క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం
మన ప్రేమకూ, అనితర భక్తికీ యెహోవా దేవుడు అర్హుడని మనకు తెలుసు. అయితే, మనం ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించకుండా ఉండేలా లోకం మనల్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. (యోహా. 17:14) యెహోవా పట్ల మనకున్న ప్రేమను పటిష్ఠపర్చేందుకూ, మన ఆధ్యాత్మికతను అపాయంలో పడవేసే లోకంలో ఉన్న వాటిని నిరోధించడానికి మనల్ని బలపర్చేందుకూ 2001 సేవా సంవత్సరపు క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం “దేవునిని ప్రేమించండి—లోకములో ఉన్నవాటిని కాదు” అనే మూలాంశాన్ని కల్గివుంది.—1 యోహా. 2:15-17.
యెహోవా పట్ల మనకున్న ప్రగాఢమైన ప్రేమ, ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చేందుకు మనలను పురికొల్పుతుంది. అయినప్పటికీ క్షేత్రసేవలో పాల్గోవడం, దేవుని ప్రజల్లో అనేకమందికి అంత సులభమైన విషయమేమీకాదు. “దేవుని పట్ల ఉన్న ప్రేమ మన పరిచర్యలో మనలను కదిలిస్తుంది” అనే ప్రసంగంలో, క్షేత్రసేవలో పూర్తిగా భాగం వహించేందుకు ఎంతమంది బిడియాన్నీ మరితర ఆటంకాలనూ అధిగమించారో తెలుసుకుంటాం.
దిగజారిపోతున్న లోక ప్రమాణాలు మనపై ఎలా ప్రభావాన్ని చూపిస్తాయి? ఒకప్పుడు చెడ్డవిగా దృష్టించబడిన క్రియలు ఇప్పుడు సర్వ సాధారణమైనవిగా అయిపోయాయి. “యెహోవాను ప్రేమించువారు చెడును అసహ్యించుకుంటారు” అనే ప్రసంగమూ, “లోకంలో ఉన్నవి—వాటిని మనమెలా దృష్టిస్తాము?” అనే గోష్ఠీ చెడ్డ కోరికలను తిరస్కరించాలనే మన నిశ్చయాన్ని బలపరుస్తాయి.
ఆ కార్యక్రమంలో నమూనా దైవ పరిపాలన పరిచర్య పాఠశాల, సేవా కూటము అలాగే ఆ వారంలో జరగబోయే కావలికోట పఠన భాగ సారాంశం చేర్చబడతాయి. “ప్రేమా విశ్వాసాలు లోకాన్ని ఎలా జయిస్తాయి” అనే బహిరంగ ప్రసంగం, లోకపు ఒత్తిళ్ళను ఎదుర్కోవడంలో యేసును అనుకరించేలా మనలను ప్రోత్సహిస్తుంది. (యోహా. 16:33) దానికి హాజరయ్యేందుకు మీ బైబిలు విద్యార్థులను ఆహ్వానించండి. బాప్తిస్మం పొందాలని అనుకునేవారు సాధ్యమైనంత త్వరలో సంఘ పై విచారణకర్తకు తెలియజేయాలి, అప్పుడు అవసరమైన ఏర్పాట్లు చేయబడతాయి.
యెహోవా దేవుని మెండైన దీవెనలను అనుభవించేందుకు మన ప్రేమ దేనిపై ఖచ్చితంగా కేంద్రీకృతమై ఉండాలనే విషయంపై ఈ ప్రాంతీయ సమావేశం మన అవధానాన్ని మళ్ళిస్తుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో దేనినీ తప్పిపోవద్దు!