ప్రశ్నా భాగము
◼ మన పరిచర్య సంబంధంగా వ్యతిరేక లింగవ్యక్తులతో కలిసివున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు వహించాలి?
మన సహోదర సహోదరీలు తమ వ్యక్తిగత ప్రవర్తనలో అత్యున్నతమైన నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉండాలనే ఉద్దేశిస్తారని అపేక్షించడానికి మనకు మంచి కారణమే ఉంది. అయితే, మనం నైతిక విలువలు అడుగంటిపోయిన అపరిశుభ్రమైన లోకంలో, పట్టింపులేని లోకంలో జీవిస్తున్నాము. మనకు సదుద్దేశాలే ఉన్నప్పటికీ కళంకం తేవడాన్నీ లేక ఏదైనా అనుచితమైన దాంట్లో ఇరుక్కోవడాన్నీ నివారించడానికి మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. దీన్లో మనం పరిచర్యలో భాగం వహిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం కూడా ఇమిడివుంది.
సత్యంపట్ల నిజమైనది అనిపించే ఆసక్తిని ప్రదర్శించే వ్యతిరేక లింగవ్యక్తుల్ని మనం ప్రాంతీయ సేవలో తరచూ కలుస్తుంటాము. మనం ఒంటరిగా ఉన్నప్పుడు వారిని కలిసినట్లైతే, ఇంట్లో వేరే ఎవరూ లేనట్లైతే సాధారణంగా ఇంట్లోకి వెళ్లడంకన్నా గుమ్మందగ్గరే ఉండి సాక్ష్యం ఇవ్వడం మంచిది. ఆసక్తి ఉన్నట్లైతే మనతోపాటు వేరే ప్రచారకులు ఉన్నప్పుడో లేక ఇంట్లోని మిగతా సభ్యులు కూడా ఉన్న సమయంలోనో తిరిగి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇది సాధ్యం కానప్పుడు, ఇంటి యజమాని ఆడవారైతే ఒక సహోదరికీ, మగవారైతే ఒక సహోదరునికీ ఆ పునర్దర్శనాన్ని అప్పగించడం జ్ఞానయుక్తం. వ్యతిరేక లింగవ్యక్తులతో బైబిలు పఠనాలు నిర్వహించడానికి కూడా ఇదే వర్తిస్తుంది.—మత్త. 10:16.
పరిచర్యలో మనతో పనిచేయడానికి ఎవరినైనా ఎంపిక చేసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. వ్యతిరేక లింగవ్యక్తులు అప్పుడప్పుడు కలిసి పనిచేయగల్గినప్పటికీ, ఒక గుంపుతో కలిసి ఉన్నప్పుడు ఇలా చేయడం మంచిది. సాధారణంగా, మనం పరిచర్యలో కూడా మన వివాహజత కానివారైన వ్యతిరేక లింగవ్యక్తుల్లో ఎవరితోనైనా కలిసి ఒంటరిగా సమయం గడపడం మనకు జ్ఞానయుక్తం కాదు. అందుకని, సేవా గుంపును నడిపిస్తున్న సహోదరుడు యౌవనస్థులతో సహా ప్రచారకులనందరినీ విభజించేటప్పుడు మంచి వివేచనాశక్తిని ఉపయోగించాలి.
ఎల్లప్పుడూ మంచి వివేచనాశక్తిని ఉపయోగించడం ద్వారా, మనం మనకూ లేక ఇతరులకూ “ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు” కలుగజేయకుండా ఉంటాము.—2 కొరిం. 6:3.