కువ ఎనిమిది బైబిలు అధ్యయనాలు నిర్వహించడం మొదలుపెట్టాను. సంఘ సేవకునిగా (పెద్దల సభ సమన్వయకర్తగా) నియమితుణ్ణయ్యాక, మొదటిసారి బహిరంగ ప్రసంగం ఇచ్చే నియామకం వచ్చింది. అది నాకు ఎంతో భయాన్ని కలిగించింది. నేను ఆ ప్రసంగం ఇవ్వడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందు నన్ను వేరే సంఘానికి మార్చడంతో ఊపిరి పీల్చుకున్నాను. తర్వాతి సంవత్సరాల్లో నేను 5,000 కన్నా ఎక్కువ ప్రసంగాలు ఇస్తానని అస్సలు ఊహించలేదు.
పైన: 1950లో ఆమ్‌స్టర్‌డామ్‌లో వీధి సాక్ష్యం ఇస్తున్న మార్కుస్ (పూర్తిగా కుడికి)
నన్ను 1950 మే నెలలో హార్లంకు నియమించారు. ఆ తర్వాత ప్రయాణ సేవ చేయడానికి ఆహ్వానాన్ని అందుకున్నాను. దాంతో నాకు మూడు రోజుల పాటు సరిగ్గా నిద్రపట్టలేదు. నేను ఆ బాధ్యతను చేపట్టడానికి అర్హుణ్ణి కానని బ్రాంచి కార్యాలయంలో సేవచేస్తున్న రోబర్ట్ వింగ్క్లర్కు చెప్పాను, దానికి ఆయన ఇలా అన్నాడు: ‘ముందు దరఖాస్తు నింపేయ్, ఆ తర్వాత నువ్వే నేర్చుకుంటావ్.’ ఆ తర్వాత కొంతకాలానికి, నాకు ఓ నెలపాటు శిక్షణ ఇచ్చిన తర్వాత నేను సర్క్యూట్ సేవకునిగా (ప్రాంతీయ పర్యవేక్షకునిగా) సేవచేయడం మొదలుపెట్టాను. ఒకానొక సంఘాన్ని సందర్శించినప్పుడు, యెహోవా పట్ల ఎంతో ప్రేమ, అలాగే స్వయంత్యాగ స్ఫూర్తి ఉన్న యాన్నీ టాట్గన్ అనే ఉత్సాహవంతురాలైన ఓ యౌవన పయినీరును కలిశాను. మేము 1955లో పెళ్లి చేసుకున్నాం. అయితే నేను నా గురించి ఇంకా చెప్పే ముందు, యాన్నీ తానెలా పయినీరు అయ్యిందో, మా పెళ్లయ్యాక మేమిద్దరం కలిసి ఎలా సేవ చేశామో చెబుతుంది.
పెళ్లయ్యాక మా సేవ
యాన్నీ: 1945లో నాకు 11 ఏళ్లున్నప్పుడు మా అమ్మ యెహోవాసాక్షి అయ్యింది. ముగ్గురు పిల్లలమైన మాతో కలిసి బైబిలు చదవడం ఎంత ప్రాముఖ్యమో అమ్మ అర్థంచేసుకుంది, కానీ మా నాన్న సత్యాన్ని వ్యతిరేకించాడు. అందువల్ల మా నాన్న ఇంట్లో లేనప్పుడు అమ్మ మాకు బైబిలు నేర్పించేది.
ద హేగ్‌లో 1950లో జరిగిన సమావేశమే నేను హాజరైన మొట్టమొదటి కూటం. ఓ వారం తర్వాత, డ్రెంట ప్రాంతంలోని ఆసన్ నగరంలో ఉన్న స్థానిక రాజ్యమందిరంలో నేను మొదటిసారిగా ఓ సంఘకూటానికి హాజరయ్యాను. దాంతో మా నాన్నకు కోపమొచ్చి నన్ను ఇంట్లో నుండి గెంటేశాడు. అప్పుడు మా అమ్మ నాతో, “నువ్వు ఎక్కడికెళ్లాలో నీకు తెలుసు” అని అంది. ఆధ్యాత్మిక సహోదర సహోదరీలను ఉద్దేశించే అమ్మ అలా చెప్పిందని నాకు అర్థమైంది. మొదట్లో నేను, దగ్గర్లోని ఓ సాక్షి కుటుంబంతో ఉండేదాన్ని. అయినా, మా నాన్న నన్ను బాగా ఇబ్బందిపెట్టేవాడు. అందువల్ల, నేను 95 కిలోమీటర్ల దూరంలో ఓవరైసల్లోని డెవెంటర్లో ఉన్న సంఘానికి వెళ్లాను. నేనింకా మైనరునే కాబట్టి, ఇంటి నుండి నన్ను వెళ్లగొట్టినందుకు మా నాన్నకు ప్రభుత్వాధికారుల నుండి సమస్యలు ఎదురయ్యాయి. దాంతో ఆయన నన్ను తిరిగి ఇంటికి రమ్మన్నాడు. మా నాన్న సత్యాన్ని అంగీకరించకపోయినా, మెల్లమెల్లగా నన్ను కూటాలకు, పరిచర్యకు వెళ్లనివ్వడం మొదలుపెట్టాడు.
