ప్రశ్నా భాగం
◼ అదనపు సంఘ పుస్తక అధ్యయన గ్రూపును ఎప్పుడు రూపొందించడం సముచితంగా ఉంటుంది?
రాజ్య మందిరంతో సహా సంఘ పుస్తక అధ్యయనం జరిగే ప్రతి స్థలంలోను హాజరయ్యేవారి సంఖ్య 15 లేక అంతకన్నా తక్కువగా ఉండాలి, ఆ సంఖ్య మించిపోతున్నప్పుడు, కొత్త గ్రూపును రూపొందించడానికి ఆలోచించాలి. ఎందుకిలా సిఫారసు చేయబడుతుంది?
సంఘ పుస్తక అధ్యయన గ్రూపులు చిన్నవిగా ఉన్నప్పుడు, నిర్వాహకుడు హాజరైన ప్రతి ఒక్కరిపై మంచి శ్రద్ధ చూపించగలుగుతాడు. అంతేకాక, వ్యాఖ్యలను చేయడం ద్వారా తమ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించే అవకాశాలు హాజరైనవారందరికీ పుష్కలంగా ఉంటాయి. (హెబ్రీ. 10:23; 13:15) సంఘ సేవా ప్రాంతమంతటా అనేక చిన్న గ్రూపులు ఉంటే, సంఘ పుస్తక అధ్యయనానికీ, క్షేత్రసేవ కూటాలకూ హాజరవ్వడానికి ఎక్కువ అనువుగా ఉంటుంది. అలా సంఘ పుస్తక అధ్యయనం చేసే గ్రూపులను పెంచుకొన్న సంఘాలు, పుస్తక అధ్యయనాలకు హాజరయ్యేవారి మొత్తం సంఖ్య పెరిగిందని కనుగొన్నాయి.
ఇప్పుడున్న గ్రూపు చిన్నదైనప్పటికీ కొన్ని పత్యేకమైన పరిస్థితుల్లో మరొక గ్రూపును రూపొందించాల్సి రావచ్చు. మారుమూల ప్రాంతమైతే లేదా ప్రస్తుతపు స్థలాల్లో హాజరయ్యేవారు ఎక్కువైతే లేదా కూర్చోవడానికి స్థలం సరిపోకపోతే అది అవసరం కావచ్చు. అవసరమైతే, వృద్ధులకు, రాత్రిళ్ళు పని చేసేవాళ్ళకు, అవిశ్వాసులైన భర్తలుగల సహోదరీలకు ప్రయోజనకరంగా పగలు కూడుకొనే ఒక గ్రూపును రూపొందించవచ్చు.
ప్రతి పుస్తక అధ్యయన గ్రూపులో, ఆధ్యాత్మికంగా బలంగా, చురుగ్గా ఉండే కొందరు ప్రచారకులను నియమించాలి, వారితోపాటు యోగ్యుడైన నిర్వాహకుడూ, చదవడానికి యోగ్యతగల ప్రచారకుడూ ఉండాలి. సంఘంలోని ఈ అవసరాలను తీర్చగల యోగ్యతలను చేరుకునేందుకు సహోదరులు కృషి చేయాలి.
సంఘ పుస్తక అధ్యయన గ్రూపులు సహేతుకమైన పరిమాణంతో, ఆధ్యాత్మికంగా చక్కగా పోషించబడేవిగా, కూడుకోవడానికి అనువైన స్థలాల్లో ఉండేలా చూడడం ద్వారా పెద్దలు సంఘాన్ని ప్రగతిపథంలో ఉంచగల్గుతారు. అసమానమైన ఈ ఆధ్యాత్మిక ఏర్పాటు నుండి అందరూ పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి, కొత్త గ్రూపులను రూపొందించవలసిన అవసరం ఏర్పడితే, తప్పకుండా రూపొందించాలి. పుస్తక అధ్యయన స్థలంగా మీ ఇంటిని ఉపయోగించుకొమ్మని మీరు ప్రతిపాదించగలరా? అలా చేసినవారనేకమంది ఆధ్యాత్మిక ఆశీస్సులను పొందారు.