కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwia ఆర్టికల్‌ 6
  • “నేను ప్రభువును చూశాను!”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నేను ప్రభువును చూశాను!”
  • వాళ్లలా విశ్వాసం చూపించండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “తమకున్న వాటితో యేసుకు, అపొస్తలులకు సేవలు చేస్తూ ఉన్నారు”
  • “యేసు హింసాకొయ్య దగ్గర”
  • “నేను ఆయన్ని తీసుకెళ్తాను”
  • “నేను ప్రభువును చూశాను!”
  • “ఆ స్త్రీలు చెప్పినదాన్ని వాళ్లు నమ్మలేదు”
  • “నేను ప్రభువును చూశాను!”
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • ఆమె తీవ్రమైన వేదనను తట్టుకుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • మగ్దలేనే మరియ ఎవరు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ‘ఇదిగో! యెహోవా దాసురాలిని!’
    వాళ్లలా విశ్వాసం చూపించండి
మరిన్ని
వాళ్లలా విశ్వాసం చూపించండి
ijwia ఆర్టికల్‌ 6
మగ్దలేనే మరియ.

వాళ్లలా విశ్వాసం చూపించండి | మగ్దలేనే మరియ

“నేను ప్రభువును చూశాను!”

మగ్దలేనే మరియ కన్నీళ్లు తుడుచుకుంటూ పైకి చూసింది. అక్కడ కొయ్యమీద తన ప్రియమైన ప్రభువు వేలాడుతున్నాడు. అది వసంతకాలం మిట్టమధ్యాహ్నం, ‘అయినా, దేశమంతటా చీకటి కమ్ముకుంది!’ (లూకా 23:44, 45) మూడు గంటలపాటు కమ్ముకున్న ఈ చీకటికి కారణం సూర్యగ్రహణం కాకపోవచ్చు, ఎందుకంటే అది కొన్ని నిమిషాలే ఉంటుంది. బహుశా మరియకు, యేసు దగ్గర నిలబడిన మిగతావాళ్లకు రాత్రిపూట మాత్రమే వినబడే కొన్ని జంతువుల అరుపులు కూడా వినిపించివుంటాయి. అక్కడున్న కొందరు, “చాలా భయపడిపోయి ఇలా అన్నారు: ‘ఖచ్చితంగా ఈయన దేవుని కుమారుడే.’” (మత్తయి 27:54) తన కుమారుణ్ణి అంత క్రూరంగా హింసించారని యెహోవాయే తన బాధను, కోపాన్ని అలా చూపించాడా అని యేసు అనుచరులు, ఇతరులు అనుకొనివుంటారు.

అదంతా చూడడం మగ్దలేనే మరియ వల్ల కావడంలేదు, అలాగని యేసును విడిచి వెళ్లడం కూడా ఆమె వల్ల కాదు. (యోహాను 19:25, 26) యేసు చెప్పలేనంత బాధను భరిస్తున్నాడు. యేసు తల్లికి కూడా ఓదార్పు, మద్దతు కావాలి.

మగ్దలేనే మరియ యేసు తన కోసం చేసినదంతా తలుచుకుంటూ ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది. ఒకప్పుడు ఆమె ఎంతో దయనీయ స్థితిలో ఉండేది, కానీ యేసు ఆమె పరిస్థితిని పూర్తిగా మార్చేశాడు. ఇప్పుడు ఆమె జీవితం హుందాగా, అర్థవంతంగా ఉంది. అలాగే ఆమె, గొప్ప విశ్వాసం చూపించిన ఒక స్త్రీ కూడా. ఇదంతా ఎలా జరిగింది? ఆమె విశ్వాసం నుండి నేడు మనం ఏం నేర్చుకోవచ్చు?