కింద: 1952లో వెకేషన్ పయినీరింగ్ చేస్తున్న యాన్నీ (పూర్తిగా కుడికి)
నేను ఇంటికి వచ్చిన కొద్ది రోజుల తర్వాత మా అమ్మ తీవ్రంగా అనారోగ్యం పాలవ్వడంతో ఇంటి పనంతా నేనే చేయాల్సివచ్చేది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా, నేను ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించి, 17 ఏళ్ల వయస్సులో 1951లో బాప్తిస్మం తీసుకున్నాను. 1952లో మా అమ్మ కోలుకున్న తర్వాత, నేను మరో ముగ్గురు పయినీరు సహోదరీలతో కలిసి రెండు నెలలు వెకేషన్ (సహాయ) పయినీరుగా సేవ చేశాను. మేము ఒక హౌస్‌బోట్‌లో ఉంటూ, డ్రెంట ప్రాంతంలోని రెండు పట్టణాల్లో పరిచర్య చేశాం. 1953లో నేను క్రమ పయినీరునయ్యాను. ఒక సంవత్సరం తర్వాత, ఓ యౌవన ప్రాంతీయ పర్యవేక్షకుడు మా సంఘాన్ని సందర్శించాడు. ఆయనే మార్కుస్. ఒక జంటగా మేము యెహోవాకు ఇంకా మంచిగా సేవ చేయవచ్చని భావించి, 1955లో పెళ్లి చేసుకున్నాం.—ప్రసం. 4:9-12.
1955లో మా పెళ్లినాడు
మార్కుస్: మా పెళ్లయ్యాక, మొదటిగా మమ్మల్ని గ్రోనింగన్ ప్రాంతంలోని వేన్డామ్కు పయినీర్లుగా నియమించారు. మేము అక్కడ చాలా చిన్న గదిలో ఉండేవాళ్లం. ఆ చిన్న గదిని కూడా యాన్నీ చాలా శుభ్రంగా ఉంచేది, అందంగా అలంకరించేది. ప్రతీరోజు రాత్రి మేము మాకున్న బల్లను, అలాగే రెండు చిన్న కుర్చీలను పక్కకు జరిపి గోడకున్న మంచాన్ని (వాల్బెడ్) కిందికి దించేవాళ్లం.
ఆరు నెలల తర్వాత, బెల్జియంలో ప్రయాణ సేవ చేయడానికి ఆహ్వానాన్ని అందుకున్నాం. 1955 నాటికి ఆ దేశంలో 4,000 మంది ప్రచారకులు మాత్రమే ఉండేవాళ్లు. ఇప్పుడు ఆ సంఖ్య 24,000కు చేరుకుంది! ఉత్తర బెల్జియంలోని ఫ్లాండర్స్ నగరంలోని ప్రజలు నెదర్లాండ్స్‌లో మాట్లాడే భాషనే మాట్లాడతారు. అయినా, బెల్జియన్ యాస చాలా భిన్నంగా ఉండడంతో మొదట్లో మాకు కొంచెం కష్టమైంది.
యాన్నీ: ప్రయాణ సేవ చేయాలంటే ఎంతో స్వయంత్యాగ స్ఫూర్తి అవసరం. మేము సంఘాలను సందర్శించడానికి మా సైకిళ్ల మీదే వెళ్లేవాళ్లం, సహోదరసహోదరీల ఇళ్లలో ఉండేవాళ్లం. మాకు ఉండడానికి సొంత ఇల్లు లేకపోవడంతో, సోమవారం వరకు సహోదరుల ఇళ్లలోనే ఉండి, మంగళవారం ఉదయం బయలుదేరి తదుపరి సంఘానికి వెళ్లేవాళ్లం. అయినా మేమెప్పుడూ మా సేవను యెహోవా ఇచ్చిన ఆశీర్వాదంగానే భావించేవాళ్లం.
