కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w13 4/15 పేజీలు 22-26
  • ‘శ్రేష్ఠమైన కార్యములను వివేచించండి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘శ్రేష్ఠమైన కార్యములను వివేచించండి’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా సంస్థలోని పరలోక భాగం దూసుకెళ్తోంది
  • యెహోవా సంస్థలోని భూసంబంధ భాగం
  • “శ్రేష్ఠమైన కార్యముల” మీదే దృష్టంతా
  • యెహోవా సంస్థను ఆదర్శంగా తీసుకోండి
  • యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • దేవుని సంస్థలో భాగంగా సురక్షితంగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ‘అలసిపోకుండా మేలు చేయండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • యెహోవా తన సంస్థను నడిపిస్తున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
w13 4/15 పేజీలు 22-26

‘శ్రేష్ఠమైన కార్యములను వివేచించండి’

‘శ్రేష్ఠమైన కార్యములను వివేచించండి.’—ఫిలి. 1:9, 10.

ధ్యానించాల్సిన అంశాలు

  • యెషయాకు, యెహెజ్కేలుకు, దానియేలుకు దేవుడిచ్చిన దర్శనాలు మనకు ఏ నమ్మకాన్ని కలిగిస్తున్నాయి?

  • యెహోవా సంస్థలోని భూసంబంధ భాగం దేనిమీద పూర్తిగా దృష్టి నిలుపుతుందో పరిశీలించినప్పుడు మనం ఏమి నేర్చుకుంటాం?

  • ఈ ఆర్టికల్‌ మీలో ఏ కృత నిశ్చయాన్ని కలిగించింది?

1, 2. అంత్యదినాల గురించిన ఏ ప్రవచనం యేసు శిష్యులను బాగా ఆలోచింపజేసి ఉంటుంది? ఎందుకు?

ఆ సమయంలో యేసుతో పాటు పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ మాత్రమే ఉన్నారు. దేవాలయం నాశనం కాబోతుందని అప్పటికి కాసేపటి క్రితమే యేసు చెప్పడం వల్ల, వాళ్ల మనసులు చాలా భారంగా ఉన్నాయి. (మార్కు 13:1-4) అందుకే వాళ్లు ఆయనను ఇలా అడిగారు: “ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుము.” (మత్త. 24:1-3) దాంతో యేసు యెరూషలేము నాశనానికి ముందు జరగబోయే వాటితోపాటు, సాతాను లోకపు అంత్యదినాల్లో జరగబోయే వాటి గురించి కూడా చెప్పాడు. ప్రత్యేకించి ఒక విషయం యేసు శిష్యులను బాగా ఆలోచింపజేసి ఉంటుంది. యుద్ధాలు, ఆహార కొరత, అక్రమం విస్తరించడం వంటి కృంగదీసే విషయాల గురించి చెప్పిన తర్వాత యేసు, అంత్యదినాల్లో చోటుచేసుకునే ఓ శుభపరిణామం గురించి చెప్పాడు. ఆయనిలా అన్నాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”—మత్త. 24:7-14.

2 క్రీస్తుతో కలిసి రాజ్యసువార్త ప్రకటించే చక్కని అవకాశం ఆయన శిష్యులకు దక్కింది. (లూకా 8:1; 9:1, 2) “కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి” అని ఆయన చెప్పినట్లు వాళ్లు జ్ఞాపకం చేసుకొనివుంటారు. (లూకా 10:2) అయితే, వాళ్లు “సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతట” ఎలా ప్రకటిస్తారు? అంతమంది పనివాళ్లు ఎక్కడ నుండి వస్తారు? యేసు ప్రక్కన కూర్చుని ఉన్నప్పుడు శిష్యులకు భవిష్యత్తును చూసే అవకాశం దొరికుంటే వాళ్లు తప్పకుండా ఆశ్చర్యపోయే వాళ్లు! మత్తయి 24:14లోని ఆ మాటలు ఇప్పుడు అంత గొప్పగా నెరవేరుతున్నాయి!