“తమకున్న వాటితో యేసుకు, అపొస్తలులకు సేవలు చేస్తూ ఉన్నారు”

బైబిల్లో మగ్దలేనే మరియ కథ ఒక బహుమతితో మొదలౌతుంది. యేసు ఆమెను పీడ కల లాంటి ఘోరమైన పరిస్థితి నుండి విడిపించి, స్వేచ్ఛగా బ్రతికేలా చేశాడు. ఆ రోజుల్లో చెడ్డదూతల ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. చెడ్డదూతలు చాలామంది ప్రజలపై దాడి చేసేవాళ్లు. కొంతమంది లోపలికి కూడా దూరి, వాళ్లను గుప్పిట్లో పెట్టుకునేవాళ్లు. నిస్సహాయ స్థితిలో ఉన్న మగ్దలేనే మరియపై చెడ్డదూతల ప్రభావం ఎంత ఉండేదో మనకు తెలీదు; కానీ చాలా నీచమైన, దిగజారిన ఏడుగురు చెడ్డదూతలు ఆమెకు పట్టారని మాత్రం మనకు తెలుసు. అయితే సంతోషకరంగా, యేసుక్రీస్తు ఆ చెడ్డదూతలందర్నీ ఆమె నుండి వెళ్లగొట్టాడు!—లూకా 8:2.

చివరికి, మగ్దలేనే మరియకు చెప్పలేనంత ఉపశమనం దొరికింది, ఒక కొత్త జీవితం ఆమెకు స్వాగతం పలికింది. మరి ఆమె తన కృతజ్ఞతను ఎలా చూపించాలి? మరియ యేసుకు నమ్మకమైన శిష్యురాలైంది. అవసరమైన సహాయం చేయాలనుకుంది. యేసుకు, అపొస్తలులకు ఆహారం, వస్త్రాలు, రాత్రి పడుకోవడానికి ఒక చోటు అవసరం. వాళ్లు ధనవంతులేమీ కాదు, పైగా జీతం వచ్చే పనేదీ చేయడం లేదు. కాబట్టి ప్రకటించడం, బోధించడం మీద దృష్టిపెట్టాలంటే వాళ్లకు సహాయం అవసరం.

ఆ అవసరాల విషయంలో మగ్దలేనే మరియ, ఇతర స్త్రీలు సహాయం చేశారు. వాళ్లు, “తమకున్న వాటితో యేసుకు, అపొస్తలులకు సేవలు చేస్తూ ఉన్నారు.” (లూకా 8:1, 3) వాళ్లలో కొంతమంది స్త్రీలు డబ్బున్నవాళ్లు కావచ్చు. వాళ్లు ఆహారం సిద్ధం చేశారా, బట్టలు ఉతికారా, లేదా ఒక గ్రామం తర్వాత ఇంకో గ్రామంలో వసతి ఏర్పాటు చేశారా అనేది బైబిలు చెప్పట్లేదు. కానీ దాదాపు 20 మంది ఉన్న ఆ ప్రయాణించే గుంపుకు వాళ్లు ఇష్టపూర్వకంగా సహాయం చేస్తూ ఉన్నారు. యేసు, ఆయన అపొస్తలులు ప్రకటించడం మీదే దృష్టి పెట్టడానికి ఈ స్త్రీల మద్దతు ఖచ్చితంగా సహాయం చేసివుంటుంది. నిజమే, యేసు చేసిన మేలుకు తాను ఎప్పటికీ రుణం తీర్చుకోలేనని మరియకు తెలుసు. కానీ చేయగలిగిన సహాయం చేసినందుకు ఆమె ఎంత సంతోషించి ఉంటుందో కదా!