మార్కుస్: మొదట్లో మాకు సంఘాల్లో ఉన్న సహోదరసహోదరీలు పెద్దగా పరిచయం లేదు, అయినా వాళ్లు మాతో చాలా దయగా ఉండేవాళ్లు, ఆతిథ్యాన్ని చూపించేవాళ్లు. (హెబ్రీ. 13:1) గడిచిన సంవత్సరాల్లో మేము బెల్జియంలోని డచ్ భాషా సంఘాలన్నిటినీ చాలాసార్లు సందర్శించాం. దానివల్ల మేము ఎన్నో ఆశీర్వాదాలను పొందాం. చెప్పాలంటే దాదాపు డచ్ సహోదరసహోదరీలు అందరూ మాకు సుపరిచితులయ్యారు, చాలా సన్నిహితులయ్యారు. వందలాది పిల్లలు మా కళ్ల ముందే పెరిగి పెద్దవాళ్లయ్యారు, ఆధ్యాత్మికంగా ఎదిగారు, తమ జీవితాల్లో రాజ్యానికి మొదటి స్థానం ఇస్తూ యెహోవాకు సమర్పించుకున్నారు. వాళ్లలో చాలామంది పూర్తికాల సేవలో అడుగుపెట్టి, యెహోవాకు నమ్మకంగా సేవచేయడాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. (3 యోహా. 4) అలా ‘ఒకరి విశ్వాసం చేత ఒకరం ఆదరణ పొందడం’ వల్ల మా నియామకంలో మేము పూర్ణహృదయంతో కొనసాగగలిగాం.—రోమా. 1:11.
ఓ కఠిన పరీక్ష, గొప్ప దీవెన
మార్కుస్: మా పెళ్లయిన నాటి నుండి గిలియడ్ పాఠశాలకు వెళ్లాలని మా కోరిక. ప్రతీరోజూ మేము కనీసం ఒక గంట ఇంగ్లీషు చదివేవాళ్లం. ఎంతైనా పుస్తకాల నుండి ఇంగ్లీషు నేర్చుకోవడం కష్టమని భావించి, మేము సెలవుల్లో ఇంగ్లాండ్‌కు వెళ్లి పరిచర్య చేస్తూ భాషను మెరుగుపర్చుకోవాలనుకున్నాం. చివరకు 1963లో బ్రూక్లిన్‌లోని ప్రపంచ ప్రధాన కార్యాలయం నుండి మేము ఒక ఉత్తరాల కవరును అందుకున్నాం. అందులో నాకు, యాన్నీకి తలా ఒక ఉత్తరం ఉంది. నా ఉత్తరంలో, పది నెలల ప్రత్యేక గిలియడ్ పాఠశాలకు నన్ను రమ్మనే ఆహ్వానం ఉంది. ఆ పాఠశాల ముఖ్యంగా సహోదరులకు శిక్షణనివ్వడానికి, సంస్థాగత విషయాల్ని నేర్పించడానికి రూపొందించారు. ఆ పాఠశాలకు ఆహ్వానం పొందిన 100 మంది విద్యార్థుల్లో 82 మంది సహోదరులే.
యాన్నీ: ఆ రోజు నాకు వచ్చిన ఆ ఉత్తరంలో, మార్కుస్ గిలియడ్ పాఠశాలకు హాజరయ్యే సమయంలో బెల్జియంలో ఉండడం వీలౌతుందో లేదో ప్రార్థనాపూర్వకంగా ఆలోచించమని నన్ను కోరారు. అది చూసినప్పుడు మొదట నేను చాలా నిరాశ చెందానని ఒప్పుకోవాల్సిందే. ఆ పాఠశాలకు అర్హురాలినయ్యేందుకు నేను చేసిన ప్రయత్నాల్ని యెహోవా ఆశీర్వదించలేదనిపించింది. అయినా ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటించడానికి విద్యార్థులకు సహాయం అందించడమే గిలియడ్ పాఠశాల ఉద్దేశమని గుర్తుచేసుకున్నాను. కాబట్టి నేను వాళ్లు అడిగిన దానికి అంగీకరించాను. అప్పుడు నన్ను బెల్జియంలోని గెంట్ నగరంలో ప్రత్యేక పయినీర్లుగా సేవ చేస్తున్న ఆన్నా, మారీయా కోల్పర్ట్ అనే ఇద్దరు అనుభవం గల సహోదరీలతో కలిసి సేవ చేసేందుకు ప్రత్యేక పయినీరుగా నియమించారు.