3. లూకా 21:34 ఈ రోజుల్లో ఎలా నెరవేరుతోంది? మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

3 యేసు చెప్పింది జరుగుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. లక్షలమంది ఒక్కతాటి మీదకు వచ్చి దేవుని రాజ్యం గురించి ప్రపంచమంతటా ప్రకటిస్తున్నారు. (యెష. 60:22) ఈ అంత్యదినాల్లో ఆ పని మీద మనసు లగ్నం చేయడం కొంతమందికి అంత సులువు కాదని కూడా యేసు చెప్పాడు. వాళ్ల ధ్యాస పక్కకు మళ్లి, వాళ్ల హృదయాలు “మందముగా” తయారవుతాయి. (లూకా 21:34 చదవండి.) ఆ మాటలు కూడా మన కళ్ల ముందే నెరవేరుతున్నాయి. దేవుని ప్రజల్లో కొంతమంది పక్కదారి పడుతున్నారు. ఆటపాటల కోసం వాళ్లు వెచ్చించే సమయం, ఉద్యోగం, పై చదువులు, ఆస్తిపాస్తుల అర్జన వంటి వాటిల్లో వాళ్లు తీసుకునే నిర్ణయాల్ని బట్టి ఆ విషయం అర్థమౌతోంది. మరికొందరు, రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లూ ఇబ్బందుల వల్ల నీరసించిపోతున్నారు. ఈ ప్రశ్నలు వేసుకోండి: ‘ఈ విషయాల్లో నేనెలా ఉన్నాను? నేను దేనిమీద మనసు లగ్నం చేస్తున్నానని నా నిర్ణయాలు చూపిస్తున్నాయి?’

4. (ఎ) ఫిలిప్పీ క్రైస్తవుల విషయంలో పౌలు దేనిగురించి ప్రార్థించాడు? ఎందుకు? (బి) ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం? ఎందుకు?

4 దేవునికి సంబంధించిన పనుల మీద ధ్యాస ఉంచడానికి మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ప్రయాసపడాల్సి వచ్చింది. ఫిలిప్పీలోని క్రైస్తవులు “శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారు” అయ్యేలా వాళ్లకోసం ప్రార్థించాల్సిన అవసరం ఉందని అపొస్తలుడైన పౌలు గుర్తించాడు. (ఫిలిప్పీయులు 1:9-11 చదవండి.) ఆ కాలంలో ఉన్న ఎంతోమంది, అపొస్తలుడైన పౌలులా “నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషధైర్యము తెచ్చుకొనిరి.” (ఫిలి. 1:12-14) ఈ రోజుల్లో కూడా మనలో అత్యధికులు ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ, యెహోవా సంస్థ సాధిస్తున్న దాన్ని పరిశీలిస్తే, అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఈ పని మీద మరింత ఎక్కువగా దృష్టి నిలపగలుగుతాం. మత్తయి 24:14లోని మాటలు నెరవేరేలా యెహోవా చేసిన ఏర్పాటు గురించి ఈ ఆర్టికల్‌లో చూద్దాం. ఆయన సంస్థ ముఖ్యంగా దేని మీద దృష్టి నిలుపుతోంది? దాన్ని తెలుసుకున్నప్పుడు మనకు, మన కుటుంబ సభ్యులకు ఏమి చేయాలనిపిస్తుంది? యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగుతూ, ఆయన సంస్థతోపాటు నడవడానికి మనకు ఎలాంటి సహాయం అందుబాటులో ఉందో తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

యెహోవా సంస్థలోని పరలోక భాగం దూసుకెళ్తోంది

5, 6. (ఎ) యెహోవా తన సంస్థలోని పరలోక భాగానికి సంబంధించిన దర్శనాల్ని ఎందుకు ఇచ్చాడు? (బి) దర్శనంలో యెహెజ్కేలు ఏమి చూశాడు?

5 యెహోవా, తన వాక్యంలో ప్రతీ విషయాన్ని రాయించాలనుకోలేదు. ఉదాహరణకు, ఎంతో ఆసక్తికరంగా ఉంటాయనిపించే విషయాలు అంటే మానవ మెదడు, విశ్వం వంటివాటి గురించిన పూర్తి వివరాలు ఆయన ఇవ్వలేదు! అయితే, తన సంకల్పాలను అర్థం చేసుకోవడానికి, వాటికి తగినట్లు మన జీవితాలను మలచుకోవడానికి అవసరమైన సమాచారాన్ని యెహోవా రాయించాడు. (2 తిమో. 3:16, 17) ఆసక్తికరంగా, యెహోవా సంస్థలోని అదృశ్యభాగం గురించి బైబిల్లో కొన్ని వివరాలు ఉన్నాయి! యెహోవా పరలోకంలో చేసిన ఏర్పాటు గురించి యెషయా, యెహెజ్కేలు, దానియేలు రాసిన పుస్తకాల్లో, యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో చదివినప్పుడు పులకించిపోతాం. (యెష. 6:1-4; యెహె. 1:4-14, 22-24; దాని. 7:9-14; ప్రక. 4:1-11) వాటిని చదువుతుంటే, యెహోవా ఆకాశపు తెరను కాస్త తొలగించి, పరలోకాన్ని తిలకించే అవకాశాన్ని మనకు కల్పించినట్లుగా ఉంటుంది. ఇంతకీ ఆయనెందుకు ఈ సమాచారాన్ని తెలియజేశాడు?

