అప్రమత్తంగా ఉండండి!
యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధానికి, మతానికి ఉన్న సంబంధం—బైబిలు ఏం చెప్తుంది?
పేరున్న మతనాయకులకు, యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఈమధ్య కొన్ని రిపోర్టులు ఇలా చెప్పాయి:
“రష్యన్ ఆర్థడాక్స్ చర్చి పెద్ద అయిన బిషప్ కిరీల్ రష్యా చేస్తున్న దాడుల గురించి పెదవి విప్పలేదు. . . . కొంతకాలంగా అతని చర్చివాళ్లు యుక్రెయిన్‌కి వ్యతిరేకంగా కొన్ని విషయాలు ప్రచారం చేస్తూ వస్తున్నారు; యుక్రెయిన్‌పై యుద్ధం చేయడానికి పుతిన్ వాటినే కారణాలుగా వాడుతున్నాడు.”—EU అబ్జర్వర్ వార్తాపత్రిక, మార్చి 7, 2022.
బిషప్ కిరీల్, . . . రష్యా యుక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధాన్ని వెనకేసుకొచ్చాడు. అది ‘పాపానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఒక భాగం’ అని అన్నాడు.—AP న్యూస్, మార్చి 8, 2022.
“కీవ్ నగరంలో ఉండే యుక్రెయిన్ ఆర్థడాక్స్ చర్చి నాయకుడైన, మెట్రోపాలిటన్ ఎపిఫేనియస్ I, సోమవారం రోజున తన దేశ ప్రజల్ని దీవించి, ‘రష్యన్ సైనికులతో పోరాడమని’ చెప్పాడు . . . పైగా రష్యా సైనికుల్ని చంపడం పాపం కాదని అతను అన్నాడు.”—జెరూసలేం పోస్ట్, మార్చి 16, 2022.
“మేము [అంటే, UCCROa] యుక్రెయిన్ సైనికులకు, మా తరఫున పోరాడుతున్న ప్రజలకు మద్దతు తెలుపుతున్నాం. యుక్రెయిన్‌ను శత్రువుల నుండి కాపాడడానికి వాళ్లు చేస్తున్న పోరాటంలో విజయం సాధించాలని దీవిస్తున్నాం, వాళ్లకోసం ప్రార్థనలు చేస్తున్నాం.”—UCCRO ప్రకటన, ఫిబ్రవరి 24, 2022.
మీరేమంటారు? యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడుస్తున్నామని చెప్పుకునే మతాలు, యుద్ధానికి వెళ్లమని తమ సభ్యుల్ని ప్రోత్సహించడం సరైనదేనా? బైబిలు ఏం చెప్తుంది?
చరిత్రలో యుద్ధాలకు, మతంతో ఉన్న సంబంధం
శాంతి కోసం కృషి చేస్తున్నామని చెప్పుకునే చాలా మతాలు, ఎన్నో సందర్భాల్లో యుద్ధాల్ని సమర్థించినట్లు, ఆఖరికి ప్రోత్సహించినట్లు చరిత్ర చెప్తుంది. మతం వెనకున్న ఈ చీకటి కోణాన్ని, కొన్ని దశాబ్దాలుగా యెహోవాసాక్షులు బట్టబయలు చేస్తున్నారు. మా పత్రికల్లో వచ్చిన అలాంటి కొన్ని ఆర్టికల్స్ చూడండి:
‘పవిత్ర యుద్ధాలు పేరుతో జరుగుతున్న మారణకాండ’ (ఇంగ్లీషు)—దేవుని పేరు, క్రీస్తు పేరు చెప్పుకుని రోమన్ క్యాథలిక్ చర్చి ఎంతమంది ప్రాణాల్ని బలి తీసుకుందో ఆ ఆర్టికల్ వివరిస్తుంది.
“ఆఫ్రికాలోని క్యాథలిక్ చర్చి” (ఇంగ్లీషు)—జాతుల మధ్య జరిగే యుద్ధాల్ని, జాతినిర్మూలనా దాడుల్ని ఆపడంలో మతం ఎంత ఘోరంగా విఫలమైందో అది వివరిస్తుంది.
“తప్పు మతానిదా?” (ఇంగ్లీషు), “మానవుని యుద్ధాల్లో మతం పాత్ర,” “మతం పక్షం వహిస్తుంది” ఎన్నోసార్లు క్యాథలిక్, ఆర్థడాక్స్, ప్రొటస్టెంట్ మతపెద్దలు యుద్ధం చేసుకుంటున్న రెండువైపుల వాళ్లకు మద్దతు తెలపడం గురించి ఆర్టికల్స్ వివరిస్తాయి.