మార్కుస్: నేను ఇంగ్లీషు భాషను ఇంకా మెరుగుపర్చుకోగలిగేలా, పాఠశాల మొదలవ్వడానికి 5 నెలల ముందే నన్ను బ్రూక్లిన్కు పిలిచారు. నేనక్కడ షిప్పింగ్, సర్వీస్ డిపార్ట్మెంట్లలో పని చేశాను. ప్రపంచ ప్రధాన కార్యాలయంలో పని చేస్తూ ఆసియా, యూరప్, దక్షిణ అమెరికాకు సాహిత్యాన్ని ఎగుమతి చేసే విషయంలో సహాయపడుతూ నేను అంతర్జాతీయ సహోదరత్వం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోగలిగాను. సహోదరుడైన రస్సెల్ కాలంలో పిల్గ్రిమ్ (ప్రయాణ పర్యవేక్షకుడు) పనిలో ఉన్న సహోదరుడు ఏ.హెచ్. మాక్‌మిలన్‌ను నేను ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటాను. నేను ఆయనను చూసే సమయానికే ఆయన చాలా వృద్ధుడు, పైగా వినికిడి లోపం ఉండేది. అయినా ఆయన ఎంతో నమ్మకంగా సంఘ కూటాలన్నిటికీ హాజరవ్వడం చూశాను. అది నా మీద చెరగని ముద్ర వేసింది. మన క్రైస్తవ సహవాసాన్ని ఎన్నడూ తేలిగ్గా తీసుకోకూడదని అది నాకు నేర్పించింది.—హెబ్రీ. 10:24, 25.
యాన్నీ: నేను, మార్కుస్ ప్రతీవారం ఎన్నోసార్లు ఉత్తరాలు రాసుకున్నాం. ఒకరి తోడు ఒకరికి లేని పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపించింది. అయినా మార్కుస్ గిలియడ్ శిక్షణలో, నేను నా పరిచర్యలో నిజమైన ఆనందాన్ని పొందాం. మార్కుస్ అమెరికా నుండి తిరిగివచ్చే సమయానికి నేను 17 బైబిలు అధ్యయనాలు చేస్తున్నాను. ఒకరిని విడిచి ఒకరం 15 నెలలపాటు దూరంగా ఉండడం ఒక సవాలే అయినా, మేము చేసిన త్యాగాలకు యెహోవా మమ్మల్ని ఆశీర్వదించడం చూశాను. మార్కుస్ తిరిగి వచ్చిన రోజున, ఆయన రావాల్సిన విమానం చాలా ఆలస్యమైంది. చివరకు ఆయన వచ్చినప్పుడు మేమిద్దరం ఒకరినొకరం హత్తుకొని ఎంతగానో ఏడ్చాం. ఆ తర్వాత మేమిద్దరం ఎప్పుడూ ఒకరిని విడిచి ఒకరం లేము.
చక్కటి సేవావకాశాలను పొందినందుకు యెహోవాకు రుణపడి ఉన్నాం
మార్కుస్: నేను 1964 డిసెంబరులో గిలియడ్ పాఠశాల నుండి తిరిగి వచ్చాక, మమ్మల్ని బెతెల్ సేవకు నియమించారు. కొంతకాలానికి మా నియామకం మారుతుందని అప్పుడు మాకు తెలియదు. కేవలం మూడు నెలలకే నన్ను ఫ్లాండర్స్‌లో జిల్లా పర్యవేక్షకునిగా నియమించారు. బెల్జియంకు మిషనరీలుగా వచ్చిన ఆల్జన్, ఎల్స్ వీగర్స్మా దంపతులను జిల్లా సేవకు పంపించినప్పుడు మేము తిరిగి బెతెల్‌కు వెళ్లాం, అక్కడ నేను సర్వీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. 1968 నుండి 1980 మధ్యకాలంలో మా నియామకం బెతెల్ నుండి ప్రయాణ సేవకు, ప్రయాణ సేవ నుండి బెతెల్‌కు, అలా ఎన్నోసార్లు మారింది. చివరకు, 1980 నుండి 2005 వరకు నేను మళ్లీ జిల్లా పర్యవేక్షకునిగా సేవ చేశాను.