6 మనం ఓ విశ్వవ్యాప్త సంస్థలో ఉన్నామనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదనే ఉద్దేశంతో యెహోవా అది తెలియజేశాడు. యెహోవా చిత్తానికి సంబంధించి, మన కంటికి కనిపించని ఎన్నో పనులు జరుగుతున్నాయి. ఉదాహరణకు యెహెజ్కేలు ఒక దర్శనంలో, యెహోవా సంస్థలోని అదృశ్య భాగం ఓ గొప్ప పరలోక రథంగా చిత్రీకరించబడినట్లు చూశాడు. ఆ రథం అతి వేగంగా దూసుకెళ్తూ రెప్పపాటులో దిశలు మారుతున్నట్లు ఆయన చూశాడు. (యెహె. 1:15-21) దాని చక్రాలు ఒక మారు తిరిగేసరికి అది ఎంతో దూరం దూసుకెళ్తోంది. యెహెజ్కేలు ఆ దర్శనంలో, దాని రథసారథిని కూడా లీలగా చూశాడు. ఆయనిలా అన్నాడు: “అగ్ని స్వరూపముగా నాకు కనబడెను, చుట్టును తేజోమయముగా కనబడెను. . . . ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము.” (యెహె. 1:25-28) యెహెజ్కేలు ఆ దర్శనాన్ని చూసి ఎంతటి సంభ్రమాశ్చర్యాలకు లోనై ఉంటాడో కదా! యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా తన సంస్థను నడిపిస్తూ పూర్తిగా నియంత్రిస్తున్నట్లు యెహెజ్కేలు చూశాడు. యెహోవా పరలోక సంస్థ చురుగ్గా పనిచేస్తోందని చెప్పడానికి ఆ రథం ఎంత అద్భుతమైన పోలిక!

7. దానియేలుకు కలిగిన దర్శనం ఎలా మన నమ్మకాన్ని బలపరుస్తుంది?

7 దానియేలు కూడా పరలోకానికి సంబంధించిన ఓ దర్శనం చూశాడు. అది కూడా యెహోవా సంస్థ మీద మన నమ్మకాన్ని బలపరుస్తుంది. అందులో యెహోవాను అగ్నిజ్వాలల సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ‘మహా వృద్ధునిగా’ చూశాడు. ఆ సింహాసనం చక్రాల మీద ఉంది. (దాని. 7:9) తన సంస్థ తన సంకల్పాన్ని నెరవేరుస్తూ దూసుకెళ్తోందనే విషయాన్ని యెహోవా దానియేలుకు చూపించాలనుకున్నాడు. “మనుష్యకుమారుని పోలిన” ఒకరిని కూడా దానియేలు చూశాడు. యెహోవా తన సంస్థలోని భూసంబంధ భాగం మీద ‘మనుష్య కుమారుడైన’ యేసుకు అధికారం ఇచ్చినట్లు దానియేలు చూశాడు. క్రీస్తు పరిపూర్ణ పరిపాలన కొద్దికాలం ఉండి గతించిపోయేది కాదు. “ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.” (దాని. 7:13, 14) దీని గురించి ఆలోచించినప్పుడు యెహోవాపై నమ్మకం ఉంచుతాం, ఆయన సాధిస్తున్న వాటిని గుర్తిస్తాం. ఎదురైన ప్రతీ పరీక్షలో నెగ్గిన తన కుమారుడైన యేసుకు యెహోవా “ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును” ఇచ్చాడు. తన కుమారుని మీద యెహోవాకు నమ్మకం ఉంది. కాబట్టి, మనం కూడా యేసు పరిపాలనపై పూర్తి నమ్మకాన్ని ఉంచవచ్చు.

