యెహోవాను ప్రేమించడం ఇతరులకు నేర్పించండి
1 యెహోవా గురించి మీరు మొదటిసారిగా వినడం మీకు గుర్తుందా? ఏది మిమ్మల్ని ఆయనవైపుకు ఆకర్షించింది? యథార్థవంతులైన చాలామంది, మన సృష్టికర్తకున్న సాటిలేని లక్షణాల గురించి ప్రాముఖ్యంగా కరుణ, ప్రేమవంటి లక్షణాల గురించి తెలుసుకున్నప్పుడు, ఆయనవైపుకు ఆకర్షించబడ్డామని చెబుతారు.—1 యోహా. 4:8.
2 ‘ఇదిగో మన దేవుడు’: బైబిలు బోధిస్తోంది అనే పుస్తకం యెహోవా ప్రేమను, ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగివుండవలసిన అవసరాన్ని నొక్కిచెబుతుంది. ఇతరులు దేవునిపట్ల ప్రేమను పెంపొందించుకునేందుకు మనం ఈ పుస్తకాన్ని ఎలా ఉపయోగించవచ్చు? ఏదైనా క్రొత్త విషయం గురించి చెబుతున్నప్పుడు, ఆలోచన రేకెత్తించే ఇలాంటి ప్రశ్నలు అడగవచ్చు, “ఈ సత్యం యెహోవా గురించి ఏమి వెల్లడిచేస్తుంది?” లేదా “యెహోవా సర్వోత్తమమైన తండ్రి అని ఈ అంశం ఎలా నిరూపిస్తుంది?” ఈ విధంగా బోధించడం ఆ విద్యార్థి యెహోవాతో శాశ్వత సంబంధాన్ని ఏర్పర్చుకునేందుకు సహాయం చేస్తుంది.
3 జీవముగల అద్వితీయ సత్యదేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఎంత ప్రాముఖ్యమో బైబిలు విద్యార్థులు గ్రహించడానికి సహాయం చేస్తే వారు, యెషయా చెప్పినట్లు ‘ఇదిగో మన దేవుడు’ అని అంగీకరిస్తారు. (యెష. 25:9) దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు, క్రీస్తుయేసు ఆధ్వర్యంలో రాజరిక ప్రభుత్వం ద్వారా యెహోవా సంకల్పాలు నెరవేర్చబడినప్పుడు మానవజాతి ఎలా ఆశీర్వదించబడుతుందో నొక్కిచెప్పడం అవసరం.—యెష. 9:6, 7.
4 యెహోవాపట్ల ప్రేమకు రుజువు: పూర్ణ హృదయంతోను, పూర్ణాత్మతోను, పూర్ణ మనసుతోను యెహోవాను ప్రేమించడమంటే దైవభక్తి కలిగివుండడం మాత్రమే కాదు, ఆయన ఆలోచనావిధానాన్ని అలవర్చుకొని దానిని అనుసరించాలి. (కీర్త. 97:10) దేవునిపట్ల ప్రేమ ఉంటే, ఆయన ఆజ్ఞలకు ఖచ్చితంగా విధేయత చూపించడమేకాక వ్యతిరేకత, శ్రమలు వచ్చినప్పుడు కూడా “పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను” కొనసాగుతాం.—2 పేతు. 3:11, 12; 2 యోహా. 6.
5 దేవునిపట్ల ప్రేమతో ఆయన చిత్తాన్ని చేయడం మనకు సంతోషాన్నిస్తుంది. (కీర్త. 40:8) దేవుని ఆజ్ఞలన్నీ ఆయన సేవకులకు నిరంతర ప్రయోజనం చేకూర్చేందుకు రూపొందించబడ్డాయని బైబిలు విద్యార్థి గ్రహించాలి. (ద్వితీ. 10:12, 13) ఒక వ్యక్తి యెహోవా నిర్దేశానుసారంగా జీవించడం మూలంగా దేవుని అద్భుత కార్యాలన్నింటిపట్ల ప్రగాఢ ప్రశంసను చూపిస్తాడు. యెహోవా నీతి మార్గాల్లో నడవడం ద్వారా ఎంతో మనోవేదనను తప్పించుకోవచ్చని గ్రహించడానికి విద్యార్థికి సహాయం చేయండి.
6 దేవుని ప్రేమించేవారికి ఆశీర్వాదాలు: యెహోవా దేవుడు తనను ప్రేమించే వినయస్థులపట్ల ఎంతో శ్రద్ధ తీసుకొని వారికి తనగురించిన “మర్మములను” వెల్లడిచేస్తాడు. (1 కొరిం. 2:9, 10) వారు యెహోవా సంకల్పాల పట్ల అలాంటి జ్ఞానంతో, భవిష్యత్తు ఎలావుంటుందో స్పష్టంగా గ్రహించి ఖచ్చితమైన నిరీక్షణను ఏర్పర్చుకోగలుగుతారు. (యిర్మీ. 29:11) యెహోవాను ప్రేమించేవారు ఆయన విశేషమైన దయను పొందుతారు. (నిర్గ. 20:6) వారు దేవునికి తమపట్ల ఉన్న గొప్ప ప్రేమనుబట్టి నిత్యజీవ నిరీక్షణను విలువైనదిగా ఎంచుతారు.—యోహా. 3:16.
7 మనం మన పరలోక తండ్రి గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా ఆయన గురించి ఇతరులకు చెబుతాము. (మత్త. 13:52) యెహోవాను ప్రేమించడం ఇతరులకు, ప్రత్యేకంగా మన పిల్లలకు నేర్పించడం ఎంతటి అనిర్వచనీయమైన ఆధిక్యతో కదా! (ద్వితీ. 6:5-7) ‘యెహోవా మహా దయాళుత్వమును’ అనుభవిస్తూ మనం, మన బైబిలు విద్యార్థులతోపాటు ఆయనను స్తుతించడంలో కొనసాగుదాం.—కీర్త. 145:7.
[అధ్యయన ప్రశ్నలు]
1. కొంతమందిని యెహోవావైపుకు ఆకర్షించేదేమిటి?
2, 3. బైబిలు విద్యార్థులు యెహోవాపట్ల తమ ప్రేమను పెంపొందించుకునేందుకు సహాయం చేయడానికి మనం బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఎలా ఉపయోగించవచ్చు?
4, 5. యెహోవా పట్ల ప్రేమ కలిగివుండడమంటే ఏమిటి?
6. యెహోవాను ప్రేమించేవారు ఎలాంటి ఆశీర్వాదాలు పొందవచ్చు?
7. యెహోవాను ప్రేమించడం ఇతరులకు నేర్పించడం గురించి మీరెలా భావిస్తున్నారు?