మా నియామకం ఎన్నిసార్లు మారినా, మేము యెహోవాకు పూర్ణాత్మతో సేవ చేయడానికే మా జీవితాలను సమర్పించుకున్నామనే వాస్తవాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. మా సేవలో వచ్చిన ఏ మార్పైనా రాజ్య సంబంధమైన పనిని విస్తరించడానికేనన్న నమ్మకంతో మేము పొందిన ప్రతీ నియామకాన్ని ఎంతో ఆనందించాం.
యాన్నీ: బ్రాంచి కమిటీ సభ్యునిగా అదనపు శిక్షణ కోసం మార్కుస్ను 1977లో బ్రూక్లిన్కు, అలాగే 1997లో ప్యాటర్సన్కు ఆహ్వానించినప్పుడు, ఆయనతో వెళ్లే ఉత్తేజకరమైన అవకాశాన్ని నేనెంతో ఆస్వాదించాను.
మాకు ఏమి కావాలో యెహోవాకు తెలుసు
మార్కుస్: 1982లో యాన్నీకి ఓ శస్త్రచికిత్స జరిగింది, అయితే తను త్వరగానే కోలుకుంది. మూడు సంవత్సరాల తర్వాత, లూవెన్లోని సంఘం వాళ్లు ఎంతో దయతో తమ రాజ్యమందిరం పైన ఉన్న ఇంటిని మాకిచ్చారు. 30 సంవత్సరాల్లో మొదటిసారిగా మాకంటూ ఓ చిన్న సొంతిల్లు లభించింది. మంగళవారాలు మేము సంఘాల్ని సందర్శించడానికి బయలుదేరేటప్పుడు, మా లగేజీని దించడానికి పైకీ కిందికీ 54 మెట్లు ఎక్కిదిగాల్సొచ్చేది. సంతోషకరంగా 2002లో, మాకు కింది అంతస్తులో ఓ ఇల్లు ఉండేటట్లు ఏర్పాటు చేశారు. నాకు 78 ఏళ్లు వచ్చాక, మమ్మల్ని లోకరన్ అనే పట్టణానికి ప్రత్యేక పయినీర్లుగా నియమించారు. ఈ విధమైన సేవను చేస్తున్నందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాం, ఇప్పుడు కూడా ప్రతీ రోజు పరిచర్యకు వెళ్లగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాం.
“ఎక్కడ సేవ చేస్తాం, ఏ స్థానంలో సేవ చేస్తాం అన్నది కాదుగానీ, ఎవరికి సేవ చేస్తామన్నదే ప్రాముఖ్యమని మేము బలంగా నమ్మాం”
యాన్నీ: మా ఇద్దరి పూర్తికాల సేవా సంవత్సరాలను కలిపి లెక్కిస్తే అవి 120 ఏళ్ల పైమాటే. తనను నమ్మకంగా సేవించేవాళ్లను, “ఏమాత్రమును విడువను” అనీ, వాళ్లకు “ఏమియు తక్కువకాదు” అనీ యెహోవా చేసిన వాగ్దానాలు ఎంత నిజమో మేము స్వయంగా తెలుసుకున్నాం.—హెబ్రీ. 13:5; ద్వితీ. 2:7.
మార్కుస్: యౌవనులుగా ఉన్నప్పుడే మమ్మల్ని మేము యెహోవాకు సమర్పించుకున్నాం. మేము ఎన్నడూ గొప్పవాటిని ఆశించలేదు. ఎక్కడ సేవ చేస్తాం, ఏ స్థానంలో సేవ చేస్తాం అన్నది కాదుగానీ, ఎవరికి సేవ చేస్తామన్నదే ప్రాముఖ్యమని మేము బలంగా నమ్మాం కాబట్టి మాకు ఏ నియామకం ఇచ్చినా, దానిని మేము సంతోషంగా అంగీకరించాం.
a ఆ తర్వాతి సంవత్సరాల్లో మా నాన్న, అమ్మ, పెద్ద అక్క, ఇద్దరు తమ్ముళ్లు కూడా సాక్షులయ్యారు.