8. యెహోవా ఇచ్చిన దర్శనాలు యెహెజ్కేలుపై, యెషయాపై ఎలాంటి ప్రభావం చూపించాయి? ఆ దర్శనాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి?

8 యెహోవా సంస్థలోని అదృశ్య భాగం గురించిన ఆ దర్శనం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది? యెహెజ్కేలులాగే మనం కూడా యెహోవా నెరవేరుస్తున్న వాటినిబట్టి సంభ్రమాశ్చర్యాలకు లోనౌతాం, మనల్ని మనం తగ్గించుకుంటాం. (యెహె. 1:28) యెహోవా సంస్థ గురించి ధ్యానిస్తే యెషయాలాగే మనం కూడా యెహోవా అప్పగించిన పని చేయడానికి నడుంబిగిస్తాం. యెహోవా చేస్తున్న దాని గురించి ప్రకటించే అవకాశం వచ్చినప్పుడు, మరో ఆలోచన లేకుండా యెషయా దాన్ని అందిపుచ్చుకున్నాడు. (యెషయా 6:5, 8 చదవండి.) యెహోవా సహాయంతో తాను ఎలాంటి సవాలునైనా సమర్థంగా ఎదుర్కోగలనని యెషయా బలంగా నమ్మాడు. యెహోవా సంస్థలోని అదృశ్య భాగానికి సంబంధించిన ఈ వివరాలు మనలో కూడా గగుర్పాటును కలిగించి, యెహోవా చెప్పిన పనిచేయడానికి మనలను చైతన్యవంతుల్ని చేస్తాయి. పూర్తిగా యెహోవా ఉద్దేశాల్ని నెరవేర్చడం మీదే దృష్టి నిలిపి, దశదిశల్లో దూసుకెళ్తున్న ఆ సంస్థ గురించి ఆలోచించడం మనలో ఎంత స్ఫూర్తిని నింపుతుంది!

యెహోవా సంస్థలోని భూసంబంధ భాగం

9, 10. యెహోవా సంస్థకు ఒక దృశ్య భాగం ఎందుకు అవసరం?

9 తన సంస్థలోని అదృశ్య భాగానికి అనుగుణంగా పనిచేసే ఓ సంస్థను యెహోవా తన కుమారుని ద్వారా ఈ భూమ్మీద ఏర్పాటు చేశాడు. మత్తయి 24:14 పేర్కొంటున్న పనిని నెరవేర్చడానికి ఒక దృశ్య సంస్థ ఎందుకు అవసరమైంది? మూడు కారణాలను పరిశీలిద్దాం.

10 మొదటిది, తన శిష్యులు “భూదిగంతముల వరకు” ఈ ప్రకటనా పనిని చేయాలని యేసు చెప్పాడు. (అపొ. 1:8) రెండవది, ఈ పనిలో పాల్గొనే వాళ్లకు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడానికి, వాళ్లను ప్రోత్సహించడానికి ఏర్పాట్లు అవసరమౌతాయి. (యోహా. 21:15-18ఎ) మూడవది, రాజ్య సువార్త ప్రకటించేవాళ్లు యెహోవాను ఆరాధించేందుకు ‘సమకూడడానికి,’ ప్రకటనాపని ఎలా చేయాలో నేర్చుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. (హెబ్రీ. 10:24, 25) అయితే ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగిపోవు. క్రీస్తు అనుచరులు ఆ పనిలో విజయం సాధించాలంటే, దాన్ని క్రమపద్ధతిలో వ్యవస్థీకరించాల్సి ఉంటుంది.

11. యెహోవా సంస్థ చేస్తున్న ఏర్పాట్లకు మద్దతు ఇస్తున్నామని మనమెలా చూపించవచ్చు?

11 యెహోవా సంస్థ చేస్తున్న ఏర్పాట్లకు మద్దతు ఇస్తున్నామని మనమెలా చూపించవచ్చు? ప్రాముఖ్యంగా, ప్రకటనాపనిలో నాయకత్వం వహించడానికి యెహోవా, యేసు నమ్మకంతో ఎంచుకున్న వ్యక్తుల మీద మనం ఎల్లప్పుడూ భరోసా ఉంచడం ద్వారా అలా చేయవచ్చు. మన మధ్య నాయకత్వం వహిస్తున్న వాళ్ల ధ్యాసను పక్కకు మళ్లించేవి ఈ లోకంలో ఎన్నో ఉన్నా, యెహోవా సంస్థలోని దృశ్య భాగం తన ధ్యాసను పూర్తిగా దేని మీద ఉంచుతోంది?

