మనం యెహోవాకు ఏదైనా ఇవ్వగలమా?
1 మానవులు దేవునికి ఇవ్వగలిగినవి కొన్ని ఉన్నాయని మీకు తెలుసా? హేబెలు తన మందలోని శ్రేష్ఠమైనవాటిలో కొన్నింటిని యెహోవాకు అర్పించాడు, నోవహు, యోబు కూడా అలాంటి అర్పణలే అర్పించారు. (ఆది. 4:4; 8:20; యోబు 1:5) సమస్తం యెహోవాకు చెందినదే కాబట్టి అలాంటి అర్పణలేవీ ఆయనని సంపన్నుణ్ణి చేయలేవు. అయితే విశ్వసనీయులైన మానవులు బలులు అర్పించడం ద్వారా యెహోవాపట్ల తమకున్న ప్రగాఢమైన ప్రేమను చూపించారు. నేడు మనం, మన సమయాన్ని, శక్తిని, వస్తుపరమైన వనరులను (వస్తు సంపత్తిని) యెహోవాకు “స్తుతియాగము[గా]” అర్పించడానికి ఉపయోగించవచ్చు.—హెబ్రీ. 13:15.
2 సమయం: అంతగా ప్రాముఖ్యం కాని విషయాల్లో సమయాన్ని “పోనియ్యక” పరిచర్యలో పూర్తిగా భాగం వహించడానికి ఉపయోగించడం ఎంత ప్రశంసనీయమో కదా! (ఎఫె. 5:15, 16) సంవత్సరంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ నెలలు సహాయ పయినీరు సేవ చేయడానికి మనం సర్దుబాట్లు చేసుకోవచ్చు. పరిచర్యలో మనం సాధారణంగా వెచ్చించే దానికన్నా ఎక్కువ సమయం గడపవచ్చు. అంటే వారానికి 30 నిమిషాలు అదనంగా వెచ్చిస్తే నెలలో కనీసం రెండు గంటలు ఎక్కువ చేయగలుగుతాం.
3 శక్తి: పరిచర్య చేయడానికి మనకు శక్తి ఉండాలంటే, మనల్ని ఎంతో అలసటకు గురిచేసి, యెహోవాకు మనం ఇవ్వగలిగినంత ఇవ్వకుండా చేయగల వినోద కార్యకలాపాలు, ఉద్యోగం వంటివాటికి దూరంగా ఉండాలి. అంతేకాక హృదయాన్ని ‘క్రుంగదీయగల’ చింతలను కూడా మనం ప్రక్కనపెట్టాలి, ఎందుకంటే అవి దేవుని సేవలో మనం ఉపయోగించగల శక్తిని హరించివేయగలవు. (సామె. 12:25) ఒకవేళ మనం చింతించడానికి బలమైన కారణాలున్నా ‘భారమంతా యెహోవామీద మోపడం’ ఎంతో మంచిది.—కీర్త. 55:22; ఫిలి. 4:6, 7.
4 వనరులు: ప్రకటనా పనికి మద్దతునివ్వడానికి మనం వస్తుపరమైన వనరులను కూడా ఉపయోగించవచ్చు. అవసరంలోవున్న వారికి సహాయం చేయడానికి వీలుగా క్రమంగా “కొంత సొమ్ము నిలువ” చేయాలని పౌలు తోటి క్రైస్తవులను ప్రోత్సహించాడు. (1 కొరిం. 16:1, 2) అదే విధంగా, మనం కూడా స్థానిక సంఘ అవసరాలకు, ప్రపంచవ్యాప్త పనికి విరాళంగా ఇచ్చేందుకు కొంత డబ్బు దాయవచ్చు. మనం హృదయపూర్వకంగా ఇచ్చేది కొంచెమైనా సరే యెహోవా దానిని విలువైనదిగా ఎంచుతాడు.—లూకా 21:1-4.
5 యెహోవా మనకు ఎన్నో ఇచ్చాడు. (యాకో. 1:17) ఆయన సేవలో మనం మన సమయాన్ని, శక్తిని, ఇతర వనరులను ఉదారంగా ఉపయోగించడం ద్వారా కృతజ్ఞత చూపిస్తాం. మనమలా చేస్తే, ‘ఉత్సాహంగా ఇచ్చేవానిని ప్రేమించే దేవుడైన’ యెహోవాను సంతోషపరుస్తుంది.—2 కొరిం. 9:7.