ఇతరుల కోసం తక్కువ స్థాయి పనులు చేసేవాళ్లను ఈ రోజుల్లో చాలామంది చులకనగా చూస్తారు. కానీ దేవుడు అలా చూడడు. యేసుకు, ఆయన అపొస్తలులకు వీలైనంత సహాయం చేయడానికి మగ్దలేనే మరియ తనను తాను అంకితం చేసుకోవడం చూసినప్పుడు యెహోవా ఎంత సంతోషించి ఉంటాడో ఊహించుకోండి! నేడు చాలామంది నమ్మకమైన క్రైస్తవులు ఇతరుల కోసం సంతోషంగా సేవలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఒక అవసరమైన పని లేదా దయగల మాట కూడా ఎంతో మంచి చేయవచ్చు. అలాంటి వాటిని యెహోవా విలువైనవిగా చూస్తాడు.—సామెతలు 19:17; హెబ్రీయులు 13:16.

“యేసు హింసాకొయ్య దగ్గర”

క్రీ.శ. 33లో పస్కా పండుగ ఆచరించడానికి యేసుతో పాటు యెరూషలేముకు వెళ్లిన చాలామంది స్త్రీలలో మగ్దలేనే మరియ కూడా ఉంది. (మత్తయి 27:55, 56) యేసును రాత్రిపూట బంధించి విచారణ చేశారని తెలిసినప్పుడు ఆమె ఖచ్చితంగా బాధపడివుంటుంది. విషయం అక్కడితో ఆగిపోలేదు. అధిపతైన పొంతు పిలాతు యూదా మతనాయకుల, వాళ్లు రెచ్చగొడుతున్న ప్రజల ఒత్తిడికి లొంగిపోయి యేసును కొయ్యమీద వేలాడదీసి చంపమని క్రూరమైన శిక్ష విధించాడు. తన ప్రభువు రక్తం కారుతూ నీరసించిపోవడం, తనను వేలాడదీసే పొడవైన కొయ్యను మోసుకుంటూ విధుల్లో కష్టంగా నడవడం మరియ చూసే ఉంటుంది.—యోహాను 19:6, 12, 15-17.

శిక్ష వేసిన చోట, దాదాపు మిట్టమధ్యాహ్నం సమయంలో చీకటి పడిన తర్వాత, మగ్దలేనే మరియ అలాగే ఇతర స్త్రీలు “యేసు హింసాకొయ్య దగ్గర” నిలబడివున్నారు. (యోహాను 19:25) చివరి వరకు అక్కడే ఉన్న మరియ, యేసు తన తల్లి బాధ్యతను తన ప్రియ అపొస్తలుడైన యోహానుకు అప్పగించడం చూసింది. యేసు ఎంతో వేదనతో తన తండ్రికి మొరపెట్టడం కూడా ఆమె చూసింది. చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు, యేసు “అంతా పూర్తయింది!” అని చెప్పిన చివరి మాటల్ని కూడా ఆమె విన్నది. ఆమె చాలా బాధలో ఉంది. అయినా సరే యేసు చనిపోయాక కూడా అక్కడే ఉంది. తర్వాత అరిమతయియ నగరంవాడైన యోసేపు అనే ధనవంతుడు యేసు శరీరాన్ని కొత్త సమాధిలో ఉంచినప్పుడు, ఆమె అక్కడే కూర్చుండిపోయింది.—యోహాను 19:30; మత్తయి 27:45, 46, 57-61.

తోటి విశ్వాసులు కష్టమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మనం ఏం చేయవచ్చో మరియను చూసి నేర్చుకోవచ్చు. మనం చెడు సంఘటనలు జరగకుండా ఆపలేకపోవచ్చు, బాధితుల వేదనను పూర్తిగా తీసేయలేకపోవచ్చు. కానీ మనం కనికరం, ధైర్యం చూపించవచ్చు. కష్ట సమయాల్లో, అండగా ఉండే స్నేహితుడు ఊరికే కళ్లముందు కనిపించినా చాలా ధైర్యంగా ఉంటుంది. అవసరంలో ఉన్న స్నేహితుని పక్కనే ఉండడానికి కొండంత విశ్వాసం కావాలి, అది చెప్పలేనంత ఊరటను ఇస్తుంది.—సామెతలు 17:17.

యేసు హింసాకొయ్య మీద వేలాడుతున్నప్పుడు మగ్దలేనే మరియ యేసు తల్లియైన మరియను ఓదారుస్తోంది. దగ్గర్లో కొంతమంది స్త్రీలు, పురుషులు, ఒక రోమా సైనికుడు నిలబడివున్నారు.

మగ్దలేనే మరియ తన పక్కన ఉండడం వల్ల యేసు తల్లి ఖచ్చితంగా ఊరట పొంది ఉంటుంది

“నేను ఆయన్ని తీసుకెళ్తాను”

యేసు శరీరాన్ని సమాధిలో పెట్టారు. కొంతమంది స్త్రీలు ఆయన శరీరానికి పూయడం కోసం అదనంగా సుగంధ ద్రవ్యాల్ని కొన్నారు, వాళ్లలో మగ్దలేనే మరియ కూడా ఉంది. (మార్కు 16:1, 2; లూకా 23:54-56) విశ్రాంతి రోజు గడిచాక, ఆమె పొద్దుపొద్దున్నే నిద్రలేచింది. ఆమె, ఇతర స్త్రీలు ఇంకా చీకటిగా ఉన్న వీధుల గుండా నడుచుకుంటూ యేసు సమాధి దగ్గరికి వెళ్లడం ఊహించుకోండి. దారిలో వాళ్లు, సమాధికి అడ్డుగా పెట్టిన పెద్ద రాయిని ఎలా పక్కకు దొర్లించాలా అని ఆలోచించివుంటారు. (మత్తయి 28:1; మార్కు 16:1-3) కానీ వాళ్లు వెనక్కి తిరగలేదు. వాళ్లు చేయగలిగింది చేద్దామని, మిగతాది యెహోవా చూసుకుంటాడని విశ్వాసం ఉంచారు.

మరియ వాళ్లకన్నా ఒకడుగు ముందుగా సమాధి దగ్గరికి చేరుకొని ఉంటుంది. సమాధిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అప్పటికే ఎవరో రాయిని పక్కకు దొర్లించేశారు, సమాధి ఖాళీగా ఉంది! మరియ ఊరికే చూస్తూ ఉండిపోలేదు, వెనక్కి పరుగెత్తుకెళ్లి ఆ విషయం పేతురుకు, యోహానుకు చెప్పింది. ఆమె రొప్పుతూ, “వాళ్లు ప్రభువును సమాధిలో నుండి తీసుకెళ్లిపోయారు, ఆయన్ని ఎక్కడ ఉంచారో మాకు తెలీదు” అని చెప్పడం ఊహించుకోండి! పేతురు, యోహాను ఆగమేఘాల మీద సమాధి దగ్గరికి వచ్చారు. నిజంగానే సమాధి ఖాళీగా ఉండడంతో వాళ్లు తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోయారు.a—యోహాను 20:1-10.

మరియ సమాధి దగ్గరికి తిరిగొచ్చినప్పుడు ఆమె ఒక్కతే దిగాలుగా అక్కడ కాసేపు ఉండిపోయింది. ఖాళీ సమాధిని, తెల్లవారుజామున ఆ నిశ్శబ్దాన్ని తట్టుకోలేక ఆమె ఏడ్చేసింది. ప్రభువు సమాధిలో లేడనే విషయం జీర్ణించుకోలేక, ఒక అడుగు ముందుకు వేసి సమాధిలోకి తొంగి చూసి ఆశ్చర్యపోయింది. అక్కడ తెల్లని వస్త్రాల్లో ఇద్దరు దేవదూతలు కూర్చొని ఉన్నారు! వాళ్లు, “ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగారు. ఏంచెప్పాలో అర్థంకాక, “ఎవరో నా ప్రభువును తీసుకెళ్లిపోయారు, ఆయన్ని ఎక్కడ ఉంచారో నాకు తెలీదు” అంటూ అపొస్తలులతో చెప్పిన మాటలే వాళ్లతో చెప్పింది.—యోహాను 20:11-13.