“శ్రేష్ఠమైన కార్యముల” మీదే దృష్టంతా

12, 13. క్రైస్తవ పెద్దలు తమ నియామకాన్ని ఎలా నెరవేరుస్తున్నారు? అది మీకెందుకు ప్రోత్సాహాన్నిస్తుంది?

12 ప్రకటనాపనిని వ్యవస్థీకరించడానికి, దానికి నాయకత్వం వహించడానికి ప్రపంచవ్యాప్తంగా అనుభవజ్ఞులైన క్రైస్తవ పెద్దలు నియమితులయ్యారు. ఈ సహోదరులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుని వాక్యాన్ని ‘తమ పాదాలకు దీపంగా, తమ త్రోవకు వెలుగుగా చేసుకుంటూ’ అందులోని నిర్దేశం కోసం వెదుకుతారు, యెహోవా నడిపింపు కోసం పట్టుదలగా ప్రార్థిస్తారు.—కీర్త. 119:105; మత్త. 7:7, 8.

13 మొదటి శతాబ్దంలో ప్రకటనా పనికి నాయకత్వం వహించిన వారిలాగే, నేడు ప్రకటనాపనిని పర్యవేక్షిస్తున్న పెద్దలు కూడా ‘వాక్యపరిచర్యకు’ మొదటి స్థానం ఇస్తున్నారు. (అపొ. 6:4) స్థానికంగానూ, ప్రపంచవ్యాప్తంగానూ ప్రకటనాపనిలో వస్తున్న మంచి ఫలితాలను చూసి వారు ఎంతగానో సంతోషిస్తున్నారు. (అపొ. 21:19, 20) వాళ్లు నియమాల, పద్ధతుల పెద్దచిట్టా తయారుచేయరు కానీ, ప్రకటనాపనిని ముందుకు తీసుకెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసేటప్పుడు లేఖనాలను, పరిశుద్ధాత్మ నిర్దేశాల్ని పాటిస్తారు. (అపొస్తలుల కార్యములు 15:28, 29 చదవండి.) అలా చేయడం ద్వారా బాధ్యతగల ఈ సహోదరులు ఆయా సంఘాల్లో ఉన్న వాళ్లందరికీ ఆదర్శంగా ఉంటారు.—ఎఫె. 4:11, 12.

14, 15. (ఎ) భూవ్యాప్తంగా సువార్త ప్రకటించడానికి వీలుగా ఏ ఏర్పాట్లు జరిగాయి? (బి) రాజ్య ప్రకటనాపనికి మద్దతు ఇచ్చే గొప్ప అవకాశం గురించి మీకేమనిపిస్తోంది?

14 మన ప్రచురణల్లో, కూటాల్లో, సమావేశాల్లో అందించే ఆధ్యాత్మిక ఆహారాన్ని సిద్ధపర్చడం కోసం ఎంత నిర్విరామ కృషి జరుగుతుందో చాలామందికి కనిపించదు. ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని దాదాపు 600 భాషల్లోకి అనువదించడానికి వేలమంది స్వచ్ఛంద సేవకులు అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. దానివల్ల వీలైనంత ఎక్కువమంది తమ సొంత భాషల్లో “దేవుని గొప్పకార్యముల” గురించి నేర్చుకోగలుగుతున్నారు. (అపొ. 2:7-11) వేగవంతమైన ముద్రణా యంత్రాల, బైండింగ్‌ పరికరాల సహాయంతో ఎంతో సాహిత్యాన్ని ఉత్పత్తి చేయడానికి యౌవన సహోదర సహోదరీలు కష్టపడి పనిచేస్తున్నారు. ఆ తర్వాత మన ప్రచురణలు ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల వరకు పంపిణీ అవుతున్నాయి.

15 స్థానిక సంఘంతో కలిసి సువార్త ప్రకటించే పని మీద దృష్టి నిలపడానికి వీలుగా ఎన్నో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదాహరణకు రాజ్యమందిరాల, సమావేశ హాళ్ల నిర్మాణ పనుల్లో సహకరించడానికి; ప్రకృతి విపత్తుల బాధితులకు, అత్యవసర వైద్య సహాయం కావాల్సిన వాళ్లకు సహాయం చేయడానికి; సమావేశాలను ఏర్పాటు చేయడానికి; మన సంస్థ నిర్వహిస్తున్న ఆయా పాఠశాలల్లో బోధించడానికి; అలాంటి ఎన్నో పనుల్లో పాల్గొనడానికి వేలాదిమంది సహోదర సహోదరీలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. చెప్పాలంటే యెహోవా సంస్థలో జరుగుతున్న పనుల్లో అవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇంతకీ ఆ పనులు దేని కోసం చేస్తున్నట్లు? సువార్త ప్రకటించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి, ప్రకటనాపనిలో పాల్గొంటున్న వాళ్ల ఆధ్యాత్మికతను పెంచడానికి, సత్యారాధనను విస్తృతపర్చడానికి అవన్నీ చేస్తున్నారు. యెహోవా సంస్థలోని దృశ్య భాగం “శ్రేష్ఠమైన కార్యముల” మీద దృష్టి నిలిపిందా? అందులో సందేహమే లేదు!

యెహోవా సంస్థను ఆదర్శంగా తీసుకోండి

16. మీకు లేదా మీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటుందనిపించే చక్కని బైబిలు అధ్యయన ప్రాజెక్టు ఏమిటి?

16 యెహోవా సంస్థ చేస్తున్న పనుల గురించి ఆలోచించడానికి మనం అప్పుడప్పుడు సమయం తీసుకుంటున్నామా? కొంతమంది ఈ విషయాల గురించి పరిశోధన చేయడానికి, వాటి గురించి ధ్యానించడానికి తమ కుటుంబ ఆరాధనలో లేదా వ్యక్తిగత అధ్యయనంలో కాస్త సమయాన్ని కేటాయిస్తున్నారు. యెషయాకు, యెహెజ్కేలుకు, దానియేలుకు, యోహానుకు కలిగిన దర్శనాల గురించి అధ్యయనం చేస్తే ఉత్తేజకరంగా ఉంటుంది. యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) పుస్తకం, మీ భాషలో అందుబాటులో ఉన్న ఇతర ప్రచురణలు, డీవీడీలు సంస్థ గురించి ఎంతో అవగాహనను కలిగిస్తాయి.

17, 18. (ఎ) ఈ ఆర్టికల్‌లో చర్చించిన విషయాలు మీకెలాంటి ప్రయోజనం చేకూర్చాయి? (బి) మనం ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలి?

17 యెహోవా తన సంస్థ ద్వారా ఏమి సాధిస్తున్నాడో ధ్యానిస్తే మనం ప్రయోజనం పొందుతాం. ఈ అద్భుతమైన సంస్థతో కలిసి మనం కూడా “శ్రేష్ఠమైన కార్యముల” మీద దృష్టి నిలపాలనే కృత నిశ్చయాన్ని కలిగి ఉందాం. అలా చేస్తే, పౌలు చూపించినలాంటి దృఢ నిశ్చయాన్ని చూపించడానికి బలాన్ని పొందుతాం. “ఈ పరిచర్య పొందినందున కరుణింపబడినవారమై అధైర్యపడము” లేదా పట్టువిడవము అని ఆయన రాశాడు. (2 కొరిం. 4:1) అంతేకాక తన తోటి సహోదరులను పౌలు ఇలా ప్రోత్సహించాడు: “మనము మేలుచేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము.”—గల. 6:9.

18 మన అనుదిన జీవితంలో ‘శ్రేష్ఠమైన కార్యములను వివేచించడానికి’ మనం వ్యక్తిగతంగా గానీ, కుటుంబంగా గానీ చేసుకోవాల్సిన మార్పులు ఏమైనా ఉన్నాయా? అత్యంత ప్రాముఖ్యమైన ప్రకటనాపని మీద మరింత ఎక్కువగా దృష్టి నిలపడానికి వీలుగా మన జీవితాన్ని నిరాడంబరం చేసుకోగలమా? ఆ పనికి అవాంతరాలను తగ్గించుకోగలమా? యెహోవా సంస్థతోపాటు ముందుకు సాగడానికి ఉపకరించే ఐదు విషయాల గురించి మనం తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి