జ్ఞాపకార్థ ఆచరణ కాలం—పరిచర్య ఎక్కువగా చేయడానికి ఒక అవకాశం!
1. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరిచర్య ఎక్కువగా చేయడం గురించి ఆలోచించడానికి ఏ కారణాలున్నాయి?
1 రాబోయే జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో మీరు పరిచర్య ఎక్కువగా చేయగలరా? చాలా ప్రాంతాల్లో త్వరగా చీకటిపడదు. స్కూళ్లలో పనిచేసే లేదా చదువుకునే కొంతమంది ప్రచారకులకు సెలవులు ఉంటాయి కాబట్టి వాళ్లు పరిచర్య చేయవచ్చు. ఏప్రిల్ 17న జరిగే జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యేందుకు ఆసక్తి ఉన్న వాళ్లను ఆహ్వానించడానికి ఏప్రిల్ 2 నుండి మనం ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో పాల్గొంటాం. ఆ తర్వాత జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన వాళ్ల ఆసక్తి పెంచడానికి ప్రయత్నం చేసి, ఏప్రిల్ 25తో ప్రారంభమయ్యే వారంలో ఇవ్వబడే ప్రత్యేక ప్రసంగానికి వాళ్లను ఆహ్వానిస్తాం. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరిచర్య ఎక్కువగా చేయడం గురించి ఆలోచించడానికి నిజంగానే చాలా కారణాలున్నాయి.
2. పరిచర్య ఎక్కువగా చేయడానికి ఒక మంచి మార్గం ఏమిటి?
2 సహాయ పయినీరు సేవ: పరిచర్య ఎక్కువగా చేయడానికి ఒక మంచి మార్గం సహాయ పయినీరు సేవ చేయడం. అందరం చాలా బిజీగా ఉంటాం కాబట్టి, అలా చేయాలంటే ముందే ప్రణాళిక వేసుకోవడం, సర్దుబాట్లు చేసుకోవడం అవసరం. (సామె. 21:5) మీరు ఎప్పుడూ చేసుకునే వాటిలో అంత ముఖ్యం కాని కొన్ని పనుల్ని వాయిదా వేసుకోవచ్చు. (ఫిలి. 1:9-11) మీరు సహాయ పయినీరు సేవ చేయాలనుకుంటున్నట్టు సంఘంలోని వేరేవాళ్లకు చెప్తే వాళ్లు కూడా మీతోపాటు సహాయ పయినీరు సేవ చేయడానికి ఇష్టపడవచ్చు.
3. ఎక్కువగా పరిచర్య చేయడానికి కుటుంబాలు ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు?
3 ఈసారి మీరు కుటుంబ ఆరాధన చేసుకునేటప్పుడు మీ లక్ష్యాల గురించి అందరూ కలిసి మాట్లాడుకోవడం మంచిది. (సామె. 15:22) అందరూ ఒకరికొకరు సహకరించుకుంటే కుటుంబంలో కొంతమంది ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ నెలలు సహాయ పయినీరు సేవ చేయవచ్చు. ఒకవేళ అది మీ వల్ల కాదని మీకు ఖచ్చితంగా అనిపిస్తే ఏమి చేయవచ్చు? అలాంటప్పుడు కుటుంబం కొన్ని సాయంత్రాలు లేదా వారాంతాల్లో ఎక్కువగా పరిచర్య చేయడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు.
4. ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో పరిచర్య ఎక్కువగా చేస్తే ఎలాంటి ఆశీర్వాదాల్ని పొందవచ్చు?
4 యెహోవా తన సేవ చేయడానికి మనం చేసే ప్రయత్నాలన్నిటినీ గమనిస్తాడు, మనం చేసే త్యాగాల్ని విలువైనవిగా ఎంచుతాడు. (హెబ్రీ. 6:10) యెహోవా కోసం, ఇతరుల కోసం సమయాన్ని వెచ్చిస్తే సంతోషం కలుగుతుంది. (1 దిన. 29:9; అపొ. 20:35) మీరు ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో పరిచర్య ఎక్కువగా చేయగలరా? అప్పుడు మీరు ఎంతో సంతోషాన్ని, ఎన్నో ఆశీర్వాదాల్ని పొందవచ్చు.