ఆమె తిరిగి చూసేసరికి వెనుక ఒకాయన నిలబడివున్నాడు. ఆయనెవరో ఆమె గుర్తుపట్టలేదు, బహుశా ఆ చోటును చూసుకునే తోటమాలి అనుకుంది. ఆయన ఆమెను దయగా ఇలా అడిగాడు: “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరి కోసం వెదుకుతున్నావు?” దానికి మరియ, “అయ్యా, నువ్వు ఆయన్ని తీసుకెళ్లివుంటే ఆయన్ని ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయన్ని తీసుకెళ్తాను” అని చెప్పింది. (యోహాను 20:14, 15) ఆమె చెప్పిన మాటల గురించి ఒకసారి ఆలోచించండి. ఎంతో బలంగా, దృఢంగా ఉండే యేసుక్రీస్తు శరీరాన్ని ఆమె ఒక్కతే లేపి మోసుకెళ్లగలదా? కానీ మరియ అవేవీ ఆలోచించలేదు. తాను చేయగలిగింది చేయాలి అని మాత్రమే అనుకుంది.

యేసు శరీరాన్ని ఉంచిన సమాధి ద్వారం దగ్గర మగ్దలేనే మరియ, ఆమె వెనుక ఒకాయన నిలబడివున్నాడు.

“నేను ఆయన్ని తీసుకెళ్తాను”

మనకు భరించలేం అనిపించే బాధలు, కష్టాలు వచ్చినప్పుడు మగ్దలేనే మరియను ఆదర్శంగా తీసుకోగలమా? అలాంటి సమయంలో మన బలహీనతలు, పరిమితుల గురించే ఆలోచిస్తే భయంతో చచ్చుబడిపోతాం, ఏమీ చేయలేం. కానీ మనం చేయగలిగినదంతా చేసి, మిగతాది యెహోవా చేతుల్లో విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటే మనం ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ చేయగలం. (2 కొరింథీయులు 12:10; ఫిలిప్పీయులు 4:13) అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవాను సంతోషపెడతాం. మరియ అదే చేసింది, ఆయన ఆమెను ఊహించని రీతిలో దీవించాడు.

“నేను ప్రభువును చూశాను!”

మరియ ముందు నిలబడిన వ్యక్తి తోటమాలి కాదు. ఒకప్పుడు ఆయన వడ్రంగి, తర్వాత బోధకుడు, మరియకు ప్రియమైన ప్రభువు. కానీ ఆమె ఆయన్ని గుర్తుపట్టకుండా పక్కకు తిరిగింది. జరిగిన విషయం ఆమెకు అంతుపట్టి ఉండదు: యేసు దేవదూత లాంటి శరీరంతో శక్తివంతమైన ప్రాణిగా తిరిగి బ్రతికించబడ్డాడు. ఇప్పుడు మనిషి రూపంలో ఆమెకు కనిపించాడు, కానీ బలి అర్పించిన అదే శరీరంతో కాదు. యేసు పునరుత్థానమైన తర్వాతి రోజుల్లో, బాగా తెలిసినవాళ్లు కూడా తరచూ ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు.—లూకా 24:13-16; యోహాను 21:4.

మరియ తనను గుర్తుపట్టడానికి యేసు ఏం చేశాడు? ఆయన ఆమెను ఎలాగైతే పిలిచేవాడో అలా “మరియా!” అని పిలిచాడు. ఆ పిలుపు వినగానే మరియ వెనక్కి తిరిగి, “రబ్బోనీ!” అంది. బాగా తెలిసిన ఆ హీబ్రూ పదంతో ఆమె అంతకుముందు ఎన్నోసార్లు ఆయన్ని పిలిచింది. ఆ వ్యక్తి, తన ప్రియమైన బోధకుడు అని గుర్తుపట్టినప్పుడు ఆమె ఆనందానికి అవధుల్లేవు! ఆయన్ని పట్టుకుని అలాగే ఉండిపోయింది, విడిచిపెట్టాలని అనుకోలేదు.—యోహాను 20:16.

ఆమె ఏం ఆలోచిస్తుందో యేసుకు తెలుసు. యేసు ఆమెతో, “నన్ను అలాగే పట్టుకుని ఉండవద్దు” అన్నాడు. ఆయన బహుశా చిరునవ్వుతో మెల్లగా ఆమె చేతుల్ని తీసేస్తూ, “నేనింకా తండ్రి దగ్గరికి వెళ్లలేదు” అని దయగా చెప్పడం మనం ఊహించుకోవచ్చు. యేసు అప్పుడే పరలోకానికి వెళ్లిపోడు. భూమ్మీద ఆయన చేయాల్సిన పని ఇంకా ఉంది, దానికి మరియ సహాయం కూడా కావాలి. యేసు ఏం చెప్తాడా అని మరియ చెవులు పెద్దవి చేసుకుని వింది. ఆయన ఆమెతో, “నా సహోదరుల దగ్గరికి వెళ్లి, ‘నా తండ్రీ మీ తండ్రీ, నా దేవుడూ మీ దేవుడూ అయిన ఆయన దగ్గరికి నేను వెళ్తున్నాను’ అని చెప్పు” అన్నాడు.—యోహాను 20:17.

ఆమె ప్రభువు ఎంత గొప్ప పని అప్పగించాడో కదా! పునరుత్థానమైన యేసును చూసే గొప్ప అవకాశం దక్కిన తొలి శిష్యుల్లో మరియ కూడా ఉంది. ఇప్పుడు ఆ మంచివార్తను ఇతరులకు చెప్పే గౌరవం కూడా ఆమెకు దక్కింది. మరియ ఎంత సంతోషంగా-ఆత్రంగా శిష్యుల్ని వెతకడానికి వెళ్లి ఉంటుందో కదా! ఆమె ఊపిరి బిగబట్టుకొని, “నేను ప్రభువును చూశాను!” అని వాళ్లతో అంది. ఆ మాటలు చాలాకాలం ఆమె మనసులో, వాళ్ల మనసుల్లో మారుమ్రోగి ఉంటాయి. యేసు చెప్పిన ప్రతీ మాటను ఆమె గుక్కతిప్పుకోకుండా వాళ్లకు చెప్పింది. (యోహాను 20:18) అప్పటికే యేసు ఖాళీ సమాధిని చూసిన ఇతర స్త్రీలు శిష్యులకు చెప్పిన మాటలకు మరియ మాటలు కూడా తోడయ్యాయి.—లూకా 24:1-3, 10.

అపొస్తలులు, ఇతర శిష్యులు ఉన్న చోటుకు మగ్దలేనే మరియ పరుగెత్తుకొని వెళ్లి, ‘నేను ప్రభువును చూశాను!’ అని సంతోషంగా చెప్తోంది.

“నేను ప్రభువును చూశాను!”

“ఆ స్త్రీలు చెప్పినదాన్ని వాళ్లు నమ్మలేదు”

మరి ఆ మాటలు విన్న శిష్యులు ఎలా స్పందించారు? వాళ్లకు నమ్మబుద్ధి కాలేదు. బైబిలు ఇలా చెప్తుంది: “వాళ్లకు అవి అర్థంపర్థంలేని మాటల్లా అనిపించాయి, కాబట్టి ఆ స్త్రీలు చెప్పినదాన్ని వాళ్లు నమ్మలేదు.” (లూకా 24:11) వాళ్లు మంచివాళ్లే, కానీ స్త్రీలు చెప్పేది వెంటనే నమ్మని సమాజంలో వాళ్లు పెరిగారు. రబ్బీల సంప్రదాయం ప్రకారం, స్త్రీలు కోర్టులో సాక్ష్యం చెప్పలేరు. అపొస్తలులు గుర్తించలేదేమో గానీ, వాళ్ల సంస్కృతి ప్రభావం వాళ్ల మీద చాలానే ఉంది. యేసు, ఆయన తండ్రి మాత్రం స్త్రీలను అలా చూడడం లేదు. నమ్మకమైన ఆ స్త్రీకి వాళ్లు ఎంత గొప్ప అవకాశం ఇచ్చారో కదా!

వాళ్లు తన మాటలు నమ్మలేదని మరియ ఏమీ నొచ్చుకోలేదు. తన ప్రభువు నమ్మాడు, అది చాలు ఆమెకు. యేసును అనుసరించే వాళ్లందరికీ ఆమెలాగే ఒక సందేశం చెప్పే బాధ్యత ఉంది. ఆ సందేశాన్ని బైబిలు, “దేవుని రాజ్యం గురించిన మంచివార్త” అని పిలుస్తుంది. (లూకా 8:1) వాళ్లు చెప్పే సందేశాన్ని అందరూ నమ్ముతారని గానీ వాళ్ల పనిని విలువైనదిగా చూస్తారని గానీ యేసు తన అనుచరులకు మాట ఇవ్వలేదు. బదులుగా, ప్రజలు వాళ్లను హింసిస్తారని చెప్పాడు. (యోహాను 15:20, 21) కాబట్టి క్రైస్తవులు మగ్దలేనే మరియను గుర్తుచేసుకోవడం మంచిది. తన సొంత ఆధ్యాత్మిక సహోదరులే తన మాటలు నమ్మకపోయినా సరే, పునరుత్థానమైన యేసు గురించిన మంచివార్తను ఆమె సంతోషంగా చెప్పింది!

ఆ తర్వాత యేసు తన అపొస్తలులకు, ఇంకా ఎక్కువమంది శిష్యులకు కనిపించాడు. ఒకసారైతే 500 కన్నా ఎక్కువమందికి ఒకే సమయంలో కనిపించాడు! (1 కొరింథీయులు 15:3-8) అలా యేసు కనిపించిన ప్రతీసారి మరియ విశ్వాసం బలపడివుంటుంది. కొన్నిసార్లు ఆమె నేరుగా చూసి ఉంటుంది, ఇంకొన్నిసార్లు చూసినవాళ్లు ఆమెకు చెప్పి ఉంటారు. పెంతెకొస్తు రోజున యెరూషలేములో సమకూడిన యేసు అనుచరుల మీద పవిత్రశక్తి కుమ్మరించబడినప్పుడు, అక్కడున్న స్త్రీలలో మగ్దలేనే మరియ కూడా ఉండివుంటుంది.—అపొస్తలుల కార్యాలు 1:14, 15; 2:1-4.

ఏదేమైనా, ఒక విషయంలో మనం నమ్మకంతో ఉండవచ్చు: మగ్దలేనే మరియ చివరివరకు తన విశ్వాసం కాపాడుకుంది. మనలో ప్రతీ ఒక్కరం అలాగే చేయాలని తీర్మానించుకుందాం! యేసు మన కోసం చేసినవాటన్నిటి పట్ల కృతజ్ఞత చూపిస్తూ, దేవుడు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఇతరులకు వినయంగా సేవచేస్తే మనం మగ్దలేనే మరియ లాంటి విశ్వాసం చూపిస్తాం.

a దేవదూత మిగతా స్త్రీలకు కనిపించి క్రీస్తు తిరిగి బ్రతికాడని చెప్పకముందే మరియ అక్కడినుండి వెళ్లిపోయిందని తెలుస్తుంది. లేకపోతే యేసు శరీరం ఎందుకు కనిపించడం లేదో దేవదూత వివరించిన సంగతి ఆమె పేతురుకు, యోహానుకు ఖచ్చితంగా చెప్పి ఉండేది.—మత్తయి 28:2-4; మార్కు 16:1-8.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి