Halfpoint Images/Moment via Getty Images
అప్రమత్తంగా ఉండండి!
పిల్లలు సోషల్ మీడియా వాడడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి ఉన్నత స్థాయి హెల్త్ ఆఫీసర్ హెచ్చరించారు—బైబిలు ఏం చెప్తోంది?
సోషల్ మీడియా వాడకం చాలామంది పిల్లల్ని దెబ్బతీస్తోంది అని మే 23, 2023 తేదీన అమెరికాలోని ఒక ఉన్నత స్థాయి హెల్త్ ఆఫీసర్ ప్రజల్ని హెచ్చరించారు.
“సోషల్ మీడియా కొంతమంది పిల్లలకు ఉపయోగపడవచ్చు. కానీ పిల్లల ఎదుగుదలకు, మానసిక ఆరోగ్యానికి అది చాలా చెడు చేస్తోంది అనడానికి ఎన్నో రుజువులున్నాయి.”—సోషల్ మీడియా అండ్ యూత్ మెంటల్ హెల్త్: ద యు.యస్. సర్జన్ జనరల్స్ అడ్వైసరీ, 2023.
ఆ అడ్వైసరీ, మనం దీని గురించి ఎందుకు ఆలోచించాలో తెలిపే కొన్ని పరిశోధనల గురించి కూడా చెప్పింది.
12 నుండి 15 ఏళ్ల వయసున్న పిల్లల విషయానికొస్తే, “సోషల్ మీడియాను రోజుకు 3 కన్నా ఎక్కువ గంటలు వాడిన పిల్లల్లో డిప్రెషన్ (కృంగుదల), ఆంక్సైటీ (ఆందోళన) లాంటి మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం రెండింతలు ఎక్కువగా ఉంది.”
14 ఏళ్ల పిల్లల విషయానికొస్తే, “సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించిన పిల్లలు సరిగ్గా నిద్రపట్టక ఇబ్బందులు పడ్డారు, ఆన్లైన్లో వేధింపులకు గురయ్యారు, చూడడానికి అంతగా బాలేమని బాధపడ్డారు, తాము ఎందుకూ పనికిరామని అనుకున్నారు, డిప్రెషన్‌కు గురయ్యారు. ఈ సమస్యలు అబ్బాయిల కన్నా అమ్మాయిల్లో ఇంకా ఎక్కువగా కనిపించాయి.”
మరి ఇలాంటి ప్రమాదాల నుండి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా కాపాడుకోవచ్చు? బైబిలు కొన్ని మంచి సలహాలు ఇస్తోంది.
తల్లిదండ్రులు ఏం చేయవచ్చు?
మీరే నిర్ణయించండి, ఓ కంట కనిపెట్టండి. ప్రమాదాల గురించి ఆలోచించి, మీ పిల్లలు అసలు సోషల్ మీడియా వాడడం అవసరమో లేదో తల్లిదండ్రులుగా మీరు నిర్ణయించండి.
బైబిలు సలహా: “పిల్లవాడు నడవాల్సిన దారిని అతనికి నేర్పించు.”—సామెతలు 22:6, అధస్సూచి.
ఎక్కువ తెలుసుకోవడానికి, “నా పిల్లలు సోషల్ మీడియా వాడడం అవసరమా?” (ఇంగ్లీష్) అనే ఆర్టికల్ చదవండి.
సోషల్ మీడియా వాడడానికి మీరు మీ పిల్లలకు పర్మిషన్ ఇస్తే, ఎలాంటి ప్రమాదాలు ఎదురవ్వవచ్చో తెలుసుకోండి; మీ పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండండి. అదెలా చేయవచ్చు?
మీ పిల్లలు పాడవ్వకుండా చూసుకోండి. ఎలాంటివి పిల్లల్ని పాడుచేస్తాయో అర్థంచేసుకుని వాటిని గుర్తించేలా, అలాగే వాటికి దూరంగా ఉండేలా మీ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వండి.
బైబిలు సలహా: “లైంగిక పాపం, అన్నిరకాల అపవిత్రత, అత్యాశ అనేవాటి ప్రస్తావన కూడా మీ మధ్య రానివ్వకండి, … అవమానకరమైన ప్రవర్తన, మూర్ఖంగా మాట్లాడడం, అసభ్యమైన హాస్యం” అనే వాటికి దూరంగా ఉండండి.—ఎఫెసీయులు 5:3, 4.
చక్కని సలహాల కోసం, “సోషల్ మీడియాను జాగ్రత్తగా ఎలా వాడాలో మీ పిల్లలకు నేర్పించండి” (ఇంగ్లీష్) అనే ఆర్టికల్ చదవండి.
హద్దులు పెట్టండి. ఉదాహరణకు, సోషల్ మీడియాను ఎప్పుడు వాడాలి, ఎంతసేపు వాడాలి అనే విషయంలో కొన్ని రూల్స్ పెట్టండి.
బైబిలు సలహా: ‘చాలా జాగ్రత్తగా ఉంటూ తెలివిగలవాళ్లలా నడుచుకోండి, మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి.’—ఎఫెసీయులు 5:15, 16.
సోషల్ నెట్‌వర్క్‌లను జాగ్రత్తగా ఉపయోగించండి అనే వీడియో సహాయంతో, అలాంటి రూల్స్ ఎందుకు అవసరమో మీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి.