ఓదార్పు పొందేందుకు ఇతరులకు సహాయపడండి
1 విపత్తులను గురించి, యుద్ధాలను గురించి, నేరాలను గురించి, కష్టాలను గురించి విని విని అనేకులు విసిగిపోయారు. అయితే మానవజాతికి నిజంగా అవసరమైన ఓదార్పనేది నేటి వార్తాపత్రికల్లో కనిపించడమే లేదు. ఓదార్చడమంటే, మరొకరికి “బలాన్నిచ్చి నిరీక్షణనివ్వడం” “దుఃఖం నుండి లేదా బాధ నుండి ఉపశమనాన్నివ్వడం” అని అర్థం. యెహోవాసాక్షులముగా మనం ప్రజలకు ఈ విధంగా సహాయపడేందుకు సంసిద్ధులమై ఉన్నాం. (2 కొరిం. 1:3, 4) మనం జూలైలోనూ ఆగస్టులోనూ ప్రతిపాదించబోతున్న బైబిలాధార బ్రోషూర్లలో ఓదార్పుకరమైన సత్యపు సందేశాలు ఉన్నాయి. (రోమా. 15:4) విభిన్న పరిస్థితుల్లో వాటిని అందించేందుకు కొన్ని సలహాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
2 విషాదకరమైన వార్తా కథనం సాక్ష్యమిచ్చేందుకూ ఇతరులకు ఓదార్పునిచ్చేందుకూ అవకాశాన్ని కల్పిస్తుంది. బహుశా ఈ క్రింది విధంగా చెప్పవచ్చు:
◼ “అలాంటి సంఘటనలు జరిగినప్పుడు, దేవుడు నిజంగా మానవుల ఎడల శ్రద్ధ తీసుకుంటున్నాడా అని కొందరు ఆలోచిస్తారు. మీరేమనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] భూమిని సృజించడంలో దేవునికి ఒక సంకల్పం ఉండిందని బైబిలు చెబుతుందని గమనించండి.” యెషయా 45:18 చదవండి. తర్వాత ఇలా కొనసాగించండి: “భూమి మీద నివాసములేర్పడాలని ఆయన కోరుకుంటున్నట్లయితే, మానవులు భూమిపై శాంతియుతంగా జీవించడాన్ని నిశ్చయపరచేందుకు ఆయన ఏమైనా చేస్తాడని నమ్మడం హేతుబద్ధం కాదా? నా దగ్గర ఒక బ్రోషూర్ ఉంది. మీరు దానినుండి ఓదార్పు పొందగలరని నాకు తెలుసు. దానిపేరు దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? [కవరు పేజీపై ఉన్న ప్రశ్నలను చదవండి.] మనం నేడు ఎదుర్కుంటున్న అవినీతితోకూడిన పరిస్థితులకన్నింటికీ దేవుడు అంతం తెస్తాడనే దానికి ఒప్పింపజేసే రుజువు ఇందులో ఉంది. మీరు దీనిని చదవడానికి ఇష్టపడతారా?” బ్రోషూర్‌ను ప్రతిపాదించి, తిరిగివెళ్ళే ఏర్పాటు చేసుకోండి.
3 తిరిగి వెళ్ళినప్పుడు మీరిలా చెప్పవచ్చు:
◼ “దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? అనే బ్రోషూర్‌ను నేను మీకిచ్చినప్పుడు దేవునికి శ్రద్ధ ఉందనడానికిగల రుజువును గురించి మనం మాట్లాడుకున్నాం. బహుశా మీరు 7వ పేజీలోని ఈ పాయింటును గమనించి ఉండవచ్చు. [చిత్రాన్ని చూపించి 15వ పేరాను క్లుప్తంగా వివరించండి.] మానవజాతిని సృజించడంలో దేవుడు ఎంత శ్రద్ధతీసుకున్నాడో చూపించేందుకు ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. [9వ పేజీలోని 27వ పేరాను చదవండి.] బైబిలును వ్యక్తిగతంగా పఠించడం విషయాలను గురించిన దేవుని దృక్కోణాన్ని ఇస్తుంది. ఆ విధంగా జీవితంలోని దైనందిన సమస్యలను అధిగమించడానికి బైబిలు పఠనం నాకు సహాయపడింది.” పఠనాన్ని ఎలా నిర్వహిస్తామో చూపిస్తానని చెప్పండి.
4 “జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?” అనే బ్రోషూర్‌ను ఉపయోగిస్తూ క్లుప్తంగా సాక్ష్యమివ్వవచ్చు. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని ఇలా చెప్పవచ్చు:
◼ “నేను మిమ్మల్నీ మీ పొరుగువారినీ ఒక ప్రాముఖ్యమైన సందేశంతో సందర్శిస్తున్నాను.” బ్రోషూర్‌లోని 4వ పేజీలోని మొదటి పేరాను చదివి, గృహస్థుడు ఏమనుకుంటున్నాడో అడగండి. ఆయనను ప్రతిస్పందించనివ్వండి. మీ బైబిలును యెషయా 45:18కి తెరవండి. ఆ వచనాన్ని చదివి ఇలా చెప్పండి: “మనలను దృష్టిలో పెట్టుకుని భూమిని సృష్టించడం జరిగిందని ఈ వాక్యం చూపిస్తుంది. మరి మనమిక్కడ ఏమి చేయడానికి సృజించబడ్డాం? మన భవిష్యత్తేమిటి?” బ్రోషూర్ యొక్క ఉద్దేశాన్ని వివరించి, దానిని ప్రతిపాదించండి. తిరిగి వెళ్ళేందుకు నిర్దిష్టమైన ఏర్పాటు చేసుకోండి.
5 తిరిగి సందర్శించినప్పుడు, పఠనాన్ని ఆరంభించేందుకు మీరీ క్రింది పద్ధతిని అవలంబించవచ్చు:
◼ “మునుపు మనం సంభాషించిన దాని ఆధారంగా, ఒక ఉదాహరణ సహాయంతో, జీవిత సంకల్పాన్ని గురించి మనకెవరు చెప్పగలరనేది వివరించాలని ఇష్టపడుతున్నాను. [జీవిత సంకల్పం బ్రోషూర్‌లో 6వ పేజీలోని 1, 2 పేరాల్లోని తాత్పర్యాన్ని చెప్పండి.] యెహోవా దేవుడే మన సృష్టికర్తయని ప్రకటన 4:11 వివరిస్తుంది. [చదవండి.] మనలను సృష్టించడానికి ఆయనకు తప్పకుండా ఒక కారణముండవచ్చు. ఆ కారణమేమిటో తెలుసుకోవాలని కోరుకున్న ప్రజలు దేవుని లిఖిత వాక్యమైన బైబిలును పఠించారు. మీకు ఆ అవకాశాన్నివ్వాలని ఇష్టపడుతున్నాను.” మనం ఉచిత గృహ బైబిలు పఠన కోర్సును ఎలా నిర్వహిస్తామో వివరించి, పఠనాన్ని ఆరంభించేందుకు ఏర్పాట్లు చేయండి.
6 తమ ప్రియమైనవారు చనిపోయినందువల్ల దుఃఖితులైనవారిని ఈ క్రింది విధంగా అనుకూల దృక్పథంతో మాట్లాడి ఓదార్చవచ్చు:
◼ “తమ ప్రియమైనవారిని మరణమందు కోల్పోయిన వారి కోసం నేను ప్రజా సేవ చేస్తున్నాను. మనమెవరమైనా తట్టుకోలేని అతి కఠినమైన విషయాల్లో ఇదొకటి కావచ్చు కనుక, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే అనే ఈ బ్రోషూర్ తయారు చేయబడింది. ఇది లక్షలాది మంది ప్రజలకు సహాయపడింది. యేసుక్రీస్తు చేసిన ఒక ఉత్తేజకరమైన వాగ్దానాన్ని గురించి అది ఏమి చెబుతుందో మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. [26వ పేజీలోని ఐదవ పేరాను యోహాను 5:21, 28, 29తో సహా చదవండి.] 29వ పేజీలో, యేసు లాజరును నిజంగా మరణం నుండి పునరుత్థానం చేసిన బైబిలు వృత్తాంతాన్ని వర్ణించే ఈ చిత్రాన్ని గమనించండి. ఈ ఓదార్పుకరమైన బ్రోషూర్‌ను తీసుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. నేను తిరిగి వచ్చి మీతో ఈ బ్రోషూర్‌లోని విషయాలను చర్చించడానికి సంతోషిస్తాను.”
7 మీరు తిరిగివెళ్ళినప్పుడు, “మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే” అనే బ్రోషూర్‌లోని 29వ పేజీలోని ఆ చిత్రాన్ని మళ్ళీ చూపించి ఇలా చెప్పవచ్చు:
◼ “యేసు లాజరును పునరుత్థానం చేయడాన్ని గూర్చి మనం చర్చించిన విషయాన్ని గుర్తు చేసుకోండి. [28వ పేజీలోని క్యాప్షన్‌ను చదివి, “ఇది నిజంగా జరిగిందా?” అనే ఉపశీర్షిక క్రింద ఉన్న సమాచారాన్ని పరిశీలించండి.] చనిపోయిన మీ ప్రియమైన వ్యక్తిని తిరిగి చూడగలుగుతారని నమ్మడానికి మీ హృదయం పరితపిస్తున్నట్లయితే, పునరుత్థాన నిరీక్షణను మీ స్వంతం చేసుకునేందుకు మీకు సహాయపడనివ్వండి.” గృహ బైబిలు పఠనాన్ని ప్రతిపాదించండి.
8 ‘దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుతూ’ యేసును అనుకరించేందుకు రానున్న నెలల్లో మన శాయశక్తులా ప్రయత్నించుదము గాక.—యెష. 61:2.