చనిపోయి మళ్లీ బ్రతికినప్పుడు యేసుకున్న శరీరం, మనుషుల శరీరం లాంటిదా, దేవదూతల శరీరం లాంటిదా?
బైబిలు ఇచ్చే జవాబు
యేసు ‘శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడ్డాడు [“పరలోక సంబంధమైన శరీరంతో బ్రతికించబడ్డాడు,“ NW]‘ అని బైబిలు చెబుతుంది.—1 పేతురు 3:18; అపొస్తలుల కార్యములు 13:34; 1 కొరింథీయులు 15:45; 2 కొరింథీయులు 5:16.
మనుషుల కోసం అంటే “లోకమునకు జీవము” కోసం తన ‘శరీరాన్నే’ విమోచన క్రయధనంగా ఇస్తున్నట్లు యేసు చెప్పాడు. ఆ మాటల్లో, తాను రక్తమాంసాలున్న శరీరంతో పునరుత్థానం అవ్వనని ఆయనే స్పష్టం చేశాడు. (యోహాను 6:51; మత్తయి 20:28) ఒకవేళ, పునరుత్థానం తర్వాత ఆయన తన మానవ శరీరంతోనే మళ్లీ వచ్చుంటే, తానిచ్చిన విమోచన క్రయధనాన్ని తానే రద్దు చేసినట్లు అయ్యుండేది. అయినా ఆ అవకాశం లేదు, ఎందుకంటే ఆయన తన రక్తమాంసాలను అన్ని కాలాలకు సరిపోయేలా “ఒక్కసారే” బలిగా అర్పించేశాడని బైబిలు చెప్తుంది.—హెబ్రీయులు 9:11, 12.
యేసు దేవదూతల శరీరంతో బ్రతికి వస్తే, శిష్యులు ఆయన్ని ఎలా చూడగలిగారు?
దేవదూతలు మనుషుల రూపాన్ని ధరించగలరు. ఉదాహరణకు, గతంలో అలా చేసిన దేవదూతలు మనుషులతో కలిసి భోజనం కూడా చేశారు. (ఆదికాండము 18:1-8; 19:1-3) అయినా వాళ్లు పరలోక సంబంధ ప్రాణులే, కాబట్టి వాళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు మానవ శరీరాన్ని వదిలేయగలరు.—న్యాయాధిపతులు 13:15-21.
గతంలో దేవదూతలు చేసినట్లే, యేసు కూడా పునరుత్థానం అయిన తర్వాత, తాత్కాలికంగా మానవ శరీరాన్ని ధరించాడు. అయినా, పరలోక సంబంధ ప్రాణి కాబట్టి, హఠాత్తుగా ప్రత్యక్షమై మళ్లీ హఠాత్తుగా మాయమైపోయే సామర్థ్యం ఆయనకు ఉంది. (లూకా 24:31; యోహాను 20:19, 26) మనుషులకు కనిపించడానికి ఆయన ఉపయోగించిన మానవ శరీరం అన్ని సందర్భాల్లో ఒకేలా లేదు. అందుకే, యేసు ప్రాణ స్నేహితులు కూడా ఆయన మాటలు లేదా చేతల వల్లనే ఆయన్ని గుర్తుపట్టగలిగారు.—లూకా 24:30, 31, 35; యోహాను 20: 14-16; 21:6, 7.
అపొస్తలుడైన తోమాకు కనిపించినప్పుడు, యేసు గాయాల గుర్తులున్న శరీరాన్ని ఉపయోగించాడు. యేసు మళ్లీ బ్రతికాడన్న విషయాన్ని తోమా సందేహించాడు, కాబట్టి తోమా నమ్మకాన్ని బలపర్చడానికి యేసు అలా చేశాడు.—యోహాను 20:24-29.