క్రైస్తవ మతాలు యుద్ధాలకు మద్దతివ్వాలా?
యేసు ఇలా బోధించాడు: “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ సాటిమనిషిని ప్రేమించాలి.” (మత్తయి 22:39) “మీ శత్రువుల్ని ప్రేమిస్తూ ఉండండి.”—మత్తయి 5:44-47.
ఆలోచించండి: కొన్ని మతాలు సాటిమనుషుల్ని ప్రేమించమనే యేసు ఆజ్ఞను పాటిస్తున్నామని చెప్పుకుంటూ, మరోవైపు యుద్ధానికెళ్లి ఇతరుల్ని చంపమని తమ సభ్యులను ప్రోత్సహిస్తున్నాయి. అలా చేయడం సరైనదేనా? జవాబు తెలుసుకోవాలంటే, “నిజమైన క్రైస్తవులు మరియు యుద్ధం,” “శత్రువుల్ని ప్రేమించడం సాధ్యమేనా?” (ఇంగ్లీషు) ఆర్టికల్స్ చదవండి.
యేసు ఇలా చెప్పాడు: “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు. నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినదైతే, నేను … అప్పగించబడకుండా నా సేవకులు పోరాడి ఉండేవాళ్లు.” (యోహాను 18:36) “కత్తి పట్టుకున్న వాళ్లందరూ కత్తితోనే నాశనమౌతారు.”—మత్తయి 26:47-52.
ఆలోచించండి: క్రైస్తవులు యేసును కాపాడడం కోసం కూడా పోరాడకూడదని చెప్పినప్పుడు, వేరే ఏ కారణం చేతైనా ఆయుధాలు పట్టుకుని యుద్ధానికి వెళ్లడం సరైనదేనా? మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు యేసు ఆదర్శాన్ని, ఆయన చెప్పిన మాటల్ని ఎంత నమ్మకంగా పాటించారో తెలుసుకోవాలంటే, “క్రైస్తవత్వం యుద్ధాల్ని ప్రోత్సహిస్తుందా?” (ఇంగ్లీషు) ఆర్టికల్ చదవండి.
యుద్ధాలకు మద్దతిచ్చే మతాలకు ఏమౌతుంది?
యేసు అనుచరులమని చెప్పుకుంటూ, ఆయన చెప్పిన వాటిని పాటించని మతాల్ని దేవుడు అంగీకరించడని బైబిలు చెప్తుంది.—మత్తయి 7:21-23; తీతు 1:16.
“భూమ్మీద దారుణంగా చంపబడిన వాళ్లందరి” విషయంలో, అలాంటి మతాల్ని యెహోవా బాధ్యులుగా ఎంచుతాడని ప్రకటన గ్రంథం చెప్తుంది. (ప్రకటన 18:21, 24) ఎందుకో తెలుసుకోవాలంటే, “మహాబబులోను అంటే ఏమిటి?” ఆర్టికల్ చదవండి.
అలాంటి మతాల పరిస్థితి ఏమౌతుంది? దేవుడు అంగీకరించని మతాలన్నీ, అవి చేస్తున్న చెడ్డ పనుల్ని బట్టి నాశనమౌతాయని యేసు చెప్పాడు. ఇంకోలా చెప్పాలంటే, కుళ్లిన పండ్లు కాసే చెడ్డ చెట్టును ‘నరికి, అగ్నిలో పడేస్తాం’ కదా, ఆ మతాల్ని కూడా దేవుడు అలానే నాశనం చేస్తాడు. (మత్తయి 7:15-20) అది ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి, “మతం పేరిట జరుగుతున్న దుష్క్రియలు అంతమౌతాయా?” ఆర్టికల్ చదవండి.
Photo credits, left to right: Photo by Sefa Karacan/Anadolu Agency/Getty Images; Maxym Marusenko/NurPhoto via Getty Images
a UCCRO అంటే యుక్రెనియన్ కౌన్సిల్ ఆఫ్ చర్చస్ అండ్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్. ఇందులో ఆర్థడాక్స్, గ్రీక్ అలాగే రోమన్ క్యాథలిక్, ప్రొటస్టెంట్, ఇవాంజిలికల్ డినామినేషన్లకు సంబంధించిన 15 చర్చీలతోపాటు యూదులకు, ముస్లింలకు సభ్యత్వం ఉంది.