యెహోవా ఆశీర్వాదము మనలను ఐశ్వర్యవంతులను చేస్తుంది
1 ప్రజలు తరచుగా ఒక వ్యక్తి యొక్క జీతాన్ని బట్టి అతని సాఫల్యతను అంచనావేస్తారు. అందుకే చాలామంది, డబ్బుగలవాళ్ళను అత్యంత సంతోషముగలవారిగానూ, సంతృప్తిగలవారిగానూ దృష్టిస్తారు. కానీ, డబ్బుతో సంతోషాన్ని కొనుక్కోవచ్చని అనుకునేవారు చాలా ఘోరంగా పొరబడుతున్నారు. (ప్రసం. 5:12) నిజానికి, వస్తుసంబంధంగా “ధనవంతులగుటకు అపేక్షించు” వారికి శాశ్వత ఆనందం ఉండదు. (1 తిమో. 6:9) దానికి బదులుగా, యెహోవా సేవకులు నిజమైన ఆనందాన్ని కలిగివుంటారు, ప్రపంచమంతటిలో వాళ్ళే అత్యంత ఐశ్వర్యవంతులు. (సామె. 10:22; ప్రక. 2:9) అదెలా?
2 మన ఐశ్వర్యానికి నిదర్శనం: మనకు దేవుని వాక్యమైన బైబిలుపై మంచి అవగాహన, ఆధ్యాత్మిక అంతర్దృష్టి అనే ఐశ్వర్యం ఉంది. మన శాశ్వత ప్రయోజనార్థమై యెహోవా తన భూసంస్థ ద్వారా మనకు, తన గురించీ తన కుమారుని గురించీ నిర్విరామంగా బోధిస్తున్నాడు. ఆ బోధలపై స్పష్టమైన అవగాహన, మనం యెహోవాకు దగ్గరవడానికీ ఆయనతో సన్నిహిత సంబంధాన్ని అనుభవించడానికీ సాధ్యం చేస్తుంది. (యాకో. 4:8) మంచి చెడులమధ్య తేడాను గ్రహించడం ద్వారా, అలాగే దేవుని నియమాలను అనుసరించడం ద్వారా కొన్ని రకాల వ్యాధుల నుండి ప్రమాదాల నుండి మనం కాపాడబడతాము. యెహోవా దేవుడు మన ప్రాథమికావసరాలను తీరుస్తాడని మనకు దృఢనమ్మకం ఉంది, వాటితోపాటు ఆయన నుండి మాత్రమే వచ్చే నిజమైన సంతృప్తి శాంతి మనకు లభిస్తాయి.—మత్త. 6:33.
3 మనం దేవుని ఆత్మ ఫలాలను అలవర్చుకుంటూ ఉంటాము కాబట్టి, మనం మన ఆధ్యాత్మిక సహోదర సహోదరీల మధ్య శాంతిని, ఐక్యతను అనుభవిస్తాము. మనం కష్టాలను ఎదుర్కొనే సమయాల్లో దేవుడు కానీ మన సహోదరులు కానీ మనలను విడిచిపెట్టేశారని భావించవలసిన అవసరంలేదు ఎందుకంటే, ప్రేమ అనే దృఢమైన బంధంలో మనమంతా ఐక్యత కలిగివున్నాము.—గల. 6:10.
4 మన జీవితాలకు నిజమైన అర్థమూ, సంకల్పమూ ఉన్నాయి. భూవ్యాప్తంగా దేవుని రాజ్య సువార్తను ప్రకటించే పనిలో మనం కూడా పాల్గొనడాన్ని ఒక గొప్ప ఆధిక్యతగా భావిస్తాము. మనం ప్రకటించే రాజ్య సువార్త ద్వారా, ఇతరులు దేవునితో మంచి సంబంధాన్ని కలిగివుండేలా, మనతోపాటు ఐక్యంగా స్వచ్ఛారాధనను చేసేలా సహాయం చేయడం మనకు శాశ్వత ఆనందాన్ని తీసుకువస్తుంది. మనకున్న పరిచర్య అనే అమూల్యమైన ఐశ్వర్యము, యెహోవాకు ఘనతను తీసుకురావడమే కాక దేవుని నామాన్ని పవిత్రపర్చేందుకు మనమూ తోడ్పడుతున్నామనే సంతృప్తిని కూడా మనకు ఇస్తుంది. త్వరలోనే భవిష్యత్తును గూర్చిన మన నిరీక్షణ వాస్తవం కాబోతుందని తెలిసిన వారమై, నిశ్చితమైన మానసిక దృక్పథంతో కొనసాగుదాము.
5 మన మెప్పుదలను చూపించడం: మనలను ఈ భూమిపై నిజమైన ఐశ్వర్యవంతులనుగా చేసే యెహోవా ఆశీర్వాదాలను బట్టి ఎల్లప్పుడూ మెప్పును కలిగివుందాము. (సామె. 22:4) ప్రతిరోజూ కొంత సమయాన్ని తీసుకుని, మనకున్న వాటన్నింటిని గూర్చి ధ్యానించడం ద్వారా, యెహోవా మనపట్ల చూపించే అపారమైన ప్రేమకు కృతజ్ఞత చూపుతూ సంపూర్ణ భక్తితో కొనసాగడానికి పురికొల్పబడతాము.