పైవిచారణకర్తలు నేతృత్వం వహిస్తారు—సంఘ పైవిచారణకర్త
1 సంఘంలో పైవిచారణకర్తగా సేవచేయడమంటే గంభీరమైన బాధ్యతే. (అపొ. 20:28; 1 తిమో. 3:1) క్రైస్తవ పెద్దలు మన పక్షాన చేసే ముఖ్యమైన పనిని మనమందరమూ గుణగ్రహించేందుకుగాను క్రైస్తవ పెద్దల విభిన్న విధులను సంక్షిప్తపరచే శీర్షికా పరంపరలోని మొదటి శీర్షిక ఇది.
2 అధ్యక్షత వహించే పైవిచారణకర్తను (ప్రిసైడింగ్ ఓవర్సీయర్ను) అనిర్దిష్ట కాలం వరకూ సేవ చేసేందుకు సొసైటీ నియమిస్తుంది. సంఘ పైవిచారణకర్త కార్యాలను సమన్వయపరుస్తాడు గనుక, పెద్దలు తమ నియుక్త విధులపై కావలసినంత అవధానమిచ్చేందుకు అది సహాయపడుతుంది. (మన పరిచర్య, పేజీ 42) ఇందులో ఏమి ఇమిడి ఉంది?
3 సంఘ పైవిచారణకర్త సంఘ తపాలాను అందుకుని, వాటిని హ్యాండిల్ చేసేందుకు వెంటనే సెక్రెటరీకి ఇస్తాడు. సంఘ పైవిచారణకర్త పెద్దల కూటాల కొరకైన సిద్ధపాటులో, చర్చించవలసిన విషయాలపై పెద్దల సలహాలను సేకరిస్తాడు, ఆ తర్వాత వాటిని సమకూర్చి అజెండా తయారు చేస్తాడు. ఆయన పెద్దల కూటంలో ఛైర్మాన్గా కూడా పనిచేస్తాడు. నిర్ణయాలు తీసుకున్నాక, అవి సరిగ్గా అమలు జరిగేలా చూస్తాడు. ఆయన సేవా కూటం యొక్క సిద్ధపాటుకూ, బహిరంగ ప్రసంగాల షెడ్యూలింగ్కూ పైవిచారణ చేస్తాడు. సంఘానికి చేయబడిన ప్రకటనలనన్నింటినీ ఆయన ఆమోదిస్తాడు. సాధారణ నిర్వహణ ఖర్చుల చెల్లింపులకు అంగీకారం తెలియజేస్తాడు, మూడు నెలలకొకసారి సంఘ అక్కౌంట్లు ఆడిట్ అయ్యేలా చూసుకుంటాడు.
4 చైర్మాన్గా, సంఘ పైవిచారణకర్త సంఘ సేవా కమిటీ పనిని సమన్వయపరుస్తాడు. ఒక బైబిలు విద్యార్థి తను బాప్తిస్మం పొందని ప్రచారకుడుగా గుర్తించబడాలని కోరుకున్నప్పుడు, లేదా బాప్తిస్మం పొందని ప్రచారకుడు బాప్తిస్మం పొందాలని అనుకున్నప్పుడు, పెద్దలు ఆ విద్యార్థిని కలిసే ఏర్పాటు సంఘ పైవిచారణకర్త చేస్తాడు. ప్రయాణ పైవిచారణకర్త సందర్శనానికి సిద్ధపడడంలో కూడా సంఘ పైవిచారణకర్త నేతృత్వం వహిస్తాడు. ఆ విధంగా సంఘం ఆ వారపు ప్రత్యేక కార్యకలాపాల నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందగల్గుతుంది.
5 సంఘ పైవిచారణకర్త విధులు అనేకముగాను, వివిధముగాను ఉంటాయి. ఆయన నమ్రతగా, “జాగ్రత్త”గా తన బాధ్యతలను నిర్వహిస్తున్నప్పుడు, మనమందరమూ పెద్దలతో సహకరించడం ద్వారా మన వంతు చేయగలము. (రోమా. 12:8) మన మధ్య నేతృత్వం వహిస్తున్నవారు చెబుతున్నది మనం “విని,” వారికి “లోబడి” ఉంటున్నట్లయితే, వాళ్ళు తమ పనిని నిజమైన గొప్ప ఆనందంతో చేయగలరు.—హెబ్రీ. 13:17.